శివపురాణము/రుద్ర ఖండము/శరభుడిగా శంభుడు

శరభుడిగా శంభుడు

దక్షయజ్ఞధ్వంసిగా పేరుగడించిన వీరభద్రుడు శివ జటా జూటోద్భవుడు. శివుడుగానీ - శివాంశలు ఏవైనగాని - శివ వీర్య సంజాతమైన రూపాలుగానీ...సమస్తం శివమయం అని మనం తెలుసుకోవలసివుంది.

అట్టి వీరభద్రుడొకసారి, శ్రీహరి ఉగ్రనారసింహరూపాన్ని ఉపసంహరించ వలసిందని కోరగా, దానికాయన అంగీకరించకపోయేసరికి, వీరభద్రుడు తన నిజస్వరూపం ఎరిగించే ప్రయత్నంలో సాక్షాత్తు శివునిగా పరివర్తన చెంది, నిజరూపదర్శనం చేశాడు శ్రీహరికి. సహస్రబాహువులతో, చంద్రరేఖాంకితుడై, జటా జూటధారియై, నీలకంఠుడై, త్రినయనుడై, వజ్రసదృశనఖుడై శంభుడు కనిపించాక తన ఉగ్రరూపం విరమించాడు మురారి.

నృసింహుడూ ఈశుడే:

శ్రీహరి అవతారాలలో ఒకటిగా పరిగణింప బడుతున్నప్పటికీ, నిజానికి నృశింహావతారం ఈశ్వరుడే. శ్రీహరి సహజంగా శాంతమూర్తి కేవలం దనుజ సంహారార్థం అతడికి ఆ ఉగ్రరూపం దయ చేయించింది - శివ శక్త్యాత్మకమైన ప్రకృతియే! రెండూ వేర్వేరు కావు. శివుని మెడను అలంకరించే ముండమాలికలోని 'తరళ' స్థానంలో ఉన్నదే ఈ నృసింహుని సింహపు శిరస్సు.

యక్షావతారం:

ఒకానొక దేవాసుర సంగ్రామంలో దానవులపై విజయం సాధించారు దేవతలు. అది కేవలం తమ బలపరాక్రమమే అని విర్రవీగి, శివానుగ్రహం ఏమీలేదన్న భావనతో ప్రగల్భాలు పలకసాగారు.

వారికి కనువిప్పు కలిగించదలచి, శివుడొక యక్షుడి అవతారంలో వారి ఎదుట నిలిచి "మీ యొక్క సంరంభ కారణమేమిటి?" అని అడిగాడు. రాక్షస సంహారం తమ ప్రతిభే అన్నారు. "అంతటి బలపరాక్రమ వంతులైతే ఈ గడ్డిపోచ సంగతి చూడండి!" అంటూ వారి మద్య ఓ తృణం ఉంచాడు శంభుడు.

యక్షవేషధారి శంభుడని తెలీని దేవతలు రకరకాలుగా ప్రయత్నించారు. కనీసం దాన్ని కదల్చనైనా లేకపోయారు. శివాజ్ఞ - అనుగ్రహం లేనిదే ఏదీ జరగదని తన నిజరూపం చూపాడు శంభుడు.

గృహయజమాను డీశ్వరుడే

నర్మదాతీరాన ధర్మపురంలో నివశించే వైశ్వానరుడు - శుచిష్మతి దంపతులకు, శివ వరప్రసారం వల్ల జన్మించిన కుమారుడు. శివాంశ సంభూతుడిగా 'గృహపతి' అనే పేర పెరగసాగాడు. కాని అతడికి 12వ ఏట పిడుగు గండం ఉందని తెలిసి దంపతులు చింతాక్రాంతులై ఉండగా, ఆ బాలకుడు తల్లితండ్రులను ఒప్పించి తపస్సుకోసం వారణాసి వెళ్లిపోయాడు.

శివుడాతడిని పరీక్షలకు గురిచేసి, అతని తపం ఏకాగ్రమైనదని సంతృప్తితో వరాలనుగ్రహించి ప్రాణులందు జఠరాగ్నిగాను, దిక్కులలో ఆగ్నేయానికి అధిపతిగాను చేశాడు. కనుకనే అగ్ని కూడా ఈశ్వరావతారమే! వైశ్వానరుడనే పేరు అగ్నికి అందుచేతనే కలిగింది.

ద్విజేశ్వర రూపుడిగా..

భద్రాయువు అనే రాజునకు వనవిహార సమయంలో కనిపించిన మాయపులి, శివుని భార్యను కబశించగా, శివుడు రాజుభార్యను దానంగా ఇమ్మని కోరాడు. (ఆ సమయంలో - శివుడూ - శివపత్నీ బ్రాహ్మణ వేషధారులై ఉన్నారు. వారు పార్వతీ పరమేశ్వరులనీ, పార్వతినే పులిమాయ పట్టుకెళ్ళి పోయిందనీ తెలీని భద్రాయువు,తన భార్యను శివునికి సమర్పించడానికి వెనుకాడలేదు). అప్పుడతని ధర్మనిష్ఠకు మెచ్చిన శివుడు తన ద్విజేశ్వరావతారాన్ని ఉపసంహరించి సదాశివుడిగా ప్రత్యక్షమై వరాలు ఇచ్చాడు.