శివపురాణము/ఉమా ఖండము/కాళి 'గౌరి' అగుట

పరమశివుడు రుద్రాణిని తరుచు 'కాళీ' అనీ, 'శ్యామా' అనీ; 'కజ్జలా' అనీ పిలుస్తూ ఆటపట్టిస్తూంటే - తన పతికి ఈ వర్ణం నచ్చలేదని భావించుకున్న ఉమాదేవి, బ్రహ్మకోసం తపస్సు చేయబోగా శివుడామెను వారించడం - దాని కామె అంగీకరించక పోవడం మనం చెప్పుకున్నాం! ఆ రంగు నేను నాక్కావాలనుకుంటే ప్రసాదించగలనన్నాడు కాని, ఉమాదేవి ప్రయత్న పూర్వకంగా సాధించాలనుకున్న వైనం కూడా మనకు తెలిసిందే.

అలా బ్రహ్మకోసం తపిస్తున్న ఉమకు ఏకైక లక్ష్యం - గౌరవర్ణ సాధన.

అమె తపమాచరిస్తున్న అడవిలోనే ఓ మహా కృరమైన పెద్దపులి ఉంది. ఓ రోజు దానికి ఎంతగానో, అడవినంతా గాలించినా వేట దొరకలేదు.

తపోదీక్షలో ఉన్న ఉమపైకి లంఘించబోయి ఐదారుసార్లు వెల్లికిలబడింది. మళ్లీ ఎగిరింది. దూకింది. మళ్లీ అలాగే పడింది.

ఉమకు ఇదంతా ఆశ్చర్యంగానూ - వినోదంగానూ ఉంది. ఆ పులి తనను వినోదింప జేయడానికే అలా చేస్తున్నట్లుగా భావించారు అమ్మవారు. దానిపైకి దయానంద భరితమైన కటాక్ష వీక్షణాన్ని ప్రసరింప జేసేసరికి దాని ఆకలి తీరిపోయింది. దాని కృరత్వమే నశించిపోయింది. సాధువుగా మారిపోయింది.

దాంతో, అది అక్కడక్కడే ఆశ్రమం వదలకుండా సంచరించ సాగింది. సర్వ జగద్రక్షకి అయిన ఉమాదేవికి కావలిగా ఉండసాగింది.

అమ్మవారి ఆరాధన - తపోదీక్ష రెప్పవాల్చకుండా చూస్తూండేది. అంబిక అయ్యవార్ని ఉపాసిస్తూ వుంటే, ఈపులి అమ్మవార్ని ఉపాసిస్తోందా అనిపించేది.

శుంభ నిశుంభులనే రాక్షసుల వల్ల దేవతలు ఇక్కట్లు పడుతున్న తరుణమది! దేవతలంతా కలిసికట్టుగా విధాత వద్దకెళ్లి మొర పెట్టుకున్నారు. శుంభ నిశుంభుల్ని వధించడానికి ఒక్క కాళియే తగినదని తామరచూలికి తెలుసు! దేవతలందరికీ అభయం ఇచ్చి పంపివేసి, ఇక్కడ తపోనిమగ్న అయిన ఉమాదేవి ఎదుట ప్రత్యక్షమయ్యాడు విధాత.

"అఖిల దేవతలకు వరాలిచ్చే తల్లీ! ఆజ్ఞాపిస్తే నేనే మీ చరణాల వ్రాలేవాడిని! అయినప్పటికీ నా కోసం తపించి, మాకు లోకంలో ఔనత్యం కల్పించిన బ్రహ్మాండనాయకీ! మీకిదే నా ప్రణామం! ఏమి ఆజ్ఞ తల్లీ" అని అడిగాడు బ్రహ్మ.

అమ్మవారు తనకున్న ఆలోచన చెప్పారు. "అవశ్యం! కానీ, మాదొక విన్నపం తల్లీ! తాము ఏ కాళిక రూపాన్ని విడుస్తున్నారో, అది వృధాపోనీయకుండా - ఒక మహత్కార్య సిద్ధికి వినియోగపడేలా అనుగ్రహించు తల్లీ! శుంభ నిశుంభుల్ని నిశ్శేషంగా నిర్జించగల అస్త్రంగా మీ కాళీత్వం మాకు ప్రసాధించాలి! గౌరివై సదాశివుని చేరుకోవమ్మ!" అని కోరాడు విరించి. సరేనన్నది అంబ.

ఆ విధంగా అమ్మవారి నుండి వెలువడ్డ కృష్ణ వర్ణపు కాళీరూపం ఓ కన్యకగా మారగా, విధి ఆమెకు 'కౌశికి' అని పేరుపెట్టడం - సింహవాహనారూఢురాల్ని చేయడం - వింధ్యాచలం నివాసంగా ఏర్పరచడం వెంట వెంటనే జరిగిపోయాయి. తర్వాత కాలంలో శుంభ నిశుంభుల్ని వధించిందీ కౌశిక రూపమే!

ఇక - ఇక్కడ..

కాళిక రూపు విడిచి, గౌరిగా కైలాసానికి వెళ్తూ, తనను అన్ని రోజులుగా కనిపెట్టుకుని ఉన్న పులితో సహా వెళ్లింది.

ప్రమధాదులతో సహా అంతా ఆనందించారు.

తనతో వచ్చిన పులిని గురించి శివునికి నివేదించి, తన మందిరానికి కాపలాగా ఉండటానికి అనుమతించవలసిందిగా కోరింది అంబ.

శివుడు సానునయ పూర్వకంగా ఆ పులిని చూడగానే, అది ఒక వ్యాఘ్రస్త్రీగా - పరవేత్రహస్తగా మారిపోయింది. సోమనందిగా గౌరీదేవిని అనుక్షణం కవచంవలె కాపాడే పనిలో నియుక్తురాలైంది."

శాబ్దిక రూప ఉమా శంకరులు

గౌరీ రూపధారిణిగా, ఉమాదేవి అవతార విశేషాన్ని వివరించిన అనంతరం సూతుడు ఉమాశంకరుల శబ్దరూప విశేషాదులను వేదాంతాస్వయంగా శౌనకాది ఋషులకు వివరించసాగాడు.

"యో వేదాదౌ సర్వఃప్రోక్తః

వేదాంతే తు ప్రతిష్ఠితాం ||

గాతస్య ప్రకృతి లీనన్వ యః

పరః స మహేశ్వరః ||

అని శ్రుతి ప్రమాణం. ఇది ఋషి వాక్యం.

మహాదేవుడు శబ్ద బ్రహ్మయొక్క తనువు. ఇతడే పరబ్రహ్మ. చింతా రహితుడు. మనోవాగతీతుడు. పరమకారణుడు. ఓంకారవాచ్యుడు. సత్యస్వరూపం, అమృతం, వేదవేద్యం, విశ్వాత్మకం, ఆనందకారకం శివతత్త్వం. కనుకనే ఓం కారంలో (ఆ+ఉ +మ) మూడు బీజక్షరాలు. వీటినుంచి త్రిమూర్తులు ఉద్భవించి సృష్టి స్థితి లయాలు నిర్వహిస్తున్నారు.

బ్రహ్మకు పరమేశ్వరుడు సాక్షాత్కరించినపుడు సృష్టి విధానాన్ని బ్రహ్మకు స్వయంగా బోధించాడు.

'మ' కారం బీజి. 'అ' కారం బీజం. 'ఉ' కారం యోని. నాదమే అనుసంధానం. బీజి అయిన రుద్రుడు నాద స్వరూపుడైన సదాశివుని ప్రేరణచేత బీజమును యోనియందు విడుదుల చేసాడు.

తద్వారా ఓ బ్రహ్మాండం ఏర్పడింది. అది వెయ్యి దివ్యవర్షాలు జలమయమై ఉన్న అనంతరం రెండుగా విడిపోయింది. ఈ శకలాల్లో పైభాగం స్వర్లోకాది 7 దివ్యలోకాలుగాను ; అధోభాగం మర్త్యలోకాది 7 అధోలోకాలుగాను పరిణమించింది.

ఈ విధంగా ఋగ్యజస్సులు 'ఓం' అని విశదీకరిస్తున్న తరి, చతురానన చతుర్భుజులిద్దరూ మరింత దీక్షగా పరమ మహేశునికై పరితపించారు.

అప్పుడు అకారాదిక్షకారాంత సర్వవర్ణాత్మకమైన ఉమాసమేత శివుని శబ్దబ్రహ్మ స్వరూపమైన ఓం మొదలు సమస్త మహా మంత్రాలూ పరిఢవిల్లాయి.

సర్వాక్షర సంపత్కరమైన ఆ సర్వేశు దర్శనమాత్రం చేతనే, విష్ణువు ఈ సమస్త మంత్రాలనూ తెలుసుకొని పరిగ్రహిస్తున్నాడు. అదే సర్వాక్షర పరబ్రహ్మ స్వరూపం.