శివతాండవము/శివతాండవ కావ్యగుణములు

శివతాండవ కావ్యగుణములు

సత్కావ్యమును పదేపదే చదివి ఆనందించడమే శోభకాని, దానిని విశ్లేషించి అందాలు చూప యత్నించడము శోభ కాదు. అయితే శివతాండవ పునర్ముద్రణ చేయించే సందర్భములో మిత్రులు నేలనూతల శ్రీ కృష్ణమూర్తిగారు కావ్యగుణ ప్రస్తావన చేయమని నాకు పని పెట్టినారు. ఆ అవకాశాన్ని పురస్కరించుకొని శివతాండవముతో సంబంధము కల్పించుకున్న నా చాపల్యమును సహించి ఈ నాలుగు మాటల తాత్పర్యమును గ్రహించండని మనవి.

తన భావాల్ని, ఉత్సాహాన్ని, కరుణమూ, జుగుప్సనూ, భయాన్నీ, హాసాన్నీ చదువరులకు కూడా కలిగించాలని కవికావ్యరచన చేస్తాడు. ఈ భావాలు చదువరికి కలిగి, వాటి ఫలితమైన ఆనందంతో అతని హృదయము సంతుష్టి చెందడాన్ని రసానందము పొందడమంటారు. 'శివతాండవము' లో కవి ఆ తాండవమును ఊహారంగము మీద దర్శించిన ఆశ్చర్యాన్ని మాటలతో పదకవితలో వర్ణిస్తే మనము చదివి ఆశ్చర్య చకితుల మౌతాము. "అలలై, బంగరు కలలై, పగడపు బులుగులవలె, మబ్బులు విరిసినయవి." "చతురాననుడే సవరించునట! శత్వున కుత్తమ సర్పవిభూషలు!" శ్రుతిబట్టుటకు భృంగమ్ములు గొంతులు సవరించెనట! నెల కన్నెలు కుచ్చెళు లెల్లెడ విచ్చలవిడిగా దుసికిళ్లాడగ నాకసమున పరుగిడేనట, సంధ్యా బిబ్బోకవతి కవకుసుంభరాగవసనము ధరించినదట శివపూజకు!"అర్ధేదూత్ఫుల్ల కేశం"అంటూ నంది దేవభాషలో నాంది నారంభించెనట. వీటన్నిటిలో మన ఆపేక్ష కేంద్రీకృతమౌతుంది."తలపైన జదలేటి యలలు దాండవమాడ, నలల ద్రోపుడుల గ్రొన్నెల పూవుగదలాడ" శివుడు ఆడనారంభించేటప్పటికి మనకి వేరు ధ్యాస ఉండదు. బుసలుగొని తలచుట్టు బారాడు భుజగములు సాంధ్యకిమ్మీర ప్రభలుగూడేతనువూ, యెముక పేరుల మర్మరమూ, బింబాధరంబు గదంబించు తాంబూలమూ, పరుపులైపడు కల్పపాదపంబులపూలూ, వెన్నెలలు పలపలని చిలికించినట్లు, తెలిబూదిపూత తెట్టలు గట్టినట్టు, మంచు గుప్పలు గూర్చినట్టు ఆడే శివుడూ కళ్ళకు కట్టేసరికి సద్యఃపరనిర్వృతి కలుగుతుంది. ఆవేశముతో అవి అల్లే తీగలతో పాకి మొగిలిపూల తావులతో విహరించి, తొలుకారు మెరపులతో దోబూచులాడి, అచ్చెరువు రూపుగొనినట్లు నిలుస్తాము. ఘల్లుఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రోగుతూనే వుంటాయి. ఝణుత, తిధిగిణత, తిధిగిణిత అని మద్దెళ్ళు మ్రోగుతూనే వుంటాయి. మకరకుండల చకాచకలు విసురుతూనే వుంటాయి; కంఠహారాళి కదలిపోతూనే వుంటుంది. మనము లెక్కేమిటి; పరవశత్వమున శ్రీపతియే చెమరుస్తాడు.

శివుడు లోకేశ్వరుడు, విశ్వేశ్వరుడు, సర్వేశ్వరుడు. ఆయన నాట్యము నాట్యమునకే పరాకాష్ఠ.

తలపైన జలదేటి యలలు, మూడవకంటి కటిక నిప్పులు, మర్మరము సేయు యెముక పేరులు, పులితోలు హొంబట్టు, క్రొన్నాగు మొలకట్టు బిరుదాడు పదకింకణులు నటరాజు ఆహార్యము. అంగ ప్రత్యంగ ఉపాంగ చలనము తారహారముల కదలాట, సుందర మంజీరకింకిణులూ, కుండల విలాసమూ, చంచల హస్తాభినయమూ, నృత్తనృత్య తాండవగతులూ, ఆయన ఆంగికము. జిగజిగలాడే నక్షత్ర కలాపము, ఫక్కున నవ్వు కైలాసశిఖరములు, ధిమిధిమి ధ్వనులూరు గిరిగర్భములూ, నాట్యములు వెలయించు నదులూ జలదాంగనలై వచ్చిన వియచ్చరకన్యలూ ఆయన నాట్యరంగ ప్రసాధనము. షడ్జద్వయము నందించు వేణు మయూరములూ, పంచమ మాలపించు పికమూ, నిషాదమును తరుము వెనకయ్య బృంహితమూ, ఆ నాట్యములోని స్వరనాదములు. గంధర్వులు, అచ్చరలు, కిన్నరులు, నిర్జరులూ, దిక్పాలకులు, మునులూ, శరజన్ముడు, విఘ్నేశ్వరుడు, అమ్మవారు, బ్రహ్మ, సరస్వతి, శ్రీపతి, లక్ష్మి, చంద్రుడు, సర్వలోకాలూ ఆ మహానాట్యానికి ప్రేక్షకులు. కవిగారి వ్యుత్పత్తి తీర్చిన ఈ శివతాండవములో పై సమ్మర్దము పూర్తిగా నిండుగా కానవస్తుంది.

నారాయణాచార్యులుగారు విజయనగరాస్థాన విద్వద్వరేణ్యులు తాతాచార్యుల వంశములోనివారు. విజయనగర సారస్వత విభూతి వీరి రచనలో అక్కడక్కడ మెరుస్తూ ఇంపు గొలుపుతుంది. ఆంధ్ర వాజ్మయానికి అభిశాపరూపమైన చంపూ పద్ధతిని వీడి ఈయన తెలుగు జిగిని చక్కగా వెలయించగల పదఛందస్సును స్వీకరించుట ఈయన చైతన్యమును ప్రకాశింపజేయు దీపము.

శివతాండవమును విన్న తర్వాత వీరినోట కృష్ణలీలలు వినాలని వున్నది నాకు! మరొకమారు వినండి శివతాండవము.

శ్రీపాద గోపాలకృష్ణమూర్తి.
19-7-1961