శివపురాణము/కైలాస ఖండము/కుమారస్వామి ఉవాచ, నవవిధ భక్తిరీతులు
ప్రత్యేక శివ పూజ
ఈవిధంగా శివపూజ చేయదల్చుకున్న పాశాంకుశవరదాభయ ముద్రలు దాల్చినవాడుగాను, సర్వాభరణ భూషితుడుగాను అర్చించి; అనంతరం స్కందుని పూజించాలి.
కుమారస్వామిని మయూర ధ్వజునిగాను బాల భాస్కరుడిగాను, వరదాభయహస్తుడిగాను ధ్యానించాలి.
అ వెనుక - అంతఃపురాధికారి నందీశ్వరుని ధ్యానించి, సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాలతోను శివార్చన చేయాలి. వామ భాగాన అమ్మవారిని గౌరిగా భావించి పూజించాలి.
అటు తర్వాత శివాత్మకమైన లింగానికి షోడశోపచార పూజచేసి; ధూపదీప నైవేద్యాలు; తాంబూల నీరాజన మంత్రపుష్పాలు అర్పించి ప్రదక్షిణ అపరాధక్షమాపణ నమస్కృతులతో పరిపూర్తి గావించాలి.
కుమారస్వామి ఉవాచ:
ఒకానొక పరి, కైలాసమందు ఋషిగణాదులందరూ స్కాంద దేవుని దర్శించి, ప్రత్యేక శివపూజలు చేయలేని అశక్తులను కరుణించమనగా, ఆయన చిరునవ్వుతో ఇలా వివరించాడు:
"సాధకుడిననుసరించి శివుని కరుణ అందరియందూ సరిసమానంగానే ప్రసరిస్తుంది. విశేష ఫలితాలు కోరేవారు, విశేషంగా చేస్తే చేయవచ్చుగాక! శంకరుడు భక్తసులభుడు - భక్తవశంకరుడు అని తెలుసుకోండి.
అందుకే ఆయనను 'సచ్చిదానందమూర్తి' స్వరూపంగా అభివర్ణించారు. దీని అర్థం...'స్త్రీ పురుష సమభావ సంయోగ రూపం' అని ఇంతవరకూ ఈ పురాణం మొత్తం సారంగా గ్రహించినవారున్నారు.
పంచకోశాలతో కూడుకొని ఉన్న ఈ శరీరం తల్లితండ్రులవల్ల ఏర్పడుతున్నాయి. కనుక యావత్తు సృష్టి అంతా స్త్రీ పుం. సంయోగోద్భోవంగా గుర్తించాలి..."
కుమారస్వామి ఉపదేశ సారాంశాన్ని సూతులవారు శౌనకాది ఋషుల కెరిగించిన పిమ్మట, వారందరూ అతి ముఖ్యమైన పంచావరణ పూజ గురించి అడుగగా, ఆ విధానం చెప్పాడాయన.
పంచావరణ పూజ:
శ్లో: "నమః శివాయ సాంబాయ
సగణా యాదిహేతవే |
రుద్రాయ విష్ణవే తుభ్యం
బ్రహ్మణే చ త్రిమూర్తయే ||"
అనే శ్రుతి ప్రమాణం ప్రకారం, త్రి మూర్త్యాత్మకం అయిన సాంబశివుని, విష్ణుదేవుని పూజానంతరం, సూర్యనమస్కారాదులు చేసి కుమార, సద్యోజాతాది పంచబ్రహ్మమూర్తులనూ తొలి ఆవరణలో పూజించాలి.
ఇక - ద్వితీయావరణంలో అనంతసూక్ష్మ శివోత్తమ, ఏకరుద్ర, శ్రీకంఠులను ఆరాధించాలి.
మూడవ ఆవరణంలో అష్టమూర్తులను అర్చించాలి.
నాల్గవ ఆవరణంలో - విరాట్పురుషుడినీ, విష్ణుదేవుడినీ, అనిరుద్ధుడినీ, సంకర్షణుడినీ, విధాతనూ సేవించుకోవాలి.
చివరిదైనా పంచమావరణంలో లోకపాలురు, క్షేత్రపాలుడు, ఆయుధాలు మొ|| శివాత్మక ద్రవ్యరూపాలను కొల్చుకోవాలి.
నవవిధ భక్తిరీతులు :
ఇప్పుడు తొమ్మిది రకాల భక్తిమార్గాలను గురించి వివరిస్తాను...ఎవరికేది ఇష్టమైతే వారు ఆవిధంగా ఆ కైలాసవాసుని సేవించుకోవచ్చు!
ఒకానొక సందర్భంలో, సాక్షాత్తు శివదేవుడే వచించిన విధంగా - ఆయన జ్ఞానులకన్నా భక్తులనే ముందుగా అనుగ్రహిస్తాడని తెలుసుకోండి! జాతి, కుల వివక్షతలకు అతీతంగా తనను కొల్చు భక్తులందరినీ కటాక్షించే నిమిత్తం వారిగృహాలలో వసించి అభీష్టసిద్ధి గావిస్తాడాయన.
తొమ్మిదివిధాల భక్తిమార్గాల క్రమం ఇది !
1. శ్రవణం: వినడం ద్వారా శివుని గురించి తెలుసుకొని భక్తి కలిగియుండుట
2. కీర్తనం: తెలుసుకున్న వారెవరైనా శివస్త్రోత్రాల్ని కీర్తనలు చేయుట
3. స్మరణం: నిరంతరం శివుని తల్చుకుంటూ ఉండటం
4. సేవనం: ప్రతి నిత్యం శివపూజ చేయడం
5. దాస్యం: శివుడు తప్ప అన్యమైన దేదీలేదని శివప్రీతికరమైన పనులనే చేయడం
6. అర్చనం: విధివిధానంగా ఉపచారసహితంగా పూజలు చేయడం
7. వందనం: సాష్టాంగపూర్వక శివస్మరణాత్మక నమస్కారం
8. సఖ్యం: నిరంతరం శివుడు తనతో ఉన్నట్టుగా భావించుకొని, జరిగే ప్రతి కార్యమూ శివప్రేరణచేతనే జరిగినట్లు తలచుట
9. ఆత్మ నివేదనం: తన హృదయంలో శివుని నిల్పి అంతా చేయునదీ - చేయుంచునదీ అతడే అని గ్రహించుకొనుట
ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాలలో, జనులేది అనుసరించినా అది శివప్రీతికరమే అవుతుంది. బిల్వసమీకరణం, గన్నేరు పుష్ప సమర్పణం వంటివి కొన్ని శివప్రీతికరమైనవి వున్నా - భక్తి ప్రధానంమని భావించాలి. సాంగోపాంగ భక్తి మాత్రమే మోక్షర్హత ప్రసాదిస్తుంది.