శుకసప్తతి/ద్వితీయముద్రణపీఠిక
ద్వితీయ ముద్రణ పీఠిక.
ఆర్యులు చేయుపనులన్నియు స్వార్థరహితములు నిహపరసాధకములును. వారు రచియించిన భారతాద్యుద్గ్రంథములు మొదలు కవిచౌడప్పశతకమువఱకు నీతిబోధకములును, ధర్మోపదేశకములును, దన్మార్గమున మోక్షసాధకములు నగుచున్నవి. ఆయా గ్రంథములయందలి విషయ మేదై నను దుద కూహించినచో నది యేదో ధర్మమునో నీతినో బోధించునది యై తీరవలయును. అందుఁ గొన్నింట ధర్మాదులు స్ఫుటముగా నగపడును, గొన్నింట నూహించినం దోఁప గర్భితములై యుండును. పంచతంత్రము, హితోపదేశము, విక్రమార్కచరిత్ర మను ద్వాత్రింశత్సాలభంజికలకథలు, తదంతర్భూతములగు బేతాళపంచవింశతి, రేచుక్క పగటిచుక్క కథలు, హంసవింశతి మున్నగునవి యెల్ల నీతిబోధకములే. పంచతంత్రాదులు కొన్నిస్త్రీపురుషసామాన్యము లగువిషయములం దెలుపును. హంస వింశతి, యీ శుకసప్తతియుఁ గేవల స్త్రీలకొఱకే యని యూహింపవచ్చును. ఇందుఁ గామోద్రేకమునఁ బరదూతికాప్రేరణ మునఁ దప్పుత్రోవలంబడఁబోవుపడఁతులను సన్మార్గమునకుం ద్రిప్పుటకుఁగా ననేకోదాహరణములం దెల్పి శీలభంగము కాకుండఁ జేయుటయే ముఖ్యోద్దేశమైయున్నది. ఇవియన్నియుం బంచతంత్రమువంటి కట్టుకథలే ఈ కట్టుకథలకు మూలము మహా భారతములో భీష్ముఁడు చెప్పిన జంతుజాలవిశేషములకథలే కావచ్చును. మఱియు హంస, చిలుక చెప్పుటచేఁ బిట్టకథలునై యున్నవి. కల్పితములేగాని జరగినవై యుండవలనులేదు. పచ్చిశృంగారము గుప్పించి కథ చెప్పినను దుదకు నీతి కనఁబఱపఁబడుచుండును. అవి నీతికథలను బురస్కరించికొని నీతి తెల్పఁబడుచుండును. ఒక్కదానిలోనికథలసామ్య మింకొక్కదానిలోఁ గనఁబడుచుండును. ఇంగ్లీషుభాషలో నిట్టికథ లున్నవో లేవో కానీ ఆరబ్బీభాషలో "ఆలఫ్ లైలా” (ఆరేబియన్ నైట్సు) వేయిరాత్రులకథ లీరీతివియే. హిందూస్థానీలో "శుకశారికల కథలు” (తోతా మైనా) గలవు. వానిలో నొకటి పురుషదుర్గుణముల నెంచి వారల నిందించిన రెండవది పురుషులపక్షము వాదించుచు స్త్రీలయవగుణము లెన్నుచుండును. ఎవరిపక్షము వారు సమర్థించుకొనుట చిత్రము. మనకథలకన్నింటికి సంస్కృ తములో మూలములు గలవు. బృహత్కథ, కథాసరిత్సాగరము నిట్టివానికి మూలములు కావచ్చును. ఇందేదేశమువా రేదేశమువారి ననుకరించిరో యూహించుట దుష్కరము. బుద్ధిమంతులు సర్వత్ర కలరు. ఏదేశపుఁబండితునకైనను లోకమునకు నీతి బోధించుటకు ధర్మోపదేశము చేయుటకు సద్బుద్ది పొడముచుండును. వారు వారు బోధించుమార్గములు భిన్నములుగా నుండును.
ఈశుకసప్తతి పేరునకు డెబ్బదికథ లనియున్నను మనకు దొరకినవి కొంచె మెచ్చుతక్కువ యుపకథలతోఁ గూడ వానిలో సగమున్నవి. లభించినంతవఱకుఁ జాలమనోహరములుగా నున్నవి. మొదట నేను శ్రీపోలవరము సంస్థానాధీశుల సరస్వతీపత్రికకై చెన్నపురి దొరతనము వారి ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారములోని పెక్కుతాళపత్రమాతృకలనుండి దీని కొకపుత్రికను వ్రాసి తెచ్చి ప్రకటించితిని. అప్పటికిఁ గృత్యాది పద్యములు లభింపలేదు. నాయుద్యమము నెఱిఁగియున్న బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవి, ఎం. ఏ., గారు తాము వివిధమండలములలో బహుభాషాగ్రంథపరిశోధనముం గావింప నేగినతరి సంపాదించిన కృత్యాదిపద్యము లెనుబదిమూఁడును బంపిరి. అప్పటికి సరస్వతీపుత్రిక నిల్చిపోయినది. కావునఁ గొంతకాల మాపద్యములు ప్రకటింప నవకాశము లేక పోయినది. కాకినాడలో శతావధానులు తిరుపతిశాస్త్రిగారితనయులయొద్ద భద్రము చేయఁబడిన యీపద్యములను నేనే పరిషత్పత్రికలోఁ బ్రకటించు భాగ్యము నందితిని. ఆపద్యములు గూడ నిందు మొదటఁ జేర్పఁబడి యథాస్థానమున శోభిల్లుచున్నవి. ఇందుఁ గొన్ని వ్రాఁతతప్పులును, లుప్తభాగములును గలవు. ఈపద్యములు లభించువఱకు గద్యములోని-
"శ్రీమత్ఖాదిరీనృసింహళరుణాకటాక్షవీక్షణసమాగత కవితాధార పాలవేకరికులకలశాంభోనిధిసుధాకర తాడిగోళ్లకరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర... కదురధరామండలాఖండలపుత్ర ...కదిరీపతినాయకప్రణీతంబు ... అనుమాటలంబట్టి విశేషములం దెలిసికొన ననువుపడలేదు. ఆపొడిమాటలకు వివరణ మీకృత్యాదిపద్యములంబట్టి యిట్లు తెలియవచ్చుచున్నది.
చంద్రవంశక్షత్రియులలో నచ్యుతగోత్రజులు పాలవేకరివారను నింటిపేరుగలవా రుండిరి. వారికి రాజధాని తాడిగోళ్లపురము[1]. మొదట పాలవేకరి పెదయోబళరాజు రాయలవారిచే నశ్వవారణరత్ననవరత్నహారాంబరాదులచే బహూకరింపఁబడి, పిదప అళియ రామరాజు చేసిన యుద్ధములకుఁ గర్తయై “గదెరాకమున తెర్క మొదలుగల్గు” బహురాజ్య మేలి సమగ్రమహాహవోగ్రసప్తకసహస్రచాపభృత్సైన్యజితమదాహీతెంగాగనుద్రుండై” కోడుగలు మొదలగు గ్రామములను శ్రీఖాదిరీనృసింహమూర్తికి సమర్పించి వన్నె కెక్కినవాఁడు. ఈ రాజు కుమారుఁడు నారవిభుఁడు. ఇతనికిఁ దొమ్మండ్రు సుతులు. వీరిలో నొక్కఁడగునౌబళుఁడు ప్రసిద్ధి కెక్కెను. ఈ నృపునియగ్రమహిషి బాలమ. ఈ దంపతులకు కరిమాణిక్యరా జుద్భవించెను. ఈతఁడు రామదేవరాయలసరిగద్దియం గూర్చుండుమన్ననం గాంచి యనేకబిరుదములం బడసెను. కరిమాణిక్యరాజునకు లచ్చమ్మ, రాచమ్మ, రంగమ్మ, భద్రమ యని నల్వురుపత్నులు. వీరియందు వసంతరాజు, రామరాజు, నారపరాజు, కదురరాజు నను నలుగురు సుతులు జనించిరి. వీరిలో వసంతరాజునకు రామరాజు తనయుఁడయ్యెను. ఈ రామరాజు శ్రీరంగరాయలచే మత్స్యమకరధ్వజాదిచిహ్నములం బొందెను. ఈ రామరాజుతనూజుఁడు రఘునాథరాజు. కరిమాణిక్యరాజు రెండవకుమారుఁడు రామరాజు. ఈతని తమ్ముఁడు నారపరాజు. నారపరాజు తమ్ముఁడు కదురక్ష్మాపాలుఁడు. ఈకదురరాజునకుఁ గదురమ్మయే దేవేరి యైనది. ఈసనామదంపతులకు కదురక్షాపాలుఁడు, వేంకటరాజునని యిరువురుతనయులు. ఈయిరువురు సోదరులలోని కదురక్ష్మాపాలుఁడే యీశుకసప్తతి గ్రంథకర్త కదిరీపతి. ఖాదిరిశబ్దమునుండియే కదుర, కదిరి రూపములు కల్గినవి. ఈవంశావళి బట్టి వసంతరాజుకుమారుఁడైన రామరాజు (రెండవ) శ్రీరంగరాయలచే బహూకరింపఁబడినట్లు చెప్పఁబడినందున శ్రీరంగరాయలు 1572-85 నాఁటివాఁడని తెలియవచ్చుచున్నది కావున రామరాజు పౌత్రుడు కదిరీపతికవి 17-వ శతాబ్దప్రారంభమునాఁటివాఁ డగునని తలంపవచ్చును.
ఈకదిరీపతికవి తన గ్రంథములో నన్నయభట్టారకుఁడు మొదలు తనవఱకుఁగలకవుల మర్యాదల నన్నింటిని బహువిధములఁ జేర్చినాఁడని యొక్కమాట చెప్పినంజాలును. స్వభావవర్ణనల కీతఁడు పెట్టినది పేరు. సామెతలగని, జాతీయములకు నిధి. అనఁగా ననఁగా నొకపురము-బిడ్డయొ పాపయో చిదిమి పెట్టినయట్లు- పుడకలువిఱిచి - చింతాకుముడుఁగుతఱి - మూసిన ముత్తెము-మిట్టిమీనై యదల్పు-బడాపగలఁజూచి-ఎట్లు నోరాడెనో-నీధర్మసత్రపుబ్రాహ్మణుఁడ - కడుపు చుమ్మలు చుట్టు - పంటఁ బగపట్టెన్-ఇత్యాదిగా ననేకములు వాడినాఁడు. హాస్యరసము కడ కడుపు చెక్క లగునట్లు నవ్వు వచ్చును. హిందూస్థానీపదములం బ్రయోగించెను ఇంగిలీసులముఖాములు, పరాసులు ననునితరభాషాపదములు గలవు. సంస్కృత వాక్యములు - "స్వామి ద్రోహి మిదం భారం” “విపది ధైర్యమథాభ్యుదయే క్షమా." ఇట్టివి తెనుఁగుపద్యములలో సందర్బోచితముగా సులువుగా నుపయోగించును. సందర్భమునుబట్టి యొకచో వచ్చిన పద్యములే వేఱొకచో వాడినాఁడు. ఈకవికున్న ప్రపంచజ్ఞాన మితరకవులలోఁ బలువురకు లేదు.
పురాణాదులు సూతుండు శౌనకాదిమునులకుం జెప్పి నట్లుండఁగా నిటీవలిగ్రంథములను రచించినవారు చెప్పువాఁ డొక్కఁడు, వినువాఁ డొక్కఁడు నుండవలయునని నిర్బంధించుచున్నారు. కొందఱు దైవములకుఁ గృతి యర్పించియు, నరులకు నొసంగియు, సూతుండు శౌనకాది మహర్షులకుం జెప్పినదాని నవధరింపుమని చెప్పఁదొడఁగిరి. దానినిబట్టి యిప్పటికలికాలపు పేదరాసి పెద్దమ్మకథలకుఁగూడ నేనారదుఁడో యేయింద్రునతో చెప్పినట్లుగా నతుకుచున్నారు. ఈశుకసప్తతికథలు కేవల (నీచ) శృంగారకథలు. వీనిని గౌరికి శంకరుఁడు రహస్యముగాఁ జెప్పినాఁడని “ధౌమ్యమహర్షివర్యుండు నిరవధికకుతూహలధుర్యుండై యిట్లనియె" నని వచించుట యంత సరసముగా నున్నట్లు తోఁపదు. వ్రతకథలకును గొంద ఱేశివుఁడో యేవిష్ణువో లోకానుగ్రహకాంక్షతో నీవ్రతాచరణమునఁ బుణ్యము గలుగునని దారము లేక మఱ్ఱియూడతోరము గట్టుకొన్నను, బియ్యపుపిండి లేక నివ్వరిగింజలు రెండునూఱి నైవేద్యము చేసినను జాలును, స్వర్గము చేతిలోనికి వచ్చునన్న చిట్టిచిట్టి వ్రతములు సెలవిచ్చినట్లు కలదు. అందేదో పుణ్యమో పురుషార్థమో యున్న దనుచున్నారు గావున వానికి నమస్కారము. ఇట్టి నీరసకథలుకూడ నట్టిమహర్షులు సట్టియుత్కృష్ట దైవతములు చెప్పినట్లు కల్పించుట యుచితముగానుండదేమో యని కొందఱకైనఁ దోపకమానదు.
హంసవింశతికర్త తన గ్రంథములోఁ బర్యాయపదముల నిఘంటువును గుది గ్రుచ్చి కథ కడ్డువచ్చునట్లు చేసి పాఠకులను బాధ పెట్టినాఁడని కొందఱనుచున్నారు. కథ కానిఘంటువు కొంతవఱ కడ్డుతగులుచున్న మాట సత్యమే. ఈకవి యట్లు చేయక, అంతకంటే నెక్కుడుమాటలను సందర్బోచితముగ నందందుఁ జేర్చి కథ కడ్డు రాకుండఁ జేసి పాఠకుల మెప్పునకుఁ బాత్రుండయ్యె ననవచ్చును. ముప్పదికథలలోనే యిన్ని చమత్కృతు లున్నవియే, డెబ్బదిలో నెన్ని యున్నవో! అవి మనకు లభింప లేదయ్యెఁగదా యని విచారపడవలసివచ్చినది. ఈ చక్కని వాగ్జాలము రాజిల్లు నీతనిముఖమున నేరామాయణమో, భాగవతమో మనము వినుభాగ్యముపట్టిన నెంతమనోహరముగ నుండునో గదా!
ప్రథమముద్రణములోని ప్రమాదములు కొన్ని యిందు సవరింపఁబడినవి. పాఠకులే యిందలివిశేషములను గమనింతురు గాకయని విస్తరింపలేదు.
ఇట్లు సుజనవిధేయుఁడు,
కొత్తపల్లి సూర్యరావు.
- ↑ శాసనములలోన Tadigotla యని కనఁబడునదియే తాడిగోళ్ల కావచ్చును.