శివపురాణము/యుద్ధ ఖండము/జలంధరునికి నారదుడు నూరిపోసిన అంశం
నారాయణుడిని దర్శించే నెపంతో,జలంధరుని పురంలో ప్రవేశించాడు నారదుడు. తమ బావగారికి అత్యంత ఆప్తుడైనందున నారదుని సగౌరవంగా ఆహ్వానించి యధోచిత మర్యాదలు చేశాడు జలంధరుడు.
సత్కారాలన్నీ అందుకున్న మీదట, నారద మౌని సంతుష్టుడై జలంధరునితో ముచ్చటగా ఇష్టాగోష్ఠి ప్రారంభించాడు.
మొదట - అదృష్ట మంటే, జలంధరునిదే అదృష్టం అన్నాడు. ఆ పిదప - వివిధ రత్న మాణిక్యాదులు, సిరి సంపదలకు నెలవైన రమనూ, రమా రమణుడ్నీ తన నట్టింట కొలువుంచు కోగలిగిన ధీశాలి అని మరింతగా జలంధరుడ్ని ఉబ్బించాడు.
దేవర్షి అంతటివాడు తనను పొగుడుతూ ఉంటే, మరింత గర్వాంధతతో అలా పొగిడించుకుంటున్నాడే తప్ప, వినయంగా,అది తనకు వర్తిస్తూందో లేదో గ్రహించలేకున్నాడు జలంధరుడు.
సమయం చూసి, సందర్భవశాత్తు ప్రసంగం తెచ్చినట్టుగా ప్రారంభిస్తూ "జలంధరా! ఇన్నివిధాలుగా నీ ఇంట లక్ష్మి తాండవిస్తునప్పటికీ, గృహలక్ష్మి పదానికి సరిగ్గా సరిపోగల స్త్రీ నీ ఇంటలేదు" అన్నాడు నారదుడు.
అప్పటికే అహంకారంతో నీండా కూరుకుపోయిన కళ్లకు పొగడ్త మత్తు ఆవహించగా - "ఏమిటిస్వామీ! అలా సెలవిచ్చారు?" అని మహాగర్వంగా అడిగాడు.
"అవునయ్యా! అనవసరంగా ఆ బూడిద బుస్సన్న...పాముల భూషయ్య..శంకరయ్య పాలబడింది గానీ, పార్వతికి ఓ సుఖమా? పాడా? నీవంటి క్షాత్రవీరుడి దగ్గర ఉండదగ్గ రాచపడుచు ఆవిడ. ఆవిడ్ని నీవు చేపడితే తప్ప నిండుదనంలేదని నా అభిప్రాయం!" అన్నాడు నారదుడు - లోలోపల అవాకులూ - చెవాకులూ వాగవలసి వచ్చినందుకు అంబను క్షమాపణలు వేడుకుంటూ.
కానీ, అదంతా శివేచ్చ అనీ, శివాదేశానుసారమే తాను అలా పలుకుతున్నాడనీ నారదుల వారికి కూడా తెలీదు.
మొత్తం మీద జలంధరునికి ఎంతో కొంత అసంతృప్తిని రగిలించడంలో నారదుడు కృత కృత్యుడయ్యాడు. నారదుడ్ని సాగనంపాక, జలంధరుడిపై ఆ మహాముని పలుకులే పని చెయ్యసాగాయి. ఇక తాళలేక, రాహువుకు కబురుపంపి రప్పించి, చెప్పవలసిన వన్నీ చెప్పి, శివుడి దగ్గరకు రాయబారిగా వెళ్లమన్నాడు.
దూతగా వెళ్లినవాడు, ఎన్ని పొరపాటు మాటలాడినప్పటికీ ఏమీ ప్రాణభయం లేనందువల్ల, దేవతల పట్ల తనకున్న ద్వేషాన్ని అంతా రంగరించి మరీ ( జలంధరుని మాటలకు తన మాటలను కూడా చేర్చి) రాహువు చేసిన రాయబార ప్రసంగం విన్నవాళ్లకి మహాకోపం తెప్పించేంత పరుషంగా, దుర్మార్గంగా సాగింది.
"బూడిద పూతల వల్లకాటివాసా! భూతప్రేత సహవాసా! లోకోత్తర సౌందర్యరాశి అయిన గిరిసుతని నీ గుప్పెట ఎలా ఇరికించావో గాని, ఆమెకు నువ్వు ఎంత మాత్రం తగవు! అసలు నీలాంటి విరాగి; తిరుగుడు దేవరకు గౌరి దేనికి? అనవసరంగా భార్యని కలిగిఉన్నావు. రత్నాకర పుత్రుడైన జలంధరునికి ఆమెని సమర్పించుకో!" ఇదీ రాహువు చేసిన రాయబార నిర్వాక సారాంశం.
జలంధరుడి తరుపున దూతగా వచ్చినా, వొళ్ళుమండించే మాటలు మాట్లాడిన రాహువుని శిక్షించడం అనౌచిత్యం ఏమీ కాదన్న శివుడు వెంటనే, తన కనుబొమల నడిమినుండి ఓ ఉగ్రరూపుని పుట్టించాడు. అయితే రాహువు బ్రాహ్మడైనందువల్ల చంపరాదనీ - దూత కూడా కనుక ప్రాణాపాయం లేని శిక్షవేసి వదలమనీ శివాజ్ఞ.
శివభ్రూమధ్యోద్భవుడు, రాహువుని అమాంతం ఎత్తుకెళ్లి బర్బర దేశంలోకి విసిరిపారేశాడు. ఆ క్షణం నుంచే రాహువుకు బర్బరీకుడనే సార్థక నామధేయం కలిగింది.
రాహువు నానా తిప్పలుపడి రాక్షసలోకం చేరుకొని, తనకు జరిగిన పరాభవం జలంధరునికి మనవి చేసుకున్నాడు.
'పెద్దవాడు అనైనా చూడకుండా, తన దూత నింతగాపాట్లు పెడతాడా ఆ పార్వతీ పతి?' అని క్రోధావేశాలతో యుద్ధసన్నాహమే చేశాడు జలంధరుడు.
నారదుడి బోధ మేరకు, అంతటి సౌంధర్యవతినీ చేజిక్కుంచుకోడానికి యుద్ధానికైనా వెనుదీయరాదని నిశ్చయించుకున్నాడు.