శశికళ/ప్రస్తావన
-: ప్రస్తావన :-
- * -
శశికళాప్రియుడు,కవి, చిత్రకాఉడు,సంగీత నాట్య కళాకోవిదుడు అగు కులపతి శ్రీ అడివి బాపిరాజుగారి శశికళ గేయకావ్యమును తొలిసారిగా ప్రచురించి ఆంధ్ర సారస్వతాభిమానులకు సమర్పించగలిగినందుకు ఎంతయో సంతసిస్తున్నాను.
ఇందలి గేయములు చాలావరకూ మద్రాస్, విజయవాడ, హైద్రాబాద్ రేడియోకేంద్రముల నుండి ప్రసారితము లవుతున్నవే. 'పాడకే నా రాణి' 'బాలవే నీవెపుడు' పాటలు రెండూ ప్రసిద్ధగాయకులు శ్రీ ఎమ్.ఎస్ రామారావుగారు హెచ్. ఎమ్. వి. గ్రామఫోన్ రికార్డులలో పాడియున్నారు. ఇందులో కొన్నికొత్త గేయములు కూడా చేర్చి పుస్తకమంతా సరిచూసుకున్నారు తమ జీవితపు చివరిదశలో బాపిరాజుగారు.
బాపిరాజుగారు రచించిన గేయములు, చిత్రములు అనేకం ఉన్నాయి. ఆయన ఒకచేతితో కలం మరొకచేతితో కుంచె పట్టుకుని సమంగా ఒకదానికొకటి అండగా రైలుపట్టాలవలె నడిపించారు. 'మన చెలిమి' అనే గేయంలో.
'ఎవరు నేనీ జగతి
ఎవరు నేనీ ప్రగతి'
అని బాపిరాజుగారు జీవితాంతమున ఆత్మపరిశోధన చేసుకున్నార.
శశికళ అనేకరూపాల్లో- సూర్యసుతగా, యోగినిగా, నర్తకిగా, గానసుందరిగా, దేశికగా, ప్రేయిగా, ఆయనకు దర్శనమిస్తుంది.
బాపిరాజుగారి జీవితమంతా కళామయంచేసి చివరికి ఆయననుతనలో లీనంచేసుకున్నది శశికళ.
బాపిరాజుగారు అదృశ్యులైనా ఆయన గ్రంధావళి దీపావళివలె ఎప్పుడూ జ్వలిస్తూనే ఉంటుంది.
శశికళా నిలయం
రామచంద్రపురం
1 జనవరి 1954
రావులపర్తి భద్రిరాజు.