శుకసప్తతి/తొమ్మిదవకథ

వ. చని యథోచితవిధంబునం బ్రవర్తిల్లె దదనంతరంబ క్రమంబున. 141

చ. హరనటనాతివేగగళితాలికలోచనవిస్ఫులింగమై
సరసిజబంధుఁ డస్తగిరిచక్కటి వ్రాలఁ దదీయకీచకో
త్కరములు గాలు క్రొందగుపొగల్బలెఁ జీకఁటి పిక్కటిల్లె నం
బరమునమించుఁదత్తృటితమౌక్తికముల్బలెఁ జుక్క లొప్పఁగన్. 142

చ. అపుడు ప్రభావతీరమణి హారమణీఘృణిధోరణీప్రసూ
నపటలయు న్వినీలవసనభ్రమరాళియు నై లతాకృతిం
గపురువహించి వచ్చిన శుకంబు “మనోరథసిద్ధిరస్తు తే
చపలవిలోచనే” యని యసహ్యపుదీవన నిచ్చి యిట్లనున్. 143

తొమ్మిదవకథ

ఉ. వింటివె యొకవింతకథ వీనుల కింపు ఘటింపఁజాలు ని
ష్కంటకరాజమౌళి దొరగా విదిశాపురి మించు నందు నే
వెంటఁ గొఱంతవోని పృథివీసురుఁ డొక్కఁడు సోమశర్మ పే
రింట నెసంగు భార్యయయి రేవతిపేరి వధూటి గొల్వఁగన్. 144

సీ. గాదెలఁ గొలుచు ముక్కారుఁ బండెడు మళ్లు
నత్తోఁపు నడబావు లండ దొడ్డి
యాకుఁదోఁటలగుంపు పోఁకమ్రాకులు గుత్త
చేలు గొఱ్ఱలకదుపొలమంద
చెఱకుగానుగ మొద ల్జెడక వర్ధిలు నేర్పు
బానిసె ల్బడవాళ్లు బంటుపైద
పారిగోడలు గొప్పపడసాల మేల్మచ్చు
గారముంగిలి వింతగాని పొరుగు

తే. రాగి నగలు సదాచారరతీయు దేవ
పూజ నిత్యాన్నదానంబుఁ, బూసబొట్టు
చిదురఁ జల్లిన తులసెమ్మచిన్నితిన్నె
గలిగి కనుపట్టు నాతనికాఁపురంబు. 145

తే. [1]ఇట్లు వర్తింప నాతని యింతి గర్భ
కలితయై చిట్టుముల బయకలు మొగమునఁ
దెలుపుఁ గనిపింపఁ దొమ్మిదినెలలు నిండి
పసిఁడిరేకనఁదగు నాఁడుపడుచుఁ గనిన. 146

తే. పురుడు వెడలినవెనుక నాభూమిదేవుఁ
డాశిశువు జన్మ నక్షత్ర మరసి ఖన్నుఁ
డై సురార్చన మొనరింప నరుగుదేర
కున్నఁ గనుఁగొని రేవతీయువతి చేరి. 147

క. ఇదియేమి మీర లిత్తఱిఁ
జదివితి రేమేమొ పడుచుజాతకమునకై
[2]యది మొదలు చిన్నఁబోయితి
రెద నడరెడు భయము నుడువుఁ డేలా దాఁపన్. 148

క. అన విని యిది యేమియు లే
దనఘగుణా! మీఁద జార యగు నిది యటుగా
వునఁ జింతించెదననఁ బతిఁ
గనుఁగొని యమ్మగువ నగవుగలమొగ మలరన్. 149

[3]క. ఔ లెండ యేటి మాటలు
మేలే యిది బ్రతికినట్టిమీఁదటఁగద యా
జోలి యెటులైన నైదవ
రాలై మనపడుచుగాఁగ నమరినఁ జాలున్. 150

క. అని చని యాయమ జననీ
జనకులకుం దెలుపు సంతసంబున వారల్
విని మనుమరాలుగావున
ననువారము దాని జారయని పిలుచుటయున్. 151

తే. ఊరివారెల్ల రావె యోజార యనఁగ
నదియె పే రయ్యె నాజార కంబుజాక్షి
యంత నది యింతయై యంతయై వినూత్న
పేశలాకారయై మించి పెండ్లి కెదుగ. 152

తే. అడుగవచ్చిన వార లయ్యబలరూప
శీలకులగుణవిఖ్యాతి చాల మెచ్చి
జారయనుపేరు విన్నంతఁ జాఱుటయును
బీఁట మీఁదిటిపెండ్లిండ్లు పెక్కు లెడసె. 153

చ. పొలుపుగ మోసులెత్తుచనుపూపలు ఱొమ్మున నిక్క నాఁకట
న్మలమలమాడఁగా జెఱఁగుమాసిన దోసము వచ్చునంచు న
గ్గలికలతల్లి కూడడఁగఁగట్టె మహీసురజాతిధర్మముల్, దెలు
పుచుఁ బెండ్లిపే రకట దేవుఁ డెఱుంగు మెఱుంగుబోఁడికిన్. 154

క. వేఱేపనులకు వచ్చిన
వారిం గని పడుచు నడుగ వచ్చిరటంచున్
గారాబుకూఁతునకు సిం
గారించుం దల్లియాస్యకమలం బలరన్. 155

క. ధరణీసురమాత్రుఁడు పే
రరయక యరు దెంచి పెండ్లి యాడినఁ జాలున్
వరదక్షిణతో నిచ్చెదఁ
దరళేక్షణ ననుచుఁ దండ్రి తలచు న్మదిలోన్. 156

తే. వార లీరీతి నుండిరో వామనయన
యంత బుధవంత మనునగ్రహారమునను
వినయవిఖ్యాతి మించు గోవిందుఁ డనెడు
బ్రహచారి చతుర్వేదపారగుండు. 157

తే. ఆతఁ డుపనీతుఁడైన యనంతరంబ
తల్లిదండ్రులు వోవ సంతాప మెడలి
యప్పురివరమందె విద్యార్థి యగుచు
నఖిలవిద్యలుఁ దనకుఁ దా నభ్యసించె. 158

క. అంతట నవ్వటుమణికిం
గంతుపరబ్రహ్మతావిఖండనచణవే
దాంతతిరస్కృతికరణా
నంతం బైనట్టిజవ్వనం బరుదెంచెన్. 159

వ. ఇవ్విధంబున సంప్రాప్తయౌవనుండై యతండు సమావర్తనహోమంబుల వ్రేల్చు వారలం గనుంగొని మోము వ్రేల్చియుఁ గల్యాణకంకణధారులం గనుంగొని యేకారియు నాకబలిసంవిధానంబు లాచరించువారలం గనుంగొని గ్రుక్కిళ్లు మ్రింగియు నూతనవధూయుక్తులై యూరేగువారి నిరీక్షించి మనంబునం గుందియు నార్తవశోభనపరాయణులైనవారలం గనుంగొని భిన్నత్వంబు నొందియు వివాహవాంఛాధీనుండై కన్యార్థియై పోయి యొక్కచోట నక్షత్రానుకూల్యంబు లేక మనోవైకల్యంబు నందుచు నొక్కయెడ జాతివిరోధం బైన వెలవెలం బాఱుచు నొక్కచాయ రాశిమిత్రత్వంబు చాలకుండినం బెండువడుచు నొ దారి గణవైపరీత్యంబైన నత్యంతం బనుతాపించుచుఁ బుడమి యెల్లం జెల్లందిరిగి యలబ్ధమనోరథుండై యుండి వెండియు. 160

తే. మునుపు చదివిన శాస్త్రసమూహమెల్ల
నూఁచముట్టుగ నొజ్జల గొప్పగించి
యుద్వహనకేళి చింతింపుచునికిఁ జేసి
పలుకు నిద్దురలోఁ బెండ్లికలవరింత. 161

క. ఊరెల్లఁ బిలిచిరేని య
పారంబగుచింత మునిఁగి పలుకం డదిగో
జేరె వివాహమఁటన్నం
దోరంబగు కాంక్ష నోరునోరే తెఱచున్. 162

తే. ఇట్లు చింతించి యవ్వటుఁ డేగుదెంచి
సోమశర్మగృహాళిందభూమి కొక్క
నాఁడు గ్రాసార్థమైరాఁగ వానినామ
మన్వయంబును నడిగియు నక్కుటుంబి. 163

క. మనయింటఁ గన్నె యున్నది
యనఘా యిదియేమి పెండ్లియాడెదవే మీ

కును మాకును బంధుత్వం
బనుతరమై బ్రహ్మనుండి యమరినదరయన్. 164

క. అని యనియు ననకమునుపే
యనఘా యే బ్రతికితిని మదన్వయ మిది పా
వనమయ్యె ననుచు నవ్వటుఁ
డనితరగతిఁ దత్పదద్వయంబున వ్రాలెన్. 165

తే. అతఁడును బొంతనము లెల్ల నరసి లెస్స
యున్నవని పల్కి యారేయి యొక్కలగ్న
మేర్పఱచి యిరుగుపొరుగు నెఱుఁగకుండఁ
దనతనూభవ నతనికి ధారపోసె. 166

ఉ. అంతట దాని పేరు విని యల్లుఁడు మెల్లన మామగారి నే
కాంతమునందుఁ జేరి వినయంబున నీయభిధాన మెట్టు లీ
కాంతకుఁ గల్గెఁ దెల్పుమనఁగా విని యాతఁడు దానిపూర్వవృ
త్తాంతముఁ దెల్పి దీనిఁ జెడుగై పడనీయక కాచికొమ్మనన్. 167

తే. మంచిదని నాగవల్లట మించినపుడె
యాలిఁ దోడ్కొని తనయగ్రహారమునకు
బోయి తనగృహమధ్యంబు పోతుటీఁగ
కైన బొలయక యుండంగ నలవరించి. 168

క. తలయంటు నలఁగుఁబెట్టున్
జలకములార్చు న్మెఱుంగుచలువలు గట్టుం
దిలకంబుదీర్చుఁ గలపం
బలఁదుం గోవిందుఁ డయ్యొయారికి దినమున్. 169

తే. ఇట్లు పోషింప నాశారదేందువదన
కెలమి దళుకొత్తు బెళుకుఁగన్నులును ముద్దు
లొలుకు నవ్వులు గులుకుగుబ్బలమెఱుంగుఁ
జిలుకుటెక్కులుఁ దగువయశ్రీ నెసంగె. 170

వ. అంత. 171

సీ. వీథి నేగెడు ప్రౌఢవిటుఁడు పాడెడువింత
యేలపదా లట్టె యాలకించుఁ
బొరుగింటిమగవాని పొలుపైనఁ బెనుగోడ
యివ్వలఱోటిపై నెక్కి చూచు
నాయివారములకై డాయువారలతోడ
జోలి ద్రవ్వుచుఁ బెక్కుసుద్దులాడు
వరుసతో మాటాడవచ్చువిఫ్రులమ్రోల
రాకపోకల నొయారంబు నెఱపు
తే. నింటి కేతెంచు నెదురింటి యింతితోడ
దానిహృదయాధినాథువర్తనము లడుగు
రతు లెఱుంగకమున్నె యారాజవదన
వ్రాఁత తప్పింపఁజేయ నెవ్వరితరంబు. 172

తే. [4]ఆగృహంబున నిచ్ఛావిహారమునకు
మనసు పరువులు వాఱ నేమాడ్కి నైన
సందు గానక యినుపపంజరములోని
చిలుకపోలికఁ దలఁకు నక్కులుకులాఁడి. 173

శ. ఆలలన జారలీలా
లోలితమతి యుడుపుటెట్టులో జాణవు నీ

వాలోచన మెయిఁ దెలుపుము
బాలా యనఁ జిలుకతోఁ బ్రభావతి పలుకున్. 174

క. [5]మగువయె విడిచెద ననిన
న్మగవాఁడా నిలుపువాఁడు మానము నీవే
వగఁ జెప్పెదవో విని తగుఁ
దగ దనియెదఁగాని తెలుపు తత్కథ యెల్లన్. 175

చ. అన విని మంచిదంచు విహగాగ్రణి యిట్లను నట్టిభార్య వ
ర్తనమున కార్తినొందుమతిఁ దద్ధరణీసురమౌళి యొక్కనాఁ
డనుపమవైభవం బలర నార్తవశాంతి యొనర్చి నిత్యశో
భన బహులాభకారి యగు బ్రాహ్మణభోజన మైనపిమ్మటన్. 176

తే. చిఱునగవుతోడ నిజకాంతఁ జేరఁ బిలిచి
నీకు నేర్పెడువారలు లేక యునికిఁ
దెలుపవలెఁ గద కేళిమందిరమునొకట
తోయజామోద లెల్లను డాయువిధము. 177

క. మొగమున మసిబొట్టులు కర
యుగమునఁ గప్పెరయుఁ గత్తియు న్వ్రేలునెఱుల్
దిగమ్రింగెద ననుపలుకులు
దగఁ జేరఁగవలయుఁ గేళిధామంబునకున్. 178

తే. అనిన నంగీకరించి తానానతిచ్చి
నట్లె యేతెంచుదానితో నతను కేళి
దేలి ప్రతిరాత్రమును నట్టి తెఱుఁగు మీఱఁ
బడుకయిలు సేరఁగా నేఱుపఱిచె నతఁడు. 179

ఉ. అంతటఁ గొన్నినా ళ్ళరుగ నయ్యురగాయతవేణి యేటికిం
గాంతుఁడు వోవ వీథిఁబొడకట్టిన కేశవనామభూసురుం
జంతతనంబునం దలుపుచాటున నుండి కరారవిందసం
భ్రాంతిని సన్న చేసి వలరాయనిబారికి లో నొనర్చినన్. 180

తే. ఆతఁ డదియాదిగాఁగ నయ్యబలమగని
మొఱఁగి చావడిలో నిల్చి మొగముసూపుఁ
జిన్నలకు లోఁగు కంచంబుచెంత పిల్లి
కరణి నెదురింటివాకుటఁ గాచియుండు. 181

క. గోవిందుఁడు సవసవగా
నావిధ మించుక యెఱింగి యాత్మోపాయ
శ్రీవెలయింపఁగఁ దలఁచి ర
సావేశమ్మున మెలంగు నంగనతోడన్. 182

క. ఎల్లుండి సమారాధన
చిల్లరవెచ్చములు గొనఁగ శీఘ్రమె యిదె యీ
పల్లియసంతకుఁ జని యే
నెల్లిటి కరు దెంతు పదిల మిల్లని పలుకన్. 183

చ. అది మదిఁదోఁచు వేడుక బయల్పడనీయక వేఁడికంటినీ
రొదవఁగ మోము వాంచనతఁ డోచెడుఁద్రిమ్మరిసమ్మదాశ్రువు
ల్గద యివి యంచు నాత్మను దలంచుచుఁ జింతలనేల ఱేపె వ
చ్చెదనని బుజ్జగించి యతిశీఘ్రమునం బురి నిర్గమించినన్. 184

క. అతఁ డూరు వెడలిచను డ
య్యతివ పదింబదిగఁ దెలిసి యపు డాయెదుటన్

ధృతినిల్చిన కేశవుతో
బతి యరుగుట తెలిపి గూఢభంగి న్మఱియున్. 185

క. ఈరేయి నన్ను నిలువున
నీరుగఁ గరఁగింపవలయు నేఁడున్నని నీ
నేరుపు లన్నియు నని నయ
గారపువగలాఁడి యనుపఁగా నతఁ డరిగెన్. 186

క. రవి గ్రుంకెఁ బంకజాత
చ్ఛవి డొంకెన జక్రవాకచక్రోల్లాసా
రవ మింకె జారరతమా
నవి బొంకె న్సాధునీతి నాథునితోడన్. 187

క. అంతట నగ్గోవిందుం
డెంతయుఁ గనకుండఁ బడుకయిలు సొచ్చి తద
భ్యంతరమున వస్తుసమా
క్రాంతం బగు నటుకమీఁదఁ గదలక యుండెన్. 188

తే. అంతటను గేశవుం డూరి యలబలంబు
మట్టుపడఁ జూచుకొని మాటుమణిగె ననుచుఁ
గటికి చీఁకటి నెఱనేస్తకాఁడుఁ దాను
ధృతి యెసంగఁగ దానిమందిరముఁ జేర. 189

చ. ఎదురుగ వచ్చియు న్బడుకటింటికిఁ దెచ్చియు మోవి యిచ్చియుం
గుదురు మెఱుంగు గబ్బివలిగుబ్బల గ్రుచ్చియు నాతగానికిన్
ముద మొదవించి యమ్ముదిత మున్పటికైవడిఁ గేళిగేహముం
గదియఁ దలంచి లేచి చని గ్రక్కున రాకటు తామసించినన్. 190

క. న న్నిచట నుంచి చనియెం
గన్ని య మఱి రాక తడసెఁ గపటోపాయం
బెన్నె నొకొ యెవ్వఁ డెఱుఁగుఁ బ్ర
సన్నాంబుజముఖుల యింద్ర జాలము లెల్లన్. 191

తే. అనుచుఁ దద్భూసురుం డెంచునంతలోన
సురియ నిప్పులు రాలుకప్పెరయు మొగము
మీఁద మసిబొట్లుమించ నమ్మెలఁత రాగఁ
జూచి దిగులొంది యిదిగోఁ బిశాచి యనుచు. 192

తే. అతఁడు పరువెత్త నిదియేమి యౌర పోకు
పోకుమనుపల్కుతోడ నప్పు డది నడచి
వెంటనే యంట నీదయ వేగఁగాలి
పోవనిమ్మంచుఁ దనగేహమునకు నేగ. 193

తే. అంతలో దానిపెనిమిటి యటుక డిగ్గి
గూఢముగ నేగి పెరటి బల్గోడ దాఁటి
వెలుపటికి వచ్చి యెవ్వరే తలుపు తెఱవ
వేయనుచుఁ బిల్వ నచ్చెల్వ వేషమడఁచి. 194

క. గడియ సడలింప నతఁ డ
య్యెడ నవ్వగలాడిఁ దప్పకీక్షించి యిదే
మడరెఁ బరపురుష వాసన
చెడుగా నొడువుమని కాలఁజేతం దన్నెన్. 195

చ. అది మొద లవ్వధూమణి పరాప్తికి దండము వెట్టె వాసనా
భ్యుదయము నాయకు డెఱుఁగురో యని యెంతయుఁ గేశవాఖ్యసం

విదితతదీయమూర్తులయి వేడుకకాండ్రది తల్లి తోడుగా

మది గణియించిరో చెలి సమర్పణమయ్యెనె వానినైపుణుల్. 196

క. అననం బ్రభావతి యిదిగా
దనవచ్చునె పురుషులే యుపాయపరుల్ వా
రిని గెలువఁ దరముగా దని
యినుఁ డుదయింపంగఁ బడుకయింటికి నరిగెన్. 197

క. అంతఁ గ్రమంబున నలినీ
కాంతుం డపరాబ్ధి మునుఁగఁగాఁ బుణ్యజనా
త్యంతార్తికరణపాపం
బంతయు వెడలె ననఁ దిమిర మడరెం దఱచై. 198

చ. అనుపమలీల నప్పు డసితావరణాంబరదీప్తిగుప్తయై
తనులత మబ్బులోని తెరతళ్కులమించు నదల్చుదూలిఁ దో
డ్కొని చనుదేరవచ్చునల కోమటికోడలికొమ్మఁ జూచి యి
ట్లను శుక ముత్పలాశముకుళాంచలచంచలచుంచుచంచువై. 199

చ. పనివడి రాజుఁ జేరఁ జలపట్టినదానవు చేరకుందువే
విను మఱి రాచవారు మదవిహ్వలు లించుక నేరకున్నఁ గో
పనియతిచేత మొక్కపఱపం దమకింపుదు రట్టులైన నా
థునియెడ బొంకఁగా వెరవు దోఁచినఁ బొమ్ము సరోజలోచనా. 200

పదియవకథ

తే. అమ్మ దీనికి నొకయితిహాస మలరు
వినుము ధనపాలుఁ డను రాజు పెనుప వెలయు
మేదురోద్భటభటసింహనాదచలిత
దిగ్గజవరంబు పద్మావతీపురంబు. 201

  1. గీ. కలికి యాతని కులకాంత గర్భచిహ్న
    కలితయై చాల ముద్దులు గులుకు మొగము
  2. యది మొదలు చిన్నఁబోయితి
    రిదియంతయు నాకుఁ బలుకుఁ డేలా దాఁపన్
  3. క. పోలెండ యేటిమాటలు
    జాలిం బడనేల మనము సరగున దీనిం
    బోలంగ నొక్కతెఱఁగునఁ
    బాలింత మటన్న సతికిఁ బతి యిట్లనియెన్.

    క. బాల యిది యాయు వలరుచు
    మేలిమిగా బ్రతికినట్టి మీఁదటఁ గదయా
    జోలి యెటులైన నైదువ
    రాలై మనపడుచుగాఁగ నమరినఁ జాలున్.
  4. అనుదినంబును నిచ్ఛావిహారమునకు
  5. మగువలవగలునువలపులు
    మగవాఁడా నిలుపువాఁడు మానమునీవే