శివతాండవము/శివతాండవము1

శివతాండవము


క. శ్రీరమణీ లలిత కటా
    క్షాఽఽరోపణ చంపక ప్రసవమాలా శృం
    గారిత వక్షుండు దయా
    వీరుఁడు బరదైవ మెడఁద వెలిఁగెడుఁ గాతన్‌.
ఉ. కన్నులఁ గల్వచూపులు వికస్వరము ల్గగనాంచలంబులన్‌
        దన్నఁగ, ధింధిమి ధ్వనులు దట్టములై ప్రతిశబ్ద మీన, నా
        సన్న గుహాంతరాళముల సాంధ్యలఁదాండవమాడు దుఃఖితా
        పన్న[1] శరణ్యుఁ డీశ్వరుఁడు భావమున న్జిగిరించుఁ గావుతన్‌.
తలపైనిఁ జదలేటి యలలు దాండవమాడ
నలలత్రోపుడులఁ గ్రొన్నెల పూవు గదలాడ
మొనసి ఫాలముపైన ముంగుఱులు చెఱలాడఁ
కనుబొమ్మలో మధుర గమనములు నడయాడఁ
కనుపాపలో గౌరి కసినవ్వు[2] బింబింపఁ
కనుచూపులను తరుణకౌతుకము చుంబింపఁ
కడఁగి మూడవకంటఁ గటికనిప్పులు రాలఁ
కడుఁబేర్చి పెదవిపైఁ గటికనవ్వులు వ్రేల
ధిమిధిమిధ్వని సరిద్గిరి గర్భములు తూఁగ
నమిత సంరంభ హాహాకారములు రేగ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

కిసలయజటాచ్ఛటలు ముసరుకొని వ్రేలాడ
బుసలుగొని తలచుట్టు భుజగములు బారాడ
మకరకుండలచకాచకలు చెక్కులఁ బూయ
అకలంక కంఠహారాళి నృత్యము సేయ
ముకుజెఱమలో శ్వాసములు దందడింపంగఁ
బ్రకటభూతిప్రభావ్రజ మావరింపంగ
నిటలతటమునఁ చెమట నిండి వెల్లువగట్టఁ
కటయుగమ్మున నాట్యకలనంబు జూపట్ట
తకఝణుత ఝణుత యను తాళమానము తోడ
వికచనేత్రస్యంది విమలదృష్టుల తోడ
        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు
భుగభుగ మటంచు నిప్పులు గ్రుమ్మ నూరుపులు
ధగధగిత కాంతి తంద్రములుగాఁ గకుభములు
దంతకాంతులు దిశాంతముల బాఱలు వాఱఁ
గాంత వాసుకి హస్త కటకంబు డిగజాఱ
భావోన్నతికిని దాపటి మేను వలపూఱ
భావావృతంబు వల్పలిమేను గరుపాఱ
గజకృత్తి కడలొత్తి భుజముపై వ్రేలాడ
నజుఁడు గేల్గవమోడ్చి "హరహరా" యని వేడ
ఝణుత తధిఝణుత తదిగిణతో యను మద్దెలల
రణనంబు మేఘ గర్భముల దూసుక పోక

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

ఎగుభుజమ్ములు దాచి నగుమొగమ్మునఁ జూచి
వగలురమ్మునఁ దూచి భావాభిరతి నేచి
తరళతంద్రమ్ము మధ్యమ్ము కిట కిటలాడ
వనసాంధ్యకిమ్మీర[3] ప్రభలు దనువునఁ గూడ
కుణియునెడ[4] వలయంపు మణులు చిందఱలాఁడ
కిణుకిణు మటంచుఁ బదకింకిణులు బిరుదాఁడ
శృంఖలారుండములు చెలగి తాండవమాఁడ
శంఖావదాత లోచనదీప్తి గుమిగూడ
వలగొన్న యెముక పేరులు మర్మరము సేయఁ
పులకింపఁగా నొడలు మురజంబులును మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

మొలక మీసపుఁ గట్టు, ముద్దుచందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటల రట్టు
సికపై ననల్పకల్పక పుష్పజాతి, క
ల్పక పుష్పజాతిఁ జెర్లాడు మధురవాసనలు

బింబారుణము కదంబించు దాంబూలంబు
తాంబూల వాసనలఁ దగులు భృంగ గణంబుఁ
గనుల పండువుసేయ, మనసు నిండుగఁ బూయ
ధణధణధ్వని దిశాతతి బిచ్చలింపంగ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

సకల భువనంబు లాంగికముగా శంకరుఁడు
సకల వాఙ్మయము వాచికము గాఁగ మృడుండు
సకల నక్షత్రంబులు కలాపములు[5] గాఁగ
సకలంబు దనయెడఁద సాత్త్వికంబును గాఁగ
గణనఁ జతుర్విధాభినయాభిరతిఁ దేల్చి
తన నాట్యగరిమంబుఁ దనలోనె తావలచి
నృత్యంబు[6] వెలయించి నృత్తంబు[7] ఝళిపించి
నృత్త నృత్యములు శబలితముగాఁ జూపించి
లాస్యతాండవ[8] భేద రచనాగతులు మీఱ
వశ్యులై సర్వదిక్పాలకులు దరిఁజేర

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

అంగములు[9] గదురఁ బ్రత్యంగంబులునుఁ [10] జెదర
హంగునకు సరిగా నుపాంగంబులునుఁ [11] గుదుర
తత సమత్త్వాదు లంతఃప్రాణదశకంబు[12]
నతి శస్తములగు బాహ్యప్రాణ[13] సప్తకము
ఘంటాసదృక్కంఠ కర్పరము గానంబు
కంఠగాన[14] సమాన కరయుగాభినయమ్ము
కరయుగము కనువైన కనులలో భావమ్ము
చరణములఁ దాళమ్ము చక్షుస్సదృక్షమ్ము
ఒరవడిగ నిలువంగ నురవడిఁ దలిర్పంగఁ
బరవశత్వమున శ్రీపతియున్‌ జెమర్పంగ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

కర ముద్రికల[15] తోనె గనులఁ జూపులు దిరుగఁ
దిరుగు చూపులతోనె బరుగెత్త హృదయమ్ము
హృదయమ్ము వెనువెంటఁ గదిసికొన భావమ్ము
కుదిసి భావము తోనె కుదురుకోగ రసమ్ము
శిరము గ్రీవమ్ము పేరురము హస్త యుగమ్ము
సరిగాగ మలచిగండరువు[16] నిల్పిన యట్లు
తారకలు[17] జలియింపఁ దారకలు నటియింపఁ
కోరకములై గుబురు గొన్న జూటము నందు
నురగాలి నలి రేఁగి చొక్కి వీచిఁన యట్లు
పరపులై పడఁ గల్పపాదపంబులఁ బూవు

        లాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

మొగ్గలై ప్రేమంపు బుగ్గలై యమృతంపు
నిగ్గులై దమలోన మొగ్గరంబులు గట్టి
నును సిగ్గుతో ముడిచికొని పోయెడు విధాన
పెను వెఱపుతో రాలి వణకాడెడు విధాన
బలపలని వెన్నెలలు జిలికించెడు విధాన
రోసంబు గ్రసియింప రూక్షమైన విధాన
వేసరికతో సరిగ వికసింపని విధాన

అచ్చెరువుతో స్తబ్ధమై నిల్చిన విధానఁ
గుచ్చులుగఁ దిగ కన్నుఁ గొనలఁ జూపులు బెనఁగ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన
నెఱ జాదులవి కుప్ప నెఱసికొన్న విధానఁ
తెలిబూది పూఁత దెట్టులు గట్టిన విధానఁ
చలికొండ మంచు కుప్పలు గూర్చిన విధానఁ
పొసఁగ ముత్తెపుసరు ల్బోహళించు విధాన
నసదృశము నమృతంబు నామతించు[18] విధాన
ఘనసారమును దెచ్చి కలయఁ జల్లు విధాన
మనసులో సంతసము గనులఁ జాఱు విధాన
గులుకునీలపుఁ గండ్లఁ దళుకుఁ జూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

మబ్బుగము లుబ్బికొని ప్రబ్బికొన్న విధాన
అబ్బురపు నీలములు లిబ్బి సేరు విధాన
నల్ల గలువలు దిక్కులెల్ల విచ్చు విధాన
మొల్లముగఁ దుమ్మెదలు మొనసికొన్న విధాన
వగలు కాటుకగొండ పగిలి చెదరు విధాన

తగిలి చీకటులు గొప్పగఁ గప్పెడు విధాన
తనలోని తామసము కనులఁ జాఱు విధాన
తనలోని వక్రతయె కనులఁ దీఱు విధానఁ
గకులుకునీలపుఁ గండ్లఁ దళుకుఁ జూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్లఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

తమ్ములై, ఘటితమోదమ్ములై, సుకృతరూ
పమ్ములై, శాస్త్రభాగ్యమ్ములై, నవకోర
కమ్ములై, వికచపుష్పమ్ములై, దుమ్మెదల
తమ్ములై, భావమంద్రమ్ములై, హావఫు
ల్లమ్ములై, నూత్నరత్నమ్ములై, వల్గుహా
సమ్ములై, గన్గొనలసొమ్ములై, విశ్రాంతి
దమ్ములై, రక్తకిసలమ్ములై, రక్తిచి
హ్నమ్ములై, తంద్రగమనమ్ములై గెడఁగూడి
కులుకునీలపుఁగండ్లఁ దళకుజూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

తరగలనుఁ జిఱుగాలి పొరలు వేచిన యట్లు
చిరుగాలిలోఁ దమ్మి విరులు గదలిన యట్లు
విరులలో నునుఁదావి తెరలు వేచిన యట్లు

తెరలపైఁ చిత్రాలు పరిఢవించిన యట్లుఁ
కమ్మకస్తురివీణె గడఁగి విరిసిన యట్లు
నెమ్మి దనపింఛమ్ము నెమ్మి విప్పిన యట్లుఁ
చిగురుటాకులు గాలి వగలు వోయిన యట్లు
నగవులో లేవలపు బిగువు జారిన యట్లుఁ
కులుకునీలపుఁ గండ్లఁ దళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

మొగలిపూవులు దావిఁ బుక్కిలించిన యట్లుఁ
తొగకన్నె నీలంపునగవు జార్చిన యట్లు
నవవసంతపుశోభ భువిఁ గప్పికొన్నట్లు
శివుచెంత శర్వాణిసిగ్గు జారిన యట్లుఁ
కన్నెమదిఁ గోరికల కలలు దూకిన యట్లు
సన్నజాజుల తేరు సంధానమైనట్లుఁ
పచ్చిసంపెగపూలు బరపులై బడినట్లు
అచ్చెరువు రూపుకొని యాక్రమించిన యట్లు
కులుకునీలపుఁగండ్ల దళుకుఁ జూపులు బూయ
ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

నగవులే నగవులై, బిగువులే బిగువులై
సొగసులే సొగసులై, జూడ్కులే జూడ్కులై
దొలుకారు మెఱపుల్లు దోబూచులాడినటుఁ
తొకోర్కులు విచ్చికొన్న యటుఁ
తొలుసారి రతి వింతసొలపు గ్రమ్మినయట్లుఁ
తొలిగట్లుపైజొత్తు బులకరించిన యట్లుఁ
దొలుసంజలోఁ దెల్వి దూకివచ్చిన యట్లు
మలుసంజలోఁ గాంతి మరలిపోయిన యట్లు
కులుకునీలపుఁగండ్లఁ దళుకుజూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

తీగలై, సోగలై, దీరుకొని బారులై
మూగికొని జొంపమై, మురిపెంపు దారులై
మలకలై, మొలకలై, మలపుఁగొని నేరులైఁ
పొలపంబు వెలయించి పూల దొలుకారులై
ముడులుగొని సుడులుగొని, మొగుడుకొని మొగ్గలై
జడిమగొని దడ బడుచు వడకి గడుఁ దగ్గులై
పిలపిలమటంచుఁ దావులుమూఁగ బాగులై
కులుకునీలఁపుగండ్ల దళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

మలక మెఱపులు కొన్ని, నిలువు మెఱపులు కొన్ని
సొలపు మెఱపులు కొన్ని, సూది మెఱపులు కొన్ని
కోల మెఱపులు కొన్ని, క్రొత్త మెఱపులు కొన్ని
చాలు మెఱపులు కొన్ని, జాఱు మెఱపులు కొన్ని
ప్రక్క మెఱపులు కొన్ని, సొక్కు మెఱపులు కొన్ని
నిక్కు మెఱపులు కొన్ని, నిండు మెఱపులు కొన్ని
క్రేళ్ళు మెఱపులు కొన్ని, క్రేటు మెఱపులు కొన్ని
సుళ్ళ మెఱపులు కొన్ని, త్రుళ్ళు మెఱపులు కొన్ని
కులుకునీలఁపుగండ్ల దళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

గరులుగల యంపగమి కరణిఁ దిరిగెడుఁ గొన్ని
యఱమోడ్పు కనుదోయి నణగిపోవును కొన్ని
ఉయ్యాలతూఁగులై యూగులాడెడుఁ కొన్ని
లేయెండవలె దట్టమై యేఁచు మఱిఁ కొన్ని
పందెపు గురాలవలెఁ బరుగులాడును కొన్ని
మందముగ మంచువలె మలసితిరుగును కొన్ని
గ్రిందుమీదై యీడిగిలఁ బడును మఱికొన్ని
సందుసందున నక్కి సాగిపోవును కొన్ని

కులుకునీలఁపుగండ్ల తళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

కరశాఖలను నూర్మికలు వోలె లగియించి
కరబంధములనుఁ గంకణములై జిగి నించి
కరరుహంబుల యావకపుజొత్తు బండించి
యఱుత నూతన తారహారములు నిండించి
చరణముల మంజీరసౌందర్యములు గూర్చి
యురముపై నెఱఁబూఁత నెఱసినటు రుచిఁ జేర్చి
యవలగ్నమున మేఖలవలెఁ జఱ్ఱునఁ జుట్టి
శ్రవణములఁ గుండలవిలాససంపద గట్టి
కులుకునీలఁపుగండ్ల దళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

ఎలగాలిపైఁ దేలి పొలయు గీతిక వోలె
నెలపాప బెదవిపై మలయు నవ్వును వోలె
కులపాలికా ముగ్ధ[19] కిలికించితము[20] వోలె
జలదాంగనా లలితసంచారములు వోలె

ప్రణయరథమునఁ తూగిపడు కింకిణులు వోలె
ప్రణయార్ద్రహృదయమునఁ పారాడు వెలుఁగు వలె
సెలకన్నె యెడఁదలోఁ తలఁపు గలగలల వలె
చలివెలుఁగు వెన్నెలల మొలకతుంపరల వలె
కులుకునీలఁపుగండ్ల తళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

చిఱునవ్వు పొరలపై నొఱసి జారుఁడు కొన్ని
యరుణ గండములపై నంటి యాడును కొన్ని
నెమిలిపింఛము వోలె నెఱసి విరియును కొన్ని
కుముదముల ఱేకులై కలుకు వోవును కొన్ని
యిలయు నాకాశమ్ము ఁ గొలఁత వెట్టును కొన్ని
తళతళలు వెలయించి తఱచుఁ గప్పును కొన్ని
యడ్డంబు నిడువులై యమరి నిల్చును కొన్ని
యడ్డమాఁకయు లేక యాడిపోవును కొన్ని
కులుకునీలఁపుగండ్ల దళుకుఁ జూపులు పూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

సమశీర్షకముతోడ[21] సమదృష్టి[22] ఘటియించి
సమపాద[23] విన్యాస చాతుర్యము లగించి
వరపతాకమ్ము[24] దాపటి కేల నెసకొల్పి
వామహస్తం బధో వక్త్రముగ సంధించి
త్రిపతాకమూని[25] యర్థపతాకమును[26] బట్టి
చపలదృష్టులు దిశాంచలములను మోపట్టి
ధూతమస్తము[27] జెల్వు దోబూచు లాడంగ
వీతరాగులు ఋషులు వినుతులను సేయంగ
నిలయెల్ల చెలువు రూపెత్తి నిల్చిన యట్లుఁ
గలలెల్ల నిజములై గానుపించిన యట్లు

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

హంసాస్యమును[28] రెండు హస్తంబులను నించి
అంసభాగంబులకు నానించి చూపించి

కలికి చూపుల చంపకములు బై జల్లించి
కెలఁకులకుఁ గంఠమ్ము మెలఁపుతో నాడించి
కనుగ్రుడ్లు గనులఁ చక్రముజుట్టి చుట్టిరా
ధనువులై బొమలు తద్దయుఁ గాంతిఁ చూపరా
నొకకాలు దివిఁగొల్వ నొకకాలు భువినిల్వఁ
ప్రకటముగ దేవతావరులు భక్తినిఁ గొల్వ
ఇలయెల్ల చెలువు రూపెత్తి నిల్చిన యట్లు
కలలెల్ల నిజములై కానుపించిన యట్లు

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

ఒకసారి దిరములై యుండి కాంతులు గ్రుమ్ము
నొకసారి గంటువేసికొని ఫూత్కృతి జిమ్ము
నొకసారి మనుబిళ్ళ యోజ చెంగున దాటు
నొకసారి వ్రేలు వాడిన పూలరేకులై
యొకసారి దుసికిళ్ళు వోవు చిఱుచేపలై
యొకసారి ధనువులై యుబ్బుఁ గన్నుల బొమ్మ
లిలయెల్ల చెలువు రూపెత్తి నిల్చిన యట్లుఁ
కలలెల్ల నిజములై గానుపించిన యట్టు

        లాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

కనుదోయి సైగలకుఁ గనుబొమలె బదు లొసగ
మనసులో నూహలకు తనువె బులకలు దాల్ప

ప్రతిపులకలోఁ దీవ్ర భావములు వాసింపఁ
ప్రతియడుగులో లయోన్నతి తూగి శోభింప
నవ్వులకుఁ గింకిణుల నాదములె ప్రతినవ్వ
నవ్వులే మువ్వలై నాట్యమున నెలుఁగివ్వ
నెలుఁగులను శ్రుతిరుతులు నెలయు నంఘ్రులగతులు
కలసియో! కలియకో! కడుఁ గ్రొత్త రుచి నివ్వ
ఇలయెల్లఁ జెలువు రూపెత్తి నిల్చిన యట్లుఁ
కలలెల్ల నిజముగా గానుపించిన యట్టు

        లాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

స్తంభయుగమో, నీపశాఖాద్వయమొ! మత్త
కుంభికర కాండములొ! గొనబైన దీగెలో,
సుమ దామములొ, శిరీషములె నిల్చిన విధమొ
కమల రజములు రూపుగట్టి వచ్చిన మెలపో!
తటి దుదంచిత కాంతి తాండవంబో యనఁగ
అటువైపు నిటువైపు నమల హస్తములూగి
కనవచ్చుచును మందగతిని గదలినయప్డు
కానరాకయును శీఘ్రగతినిఁ బరుగిడినప్డు
ఇలయెల్లఁ చెలువు రూపెత్తి నిల్చిన యట్లుఁ
కలలెల్ల నిజముగా గానుపించిన యట్టు

        లాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

పడగలెత్తును నాగుబాములై యొకసారి
ముడిచికొనుఁ గమలంపు మొగ్గలై యొకసారి
జ్ఞానముద్రికలఁ బక్షము లెత్తు నొకసారి
దీనదీనంబులైఁ దేలాడు నొకసారి
కటకాముఖంబులై[29] కనుపట్టు నొకసారి
పటు ముష్టి[30] బంధ సంపదఁ జూపు నొకసారి
శుకతుండ[31] హస్తమున శోభిల్లు నొకసారి
ప్రకట భ్రమరీసరళి[32] పరగించు నొకసారి
అటువైపు నిటువైపు నమల హస్తములూగి
అటమీఁద లిటఁగ్రింద నందములు జెల రేఁగి

        యాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

కైలాస శిఖరములు కడఁగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగధ్వానములు బొదలఁ
తుందిలాఽకూపార తోయపూరము దెరలఁ

జదలెల్లఁ గనువిచ్చి సంభ్రమతఁ తిలకింప
నదులెల్లఁ మదిఁబొంగి నాట్యములు వెలయింప
వనకన్యలు సుమాభరణములు ధరియింప
వసుధయెల్లను జీవవంతమై బులకింప

        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

అదిగదిగో! జలదకన్యక జూచు నేమిటో?
సదమలంబై నట్టి శంకరుని నాట్యమ్ము
నవిగో! మయూరమ్ము లాలపించు నదేమి?
శివుని తాండవకేళి శివకరము షడ్జమ్ము
చికిలిగొంతుకతోడఁ పికము గూయు నదేమి!
సకలేశ్వరుని శ్రుతి స్థాయికై పంచమము
వాయుపూరిత వేణువర్గ మే మందించు!
ఆ యభవు దాండవముకై తార షడ్జమ్ము

        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

ఒకవైపు నర్థచంద్రకరంబు[33] బరగించి
యొకవైపు సూచీ[34] ముఖోద్వృత్తిఁ జూపించి
క్రీగంటితో నవ్వు క్రేళ్ళురుక వీక్షించి
మ్రాఁగన్ను వైచి తన్మయతఁ దా నటియించి

వామపాదము జక్కఁగా మహిని నాటించి
నేమమున దక్షిణము నింత మీఁదికి నెత్తి
యుయ్యాలతూఁగుతో నూగులాడఁగ మధ్య
మొయ్యనొయ్యన మువ్వ లూగి నవ్వులు నవ్వ

        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

కుడికాలి నంబువలెఁ గొంచెముగ మునువంచి
యెడమపాదము వైపు నింతశీర్షము వంచి
కమలనాళములు హస్తములు బారలు సాచి
ప్రమదమ్ముతో రెండువైపు లల్లనఁ జాచి
సవ్యవక్షము బులకచయముతో నుబ్బంగ
సవ్యేతరము సిగ్గుతో వెన్క కొదుగంగ
నొక గపోలము నగవు వికసించి రాగిల్ల
నొక గపోలము బిగువు బ్రకటించి తోపిల్ల

        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

ఎడమచేతినిఁ బ్రీతి నడుముపై సంధించి
కుడిచేతిలో నంచకొదమగుఱుతు[35] లగించి
యంచముక్కున దృష్టి నంచితంబుగఁ జేర్చి
సంచాలితమొనర్చి సమశిరము[36] ముందునకుఁ

పరివాహితముఁ [37] జూపి పైపైనిఁ కాంతమ్ముఁ
పరగించి చూపు భావావేశ మధురమ్ము
నటుదూగి యిటుదూగి చటులమ్ము గజకృత్తి
నటనమధ్యమ్ములో నయముగాఁ గడకొత్తి

యాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

ఒకకాలు వెనుకకై యొకకాలు ముందుకై
మొకమెల్లఁ జిరునవ్వు మురిపెముల ముద్దయై
గుడిచేతి యందు లఘుకోణత్వము ఘటించి
యొడికంబుగాఁ దలముఁ బడగవలెఁ కుంచించి
పెరచేత గురుకోణ మరుదుగాఁ దావలచి
కరశాఖలను వంచి శిరము వెన్కకుమలఁచి
వెనుకఁజూచిన యప్డు వెన్నెలలు జిలికించి
మునుముజూచిన యప్డు ముద్దులే బండించి

యాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

హస్తంబు కనుదోయి కడ్డంబుగా నిలిపి
శస్తంబరాళంపు[38] సంజ్ఞ నెదురుగ మలపి
ధూతంబు శిరము[39] సాకూతంబు కనుచూపు

ప్రీతిఁగావింప నిల్చిన దేవతల కెల్ల
నాభికెదురుగ దక్షిణంబైన హస్తమ్ము
శోభిలనుజల్లింప సోలపద్మపుముద్ర [40]
ఒకవైపు గటిభాగ మొయ్యారముగ నొత్తి
సకలలోకముల కాశ్చర్యంపు సిడమెత్తి
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
తకిటతక, తకతకిట, తకతకిట, తకిటతక
తకతదిగిణతొగిణతొ, కిటతకతదిగిణతొ
కిటతకతదిగిణతొ, కిటతకతదిగిణతొ
చటులంబులగు జతులు[41] సరిగాఁగఁ దూగించి
ససరిరిస [42] రిగరిరిస సరిగాగ రీగాగ

గనగాగ ధపసాస

రి రి స రి స స రి గా గ రీ గా గ రి గ రి రి స
స రి సా స పదపాప సరిగ నెత్తులుముడిచి
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

మేళకర్తల నెత్తి యాలాపనము దీర్చి
యాలాపనమ్ములో నక్షులను నఱమోడ్చి
సంవాదివాదు లనుస్వరములను జూపించి
క్రొవ్విరుల గుచ్ఛములు గునిసిపోయిన యట్లు
గమకములు వెలయించి కడఁగి జారులుబట్టి
ప్రమదమ్ముతోడఁ మూర్ఛనలెల్ల రాఁబట్టి
మంద్రమధ్యమతార మధురిమలు జూపించి
సాంద్రమ్ముగా గానసాగరమ్మును రేపి
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
వక్రరాగము నెత్తి, పాండిత్యధీరతో
పక్రమణమును బూని, ప్రక్కవాద్యముఁ జూచి
కనకాంగియే[43] యంచుఁ గనుఁగోనలనె నవ్వి
వినిపించి, శుద్ధస్వరనిచయంబునె ద్రవ్వి
కాలువిడు[44] పఱయు ముక్కాలుచోటుల నెత్తి
కోలుఁ జూపించి, నిక్కుగఁ బల్లవులఁ బాడి
కాలభేదములతోఁ గలితనం బెలయించి
సోలు నిర్జరమనస్సుల నెల్ల వంచించి
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

మధ్యమము[45] రాగసామ్రాజ్యాధిదైవతము
శుద్ధమ్ముగాఁ[46] బ్రతిగఁ జూపించి వణకించి
వణకులో నొకగ్రొత్త వాలకము గనుబరచి
తని పూవులను బుట్టలను దెచ్చిపోసినటు
గలగలమనంగఁ జిఱుగవ్వలను వెదికినటు
బలపలని యెండుటాకుల మర్మరములట్లు
నాదధేనువు బొదుగునందు దుగ్ధము జాఱ
భేదవాదము రాగవీథిలో బుడమార

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

స్వరకన్యకల గుబ్బచనులఁ బుల్కలు రేపి
సురకాంతలకుఁ గోర్కె లెరయ నెమ్మదులూపి
లయపురుషు[47] నానందరాశిలో మునిగించి
రయముతోఁ దాళముల రవణములు హత్తించి
ఝల్లరీముఖవాద్య చయము మేనులుదాల్చి
యుల్లములఁ బొంగెత్తి "యో" యంచు నెలుగివ్వఁ
దంబూర యానంద తరళసంఫుల్ల వ
క్త్రంబుతోఁ, దానుగా గళమువిచ్చుక పాడ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

వల్లకీసుందరులు ఫుల్ల రాగములీనఁ
కల్లోలమయిపోవ గంధర్వ హృదయములు
అచ్చరలగన్నులం దానందబాష్పములు
బెచ్చుగా గండముల విరిసికొన హాసములు
గిన్నరీహస్తముల సన్నజాజులు మురిసి
చెన్నుగాఁ బలుక నుజ్జీవములు పాటలను
పలుకుఁ పల్కున నమృత భరము తుంపెసలాఁడ
నిలువెల్ల గానమే నిండికొని వెలికూర

ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

సరిగాగ రూపించి షడ్జమము వట్టంగ
శరజన్ము తేజి పింఛమువిప్పి నర్తింప
ఋషభస్వరంబు కుల్కించి పాడిన నంది
వృషభంబు చెలరేగి నియతిపై లంఘింప
నందంబుగా ధైవతాలాపనము సేయ
గంధర్వ లోకంపు గనులఁ బూవులు బూయఁ
బనిఁబూనుచు నిషాదస్వరము రక్తికిఁ దేఁగ
వెనకయ్యబృంహితము వెనుకఁ దరుముక రాగ

ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

ఎత్తుగడ కెత్తుగడ కేరీతిఁ దోచునో!
గ్రొత్తతీరులను క్రొంగ్రొత్తభావము లాచి

సరసిలో లేయలల తెరలవలె నుబుకునో!
స్వరపంపకములోన జాతులను వెసమార్చి
మానతైష్ణ్యం బదెంతటిదో! దాళము వేయఁ
బూని యమరులు దప్పిపోయినా రెచ్చటనొ!
శ్రుతిలయంబెంత పెచ్చుగ రేగెనో! సర
స్వతిగుండె కంపించి జలజలా బారంగ

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

అఱపల్కు వచియించి యక్షులను బూరించుఁ
బూరించునర్థంబుఁ బొందించు హస్తముల
మొదలఁ గన్నులఁ గొంత ముచ్చటించును మిగులుఁ
గదియించు వాఙ్మయాఖండ పుణ్యము బండఁ
గనులసైగలు మాటఁ పెనవేసి చూపించు
వెనుక మాటలుబల్కి, మును దీర్చుఁ గన్నులను
వచియించిపల్కు, లావల నేత్రముల దిద్దు
ఖచరులెల్లరును దిగ్భ్రమ మొంది వీక్షింప

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

సంయుతకరంబులను[48] శాస్త్రాను సారంబ
సంయుతకరంబులను[49] జక్కఁగాఁ గదియించి

శాస్త్రమునుదాటి తన స్వాతంత్ర్యమును బూని
శాస్త్రకారులయూహ సాగుమార్గముఁ జూపి
భావరాగముల సంబంధంబు, రాగ లీ
లావిశేషంబు నుల్లాసంబు గదియింప
భావమే శివుఁడుగా బ్రమరి చుట్టెడు భంగి
భూవలయమెల్ల మదిఁ బొంగి యాడెడుభంగి

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

స్థలపద్మములవోలె నిలుకడగ నిలువఁబడి
మెలఁగుకూర్మమువోలె మెల్లగాఁ జలియించి
యావైపు నీవైపు నల్లనల్లనఁ దిరిగి
భావింప గజగమనభంగి ముందుకు సాగి
వాలుగల కులుకు వలె వంకరలు జిత్రించి
వ్రాలి, నాగమువోలెఁ పార్ష్ణిభాగం బెత్తి
వెనుకభాగంబెత్తి, మునుము నేలకు నొత్తి
యనుకొనని యందమ్ము లలరింపఁ బదతలము

లాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

ఎలగాలిఁ గదలు నాకులువోలెఁ దేలికై
యలలతూగుడులఁ దమ్ములపూవు లట్టులై
గన్నె కనుబొమలోని కలలబరు వట్టులై
మిన్ను గన్నట్టి చిఱుమేఘముల యట్టులై

కలికి బిగిగౌగిలింతల హాయిఁ గొల్లాడి
చెలిచెక్కుపై సిగ్గు చెలువంబు నుగ్గాడి
యవనీ కుచస్థలంబట్టుగా బిరుసెక్కి
వివిధరీతుల నేర్పు వెలయింపఁ బదతలము

లాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

కోనలును కొండలును కోల్మసఁగి తలలూపఁ
కొనగోలువలికి సాకూతంబుగాఁ జూచి
డక్క చెక్కును గీటి డంబుగాఁ బలికించి
యెక్కడను దననాట్యమే మాఱు మ్రోయంగఁ
దానె తాండవమౌనొ! తాండవమె దానౌనొ!
యేనిర్ణయము దనకె బూనిచేయఁగరాకఁ
దామఱచి, మఱపించి తన్నుఁ జేరినవారిఁ
గాములీలగ మూఁడుగన్నులను సృష్టించి

యాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

ఒకసారి దనుమఱచు నుప్పొంగునాట్యమున
నొకసారి మఱపించు నూది, తాండవకళనె
మఱచిమఱువక యొక్కపరి యాంగికము వట్టు
నెఱసంజవైపు గన్గిఱిపి సైగలుసేయు
నొకవైపు దాండవం బొకవైపు లాస్యమ్ము
నొకవైపు గాంభీర్య, మొకవైపు శృంగార
మొకవైపు భస్మంబు, నొకవైపు జిత్రకం
బొకవైపు భేదదృ, క్కొకవై పభేదమున

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

నీలసూత్రము[50] లోన నిక్కి యర్రులుసాచి
కూలంకషమ్ముగాఁ గూయు జిఱుగజ్జియలు
జిలిబిలి పదంబులను పలుకు నొక్కకసారి
కలకలమటంచు నవ్వులు జిల్కు నొకసారి
చెలువంబు వడబోసి చిఱు నవ్వు నొకసారి
కొలఁదిమీఱంగ ఫక్కున నవ్వు నొకసారి
మూఁగసైగలతోనె మురిపించు నొకసారి
రాగాలపనమందు రణియించు నొకసారి

ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

జననాంతరంబులో సంసక్తమయి వచ్చి
మనసులోతుల నిల్చి, మాటాడువాసనలో!!
యమృతమయమై యాత్మనంటిన సుషుప్తిలోఁ
గమముగా గప్పు నిర్జరమహచ్ఛాయలో!!
ప్రమదంబె రూపెత్తు బంగారుకలలలో
నమరకాంతలు సేయునట్టి కనుసైగలో!!
యన సూక్ష్మతమముగా, నటు సూక్ష్మతరముగా
వినఁబడియు, వినఁబడనివిధిగ మువ్వలు మ్రోఁగ

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

కరుణఁ జూపినయప్డు దొరఁగు బాష్పమ్ము ల
చ్చెఱువు జూపినయప్డు జిగినించు నిశ్చలత
వీరంబులో నగ్గి వెడలించుఁ దారకలు
ఘోరంబులోఁ గెలంకులఁ గొల్చుఁ గనుగ్రుడ్లు
వికృతంబులో వంగి వికటించుఁ గనుబొమలు
వికచంబులగును దారకలు హాస్యమునందు
శృంగారమున విలోలిత దృష్టిపాతంపు
భంగి, రౌద్రమున దుర్భరకటాక్షములతో

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

భావాంబరమున కావల వెల్గు దైవంబు
భావగోపీనాథుఁడై వేడ్కఁ జెలఁగించి
రాగిణీవిభ్రమము లక్కడక్కడ దీర్చి
రాగాలపనజన్య రమణీయతలు బేర్చి
యొకయడుగు జననంబు, నొకయడుగు మరణంబు
ఒకభాగమున సృష్టి, యొకవైపు బ్రళయంబుఁ
గనుపింపఁ దిగకన్నుఁగొనలు మిన్నుల నంట
మునిజనంబుల హృదయములు దత్పదం బంట

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

సమమధ్యదృతగతులు జరణముల, ననుకూల
భ్రమణములు నడుములోఁ బ్రౌఢములు వ్యాకృతులు
బయిపైని గప్పికొను భావబంధంబులును
నూరేసిగజ్జియల[51] నులివులో వేదములు
దీరైన నృకపాల హారములు గానములు
తొలుకాడు గంగమ్మ యలలలోఁ దానములు
మొలిపించి, జందురుని మొగముపైఁ జిఱునగవు

లాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

భరతముని ముందుగాఁ బదపద్మములుబట్టి
"హరహరా!" యని ప్రమోదాయత్తుఁడై దూఁగఁ
తనసృష్టిగర్వంబు దలిఁగిపోఁగ విరించి
కనులలో బాష్పములు గట్ట డీల్పడి నిలువ
నావైపు నీవైపు నష్టదిక్పాలకులు
కేవలము రసమూర్తులై, విశ్వమును మఱువ
దన వేయికనులు జాలని బిడౌజుడు, గౌత
ముని శాపమున గొఱంతనుఁ గూర్చి చింతింప

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

హరియె హరుఁడై, లచ్చి యగజాతయై, సరికి
సరి, దాండవములాఁడ సమ్మోదరూషితులు,
హరునిలోహరిఁ జూచి, హరియందు హరు జూచి
నెఱవేది దేవతలు విస్మితులు, మునులెల్ల
రధిగతానందభావావేశచేతస్కు
లెదవిచ్చి, యుప్పొంగి, యెగిరి స్తోత్రము సేయ,
భేదవాదములెల్లఁ బ్రిదిలిపోవఁగ, సర్వ
మేదినియు నద్వైతమే బ్రతిధ్వనులీన

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

శోకమ్ము సంతోష మేకమ్ము, నరకంబు
నాకంబు నేక, మ్మనంత మాకాశమ్ము
పరిగతంబగు భూమి, నవనిధులు బల్వములుఁ,
తరులు బీజములుఁ, గ్రొవ్విరులుఁ కసిమొగ్గలును
జఠరాంధకారంబు బరిణాహిచంద్రికలు,
పరమఋషు, లజ్ఞాన భరితు, లందఱకు నేఁ
డద్వైత! మద్వైత! మని మాటి
కద్వయముగా నొత్తి, యఖిలలోకము లార్వ

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

ప్రతితారకయు విచ్చి, ప్రత్యణువుఁ బులకించి
శితికంఠునకు నపుడు సెల్లించినది సేవ,

యానందసాగరం బంతటనుఁ గవిసికొన
మీనములుఁ దిమిఘటలు మేదినీజీవములు
బ్రతిప్రాణిహృదయమ్ము వల్లకీవల్లరిగ
మతిమఱచి పాడినది మధురసంగీతమ్ము,
జగమెల్ల భావంబె, సడియెల్ల రాగంబె
జగతియే యొక నాట్యసంరంభముఁనుగాగ

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

చూచువా రెవ్వరా చోద్యంబు! నందఱును
సూచింత్రు దాండవము, సొక్కి సమ్మోదమున
శంకరుఁడె గెమ్మోవి సెలవులను జిఱునవ్వి
పంకించి తల, నటక వర్గంబు వీక్షించె
హరుఁజూచి హరినవ్వె, హరుఁడె హరియైనవ్వె
విరిసికొనె నొకవింతవెన్నెలలు లోకముల
శ్యామసాంధ్యస్ఫూర్తి జంద్రికలలో డాఁగెఁ
గామించెఁ బ్రకృతి జీకటులొ! జ్యోత్స్నాతతియె

ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

నవజటాపటల సంధ్యాకాలవారిదాం
తవికాసచంద్ర మంద్రాతపార్ద్రశరీర!
నగకన్యకానేత్రయుగళనిర్యత్కటా
క్షగణతాపింఛ పింఛాధీనగురువక్ష!

నిగమదాసీ సమున్నిద్రసాహోనినా
ద! గణనీకృతనైకతారహారవిలాస!
భూతేశ! భూతభావాతీత! యనిపల్కి
స్తోత్రములఁ బఠియింపఁ జోద్యమున వైకుంఠుఁ

డాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

పద్మామనోబ్జ యావక పుష్పితశరీర!
పద్మసుందరనేత్ర! భావాంబరాతీత!
మాయాసతీభుజా మధుపరీరంభాఽవి
షయవివేక! హృషీకసంచయాఽధిష్టాత!
శౌరి! నీ తేజమే సంక్రమించెను నన్నుఁ
పూరించెఁ దాండవముఁ పూర్ణి చిత్కళతోడ!
నని నిటాలమునందు హస్తమ్ములను మొగిచి
వినతుఁడై శంకరుఁడు విష్ణువును నుతియించి

యాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

  1. దుఃఖితులైన యాపన్నులు.
  2. ఎలనవ్వు.
  3. అనేక వర్ణములుగల.
  4. ఆడు.
  5. భూషణము.
  6. రసభావాశ్రిత నాట్యము.
  7. చూడు. "వృత్తారంభాట్టహాస".
  8. చూడు. "శివతాండవమత, శివలాస్యంబట".
  9. తల, చేతులు, చంకలు, పార్శ్పనులు, నడుము, పాదములు
  10. మూపులు,భుజములు, వీపు, కడుపు, తొడలు,పిక్కలు
  11. చూపు, రెప్పలు, నల్లగ్రుడ్డు, చెక్కిళ్ళు, ముక్కు, దవుడలు, అధరములు, దంతేములు, నాలుక, గడ్డము, మొగము, శిరస్సు
  12. పడి, నిలకడ, నమత, చపలత్వము, చూపు, శ్రమములేమి, బుద్ధి, శ్రద్ధ, మంచిమాటలు, పాట.
  13. మృదంగము, తాళము, వేణువు, పాట, శ్రుతి, వీణ గజ్జెలు, గాయకుడు
  14. కంఠముచేత గానమును, దానిలోని యర్థమును, హస్తాభినయము చేతను, బావమును, కంఠముచేత గానమును, దానిలోని యర్థమును, హస్తాభినయము చేతను, భావమును గనుల చేతను, లయను పాదముల చేతను జూపింప వలెనని నాట్య చార్య సంకేతము.
  15. హస్తముద్రిక యేవైపునకుండునో దానియెడ దృష్టియు, దానియందు మనస్సును, మనసునందు భావమును కేంద్రీకరింపవలెనని నాట్యాచార్య సంకేతము. అప్పుడే రసోద్భూతి కలుగును.
  16. బొమ్మ.
  17. కనుగ్రుడ్లు.
  18. పిలుచు.
  19. నవ వివాహిత.
  20. రోషాశ్రుహర్ష భీత్యాదులు నంకరముగా గలుగు శృంగారచేష్ట.
  21. క్రిందికిగాని, పైకిగాని, పంపక, యెత్తక, సమానముగా నుంచిన శిరస్సు.
  22. రెప్పపాటు లేని దృష్టి.
  23. సాధారణముగా నిలువబడినట్లుండును.
  24. అన్ని వ్రేళ్ళను చాచి, బొటన వ్రేలిని, చూపుడు వ్రేలి కడపటి గెణుపున కానించి చూపుట.
  25. పతాకహస్తమున అనామికను వంచి చూపుట.
  26. పతాకమున జిటికెనవ్రేలిని వంచి చూపుట.
  27. ఎడమ కుడిప్రక్కలకు గదలించెడు శిరస్సు
  28. నడిమివ్రేలు మొదలు మూడు వ్రేళ్ళను ఎడముగలవిగాజూచి యంగుష్టమును జూపుడువ్రేలితో జేర్చికట్టిన హంసాస్యము.
  29. చూపుడు వ్రేలును, అనామికయు, బొటనవ్రేలితో మొగ్గవలె బట్టవలెను.
  30. నాలుగు వ్రేళ్ళను జేర్చి యరచేతిలోనికి వంచి యంగుష్ఠమును మిదజేర్చిన ముష్టిహస్తము.
  31. పతాకమున జూపుడు వ్రేలును, అనామికయు వంచిన శుకతుండము.
  32. నడిమి వ్రేలితో బొటనవ్రేలిని దాకి చూపుడు వ్రేలిని వంచి తక్కినవి జూచిన భ్రమరము.
  33. పతాకమున నంగుష్ఠమును క్రిందకడ్డముగా జూచిన అర్ధచంద్రము.
  34. కటకాముఖమున జూపుడు వ్రేలు జూచిన మాచీహస్తము.
  35. హంసాస్యము చూ. "హంసాస్యమును రెండు."
  36. చూ. "సమశీర్షకము."
  37. చక్రాకారముగ ద్రిప్పఁబడు శిరము పరివాహితము.
  38. పతాకమున జూపుడు వ్రేలు వంచిన అరాళ హస్తము.
  39. చూ: "ధూతమస్తకము చెల్వు."
  40. అన్ని వ్రేళ్లును సందులు గలవిగా ద్రిప్పి పట్టిన సోలపద్మము.
  41. మృదంగ వరుసల ప్రస్తారము.
  42. మోహనరాగ స్వరములు.
  43. కనకాంగిరాగమున కన్నియు శుద్ధస్వరములే గలవు.
  44. పాటలోని యెత్తుగడ భేదములు.
  45. సామాన్యముగ నన్ని రాగములు మారుటకును, మధ్యమ స్వరమే మూలము. అందుచే నది యధిధైవతమైనది.
  46. శుద్ధము గా శుద్ధమధ్యమము. బ్రతిగ ప్రతిమధ్యమము.
  47. తాళము లోని సామ్యము.
  48. రెండు చేతుల హస్తముద్రలు సముదితములై యొక యర్థమును జూపించిన సంయుతహస్తమని పేరు.
  49. ఒక చేతిలోనే భాగముజూపు ముద్రకు అసంయుతహస్తమని పేరు.
  50. పాదముల యందలి గజ్జెలు నీలసూత్రమునకే గూర్చవలెనని యాచార్యమతము.
  51. ఒక్కొక్క కాలియందు నురేసిగాని, యిన్నూరేసిగాని దక్షిణపాదమున నూరు వామపాదమున నిన్నూరుగాని గజ్జెలు గట్టికొనవలెనని నాట్యాచార్యమతము.