వేమన/ఆరవ యుపన్యాసము
శ్రీ:
ఆఱవ యుపన్యాసము
వేమన వంటివారు
మతము, రాజ్యము మొదలగు నేవిషయములందు సంఘమున కధఃపాతము గల్లినను దానినుద్ధరించి సంస్కరించుటకు ఒక్కఁడు జనించినఁజాలదు. అతc డెంతటి మహాపురుషుఁడైనను మనుష్యుఁడే కావున మానవసామాస్యములగు నిర్బంధములకును మేరలకును లోఁగక తీఱదు. అందును జాతులు భాషలు వేఱువేఱుగా (గల హిందూసంఘము వంటిదాని నొకఁడు నిర్వహింపఁగల్గుట యట్లుండనిండు; దానికి ప్రయత్నించుటయే యసాధ్యము. కావున నిట్టిసమయము లలో సంస్కరణోద్రేకముతో నిండిన యనేకులు బయలుదేఱుదురు. మనకుఁ గల్లిన యిప్పటిరాజకీయాధఃపాతమును సంస్కరించుట కెందఱు మహామహు లవతరించు చున్నారు చూడుఁడు. ఇట్లే వైదికమతమును ఇతర మతములను వేఱువేఱుగా స్థాపించిన యాచార్యుల తరువాత, మనుష్యులకు సహజమైన సుఖకాంక్ష, స్వార్థపరత మొదలగు గుణములచే, ఆయా మతములవారు పారమార్ధికదృష్టి చాలవఱకు నశించి, బహిరాడంబరములలో మాత్రము జాగ్రత్తగలిగి వర్తించుచు, ఆజ్ఞానమునకు ఆ కార్యమునకును మతమొక సాథనముగాc జేసికొనగా సామాన్య ప్రజల నాయవస్థనుండి తప్పించి సన్మార్గమున కీడ్వవలెనని ప్రయత్నించిన వేమనవంటివారు హిందూసంఘ మందనేకు లుదయించిరి. వారు తలఁచిసటే సన్మార్గము కాకపో పచ్చను. కాని యెప్పటి సామాన్యసంఘమున్నది మాత్రము సన్మార్గము కాదనుటలో సందేహము లేదు. తత్వము, నీతి, ధర్మము మున్నగువిషయములను తమ మసస్సాక్షి చేతను అనుభవముచేతను నిర్ణయించుటకు బదులు, తమపెద్దలు మాటలను వినియో, లేక వారిపెద్దలు వ్రాసిన గ్రంథములను చదివియో నిర్ణయించుస్థితికి వచ్చిన సంఘము బ్రతుకు బొమ్మలాటవంటిదే కాని సత్తువగలపదార్ధము గానేరదు. అనగా, అందఱును తమంతట పైవిషయములను నిర్ణయించుకొనుట సాధ్యమా న్యాయమా ? యుని యడుగవచ్చును. అన్నిటికిని ఇతరులనే నమ్ముకొనుట యెంత న్యాయమో యిదియు నంతే ; రెండును అనుచితములే. మన యనుభవములనే నమ్ముకొన్నపుడు మనయజ్ఞానము మనల నెంత చెఱుచునో, యితరులను నమ్ము కొన్నప్పుడు వారి యజ్ఞానము మనల నంతే చెఱుచును. మనుష్యుఁడు ఏ విషయ మందును కేవల స్వతంత్రుఁడు గాCడు ; పట్టి పరతంత్రుఁడునుగాఁడు; మధ్యవర్తి లేకున్న బ్రదుకు సాcగదు. కావున -
"క. వినవలె నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపపలెన్
కని కల్ల నిజముఁ దెలిసిన
మనుజుఁడె పో నీతిపరుఁడు మహిలో సుమతీ,"
ఇట్టివారిలో వేమన్న తరువాత నందరికంటే మొదలు మన మెఱుఁగఁ దగినవాఁడు -
సర్వజ్ఞమూర్తి
ఇందుకు రెండు కారణములు గలవు. వేమన్న కితఁడు అచ్చపు ప్రతిబింబము వలె నుండుట యొకటి. రెండవది కన్నడమువాఁడగుట. మొదటినుండి తెలుఁగు వారికి కన్నడమువారియంత సమీపబంధుపులు ఇతరులుగారు. దేశములు రెండును చాలవఱకంటుకొనియుండుటయేకాక, ఇరుతెగలవారును పలుమాఱొకరి నొకరు ఏలుచును, ఒక్క రాజనకే లోపడుచునుండి, మతప్రచారము, వాజ్మయ రచనము మొదలగు విషయములం దొకరికొకరు సేవచేసినవారు. కొవుననే యిరువురి మార్గములును చాలవఱకొకటే తీఱుగా నుండును. అట్లగుటచేత వారు మనలఁ గూర్చియు, మనము వారిని గూర్చియు తెలిసికొనవలయుననుట ముఖ్యధర్మమని వేఱుగ చెప్పఁ బనిలేదు.
వేమన్న చరిత్రమునుగూర్చి యెన్ని చిక్కులుగలవో యితనినిగూర్చియు సన్ని కలవు. 'బసవరసు' అను ఆరాధ్య బ్రాహ్మణునికిని, అంబలూరు అను గ్రామము లోని కుమ్మరి విధవయగు మాళి" అను దానికిని ఇతఁడు జనించినట్లు కథ ; కథయే కాదు, అతని పేరిటి పద్యములును గలవు. †[2] కాని యితఁడు చిన్న నాఁటి నుండి తల్లిదండ్రులను లక్ష్యపెట్టక, తాను పరమేశ్వరుని వరమున జనించిన వాఁడనియు, మన్ను కైలాసమున ఈశ్వరుని సేవకు(డైన పుష్పదత్తుడనువాఁ డనియుఁ జెప్పుకొనెను. *[3]వేమన్న కిట్టి సంకరజన్మకధ లేకున్నను ఆతనికి క్రమ ముగా తల్లిదండ్రులపై నభిమానము నశించినది
"ఆ, తల్లిదండ్రి మీఁద దయలేని పత్రుండు
పుట్టినేమి వాఁడు గిట్టెనేమి?.." (1853)
అని వ్రాసినను, తుదకు
"ఆ, తల్లి గౌరియగును, తండ్రియా శంభుండు
ప్రమథగణము లఖిలబంధు వితతి
తనకుఁబుట్టనిల్ల తనరు కైలాసంబు." (1-47)
వేమన్న కాలమైనను మేలు; సర్వజ్ఞనిదింకను చిక్కు, ఒక పద్యములో బసవేశ్వరుని శిష్యుఁడని యున్నది (945). వేరొక పద్యములో ఇంగ్లీషువారు శ్రీరంగపట్టణమును వశపరచుకొన్న విషయమున్నది! (1001) అనఁగా, పండ్రెండవ శతాబ్దము మొదలు పదునెనిమిదవ శతాబ్ధంవరకును ఇతనిజీవిత మన్నమాట! ఇతనిని గూర్చి యొక్కువ పరిశోధనచేసి పద్యములను ప్రకటించిన ఉత్తంగి చెన్నప్ప గారు పదునాఱవ శతాబ్దము వాఁడై యుండునని యూహచేసిరి.†[4] కాని యదియు సాధనములులేని చరిత్రకారుల యూహలవంటిదే కాని, యెక్కువ నమ్మఁదగినది కాదు.
ఇతఁడు తలిదండ్రులను తిరస్కరించె నంటిని. దానికి కారణము వట్టిధోర్త్యమై యుండదు. ఇతని జన్మ విచారమును బేర్కొని, జనులపహసింపఁగా తాను సామాన్య మనుష్య మాత్రుఁడను గానని వారి కితఁడు ప్రతిఘటించి నిలిచి యుండును. 'శూద్ర ప్రజ్ఞలు', 'కావు కవిత్వములు" మనలో ప్రాఁతమాటలేకదా. ఇట్లు జాతినిబట్టి వ్యక్తిని తిరస్కరించువారిపై నితఁడు కత్తిగట్టెను గావననే యిట్లను చున్నాcడు'
"ముత్తు నీరలి హుట్టి హత్తు సావిర హడగు ;
హత్తు చిప్పొందు హణమిల్ల; తాయ్తందె
ఎత్తణవరెంద పర్వజ్ఞ." (1112)
(నీటఁబుట్టస ముత్యము పదివేలుచేయును. అట్టి కప్పచిప్పలు పదివేసినను ఒక రూక చేయవు. తలిదండ్రు లెక్కడిలెక్క ? అన్నాఁడు సర్వజ్ఞఁడు.)
వేమనకువలెనే యితనికిని తనశక్తియం దెక్కువ నమ్మకముగలదు. ఇతని సర్వజ్ఞుఁడను పేరుగూడ తలిదండ్రులు పెట్టినపేరుగాఁ దోcపదు. సర్వజ్ఞుడను బిరుదు గలవారనేకులున్నారు గాని, అట్టి పేరుగలవారి నిదివఱకును నే నెఱుగను. ఇఁక ఇతఁడును పండితుఁడు గాఁడు గావున, ఇతనిశక్తికి మెచ్చి యే ప్రభుపుగాని యాకాలమున నీ బిరుదు నిచ్చియుండcడు. కావున యెవరో యితని ధూర్తపు మాటలు విని వీcడేమి సర్వజ్ఞ(డా ?' యని యూక్షేపించిరి గాcబోలు. *ఏల కాఁగూడదు?" అని ఆ పేరే యతఁడుంచుకొని పద్యములు రచించి వారి మొగమునఁ బాఱవేయఁ జొచ్చెనేమో! ఇదియే నిజమేని తన పుట్టినపేరు జాతి మార్చుకోcదలపని వేమన్న కన్న సంఘతిరస్కారమున నితఁడొక మొట్టు ముందు పడినాఁడని చెప్పవచ్చును. వేమనవలె నితఁడును చాలవఱ కుద్రి క్తస్వభావము కలవాఁడు. చదువు సంధ్యల నిర్బంధమున కెక్కువ లోఁగినవాఁడు కాఁడు. సహజముగా పదనైన కవితాశక్తి కలవాఁడు. హాస్యప్రియుఁడు. 'నక్కునగినువానుడిలేను' (నవ్వి నవ్వించుమాట లెస్స) యని నిర్ణయించినవాఁడు (1236). అట్లే నవ్వి నవ్వింపఁ గలవాఁడు. కావననే ఇహలోకసౌఖ్యమును వేమన్నకన్న నెక్కువ ప్రీతితో తృప్తితో ననుభవించినవాఁడు. వేమన్నయందు చిన్ననాఁటినుండి అతృప్తియను ధర్మము మితిమీరియున్నది. ఇతనియందును గలదుగాని యంతలేదు. అనఁగా, నితడు గొప్ప ధనవంతుఁడుగా నుండెనని కాదు. మనోధర్మము గాని వస్తుధర్మము గాదు, వేమనవలె నితనికిని నేయి, పాలు, పెఱుఁగు, పప్పు మొదలగు సామాన్య వస్తువులమీఁదనే కాక, మినుపవడలు, ఓళిగలు, కజ్ఞాయములు మొదలగు విశేషపు తిను బండములపైCగూడ నాదరము మెండైనను, జొన్నలు, కొఱ్ఱలు, రాగులు మొదలగు ధాన్యములపైనను ఆభిమానముగలదు.*[5]ఇతని సంసారలక్షణ మేమనఁగా వెచ్చని యిల్లు, వెచ్చమునకు డబ్బు, రెండెద్దులు, ఐదుగురు కొడుకులు (?), వట్టిపోని ఆవులు, వెనుదీయక పనిచేయుకోడలు, ఒక ముసలి యవ్వ, తన యిచ్చనెఱుఁగఁగల గుణవతియగు భార్య-ఇవి యున్నచో 'స్వర్గక్కెకిచ్చు హచ్చెంద సర్వజ్ఞ (పే. 267). స్వర్గమునకు నిప్పంటించు మన్నాఁడు సర్వజ్ఞCడు. అనఁగా, నితడు వేమనకంటె బుద్ధిమంతుఁడై యేక పత్నీవ్రతమును మర్యాదగా పాలించి బ్రతికినవాఁడని యూహింపకుఁడు. అతనివలె నితఁడును జారస్త్రీలు, వేశ్యలు మొదలగు వారికి లోపడుటయేకాక, ఆ ప్రపంచమున నతనికన్న నొకచేయి యొక్కువగానే పోరాడినవాఁడని చెప్పవలసి యున్నది. ఎట్టివారు జార స్త్రీలను విషయమును తెలుపుటకితఁ డనేకపద్యములు వ్రాసినాఁడు (1664-1771) . స్త్రీవశీకరణమునకు తక్కిన వేఱువెల్లఁకులేమియుఁ బనిలేదంట. బంగారువేఱుచే వారు తప్పక స్వాధీనమవదురcట ! (1628) ఇట్లే వేశ్యల గూర్చియు పలుపద్యములితఁడు వ్రాసెను (పే.289). వారి విషయముగా నొక్క మంచిమాటయైనను వ్రాయలేదు సరిగదా, మీఁదుమిక్కిలి వట్టిమాటలచే వారిని మరులు కొలిపి డబ్బీయక దగాచేసినవాఁడే జాణయనియు నొకచోటఁ జెప్పినాఁడు ! (1766) కాని యీవర్తనము అనుచితమని యితఁడెఱుఁగును. ఇతరులకట్లే బోధించెను. నిజమైన సుఖమేదనఁగా -
"జోళూ బోనాగి మేలె కెనె మొుసరాగి
వేళగె బరువ సతియూగె, సూయను
కోళ దిక్కెంద సర్వజ్ఞ" (1559)
జొన్నన్నము, మీఁగడపెరుగు, వేళకువచ్చుసతి–ఇవియున్నచో వేశ్యను కొఱత వేయుము-అని యర్ధము. అవి లేనప్పడు వేశ్య పనికివచ్చునని తార్పర్యము!
ఇట్టి తృప్తిగల స్వభావము గలవాఁడు గావుననే, వేమనవలె అడుగడుగు నకును బ్రహ్మను దిట్టక, మనకు తెలియని విషయములను గూర్చి చింతించి, మనకు సాధ్యముగాని కార్యములను సాధింపఁ బ్రయత్నించి, అవస్థపడుటకన్న 'శివతోరిదంతిహుదె లేను సర్వజ్ఞ'-శివుఁడు చూపినట్లుండుట లెన్స-యను కొన్నాఁడు (815) "బందీతు రోగ నినగెందు అంజికె బేడ,
బందుదను ఉండు సుభిసుత్త,
రోగబం దందిగెద్దేళు సర్వజ్ఞ." (343)
(రోగమువచ్చునేమోయని భయపడవలదు. వచ్చినదితిని సుఖింపుము. రోగము వచ్చినపుడు లేచి పొమ్ము)
అనఁగా, ఇతఁడు శాంతమూర్తియై, చప్పడులేక, యనేకులవలె చప్పిడి బ్రతుకు బ్రతికినవాఁడని కాదు, వేమనవలెనే యితనిని రేగఁబెట్టుటయు భేరిని "జోకొట్టినట్లే". మాటలపదనులో ఇరువురును ఒకరికొకరు ఎందును దీసిపోరు. ఇద్దఱి తిట్లును తెగని చే(దుగలవే. కాని వేమన్నకన్న నితనిలో నెమ్మది, ఉదాసీనము కొంచె మొక్కువగాఁ గానవచ్చును. కావుననే వేమన కున్నంత అసహ్యము ప్రపంచముపై నితనికుండలేదు.
వేమనవలె నితనికిని సంగీతమందభిరుచి కలదు. అతనికన్న కొంచెమొక్కువ ప్రవేశము గలదేమో. తంతివాద్య మేలని అందును వీణు లెస్స యని యెతఁడును తల(చెను (1029). వేమనకు ప్రియమైన ఆటవెలఁదికన్న ఇతని త్రిపది సంగీతమన కెక్కువ పనికివచ్చు స్థిరమైన లయగతిగలది ఇది పద్యమనుట కన్న పాటయనుటయే మేలు. ఏక వాదము వేమన్నకన్న నితనీ కెక్కువ పనికి వచ్చును. ఈ త్రిపదిలో పద్యములవలె, గురువు గురువు గాను లఘుపు లఘువు గాను ఉచ్చరించినఁజాలదు! తాళపు నడకకు తగినట్లుగా రెండును కొంతమార్చి సరిచేసికొనవలసి యుండును. సంగీత గాండ్ర కితని యుపదేశ మొకటి చాల విలువయైనది కలదు.
"అర్థవిల్లదహాడు వ్యర్థసాసిర విద్దు,
ఆర్తియిం కత్తి యరచి, దదరల్లి
అర్థవుంటెంద సర్వజ్ఞ." (1208)
(అర్థంలోని పాటలు వేయియైనను వ్యర్ధము. మనసిచ్చి గాడిద యరచినను అందును ఆర్థముగలదు.) అర్థములేనిపాట యంతకంటె చెడుగని భావము. వేమన్నకు తోడిరాగముపైఁ బ్రీతియంటిని. ఇతఁడు నాటిరాగము లెస్స యను చున్నాఁడు (269). తోడివలె దీనియందును అసహ్యము, పట్టుదల, ఆతృప్తి, స్వతంత్రము మొదలగు భావములను జూపవచ్చు నైనను, దైన్యము దానియందు వలె దీనియందంత స్పష్టముగాఁ జూపసాధ్యముగాదు. మనుష్యుఁడనై యెందుకును జేఁతగాని వాఁడనై, యేమియుఁ దెలియనివాఁడనై, పుట్టితినే యను దుఃఖము వేమనకున్నది ; నిజమే కాని దానినిగూర్చి దుఃఖించిన "దేహము కృశించునే? (815) ఫలములేదు గావున ఉన్న నాల్గునాళ్లు చేతనైనంత పనిచేసి తనకు ఇతరులకును సుఖముగా బ్రతికి చత్తమను భావము సర్వజ్ఞునిది. నాటి రాగమందీ ధీరగుణము చక్కగాఁ జూపవచ్చును.
కావున యుద్ధసమయములందు శౌర్యము, ప్రాణమునకు వెఱవకుండుట, ఇత్యాది గుణముల నితఁడు చాల ప్రశంసించి యున్నాడు. 'అమ్మనాడిని యువదు బొమ్మ నాదడెయేను ?" (629)—బ్రహ్మయెదురు పడిననేమి ? తన బిరుదును జెప్పిపొడుపవలయును-అని యితని మతము, 'జాతి వీరరునావధీతి గంజళివరే?" (628)-'జాతివీరులు చచ్చుటకు వెఱచి వెనుదీయుదురా' యనియు "మురిదు బందగా తరియదాకత్తియు, నరెదు ముక్కువనె!"(675)
- తెగివచ్చినపుడు నరుకలేని యా కత్తి యేల నూరుకొని త్రాగుటకా ? యనియ నితఁడతి తీవ్రముగాఁ బలుకును.
"ఆ. పరబలంబుఁ జూచి ప్రాణరక్షణమున
కురికి పాలీపోవ పిరికినరుఁడు;
యముఁడు అలిగితేను యవ్వరడ్డంబయా ?..." (2432))
అని వేమన్నగూడఁ జెప్పెను. కాని యీ విధమైన శౌర్యంబునందు అతనికంత యభినివేశము కానరాదు. ఇట్లు శౌర్యమునందును సంసారసుఖమునందును ఆశగలవాఁడు కావుననే యితఁడు దానిని దీర్చుకొనుటకు కొన్నాళ్లు రాజసేవ చేసినట్లున్నది. వేమనయు చేసియుండునని యూహించితిమిగాని యతనికది చాలదినములు సాఁగియుండదు. ఈ విషయమం దితనికున్నంత యనుభవ మతనికి లేదు. ఆ నిప్పును చాలనాళ్లు అణఁచిపెట్టుకొనఁగల రాజు ఆ కాలమందే కాదు, ఏ కాలమందును గలుగఁడు. ద్రవ్యార్జనకై కొన్ని దినములాపని చేసిచూచి త్వరలోనే యతఁడు విసిగి
"ఆ. ఎంత సేవఁజేసి యేపాటుపడినను
రాచమూక నమ్మరాదురన్న!
పాముతోడి పొందు పదివేలకైనను..." (638)
అని తెలుసుకుని యీ పీడవదిలించుకొనెను. సర్వజ్ఞC డట్లుగాక, రాజుల చిత్తవృత్తి నాశ్రయించి నడిచి, వారి మంత్రుల యడుగులకు మడుఁగులొత్తి, కొలువులోని తక్కిన పెద్దవారియెడ వినయవిధేయతలు చూపి సేవించినాఁడు (645-660) 'స్వామి కార్యక్కె మడియలేబేకు' (706) 'స్వామి కార్యమునకై చచ్చియే తీరవలయును" అని సంకల్పించి ఒడలు దాఁచక వారికై పోరినాఁడు, కాని, జారత్వము, చోరత్వము, అసత్యము మొదలగు దుర్గుణములు వారియందు చూచి, వాని ఫలమనుభవించి విసిగి వేసరినాఁడు. *[6]తుదకు 'బిన్నపవ గ్రేళ్లదర సినోలగదింద సన్యాసలేసు' 'మనవిని వినని దొరకొలుపుకన్న సన్యాసము మేలు" (690) అని నిర్ణయంచుకొన్నాఁడు.
మొదటినుండి యితఁడును బసవేశ్వరప్రతిపాదితమైన లింగధారివీర శైవ మతమునకుఁ బేరినవాఁడు. కావున నితనికి తలఁచుకొస్నప్పడు సన్యాసమిచ్చు శివయోగులకు ఆ మతమునకుఁ జేరినవారిలో కరవులేదు. ఇట్టివారిలో నెవఁడో యితనిని జంగముగాఁ జేసి యోగమార్గ ముపదేశించినాఁడని తోఁచుచున్నది. కాని యీ యోగసాధనకు మొదలు ఇతనికి, సామాన్యముగ నందఱి వలె, బహిరంగ వేషములందు నమ్మిక కలదు. విభూతిరుద్రాక్షలు ధరించిన వానికి పాపము బయలై ఉన్నచోటికి శివుఁడు వచ్చునని యితడు తల(చెను (99). లింగములేక యేదియు తినరాదు (108). తానుభుజించు వస్తువుల నెల్ల మొదలు శివార్పణము చేసి పిమ్మట భుజింపవలెను (107). జంగములు సాక్షాచ్ఛివస్వరూపులు, వారి కిచ్చిన శివునికి నైవేద్యము చేసినట్లే (142). కావున 'తిరుదు తందాదరూ కరెదు జంగమకిక్కు' 'తిరిపెమెత్తి తెచ్చియైనను పిలిచి జంగానికి పెట్టుము' (549) అని యితనిబోధ. ఔదార్యవిషయమున వేమనవలెనే యితఁడును అతివాదియై *తిరిపెమెత్తియో పీడించియో దొంగిలించియో తెచ్చి పిలిచి దానమిమ్ము' (550) అని చెప్పినను, దానపాత్రవిషయమున అతనికున్నంత విశాలదృష్టి యితని కున్నట్లు తో(పదు. ఇతనిమతమున అందఱికిచ్చుటకన్న శివభక్తులకిచ్చు దానమే శ్రేష్టము (551-553) కాని గతిలేని చేతఁగానివారేమి దానము చేయఁగలరు ? ఇతని యుత్తరము, జంగాలు తెచ్చిన బియ్యము వండి పెట్టుట, ఉండుటకు తావిచ్చుట, తాగుటకు నీరిచ్చుట ? (554) ఇది గూడ చేయలేని పేదవారుండరు గదా!
ఇట్లతనికి వేమన్నకన్న శివపక్షపాతమును, ఇతరదేవతలయం దనాదరమును కొంచెమెక్కువగా నుండెను. 'నరసింహుని యవతారము పెద్ద విచిత్రమే కాని శరభుఁడు గోటితోఁ జంపునపుడు విష్ణువూరినక్కవలె నాయెను' (175). కావున పదిజన్మములెత్తి ఎద్దుగేదెలను గాచి, పాండవుల సేవకుఁడైన హరి యేటిదేవుఁడు ? అని యితఁడు ప్రశ్నించుచున్నాఁడు (174). కాని యోగసాధనకుఁబూని చేయఁగా అందుఁగలుగు చిత్రవిచిత్రములగు ననుభవములు గమనించి, బ్రహ్మసాక్షాత్కార సౌఖ్యమనుభవించుటకు మొదలిడిసవెంటనే యితనికి బహిరంగములగు భావ లన్నియు వేమనకువలెనే నశించినవి. ఈ విగ్రహపూజలు, ఈ వేదవాదములు, ఈ జాతిబేదములు మొదలగునవన్నియు తత్త్వనిర్ణయముననెందుకును తరముగావని తలఁచెను. 'చెడురాళ్ళకు వట్టిపూజ చేయకు వేమా!? (2372) యని చెప్పిన యతనివలెనే యితనికిని, దేవళమందలి శివలింగము సంబారము నూఱుటకు పనికివచ్చుగుండేకాని వేఱుకాదని తోఁచినది. “సంబారవరేవ బలుకల్లు హరనెందు నంబువవరారు నర్వజ్ఞ’ (165). ఎన్ని వేదములున్న నేమిఫలము ? " అనుభవియ వేద వే వేద? (816)-అనుభవించిన వాని వేదమే వేదము. మఱియు 'నాల్గు వేదములును నాల్గుచన్నులు; నాదమేనురుగు పాలు, దీనిని సాధించుశక్తి శివయోగికి తప్ప తక్కినవారికి లేదు? (424). వేమనయు “వేదసార మెల్లవేమన యెఱుఁగును" (3607) అని చెప్పెను. యోగులెల్ల నిట్లే చెప్పకొందురు.
"మథిత్వా “చతురోవేదాన్ సర్వశాస్త్రాణి చైవహి
సారస్తు యోగిభిః పీతస్తక్రం పిబతి పట్టితః "
(జ్ఞానసంకలినీ తంత్రము, 50)
(అన్ని వేదములును శాస్త్రములును మధించి యోగులు సారము త్రాగుదురు. పండితుఁడు వట్టి మట్టిగ త్రాగును.)
కా(బట్టి జ్ఞానికి వాదముతోఁబనిలేదు. మఱియు బ్రహ్మజ్ఞానము గలవాడూరకుండవలయునే కాని దానినిగూర్చి చర్చించుట, దొంగిలింపఁ బోయినవాఁడు తుమ్మినట్లగును (324). వేమనయు “లోచూపచూడ నొల్లక వాచాబ్రహ్మంబు పలుకవలదుర వేమా? యని చెప్పెను (3340). యజ్ఞయాగాదులందతని కెంత ద్వేషమో యితనికి నంతే. ఒక మేకను జంపి తిన్నవాఁడు స్వర్గమును జేరఁగల్లునేని. యెప్పడును మేకలను లెక్కలేక చంపి తిను కటికవాఁడు దేవేంద్రుఁడే గావలదా ? యని యితని ప్రశ్న (847). ఇఁక వేమనవలెనే జాతిభేదములనుగూర్చి దండెత్తిన బనవన్నమతమునఁ బెరిగిన యితనికిని పరబ్రహ్మానుభవము తోడై, యితనిని వానికి పరమశత్రువుగాఁ జేసినది. ఆందఱి కన్న నెక్కువయనఁబడు బ్రాహ్మణులయెడ ద్వేషమును, తక్కువ యనఁబడిన చండాలులందు కనికరమును గలిగినది. బ్రాహ్మణులు ధర్మచ్యుతులైరనియే యితనికిని వేమన్నవలె వారిపై కోపము. యోగ ధ్యానముల నెఱుగక బ్రాహ్మణులు భోగులైపోయిరని వగచెను (825). “తల్లి శూద్రురాలు తానెట్లు బా(పఁడు ? (1476) అని యడిగిన వేమన్న వలెనే, వడుగుజందెములేవియులేని తల్లి భార్య మొదలగువారితో కలిసి వర్తించినను, అట్టి శూద్రులను దాఁకక వారికన్న తానెక్కువయను బ్రాహ్మణుని దేటి బ్రాహ్మణత్వ మని యడిగెను (827). వారిని నమ్మి యెవరు బ్రతికినారని యతనివలె నితఁడును ఆక్రో శించెను! (904) కాని నీతి నెఱిగిన బ్రాహ్మణుఁడు లోకమునకు జ్యోతివంటి వాఁడని నిర్వంచనగాఁజెప్పెను (888). కావున జన్మసిద్ధములైన యెచ్చుదక్కువలు దబ్బర 'ఒక భూమిపై నడిచి, ఒక నీటినే త్రాగి ఒక యగ్నిలోనందఱు మండి పోవుచుండఁగా, నడుమ కులగోత్రము లెక్కడివి?" (879) కావున “స్వర్గది హెూలె గేరి యిల్ల' (863) “దేవరలి కులభేదవిల్ల? (864) : స్వర్గమున మాలవాడ లేదనియు, దేవునికి కులభేదము లేదనియు, ఖండితముగా ఇక జెప్పెను.
ఇఁక నాదేవుఁ డెట్టివాఁడు ? అతఁడు జగమునకెల్ల నొకఁడే ప్రభువు (150). అతఁడు శివుఁడు. నిరాకారుఁడు (95); సర్వవ్యాపి; పాలలో నేయివలె, నీటిలో నగ్నివలె అన్నిటియందును గలఁడు (275). నీవున్న చోటనే నీలోనే కలఁడు (276). ఆదెట్లు సాధ్యమని యెవరైన ప్రశ్నించిరేని---
“నణ్ణనెయ మళలొళగె నుణ్ణనెయ శిలెయొళగె
బణ్ణెసి బరెద పఠదొళగె, ఇరువాత
తన్నల్లి యిరనె సర్వజ్ఞ? (280)
“సన్నని యిసుకలో, నున్నని రాతిలో, వన్నెల పటములలో ఉండగలవాఁడు, నీలో నాలో నుండలేఁడా ?" యని యితఁడు ప్రతి ప్రశ్న వేయుచున్నాఁడు. యోగ సమాధిలో నిలిచి, ఆన్ని భేదములను మఱచి, తానే తానైయున్న, నందే బ్రహ్మ సాక్షా త్కరించును (282). జీవులకే ఆజ్ఞానరూపమగు మాయ కలదు గాని యతనికి లేదు (287). తన్ను తానెఱిఁన నా మాయ నశించును (306).
ఇట్లు జీవబ్రహ్మలకు భేదమే యితని యనుభవమునకు వచ్చినదిగాని, వేమనకువలె పరిపూర్ణాద్వైతానుభవము కలిగినట్లు తోపఁదు. శివపక్షపాతము మొదలు గలిగినను కడపట “ముగ్గురికందని మూలమూర్తి యొకండు? (3103) యని చెప్పి “తన్ను తానెఱి(గిన తానెపో బ్రహ్మంబు? (1787) అన్న వేమనవలె నిశ్చ యముగా నితఁడు చెప్పలేఁడయ్యెను. అతనివలె ఆతృప్తితో ముందుమందింకను జూడవలెనను నాశ లేక, కొంతవఱకు దొరికినదానికి సంతోషించు స్వభావము గలవాఁ డగుటయే యిందుకు కారణమని తలంచుచున్నాను. పరమఫలమైన యద్వైతావస్థ లభింపకున్నను, హఠరాజయోగముల యభ్యాసముచే నితనికి వేమన్నకుఁ గలిగిన తక్కిన ఫలము లన్నియు-సర్వసమత, బహిరంగద్వేషము మొదలగునవిలభించినవి. మఱియు, బ్రహ్మాద్వైతమును సాధింపవలయునని యితఁడు ప్రయత్నింపనేలేదని చెప్పవచ్చును
"అద్వైత కోడాడి యిద్దుదను హెూగాడి
ఉద్దన మరద తుదిగేరి, క్రెజారి
బిద్దు నత్తంతె నర్వజ్ఞ." (285)
"అద్వైతమునకై తిరిగి యున్నది పోగొట్టుకొనుట, పొడువైన మ్రాని తుద కెక్కి చేయిజారి పడి చచ్చినట్లు" అని యనుకొన్న వాఁడితఁడు. కాని యితనికి జీవా ద్వైతము-అనగా, ప్రాణులందఱు నొకటేయనుట-సిద్ధించినది. “తానద్వైత మైన పిదప ఎవరితో కలహింపవలెను? బుద్ధిలో తన్నెఱిఁగిన వానికి లోకపు జగడ ములు లేవు? (337) కావున నిజమైన యోగి వేషము, తిండి మొదలగు వానిఁ గూర్చి కలఁతలు పెట్టుకొనక, దొరికినది తిని దొరకకున్న నూరకుండి, యే యింటి పంచనో యే చెట్టుక్రిందనో పరుండి, యెప్పడును శివధ్యానానంద మనుభవించుచు, చావు వచ్చినపుడు నంతోషముగా లేచిపోవ సిద్ధముగా నుండవలసినదే కాని, సంసారమునఁబడి ఆలుబిడ్డల పంచనుండిన కైలాసము లభింపదనియే నర్వజ్ఞుఁడు తలఁచెను. వేమనవలెనే యితనికిని అడవుల కొండలఁ బడియుండుట యసహ్యము. మనసులో ధ్యానించువానికి ఇల్లు, మఠము, అడవి, కొండ అన్నియు నొకటే యనియు, అదిలేని వాఁడు దేవళము గర్భగుడి'లో నున్నను, కొండ కొననున్నను ఒకటియే యనియు నితఁడన్నాఁడు (247). ఇతఁడు తన జీవితము నిట్లే కడపె ననుటలో నందేహము లేదు. కాని యంతకన్న నెక్కువ తెలియదు.
వేమన వలెనే యితఁడును వ్రాలకందక వేలనంఖ్యగా పద్యములు చెప్పిన వాఁడు. సమయము దొరకినప్పడెల్ల మాటలకు బదులుగా పాటలే యుపయోగించిన వాఁడు. ఈవిషయ మావిషయ మనకుండ దొరకినదానిపైనెల్ల పదము లల్లిపారవేసిన వాఁడు. ఇట్లు అట్లు అనక వచ్చినట్లెల్ల వాగిననోరితనిదిగూడ, శబ్దములు సహ్య ములు కాకపోవచ్చును; అర్ధమన్యాయం గావచ్చును ; కాని అశక్తి మాటలు, అంటని భావములు ఇతనినోటినుండి వెడలవు. వేమన వలెనే యితఁడును దేశ సంచారముచేసి తనకుఁ దెలిసిన తత్త్వనీతి ధర్మములను ప్రాస్తావికముగా ప్రజలకు బోధించిన వాఁడే, కాని యతనికన్న నితనికి లౌకిక మొక్కువ. తన మాటలు వినని మూరఖులనతఁడు ఎద్దులని, గులాములని, గాడ్దెలని చెడఁదిట్టినవాఁడు. ఇతఁడును అట్టి కుందేటికాళ్ళ వాదమువారి నెదుర్కొనక పోలేదు. కాని వారితో కలహించుట కిష్టములేదు : ఫలములేదు గావున, వారిని గూర్చి యితఁడే మన్నాఁడో వినుఁడు.
"నెలవన్ను ముగిలన్ను హెలివరుంటెందరే
హెలివరు హెలివరెన బేకు ; మూర్ధనలి
కలహవే బేడ సర్వజ్ఞ." (940)
(భూమిని ఆకాశమును చేర్చి కుట్టఁగలవారున్నారనిన, కుట్టఁగలరు కుట్టఁగల రనవలెను, మూర్థులతో కలహమేవలదు); కావున * మూర్ఖను అందంతె అన్ని' : "మూర్ఖుఁడు చెప్పినట్లు చెప్పఁడు" అని యితఁడు బోధించెను (943).
తొడకులేని ధారాళమైన శయ్య, అందఱికిని అర్థమగు భాష, ఎల్లరు అనుభ వించి యెఱింగిన యుపమానములు, మఱుఁగులేని మాటలు, నవి నవ్వించు హాస్యము—ఇవి ఇతని కవిత్వమందును ముఖ్యతత్వములు. జ్యోతిషము, వైద్యము, శకున శాస్త్రము, కామశాస్త్రము—మొదలగువాని యందితనికి వేమన కంటె నెక్కువ ప్రవేశము గలదు. రసవాదమందును అతనికున్నంత నమ్మికయు ననుభవమును గలదు. అసభ్య విషయముల నిరువురికిని ఎగ్గులేదు. ఇరువురును అర్థముగాని 'కూట పద్యములను అందందు వ్రాసినవారే. ఇట్లు, స్వభావము నందలి యల్పభేదముచేత దృష్టిలోను ఇరువురికిని కొంత భేదముగానవచ్చినను, మొత్తముమీఁద ఇరువురును ఒకరినొకరు తీర్చిన ప్రతిమ లనవచ్చును.
ఇదిగాక యిరువురును ఒకరితోనొకరు మాటలాడుకొని వ్రాసినట్లున్న పద్య ములు కొన్నిగలవు. చూడుఁడు(1)
(1) "కట్టలూబిడలు శివ బట్టలవ కద్దనే ?
కట్టలూ బేడ ; బిడబేడ; కణ్మనవ కట్టిదరె సాకు సర్వజ్ఞ." (148)
"ఆ. బందెతాళ్ళదెచ్చి బంధించి కట్టఁగ
లింగఁడేమి దొంగిలించినాఁడా ?
ఆత్మలింగమునకు నర్చింపనేరరో?" (2685)
(2) "ఒడల దండిసి ముక్తిపడెవె నెంబుప హెడ్డ
బడిగెయలి హత్త హెుడియలడగిహ సర్ప
మడియువదె హేళు; సర్వజ్ఞ" (510)
"ఆ. ఒడలు బడలఁజేసి యోగులమనువారు
మనను కల్మషంబు మాన్పలేరు
పుట్టమీఁదఁ గొట్ట భుజగంబు చచ్చునా?..." (806)
(3) "కొట్టు బహ కాలదలి కొట్టుణలి కరియదే
హుట్టియ ఒళగె జేనిక్కి, పరరింగె కొట్టు హెూదంతె నర్వజ్ఞ." (605)
"ఆ. ధనముఁ గూడఁబెట్టి ధర్మంబు సేయక
తాను లెన్సదినక దాcచు లోభి ;
తేనె నీగగూర్చి తెరువరికియ్యదా?..." (2107)
(4) "కల్లుప్పు కర్పురవు సొల్లెరడు ధాతొందు,
ఖుల్ల నొళ్ళిదన రూపొందు, గుణదొళగె,
ఎల్ల అంతరపు సర్వజ్ఞ." (727)
"ఆ, ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు
చూడఁ జూడ రుచుల జాడ వేఱు
పురుషులందు పుణ్యపురుషులు వేఱయా.. " (534)
ఇట్టి వింకనుగలవు. ఈపోలికలు కేవలమాకస్మికములేనా, లేక యొకరినింకొ కరుచూసి వ్రాయుటచేఁగల్గినవా యను చర్చకుఁ జేయివేసి ఫలములేదు. అసలిరువురి కాలము స్పష్టముగా నిర్ణీతము గాలేదు. కావున ఇరువురిలో నెవరు మొదలుండిరో చెప్పలేము. ఉత్తంగి చెన్నప్పగారు భావించునట్లు సర్వజ్ఞుఁడు పదునాఱవ శతాబ్దము వాఁడై, వేమన మనము తలఁచినట్లు పదునేడవ శతకపు తుదిలోనివాఁడే యైనచో వేమనయే యితని ననుసరించె నసవచ్చును. కాని వేమన్న కన్నడదేశమునకు సమీప మందున్నవాఁడైనను, తెనుఁగుదేశమందును ఆరవదేశమందును తిరిగినట్లు కాన వచ్చుచున్నదే కాని, కన్నడుల సహవాసమతనికి లభించెనని స్పష్టముగాఁ జెప్ప వీలులేదు. తెలుఁగుదేశమున సర్వజ్ఞుని పదములకు వ్యాప్తి కానరాదు గాని, యతఁడు ఇందు కొంత సంచరించినట్లున్నది. తెలుఁగువారి నితఁడు తిట్టి వ్రాసిన పద్యములు గలవు (1254-55). శ్రీరాములు లంకను జయించిన తరువాత లంకలోని స్త్రీలకును కిష్కింధాపట్టణపు పురుషులకును జరిగిన సంఘసంస్కార వివాహముల ఫలము తెలుఁగువారని యితని మనుష్యశాస్త్ర సిద్ధాంతము (1255)! మఱియు, కన్నడదేశమందు వలసపోయి నిలిచిన యాంధ్రు లనేకులు గలరు. ములకనాటి బ్రాహ్మణులు, కోమట్లు, మంగలివారు, భట్టురాజులు మొదలగు తెలుఁగువా రనేకులు మైసూరు సీమలో నిప్పుడును గలరు. కాని కన్నడు లాంధ్ర దేశమందు చాల తక్కువ. కావుననే వేమన పద్యములకు కన్నడసీమలో కొంత ప్రచారము గలదు. కనుక వేమన్న వాసనయే సర్వజ్ఞునకుఁ దగిలియుండునా యను సందేహమగూడ గలుగవచ్చును. కాని యింతకన్న నెక్కువ దూరము ఈ విషయమును నిర్ణయించుట సాహనము. మరియు నిద్దుఱు ఎవరి కెవరైనను గురువు కాఁగల సామర్థ్యముగలవా రనుటలో సందేహము లేదు.
కన్నడ వచనకారులు
ఇతనివలెనే యోగమార్గము నాశ్రయించి శివ సాక్షాత్కారమునకై ప్రయత్నిం చినవారు కన్నడ వీరశైవులలో ననేకులు గలరు. వారిలో పెక్కురు తమ తమ యనుభవములను, సిద్ధాంతములను కొంత పద్యపు నడకగల 'వచనముల'లో వ్రాసి నారు. బనవేశ్వరుఁడే యీ పద్ధతిని మొదలుపెట్టినవాఁడని తోఁచుచున్నది. వీరు సర్వజ్ఞ వేమన్నలవలె చిక్కిన విషయములకెల్ల చేయి వేయరు, వేసినను నిర్వహించు కొనఁగల కవితాశక్తియు వారికి లేదు. ఇతరుల బాహ్యాచార ఖండనము, స్వమత మందలి భక్తి, శివపారమ్యమందలి నమ్మిక, శివయోగ సాధనపద్ధతులు-ఇవి వీరి వచనములయందు ప్రముఖముగాఁ గానవచ్చును. వీరిలో కొందఱు స్త్రీలును గలరు. మచ్చుకు రెండు మూఁ డాంద్రీకరించి చూపదును.
(1) ‘లోకపు వంకరను మీరేల తీద్దెదరు? మీమీ తనువుల నూరడింపఁడు; మీమీ మనసుల నూరడింపఁడు. పొరుగింటివారి దుఃఖమున కేడుచువారిని మెచ్చఁడు కూడలి సంగమదేవుఁడు."
(బసవేశ్వరన వచనగళు, శివానుభవ గ్రంథమాల, బిజాపుర, ప 19)
(2) “నా దేహమును దండముగాఁ జేయవయ్య; నా తలను సార బుట్టగా చేయవయ్య; నా నరములను తంతులను జేయవయ్య; నావేళ్ళను పుల్లలుగా జేయవయ్య ముప్పదిరెండు రాగములు పాడవయ్య ; ఎదకొత్తుకొని వాయింపవయ్య కూడలి సంగమదేవా !"
(పై, పు. 70)
(3) కొండపై నిల్లు గట్టుకొని మృగములకు వెఱచిన నెట్లయ్య? సముద్రపు గట్టున నిల్లు గట్టుకొని నురుగుతరగలకు భయపడిన నెట్లయ్య? సంతలో నిల్లు గట్టి శబ్దమునకు సంకోచించిన నెట్లయ్య? చెన్న మల్లికార్జునదేవ ! వినవయ్య ! లోకమునఁ బుట్టిన పిదప స్తుతినిందలు వచ్చిన మనసున కోపెంపక నెమ్మదిగా నుండవలెను."
(మహాదేవియక్క కర్ణాటక కవిచరితె, 2, భా, పు. 109)
(4) ఏనుఁగును గాదని యెనుఁబోతు నెక్కిన నెవరేమి చేయుదురు ? కస్తురి విడిచి బురదc బూసుకొన్న నెవరేమి చేయుదురు? పాయసము విడిచి మద్యము త్రాcగిన నెవరేమి చేయుదురు? తెలిసి తెలిసి గుహేశ్వరుని శరణులతో వాదించిన నేవరేమి చేయుదురు చెప్పుమా మడివాళయ్య
(వచనశాస్త్రసార, 1 భాగము, పు. 108)
వీరందఱు మొత్తము మీఁద శివాద్వైతవాదులు. ఇట్టి వచనములు కన్నడ భాషలో లెక్కలేనన్ని కలవు.
ఇదిగాక విష్ణుభక్తిగల కన్నడ మాధ్వులలో పండితులట్లుండఁగా, పామరులలో సామాన్యమైన యీ వేష భాషలు, వాదములు, జాతిభేదములు మొదలగువాని ప్రాబల్యమును జూచి యసహ్యపడి, యా భావములను తమ భక్తిని పాటలరూపమున వెల్లడిపఱఁచిన పురందరదాసు, కనకదాసు మొదలగువా రనేకులు గలరు. వీనినే “దేవరనామము' లందురు. మనలో రామదాసు, త్యాగరాజు మొదలగువారి కీర్తన లిట్టివే. తత్త్వసిద్ధాంతములం దెంత భేదమున్నను మతాంతరులయెడ ద్వేషా నూయాదు లున్నను, నిరర్థకకర్మములు, దంభాచారములు మొదలగు మతవాదుల దుర్గుణములపై కత్తిగట్టుటలో వీరందఱును చాల పనిచేసినవారు. పామరజనులలో నేఁటికిని నిష్కల్మష భక్తి, నమ్మకము, సౌశీల్యము మొదలగు గుణములు నిలిచి యుండుటకు వీరే కారణభూతులు గాని, సూత్రములు, భాష్యములు, వ్యాఖ్యలు వాసిన పండితులు గారు,
తిరువళ్ళువరు
మన యింకొక పొరుగింటివారగు అరవవారిలో చాలవ్యాప్తిఁగాంచిన తిరువళ్ళువరు నాయనారి 'తిరుక్కురళ్ అను గ్రంథముతో వేమన పద్యములను పోల్చి చూడవలయుననుట ప్రకృతోపన్యాసనిబంధనలలో నొకటి. కాని యిరువురికిని పోలికలు చాల తక్కువ. నాకు ధ్రవిడభాషాజ్ఞాన మంతకంటె తక్కువ. కాని తెలిసిసంతలో అతనినిగూర్చి కొంత సంగ్రహముగా విన్నవింతును.
తిరువళ్ళువరు చాల ప్రాచీనుఁడు. ఇతనికాలము క్రీస్తుశకపు మొదటి శతక మని యనేకులు తలఁచినారు. మద్రాసులోని మైలాపూరిలోనున్న వాఁడు. 'భగ వంతుఁడను బ్రాహ్మణునికి 'ఆది' యను చండాల స్త్రీకిని జనించిన వాడని కథ* [7]వళ్ళువరనువారు ఒక తెగమాదిగలే కావున ఇతని పేరు పైకథలోఁ గొంత సత్య మున్నదని సూచించెడిని. ఇతని నిజమైన పేరేమో తెలియదు, నేఁతపని వృత్తిగా బ్రతికినవాఁడు. ఇతని భార్య వాసుకి. వీరిరువురి దాంపత్యము అపూర్వమై చాల సౌఖ్యావహమై యుండెడిదంట.
ఇతఁడు వ్రాసిన గ్రంథము కురళ్ . '" కురల్డ్ " అనఁగా ఒకవిధమగు చిన్న( ఛందస్సు : ఆటవెలఁదిలో ఇంచుమించు సగముండును. ఇతని పద్యములన్నియు ఆ ఛందస్సులో నున్నవి. ఇది ధర్మము, అర్థము, కామము అను మూఁడు పురు షార్ధములనుగూర్చి మూఁడు భాగములుగా వాయఁబడిన యుపదేశ శాస్త్రము. తాను బ్రాహ్మణుఁడు గాకపోవుటచే నధికారములేదని యితఁడు మోక్షమునుగూర్చి వ్రాయక వదలెననికథ, కాని ఉపోద్ఘాతమందలి పద్యములలోను, సన్న్యాసధర్మ ప్రకరణమునందును, భగవంతునిగూర్చియు, మోక్షోపాయములను గూర్చియు, సంగ్రహముగానైనను వ్రాసియే యున్నాడుఁ గావున ఆ కథ మనము నమ్మఁబని లేదు. మఱియు ఇతcడు సుఖియైన సంసారిగానుండి, గృహస్థధర్మములగు అతిథిపూజ మొదలగునవి జరుపు కర్మనిష్టుడై, సత్యము, నీతి మొదలగు సామాన్య లౌకిక ధర్మముల నెక్కువ శ్రద్ధతో నెఱపుచు, దృఢమైన దైవభక్తిగలవాఁడై యున్న వాఁడంతేకాని వేదాంతవిషయముల నెక్కువగా పరిశీలించినవాఁడు కాకపోవచ్చును. ఇతఁడు పై ధర్మార్థకామములో నొక్కొక్కదాని యంగములను ప్రత్యేకముగా విభాగించి ప్రతివిషయమునకు పది పద్యముల ప్రకారము మొత్తము (1330) పద్య ములు వ్రాసెను. గ్రంథకర్త యొక్క విషయ విభాగ శక్తిని సూక్ష్మదృష్టిని ఇందుఁ జూడవచ్చును.దీనికి తోడు చక్కని కవితాశక్తియుఁ గలదు. అనఁగా వేమన్నవంటి యాశుధారగాదు. తిక్కసవలె నెమ్మదిగ చెక్కి చిక్కఁగఁ దీర్చిన రచన యితనిది. భావములందును అతనియు ద్రేక మితనికి లేదు. మార్దవము, ఓర్పు, నెమ్మది యిందుఁ గానవచ్చును. కావుననే వేమన పద్యములవలె నొకమాఱు విన్నంతనే యిది బాణమువలె నెదలోఁ దూకదు. సూత్రమువలె పలుమాఱు మననము చేయ వలయును. హిందూదేశమందలి యన్ని ధర్మశాస్త్ర గ్రంథములందును గానవచ్చు అహింస, సత్యము, వైరాగ్యము, శాంతి, దాంతి, ఆతిథ్యము, రాజధర్మములు మొదలగువానినిగూర్చి యందఱును ఆదరింపఁదగిన సామాన్యనీతుల నితఁడు. వ్రాసెనేకాని యిందు క్రొత్తదేమియులేదు. కాని వాని నితఁడు సంగ్రహించి, సారించి, ఏర్పఱిచి చిత్రకారుఁడు బొమ్మనుచేసినట్లు, నలుప్రక్కలు నిదానముగాఁ బరీక్షించి, ఎక్కువతక్కువలు దిద్ది, తీర్చి నెమ్మదిగా కవిత్వపు మొఱుఁగులిచ్చి, పరిపూర్ణముగా బైటఁబెట్టినవాఁడు. కాని, ప్రాచీనులందఱి వలె పై విషయములను మితిమీఱి చీలికలుగా విభజింపఁ బూనుటచేతను, ప్రతివిషయము మీదcను పది పద్యములు తప్పక వ్రాయవలయునను నియమముచేతను, అందందు కవితాశిల్పము పలుచనై చప్పిడియైనట్లు కానవచ్చును.
వేమన్న విరక్తకవి. ఇతఁడు సంసారికవి. కావుననే యతఁడు చిన్న బిడ్డలు *మురికిముద్దలని 'ముద్ధఁ జంకబెట్టి ముద్దాడనేలరా ? (వే.జ్ఞా, 1112) యని యసహ్యపడి మొగ మావలCద్రిప్పకొనఁగా, ఇతఁడు—
"చిన్న బిడ్డలు చిఱుఁగేలఁ జెఱచినట్టి
బోన మమృతంబు కంటె నింపానుగాదె?" (స్వాంద్రీకృతము)
(కురళ్, అరత్తుప్పాల్, పుదల్వరైప్పెరుదల్ 4)
అనెను. వేమన స్త్రీవ్యక్తిని తిరస్కరించి విధిలేక దానికి లోఁగినట్లు తోఁచును; తిరువళ్ళువరు స్త్రీయెడ చాలగౌరవముతో అభిమానముతోఁ గూడినవాcడు. *తమకు ప్రియలైనవారి కౌగిలికంటె తామరకంటి దేవుని లోకమందును ఏమి సుఖము గలదు?" అని యితని ప్రశ్న (కురల్, కామత్తుప్పాల్, పుణర్చి మహిళ్లల్ 3). ఈ కారణముచేతనే యితనిని తిరన్కరించిన వారెవరును లేకపోవుట యట్లుండఁగా ననేకులు పండితులు దీనిని పొగడి వ్యాఖ్యానములు వ్రాసిరి. ఇది ప్రమాణగ్రంథ మయ్యెను. ఉత్తర వేదమని, దైవనూలని దీనికి పేళ్ళు గలిగెను. సుమతిశతకపు కర్తయైనను 'శ్రీరాముని దయచేతను" అని యుపక్రమించుటచేత, శ్రీరామ ద్వేషులెవరైన దానిని దిరస్కరింపవచ్చునుగాని, యితఁడు, 'నామలింగాను శాసనము' వ్రాసిన యమరునివలె, ఏ దేవతను పేరుతోఁ బిలువక, "ఆదిభగవంతునికి' నమస్కరించి గ్రంథముపక్రమించి, అందు ఏ మత పక్షపాతమును జూపక, సర్వ మత సాధారణములగు శాశ్వత నీతులను గూర్చి మాత్రము వ్రాయుటచేత, అందుఱికిని కావలసిన వాఁడయ్యెను. కావననే యోగ్రంథము 150 ఏండ్లకు ముందే 'లాటిను" భాషలోనికిని, తరువాత, జర్మన్, ఫ్రెంచి, ఇంగ్లీషు భాషలలోనికిని పాశ్చాత్త్యులు పరివర్తించుకొనిరఁట. *[8] నేఁటికి నలువదేండ్లకు వెనుకనే "త్రివర్ల దీపిక" యను పేరుతో కనుపర్తి వెంకటరామ శ్రీవిద్యానందులను వారు దీనిని తెలుఁగులో మొదటి రెండు ధర్మార్ధకాండములు పరివర్తించి ప్రకటించిరి. ఆంధ్రులు దాని నెక్కువ గమనించినట్లు కానరాలేదు. నహజమే. ఎందుకనఁగా, ఆంధ్రీకరించినవారికే యది యితరులకర్థము కాదని గట్టినమ్మకము కలుగుటచే, వారే దానికి వ్యాఖ్య, దానికి తాత్పర్యమును వ్రాయవలసివచ్చెను. ఇట్లు వ్యాఖ్యతో నాంద్రీకరణమును దానితో మూలమును అర్ధముచేసికొనువఱకును నిలిచియుండఁ గల కవిత్వమును రచింపఁగల్గినవాఁడు ఈ ప్రపంచమున నింకను బుట్టలేదు. ఇది గాక శ్రీ గరిమళ్ళ సత్యనారాయణగారు తెనిఁగించిరcట కాని యింకను నది వ్రాఁత లోనే యున్నట్లున్నది.*[9] దీని చక్కని యాంద్రీకరణ మొకటి తెలుఁగు భాషకు త్వరలో తెచ్చుకొనుభారము మనపై నున్నది. ఆదియట్లుండె,
సామాన్యములగు నీతులవిషయమునఁ దప్ప వేమన్నకు నితనికిని పోలికలు చాలలేవు. అతఁడు దుర్నీతి నెక్కువగా ఖండించినవాఁడు; ఇతఁడు నీతియిట్టి దని చెప్పినవాఁడు; అతనిది విర క్తి ; ఇతనిది రక్తి. అట్లుగాక వేమన్న అన్వయ మార్గమునఁ జెప్పిన నితనివలెనే చెప్పును. కాని యాపోలిక యిరువురు మనుష్యు లకు మనుష్యత్వమును బట్టి పోలిక యున్నట్లు. అపకారము చేసిన వానికిని ఉపకారము చేయుటయే మంచిది. ఇంటికివచ్చిన యతిథి నాదరింపవలయును; అసత్యములాడరాదు-ఇత్యాది విషయములలో ఏ నీతి శాస్త్రకారుఁడును వేఱు విధముగాఁ జెప్పఁడు. కావున ఇట్టి వానిలో నీయిరువురను పోల్చి చూచుటకంటె తిరువళ్ళువరునుండి రెండు పద్యములు యథాశ_క్తి తెనిఁగించి చెప్పి యీతని విషయము చాలింతును :
నిష్కల్మషత్వము
"మనసునిల్పుకొనుండు మసిలేక, ధర్మ మన
మననిదె ; యొుండెల్ల నాడంబరంబు"
(అఱత్తుప్పాల్, అఱస్ వలియురుత్తల్, ప. 3)
ఆతిథ్యము
"అతిథులకుఁ బెట్టి మిగిలినదారగించు
నరునిపొలమున విత్తులు నాటవలెనే ?"
(అఱత్తుప్పాల్, నిరుందోంబల్, ప, 5)
శాంతి
"ఓర్వవలయు నెప్పుడొరులతప్పలు ; వాని
మఱచుటింతకంటె మంచిగుణము"
(అఱ. పొరైయుడైమై, ప. 2)
స్త్రీ వర్ణనము
"కనియు వినియు మూరుకొనియును తా(కియు
తినియు నెఱుఁగఁదగిన తీపులెల్ల
బెరసి నిలిచినవిర ! మెఱుఁగు గాజులతోడి
తళుకులాఁడి దీని తనువనందు?
(కామత్తుప్పాల్, పుణర్చి మహిళ్లల్, ప. 1)
పోతులూరి వీరబ్రహ్మము
జాతిచే నితఁడు కంసాలి. ఇతని కాలము సుమారు పదునేడవ శతాబ్ద మధ్యము. వేమన్నను గూర్చి మనము నిర్ణయించిన కాలమే సరియైనచో నితఁ డతనికి సమకాలికుఁడగును. స్థలము పోతలూరు. కర్నూలు మండల మందలి బనగానపల్లెలోనుండిన గరిమ రెడ్డి వెంకటరెడ్డి యను నాతని యింట ఇతcడు చిన్నప్పుడు పసులఁ గాచుచుండెను. ఆ వయసునందే యితఁడనేకాద్భుత కార్య ములు చేసెను. చచ్చినవారిని బ్రతికించెను. ఊరిదేవరజాతరలో యితని యాజ్ఞ ప్రకారము అందఱియెదుర చండికావిగ్రహము లేచివచ్చి యితనికి చుట్ట కాల్చు కొనుటకు నిప్పుదెచ్చి యిచ్చెనఁట ! ఈతఁడును విగ్రహారాధనలు, జాతిభేదములు, జాతరులు మొదలగువానిని ఖండించి |ప్రజలకు హితోపదేశము చేసెను. ఇతఁడు సన్న్యాసిగాఁడు. గొప్ప సంసారి. భార్య గోవిందమ్మ. ఐదుగురు కొడుకులు, ఒక్క కూఁతురును ఉండిరి. ఇతని శిష్యులందరిలో దూదేకుల సిద్ధయ్య ప్రసిద్ధుఁడు. పండ్రెండేండ్ల చిన్నవయస్సునందే తన మహమ్మదీయ మతమును తల్లిదండ్రులను వదలి వీరబ్రహ్మము నాశ్రయింపఁగా, అతఁడును నిరాక్షేపముగా నితనిని శిష్యునిగా నంగీకరించి బోధించెను. ఈ గురుశిష్యుల భక్తి వాత్సల్యములు చాల మనసును కరఁగించునట్టివి. శిష్యుని కొఱకితఁడు 'సిద్దబోధము' అను గ్రంథమును వ్రాసె నcట. అందులోని వీ క్రింది రెండు పద్యములు :
"క. నీవను నేనును తానును
భావింపఁగ నొక్కఁడనుచుఁ బరఁగెఁడు గాదే
నీవును నిన్నెవీఁగినచో
నీవేయఁగు దాను నేను నిజముగ సిద్ధా!"
"క. నీలోన వెలుఁగు నెయ్యది
నాలోనను వెలుఁగునదియె నఖిలంబున దా
నాలోకనంబు గలిగిన
నీలోననె గాంతువయ్య నిజముగ సిద్ధా!"*[10]
రాగం : మధ్యమావతి - ఆదితాళం
“సంసారైనా వకటి-సంసారము విడిచిన నొకటి. (పల్లవి)
హంసనటించే విధమెటి(గుంటే సంశయములు తనమది విడిచుంటే, సం||
"ఇలవార్తలు వినకుంటే - తన - యింద్రియములు వశమంటే
కలలో మరవక యుంటే మరి కల్లలన్ని తొలగుంటే, సం!!
"నిలుకడ శాంతంబుంటే - తస - నిబసమాధిగలిగుంటే
పలుమరుయోగుల భాషలు వినుచును, చలము మంచి తానిలుకడయుంటే...
(వీరబ్రహ్మముగారి నాటకము, పే. 61)
ఇది కాక వీరాచారి చరిత్రమందు క్రింది పదపుతునక యొకటి యుదాహరింపఁబడినది :
“చిల్లరరాళ్ళకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడునుర వొరేవొరే !
చిత్తమునందలి చిన్మయజోతిని చూచుచునుండుట సరేసరే
వొక్క ప్రాద్దులని యొండుకనుంటే వానరగ చెడుదువు వొరే వెరే"
(వీరాచార్య చరిత్రము, పే. 8)
పై పద్యములు చూడఁగా, వేమన కవిత్వము నందున్నంత వేగముగాని ఆ యచ్చుకట్టుగాని యిందులో లేదని తెల్లమగును. కాని సామాన్యజనుల కింత మాత్రము చాలును. దీనికితోడు వ్రాసినవాఁడు విరక్తుఁడై హఠయోగసిద్ధుల వింతలఁ జూపిన మహానీయుఁడగుట, అతనిపదము లనేకులు పాడుచుండుటకును, అతని ననేకులు పూజించుచు ఉత్సవాదుల నిప్పటికిని జరుప చుండుటకును కారణమయినది. కటార్లపల్లె తుంగవేమన్న యిట్టివాఁడే కదా? వీరబ్రహ్మము సమాధియును స్థాపించిన మఠమును "కందిమల్లయపాళెము లోఁగలదట, ఇతఁ డును సజీవముగా "సమాధి'లోc ప్రవేశించిన వాcడే. ఈతని పౌత్రియగు నీశ్వరమ్మ యను నామెయు బ్రహ్మచారిణి యగు యోగినిగా నుండి ప్రసిద్ధిగాంచెనఁట. ఈశ్వరమ్మగారి మఠము నాయూరనే కలఁదట. ఇతని శిష్యుఁడు దూదేకుల సిద్దయ్యయు ఇట్టివే కొన్ని పాటలు వ్రాసెను. ఈతని విషయమగు స్తోత్రములు సంస్కృతభాషలో గలవు.*[11]
ఏగంటివారు
ఇట్లే అద్వైతమును బోధించుపాటలు 'ఏగంటివారి వచనాలు' అను పేరు గలవి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథ మందిరమునఁ గలవు.†[12]
ఏగంటివారెవరో ఒకరో అనేకులో యే యూరివారో యొప్పటివారో తెలియు నవకాశము నాకు లభింపలేదు. కొన్ని గుజిలీ ప్రతులలో నీ పాటలు కొన్ని 'యేగంటి లక్ష్మయ్యగారి వచనాలు' అని ముద్రింపఁబడినవి. ఆంధ్రదేశమునందు వీని కెక్కువ వ్యాప్తికలదని వినుచున్నాను. జనులలో నెక్కువ వ్యాప్తిని గాంచుటకును మననము చేయుటకును పద్యములకన్న పాటలెక్కువ పనికి వచ్చునను తత్త్వమును పండితు లనేకులు గమనింపలేదు గాని, పామరులు మాత్ర మెఱి(గి యాచరణకుఁ దెచ్చిరి. అట్టి పాటలలో సామాన్యముగాఁ గానరాని భాషా సౌష్టవము, విషయమును సంగ్ర హించి చెప్పశక్తి, ధారాళమైన శయ్య-ఇవి యీ యేగంటివారి పదములలో ఎక్కు వగాఁ గానవచ్చును. ఒకటి యదాహరింతును.
"పII ఆనందమయుఁడు గావలెను.
మనసు పదిలము సేయవలెను; ఈ
తనువులోపలి తెలివి తానె కనవలెను.
కనుచూప లొకటి కావలెను, అందు
ఘనచిదానందలింగము గానవలెను. (1)
“వాయువుల కుంభించవలెను, మిక్కిలి యు
పాయమున కుండలిని పైకెత్తవలెను.
తోయజంబులు దాఁట వలెను ; అందు
పాయకుండెడు నాదు పలుకు వినవలెను. (2)
"మూcడుయేరులు దాఁట వలెను; అందు
జోడు బాయని గురుని జాడ గనవలెను;
మేడ మీఁదికి చొర వలెను ; అందు
జోడుబాయని హంస జాడ గనవలెను. (3)
"రేయు పగలొకటి గావలెను ; అందు
వేయి రేకులమీఁది వెలుగు గనవలెను;
ఆ యెడను హంస గావలెను; ఆత్మ
బాయకేగంటి గురు పదవి గనవలెను, ఆనంద|| (4)
(ఓ. లై., 13-4-30)
కన్నడమందలి 'దేవరనామముల" వలె తెలుఁగులో ఇట్టి అద్వైతబోధకము లగు పదములు లెక్కకు మీఱి కలవు. ఇవి గాక ఇట్టి వేదాంతమునే పద్యరూప ముగ వ్రాసిన శతకకర్తలు అసంఖ్యులు. శ్రీ వం. సుబ్బారావుగారు ఇట్టి వారిని సుమారేఁబది మందిని పేర్కొనిరి (వం, సు. వేమన, పు. 187). ఇట్టివారిలో నొకఁడగు :
ఆనంద వరదరాజయోగి
రచించిన 'నదానంద యోగిశతకము" నుండి రెండు పద్యములు
"తే|| స్నానమొల్లఁడు దేవతార్చనము సేయఁ
డమల విజ్ఞాన సంపన్నుఁ డైనయోగి
లోకులకు తెలియునె వానిలోని గుట్టు?
నవ్యతర భోగి శ్రీ సదానందయోగి!" (24)
“బ్రాహ్మల మటంచు కొందఱు పలుకుటెట్లు ?
బ్రహ్మనెఱుగంగ నేరక బ్రాహ్మఁడగునె?
బ్రహ్మ నెఱిఁగిన వాఁడెపో బ్రాహ్మణుండు, నవ్యతర..."(66)
ముత్యాల నారసింహయోగి
'జీవతత్త్వ ప్రబోధ కుసుమావళి" యను పేర నీ వేమన మతమునే ప్రకటించుచు చక్కని కందపద్యములతో గ్రంథ మొకటి వ్రాసెను.
వీరందఱికిని యోగశాస్త్ర పరాయణమగు అమనస్కసమాధియు పరతత్త్వ సాక్షాత్కారమును ఎంతవఱకు లభించినదో లభింపనేలేదో చెప్పలేము. ప్రథమావస్థ ననుభవించిన సాధకులును, వట్టి నమ్మికచే వ్రాసిన భక్తులును వీరిలో నెందరో యుండవచ్చును. రామకృష్ణ పరమహంనుఁడు, వివేకానందుఁడు మొదలగు వారి యనుభవములపై, మాటలపై నమ్మిక గలిగి, తమకట్టి యనుభవమేమియు లేకున్నను ఆ విషయముపై నుపన్యాసములిచ్చి బోధించువారు మనలో నెందఱు లేరు ?
ఇంతటితో నేఁటి యుపన్యాసము ముగింపవలసినదే కాని రామకృష్ణపరమహంనుని పేరెత్తిన తరువాత నూరక దాఁటిపోవ సాధ్యములేదు. ఇదివఱకుఁ జెప్పిన యోగు లెల్లరును తమతమ దేశముల యెల్లలు మీఱినవారు కారు. కొందఱు తామున్న యూరే దాఁటి బైట వచ్చిసట్లు తో(పదు. కాని శ్రీరామకృష్ణుఁడు భరతఖండమందే కాక ఖండాంతరములందును కీర్తిగన్నవాఁడు. కడచిన శతాబ్దమున (1836) వంగదేశమున సామాన్య బ్రాహ్మణ కులమున జనించి, ఎక్కువ చదువు సంధ్యలు లేక, ఒకానొక కాళికాదేవి గుడిపూజారిగా నున్నవాఁడితఁడు. కాని సహజమైన యార్ధ హృదయము, ఆధ్యాత్మిక తత్త్వములం దభిమానము, దైవభక్తియుఁ గల వాఁడగుటచే, ప్రయత్నములేకయే యితనికి దేవతాసాక్షాత్కారము మొదలగు ఆధ్యాత్మికానుభవములు తమంతట కలుగుచుండెడివంట. ఉన్న దున్నట్టు చిన్న నాఁటినుండి యితనికి సమాధియనుభవము గలుగుచుండెనcట. ఇతఁడు తాంత్రిక పూజలు, హఠలయాదిసాధనలు సక్రమముగానే యాచరించి తుదకు రాజయోగిగా పరిణమించెను. ఇతని జీవితమున జరిగినవని చెప్పఁబడు విచిత్రములకు లెక్కలేదు. హిందూదేశమందలి యన్ని మతముల ప్రకారమును ఇతఁడాచరించి తత్త్వానుభవ మును బొందెనcట. ఇతనిని వట్టి పిచ్చివాఁడని యప్పడును కొందఱు తలఁచిరి. ఇప్పడును అట్లనుకొనువారు లేకపోలేదు. అది యెట్లున్నను, విజ్ఞాన ప్రధానమైన ఆంగ్లేయ విద్యను ఆభ్యసించిన వా రనేకులు ఆధ్యాత్మిక ప్రపంచమందే నమ్మికలేక కేవల నాస్తికులైయున్న సమయమున, ఆస్థికతగలవారు హిందూధర్మములు మోక్షసాధకములు గావని తిరస్కరించి క్రీస్తమతమునో లేక దాని రూపాంతరము లగు బ్రహ్మసమాజమునో, ఆర్యసమాజమునో ఆశ్రయించుచుండిన కాలమున, హిందువులలో ఆస్థికులనఁబడినవారు పరస్పర జాతి మత ద్వేషములతో వారికి మోక్షములేదని వీరును, వీరికి లేదని వారును తన్నులాడుకొనుచున్న సందర్భమున, ఈ మహాపురుషుఁడు జన్మించి, సగుణనిర్గుణోపాసనల వివిధ భేదములను తాను ప్రయత్నపూర్వకముగా సాధించి సర్వమతములకు సార మొకటియే యనియు, దైవమని యొకటి నంగీకరించు ఏ మతమునందు శ్రద్ధతో నుపాసనచేసినను పరమ ఫలమైన యద్వైతము లభించుననియు, నమ్మునట్లు తా నాచరించి చూపి, విజ్ఞానధనులైన వివేకానందుని వంటి వారి ననేకులను లౌకిక వైదికులను శిష్యులనుగాఁ జేసికొని, వారి మూలమున హిందూమత శాస్త్రముల ఘనతను యూరోపు, అమెరికా మున్నగు ఖండాంతరములందును చాటింపఁ జేయఁగల్గెను! ఇతని మతప్రకారము అద్వైతమే ప్రధానతత్త్వమని చెప్పటకుఁగాని, ఖండించు టకుఁ గాని, నాకు శక్తిలేదని మొదలే విన్నవించితిని గదా? అదియెట్లున్నను, దేశమున కితఁ డనుగ్రహించిన గొప్పయుపదేశము : భిన్నమతములవారు ఒకరొకరితో కలహింప నక్కరలేదనుట. ఏ మతము నాశ్రయించినను ఫల మొకటియే కావున వారి వారి నంప్రదాయమునకు, ఇష్టమునకు తగిన మతము ననుసరింపవచ్చును. బహిఃప్రపంచమున శాంతిదాంతులుగలిగి, పరోపకారము, అనాథ సేవ చేయుటయే పరమధర్మమని యితఁడు బోధించెను. సంఘసంస్కారము, మతసంస్కారము అను పేరుతో జాతిభేదములు, విగ్రహారాధన మొదలగు వానినెల్ల నొకటేమాఱు మూలముట్టుగ నశింపఁజేయఁ బ్రయత్నించుట పిచ్చిపని ; ఆవియొకచోట నడంచిన వేరొకచోట, ఒకరూపమును పాడుచేసిన వేఱొకరూపమున పైకిలేచును; దయ, దాక్షిణ్యము, భక్తి, నమ్మిక మొదలగు నుదారగుణములు ప్రజలలో పెంపొం దించినచో పై జాతిభేదాదులు తమంతట తమ బలమును గోలుపోవును. కావున వాని నడంచుటయందుఁగాని, స్థాపించుటయందుఁగాని శ్రద్ధవహింపక యుదా సీనముగా నుండుట యావశ్యకము. చండాలస్పర్శ చేసిన 'నాజన్మమే చెడిపోయెను, నేను ముక్తికి దూరుఁడనైతిని, అని నిష్కల్మషముగా నమ్మినవానిని బలవంతముగాc బట్టితెచ్చి మాలపల్లి మధ్యలో నిలిపినను, తిరుపతికిఁ బోయి దేవునికి 'పొంగలి సేవార్ధము చేయించిన నాకు ముక్తి లభించునని దృఢముగా నమ్మి తిరిపెమెత్తి కర్చుకు సంపాదించుకొని కాళ్ళనొప్పలు గమనింపక కొండయొక్కి పరమానందముతో దేవుని దర్శించి “ధన్యుఁడైతిని గదా" యని కన్నీళ్ళు రాల్చువానికి 'ఇది వట్టి రాతిబొమ్మరా, దేవఁడును గాదు, దయ్యమును గాదు. దీని కేల మొక్కెదవు?" అని యెంత చెప్పిసను, నీటి కెదురీదినట్లగును గాని ఫలము లేదు, వారి మనస్సు నెమ్మదిని జెఱిచినట్లగునింతె. ఒక అభిప్రాయం మనసులో స్థిరముగా నిలుచుట కెన్నాళ్ళు పట్టునో, దానిని పోఁగొట్టుకొనుట కంతకన్న నెక్కువ పట్టను-ఈ తత్త్వములను రామకృష్ణపరమహంసుని వలె, నే నెఱిఁగినంతవఱకును, ఇతర బోధకులెవరును గమనింపలేదు. ఈ జాతిభేదము మొదలగునవన్నియు త్రానును తుదిలో వదలినవాఁడే. కాని యితరుల నట్లుచేయుమని నిర్బంధించి తిట్టలేదు. నిర్బంధములతోను, దూషణలతోను శ్రద్ధ జనింపఁజేయుట యసాధ్యమనియు, అనావశ్యకమనియు ఖండించి యుపదేశించువానికన్న మౌనముతో నాచరించువాఁడు మంచి సంస్కర్తయనియు నీతఁ డెఱిఁగెను. బలవంతపు మాఘస్నానముతో పుణ్యము వచ్చునేమో కాని చలి విడువదుగదా !*[13]
- ↑ ఈ పద్యము వేమన పద్యములలోను గలదు, 3519.
- ↑ † చూ, ధార్వాడ ఉత్తంగి చెన్నప్పగారు ప్రకటించిన 'సర్వఙపడగళు", పీఠికా ప్రకరణము.
- ↑ * చూ, ప. _2-14
- ↑ †tచూ, సర్వ. పీఠిక, ప, 39
- ↑ * చూ, లేసుపద్దతి, ఆన్నపద్దతి,
- ↑ * చూ, రాజనీతిపద్ధతి,
- ↑ * 'కురళ్' తెనుగగు ‘త్రివర్గదీపిక' పీఠికలలో, అత్యద్భుతములైన గాథలు ఇతనిని గూర్చి కలవు కాని యది శుద్ధ పురాణము,
- ↑ * See V. V. S. Iyer's Preface, LXIII.
- ↑ * Vide, “Maxims of Thiruvolluvar” by V. V. S. Iyer, Preface XX. తిరువళ్ళువరును గూర్చిన యనేక విషయములిందుండియే గ్రహించితిని.
- ↑ * బెజవాడ టి, వి, రాఘవాచార్యులు గారు ప్రకటించిన వీరాచార్య చరిత్రము', పు. 17. ఇందలి విషయము లీ గ్రంథమునుండియే గ్రహింపఁబడినవి. ఇది గాక తప్పుల తడకల గుజిలీ ప్రతి యొకదానిలో కొన్ని పాట లిటీవల చూచితిని.
- ↑ * చూ, వీరబ్రహ్మ నాటకము, పే. 87.
- ↑ † tశ్రీ వే, ప్రభాకరశాస్త్రిగారు నాకివి చూపిరి,
- ↑ * పై రామకృష్ణపరమహంసుని జీవితచరిత్రవిషయములు 'The Life of Sree Ramakrishna' అను గ్రంథము నుండి సంగ్రహింపఁబడినవి,