శశికళ/నగ్న
నగ్న
వెన్నెల లో వెలుగుధార
వన్నెల తో స్నానమాడ
ధవళకాంత తరళ మూర్తి
భువన సకల మోహ మూర్తి
ప్రణయ దేవి నా శశికళ
మృణాలాంగి నా శశికళ
పూర్ణ నగ్నయై నిలిచెను
చూర్ణ కుంతలా లాడగ.
తను భంగిమ హిమ శృంగము
మినువాకలో తరంగము
వెన్నెలలో స్నానమాడ
క్రొన్ననలల ప్రోవు ప్రోడ్త
స్వచ్ఛ దేహయై నిలిచెను
స్వప్న సుందరయై పొలిచెను
మిరుమిట్లయె నా కన్నులు
ఉరవడించె నా కోర్కెలు.
సమ భంగాకృతి నిలిచెను
సుమ పరిమెళములు విరిసెను
నగ్నబాల నా శశికళ
నగ లలంకరించని కల
తళ తళమని మెరిసె దేవి
తలిరుటాకు మృదువు ప్రోవు
అనుప మాన సౌందర్యము
నిరుప మాన లావణ్యము
ఉద్రిక్తము నా హృదయము
ఉద్గాఢము నా ప్రణయము.
పదములు పూవుల గుత్తులు
మధుపము నా తోడి చిత్తము
సుషమాధారము జంఝలు
తుషారార్ద్రములు తలపులు
అమృత కలశమామె కుకటి
అమరపతి నామె ఎదుట
డమరుక మధ్యమ్ము నడుము
క్రమము తప్పి మది నృత్యము
పారిభద్ర సుమకుచములు
బాహ్లిక సుమ చూచుకములు
ధవళ కమల ముకుళ గళము
నవమాలిక సరము కరము
సౌగంధిక కుసుమ ముఖము
సై రేయక సుమనాసిక
ఇందీవర లోచనములు
మందారక కపోలములు
శేఫాలీ కుటి కైశ్యము
శ్రీఫాలము మాలతి కృతి
పాట లాథ రోష్ఠమ్ములు
ప్రవిమల మూర్తి నిలిచెను
పరమ శోభతాన మగుచు
దివ్యదేవి నా శశికళ
భవ్యమయ్యె నా జన్మము !