శ్రీరస్తు

శశాంకవిజయము

పీఠిక

ఇష్టదేవతాప్రార్థనాదికము

శ్రీవిన్నాణపుగుబ్బచన్నుల నయారే గంబురా గుప్పి ము
క్తావల్లుల్ ఘటియిం చెదేమి శశికిన్ దారాప్రయుక్తంబనే
భావంబో యని పల్కుకల్మిచెలి సంభావించు కాంచీపురీ
దేవుం డీవుత సీనయార్యమణికిన్ దీర్ఘాయురారారోగ్యముల్.

1


చ.

సరసివి గానఁజక్కవలె చన్నులు గా వివి పద్మినీకులా
భరణవు గానఁ దేనియయె వాతెఱ గా దిది కల్మిచూపు పెన్
గరితవు గానఁ బొంబిలమె నాభిక గా దని నాన దీర్చుదే
వరయురమందుఁ గుల్కురమ వంగలసీనయయింట నిల్చుతన్.

2


చ.

కృతయుగమం దనంతుఁ డనఁద్రేతను లక్ష్మణసంజ్ఞ రేవతీ
పతి యన ద్వాపరంబునను భాష్యకృదాఖ్యఁ గలిం జనించి శ్రీ
సతిపతివైఖరిన్ జననచాతురి చాతురి మీఱి నిత్యశే
మతఁ గనుశేషుఁ డిచ్చుఁ గృప శాశ్వతభోగము సీనమంత్రికిన్.

3


చ.

పులకలు మేనఁ గ్రమ్మఁ గనుమోడ్పుల వేమఱు మ్రొక్కుచాడ్పులన్
వలనుగ వారిజాక్షపద వారిజభక్తివధూవశుండ వై
కులికెడునీవు వేఱొకతెఁ గోరుదువే యని పల్కుసూత్రవ
త్యలికచమాటకు న్నగుబలాధిపుఁ డీకృతినేతఁ బ్రోవుతన్.

4


మ.

చలితస్వర్ణతుషారరౌప్యనగము ల్సంక్షోభితాంభోదము
ల్ఫలదాశానికురుంబము ల్పరిలుఠద్బ్రహ్మాండము ల్సైకత
స్థలితాంభోనిధిగర్తము ల్ఘుమఘుమత్రయ్యంతగ్రంథంబు లౌ
పులుగున్ రాయలఱెక్క మొక్క చలనంబు ల్పాపుఁ బాపంబులన్.

5

ఉ.

ఓ మధుసూదనా యన నొహో యని తార్క్ష్యునికన్న మున్ను ప్రొ
ద్దామెత వచ్చుశౌరికిని దా మును గాఁ జనితాంతదంతిర
క్షామతి నక్రమస్తకము చెక్కులు చేసినచక్ర మెప్పుడున్
క్షేమ మొసంగి చక్రపతిఁ జేయుత సీనయమంత్రి భాస్కరున్.

6


ఉ.

హైమవతీశమాన్యము జితాసురసైన్యము నభ్రవిభ్రమ
స్థేమఘుమంఘుమధ్వనివిజృంభితజన్యము పాంచజన్య మా
త్మామలకీర్తికార్తికనిశాబ్దధుతారి నొనర్చు దైవత
స్వామినిభోగలీల గెలువం గలవంగలసీనయార్యునిన్.

7


గీ.

కళుకుజగజంపువిడికెంపుకంకణంపుఁ
బలుకు లొలయంగ హరి కేలు పట్టు విడని
యమితభోగద యా గద యాగదాన
భరితు సీనార్యు నత్కళాభరితుఁ బ్రోచు.

8


ఉ.

సోమసహెూదరీరమణుసొంపులకెంపులచెక్కడంపుని
ద్దామెఱుఁగు న్బరంజు గురుదాయరుదారిమదారిదారిత(?)
న్వేమఱుఁ బ్రోచుఁ గాత కృప వేంకటరాఘవదీక్షితేంద్రవం
శామృతభాను సీనయ దయానయమానయశోభిశోభితున్.

9


చ.

కలుములకొమ్మ కొమ్మెఱుఁగు గా నతజాతులు జాతులై తగన్
విలసితవేంకటాఖ్యపృథివీధరశేఖరకృష్ణమేఘమం
దెలసిన శార్ఙ్గచాపము సమీహితవర్షము నించుఁ గాత వం
గలకుల మెల్ల వృద్ధి చెలఁగం గృతినేతకు సంతసంబుగన్.

10


శా.

వాధూలాన్వయవార్ధివిష్ణుఁ బ్రతిభావర్ధిష్ణు వేదాంతవ
న్యాధిష్ఠానవసంతు శ్రీవరదగుర్వంతేవసంతున్ గవి
త్వాధారున్ గుణహారు ధీరు విగతాహంకారు వాత్సల్యధా
రాధారున్ గృతిసిద్ధికై కొలుతు శ్రీరామానుజాచార్యునిన్.

11


మ.

వరలాలిత్యపదక్రమంబులను సద్వర్ణస్థితు ల్గాంచి శ్రీ
కరశాఖన్ గ్రహియించి యంగకలనాకాంక్షన్ కళ ల్మీఱఁగా

నురుసాహిత్యరసానుభావములచే నుప్పొంగుచున్, వాణి మో
హరతిం దేల్చు విధాత, సీనయకు ధీర్ఘాయుష్య మిచ్చున్ గృపన్!

12


చ.

తనశర మొక్కటే పదివిధంబులఁ దేజరిలన్, ధనుర్గుణం
బనుపమశబ్దరూఢిని సహస్రముఖంబులఁ బల్కుచుండఁ, దే
రనిశ మనంతరీతిఁ బొలుపారఁ, బురంబుల నోర్చి పేర్చు జో,
దనవరతంబు వైరి విజయంబు నొసంగుత సీనమంత్రికిన్!

13


సీ.

నీతోడి పొందకల్ నాతరమా యెంచ?
        జాతు లేర్పఱచిన జాణ వౌదు,
వీ నాఁట నీ పాటి నే నెచ్చటను గాన,
        ఘనరాగసంగతి గాంచితి బళి!
మోహనలీలచే మొనసి బాగైతివి
        నయములు పచరించు నటన నీది,
కాంచి ఘంటారవకలన ని న్మెచ్చెద
        శ్రుతి వియ్యముగ ననుకృతివి గావె?


గీ.

యనుచుఁ బతితోడ సరసోక్తు లాడునట్టి
వాణి, శుకపాణి, పికవాణి, వనదవేణి,
సీనయ ముఖాబ్జపీఠికాసీన యగుచు,
శ్రీ నయసమృద్ధి వర్ధిల్లఁజేయుఁగాత!

14


ఉ.

పుట్టినయింటి కెంతయు సమున్నతి చల్లఁదనంబు మీఱఁగా,
మెట్టినయిల్లు గహ్వరము మీఱియు వెండిఁ బ్రసిద్ధి కెక్కఁ, జే
పట్టిన వల్లభుం డతనుభాసితలక్ష్మి తగన్, మద ద్విపం
బట్టి తనూభవుం గనిన యంబ కృతిప్రభుఁ బ్రోచుఁగావుతన్!

15


ఉ.

దంతనిశాంతహేతి నిరుదంతనిశాచరకోటిధాటి దు
ర్దాంతనియంతవిక్రముని, దాంతుని, శాంతుని, శాంతమానసున్,
సంతతభక్తిమ ద్వనవసంతు, నితాంతసుకీర్తి నెంతయున్
మంతుకు నెక్కు, వీరహనుమంతుఁ దలంతు నిరంతరంబుగన్.

16

మ.

హరజూటానటదాపగాంబుఝరి తుండాగ్రంబునం బీల్చి సా
దరతం దజ్జలజంబు తల్లికి సముద్యత్పుష్కరాకృష్ణసా
గరగౌర్యగ్రజకంధరాంతరఫణిగ్రైవేయకం బద్భుత
స్ఫురణం దండ్రి కొసంగి ముద్దు గొనుదేవుం డిచ్చు నిర్విఘ్నతన్.

17

సంస్కృతకవిస్తుతి

ఉ.

ప్రాకటసత్కవిత్వపరిపాటిని లోకమువా రెఱుంగఁగాఁ
జేకొనఁ జేసి వేదములచిక్కులు దీసి మృదూక్తి సాహితీ
వ్యాకృతి వాగ్వధూటి త్వమహ మ్మని వా దొనరించ మించువా
ల్మీకిఁ దలంతు వ్యాసుని నమింతు నుతింతును గాళిదాసునిన్.

18

ఆంధ్రకవిస్తుతి

ఉ.

నన్నయభట్టు మైత్రివలన న్నయ మొప్ప గణించి తిక్కనన్
బన్నగభూషణాఘనవిపన్నగభీరవచోనియుక్తికై
ము న్నతిఁ జేసి యెఱ్ఱనసమున్నతి యుక్తిఁ దలంచి శేముషీ
మన్నమనీయులం గవుల మన్ననఁ గావ్యనిరూఢి కెంచెదన్.

19

కుకవినింద

మ.

పరపాకంబులగోరి యెందుకయినం బ్రాల్మాలి వృత్త్యర్థమై
యొరుపాదంబుల వంటి యర్థకలనాయోగంబు లేమి న్నిరం
తరచింతన్ దగురీతి దోపక వివర్ణత్వంబునన్ దీనులౌ
చరులంజూచి సుదృగ్జనంబు రసవన్నర్మోక్తులం బల్కునే.

20

కృతిబీజము

వ.

అని యివ్విధంబున నిష్టదేవతావందనంబును శిష్టకవిజనాభినందనంబును దుష్టకవినిందనంబునుం గావించి శృంగారభంగతరంగితంబును మకరందబిందుసందోహనిష్యందమాధురీసాధురీత్యనుబంధసుగంధిపదనిబంధబంధురంబుగా నొక్కప్రబంధంబు రచియింప నెంచియుండునవసరంబున.

21


సీ.

వంగలకులకుంభ వారాశి జనియించి
        కన్నుల కామోదగరిమ నించి

యందంద సకలకలాభ్యాసియై మించి
        జైవాతృకత్వప్రశస్తి గాంచి
కౌముదీప్రజ్ఞానగౌరవంబు వహించి
        సతతంబు కవిసమాదరణ మించి
యి మ్మైన గానామృతమ్ములు గురియించి
        యరికులంబులగర్వ మపహరించి


గీ.

యతిశయితలక్షణాఢ్యత నధిగమించి
ధాత్రి రామానుజమహాచరిత్ర ఘటన
కలనఁ గువలయవికసనకళ ధరించి
సీనఘనకుండు సర్వజ్ఞశేఖరుండు.

22


వ.

వెండియు, నఖిండమండిత మహీమండ మండనాయమాన పాండ్యమధురాధరాఖండల శ్రీవిజయరంగ చొక్కనాథ మహీనాథ కృపాకటాక్షవీక్షణానువర్థమాన, పర బలార్ణవమంథశైలాయమాన, గంధమంధరసింధురఘటాపవనజవనసింధుకాంభోజ, గంధర్వకోటీసమాటీకనచటులరథచ్ఛటావీరభట, సహస్రకిరణకిరణోపమానమాణిక్యసేవాసమాగతగాణిక్య, శరచ్ఛంద్రచంద్రికారుచిరుంద్రచంద్రశాలాసౌధసంబాధమణికుట్టిమహిరణ్మయద్వారబంధబంధురమందిరారావగ్రామ వివిధచీనిచీనాంబరనవరత్నఖచితభూషణపేటికా చేటికాహాటకాందోళికాశిబికాభద్రాసనడోలికాప్రముఖ నిఖిలసంపత్పరంపరాకంపితనిలింపనాయకుండును, నాశ్రితాభీష్టదాయకుండును, బాదారవిందవందనానందితచతురంతసామంతమహీకాంతమంత్రిమండలుండును, నిజకథాకల్పితవిద్వత్కర్ణకుండలుండును, నతులవితరణవిలసితహసితసితకరకల్పకశిబికర్ణఖేచరుండును, శ్రీరంగనాథకరుణాకటాక్షగోచరుండును, నగ్నిష్టోమాతిరాత్రవాజపేయపౌండరీకధర్మ పౌర్ణమాసచాతుర్మాస్యపశుబంధప్రకృతివేదోక్తసత్కర్మసమారాధిత మాధవకృపాతరంగితాపాంగవీక్షణాలంకార వేంకటరాఘవ దీక్షితేంద్ర తిరువెంగళమ్మ బహుజన్మతపఃపరిపాకశుభావతారుండును, కాంచనాచలధీరుండును, సేతుహిమాచల

మధ్యవర్తి సమస్తబాంధవజనతామనోరథప్రపూరణకుతూహలహలహలికాసమాకలితచిత్తుండును విహితకర్మాచరణవృత్తుండును నిత్యాన్నదానసంతర్పితసకలభూసురుండును సప్రతిహతప్రతాపభాసురుండును సత్యభాషానవీనహరిశ్చంద్రుండును సజ్జననయనకువలయపూర్ణచంద్రుండును ఘననయదేశీయకమనీయ గ్రామమూర్ఛనాబహువిధవిన్యాస ధన్యాసమానతాళమాన నానానూనతానవితానభంగీతరంగితసంగీతవిద్యావిశారదుండును వీణానినాదవినోదభూలోకనారదుండును వాదిమదగజప్రపంచపంచాననగర్జావిస్ఫూర్జిత తర్క వేదాంత వ్యాకరణశాస్త్ర సమ్మతానర్గలోపన్యాసవై ఖరీ వాగ్వధూనాథుండును నాథమునియామునప్రముఖపూర్వాచార్యచర్యాభిరాముండును రామానుజ దివ్యచరిత్రప్రబంధసాహితీమోహితానల్పసంతోషవిశంకట వేంకటనగాధీశ్వరుండును నీశ్వరాంఘ్రికంజాత శింజానమంజీరమంజుల ఝాళంఝుళీనిగుంభనస్తంభన గంభీరసంభాషణ విస్మితనిఖలసభాస్తారుండును నిరుపమనీతివిస్తారుండును తారపటీరతుషారధరణీధరసానుచరశబరీవిబుధనీలకబరీనిబిరీసవచనరచనాసముద్ఘాటిత శశిమకుటరజతగిరికటకకపటకిటిధరణీభృదునగవరసురతురగశరదకుందశరదరవిందవిమల ధవళగరుదమలకమలకుముదసముదయసమిదశనవిస్ఫూర్తికీర్తి గంగాతరంగిణీప్రక్షాళితమేదినీపంకుండును వంగలాన్వయపాలనాంకుండును నయవినయశమదమజ్ఞానవిజ్ఞానకృతజ్ఞతాభిజ్ఞ వరదగురుచరణపరిచరణకరణ శరణాగతరక్షణవిచక్షణతాసత్యసౌశీల్యవాత్సల్యమాధుర్యగాంభీర్యౌదార్య చాతుర్యశౌర్యధైర్యస్థైర్యమార్దవార్జవశుచిత్వకృతిత్వప్రముఖ నిఖిలసుగుణమణిగణరోహణాచలుండును నిశ్చలుండు నుపాసితవిబుధయూథుండు నూర్జితప్రబోధుండును సరసపదపద్యగద్యరచనాభోజుండును సంతతసుముఖాంభోజుండును నైన సీనయామాత్యబిడౌజుం డొక్కనాఁడు పరిచితశబ్దతర్కమీమాంసులైన విద్వాంసులును వాఙ్మాధురీధురీణభారతీరమణీమణీరమణీయమణినూపురరవు లైనకవులును నఖలజనశ్రవణానందదాయకు లైనగాయ

కులును వివిధవిచిత్రతానవితానతాళపాళికానిసర్గసర్గప్రవీణవీణాపాణికు లైనవైణికులును హర్షవిస్మయకళారంగంబు లగుప్రసంగంబులఁ బ్రొద్దుపుచ్చుచు నుండ నిచ్చలంపుఁబాలగచ్చులమెచ్చులు మీఱు కొలువుకూటంబునం గొలు వుండి.

23


క.

నను రంగేశ్వరపదయుగ
ఘనతరభజనానిరూఢకవితాసామ్రా
జ్యుని శేషము కృష్ణసుధీ
తనయుని బిలిపించి పలికె దయ దయివాఱన్.

24


చ.

అసదృశభక్తి సద్గురుకటాక్షము గాంచి సమంచితాత్మతన్
బిసరుహమాకరందరసపేశలకౌశలవన్మృదూక్తులన్
రసికుల కింపుగాఁ గృతిపరంపరలన్ రచియించి కీర్తిచే
నెసఁగితివయ్య వేంకటపతీ బళి శేషమువంశసత్కృతీ.

25


క.

నీ విప్పుడు మా పేర శు
భావహము శశాంకవిజయ మనెడు ప్రబంధం
బావిష్కృతశృంగారతఁ
గావింపుము రసికహృదయ కౌతుక మెసఁగన్.

26


వ.

అని సగౌరవంబుగా నానతిచ్చి కర్పూరతాంబూలంబును కనకాంబరంబు లొసంగి బహూకరించుటయు నేనునుం బ్రమోదభరితమానసుండ నై యిమ్మహాప్రబంధంబున కారంభించి కృతినాయకుని వంశావతారక్రమం బభివర్ణించెద.

27

కృతిపతివంశావతారము

సీ.

సుద్దంపుటద్దంపునిద్దంపు జెక్కిలి
        బాలసంద్రపుఁబట్టి పట్టి నొక్కఁ
దులకింపుబలుకెంపుతలకింపుజిగిమోవిఁ
        బంటలవాల్గంటి గంటు సేయ
నెలకూనపొలు పైన యళికాన నీళాస
        తీలోకతిలకము తిలక మునుప

రతి సొక్క మతిఁ దక్కి శ్రుతిచక్కి గోదాఖ్య
        మంజువాణీమణి మణిత మొసఁగ


గీ.

నఖిలశృంగారములకు నిమ్మయి వెలుంగు
భువనసప్తద్వయీగణ్యపుణ్యగంధ
సముదితసుఖంబు శారదసమయవికచ
పంకజసఖంబు శ్రీరంగపతిముఖంబు.

28


ఉ.

అందు జగన్నుతాగమసహస్రదృగాశయలబ్ధవర్ణు ల
స్పందమహాహవాంతరవిషాదితపుణ్యజనాగ్రణుల్ సదా
నందనపుణ్యగంధసుమనఃపరిశోభితు లాది నుద్భవం
బొందిరి భూసురుల్ శమదమోదయభాసురు లచ్యుతాశ్రయుల్.

29


క.

చిత్రము తద్ద్విజకులము ప
విత్రముగా సంభవించె విధిమానసమం
దత్రిగుణప్రతిబంధుం
డత్రియుగపదాబ్జభక్తుఁ డత్రి ధరిత్రిన్.

30


శా.

మాయావాదిభుజంగభంజనగరుత్మంతుండు శిష్యావళీ
శ్రేయస్సాగరపూర్ణచంద్రుఁడు త్రయీసిద్ధాంతసింహాసన
స్థాయిశ్రీయతిసార్వభౌమపదపద్మధ్యాయి తత్త్వాన్వితుం
డైయాఖ్యన్ వెలసెన్ కిడాంబికులజుండై యత్రిగోత్రంబునన్.

31


క.

వేంకటకృష్ణయ ఫణిప
ర్యంకపదాబ్దప్రసన్నుఁ డాచార్యకులా
లంకారుఁ డాహిమాచల
లంకారమణీయయశుఁడు రహి మీఱె మహిన్.

32


సీ.

చెలువంబుచే జీరుచిలుకతేజివజీరు
        విమలోక్తిచేఁ జేరు విరులచేరు
కరుణాపరత నమ్ము గరళకంధరునమ్ము
        నతిబలంబున మీఱు నలసమీరు

ఘనధైర్యరమ గట్టు కడవన్నెబలుగట్టు
        స్థిరశక్తిచే మారు శివకుమారు
తెలితరిచే నంటు కలువకన్నియ నంటు
        పటుదత్తి నెర సూను భానుసూను


గీ.

మంత్రిమాత్రుండె యతఁడు దుర్మంత్రిగంధ
సింధురోదగ్రజాగ్రన్నృసింహమూర్తి
చెంజి వేంకటన్నపతి సాచివ్యకారి
కీర్తిగుణహారి వేంకటకృష్ణశౌరి.

33


చ.

నలుదెసలందు భూమిలలనామణిహారము లగ్రహారముల్
వలనుగఁ జేసి కీర్తి గనువంగలవేంకటకృష్ణమంత్రిరా
ట్తిలకుఁడు శౌర్యసంపదవధీరితకృష్ణు విలాసకృష్ణు వి
ద్యల మునిరాజకృష్ణుఁ గనె నాత్మజరత్నము పెద్దకృష్ణునిన్.

34


ఉ.

హత్తినకీర్తికాంత విపులాంబరలాలనఁ గల్మినెచ్చెలిం
జిత్త మెలర్చుచూపులను జిత్రవిలాసకళాకలాపవి
ద్వత్తను భారతీయువతిఁ దన్పుచు శ్రీ పెదకృష్ణమంత్రి లో
కోత్తరవర్తనం దనరియుండియు దక్షిణలీలఁ గన్పడున్.

35


క.

అతనికి కొప్పెర కృష్ణయ
సుతుఁ డయ్యెఁ దదీయహేతిశూరాలివధూ
వితతులకొప్పెర గొనుటన్
క్షితి కొప్పెరకృష్ణుఁ డన సుకీర్తిం దనరెన్.

36


సీ.

ధార్మికలక్ష్మీనిదానంబు దానంబు
        గుణయుక్త ధుసంకులము కులము
భువనసమ్మానితాభోగంబు భోగంబు
        దినదినత్యాగసాధనము ధనము
రుచిరసౌమ్యగుణానురూపంబు రూపంబు
        ఘనశుభలక్షణాకరము కరము
మహితకౌరవ్యోపమానంబు మానంబు
        వరమంత్రికోటీరపదము పదము


గీ.

కలితసాఫల్యకవివచోగణము లతని
గుణము లెన్నుట కొకవేయుఫణము లున్న

నలవి యగు మంత్రిమాత్రుండె యరివిదారి
విష్ణుమతధారి కొప్పెరకృష్ణసూరి.

37


క.

రంగన్నిజభుజశక్తి
స్వాంగలు లై రిపులు సమరవీథి న్బఱవన్
వెంగన్న యట్టు వంగల
వెంగన్న నతండు గనియె వేడుక మీఱన్.

38


సీ.

తనకీర్తి నిఖిలవిద్వన్మనఃకైరవ
        నిచయంబులకు చంద్రరుచులు గాఁగఁ
దనప్రతాపంబు శాత్రవదర్పనీహార
        మండలంబునకు నీరెండ గాఁగఁ
దనయనారతభూరిదానంబు యాచక
        సస్యపాళికి నభస్యంబు గాఁగఁ
దనచరిత్ర మశేషధార్మికచారిత్ర
        పంక్తులకును మేలుబంతి గాఁగ


గీ.

నమరు సన్మార్గచారిజిహ్వాద్విజిహ్వ
ఖండనాంకుండు వినతోపకారశాలి
సామఘనపక్షుఁ డవదాతచారుముఖుఁడు
చెలఁగు వెంగన్న ద్విజకులశ్రేష్ఠుఁ డెన్న.

39


మ.

అలవెంగన్నకుఁ గూర్మితమ్ములు ఘనుం డౌకొప్పెరామాత్యుడున్
కలితాధ్వర్యుఁడు కళ్లకృష్ణుఁడును రంగప్పయ్య తిర్వేంగళ
ప్పలసత్కీర్తిహారుఁ డార్యుఁ డనుకంపాధుర్యుఁ డాచార్యుఁడున్
లలితు ల్వత్తురు ధాత్రి వంగలకులాలంకారు లై యేవురున్.

40


క.

మోచారుచిపరిభవకృ
ద్వాచారుచిరన్ శుచిత్వవర్ధిష్ణు యశ
శ్శ్రీచారుసత్కులీన
న్నాచారు వరించె వేంగనప్రభుఁ డెలమిన్.

41


క.

వెంగనకృప నాచారమ
యంగన యలబుచ్చికృష్ణయార్యున్ శేషా
ర్యుం గస్తురి నాదివరా
హుం గనె గాయత్రినిగమయుగయుగముఁబలెన్.

42

సీ.

ఏజగద్బంధుం డహీనతేజస్స్ఫూర్తి
        దమ్ముల కామోదదాయి యగును
నేపురుషోత్తముం డినమండలీపూజ్య
        మానుఁడై శుభదశాత్మకతఁ జెందు
నేవిభుధాధ్యక్షుఁ డితసిద్ధగంధర్వ
        విద్యాధరశ్రేణి వేడ్కఁ బ్రోచు
నేగోత్రనాయకుం డిలకు నాధారమై
        విష్ణుపదాశ్రయవిహృతి కాంచు


గీ.

నతఁడు లోకతమోహరుం డచ్యుతాఖ్యుఁ
డంచితసుధర్ముఁ డమితసత్త్వాశ్రయుండు
భూష్ణుఁ డుజ్జ్వలకీర్తివర్ధిష్ణుఁ డలరు
బుచ్చికృష్ణఘనుండు సత్పుణ్యధనుఁడు.

43


ఉ.

దానవవైరి వైభవనిదానవధూమణిఁ బెండ్లి యైనటు
ల్మానవతీలలామ ముఖమండలనిర్జితసోమ రూపలీ
లానవపద్మధామ నవలా మధుసూదనపాదపంకజా
సీనమనోమిళింద యగుసీనమ నయ్యనఘుండు చేకొనెన్.

44


ఉ.

పండితమండలీహృదయపంకజభానుఁడు బుచ్చికృష్ణయా
ర్యుండును సీసమారమణియున్ దొలి నోమిననోముపంటగా
హిండితకీర్తియుక్తి జనియించెను వేంకటరాఘవాధ్వరీం
ద్రుండు విభాసమానగుణరుద్రుఁడు వంగలవంశచంద్రుఁడై.

45


సీ.

శరదభ్రవిభ్రమాస్పదవాజపేయాత
        పత్రంబు ఫణిఫణాపటలి గాఁగఁ
సతతరక్షోపాయచణము లై భుజముల
        శంఖచక్రంబులు చందు మీఱ
మిత్రనందకపుష్టి మైత్రావరుణయష్టి
        కౌమోదకీమోదకలనఁ జూప
మఖవిశేషప్రాప్తమణికుండలంబులు
        మకరకుండలము లై మహిమఁ దెలుప


గీ.

సజ్జనానందకృత్సదాచరణజనిత
కీర్తిగంగాతరంగిణీస్ఫూర్తి నింప

లలిత తిరువేంగళమ్మ శ్రీలలన గాఁగ
నలరు వేంకటరాఘవయజ్వశౌరి.

46


ఉ.

ఆశువిశోషణప్రతిభ నార్చుమహాబడబాగ్నిచేఁ బయో
రాశి శమించిపోమికి ధర న్గత మేమొకొ నిచ్చనిచ్చలు
న్వేసట లేక యన్న మిడు వేంకటరాఘవయజ్వయింట మృ
ష్టాశనదానవార్ఝరసహాయత యాయత మై చెలంగఁగన్.

47


సీ.

ఋగ్యజుస్సామాదిరీతు లేర్పడఁజేసి
        భాట్టశాలలఁ బెట్టె వ్యాసులట్లు
ప్రాకారమణిమంటపాదికైంకర్యము
        ల్పరకాలుగతి రంగపతి గొనర్చె
ఛాయలు గల్పించె జలధరప్రౌఢిమ
        సాలలు వేయించి జనులకెల్ల
బుధులకు నవరత్నభూషణాంబరములు
        కల్పవృక్షంబులకరణి నొసఁగె


గీ.

వెలయ నారదవరదున కలఘుభక్తి
నిష్టభోగంబు లొసఁగె ఫణీంద్రులీల
భజనతోషితఖగసార్వభౌమవాజి
సుగుణవేంకటరాఘవసోమయాజి.

48


క.

శ్రీమద్వేంకటరాఘవ
సోమాసిమహాకుల ప్రసూత సుకీర్తి
స్తోమ తిరువేంగళమ్మన్
భామారత్నమును ధర్మపత్నిగఁ బడసెన్.

49


సీ.

రుక్మిణి కమనీయరూపసంపదచేత
        సత్యభామ మృదూక్తిసరణివలన
ఋక్షజాతాభిఖ్య యిలశ్యామ యౌటచే
        లక్షణ యగు శుభలకుణముల
మిత్రవిందయు బాంధవత్రాణమహిమచే
        భద్రయే గమనసౌభాగ్యకలన
సరవిఁ గాళిందియె సాధుజీవనయుక్తి
        రహి సుదంతయె కుందరదన యగుట

గీ.

యనఘ వేంకటరాఘవయజ్వశౌరి
చిత్త మలరంగ మెలఁగుచు శీలవృత్తి
పరమపాతివ్రతీనిష్ఠ పరఁగ ధరణి
ననఁగ తిరువేంగళమ్మ కుందనపుబొమ్మ.

50


గీ.

ఆమహాధ్వరి యాసాధ్వియందు శేష
కృతిని సీనేంద్రు వేంకటకృష్ణధీరు
ఘనుని వేంకటపెరుమాళ్లఁ గాంచి వెలసె
నలువ నాల్గుమొగంబులఁ జెలఁగినటుల.

51


సీ.

తనదుసర్వజ్ఞత కనుగుణంబుగఁ దాల్చె
        గంగోదకం బుత్తమాంగమునను
తన శేషసంజ్ఞకుఁ దగఁ దండ్రియే దైవ
        మనుచు శుశ్రూషలు తనరఁ జేసెఁ
దనకళాశాలిత కనురూపముగ యశ
        శ్చంద్రిక ల్నిలిచె దిక్సంధులందుఁ
దనలోకబాంధవత్వమునకు నీడుగా
        వేదమయుం డని వినుతిఁ గాంచెఁ


గీ.

బురుషసింహత్వవిఖ్యాతి పొసఁగ నఖర
లీల హైరణ్యదానైకలోలుఁ డయ్యె
నతఁడు సామాన్యుఁడే వంగలాన్వయుండు
శిష్టసన్నుతజనుఁ డైన శేషఘనుఁడు.

52


క.

ఆరసికుననుజుఁ డురుబల
వైరికుభృత్పక్షభేది వల్గుసుధర్మా
ధారుఁడు శ్రితమందారుఁడు
శ్రీరమ్యుఁడు సీనమంత్రి జిష్ణుఁడు వెలయున్.

53


సీ.

తనదర్శనస్ఫూర్తి తనదర్శనస్ఫూర్తి
        కరణి శ్రీధామైకగరిమఁ బూనఁ
దనయుక్తివైఖరి తనయుక్తివైఖరి
        మహి సహీనప్రౌఢి మంతు కెక్కఁ
దనయాభిరూప్యంబు తనయాభిరూప్యంబు
        గతి మహిళాశ్చర్యకరము కాఁగఁ

దనదానచాతురి తనదానచాతురి
        దారిఁ బ్రత్యర్థివర్ధన మొనర్ప


గీ.

ఘనత గాంచును శిబికర్ణకామధేను
కల్పకద్రుమ కైమర్థ్యకారి భూరి
వితరణామోదితాశేషవిబుధసుకవి
శిష్టనుతిహారి వంగలసీనశౌరి.

54


శా.

లోకాలోకము పాదుసప్తజలధు ల్తోయంబు శేషుండు వే
రాకు ల్దిక్కులు హైమశైలము పటీరాగం బుపఘ్నంబు లై
యాకాశం బురుకాయమానముగ సొు పౌతద్యశోవల్లికిన్
రాకాచంద్రుడు పండు తత్రసభుజుల్ రక్షింతు రాసీనయన్.

55


సీ.

సకలసామాజికసంఘంబుమదికి నిం
        పుగ బృహస్పతిలీల బుద్ధిఁ దెల్పు
గార్యఖడ్గక్రియాఘటనాఘటనశక్తి
        దొరను ప్రమోదంబుఁ బొరయఁజేయు
జననంబు మొదలుగా సకలజనోపకా
        రంబు వ్రతంబుగా రహి నొనర్చు
జనకునివైఖరి జ్ఞానకర్మప్రప
        దనభక్తిగురునిష్ఠ లొనర మెలఁగు


గీ.

ధర నుపనయనకన్యకాదానశతము
లన్నదానంబు జలదాన మాదియైన
దానము లొసంగుఘనుఁ డభిమానధనుఁడు
శ్రీపతినిభుండు వంగలసీనవిభుఁడు.

56


శా.

హాహాహూహులు గానగర్వమున హాహాహూహు వంచున్ స్వరా
రోహప్రక్రియఁగాఁ దురంగతను లై రూప్యంబు నానన్ వృథా
సాహంకారులు మర్త్యగాయకులు జోడా నీకుఁ బాండ్యేశ్వర
స్నేహాలంకృత! వంగలాన్వయమణీ! సీనా! కవిగ్రామణీ!

57


ఉ.

మానుజరూపమన్మథ! రమానుజకీర్తివతంసితాశ! భీ
మానుజశౌర్య! [1]నీవు విని మాను జయింతువు దత్తి నీతి రా

మానుజనుశ్చరిత్ర కృతి మానుజనాథుల నీమహోభర
మ్మానుజగానఁ గానము సమాను జనున్ భువి నీకు సీనయా.

58


చ.

అని జను లెన్న వన్నెఁ గని యాచకవాచకమేచకీచ్ఛటా
ఘనఘనసంగవైఖరిని గామితకామితసృష్టి నించుచున్
దనరువలంతి పాండ్యవసుధావసుధామునిమన్నన ల్వహిం
చినదొరలందు మేటి యగు చిమ్మనమంత్రికిరీటి వర్ధిలున్.

59


చ.

స్ఫుటపటిమార్భటీనినటిషుస్మరజిన్మకుటీపుటీసుధల్
ఘటముల గుమ్మరించి రన ఘమ్మన రాట్సభ జంత్రగాత్రముల్
పటుమతి విన్కిఁ జేయుదు శలాపటలిన్ సలిలంబు చేసి వేం
కటపెరుమాళ్ళధీరుఁడు జగన్నుతుఁ డౌ సరసత్వ మేర్పడన్.

60


క.

ఇళయపెరుమాళ్లు రాముని
వెలయన్ భజియించురీతి వేంకటపెరుమాళ్
సలలితగీతకళానిధి
విలసితమతిఁ గొలువ సీనవిభుఁడు చెలంగున్.

61


చ.

జనకునకున్ మది న్ముద మెసంగఁగ భూస్థలజాతయై మహా
వనమతి గాంచి పుణ్యజనవర్ధనతం దగి రామభద్రుఁడే
యనఁ దగుసీనయన్ బరిణయం బయి సీతమ శాస్త్రవాసనా
ఘనులను బుత్రులం గనె నఖండితకీర్తి జగంబు నిండఁగన్.

62


చ.

కులమును శీలమున్ విభునికూరిమి బాంధవపోషణంబు ని
శ్చలమృదుసూక్తి సత్త్వమును జక్కదనంబును గల్గి యొప్పుచున్
సలలితచర్య భర్తృపదసారసభక్తిజితార్య యార్య రం
జిలు నలసీనయార్యుసతి సీతమ శీతమయూఖకీర్తియై.

63


క.

అనుజుఁడు లక్ష్మణుఁ డై తగ
ననయభరతకలన నిత్యశత్రుఘ్నమతిం
దనరుచు సీతాసతితో
మను సీనయ రామచంద్రమంజులయశుఁడై.

64


సీ.

సప్తకులాచలీసౌధదేశంబుల
        నెందాఁక నవని యానంద మొందు
నవనీవధూమణిహవణించుకాంచి యై
        యంభోధి యెందాఁక నలరుచుండు

నంభోధిశయనుఁడై యజుల సృజించుచు
        నెందాఁక శ్రీహరి యెలమిగాంచు
శ్రీహరియురమందె శృంగార మెసఁగంగ
        నెందాఁక యిందిర యింపు మీఱు


గీ.

వెలయు నందాఁక వంశాభివృద్ధి గల్గి
సకలసంపత్పరంపరాసాంద్రభోగ
బహుసుపుత్త్రాయురారోగ్యభాగ్యగరిమ
శేముషీదేవతామంత్రి సీనమంత్రి.

65


షష్ఠ్యంతములు

క.

ఏవంవిధ గుణమణికిన్
శ్రీవంగలకులపయోధిచింతామణికిన్
ధీవిజితాదిమఫణికిన్
శ్రీవైష్ణవమతకువలయశీతలఘృణికిన్.

66


క.

శ్రీమన్నరురంగాధిప
నామాంకితగేయకల్పనాస్తుతమతికిన్
రామానుజవిజయాంకగ
వీమధురసమోదమాన వేంకటపతికిన్.

67


క.

ఆహవసాహసతౌరా
షాహునకున్ సిద్ధవిజయసన్నాహునకున్
స్నేహబహూకృతి సుకవి
వ్యూహునకు వసంతవితరణోత్సాహునకున్.

68


క.

వేకటరాఘవమఖికుల
పంకజభానునకుఁ గురునృపతిమానునకున్
గంకటవత్సేనునకు ని
రంకుశదాసునకు సజ్జనాధీనునకున్.

69


క.

వాధూలవరదదేశిక
సాధిష్ఠకృపాకటాక్షసంపాదితమే
ధాధీస్వోభయవేదాం
తాధికసామ్రాజ్యసంభృతానందునకున్.

70

  1. ‘నీవును సమాను జయింతువు నీదుదంతి’, ‘నీవు వినుమానుజయింతువు దత్తి
    నీది’ అని పాఠములు. అర్థము చింత్యము.