శివపురాణము/సతీ ఖండము/యజ్ఞవాటికలో సతి అత్మాహుతి
ప్రమధగణాలను వెంటనిడుకొని వెళ్తూన్న సతీదేవి తన హృదయంలో ఇలా అనుకోసాగింది.
"ఇదంతా నా తండ్రి అజ్ఞానమా? పరాకా? ప్రతీకారమా? ఈ అనాదరణను ఏమని భావించాలి? అజ్ఞానమైతే జ్ఞాన బోధ చేస్తాను. అహంకారమైతే అది తగదని హెచ్చరిస్తాను. పరాకు చిత్తగిస్తే పరోక్షంగా మందలిస్తాను.." ఇలా ఎన్నెన్నో ఊహించుకుంటూ యజ్ఞవాటిక సమీపించి, నందిపైనుండి దిగింది సతీదేవి.
తన వెంట వచ్చిన గణసముహాన్ని, తగిన తావులలో ఉండవలసిందిగా నిర్దేశించింది.
పుట్టినింట అడుగిడిన సతీదేవికి, సోదరీమణుల - దేవతల - ఋషుల స్వాగత సత్కారాలు బాగానే లభించాయి. తల్లి అసిక్నీ అక్కున చేర్చుకుంది.
హవనవేదిక చెంతకొచ్చి నిలబడింది సతి. శివుడికి తప్ప తక్కిన వారందరికీ అక్కడ హవిర్భాగాలు ఏర్పరచి ఉండటం గమనించింది. కూతుర్ని చూసికూడా, ముఖం మరోవైపు తిప్పుకున్నాడు దక్షుడు.
సతీదేవి తక్షణమే తండ్రి కెదురుగా నిలిచింది. వారి సంభాషణ ఈ రీతిగా సాగింది.
సతి: జనకా! స్మరణ మాత్రం చేతనే చరాచర జగత్తులన్నీ పావనం చెయ్య గల శంభుని ఏల పిలవలేదు? అత్యున్నతమైన అపవిత్ర కార్యం అదే అని నీకుతెలియదా? అజ్ఞానమో - అహంకారమో?! ఏదయినాగానీ... ఇటువంటి యజ్ఞం నిష్ఫలం. అధమాధమం.
దక్షుడు: చాలు! ఇక ఆపు! నీ భర్త ఇందు ఉండుటకు అర్హుడేకాడు.
సతి: (ఆశ్చర్యంగా) ఏమేమీ?
దక్షుడు: భూత ప్రేత పిశాచాలకు అధిపతులైనవారు. క్షుద్రదేవతలవుతారు. వారికి వేదోక్త యజ్ఞవాటిక పూజలందు అర్హత లేదు.
సతి: కేవలం భూత గణాధినాధుడు మాత్రమేనా? చతుర్దశ భువన భాండాలకూ రక్షా ధ్యక్ష ధురీణుడాయన. అసలు.. నీకు అజ్ఞానం తిరగబెట్టడం వల్ల, నీపేరే దక్షుడుకాదు... అక్షరాలు తిరగబడి 'క్షుద' రమైంది. నీకే అర్హతలేనిది!
దక్షుడు: (వేళాకోళంగా)ఇప్పుడే గదా - నీ భర్త సర్వవ్యాపకుడూ - సర్వాధ్యక్షుడూ అన్నావు. అదే నిజమైతే ఇక్కడ ఉండాలికదా!
సతి: విధి విధానంగా ఆవాహన చేశావా? పిలుపులో లోపం పెట్టుకుని, వ్యాపి ఇందులేడని అడగడం మర్యాదా?
దక్షుడు: ముందే చెప్పాను.. క్షుద్రసహవాసి అని!
సతి: మరి... అంత క్షుద్రమూర్తికి నన్నెట్లు ఇవ్వగలిగావు?
దక్షుడు: రుద్రమూర్తి అని చెప్పాడు బ్రహ్మ! విధివశాన్ని తప్పించ నా తరమా?
సతి: నమ్మి ఇచ్చినచోట, కడదాకా అదేనమ్మిక ఉండాలి! మధ్యలో ఎన్నో వస్తూ - పోతూ ఉంటాయి. ప్రాజ్ఞుల లక్షణమేది? బాంధవ్యం కాటుక బొట్టులాంటిదికాదు - తడిచేస్తే పోవడానికి! అల్లునికి మర్యాద ఈయవద్దా?
దక్షుడు: (హూంకరిస్తూ) మర్యాదట.. మర్యాద! మర్యాదయే తెలీని వారికి ఇంకేం మర్యాద?
సతి: (కోపం తారాస్థాయికి చేరుకొంటూండగా) అంత అమర్యాద కరమైన పనేమిచేశాడు నా పెనిమిటి?
దక్షుడు: తెలీక అడుగుతున్నావా? నా నోటితో చెప్పించే ప్రయత్నం చేస్తున్నావా? ఆ బూడిదపూతలూ, దిగంబరంగా ఊరేగుట....
సతి: (మధ్యలోనే ఆపి)చాలు చాలు! ఈ చరాచర జగత్తునే నగ్నంగా పుట్టించినవాడికి, దిగంబరం కాక పట్టు పుట్టము లుండునా? ఆయన మహిమ మీకు ఏం తెలుసు?
దక్షుడు: (మరింత వెటకారంగా) ఓహో హో! మహిమలు! అన్నీ దురాంతక దుర్మార్గచేష్టలే! మన్మధుణ్ణి కంటి మంటతో కాల్చి చంపడం మహిమేనా? బ్రహ్మ తల తెగ్గోసి, ఆ పాతకం చాలదనట్టు ఆయన కపాలంలో ఆడుక్కుతినడం ఓ గొప్పా? సిగ్గూ - ఎగ్గూ లేనివాడు.
వెంటనే, శివదూషణ భరించలేక తన అరిచేతులతో తన రెండు చెవులూ మూసుకుంది సతీదేవి.
ఇక - తండ్రితో ఎంత వాదించినా ఫలితం శూన్యం అని ఆమెకు బోధపడింది. బహుళా ఇంత రాద్ధాంతాన్ని తన పతి ముందే ఊహించి ఊంటాడు. అందుకే వెళ్లవద్దన్నాడేమో! అని క్షణకాలం పాటు ఆమె మదిలో మెదిలింది.
అక్కడున్న విష్ణ్యాది దేవతల వైపు తిరిగి ఇలా అంది సతీదేవి; సమస్త దేవతలారా! ఈశ్వర బహిష్కృతుడైన ఈ యాగానికి మీరంతా ఏ మొహం పెట్టుకొనివచ్చారు? అసలు మీకు మనసెలా ఒప్పింది?
దేవతలే కాదు... ఋత్విక్కులు సైతం, సతీదేవి ప్రశ్నకు జవాబు చెప్పలేక దిక్కుల్ని ఆశ్రయించారు.
పిలవని పేరంటానికి వెళ్లకూడదని శివుడెంత చెప్తూన్నా వినకుండా వచ్చినందుకు తనకీ శాస్తి కావలసిందే! హరహరా! ఎంత శివనింద! ఎంత మహాదూషణ? ఇక్కడ జరిగిన ఈ విషయాలు ఏ ముఖంతో ఆయనకు విన్నవించను?.. రకరకాలుగా వ్యథచెందింది.
చివరికి ఓ నిర్ణయానికి వచ్చేసింది సతీదేవి.
"తండ్రీ! యజ్ఞపురుషుడూ - యజ్ఞభోక్త - యజ్ఞరూపుడూ అయిన నా పతిదేవుని - శ్రీ సదాశివుని ఆహ్వానించకపోవడమే ఒక అపచారం!
అది చాలదన్నట్టు.. దూషణ చేశావు. అదీ నా చెవులబడేలా చేశావు. మరో అపచారం ఇది. ఏ కర్మఫలాన్ని ఆపేక్షించి ఇది తలపెట్టావొ, అది నీకు అందదు. సాంబశివుడే నిన్ను శిక్షించబూనితే రక్షించువా రుండరు. నీలాంటి పాపాత్ముడికి కూతిరిగా, దాక్షాయణిగా ఇక మనజాలను.
శివనిందాపరుడివైన నీకూ - నీచేత ఈ యాగం చేయిస్తూ సమర్ధించబూనిన యావన్మందికీ త్వరలోనే కీడు మూడుగాక!" అని అక్కడే యజ్ఞ హోమగుండంలోకి అంతా ఆశ్చర్యపోయి చూస్తుండగా దూకి, ప్రాణాలు విడిచింది సతీదేవి.
ప్రాణత్యాగం చేస్తూ, 'నేను సతీమతల్లినైతే పునర్జన్మయందు కూడా, ఆ పరమశివునే పతిగా పొందెదను గాక!' అంటూ సతీదేవి పలికిన పలుకులే యజ్ఞవాటిక అంతటా మారుమ్రోగాయి.
హోమగుండంలోనికి, నిరావాహనతో హఠాత్తుగా ఓ నిండు ప్రాణాం దుమికేసరికి - ఋత్విక్కుల నోళ్ళు కట్టుబడిపోయాయి. మంత్రాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.
ఈ అకస్మిక పరిణామానికి, ఆమె వెంటవెళ్లిన దాదాపు రెండు వేలమంది శివగణానుయాయులు, తమ శిరస్సులను తామే ఖండించు కొని శివార్పణ చేసుకున్నారు. ఎటుచూసినా రక్త కుంకుమలు జల్లినట్లు భీతావహంగా మారింది యజ్ఞవాటిక. ఈ ఘోరాకృత్యానికి దేవతలూ - ఋషులూ హాహాకారాలు చేశారు. సతీదేవి తమ కళ్లముందే నిలువునా బూడిదైపోవడం చూసి తట్టుకోలేని సున్నిత మనస్కులైన కొందరు మార్చిల్లారు. మరికొందరు శ్రీ మహావిష్ణువును చూసి, "జగద్రక్షకా! ఈ ఘోరాకృత్యములింక కొనసాగనివ్వక కట్టడి చేయకూడదా?" అని ప్రార్ధించారు.