శివపురాణము/యుద్ధ ఖండము/నటన మైత్రీ సన్నాహం
"తప్పొప్పుల సంగతి తర్వాత చూద్దాం!.... ముందు గండం తప్పే విధం చూడాలి అందరూ.." అని బృహస్పతి సమన్వయపరిచి,
"నాదొక్కమాట వినండి! మనం దనుజులతో చెలిమిచేద్దాం! అలా నటిద్దాం! వారెలాగూ మనపట్ల సదభ్రిప్రాయాన్ని కలిగి ఉంటారనేది కల్ల గనుక - ఇది అనాదిగా వస్తున్నదే గనుక మనం కనీసం స్నేహాన్ని నటించడం సమర్ధనీయమే! అని దేవతలను ఒప్పించాడు.
"దేవరాజా! దానవరాజుతో మైత్రీహస్తాన్నందుకోవడానికి సిద్ధపడు! నీ ఆహానికి గొడ్డలిపెట్టు అని నేనూ ఎరుగుదును. అయినా తప్పదు" అని దేవేంద్రునికి నూరిపోశాడు.
సరేనన్నాడు ఇంద్రుడు కాని...
కాని, మరొక చిక్కు సమస్య ఉత్పన్నమైనది. సముద్రం చూస్తే లోతూ, అంతూ - దరీ లేనిది. దేంతో మథించాలి? ఎటువంటి త్రాడుండాలి? అనే ప్రశ్న లేవదీశాడు బృహస్పతి.
"దీనికింత యోచనేల? మందర పర్వతాన్ని పెకలించి తెచ్చి కవ్వంగా ఉపయోగిద్దాం! మన సర్పలోక ప్రముఖుడు వాసుకి ఉండనే ఉన్నాడు గదా! త్రాడుగా ఉండడానికి నేను ఒప్పిస్తాను" అన్నాడు చక్రపాణి. వాస్తవానికి దేవ దానవులు అక్క చెల్లెళ్ల బిడ్డలు. దితి - అదితి అనే సోదరీమణులకు కుమారులు. కుమార్తెలు వీరు. సత్త్వగుణ ప్రధానులైన దేవతలకూ - రజస్తయోగుణాన్వితులులైన రాక్షసులకూ ఎన్నోసార్లు తగవులు సంభవించడం, చాలా వాటిలో దానవులదే పై చేయిగా ఉండడం జరుగుతూన్న కథే!
తగిన పరివారాన్ని వెంటబెట్టుకొని, దానవేంద్రుని పురాన్ని సమీపించాడు దేవేంద్రుడు.
యుద్ధ సన్నాహామేమో అని భావించిన దానవగూఢచారులు, పరివారం తక్కువుగా ఉండడంతో అదికాదని నిర్ధారించుకున్నారు.
అదీగాక అందరి చేతులలోనూ శాంతిచిహ్నాలూ - శ్వేత వర్ణ పతాకాలూ ఉండడంతో అది మైత్రీ సన్నాహమని గుర్తించి తక్షణం తమ ప్రభువుకి దేవేంద్రుని రాక గురించి తెలియజేశారు.
ఎంతటి భీకర శత్రువైనా సరే! తమ ప్రాంగణంలోకి రావడం అంటూ తటస్థిస్తే...తదుపరి పరిణామాల సంగతి తరువాత...ముందుగా ఎదురేగి స్వాగత సత్కారాలు చేయడం లోకమర్యాద. వెంటనే ఆ పని చేశాడు బలిచక్రవర్తి.
యోగక్షేమాలు విచారించి గౌరవంగా సుఖాసనాసీనుని చేసి వచ్చిన పని ఏమిటని అడిగాడు బలిచక్రవర్తి.
"ఈ మధ్య మాకు సంభవించిన కష్టాలు మీకు తెలిసే ఉంటాయే" అంటూ మొదలుపెట్టాడు శచీపతి.
తెలీదన్నాడు బలి.
సవివరంగా చెప్పడు పురందరుడు.
నిజంగానే చాలా విచారించాడు బలిచక్రవర్తి. "అర్రే, చాలా కష్టం వచ్చిందే" అని సానుభూతి చూపించాడు.
'మనం అక్క చెల్లెళ్ల బిడ్డలం! పరస్పర విద్వేషబుద్ధి మానుకోవాలి!" అన్నాడు శచీపతి.
"నిజమే! అలాగే చేద్దాం!" బలిచక్రవర్తి సాలోచనగా అన్నాడు. అన్నాడే గానీ, ఇంకా చిన్న శంక ఉండిపోయింది అతడి మనసులో, అది కనిపెట్టి -
"ఇంతవరకు మనలో మనం ఐకమత్యం లేక ఎన్నో ఇక్కట్ల పాలయ్యాం! ఇకపై అది జరగరాదని నా అభిమతం! దేవతలందరి తరుపున నేను చెప్తున్నాను. అయినప్పటికీ - దానవుల తరుపున మీరుచెప్పినాసరే! మీ బంధుమిత్రాదులందరితో చర్చించి చెప్పినాసరే! మైత్రి చిగురు తొడిగేలా చెయ్యడమే మన ముందున్న ముఖ్య కర్తవ్యం!" చాలా నమ్మకంగా - ఏమాత్రం తొట్రు పడకుండా చెప్పిన దేవేంద్రుని, కించిత్తు కూడా అనుమానించలేక పోయాడు బలిచక్రవర్తి.
ఇక చివరి అస్త్రంగా, "మీ అందరూ ఇష్టపడితే, ఉభయులమూ బాగుపడే మార్గం చెప్పగలను" అని ఆశపెట్టాడు దేవేంద్రుడు. బలి చక్రవర్తి శంక తీరింది.
వెంటనే త్రిలోకాల్లో ఎక్కడెక్కడి దానవులనూ, కుంభ, నికుంభు లనూ, మయమాలి, అరిష్టనేమి, నివాత కవచులు, విప్రచిత్తు తదితర దానవ ప్రముఖులునూ సమావేశ పరిచాడు. దైత్య గురువులైన శుక్రాచార్యులకు కబురుపంపగా, ఆయన యాగదీక్షలో ఉండుటచేత, బలిచక్రవర్తి నిర్ణయమే తన నిర్ణయంగా భావించవచ్చునని ఆయన దూతను పంపడంతో - అసురగణమంతా ఆయన లేకూండానే సమావేశమైంది. భిన్నాభిప్రాయాలు వినిపించినప్పటికీ, అధికులు మాత్రం దేవతలతో మైత్రి మంచిదని వచించారు.
అందరి అభిప్రాయాలకూ దేవేంద్రుడే ప్రత్యక్షసాక్షి.
ఆ విధంగా అందరి అభిప్రాయాలూ సమీక్షించిన బలిచక్రవర్తి "దేవేంద్రా! ఎవ్వరూ దేవతలపట్ల విముఖత ప్రదర్శించలేదు. ఒకటి రెండు భిన్నాభిప్రాయాలుండడం సహజం! వాటిని అంత పరిగణనలోకి తీసుకోవడం సబబు కాదనుకో! మొత్తం మీద, ఇకపై - దేవదానవులు సవతి బిడ్డలవలె కాక, ఓ తల్లి బిడ్డల్లా సహకరించుకోవాలనే అందరి అభిప్రాయం! కనుక - ఉభయులకు శ్రేయస్కరమైన దేదోగలదని చెప్పావు! అదేమిటి?" అని అడిగాడు.
"దేవదానవులు కలిసి పాల సముద్రం చిలికితే, అమృతం పుడుతుంది. దానిని మనం అంతా కలిసి పంచుకొని త్రాగడం వల్ల అమరత్వం సిద్ధిస్తుంది. మనకు ఇక మరణం అనేదే ఉండదు".
"చిత్రంగా ఉందే! మరణం ఉండదనే సంగతి మీకెవరు చెప్పారు?" ఆశ్చర్యపోయాడు బలిచక్త్రవర్తి.
"అదే దేవరహస్యం! కాని, ఇటీవల దూర్వాస మహాముని శాప ఫలితం...ఇందాకే చెప్పానుగా! సమస్తం సముద్రం పాలైనాయి. దీనికి సముద్ర మథనం ఒక్కటేమార్గం".