వేమన/మొదటి యుపన్యాసము
మొదటి ఉపన్యాసము
ఉపోద్ఘాతము
వేమన ఆంధ్రులలో సాటిలేని వ్యక్తి. అతీందియములైస తత్త్వములను దెలిసికొనవలెనను నాశ, వాని ననుభవ పూర్వకముగా సాధించు సాహనము, తనకుఁ దెలిసిస వానిని నిర్భయముగా ప్రపంచమునకు భోధించు దైర్యము, దానికి సాధనమై యిరుప్రక్కలందును మఱుఁగులేని మంచిపదనుగల చురకత్తివంటి కవితాశక్తి, దానికి మెఱుఁగిచ్చునట్టి సంకేత దూషితము కాని ప్రపంచ వ్యవహారము లందలి సూక్ష్మదృష్టి, గాయపుమందు కత్తికేపూసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు 'హాస్య కుశలత - ఇవన్నియు వేమన్నను సృష్టిచేయునపుడు బ్రహ్మదేవఁడుపయోగించిన మూలద్రవ్యములు. తత్వ విద్యార్థులున్నారు కాని వారిదంతయు పుస్తక పాఠము.
వారి శక్తి యంతయు ఇతరులు చెప్పిన దానిని పల్లించుటలో ముగిసిసది. యోగమును సాధించు వీరులున్నారు గాని వారిలో ననేకులకు మాటలాడుటయే రాదు ; వచ్చినను ఇతరులకు బోధించుటకు కాలము కర్చుపెట్టుట నష్టమని భావించువారే యనేకులు ; తక్కిన వారు చాలవఱకు తాము సత్యమని నమ్మినవానిని గూడ
ఇతరుల మనసు నొచ్చనేమోయని చెప్పక తప్పించుకొని తిరుగునట్టి 'ధన్యులు". కవులు మసలో దండిగ-కావలసినంతకన్న ఎక్కువగానే-యున్నారు. కాని వారిది మసన ప్రపంచము గాదు. గంధర్వనగరము. ఇక తిట్టుకవిత్వము తెలుగు వారు పెట్టిన భిక్షయే ; కవిత్వమును తిట్లకై యుపయోగించుట తెనుగు జాతిలోని
విశేష గుణము! కాని యా తిట్లలో స్వామున్నంత పరార్థము లేదు. 'నాకియ్య లేదని తిట్టినవారే కాని 'నీవు చెడిపోవుచున్నా' పని తిట్టిన వారరుదు. ఇఁక హాస్యమా ? అది మన తాతలగు సంస్కృతము వారికే రాదు, మన నెట్లు వచ్చును? నవ్వించు వారున్నారు; అసహ్యముతో నవ్వదుము; వెక్కిరింతలకు నవ్వదుము : అంతే కాని నయముతోడి నవ్వు మనకింకను ఎవరైన నేర్పవలసి యున్నది. పై గుణము లన్నియు ఒకచో నేకీభవించినమూర్తి వేమన తప్ప తెలుఁగు వారిలో ఇతరుఁడు నాకంటఁబడలేదు.
ఆంధ్రులలో కొన్ని విచిత్రములు గలవు. వానికి తృప్తికరముగా నిదివఱ కెవరును సమాధాన మిచ్చి యుండలేదు. భరతఖండముస ప్రసిద్ధములగు నన్ని భాషలలోను ప్రవేశించి అసంఖ్య గ్రందములను వ్రాసిన జైనులు మన భాషలో గ్రంథములు రచించినట్లే కానరాకపోవట యొకటి. ఆంధ్రభాష ద్రావిడ శాఖనుండి చాలా నాళ్ళక్రిందనే చీలి వేఱుపడినదని స్పష్టముగా సూహింప వీలున్నను, పదునొకండవ శతాబ్దికి వెనుక సారస్వత వ్యాపారమే యందులో జరిగినట్లు తెలియక పోవుట వేరొకటి, సంస్కృత వాజ్మయములో చక్కని నాటక రచన రెండువేల యేండ్లకు ముందునుండి జరిగివచ్చుచున్నను, ఆ వాజ్మయమునే ఆధారముగాఁ గొని శబ్దము, అర్థము, భావముఁ గూడ అనువాదము చేయుచు వచ్చిన యాంధ్రులలో ఒక్కనికైన మొన్నటిఱకు అట్టి నాటకములను తెనుఁగున గూడ వ్రాయవలయునను నాశ జనించినట్లే తోఁపకపోవుట మఱియొకటి !
ఈయన్నిటి కంటె విచిత్రమైన విషయము : సుప్రసిద్ధమత స్థాపకు లెవరును ఆంధ్రులైపుట్టి ఆంధ్రదేశమున మత బోధచేయకపోవుట, ప్రాచీన కాలమున - అనఁగా ఉపనిషత్తుల కాలమున - శిష్యులే గురువును వెదకు కొనిపోయి తత్త్వబోధను బొందుచుండిరింతే ; కాని తత్త్వజ్ఞఁడితను లున్నచోటికిఁ బోయి బలవంతముగా నైనను బోధించి మతపుంగపులను తయారుచేయ మొదలిడినవాఁడు. బుద్ధుఁడే కాఁబోలు. వానికి తరువాతివారిలో మొదటివ్యక్తి శంకరాచార్యులు. ఇతఁడు మళయాళమున జనించి, ఆసేతుహిమాచలము సంచరించి, యద్వైత ప్రధానముగా వైదిక మతమును బోధించి, యందందు మఠములను స్థాపించెను. ఇతని ముఖ్యపీఠమైన శృంగగిరి జన్మదేశముసకు సమీపమంచే కన్నడ దేశమందున్నది. కాని యాంధ్రదేశమం దీతనిమఠముగాని, సంచారము చేసినట్లు గుర్తులు గాని కానరావు. రామానుజాచార్యులు ఆరవదేశమందు జనించెను. శంకరాచార్యుల వలె భరతఖండ మంతయు సంచరించి, వైదికమతము భక్తి ప్రధానమైన విశిష్టాద్వైత మని బోధించి, మఠము లందందు స్థాపించెను గాని, యితని కాంధ్రదేశమందు సంచారము చేయునవకాశము లభింపలేదు. మఱి ఆంధ్రులు తన్ను భయపెట్టఁగా కన్నడ దేశమునకు పాఱిపోవలసి వచ్చెను. శుద్ధకర్ణాటకుఁడగు ఆనందతీర్ధాచార్యుల ద్వైతమత వ్యాప్తి కర్ణాట మహారాష్ట్ర దేశములను దాఁటినట్లే కాసరాదు. వీరిపలె వైదిక మతమునే వేఱువేఅు విధముగా బోధించిన నింబార్కాచార్యులును, వల్లభాచార్యులును ఆంధ్రజాతికిఁ చేరినవారైనను వారి మతమంతయు ఆంధ్రదేశము వెలుపలనే యున్నది. ఏ కారణముచేతనైనను స్వదేశము, స్వజాతి వారికి పనికి రాదయ్యెను. ఇ(క బసవేశ్వరుఁడు ఆంధ్రుఁడనుకొనుటలో అమూస మొలత యున్నదో ఆనత్య మంతయున్నది. అతని వ్రాఁతలన్నియు కన్నడమందే కలవు. శ్రీవైష్ణవుల కరవమువలె నేఁటికిని వీరశైవులకు కన్నడ మభిమాన భాష.
ఇట్లగుట కేమి కారణము ? తెలుఁగు వారికి తీవ్రములగు తత్త్వములను విచారించుటకుఁ గావలసిన మేధాశక్తి లేదని చెప్పట సాహసము. వారికి తత్త్వవిచారము లందు రుచిలేదని యూహించుట యన్యాయమగును. మతమనుసది, యొకఁడు తానెఱి(గినది యింకొకనికిఁ జెప్పి, యతఁడు వినకున్న సియిష్టమని వెడలి పోవుట కాక, యొకవ్యక్తి యొకసంఘమునకే తత్త్వమును దెలిపి, దానినాశ్రయించినందుకు గుఱుతుగా వేషము, భాష, ఆచారము మొదలగు వానియందు ఆ సంఘమున కంతయు మార్పును గలిగించునది యగుటచే, సహజముగా స్వాతంత్ర్యరక్తియు, స్వాభిమానమును బలముగాఁగల యాంధ్రజాతిని గొట్టెలమండలవలె నొక మతపు దొడ్డిలోఁ దోలుట కే తత్త్వజ్ఞునికిని సాధ్యముగాక పోయెనేమో ! వివేకానందుఁడు, రామతీర్థస్వామి మొదలగు మహాపురుషు లెన్నియు పన్యాసములిచ్చి యెంతప్రయాస పడినను, స్వతంత్రబుద్ధి బలసిన పాశ్చాత్యజాతి హిందూమతము నాశ్రయింపఁ దలఁపలేదని మనమెఱుఁగుదుము గదా, మఱియు మొదటినుండి రాజకీయ విప్లవములచేతను, ఆంతరంగ బహిరంగ కలహములచేతను, నెమ్మదిని శాంతిని క్రమముగా ననుభవించిన వారు కారు గావున, మసవారికీ తొందఱలే చాలినన్ని యుండుటచేత, పారలే"కిక విషయములను తత్త్వవిషయములను విమర్శించి నిర్ణ యించునంతటి యోర్పు లేకుండును. ఆంధ్రులు కొంత నెమ్మది ననుభవించిన కాలము కాకతీయుల సామ్రాజ్యమందును, విజయనగరపు సా మ్రాజ్యకాలమందును, అందు మొదటి కాలమున వీరశైవమతమును, రెండవకాలమున రామానుజమతమును ఆంధ్రదేశమునఁ బ్రవేశించి నిల్చినవి. కాని యామాత్రము గూడ మతకర్తల మూలమునఁ గాక, వారి యనుయాయులగు మత ప్రచారకుల మూలమున వచ్చి నందువలన, ఆంధ్రజాతియందు పైమతములకు ధృడమైన నిలకడ కలుగలేదు. మొదటినుండియు తత్త్వవిచారమును మతమును ఎక్కువగాఁ పట్టుకొన్నవారు బ్రాహ్మణులు. ఆంధ్ర బ్రాహ్మణులలో మక్కాలుమ్మువ్వీసముము అందఱు అద్వైతులే. వీరందఱును ప్రాయశః దేశాంతరమునుండి వలసవచ్చిచేరి నిలిచిన శాంకరమతాను యాయులు. తెనుఁగు దేశమందలి మాధ్వ రామానుజీయ బ్రాహ్మణు లెవరుగాని నిజమైన యాంధ్రులుగారు. ఇఁక బ్రాహ్మణేతరులలో వీరశైవముగాని వీరవైష్ణవము గాక వేరొకటి నిలువలేదు. భస్మధారణముచేసిస పాపమని గాని, నామాలువేసిన నరకమనిగాని తీవ్రముగా నమ్మిన బ్రాహ్మణేతరు లాంధ్రులలో నెక్కువగాలేరు. కావుననే శ్రీశైలము, ఆహెబిలము తప్ప సుప్రసిద్దమైన శైవవైష్ణవక్షేత్రము లేవియు తెలుఁగు దేశమున లేవు. అందు రెండపది యొప్పటికిని అరవవారి యాజమాన్యమందే యున్నది. శ్రీశైలపు సమాచారము నేనెఱుఁగను. ఇక తిరుపతి మాదనుకొని సంతోషించు తెలుఁగువారు ధన్యులుగాని యదంతయు ఆరవ సామ్రాజ్యమే. అది యట్లండె, చెప్పవచ్చిన దేమసఁగా, ఆంధ్రులలో మత ప్రచారకులందం దపు రూపముగాఁ గలరు గాని మతకర్తలు లేరనుట, ఆ మతప్రచారకులును చాలవఱకును తత్త్వబలముచేఁ గాక తామాశ్రయించిన రాజుల కత్తిబలముచే స్వకార్యమును సాధించిన వారుగానే కానవచ్చుచున్నారు.
వేమన యిందు కొక విధముగా అపవాదమనవచ్చును. తనకుఁ దోఁచిన తత్త్వమును నిర్భయముగా ప్రజల కందకికిని బోధించుటకై ఆంధ్రదేశమంతయు నించుమించుగా తిరిగి, యందందు మఠములను స్థాపించి, తనకు తరువాత తన మతమందు నమ్మికగలవారు కొందఱుండునట్లు చేయగలిగిన తెనుఁగువారిలో నితఁడుముఖ్యుఁడు. బహుశః మొదటివాఁడే కావచ్చును. "ఒకవిధముగా" నని బేరపు మాట యేల చెప్పితిననఁగా, ఇతఁడు బోధించిన మతమున కితఁడు మూలకర్త గాఁడు. అది యనాదిగా హిందువులలో నుండు అద్వైతమతము. కాని దాని నితఁడు అనేకులవలె పుస్తకములనుండి పారాయణము చేయక, యోగ సాధనచే నందలి తత్త్వమును గహించి, నిస్సందేహముగా తా ననుభవించి, తన దేశము వారిని గూడ నట్లు తరింపఁ జేయవలయునను ఉదారాశయముచే ఉపన్యసించుట కుపక్రమించిన వాఁడు. కావననే యితని బోధనలలో జీవమున్నది. ఇతరుల మాటలను గాక తన యనుభవమును నమ్మిన వాఁడగుటచేత, సిద్ధాంతమందలితత్త్వమును కొందఱు సందేహించినను, బోధన లందలి నిష్కపటత్వమును సందేహించు వారు పలువురుండరు. కనుక అట్లు సందేహించుటకు శక్తిలేనివారందఱును వెంటనే యతని మాటలు నమ్మి భక్తులైన శిష్యులౌదురు. అనఁగా, మతకర్తలు కాని మత ప్రచారకులలో మతకర్తల కున్నంత విలువను వ్యాప్తిని కొంతవఱకు సంపాదించు కొనఁగలిగిన ధీరుఁడు వేమన యన్నమాట. ఇతని శిష్యుఁడనఁదగు కటార్లపల్లె వేమన్న, ఏగంటి వారు, పోతలూరి వీరబ్రహ్మము, సదానందయోగి మొదలగువా రనేకులిట్టి మతమునే ప్రచారమునకుఁ దెచ్చినవారు. ప్రాచీనులలో 'శివయోగ సారము"ను వ్రాసిన గణపతి దేవుఁడు మొదలగు వారు ఇదేమతమును పండితరంజ కముగా గ్రంథములం దుపపాదించినవారు. ఇట్లే భక్తి ప్రధాన మగు వైష్ణవమతమును సామాన్యజనులలో వ్యాప్తికిఁ దెచ్చిన రామదాసు, త్యాగరాజు, తాళ్ళపాకవారు మొదలగు కీర్తనకారులును, శృంగారము మూలమున విష్ణుభక్తిని వ్యాపింపఁజేయఁ బ్రయత్నించిన క్షేత్రయ మొదలగు అనేకపదకర్తలును ఇట్టి మతకర్తలు కాని మత ప్రచారకులే. కాని వీరిలో నెవరికిని వేమన్నకున్నంత వ్యాప్తి, చనవు రాలేదు.
కారణము స్పష్టమే. వీరిలో కొందఱనుభవము గలవారు. పలువురది లేని వట్టి నమ్మకము గలవారు. అనుభవించినవానిని గాని నమ్మినవానిని గాని ఇతరులకు నచ్చఁజెప్ప ధారాళమైన వాగ్దాటి గలవారరుదు; ఉన్నను ఇతరుల కుపదేశింపవలెసను నుద్రేకముగలవారరుదు. మతమనునది మొత్తము మీఁద తసకు సంబం ధించినది : అనఁగా, ఇందులోఁ జొరఁబడినవాఁడు ముఖ్యముగా తనగతిని తాను చూచుకొనును. అందును అద్వైతమతము. ఆ యుద్వైతానుభవానందమును వదలి, తెలియనివారికి, నమ్మిక లేనివారికి దానిని తెలిపి నమ్మించు నంతటి స్వార్ధ త్యాగులు అనేకులుండరు. ఉండినవానికి పాండిత్యమేమైనఁ గొంత యలపడెనా యిఁక పామర ప్రపంచమునకును ఆతనికిని సంబంధముండదు. చేసిన పనికి పండితతృప్తి వాని పరమార్థము. ఫలము శివయోగసారము' వంటి గ్రంథములు. సామాన్యజనులకు వీనివలన నేమియు లాభములేదు. త్యాగరాజవంటి వారి కీర్తనలలో భక్తియెంత యున్నను వారిగాన పాండిత్యము దానిని గప్పి పెట్టినది. పల్లవి చాటులను జూపద మనిపించునే కాని, వానిని పాడునపుడు ప్రాయికముగ భక్తిని ప్రకటింత మనిపింపదు. క్షేత్రయ వంటి వారి శృంగార పదములలో మూల భూతమైన భక్తి మునిఁగిపోయి, వినువారి కందలి పచ్చి పచ్చి మాటలు మాత్రము తటాలున తల కెక్కును. ఇక రామదాసు పాటలవంటి వానిలో రచన లేదు. గుంపులు గట్టి కోలాహలము చేయు రచ్చభజనలకు పనికివచ్చునే కాని, వినువారి హృదయమును బట్టి పిండునట్టి కావ్యశక్తి వానిలోలేదు. మఱియు నొక్కొక్క కీర్తనయును విశేష మేమియు లేక దిక్కులేనంత పొడుగుగా నీడ్వఁబడి యుండుటచే నందు భక్తియున్నను భావనంగ్రహములేదు, వేమన పద్యము లట్టివి కావు. అతనివి చిటుకలో ముగింపఁగల చిన్న పలుకులు ; అచ్చ తెనుఁగు పద్యపు నడక ; గుండుదెబ్బవలె గుఱి తప్పని చిక్కని చెక్కిన మాటలు. నోరుగల తెలుఁగు వారందఱును నేర్వవచ్చును. మఱియు "నేనొక గ్రంథము వ్రాసినాను. చదువుఁడు. మీకు తత్త్వము కరతలామలకమగును' అని చెప్పవలసిన పనిలేదు. పోయిన చోట్లనెల్ల పద్యములే. ప్రశ్నించిన వారికెల్ల పద్యములే. నిన్నచెప్పిన పద్యమే నేఁడు చెప్పటకు వెనుదీయలేదు. ప్రాఁతపద్యము కొంత మఱచి పోయిన క్రొత్తగా నప్పడే కూర్చి యతికించుటకును కొంకులేదు. విషయములను జెప్పనప్ప డొకరి లక్ష్యము లేదు. బిడియము, సంకోచము సున్న. తా నాడుమాటలలో తన కెప్పడును సందే హములేదు. కనుకనే సామాన్యప్రజల కితనియెడ నమ్మిక, భక్తి జనించినవి. పండితు లగువారికిఁ గూడ నితనిని పూర్తిగా తిరస్కరించుట సాధ్యము కాదు.
మతకర్తలు కాని మతప్రచారకులవలె కవులను పేరు రాక కవిత్వమును రచించినవారు మనలో ననేకులున్నారు. పైఁ బేర్కొనిస శతకములు, కీర్తనలు, పదములు వ్రాసిన యనంఖ్యాకులు ఈ తెగకుఁ జేరినవారు. లాక్షణిక దాసులగు ప్రాచీనులు వీరిని కవులలో లెక్కింపకపోవట యొక వింతగాదు. వీరేశలింగము పంతులుగారివంటి "నవ్యభావ ధురంధరులకును" వీరు కవులని తోcపలేదు. వేమనగూడ నీగతిని దప్పించు కొస్నవాఁడు గాఁడు. మకియొక వింత యేమనఁగా, మన వారితనిని కవిగాఁ దలఁపక పోయినను, ఇతని పద్యముల నన్నిటిని బహు శ్రమచే సంపాదించి, తిద్ధించి, వ్రాయించి, తానే ఇంగ్లీషున టీక వ్రాసి, ప్రకటించి, శాశ్వతకీర్తి సంపాదించిన బ్రౌను దొరకూడ ఇతనిని కవి యనలేఁడయ్యెను. *[1]వేమన యందుఁగల యసాధారణ కవితా ధర్మములను గూర్చి వేఱుగా చర్చింతును. నిఘంటు పండితులును వ్యాకరణ పండితులును ఏమనుకొన్నను, ఇతని కాంధ్ర దేశ మందుఁగల మర్యాదకు, ఇతనిబోధ లింకను చెడక తెలుఁగు వారి హృదయ ముల నాఁటుకొని యుండుటకును, ఇతని పలుకులయందుఁ గల కవితానైశిత్యమే ముఖ్యకారణమనుట నిస్సందేహము. కావున మతాభిమానము, కవిత్వమందభిరుచి గలవారందఱును వేమన వాక్యములను చూడకపోయిన నష్టపడినవారగుదురు, అతని సిద్ధాంతముల నమ్మి యంగీకరించుట వేఱు మాట.
కాని వేమన పద్యములను జదివి యందుమూలమున నతని వివిధసిద్ధాంతములను నిర్ణయించుటకుఁ బూనుకొంటిమేని మనకు కొన్ని కష్టములున్నవి. వానిలో మొదటిది అతని పద్యములేవి, కానివేవి, యని నిర్ణయించుట. ఇతరులు వ్రాసిన గ్రంథములలో మన మాటలు దూర్చుట మనలో అనాదియైన యాచారము. వేదములు, ఉపనిషత్తులు గూడ నీయవస్థకు లోబడినవే ; కావుననే యందందు వేదవాక్యముల సంఖ్యను నిర్ణయించు వాక్యములు వానిలో చేర్పఁబడినవి. ఇక పురాణములగతి యడుగ(బనిలేదు. కాళిదాసాది కవుల కావ్యములుగూడ నీయవస్థకుఁ దప్పలేదు అట్లుండ వేమనను మాత్రము మనవారు మన్నించుటకుఁ గారణములేదు. మఱియు వేమన యొక గ్రంథముగా వ్రాసినవాఁడు కాడని మొదలే చెప్పితిని. 'వ్రాలకందని పద్యముల్ వేలసంఖ్య †[2](2264) గా జెప్పిన వాఁడు.
ఆనుపద్యమొకటి యితఁడొకగ్రంథము వ్రాయనారంభించినట్లు సూచించుచున్నది ; అందందు కొన్ని పద్యములు, ముఖ్యముగా కందములు, ప్రాయికముగ కేవల యోగ రహస్యాదివిషయములను దెలుపునవియై, వేమనకుగల సహజమగు వేఁడి లేక, నిదానముగా కూర్చుండి వ్రాసిన గ్రంథములోని వేమో యనిపించును. కాని ఆ గ్రంథము నతఁడు పూర్తిగా ముగించినాఁడను నమ్మిక నాకు లేదు. "క. భువి రాజ తారకంబులు
ప్రవిమలతర హంన యోగ భావంబులకున్
వివరంబులు గావించెద." (1853)
"తే. శ్రీకరుండగు వేమన చెప్పినట్టి
పద్యముల నెవ్వఁడేనియ పఠనచేయు
నట్టిపురుషుఁడు మనమున నిట్టిదనుచుఁ
జెప్పరానట్టి వస్తువుఁ జేరు వేమ" (3747)
అను పద్యమువంటివి గొన్ని పద్యములున్నవి కాని యవి గ్రంథాంత మందలి ఫలశ్రుతి పద్యములే యని చెప్పటకు తగిన సాధనములు లేవు. గ్రంథము సమగ్రముగా లభించువఱకును ఈ పద్యములు ---
“వేదాతీతుఁడు వేమన సుమ్మీ
వేమన వాక్యము వేదము సుమ్మీ ?? (3637)
ఇత్యాది పద్యములవలె, సమయమువచ్చినప్ప డాత్మప్రశంసకై యతఁడే చెప్పినవో, లేక, తరువాతి భక్తులు చేర్చినవో యగుననియే మనము నమ్మవలసియున్నది. బందరువారు ముద్రించిన ' వేమనసూ క్తిరత్నాకరము' లో అతఁడు తన చరిత్రమును వ్రాసికొన్నట్లుండు పద్యములు నాకుఁ జూడఁగా వేమనవిగావు. ఇదివఱకున్న యనేక ముద్రణములలోఁగాని, బ్రౌనుదొర సంపాదించిపెట్టిన సుమారు ఏఁబది వ్రాఁత ప్రతులలోఁ గాని యవిలేవు.
మఱియు తా నిన్ని పద్యములు వ్రాసితినన్న జ్ఞానమే వేమనకుండెనని నేను నమ్మను. 'శతనంఖ్య పద్మము' లని (3680) యొకచోట, 'వేయి పద్యంబు' లని (3652) మఱియొకచోట, 'వేయు నేనూఱుపద్యము' లని యింకొకచోట *[3] 'పదియునైదువేల పద్యములని’ (వేదాంతసిద్ధాంతము, ప. 3) వేరొకచోటఁ గాన వచ్చుచున్నది! ఇందులో నేది నిజము ? నాకుఁ జూఁడగా వేమన యేనంఖ్యయు నెఱుఁగఁ డనుటయే నిజము. అచ్చైన ప్రతులలో నాలుగువేలకు మీఁదుగా పద్యములు గలవు. బ్రౌనుదొర సంపాదించిన ప్రతులలో నిన్నిలేవు గాని అచ్చు ప్రతులలో లేని పద్యము లనేకములందుఁ గలవు. కావున వేమన యొక శతకము, సహస్రము అను సంఖ్యానియమమునకు లోబడక స్వతంత్రముగా నవకాశము వచ్చి నపుడెల్ల పద్యములు చెప్పినవాఁడనియు, వానిని విన్నవారిలో నభిమానము గలవా రప్పుడప్పుడు గుర్తువేయుచు వచ్చిరనియు, ఆతనికి తరువాతఁ గొందఱు గురుభక్తితో నతని పద్యములన్నియుఁ జేర్చి కూర్పఁ బ్రయత్నించిరనియు నమ్మట క్షేమము, ప్రక్షేపములు చేర్చువారి కింతకన్న మంచి యవకాశ మెందు లభించును? ఇతని పద్యములలో ప్రక్షేపము లెక్కువయుండవని యొకమాఱు తలఁచితిని, కాని యిటీవల నాకాభావము కొంతవఱకును మాఱినది.†[4] ఆన్ని ప్రతులకంటె నెక్కువ పద్యములు గలిగి, విశ్వకర్మ వంశీయులగు బందరు పూర్ణయా చారిగారు ప్రకటించిన ప్రతిలో, తక్కిన యేచోటను లేనివి, విశ్వకర్మను బొగడి వ్రాసిన పద్యము లనేకములు గలవు.
ప్రక్షేపముల పాపమట్లుండఁగా దానికిఁ దోడు తిద్దు(బాట్లతొందఱ యొకటి యున్నది. ప్రయాస: మొదటినుండి వేమన పద్యములు వ్రాసిన వారందఱును అవ్యుత్పన్నులే, భక్తియున్నంత జ్ఞానముగలవారరుదు. కాని తమకుఁ దెలియని దానిని తిద్దుటకు మాత్రము వెనుదీయరు. ఇట్టివారిని గూర్చియే బ్రౌనుదొర ఒక వ్రాఁత ప్రతిపై స్వహస్తముతో
" తే, తప్ప గమనించి వ్రాయు టుత్తమము, లేక
ప్రతి సమాసముగా వ్రాయు టతిముదంబు ;
రెండు విడనాడి వ్రాసెడి లేఖకుండు
గలుగు టరయంగఁ గవి యభాగ్యంబు గాదే !"
యని వ్రాసికొనెనఁట. [5]చూడుఁడు ; 'ఉప్పకప్పరంబు' అను వేమన్న ముద్దు పద్య మెఱుగనివారు లేరుగదా. ఇది యొకానొక ప్రాతప్రతిలో నిట్లున్నది'
" ఉప్పుకప్పరంబు వొక్కరీతున నుండు
చెప్పజెప్ప వారి చెవులు వెఱ్ఱి
పురుష రూపొక్కటి పుణ్య పురుషుఁడు వేఱు "
(ఓరియింటల్ లైబ్రరీ, మద్రాసు, 13-12-20)
వ్రాత ప్రతుల స్థితి యిట్లుండఁగా అచ్చుప్రతులు మరింత యసహ్యముగా నున్నవి. అందును 'గుజిలీ" ప్రతులకన్న 'పరిశోధించి" వేసిన నవనాగరకుల ముద్రణములు చాల అశ్రద్ధను వెలిబుచ్చుచున్నవి. వేమన స్వభావము, మతము, కవిత్వధర్మము, భాష మొదలగు వాని నేమియుగమనింపక, వ్రాఁత ప్రతుల పాఠములను విచారింపక, అర్ధభావములకు వచ్చుననర్ధమును లక్ష్యపెట్టక, దిద్ది ముద్రించిన పాఠము లనేకములందుఁ గలవు. మచ్చుకు ఒకటి రెండు
" ఆ, తెవులుఁ బడ్డవాఁడు దేవతాభక్తుండు,
ఈటె లేనివాఁడు పోటుబంటు,
కాసులేని వాఁడు కడుబ్రహ్మచారియౌ
విశ్వదాభిరామ? " (ఓ. లై. 12 - 9 - 19)
ఇది ప్రాచీన పాఠము. దీనికి బందరు ప్రతిపాఠము :
" తెలుఁబడ్డవాఁడు దేవతాభక్తుండు
మాట లేనివాఁడు పోటు బంటు. " (1966)
వావిళ్ళవారి కడపటి ముద్రణము చప్పుడులేకుండ దీనినే యనువాదము చేయు చేయుచున్నది.(చూ.పె 178) మఱియు.
" క. పసరపు నంజుడు మెక్కియు
మసలక సురcద్రాగ ముసలి మానులఁ గూర్చెన్
కుసుమాంగి కధర మాంసము
కుసుమాస్త్రు ని బెట్టి చెఱచె కుంభిని వేమా" (2477)
ఇది బందరు ప్రతిపాఠము. *అర్థమేమిరా" యని తల పగులఁ గొట్టుకొంటిని. వాఁతప్రతులు సాహాయ్మమునకు వచ్చినవి :
" క. పసరపు మాంసముఁ బెట్టియు
మసలక సులతాను ముసలి మానులఁజేసెన్
శశిముఖుల యధరమాంసము కుసుమాస్తుఁడు
పెట్టి చెఱిచె కులములు వేమా" (ఓ. లై., 11-6-15)
'గురము'; ఇది గృహశబ్దము యొక్క అశాస్త్రీయమైన తద్భవము. దీనిని వేమన యొక్కఁడే యుపయోగించిన వాఁడని తలఁచెదను."
(Brown's Verses of Vemana, p. 113)
అని ఇంగ్లీషున వ్రాసెను. లేనితద్భవమును గల్పించి యంటఁ గట్టుటకంటె యతియే కొంత దారి తప్పిన దనుకొన్న నష్టమేమి ?
వ్రాఁతకాండ్ర తప్పల నట్లుంచి మూలమునే కొంతవఱకు సూక్ష్మముగా బరీక్షించితిమేని, వేమన్న కచ్చితముగా నేనియమమునకును లోబడినవాఁడు కాఁడని స్పష్టమగును. విసంధులు, వ్యవహారమందలి కొన్ని భాషా రూపములు, సామాన్య మైన పద్యపు నడకకు నష్టమురాని ఛందోభంగములు—ఇత్యాదుల నతఁడు గమ నించిన వాఁడు కాఁడు. అసలు గమనింపఁ గల్గినంత చదువు చదువుకొన్నవాఁడే కాఁడని సందేహింపవలసి యున్నది. కావున 'కల్లు కిచ్చునట్లు చల్లకీయఁగ లేరు" ఇత్యాదులలో అపశబ్ద బ్రాంతిచే 'కల్లున కిడునట్లు' (1010) ఇత్యాదిగా దిద్దుట వేమన శైలిని ధ్వంసము చేయుటయే. తెలియ నీదు మాయ దీనిల్లుపాడాయ' అను దానిని 'పాడాయె' (314) అనియును 'ఉత్తమపురుషుండు ఒక్కడు చాలదా? అను దానిని 'పురుషుఁడటు లొక్కఁడు చాలఁడా" యనియను (2401), ఆధునికులు చేసిన సవరణలు, స్వచ్ఛందముగా పరువెత్తుబిడ్డల కాళ్ళకు సంకెళ్ళు తగిలించుట వంటివి.
ఇదిగాక వేమనయే మనకర్థము గానట్లు వ్రాసిన పద్యములనేకములు గలవు. ముఖ్యముగా తత్త్వవిషయములను దెలుపు పద్యములు చాలవరకు దుర్బోధ ములు, సామాన్యముగా తత్త్వశాస్త్ర విషయముల నెఱుఁగని నావంటి వాని కా శాస్త్ర పరిభాషాపదము లర్థము గాకపోవుట సహజము. కాని, అందఱెఱిఁగిన పదార్థము లకే మాఱు పేరులు పెట్టి వ్రాసినప్పడా చిక్కును వదలించుట సామాన్యకార్యము గాదు. బ్రహ్మరంధ్రమందలి సహస్రారచక్రమునకు 'నంది దుర్గ మని పేరుపెట్టిన నెవరు దానిని భేదింపఁ గల్లుదురు? (2155) ఇట్లు మఱుగు పఱిచి వ్రాయుట వేదముల కాలమునుండి కలదు. చూడుఁడు---
“ద్వా సుపర్ణా నయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్వజాతే
తయో రన్యః పిప్పలం స్వాద్వత్తి
అన్న న్నన్యోఆభిచాక శీతి? (ముండకోపనిషత్తు, 3-1-1)
" ఆ, నీరు కార మాయె కారంబు నీరాయొ
కారమైన నీరు కారమాయె
కారమందు నీరు కడు రమ్యమై యుండు" (2267)
ఇది నాకర్థము కాలేదు. మఱియు దీనికి దిక్కులేనన్ని పాఠాంతరములున్నవి. దేనికేమి యర్ధమో ! ఇట్టివి లెక్కలేనన్ని. ఇట్లగుటచే వేమన పద్యముల కన్నిటికిని కొద్దిగనో గొప్పగనో గూడార్థము గలదను నొక యభిప్రాయము బైలుదేఱినది. చూడుఁడు
" ఆ. చెప్పు లోనిరాయి, చెవిలోని జోరీగ,
కంటిలోని నలుసు, కాలిముల్లు,
ఇంటిలోని పోరు ఇంతంత గాదయూ
విశ్వదాభిరామ వినర వేమ. " (1430)
ఇందులో తెలుఁగు వారికి తెలియనిదేమున్నది? కాని, ఉన్నదని సంప్రదాయజ్ఞలనఁ బడువారు గంభీరముఖముతో ప్రత్యుత్తరమిత్తురు. మనలో సకలదుర్వ్యాఖ్యాన ములకును ఆధారము సంప్రదాయము. 'ఇందులో నేమోయంతరార్ధమున్నట్టున్నది' అని బ్రౌను దొరగూడ మొుగముముడివేసుకొని వ్రాసెను*. [6] కాలము, చెడినది గాని, లేకున్న శిష్యుఁడు దీని రహస్యార్ధము దెలుసుకొనవలెనన్న గురుపేవ కనీసము పండ్రెండేండ్లయినను జేయవలసి యుండును. కాని అచ్చు వచ్చి గురువులవారి గుట్టు చెఱచినది. దమ్మిడికి తరముగాని దీని యంతరార్థమును శ్రీ వంగూరు సుబ్బారావుగారు సంగ్రహించి ప్రకటించిరి. † [7] కుతూహలము గలవారందు, చూడవచ్చును.
ఇట్లగుటచే మొదలు వేమన పచ్యముల సంఖ్యనిర్ణయించుట, వాని మూల పాఠమును గుర్తించుట, గ్రందకర్త యర్థము నెఱుఁగుట, యను మూఁడు. చిక్కులు, సామాన్యముగ తెగనివి, యున్నవి.
ఇప్పడు ప్రకటించిన పద్యములు నాలుగు వేలకు మించియున్నవంటిని. అవి బందరు ప్రతిలోనివి. దీనిలో లేనివి 125 పద్యములు "వేమనయోగి వేదాంత సిద్ధాంతము' అను ప్రతిలోఁగలవు. వావిళ్ళవారి ముద్రణమందును కొన్ని గలవు. కాని విమర్శించి చూచితిమేని కనీసము వేయి పద్యములైనను ఆచ్చుప్రతులనుండి మనము త్రోసి వేయవలసి యున్నది. వేమన పద్యములతో బోధించినవాఁడు. విషయ మొక్కటియైనప్పడు జ్ఞప్తి చక్కఁగా నుండెనా నిన్నటి పద్యమే వచ్చును; లేకున్న భావముననుసరించినఁ జాలునని యప్పటికిఁ దోఁచిన మార్పులతోఁ జెప్పి పోవు చుండెడివాఁడు. అట్లగుటచేత ఆ పద్యములలో ఆర్ధభేదమును రూపభేదమును లేక ఒకటి రెండు పదములు మాత్రము భేదించిన పద్యములనేకములు గనుపట్టును. మఱియు ఒకటే పద్యమును వేఱువేఱుచోట్ల విన్నవారు మరలఁ జెప్పనప్పడు జ్ఞప్తి చక్కఁగ లేక, వేమన కవిత్వమునకు వారి పైత్యమును కొంతచేరి పాఠభేదములు గలుగును. ఇట్టి పద్యము లన్నియు, ప్రకృతము ముద్రించిన వారివలె, వేఱుగా లెక్కించుట యన్యాయము. వేమన 'పదియు నైదు వేల పద్యములను" చెప్పిసట్లు తానే చెOప్పికొనుట నిజమేని, ఆ సంఖ్య యిట్లే పదాక్షర భేదముచే పెరిగినదేని, ఆ కాలమున నతనికి వచ్చిన 'వెఱ్ఱి వేమన' యను బిరుదు సార్ధకమనుటకు నేఁడు నేనును వెనుదీయను ! సంఖ్య విషయమున మనవారికి ఊహ పాఱినట్లు మఱెవరికిని పాఱ దనుకొందును. రామాయణము మొదట వాల్మీకి వ్రాసినది శతకోటి గ్రంధం శుక్రనీతి శతలక్షలు! అంతయేల? మొన్నటి త్యాగరాజు వ్రాసిన కీర్తనలు ఇరువది నాల్గువేలు! ఇప్పటి రామాయణ సంఖ్య ! ఉన్న స్థితికిని ఊహకును ఎంతదూరమైన నంతసంతోషమేమో మసకు ! అది యట్లుండె, పదములకుఁ గల పాఠాంతరములు పద్యములకే రూపాంతరములుగా భావించుటచేత ఇప్పటి వేమన పద్యముల సంఖ్య యింతయైనది. అట్టివి ప్రోసివేసి వ్రాఁతప్రతులలోని యముద్రిత పద్యములను చేర్చుకొంటిమేనియు మూఁడు వేలకు మించునట్లు కానరాలేదు. వేమన్న నామము అజరామరముగా ఆంధ్రలోకమున నిలుచుటకు ఆయిన్ని పద్యములు చాలునను కొందము.
"మ.II తిలలం దైలము, పాలవెన్న, శిలలం దెల్లంబుగా లోహ ము
జ్జ్వల దీపాంకురమందు కజ్ఞలము, కాష్ణశ్రేణియందగ్ని భూ
తల ఖాతంబున నీరు గల్లుటయుఁ దద్యంబంచు నూహించి తాఁ
దలఁపన్ యత్నము సేయకున్నఁ దగునే ధర్మంబు వేమాహ్వయా,”
(వేదాంత సిద్ధాంతము, పే. 108)
" ఇనుమునఁ జేసిన మైనపు కడ్డి, ఇంటి వెనుక నఱ్ఱావుల దొడ్డి, అవిటికి మేపిన కుందురు గడ్డి (?) విప్పిచెప్పరా వేమారెడ్డి." (ఓ. లై., 13 - 9 - 19)
</poem> రెండును వేమన పేరనే యున్నవి. కాని సహృదయ(డెవ్వడుఁగాని రెండును ఒకఁడే వ్రాసినవనలేఁడు. వ్రాసి యుండిన రెండవది వేమన వ్రాసి యుండవచ్చు నేమో. వేమనకై వాడము మొదటి దానియందు శూన్యము : భారతశయ్య, రెండవదానియందు కొంచెము వేమన్న వాసన యున్నది. మఱియు,
" ఉ. వాసనలేని పూవు, బుధవర్గములేని పరంబు, చాల వి
శ్వాసములేని భార్య, గుణవంతుఁడు గాని కుమారుఁడున్, సదా
భ్యాసము లేని విద్య, పరిహాసములేని ప్రసంగ వాక్యమున్,
గ్రాసములేని ప్రాపు కొఱ గాదయ భూమిని వెఱ్ఱివేమనా "
(వేదాంత సిద్ధాంతము, పే. 107)
ఈపద్యము 'కొఱగానివి పెమ్మయసింగ ధీమణి' యను మార్పుతో జక్కన చెప్పిన " పెమ్మయ ధీమణి శతకము' లోని దని, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రలుగారు 'చాటు పద్య మణిమంజరి"లో (బ్రకటించిరి (చా.ప.పే. 102). 'నుమతి శతకము', 'తిరుమ లేశుని పద్యములు" మొదలగు వానిలోనివి గూడ వేమన్న పేరున ప్రకటింపఁబడినవి. ఇట్టివెన్ని కలవో !
వేమన పద్యములందలి ప్రక్షేపములను నిర్ణయించుటలో అర్ధభావములకన్న పద్యరచనా స్వరూపము ముఖ్యముగా గమనింపవలెనని నా యభిప్రాయము. ఎందు కనఁగా 1 మేమనకు విరుద్ధము కాని యర్ధభావములను ఇతరులును జేర్పవచ్చును : వేమనయే సహజమైన స్వాచ్చంద్యముచేతనో, సన్నివేశము, వయస్సు, అనుభవము మొదలగు వాని భేదముచేతనో, తానాడిన వానికి విరుద్ధములైన భౌవములు తానే యాడవచ్చును. కాని, ప్రకృతి సిద్ధమైన శైలీవిశేషమును అతఁడు మార్చుకోలేఁడు; ఇతరు లనువాదము చేయలేరు. శైలి కర్త యొక్క ముఖమువంటిది. అంతరంగ మెంత మాఱినను అది మాఱదు. కారణాంతరములచేఁ గొంతమాఱినను స్వత్వమును పూర్తిగాఁ బో(గొట్టుకొనఁ జాలదు. కావననే ఒక వస్తువు నొకచోటఁ బొగడి వేరొకచోట దానిని ఖండించినాఁడన్న మాత్రాన, పై రెండు పద్యములలో నొకటి యతనిది గాదని నిర్ణయించుట సాహసమని నేను తలఁచుచున్నాను. మఱి యిప్పడు వేమన్న పేరనున్న పద్యములన్నియుఁ జదువఁగా, నందులో విశేష భాగము వేమన్నదనుటలో సందేహముండదు గావున, అందువలన వేమన శైలీ స్వరూపము దృడముగా భావము నందేర్పఱుచుకొని తద్విరుద్ధములైనవి యతనివి కావని నిశ్చయించుట సహృదయునకు అసాధ్య కార్యము కానేరదు. అనఁగా, ఆర్థ భావములు పూర్తిగా వదలవలేనని కాదు. అది యసాధ్యము. కాని, ఒక యుద్దేశముతో ఆద్యంతములుగల గ్రంథము వ్రాయక సమయము వచ్చినప్పడు హృదయమునఁ దోcచిన భావములను మఱుగు పఱుచుకొనలేక బైటఁ బెట్టు వేమనవంటి తీటనాలుక వాని కవిత్వమునందు, అతని శైలీ స్వరూపము నిర్ణయించుటకు అర్ధభావముల కంటె, ఛందోగతి, యతి విశేషము, పదములకూర్పు మొదలగు బహిరంగములే యొక్కువ పనికి వచ్చుననుట నామసవి. ఈ దృష్టితో చూడఁగల్గితి మేని, ప్రక్షిప్త పద్యముల సంఖ్యను నికరముగా, చరిత్రకారుల పటకారులకు చిక్కునట్లు, చెప్పి చూపలేకున్నను, స్థూలముగానైనను తెలియఁగలము. ప్రకృత మింతకన్న నెక్కువ చేయలేము. నే నిందుదాహరించు పద్యములనెల్ల ప్రాయికముగ నిట్టి దృష్టి చేతనే చూచి నిర్ణయింపఁ బ్రయత్నింతును.
ఇట్లే మూలపాఠమును గుర్తింపవలసి యున్నది. ఇది వఱకును సామాస్య ముగ సవరించినవారు తమకు రుచియైన పాఠమును గ్రహించుట యలవాటైనది. అందేదియు రుచింపని యెడల, అర్థము కాకున్న, స్వేచ్చగా దిద్దుటయు వాడుక యైనదని మొదలే విన్నవించితిని గదా. ఇవి యొకటికంటేనింకొకటి యన్యాయమని చెప్పఁబనిలేదు. మనరుచి వేమన్నకుండవలెనని యూహించుట పొరఁబాటు. మన కర్థము కాని దానిని కాలేదని యంగీకరించిన నవమానమని తలంచుట యంతకంటే పొరఁబాటు. ఇదివఱకు బైలుపడిన తెలుఁగు గ్రంథములు శోధించిన వారనేకులు ఈయవస్థపాలైన వారే. ఇట్టి పరిశోధకుల పిలువని పేరంటమునుండి మూలమును విడ(దీయవలయునన్న వ్రాఁతప్రతులే శరణ్యము. వేమనపద్యములు వ్రాసినవారు ఎక్కువ చదువరులుగారు గావున వారివి కలము పొరఁబాట్లే కాని కవిత్వపు పొరఁ బాట్లెక్కువ యుండవు. ఈ పద్యము వినుఁడు -
"ఆ, ఇహమునందు సుఖము ఇంపారకుండిన
పరమసందు నెట్లు పడయ వచ్చు
మొదట లేని చేవ తుద నెట్లు కల్లురా,విశ్వ."
ఇందలి 'చేవ' పదమును వ్రాఁతగాండ్రు, ' చాప ' వ్రాసిరి. సామాన్య జనుల పద్ధతి ప్రకారము ఇందలి చకారము తాలవ్యముగా నుచ్చరింపఁబడుచుండెను. చదువుకొన్న శోధకుఁ డొకఁడు బాలవ్యాకరణ ప్రకారము " చాప" యని దంత్యము గా దాని నుచ్చరించి యర్ధము గాక, 'చావు' అని యుండవలెనని తీర్మానించెను. ఒకానొకరు దానికి విచిత్రముగా వ్యాఖ్యానము గూడ చేసిరి! (చూ. వేదాంత సిద్ధాంతము, పే. 23) ఇంకఁ గొందఱు 'చేవ" యను వ్రాఁతలోని 'వ' కారమును ' త' కారముగా చదువుకొని ' చేఁత' యనుకొనిరి. ఈ గందరగోళమేలయని యింకఁ గొందఱు ఆ స్థానమందు ' సుఖము' అని మార్పుచేసిరి. వీనిలో ' చావు'ను మాత్రము వదలి బందరువారు, చేత, చేప, సుఖము మూఁడును దీసికొని మూఁడు వేఱువేఱు పద్యములుగా ముద్రించిరి! (వే. సూ, పే. 32) విమర్శకులు పరిశోధకులుగా నేర్పడని యవస్థయిదీ. వ్రాఁతప్రతులను నవిమర్శముగా పరీక్షించితిమేని యీ కష్టము చాలవఱకు నివారణయగును.
ఇ(క ఆర్థమును గూర్చిన కష్టమునకు వారివారి స్వశక్తితప్ప వేఱుశరణము లేదు. వేమన పద్యములలో కొన్నిటికి వ్యాఖ్యవ్రాసినవారు నేనెఱిఁగినంత వఱకును ఐదుగురు గలరు. వీనిలో (1) బరంపురమునందలి శ్రీతారకబ్రహ్మానుభవి పూడిపెద్ది సాంబశివరావుగారు "శ్రుత్యు క్త్యనుభవములతో, రచించిన "వేమన పద్యరహస్యార్థ తాత్పర్య బోధిని". ఇదిగాక, వీరు "వేమన జ్ఞానపంచపద్యరత్నములు', 'హేమతారక విద్య','వేమనార్యునివా క్యార్థానుభవశిరోమణి', 'గగనవిద్య మొదలగుగ్రంథములు, వేమన పద్యములకు పీఠికారూపములైనవి, వ్రాసినారు. (-3) శ్రీదత్తాత్రేయ పరంప రాగత శ్రీజ్ఞానానందయోగి విరచితమైన "తత్త్వార్ధబోధిని". (3) వావిళ్ళవారు కడపట ముద్రించిన పేరులేని యాంధ్రతాత్పర్యము. (4) కరూరు బంగారయ్యగారు రచించిన '" వేమనార్యుని పద్యపదశబ్రార్ధము " . (5) బ్రౌనుదొర వ్రాసిపెట్టియుఁ గొంతవఱకు ప్రకటించియున్న ఆంగ్లేయ పరివర్తనము.
ఇందు మొదటి దానిలో ఒక్కొకపద్యముక్రింద పుటలకొలఁది వివరణము గలదు. అనేకశ్లోకములు, స్మృతులు, శ్రుతులు. పురాణములు ఉదాహరింపఁబడినవి. ఈ వ్యాఖ్యాతకు వేమన్న యందు చాలభక్తికలదు : అతని తత్త్వములను తాననుభవ పూర్వకముగా నెఱిఁగినవాఁడని పలుమాఱు తెలుపుచుండును. కాని యొకటే తక్కువ-మూలమునకును వ్యాఖ్యానమునకును సంబంధము. రెండవది కొంత మేలు. కాని యిందును మనకుఁ గల సందేహములు తీఱుట యరుదు. అందందు అప పాఠములకు సాహస వ్యాఖ్యానము గలదు. ఈ యిరువురును కొన్ని పద్యములకు మాత్రము టీక వ్రాయఁబ్రయత్నించినవారు. మూఁడవదియగు వావిళ్ళవారి వ్యాఖ్యలో దొరికిన యన్ని పద్యములకును అర్హతాత్పర్యములు వ్రాయుప్రయత్నము చేయఁబడి నది. అందలీకి నర్థమగు పద్యముల కల్లారు ముద్దగు టీక, సందిగ్ధములైన పద్యము లందు చల్లని రెండుమాటలతో చప్పన జారుకొనుట ఇందలి విశేషములు. వేమన్న యందలి వ్యాసఘట్టముల కెన్నినిటికో “సులభము', 'స్పష్టము' అనుటయే వీరి వ్యాఖ్య. *[8]నాలుగవది ఈయన్నింటికంటె వింతయైన ప్రతిభాశక్తిని జూపును. ఒక పదమునకు దీనియందలి యర్ధము మచ్చుకు : “లంజ? లం = పృథివి ; జ=పట్టబడినది. పుష్పం-అనఁగా, పుష్పముయందు బుట్టిన లక్ష్మి యగుటవల్ల తల్లి ! (చూ, వేమ నార్యుని పద్యపద శబ్దార్థము, పే.9) ఇంతచాలును. ఐదవదగు బ్రౌను దొరది భాంషాంతరీకరణమే కాని టీక కాదు. కాని మూలార్ధమెఱుఁగుటకు నిష్కపటముగా ప్రయత్నించిన పుణ్యాత్ముడితఁ డొక్కఁడే ఐసను ఇతని భాషాంతరీకరణము అనేక పద్యములకు భావమెఱుఁగకయే చేయఁబడినది.
ఇట్లు ప్రకృతము మనకు పనికి వచ్చు వ్యాఖ్యయొకటియు లేదు. కావున ఎవరి యోగ్యతకొలఁది వారే వేమన పద్యముల కర్ధనిర్ణయము చేయవలసియున్నది. నా శ కొల(ది నేనును బ్రయత్నింతును.
సందర్భముస వేమనపద్యములందనేకములకు మకుటమైస “విశ్వదాభి రామ' యను పదమున కర్ధము విచారింపవలసియున్నది. దీనికి 'విశ్వధాభి', 'విశ్వదాభి" 'విశ్వతోభి'–యని మఱిమూడు పాఠాంతరములు గలవు. కడపటి రెండును వ్రాఁతప్రతులలో నపురూపముగఁ గానపచ్చును. 'విశ్వదాభిరామ యనియే తొంబది పాళ్ళు 'విశ్వతాభి' యనునది దానికి తరువాత తక్కిన దానికంటె నెక్కువగాఁ గాన్పించును (చూ.ఓ.లై; 11-6-22; 11-6-24; 13-10-9) కాని, “విశ్వదాభిరామ' యనునదియే మూలపాఠముగా భావించి యనేకవిద్వాంసు లనేక విధములుగా నర్థము చెప్పిరి—(1) విశ్వమును ప్రపంచమును ఇచ్చువాఁడు 'విశ్వ దుcడు' = భగవంతుఁడు; అతనికి అభిరాముఁడు = ప్రీతిపాత్రుఁడు—అనియొకరు. (2) విశ్వమును = నమస్తమును, ద = ఇచ్చుటచేత, ఆభిరాముఁడు—అని యింకొకరు. (3)వేమన్న ఉంపుడుకత్తె 'విశ్వద ' యని నామకరణముచేసి, దానికబిరాముఁ డని వేరొకరు. (4) విశ్వమును సంహరించువాఁడు విశ్వదుఁడు = శివుఁడు, అతనికి ప్రియుఁడని మఱియొకరు (చూ, వం. ను. గారి "వేమన', పే.194). ఇన్నిటికి తోడు నాదియు నొక వ్యాఖ్యానముండిన నష్టమేమియనుకొని నేను, అసలీ పాఠమే తప్పని, "విశ్వతాభిరామయను పాఠమునే గ్రహించి 'విశ్వతా = ప్రపంచత్వముఅనఁగా, సర్వమును తానైయుండుట—దానిచే నభిరాముఁడు" అను నొక యర్థము బైలుదీసియుంటిని (చూ. వావిళ్ళవారి ప్రతి, పీఠిక. పుట XVIII). శ్రీ వంగూరి సుబ్బారావుగారు, 'విశ్వదుఁడు = సమస్తము నిచ్చినవాఁడు (అనఁగా, త్యజించిన వాఁడని కాఁబోలు) అగుటచే నభిరాముఁడు" అని వాడుకలోనున్న యస్త్రమే యుచిత మనిరి. ఎవరి వాడుకలో నీ యుర్ధమున్నదో యెఱుఁగను. వేమన్న పద్యములు పఠించువారందఱును ఈ నాల్గవపాదము 'తందనానతానా" వంటిదని తలఁచి యూరకున్నవారే కాని, దాని యర్ధము విచారించినవా రరుదు. పోనిండు. నా వ్యాఖ్యానమే నా కిప్పుడనుచితముగాఁ దోఁచినది. ఎందుకనఁగా: అప్పడు తానే సమస్తమును అను అద్వైతానుభవస్థితి కలిగిన తరువాతనే యితఁడు పద్యములు వ్రాయ మొదలుపెట్టెనని చెప్పవలసివచ్చును. వేమన స్వచ్ఛందచారిగను, సంసారి గాను ఉన్నప్పడు వ్రాసినవని యూహింపవలసిన పద్యము లనేకములు గలవు. ఈ విషయము ముందు స్పష్టమగును. కనుక "విశ్వతాభిరామ పాఠమును, దానికి నాయర్థమును వదలుకొనవలసియున్నాను. మనలొ వ్యాఖ్యానము వస్తుస్థితిని జెప్పుటకుఁ గాక, తమతమ శక్తిని జూపు వినోదముగా నేర్పడినది గావున ఆ పద్ధతి ప్రకారము దీని కింకొక యుర్ధముగూడ నిష్టమున్నవారు చెప్పుకొనవచ్చును : విశ్వ దుఁడు=ప్రపంచమున నందఱిని ఖండించినవాడు, అగుటచే నభిరాముఁడు.- అనఁగా, అన్ని జాతులను, వారి పద్ధతులను జంకు లేక ఖండించిన వాడగుటచే, ఆందఱును తముఁ దిట్టిన పదములను మరిచియో, మఱుఁగుపఱిచియో, యితరులను దిట్టినది మాత్రము చెప్పుకొని సంతోషింతురు. కావున నితఁడందఱికిని అభిరాముడే ! ఇట్టి టీకల కేమిలెండు. సహజమైన యర్ధము దీని కిదివఱకు లభింపలేదు. ఇఁక ముందు లభించునను నాశయు నాకు లేదు. దీని కర్థమే లేదనుకొని యింతటితో నూరకుండుట క్షేమము. ఉన్నంతలో మొదటిది మేలు.
ఇఁక నిందుకు సంబంధించిన అభిరామయ్య కథ కాళ్ళులేనిది. ఈకథ తెలిపెడు పద్యములు బందరు వారి ముద్రణములో గలవు. అది వేమన స్వకీయ చరిత్రమును వ్రాసినట్లున్నవి. నేను జూచిన యే వ్రాఁతప్రతులందును ఇదివఱకు అభి రామయ్య పేరైన కానరాదు. వ్రాఁతయచ్చుప్రతులల పీఠికలో నితని కథ సంగ్ర హముగా(గలదు. అసలు అభిరామయ్య యను పేరె వింత పేరు. రామయ్యలు గలరు, పట్టాభిరామయ్యలు గలరు; లోకాభిరామయ్యలును ఉండవచ్చును, కాని వట్టి యభిరామయ్య కర్థమేమి ? ఒకవేళ పై పేరులలో నేదోయొకటి వాడుకలో నిట్లు సంగ్రహింపఁబడినదనుకొన్నను 'విశ్వదాభిరామ పదమున కర్థమేమి? విశ్వదుఁడనఁగా, విశ్వము నిచ్చినవాఁడు-అనఁగా-చేసినవాఁడు-అనఁగా విశ్వకర్మ అనఁగా, అతని కులమునకుఁ జేరినవాఁడు-ఐన అభిరామయ్య యని యర్థమా ? అట్లైన తుదలోని వేమన్న కేమిపని ? మఱియు బందరు ప్రతి పీఠికలోని వేమన చరి త్రములో అభిరామయ్యకు రామయ్యయను పేరును గలదని చెప్పఁబడినది. అట్లైన మనకింత తల నొప్పి లేకుండ 'విశ్వకర్మ వంశ్య వినర రామ' యనియే వేమన వ్రాయవచ్చుఁ గా నుండెను గదా!
అభిరామయ్య కథ కల్ల యనుటకు వేరొక సాక్ష్యము గలదు. లంబికా శివ యోగి యను నాతఁడు, తత్త్వరహస్యము నుపదేశించెదను రేపురమ్మని కంసాలి యభిరామయ్యకుఁ జెప్పగా, దానిని రహస్యముగా(బొంచి వినుచుండిన మనవేమన్న, తన వదినెయైన రాణిగారి మూలమున మఱునాడు అభిరామయ్య నగరు విడిచి, పోలేకుండఁజేసి, తాను యోగివద్దకుఁ బోయి, అతఁడె తనకు ప్రతిగా నన్నుఁ బంపెనని చెప్పి, శివయోగిని వంచించి యతనిచే బీజాక్షర మంత్రోపదేశమును బొందెనఁట. తరువాత తాను సంపాదించినవిద్యవిలువ నెఱిఁగి, జ్ఞానియై, పశ్చాత్తాపమును బొంది, మొదలు జాగ్రత్తగా అభిరామయ్య కాళ్లు పట్టుకొని, తప్పుక్షమించెదనని బాసచేయించుకొని, తరువాత తస యపరాధమును దెలిపెను. అతడు పాపము, మొదలే క్షమించి నాఁడుగదా! అతని దయకు కృతజ్ఞతను జూపుట ధర్మమే కాని యచే బీజాక్షరోపదేశమును తానే యతనికేల చేయలేదు? పాపము దానికై యాతఁ డెన్నినాళ్ళు ఆ బైరాగి శివయోగిసేవచేసెను? పోనిండు; అభిరామయ్యవలె శివయోగి గూడ వంచి, తుఁడే కదా ! తనకు ప్రధాన గురువగు నతని కింతమాత్రము కృతజ్ఞత చూపవలదా ? వేమన పద్యములలో నా పేరే లేదే ; మఱియు పై యభిరామయ్య కథలోని యీ పద్యము చూడుఁడు
" తే, దేహశక్తియు లేనట్ట దీనునకును
చక్కగా బోధ చేసెడి చతురుఁడుగను
నిక్కముగ విశ్వకర్మ తా నీటుమెఱయ
రామయూఖను విలసిల్లె రహిని వేమ " (2072)
వేమన్న 'దేహశక్తి లేని దీనుఁడుగా" నుండెనా ? అట్లయిన నట్టి క్షయ రోగావస్థ మందులతోఁ దీఱునుగాని బోధనలతోఁ దీఱునా ? మఱియు రామన్న వేమన్నకు చేసిన బోధయేమి ? పాప మతఁ డేబోధ బాధలు నెఱుఁగఁడే ! క్షమించుటయే బోధయా? ఈ పద్యములు కృత్రిమములనుట కింతచాలును. ఈ ప్రతియందుఁగల విశ్వకర్మ పేరిట యసంఖ్య పద్యములను, 'కంసలికిని మించు కడజాతి లేదయా" యని యన్ని వ్రాఁత ప్రతులందును అచ్చు ప్రతులందును ఉండఁగా 'ఘనజాతి లేదయా' యని తిద్దియుండుటను (3094) జూచితిమేని, సంపాదకుల సుత్తి దెబ్బలు, ఆకురాయి కోఁతలు, వేమన్న చాల తిన్నాఁడని స్పష్టముగా గానవచ్చును. అది యట్లుండె.
పైఁ జెప్పిన పద్యములు పాటలుఁ గాక 'వేమన వాక్యము' లని కొంత కొంత అక్కడక్కడ పద్యపు నడకగల వచనములు కొన్ని యున్నవి. వాక్యమనఁగా పెక్కు చిన్న వాక్యములగుంపు. ఇట్టివి ఆఱు వాక్యములున్నవి. ప్రతిదాని తుదను, 'విశ్వదాభి రామ' మకుటము గలదు. ఇందలి ముఖ్య విషయములు యోగ సాంఖ్య తత్త్వములు. ఇట్టి వచన రచనలు కన్నడమున బసవేశ్వరుఁ డుపక్రమించెను. గా(బోలు. అతని తరువాత కన్నడ శైవులు తెలుఁగు శైవులును, వారివలె తెలుగు వైష్ణవులును ఇట్టి వచనములు పెక్కులు వ్రాసిరి. శివయోగి శిష్యుడైన వేమన్నయు నట్లే వ్రాసి యుండుట యనుభవముగాదు. కాని యిప్పటి వాక్యములు వేమన. వ్రాసినవని నేను నమ్మఁజాల కున్నాను. వేమనయందుఁ గల సంగ్రహశక్తి, భావమును స్పష్టముగా చదరముగా కత్తిరించినట్లు చెక్కి యతికించుశక్తి మొదలగు గుణము లేవియు ఇందుఁ గాన రావు. ఒకటి విని మీరే నిర్ణయింపఁడు
"పూర్ణ సమాధిలో రేచించి పూరించి కుంభించి- పెద్ద గాలివలెనే బరగుచుండు-యేడుకోట్ల వెట్టనాచంబులు గానబడును—మేను చల్లనిగాలి విసరును - గాలి లోపలనుండును గంధర్వనాదంబు-గానపడు వినుబాటలో నుండు (?) ఎంతైన నడువీధి నాడుచుండు"-ఇత్యాది. (చూ, పుటనోధని, పు. 50).
ఇవి కృత్రిమములనుటకు ఇంకొక సాక్ష్యము గలదు. 1వ వాక్యమం దీపద్య గంధి వాక్యముఁ జూడుఁడు.
"అది మూలమందు అంబికా శివయోగి-మూలగురుఁడు మాకు ముక్తి జూపె? " వేమనకు గురువని చెప్పఁబడినవాఁడు లంబికాశివయోగి గాని అంబికా శివయోగి గాఁడు. వట్టి శివయోగులున్నారుగాని ఆంబికా శిపయోగులను నే నెఱుఁగను. ఇందలి పద్యపు నడకకు సహజమైన యతినిబట్టి అంబికా శివయోగి యనియే వ్రాసిన వాని యభిప్రాయమనుటలో సందేహములేదు గదా! ఆంబికాశివయోగి పదమున కర్ధము ముందు విన్నవింతును. తెనుఁగు వ్రాఁతలోని ఆకార లకారములకుఁగల సామీప్యమే యీ బ్రాంతికిఁ గారణము. కాబట్టి పైరెండు శబ్దములకుఁ గల యర్థ భేద మెఱుఁగనివాఁడు, యోగశాస్త్ర శబ్దముల నెవరివలననో విన్నవాఁడు,అనుభవము లేనివాఁడు-ఎవఁడో పైవాక్యములను వ్రాసి వేమన తల కంటఁగట్టి నాఁడని సందేహించుటలో తప్పులేదు.
ఇట్లే బందరువారి ముద్రణములోను కొన్ని వచనములు గలవు. అవియును అందందు పద్యపునడక గలిగి తుచలో వేమ శబ్దముతో ముగియును. వేమనవి కావని సందేహింపవలసిన వానిలో నివియును జేరిసవి.
పై చర్చవలన వేమన పద్యములను శ్రద్ధతోఁ జదువువారికిఁ గలుగు చిక్కులు కొంతవఱకు స్పష్టమగును. సరియైన విమర్శముతోఁ జేసిన ముద్రణము ఒకటైనను ఈవఱకుఁ బ్రెలుపడలేదు. వేమన్న పద్యము లిట్లున్న మేలని తల(చిన వారే కాని, యెట్లుండి యుండవచ్చునని విమర్శించిన వారులేరు. అర్థము తెలియని వారు, ఆర్థములేని సంప్రదాయములకుఁ జేరినవారు, అనర్ధకరమగు అభిమానము గలవారు-ఈ పద్యములను తలయొక దిక్కుగా నీడ్చి చెఱచినారు. ఇతరుల భావములును రచనలును మనకెంత యసహ్యముగానున్నను వానిని తిద్దునధికారము మనకు లేదని తలఁచుట మనవా రనేకు లింకను నేర్వనివిద్య, కావననే, అందందు కొన్ని యనావశ్యకమైన సవరణలున్నను, చిన్నదైనను, ఇప్పటికిని బ్రౌను దొర ముద్రణమే సర్వోత్తమ మని చెప్పటకు సిగ్గగుచున్నది. అతఁడు మనకుఁ జేసిన మహెూపకారమును నే నరగంట చూచుచున్నానని తలఁపకుఁడు. చెన్నపట్టణములోని ప్రాచ్యపుస్తకశాలలోని వ్రాతప్రతుల నొకమాఱైనను చూచిన వారికి తప్ప తక్కినవారి కామహనీయుని "యప్పు తెలియదు. కాని యతఁడు దోసిలి నిండఁ "బెట్టినను, పెట్టిన దెంతమంచి వస్తువైసను, అది బిచ్చమే. ఆతని యౌదార్యమున కతనిని పొగడుదము కాని మన దారిద్ర్యమునకు సిగ్గుపడపలదా ? ఇందఱు తిండికి దండుగ తెలుఁగు వారుండి వేమన వంటివాని విషయమై కూడ ఇంకను తెల్లదొరగారి తిరిపెమునకే యొుడిఁ బట్టవలసినందు కేడ్వవలదా ? ఆంధ్ర మహా పురుషులందఱి తోడ వేమన్నకును యూనివర్సిటీ కుర్చీలపై సమానముగాఁ గూర్చుండఁ జోటిచ్చి ధన్యులైన ధీరులు ఆంధ్ర విశ్వకళా పరిషత్తువారు. వారు ఇంకఁ గొంత యౌదార్యము వహించి, వ్రాఁత ప్రతులను ప్రాఁత యచ్చుప్రతులను సేకరించి, సంప్రతించి, సవిమర్శముగా వేమన్న పద్యముల నూతన ముద్రణ మొకటిచేసి పుణ్యము గట్టుకొందురుగాక ! సామాన్యు లొకరిద్దఱితో ఆ కార్యము సాధ్యము కాదు గావున నా భారము ప్రకృతము వారినే చెందియున్నది.
- ↑ * The Verses of Vemana' వావిళ్ళవారి ముద్రణము, పీఠిక, మూడవ పేజీ చూడుము.
- ↑ †ఈ సంఖ్య బందరులో ప్రకటింపఁబడిన వేమన సూ_క్తిరత్నాకర మను గ్రంథమందలి పద్యసంఖ్యను దెలుపును. వేయివేటు వ్రతులలో నుండి యుదాహరించు నపుడు వానిని ప్రత్యేకముగఁ బేర్కొందును, కాని వట్టిసంఖ్య యెందున్నను అది యీ కూర్పునకే యన్వయించునని తెలియునది,
- ↑ * ఈ పద్యము శ్రీ వంగూరి సుబ్బరావుగారు తమ 'వేమన' గ్రంథములో నుదాహరించిరి. పే. 116.
- ↑ †చూ, వావిళ్ళవారి కడపటి ముద్రణపు పీఠిక.
- ↑ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగాయ చెప్పినది,
- ↑ See Brown's Verses of Vemana, p. 109.
- ↑ † చూ, వం, సు, గారి వేమన, పే. 139
- ↑ * ఈ ముద్రణమున ప్రకాశకులు నాచే నొక చిన్న పీలికి వ్రాయించి టీకి వాసిన వారి పేరు పెకి టింపక పోవుటచే దీనిని నేనే వ్రాసినానను అపఖ్యాతి నాకు గలిగినది. అది బ్రాంతిమూలకము. ఒకరి క_ర్తృత్వము వేమౌsరికి పందించుట కడుంగడు నన్యాయ్యము గావన అది నాదికాదను సత్వము నిచ్చటఁ బ్రకటింపవలసి యున్నిది.