శివపురాణము/కుమార ఖండము/శ్రీశైలానికి శ్రీకారం

భర్తను వేడుకున్నది పార్వతీదేవి. సతీపతులిద్దరూ క్రౌంచపర్వతం చేరుకున్నారు. తాను భ్రమరాంబగా మారగా, శివుడు మల్లికార్జునుడనే జ్యోతిర్లింగరూపుడై వెలిశాడక్కడ. అదే నేటి శ్రీశైలం.

అది నచ్చలేదు తనయుడికి. అటనుండి కూడా ఎటో వెడలిపోవసిద్ధమయ్యాడు. దేవతలందరూ ఆయన కాళ్ళా వేళ్ళా పడగా, అప్పటికే మూడు యోజనాలు వెళ్లిన కార్తికేయుడు అక్కడే ఆగిపోయి స్థిరపడ్డాడు. పుత్రునిపై గల ప్రేమకొద్దీ తల్లిదండ్రులే పక్షానికొక పరి అక్కడికెళ్లి కొడుకును చూసి వస్తుంటారు.

అలాగని - కుమారస్వామికి తల్లిదండ్రుల పట్ల భక్తి ప్రపత్తులు లేవని ఎవరు భావించినా పొరపాటే అవుతుంది. అందుకు నిదర్శనమైన ఈ ఘట్టం అవధరించండి.

అగ్రగణ్యత :

ఒకసారి అగ్రపూజ్యత విషయమై, అన్నదమ్ముల మధ్య మాట పట్టింపు వచ్చింది. సర్వ సైన్యాధ్యక్షుడైన తానే అగ్రపూజకు అర్హుడి నంటాడు షణ్ముఖుడు. గణాధ్యక్షుడైనందున తొలిపూజలందుకొనే వేలుపు తానే నంటాడు గజపతి.

"మంద గమనుడివి! అంత చురుకుదనం లేని వాడివి" అంటూ ఎగతాళి చేస్తూన్న సోదరునిపై తల్లిదండ్రులకు ఫిర్యాదుచేసిన గణపతి, 'అంత ముచ్చటగా ఉంటే ఈ పదవి ఏదో సోదరునికే కట్టబెట్టండి! నాకేం అవసరం లేదు" అంటూ అలిగాడు.

తమ పుత్రులసంగతి తల్లిదండ్రులకు తెలియదా? ఈ చిలిపి తగాదాను సామరస్యంగానే పరిష్కరించడానికి పార్వతీపతి ఒక పరీక్ష పెట్టాడు. తద్వారా విఘ్నేశుని ప్రతిభ, తన పుత్రరత్నమైన కుమార స్వామికీ అర్ధం అవుతుందని ఆశించాడు కూడా!

ఇద్దరినీ చేరబిలిచి "నాయనలారా! మీలో అధిక శక్తి యుక్తులెవరివొ చిన్న పరీక్ష ద్వారా మీరే గుర్తించవచ్చు!" అన్నాడు శివుడు.

సద్ధమేనన్నారు సోదరద్వయం.

"మరేమీలేదు! మీలో ఎవరు ముందుగా ఈ భూప్రదక్షిణంచేసి రాగలుగుతారో, వారే అన్ని విధాలా గణాధ్యక్ష పదవికి తగినవారు! ఒకవేళ ఈ పరీక్షలో గణపతి నెగ్గితే సరే! లేకుంటే పదవి రద్దుకు సిద్ధం" అని కూడా తండ్రి పలకడంతో, ఆ సవాలు స్వీకరించాడు స్కందుడు.

క్షణం కూడా ఆలస్యం చేయకుండా, తన నెమలి వాహనాన్ని అధిరోహించి, భూ ప్రదక్షిణానికి బయల్దేరాడు శిఖివాహనుడు.

గణపతి మాత్రం కైలాసంలోనే ఉండి, తాను తన శరీరస్థితి గతులు తెలిసినవా డవడంచేత ఒక ఉపాయం ఆలోచించాడు.

తల్లిదండ్రు లిద్దర్నీ ఒకే వేదికమీదకు చేర్చి, వారిని ఆ పీఠం పై ఆశీనులను చేసి, షోడశోపచార సహితంగా అర్చించి, చేతులు జోడించి

" పిత్రోశ్చ పూజనం కృత్వా

 ప్ర కాంతించ కరోతియః ||
 తస్య వై పృధివీ జన్యం"
 ఫలం భవతి నిశ్చితమ్ ||"

( తల్లి దండ్రులను అర్చించి, వారికి ప్రదక్షిణం ఆచరించినట్లయితే భూప్రదక్షిణం గావించినంత పుణ్యం! ఇది నిశ్చయం అని వేదశాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి) అని ప్రార్ధించి, వారి చుట్టూ సప్తప్రదక్షిణలు చేశాడు గణనాధుడు.

ఆ ప్రకారం ఏడుసార్లు భూప్రదక్షిణంచేసి వచ్చినట్లయింది గణపతి - దీని ప్రభావం వల్ల.

కుమారస్వామి ఏ పుణ్యతీర్ధాన స్నానం చేయడానికి వెళ్లినా, అప్పటికే అక్కడ స్వామిని సేవించి తిరిగి వెళ్లిపోతూన్న గణపతి కనిపించసాగాడు. అదంతా సోదరుని బుద్ధి కుశలత ప్రభావం అని తర్వాత బోధపడింది స్కందుడికి.

                                       కుమారఖండము సంపూర్ణము