శాసనపద్యమంజరి (మొదటిభాగం)/పీఠిక
పీఠిక
ఆంధ్రదేశమం దచ్చటచ్చట నున్న శిలాశాసనములందలి తెలుఁగుపద్యము లిందుఁ గూర్పఁబడియున్నవి. వీనిలో ననేకములు మాతృకలను బట్టి గాని వాని ప్రతిబింబములను బట్టి గాని నేను స్వయముగాఁ బ్రతివ్రాసినవియే. కొన్ని శాసనము లచ్చటచ్చట నిదివఱలో బ్రకటితములై యున్నవి. ఏయే గ్రంథములందు ముద్రింపఁబడినవో యవి యథాసందర్భముగ సూచించినాఁడను. ఇదివఱకుఁ బ్రకటింపఁబడని శాసనములలో నేవియైన రాజకీయశాసనాధికారవర్గముచే సంభృతములైన శాసనములలోఁ జేరియున్నచో నాశాసనము లాశాసనవర్గమువారు ప్రకటించిన యేయేసంవత్సరపు పట్టికలలో నేయేసంఖ్య గలవిగా నున్నవో యదియు సూచించినాఁడను. ఇందు మొదటిశాసనము 770వ శకసంవత్సరప్రాంతమునందును, చివరిది 1600వ శకసంవత్సరప్రాంతమందును బుట్టిన వగుటచే నెనిమిదివందల సంవత్సరములకంటె నధిక మగుకాలమందుఁ బుట్టినపద్యము లిందుఁ గలఁ వని తేలుచున్నది. వీనిలో మొదటిశాసనము నన్నయభట్టారకుని ప్రభువగు రాజరాజనరేంద్రునికంటె నూటడెబ్బది ఎనిమిది సంవత్సరములు పూర్వము – అనగా శ.స. 766 మొదలుకొని రాజ్యముచేసిన గుణగవిజయాదిత్యుని రాజ్యకాలమునఁ బుట్టినది. దానికి నించుమించుగా నేఁబది సంవత్సరముల పిదప రెండవశాసనము పుట్టినది. కావున నీరెండు శాసనములును వాగనుశాసనకాలముకంటెఁ బూర్వము పుట్టినవే. ఈనాఁటిమండలముల వరుసనుబట్టియే యేయేమండలములలో నెన్నెన్ని శాసనములు దొరికినవో యీ క్రిందిపట్టికవలనఁ దెలియఁదగు.
గంజాము ... 1
విశాఖపట్టణము ... 1
గోదావరి ... 11
కృష్ణ ... 17
గుంటూరు ... 52
నెల్లూరు ... 1
కర్నూలు ... 1
కడప ... 2
గోలకొండదేశము ... 2
———
88
———
మొత్తము పద్యములలో ముప్పాతికకు మించి కృష్ణాతీరమందు దొరికినవి. పూర్వకాలమందు, కృష్ణాతీరమందుఁ గవులెక్కుడుగా నున్నట్లు దీనివలనఁ దెలియుచున్నది.
ఈపద్యములవలని ప్రయోజనములు రెండువిధములు. దేశచరిత్రము తెలిసికొనుట యొకటి, ఆంధ్రశబ్దలక్షణమును ఛందస్సును గాలక్రమమున నెట్లు మాఱియుండునో యది తెలిసికొనుట యొకటి. భారతాదిప్రాచీనగ్రంథములు కూడ భాషాచరిత్రశోధన కుపయోగించునవియే కాని యవి పుట్టినవి పుట్టిన ట్లిప్పటివారికి లభించుటలేదు. కవులు వ్రాసిన మాతృకలు చిరకాలముక్రిందటనే నశించిపోయి... వానిని బట్టి యాయాకాలమువారు వ్రాసియుంచిన ప్రతులలోఁ జిట్టచివరవియె యప్పుడు దొరుకుచున్నవి. పాండిత్యాభావముచేత నేమి పాండిత్య ముండియుఁ బ్రాచీనప్రయోగములు తప్పు లనుకొని సవరించుటవలన నేమి కేవలప్రమాదముచేత నేమి ప్రతులు వ్రాసినవా రచ్చట్చటఁ బాఠముల దిద్దుచుండిరి. లిఖితప్రతులలోఁ బాఠాంతరములుండుటయే యిందులకు నిదర్శనము. ఇట్లు మారియున్న గ్రంథములం బట్టి కవిప్రయుక్తపాఠముల నిర్ణయించుట శ్రమసాధ్యము. ఈశాసనపద్యము లన్ననో కవులజీవితకాలములో నెట్లు లిఖింపఁబడినవో యట్లే మనకు లభించుటచేఁ గవిప్రయుక్తపాఠనిర్ణయమున కత్యంతప్రబలసాధనములుగా నున్నవి. ఈవిషయములో నేమి యితరవిషయములలో నేమి వీనిప్రామాణ్య మేమాత్రమును జెడకుండుటకై పద్యపాఠములు తూచాలు తప్పకుండ నున్నవి యున్నట్లే ముద్రింపఁబడినవి. ప్రమాదముచే నెక్కడనయిన నొక్కపాఠము తప్పియుండిన నుండునేమో కాని తప్పకుండ నుండవలయుననియే సర్వప్రయత్నములు చేసినారము.
ఈపద్యములం దయినను గవ్యుద్దిష్టములు కానిపాఠములు కొన్ని ప్రవేశించి యుండఁగూడదా యన్నచోఁ బ్రవేశించి యున్నవని యొప్పుకొనక తప్పదు. లేఖకప్రమాదజనితదుష్టప్రయోగము లనేకము లచ్చటచ్చటఁ గన్పట్టుచున్నవి. ఆపాఠము లున్నవి యున్నట్లే మూలమం దుంచి వానిని సవరించువిధ మాయాపుటలయం దడుగున సూచింపఁబడినది.
ఇవి గాక కవిప్రయుక్తము లనఁదగిన పాఠములలోఁ గూడ వర్ణక్రమమునందును శబ్దలక్షణమందును నిప్పటి సదాచారమునకు విరుద్ధము లయిన ప్రయోగములు కొన్ని కనఁబడుచున్నవి. ఇవి కూడ లేఖకప్రమాదజనితములే కాఁగూడదా యన్న నట్లు కానేర దని చెప్పవలసియున్నది. వివిధకాలముల వివిధప్రదేశములందుఁ బుట్టిన వివిధశాసనము లన్నింటిలో నొక్కవిధముగా నున్న ప్రయోగము లాయాకాలములందు జనసామాన్యసమ్మతము లయినవే గాని యాయాయి లేఖకులు కల్పించినవి కా వని చెప్పక తప్పదు. అట్టి ప్రయోగములలో ముఖ్యమైన వీక్రింద వివరింపఁబడుచున్నవి. వీనిలో I. వర్ణక్రమమునకు సంబంధించినవి కొన్ని, II. శబ్దలక్షణమునకు సంబంధించినవి కొన్ని— I. వర్ణక్రమసంబంధములు—
1. అనుస్వారస్వరూపమును గుఱించి ముందుగా విచారింతము. అనుస్వారము తెనుఁగులోఁ బూర్ణ మనియు నర్ధ మనియు రెండువిధములు. నిండుసున్న పూర్ణానుస్వారరేఖ. అఱసున్న యర్ధానుస్వారరేఖ. శాసనములందుఁ గాని పూర్వపువ్రాఁతపుస్తకములందుఁ గాని యఱసున్న యెచ్చటను గానరాదు. అది యుండవలసినచోటఁ గూడ నిండుసున్నయే కనఁబడుచున్నది. ప్రాచీనశాసనములలో నిండుసున్నకు బదులు వర్గాంత్యానునాసికాక్షరములు కనఁబడుచున్నవి. అనగా కట్టిఞ్చి, తమ్ముణ్ఢు, అన్త యేనియు, ఫలమ్బు, ఇత్యాదిరూపంబులు కనఁబడుచున్నవి. దీనిని బట్టి చూడంగాఁ దెలుఁగులో ననుస్వార మని వాడఁబడుచున్నది వర్గాంత్యానునాసికాపరరూప మనియు, అది తొలుత ననునాసికాక్షరముగానే వ్రాయఁబడుచుండి కొంతకాల మైనపిదప సౌకర్యార్థము బిందురూపముగా వ్రాయఁబడెననియు, ఆబిందువు తొలుతఁ బూర్ణముగానే యుచ్చరింపఁబడి రాను రాను లాఘవార్ధము దీర్ఘముమీఁద నిత్యముగాను హ్రస్వముమీఁద వైకల్పికము గాను దేల్చి పలుకఁబడసాగె ననియు దీనివలననే పూర్ణార్ధానుస్వారభేద మేర్పడియె ననియుఁ దేలుచున్నది.
2. శాసనములలోఁ గొన్నిచోటుల వ్రాఁత యొకవిధముగాను బలుకుబడి యొకవిధముగాను గనఁబడుచున్నది. ఉదాహరణము:—
(క) రెండవశాసనములో "నెగి దీచ్చెన్ మఠంబు” (2 వ పద్యము) "అశ్వమేధంబు ఫలంబు" (3 వ పద్యము) అనుచోటుల మఠము, ఫలము అని చదువవలయును. లేకున్న ఛందోభంగ మగును. మఠశబ్దమునకు మఠంబు, మఠమ్ము, మఠమునని మూఁడురూపము లున్నవి. అందు మఠంబు అనునదియే మొదటిరూప మయినట్లును అది మాఱి మఠమ్ము అయినట్లును, అది తేలిచి పలుకుటచేత మఠము అయినట్లును గనఁబడుచున్నది. పలుకుబడి యీవిధముగా మాఱినను వ్రాఁతమాత్రము మఠంబు అనియే కొంతకాలమువఱకు నుండెను. మఠమ్ము అనురూపము గ్రంథములందుఁ గానవచ్చుచున్నది, గాని, శాసనములం దంతగాఁ గనుపడుట లేదు. ప్రాసార్థము కవు లారూపము నంగీకరించియుందురు.
(చ) మూఁడవశాసనములో “బురుడించ్చునట్లు” అనుచోట “బురుడించునట్టుల” అనియు నాలుగవశాసనములో “శ్రీశకునేణ్డ్లు" అనుచో “శ్రీశకునేణ్డులు" అనియుఁ దొమ్మిదవశాసనములో “ఇష్ట్లకు" అనుచోట “ఇష్టులకు" అనియు “గుడ్లకు" అన్నచోట "గుడులకు" అనియు, నిరువదియొకటవశాసనములో “చెఱ్వు" (2 వ పద్యము) అనుచోట "చెఱువు" అనియుఁ జదువవలయును. ఈజంటరూపములం దసంయుక్తరూపములే పూర్వరూపములు. సంయుక్తరూపములు తరువాత వచ్చినవి. అయినను వాని కొకానొకప్పు డసంయుక్తోచ్చారణమే చెప్పవలసియున్నది. సంశ్లిష్టములుగా నుండవలసిన యక్షరములు కొన్నితావుల విడిగా వ్రాయఁబడినవి. ఉదా:- నిలిపె (39వ శాసనము.)
(ట) ఋకారమునకు బదులుగా ఇకారసహితరేఫమే ప్రాచీనశాసనములలోఁ గనఁబడుచున్నది. ఉదా:-బ్రింద, వ్రిక్షము, మ్రిగాంక (10 వ శాసనము) సమ్రిద్ది (41-6). ఒకానొకప్పుడు “నృ" అనుదానికి బదులుగా “ంద్రి" అనురూపము కనఁబడుచున్నది. ఉదా:- సూంద్రిత (41-2) సకంద్రిపావనీపాల (41-13).
(త) పాదాంతములందుఁ గేవలము హల్లుగా నుండవలసిన నకారలకారములు సాధారణముగా అజంతములుగానే కనఁబడుచున్నవి. అచ్చునకుఁ బలుకుబడి లేదు. ఒకానొకచోట నకారము పొల్లురూపమును గలదు. ఉదా:- అర్థిన్ (2-1) హేతిచేన్ (52-2) పదమ ధ్యమందుఁగూడ హల్లుమాత్రముగానె యుండవలసిన నకారలకారము లచ్చుతోఁ గూడి కనఁబడుచున్నవి. ఉదా:- శకాబ్దములు (55-5) దుర్వ్వెవసాయులను(7-4) భంగదులు (12-4).
(ప) ఐ కి మాఱుగా, అయి, అయికి మాఱుగా, ఐ, తఱచుగా వ్రాయబడినవి.
(గ) అనుస్వారపూర్వకాక్షరము పెక్కుతావుల ద్విగుణీకరింపఁబడినది. అట్లు కానిచోటులునుం గలవు.
(జ) సంయుక్తాక్షరములలో రేఫపరక మగునక్షరము తఱచుగ ద్విగుణీకరింపఁబడినది. ఉదా:- కర్త్త (58-2) ధర్మ్మంబు (58-3).
(డ) క్రావడి యుండవలసినచో శకటరేఫ ముండుట. ఉదా:- పణ్డ్ఱెణ్డు(1) చెబ్ఱోలనుణ్డి (2-4).
(ద) ೞస్సి, అೞసిన (2-3) ఇత్యాదిశబ్దములందు ೞ యను వింతయక్కర మొక్కటి కనఁబడుచున్నది. ఇది యఱవములోని ௶, కన్నడములోని ೞ యనునక్షరములకు సజాతీయమైనది. దీనియుచ్చారణ మిప్పుడు డకారోచ్చారణముగా మాఱినది. ఈయక్షరమును గూర్చిన విమర్శన మాంధ్రసాహిత్యపరిషత్పత్రికలోఁ గననగు.
పైనుదాహరింపఁబడిన వర్ణక్రమదోషముల నన్నింటిని సవరించినచో గ్రంథవిస్తర మగునని విడిచిపెట్టినారము. పాఠకులు యథోచితముగ సవరించుకొనవలయును.
II. శబ్దలక్షణమునకు సంబంధించిన ప్రయోగవిశేషములు—
1. సంస్కృతశబ్దములు కొన్నింటికి లక్షణవిరుద్ధములైన రూపములు కనఁబడుచున్నవి.
(క) కల్హారగంధి యనుటకు బదులుగా కలుహారగంధి యని (15-3).
(ట) వల్లభ యనుటకు బదులుగా వల్లభి యనుట (4-1, 5-3)
(త) బాలిక యనుటకు బదులుగా బాలకి యనుట (5-5)
(ప) ఉదయించె ననుటకు బదులుగా ఉదియించెనని తఱచుగాఁ గన్పట్టుచున్నది.
(గ) అకారాంతశబ్దములకు డుప్రత్యయము పరమైనప్పుడు ప్రకృతిరూపమందలి చివరియకారమున కుకారము రాకుండుట - బ్రహ్మదేవండు (40-3,5) శరణండు (46-14) భీమనిన్ (48-2) మల్లిదేవండు (58-12,13).
2. డుప్రత్యయాంతశబ్దములు కొన్ని డుప్రత్యయము లేకయే కనఁబడుచున్నవి. చోడుఁడు అనుటకు బదులు చోడు (58-7) తమ్ముఁడు అనుటకు బదులు తమ్ము (58-15,16)
3. నన్నయభట్టారకుని కవిత్వమందుఁ గలప్రయోగవిశేషములు కొన్ని యీశాసనములందుఁ గనుపట్టుచున్నవి.
(క) “అందు” నకుఁ బ్రయోగవిశేషము. (16-6)
(చ) ప్రథమకు బదులుగా షష్ఠీవిభక్తి ప్రయోగము. నీపడసిన (9) వెలనాంటిచోడినృపునిచ్చిన (42-1)
(ట) అస్వమేధంబున ఫలంబు (1)
4. కళలపై వచ్చు కచటతపలకు గసడదవాదేశము సాంస్కృతికములందు సైతము తఱచుగాఁ గనఁబడుచున్నది. ఈయాదేశము నిత్య మనియే పూర్వులు భావించినట్లు కనుపట్టుచున్నది. ఛందోవిషయము
1. రెండవ శాసనములోని మధ్యాక్కరలలో యతి ప్రతిపాదమునందు నైదవగణము మొదటఁ గనఁబడుచున్నది. నన్నయభట్టారకుని కవిత్వమందు నిట్లే యున్నది.కవిజనాశ్రయమునందుఁ గూడ నిట్లే విధింపఁబడియున్నది కాని యిటీవలి కవిత్వమందు నాలుగవగణము మొదటఁ గనఁబడుచున్నది. అప్పకవ్యాదులగు లాక్షణికులు నిట్లే నిబంధించినారు.
2. మొదటి శాసనములో "గొళల్చి" యనుచోటను, రెండవ శాసనములో“గొరగల్గా కొరు లిందు” అను చోటను లకారము విడిచి యుచ్చరింపవలయును. ఈసంప్రదాయము కన్నడములో నక్కడక్కడఁ గలదు.
ఇంతకంటే ఛందస్సులో విశేషము లగపడవు.
వర్ణక్రమమందుఁ దప్ప నితరవిషయములందు శాసనపద్యభాషకును నేఁటిపద్యభాషకును భేద మంతగాఁ గనఁబడదు. ఆనాఁటికే భాషాలక్షణము చాలవఱకు స్థిరపడి యున్నది.
పద్యసంజ్ఞలును పద్యసంఖ్యయు మేము చేర్చినవి గాని మాతృకలోనివి కా వని గ్రహింపవలయును. ఒక్కొక్కచో మాతృకలో కందం, వ్రిత్తం అని యున్నచోటులు చూపింపఁబడినవి.
జ. రామయ్య