పీఠిక

శ్రీ యుత వంగూరుసుబ్బారావుగా రాంధ్ర వాఙ్మయమునకు జేసిన సేవకు గృతజ్ఞతను దెలుపుట కీగ్రంథ పీఠికను వ్రాయబూనితిని. గతసంవత్సరమునం దాంధ్రవాఙ్మయ సేవాపరాయణులైన శ్రీయుతులు కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారు, లచ్చారావుగారు, సుబ్బారావుగారు పరమపదించుట యాంధ్రలోకమునకు గలిగిన దురదృష్టము. సుబ్బారావుగారు ముష్పదియేడవయేటనే పరమపదము చెందిరి. ఈ స్వల్పకాలమునందే సుబ్బారావుగారు “ప్రభాతము, వేమన, ఆంధ్ర క్షత్రియులు, వసంతలేఖలు, ఆంధ్ర వాఙ్మయచరిత్రము, శతకకవులచరిత్రము” మొదలగుగ్రంథములను వ్రాసి యాంధ్రభాషకు విశేషమైన సేవనుజేసి యాంధ్రవాఙ్మయమునందు స్థిర ప్రతిష్ఠను బడసిరి. సుబ్బారావుగారి మిత్రులకును ఆంధ్రభాషాభిమానులకును వారి యకాలమరణము విచారమును గలుగజేసినది, ఆంధ్రభాష నిజసేవాపరాయణులు లేకను తనప్రతిభను గోల్పోవుచున్నసమయమునందు సేవాపరాయణుల నిర్యాణము భాషాభిమానులకు విచారకారణం బగుచున్నది. సుబ్బారావుగారి గుణములందు మాతృభాషాభిమానమును ఆత్మగౌరవాభిమానమును గణనీయములు. ఆంధ్రనామ స్మరణము సుబ్బారాపుగారి కావేశమును గలుగజేయుచుండెడిది. ఏప్రాంతములకు బోయినను సుబ్బారావుగా రాంధ్రులప్రతిష్ఠను సమర్థించుట కధికోత్సాహమును గనుపరచుచుండిరి. పుసహా, కలకత్తానగరములందు జరిగిన పరిశోధక మహా సభలయం దాంధ్రులవ్యక్తిత్వమును బ్రతిపాదించుటకు జేసిన ప్రయత్నములు వారియాంధ్ర త్వాభిమానమును విశద ముచేయుచున్నవి. అధికారప్రాపకముగల ద్రవిడప్రముఖుల పనుగడలను బ్రతిఘటించి యాంధ్రశిబిరములను స్థాపించి యాంధ్ర వ్యక్తితమును వ్యక్తముచేసిరి. ఈయాంధ్రత్వాభిమానము వారిగ్రంథములందును జీవితవిధానమునందును బ్రత్యక్షమగుచున్నది. ఈయభిమానము వలన సుబ్బారావుగారికి ప్రతికూలానుకూలపక్షము లేర్పడినవి. సుబ్బారావుగారి యాత్మగౌరవాభిమానము వారి జీవితమునందలి వ్యత్య స్తములకు గారణంబైనది."

ఆంధ్ర దేశమునందు సారస్వత జీవసము దురారాధ్యముగ నున్న్న ది. సరస్వతీ ప్రసన్నులకు లక్ష్మీప్రసన్న మపురూపముగ నున్నది. సరస్వతీదేవి నుపాసించుటకు గంకణమును గట్టుకొనినవారలకు లక్ష్మీకటాక్షము దుర్లభముగనున్నది. శ్రీమంతులను, రాజులను, మహారాజులను నాశ్రయింపకను సరస్వతీదేవి నుపాసించుట కవకాశములులేవు. పూర్వ యుగములం దట్టి సేవ కవకాశములుండినను భౌతికాడంబరమయమైన కలియుగమునందు బొత్తిగా నవకాశములులేవు. ఈ కారణమువలననే సుబ్బారావుగారివంటి భాషాసేవకులకు సారస్వతజీవనము దుర్లభమై అకాలమృత్యువు సంప్రాప్తమైనది. సుబ్బారావుగారు పిఠాపురమునందును జెన్నపురియందును జీవయాత్రను గడుపుచున్నపుడు వారికిగలిగిన యసంతృప్తి వారియకాలమరణమునకు మూలము. పిఠాపురమునందు బ్రతిభావంతులైన శ్రీయుతపానుగంటిలక్ష్మీనరసింహము పంతులుగారికి బ్రియశిష్యులై రచనా కౌశలమును బడసిరి. శ్రీయుత చెలికాని లచ్చారావుగారి యాదరణపోషణముల క్రింద నాంధ్రపరిశోధక మహామండలిని స్థాపించి దానినిర్వహణమునం దపారమైనశక్తిని గనుపరచిరి. ఆంధ్ర పరిశోధకమండలియందు లభించిన యనుభవము వేమన, యాంధ్రవాఙ్మయచరిత్రము, శతకకవులచరిత్రము మొదలగురచనలకు దోడ్పడినది. రసానుభవము కావ్యమునకు బ్రయోజనము. నవరసములందును శృంగారకరుణరసములు ప్రధానములు. శృంగారకరుణరసములు కామపరము లైనపుడు బంధనమునకును, దైవపరములైనపుడు మోక్షమునకును మూలము లగుచున్నవి. శృంగారకరుణామూర్తియైన భగవంతుని శృంగారకరుణా లీలావిలాసము లనంతములు. అనంతమైన శృంగారకరుణావిలాసముల యానందానుభవమున కనన్యమైనభక్తి సాధనముగ నున్నది. అనన్యమైన భక్తిపారవశ్యానందమును వర్ణించుటకు శతకములు యోగ్యముగ నున్నవి. కవు లిష్టదేవతాప్రార్థనమును బలువిధములను చేసి తరించుటకు శతకము లుత్కృష్టసాధనములు. సర్వేశ్వర శతకము, కూర్మశతకము, నారాయణశతకము, రామతారకశతకము, దాశరథిశతకము, కాళహస్తీశ్వరశతకము మొదలగు శతకములందల ఈశ్వరస్తవములు భక్తి రసానందమును గలుగ జేయుచు ముక్తిమార్గమును గఱపుచున్నవి. కవులు తమతమగ్రామములందు వెలసిన పరమేశ్వరావతారములను శతకరూపమున బ్రార్థనచేయుచు గవిత్వమును సార్ధకము చేయుచున్నారు. భక్తహృదయావేశమును దెలిపెడిశతకము లనేకము లాంధ్రభాషయందు గలవు. శతకముల పరిశీలన మాంధ్రహృదయ వికాసమును భాషావికాసమును విశదము చేయగలవిధమును సుబ్బారావుగారు గ్రంధమునందు విశదముచేసిరి. గ్రంధము శతకవాఙ్మయము వృద్ధి నొందినవిధమును జక్కగ వివరించినది. శతకములందు భక్తిశతకములే కాకను నీతిహాస్య శృంగారశతకములునుగలవు. పండ్రెండవశతాబ్దియందు భక్తిభావముతో నారంభమైన శతకవాఙ్మయము పదునేడవశతాబ్దియందు శృంగారరూపమును దాల్చినది. శతకకవులచరిత్రము మతసిద్ధాంతము లందును సాంప్రదాయములందును సాంఘికవ్యవస్థలందును గలిగిన మార్పులను విశదముచేయుచు నాంధ్రహృదయ పరిణామమును నిరూపించుచున్నది. ఈ పేజివ్రాయబడి ఉన్నది. ఈ పేజి వ్రాయబడిఉన్నది. కావ్యాదులను రచియించిరనుట యనుభవమునకు విరుద్ధముగ నున్నది. ధూర్జటి ధనార్థియై శ్రీ కాళహస్తీమాహాత్మ్యమును, మోక్షార్థియై శ్రీ కాళహస్తీశ్వర శతకమును రచియించిన విధమును గ్రంథములే తెలుపుచున్నవి. శతకముల రచనావిభాగములును నీయర్థమును బరిస్ఫుటము చేయుచున్నవి. నారాయణశతకమునందుగల శతకవిభాగము శతకప్రయోజనమును దెలుపుచున్నది.

“రమణీయంబుగ నాదిమంబు నవతారమ్ము౯ భవదివ్యరూ
 పము నామామృతము౯ దలంప దశకప్రాప్తయ్యె కృష్ణావతా
 రము సుజ్ఞానము మోక్షము౯ ద్వివిధసంప్రాప్తి౯ శతాంధ్రాఖ్య కా
 వ్యము నర్పించితి మీ పదాబ్జములకు౯ వైకుంఠ నారాయణా!

నారాయణశతకము ప. 101) శతకకవులచరిత్ర 92 వ పేజి.)

శతకము 1. ఆదిదశకము 2. అవతారదశకము 3. దివ్యరూపదశకము 4. నామదశకము 5. కృష్ణావతారదశకము 6. జ్ఞానవింశతి 7. మోక్షవింశతి యని ఏడుభాగములుగను విభజింపబడినది. శతకము భగవదవతారవర్ణనములతో నారంభమై మోక్షాపేక్షతో నంతమునొందుచున్నది. శతకములందు గామసూత్రాత్మకమైన కథలు వర్ణనాదులు లేకపోయినను భాగవతాత్మకమైన కథలు వర్ణనలు గలవు. భాగవతపరములైన పద్యములందుగల పరమేశ్వర లీలా విలాసములవర్ణనలు భావగీతభావవర్ణనముల కతీతమై వ్యక్తిత్వమును భక్తిరసావేశమును గలుగజేయుచున్నవి. భావగీతములు భౌతికానందమును, శతకము లాధ్యాత్మికానందమును గలుగజేయుచున్నవి. ప్రాచ్యసంస్కారపరములైన శతకములకును పాశ్చాత్యసంస్కారపరములైన భావగీతములకును సామ్యత్వము దుర్లభము. భక్తిజ్ఞాన వైరాగ్యబోధకములైన శతకము లాంధ్రభాషాభూషణములై పండితపామరజనులకును బాలబాలికలకును బఠనార్హములుగ నున్నవి. సుబ్బారావుగారి మేధాశక్తులందు సంభావనాశక్తి విశేషము. పరిశోధనలం దొకవిశేషము గనుపడినపుడు పరమోత్సాహభరితులై కావ్యసిద్ధాంతనిర్మాణముల కుపక్రమించుచుండిరి. ఈయూహాశక్తియే సుబ్బారావుగారి వ్యక్తిత్వమును స్థాపించి ఖండనమండనములకును దూషణభూషణములకును గారణంబైనది. ఆంధ్రక్షత్రియులు, వేమన, ఆంధ్రవాఙ్మయచరిత్రము, శతకకవులచరిత్రము, వసంతలేఖలు మొదలగు గ్రంథములు సుబ్బారావుగారి యూహాశక్తిని విశదముచేయుచున్నవి. వీరు సామాన్యవిషయాధారమున మహానిర్మాణములనుజేసి పండితుల ఖండనమండనములకు బాలగుచుండిరి. ఆంధ్రవాఙ్మయచరిత్ర పీఠిక యందు శ్రీయుత కట్టమంచి రామలింగారెడ్డిగారు వ్రాసినభావము లీ విషయమును స్పష్టముచేయుచున్నవి.

“వాఙ్మయ చరిత్ర సంఘశాస్త్రసంబంధిగా వ్రాయఁబడియుండుట శ్లాఘనీయమైన విశేషము. అనేకస్థలముల సుబ్బారావుగారు నూతన యోజనముల ప్రయోగించి క్లిష్టార్థములకు నన్వయమునద్భుత భంగి కల్పించియున్నారు. ఇవి మొత్తముమీఁద వెఱ్ఱియూహలకుఁ జేరినవిగాక విమర్శనాపద్ధతి ననుసరించిన దృఢసత్త్వములుగా నున్నవి.” రామలింగారెడ్డిగారు వాఙ్మయచరిత్ర పీఠికయందు వ్రాసిన భావములు శతకకవులచరిత్రమునకును నన్వయించుచున్నవిధము శతకకవులచరిత్ర పఠనము విశదము చేయుచున్నది.

బ్రహ్మశ్రీవేదము వేంకటరాయశాస్త్రిగా రీగ్రంథమునకు బీఠికనువ్రాయుట కనుగ్రహించిరి; కాని, కారణాంతరములవలన నాపని సంభవముగాలేదు. గ్రంథము ముద్రితమై పదిమాసములైనను బీఠికకై ప్రచురణము నిలిచినది. సుబ్బారావుగారు ముద్రితమైన కాగితములను నాతావున కంపి పీఠికను వ్రాసి ప్రచురింపుమని కోరుచుండిరి. కాని, నేనట్టి సాహసమునకు బూనుకొనలేదు. సుబ్బారావుగారిప్రోద్బలముననే నేను శతకములను బ్రత్యేకముగ కవులచరిత్రములుగల పీఠికలతో ప్రచురించుటకు బూనుకొంటిని. వృషాధిప సర్వేశ్వర నారాయణ రఘువీర కాళహస్తీశ్వర దాశరథీశతకములు మొదలగు పదిశతకములను బీఠికలతో బ్రచురించితిని. సుబ్బారావుగారు జీవించియున్నపుడు నేను బీఠికను వ్రాయుటకు నిరాకరించియును వారి మరణానంతరము గ్రంథపరిచయమునకు బీఠికనువాయుట యవసరంబై పూనుకొనినందులకు బండితులు మన్నింతురుగాక!

సుబ్బారావుగారిప్రయత్నఫలమును, నాకృతజ్ఞతను వెల్లడిచేయుట కీపీఠికను వ్రాయుటకు బూనితిని. సుబ్బారావుగారు గ్రంథమునకు 44 పుటల ప్రవేశవ్యాసమునువ్రాసి శతకవాఙ్మయ చరిత్రము నాంధ్రలోకమునకు బరిచయముచేసిరి. గ్రంథము 540 పుటలనుగలిగి భావగర్భితముగ నున్నది.

ఆంధ్రవాఙ్మయమునందు బురాణములు కావ్యములు ప్రబంధములు శతకములు నవలలు నాటకములు మొదలగు వ్యక్తిత్వముగల విభాగములు గలవు. ఆవిభాగము లన్నియును బ్రత్యేకచరిత్రము నపేక్షించుచున్నవి. ఆ విభాగములందు శతకవాఙ్మయ మొకఘట్టముగ నున్నది. ఆంధ్రశతకములు ప్రాకృతసంస్కృత గ్రంథములపరిణామములైనను ప్రత్యేకవ్య క్తిత్వమును గలిగి యాంధ్రలోకాదరణమును బడసినవి. శతకవాఙ్మయము పండితపామరులకు బ్రియతరమైనను, లాక్షణికుల యాదరణమునకు విశేషముగ బాత్రము గాలేదు. లక్షణగ్రంథములను వ్రాసిన యప్పకవియనంతామాత్యాదులును గవులచరిత్రను వ్రాసిన వీరేశలింగము పంతులుగారును శతకవాఙ్మయము నాదరించియుండలేదు. ఆలోపమును దీర్పుటకు సుబ్బారావుగా రీగ్రంథమును రచించినటులు వారిపీఠిక విశదము చేయుచున్నది. శతకవాఙ్మయ మాంధ్రభాషయందపారముగ నున్నది. సుబ్బారావుగారు 600 శతకములను జూచినటులు వాసియున్నారు. ఇంకను బరిశోధన చేయవలసిన శతకము లనేకములు గలవు. ప్రస్తుతముకనుషడుచున్న శతకములందు పాల్కుర్కి సోమనాథవిరచితమైన వృషాధిపశతకము ప్రాచీనశతకము. ఇది పండ్రెండవశతాబ్దికి జెందినది. అప్పటినుండి నేటివరకును శతకరచన లవిచ్చినముగ గనుపడుచున్నవి. ఆంధ్రభారతకాలమునుండియు నవిచ్చిన్న జీవితముగల శతక వాఙ్మయ మాంధ్రవాఙ్మయపరిశోధకులకును భాషాభిమానులకును నాదరణీయముగ నున్నవి. ఆంధ్రవాఙ్మయమునందు శతకవాఙ్మయస్థానమును ప్రయోజనమును నిర్ణయించుటయె శతకకవుల చరిత్రమునకు బ్రయోజనము. కావ్యప్రయోజనము నిర్ణయించుటయందు పండిత ప్రయోజనములను గ్రంథబాహుళ్యమును రసాత్మకమునుబట్టి నిర్ణయించుట యాచారమైనను కేవలము రసపోషణమూలముననే యాదరణమును బడసిన కావ్యములు గలవు. మేఘసందేశము చిన్నదైనను కావ్యముగ బరిగణింపబడుచున్నది. “రసాత్మకమైనవాక్యము" కావ్యమనియును, “రమణీయార్థప్రతిపాదకమైనశబ్దము” కావ్యమనియును,

"శ్లో. నిర్దోషలక్షణవతీ సరీతి ర్గుణభూషితా,
     సాలంకార రసానేక వృత్తి ర్వా క్కావ్యనామభాక్."

కావ్యమనియును, లాక్షణికులు వ్రాసియున్నారు. ఆంధ్రలాక్షణికగ్రంథకర్తలు శతకములను జాటుప్రబంధములందు జేర్చిరి. విన్నకోటపెద్దన్నగారు శతకములను క్షుద్ర కావ్యములందు జేర్చిరి. శతకముల కావ్యవిభాగమును నిర్ణయించుటకు గావ్యప్రయోజనమును నిర్ణ యిచుట సమంజసము, మమ్మటాచార్యుడు నిర్ణయించిన కావ్యప్రయోజన మాదరణమును బడసినది:

శ్లో. కావ్యంయశనే ౽ర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే,
    సద్యః పరనిర్వృతయే కాంతాసమ్మిత తయోపదేశయుజే.

కావ్యప్రయోజనము రసౌచిత్యమూలమున స్థాయీభావమునుగలుగ జేయుటయైనను నయ్యది పురుషార్థసిద్ధికి సాధనము గావలయును. పద్యభేదమును సంఖ్యనుబట్టి కావ్యస్వరూపమును నిర్ణయించుట ప్రయోజనకరముగాదు. భావానుసంధానము లేనిషద్యముల సముదాయము కావ్యముగ బరిగణింపబడదు. భావానుసంధానముగల మేఘదూతము చిన్నదైనను కావ్యముగ బరిగణింపబడుచున్నది. రసౌ చిత్యముగల భావగీతములును గావ్యవిభాగములుగ బరిగణింపబడుచున్నవి.

సుబ్బారావుగారు శతకములు భావగీతములను బోలి యావాఙ్మయశాఖకు జెందినవని నిర్ణయించిరి. ఆంగ్ల వాఙ్మయరీతులలక్ష్యముతో శతకవాఙ్మయరీతిని బరిశీలించినపు డీనిర్ణయము యుక్తముగ దోచినను నీపోలికయును నిర్ణయమును నసంగతములు. భావగీతములకును శతకములకును బోలికయుండదు. భావగీతములందు గవి ప్రకృతిస్వరూషముల గుణసౌందర్యములనుగాని మనోభావములనుగాని మనోహరముగను వర్ణించుచు భావవికాసమును గలుగజేయును. భావగీతములుగలుగజేయు భావవికాసము మానసికానందమును గలుగజేసినను నాత్మానందమును గలుగజేసి పురుషార్థమునకు బ్రయోజనకరముగాదు. శతకములు భావగీతముల కతీతమైన యాత్మానందమును గలుగజేయుచు పురుషార్థమును బడయుటకు సాధనములుగ నున్నవి. శతకములు సామాన్యముగను భక్తిశతకములుగ నున్నవి. పురుషార్థమునకు బరమావధియైన మోక్షప్రాప్తి శతకమునకు బ్రయోజనము. కవులుధనకనకవస్తువాహనములనర్థించుచు ప్రబంధాదులను వ్రాసినను మోక్షకాములై శతకములను వ్రాయుచుండిరి. కవులు చిన్నతనమునందు శతకములను బెద్దతనమునందు గ్రంథము నాలుభాగములు గలిగి 200 శతకకవుల చరిత్రనుగలిగి యున్నది. ప్రథమభాగమునందు 1150-1500, ద్వితీయ భాగమునందు 1500-1700, తృతీభాగమునందు 1700-1800, చతుర్థభాగమునందు 1800-1900 వరకును జీవించిన శతకకవుల చరిత్రములుగలవు. శతకకవులజీవితములందలి సుబ్బారావుగారి నూతనాన్వేషణములు వారిపరిశోధనసామర్థ్యమును విశదము చేయుచున్నను గ్రంథబాహుళ్య మనవసరముగ గలిగినది. సుబ్బారావుగారి గ్రంథరచనాసక్తివలన బునరుక్తి దోషమును నిర్నిమిత్తమైన బాహుళ్యమును గలుగుచున్నవి.

శతకకవులచరిత్రమును ఆంధ్రవాఙ్మయచరిత్రమువలె నాంధ్రవాఙ్మయమునకు సుబ్బారాపుగారు సమర్పించిన నూతనాలంకారము. గ్రంథము సుబ్బారావుగారి రచనాసామర్థ్యమును బరిశీలనకౌశలమును విశదముచేయుచు నవవిధానమును సూచించుచున్నది. అయిదారువందల శతకములను నితరగ్రంథములను బరిశీలించి విషయమును సమన్వయముచేసి వ్రాయుటయందు గల పరిశ్రమను బండితులు గ్రహింవ నోపుదురు. నూతనరచనలయందును గల్పనలందును లోపములు సహజముగ గనుపడుచుండును. భావికాలమునందు శతకకావ్యాభిమానులీ లోపములను సవరింపనోపుదురు. ఆంధ్రవిద్యావంతులకు జరపరిచితమైన సుబ్బారావుగారి శైలి, రచనాసామర్థ్యము, నితరగుణములును జర్చించి వర్ణించుట యనవసరము. ఆంధ్రవాఙ్మయసేవకై జీవితమును సమర్పించిన శ్రీయుత వంగూరి సుబ్బారావుగారి కృతికి చిరంజీవిత్వమును వారి యాత్మ కానందమును విశ్వకళ్యాణమూర్తి విశ్వేశ్వరు డనుగ్రహించుగాత!

కా. నాగేశ్వరరావు.