శివపురాణము/కుమార ఖండము/కుమారస్వామి జననం

స్నాన సంధ్యాదులు, గాయత్రీ సహిత శివ పూజా జప తపాదులు సాకల్యంగా నిర్వర్తించుకొని నైమిశారణ్య మునిశ్రేష్ఠులందరూ నాలుగవ నాటి ప్రభాతవేళ యధావిధిగా సూత పౌరాణికుని పరివేష్ఠించారు.

పార్వతీ కల్యాణ ఘట్టము జరిగిన తదుపరి కథాంశం విన కుతూహలం పడుతూన్న మునివరేణ్యులను దయా ధృక్కులతో చూసిన రోమహర్ష్ణణ మహర్షి, వారందరి కోరిక మేరకు శ్రీ శివపురాణంలోని నాలుగవదైన 'కుమార ఖండము'ను ప్రారంభించాడు.

"... ఆ ప్రకారంగా కైలాసంలో కాపురం ఉంటూన్న పార్వతీపరమేశ్వరులు! కామసుఖాలలో లీనమై, తమదైన శృంగారలోకం లోనికి వెళ్లిపోయారు.

లోకరీతి ననుసరించి, పార్వతీదేవి గర్భందాల్చే స్థితి కలగాలంటే - సురతకేళి అవసరం గనుక వారిరువురూ శృంగారకేళికి సమాయత్తమైనారు. కాని, లేకుంటే శివుని అంశన - ఏ అవయవం నుంచి అయినా...చివరికి జటాజూట చాలనం వల్లనైనా సంతానం కలగడం అతి మామూలు విషయం.

అదీగాక - తారకాసురుడు కోరిన ప్రకారం, తనను సంహరించు అతడు శివవీర్య సంజాతుడై ఉండాలి! దేవతల్లో, మామూలు మానవులవలె అధోరేత స్ఖలనం ఉండదు. ఊర్ధ్వరేతస్కులు అధోరేతస్కులవడానికి ఎంతోకాలం గడపాలి!

అయితే, ఎంతకాలం సురత క్రీడ సాగుతున్నప్పటికీ - అటువంటి దాఖలాలు ఏవీ కనబడడం లేదు. పార్వతీదేవి గర్భధారణ జరగడం లేదు.

ఈలోపున తారకాసురుడి పీడ తారాస్థాయిని ఇంకా మించిపోతోంది. లోకాల హాహాకారం గగన తలాన్ని తాకి ప్రతిధ్వనిస్తోంది. లోకాల మనుగడకు ముఖ్య ఆధారమైన ప్రాణవాయువు సైతం స్తంభించి పోగల దుర్ద్హశ దాపురించింది.

అంతలో విష్ణుమూర్తి చెంత చేరారు మళ్లీ సుదర్శనుడితో సహా ఎవరికీ దిక్కుతోచలేదు.

"మనం చేయగలిగినదంతా చేశాం! ఇకపై చేయగలిగింది, ఆ పరమశివుడి దయపై ఆధారపడి మాత్రమే ఉన్నది. ఆయననే శరణు వేడడం ఉత్తమం" అంటూ సురసమితిని యావత్తూ వెంటబెట్టుకొని సుదర్శనుడు కైలాసదర్శనానికి బయల్దేరాడు.

అంతఃపురంలో...లోపలెక్కడో పార్వతీదేవి యందు అత్యంత అనురక్తుడై సరస క్రీడలో మునిగి ఉన్నాడు పరమేశ్వరుడు.

ముఖద్వారం దగ్గరే అందరూ మోకరిల్లి పెద్దపెట్టున "నమః పార్వతీ పతయే! నమః శంకర మహాదేవాయ నమః ఆశ్రితవరదాయ! నమోనమః" అంటూ ఎలుగెత్తి మొరలారంభించారు దేవగణాలు.

దేవతల మొర ఆయనకు శయ్యాసుఖ భంగముకాగా, బైటికొచ్చాడు శివుడు. దేవతలంతా ఆయన ఎదుట సాష్టాంగపడ్డారు.

సరిగ్గా తనకు రేతఃపతనం జరుగుతూన్న సమయంలో, బైటకు వచ్చేసినందున, అంతా సక్రమంగా జరిగే అవకాశం లేకపోయిందనీ; ఇక దేవతలకోరికలు సత్వరమే తీరాలంటే, తన రేతాన్ని వారే స్వీకరించాల్సి వుంటుందనీ తెలిపాడు పరమేశ్వరుడు.

దేవతలందరి తొందరింపువల్ల, పావురం రూపంలో అగ్నిదేవుడు శివరేతాన్ని స్వీకరించేశాడు తప్ప, అది పార్వతీదేవి ఆగ్రహకారణ మవుతుందనీ - శాపంగా పరిణమిస్తుందనీ అగ్ని తెలుసుకోలేకపోయాడు.

పార్వతి జరిగిన దాంతా చూశాక, దేవతలందరూ స్వార్ధ ప్రయోజనం కోసమే శివారాధన చేశారనీ; అందువల్ల నాశనమైనది తన సుఖమేననీ అర్ధమైంది. వారివల్లనే తాను సంతానవతి అయ్యే అవకాశాన్ని కొద్దిలో కోల్పోయిందని బాధపడి్ పోయిన పార్వతీదేవి, తన ఉసురు కొట్టిన పాపానికి దేవతలందరికీ కూడా వారి వారి భార్యల యందు సంతానం కలుగకూడదని శాపం ఇచ్చింdది.ఇచ్చా పూర్వకంగా అగ్ని శివరేతాన్ని పుచ్చుకున్నందున, అతడ్ని సర్వభక్షకుడిగా నిత్యం కష్టాలపాలయ్యేలా శపించింది.

అగ్నిదేవుడా శివవీర్య తాపాన్ని తట్టుకోలేక వాయువు సహాయం కోరి, హిమవంతుడి ద్వారా గంగానదిలో విలీనమైపోయేలా ఆ ఉగ్రాగ్ని వీర్యాన్ని విసర్జించాడు. కాని ఆ వేడిధాటికి తట్టుకోలేక, గంగమ్మ తన కెరటాలతో దానిని విచ్చిన్నం చేస్తూ రెల్లు పొదల్లోకి చేర్చింది. అలా మార్గశిర శుద్ధ షష్ఠినాడు - కుమారస్వామి ఆవిర్భావానికి సహకరించింది గంగమ్మ తల్లి.

(శివవీర్యాగ్ని సప్తర్షులలో ఒక్క అరుంధతీ సహిత వశిష్ఠునికి తప్ప ఇతర ఋషుల భార్యలను కూడా కష్టాలపాలు చేసిందని పురాణగాథ)