శివతత్త్వసారము/ఉపోద్ఘాతము

ఉపోద్ఘాతము

బహుల రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః
ప్రబల తపసే తత్సంహారే హరాయ నమో నమః
జనసుఖకృతే సత్త్వైస్థిత్త్యై ప్పరాయ నమో నమః
ప్రమహసిపదే నిస్త్రైవణ్యే శివాయ నమో నమః.

శివతత్త్వసారము అసాధారణగ్రంథము. క్రీ.శ.12 శతాబ్దిలో ఈ కావ్య ముద్భవించినది. ఆనాటి స్థితిగతులను బట్టియు, తత్పూర్వము శైవమున ప్రవర్తిల్లిన వివిధసంప్రదాయములను బట్టియు, మల్లికార్జున పండితుడు దీనిని రచించుట సంభవించినది. తత్పూర్వము కాలాముఖ, కులీక, త్రిక సంప్రదాయములు ప్రవర్తిల్లినవి. పండితునకు వానియెడ నసంతృప్తి కలిగియుండును. అంతియేకాక నాటి బౌద్ధ జైననమతములు వైదిక కర్మలు అద్వైతుల విధానములు, ఆయనకు విరుద్ధముగా తోచియుండును. కావుననే పండితుడు కొందఱను వాదములో జయించుటయు, కొందఱి సిద్ధాంతములను ఖండించుటయు తటస్థించినది.

మల్లికార్జున పండితు డసామాన్యవ్యక్తి. శ్రీశైలమల్లికార్జునదేవుని యనుగ్రహమున జన్మించినాడట. శ్రీమహేశ్వరుడే ఆయనను భూలోకమునకు బంపి నూతనశైవసిద్ధాంతప్రతిపాదన చేయు మన్నట్టు ప్రతీతి. పండితుడు కోటిపల్లి క్షేత్రములో జన్మించి ఆరాధ్యదేవుని శిష్యుడై గురువుకడ శైవదీక్ష పొంది, శైవమతరహస్యములు గ్రహించినాడు.

పండితుడు ఆంధ్రదేశమున ఆరాధ్యసంప్రదాయస్థాపకుడు. ఆయన వేదశాస్త్రములు పఠించినవాడు. కావుననే ఆరాధ్యులకు శ్రుతిస్మృతులందు ప్రమాణబుద్ధి కలదు. గృహ్యసంస్కారములను వారు వేదోక్తముగానే నడపుదురు. అంత్యసంస్కారములను ఆబ్దిక శ్రాద్ధమును మాత్రము ఆగమోక్తముగా జరుపుదురు. వీరు కులభేదము పాటింతురు, ఆంధ్రదేశమున ఆరాధ్యులు లింగధారణము చేయుదురు.

ఆ కాలముననే కర్ణాట దేశమున శ్రీ బసవేశ్వరు డను మహానుభావుడు వర్ధిల్లెను. బసవేశ్వర సంప్రదాయమున అబ్రాహ్మణులు లింగధారణము చేయుదురు. వారు లింగాయతులు. బసవేశ్వర శిష్యులకు వేదాదుల యెడ ప్రమాణబుద్ధి లేదు. వారికి శివభక్తియే ప్రధానము, ఆంధ్రదేశమున జంగము లిట్టివారే.

సహజముగా శివభక్తు డైన పండితుని యాచారములను నాటిస్మార్తులు ఆక్షేపించినట్లు తోచును. తేజస్వి యగు పండితుడు ఉద్దీపుడై వీరభావము వహించి క్రమముగా వీరమాహేశ్వరు డయ్యెను.

వైదికమగు శివభక్తియు, పౌరాణిక మగు శివభక్తియు కలవు. వానికిని వీరమాహేశ్వరమునకును భేద మున్నది. శివారాధకులలో కొందఱు శాంతచిత్తులు, కొందఱు ఉగ్రులు కలరు. శాంతచిత్తు లగు వారి సిద్ధాంతములు, సాధన ప్రణాళికలు మృదువుగా నుండును. ఉగ్రు లగువారి విధానము లుగ్రములే.

శివతత్త్వము మహోన్నతము. అతిప్రాచీనకాలమునుండియు శివమూర్తిని లింగరూపమున అనేకు లర్పించుచున్నారు. విభూతి, రుద్రాక్షలు, బిల్వపత్రములు శివభక్తులకు ప్రీతిప్రదములు. పంచాక్షరీమంత్రము అత్యంతపవిత్రము.

ఈ గ్రంథమున శివపారమ్యము చెప్పబడినది. మంచిదే! కానీ ఈకవి అద్వైతపరము లైన వేదవాక్యములకు ద్వైతపరముగా అర్ధము చెప్పుట సంభవించినది. వీరు లగువారు శివుడు తప్ప అన్యదైవతము పేరు వినరు. శివమహిమకన్న వీరికి అన్యముండరాదు. శివారాధన వలననే జనులు ముక్తులగుదురు అని వీరి విశ్వాసము.

ఇందు శివనిందకుల సంహారము చెప్పినను, బసవపురాణమున కొందరు శివభక్తులు ధవులను (శైవులు కాని వారిని) వధించిన కథ లున్నను ఆ తరువాతి కాలమున వీరశైవు లిట్టివి సమ్మతించలేదు. కానీ శివునికై మృతినొందు వానికి ప్రేతకర్మలు చేయ నక్కరలేదు. బందుగులకు సూతకము లేదు. అట్టివాని మృతికై పండుగ చేసికొనవలెను. శివనిర్మాల్యము శివదీక్షితుడు తప్ప అన్యులు భుజింపరాదు.

పండితు డిట్టివానిని ప్రతిపాదించుటకు కారణము లేమి? అతడు మహానుభావుడు, శివభక్తిపరాయణుడు, శివునికన్న అన్యమును పూజించినచో ముక్తి యుండదని విశ్వసించినవాడు. ఆయన జన్మను బట్టియు, శిక్షణను బట్టియు ఆయన కాలమున వర్తిల్లిన మతములను బట్టియు మనోవేదన కలిగి భక్తిభరితహృదయుడై లోకానుగ్రహబుద్ధితో జనసంతరణార్ధము గాఢమైన ప్రణాళిక నిర్ధారించినట్లు కానవచ్చును. ఏపని చేసినను ఆయన శివప్రీతికే చేసెను. స్వయముగా సమస్తమును శివమయముగా భావించువాడు జనులలో పరినిష్ఠితబుద్ధి ఏర్పడుటకై గట్టిచట్టము ఏర్పరచినాడు. ఈ కావ్యమున అన్యమతవిరుద్ధముగా కానబడు తీవ్రవాక్కులను యథాతథముగా స్వీకరింపక, "శివః సత్యం' అను సిద్ధాంతమునకు సర్వజనులను ఉన్ముఖులను చేయుటకై ప్రవచించినట్లు భావించుట యుక్తము. బాహ్యరూపమున వక్కాణించిన వాక్కులకన్న అంతర్గతసత్యమే అత్యంతప్రధానమని గ్రహింప నగును,

ఈకావ్య మసమగ్రముగా నుండుట శోచనీయము. ఇది పద్యరూపమున, అందును కందపద్యముగా నడచుట పఠన పాఠనములకు యోగ్య మగు ననియు, స్మరణకు సులు వనియు ఆయన తలచియుండును. అన్యవాద, మతధిక్కరణము నేటికిని కొందరు, కొందరు తత్త్వవేత్తలు చేయుచున్న పనియే. భక్తుడగువాడు అద్వైతము నంగీకరింపలేడు. భక్తస్థితిలో నున్నవా రెల్లరును ద్వైతులే. ధర్మముకన్నను ద్వైతులకు భక్తియే ప్రధాన మగుటచే కొన్ని యెడల భక్తి పక్షపాతమున విచిత్రకార్యములను ఉపపాదింప వలసి వచ్చును. అన్నిటిని సక్త్రమముగా గ్రహించి సమన్వయము చేసికొని పఠితలు ప్రమోదము చెందుట ప్రశస్తము. నమః పార్వతీ పతయే!

ఇతి శివమ్!

స్వామి శ్రీ శివశంకరస్వామి
తీర్థాశ్రమము - ఒంగోలు