వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/8-ప్రకరణము

8-ప్రకరణము

పాత్రోచితభాష

ఆంధ్రవాఙ్మయమున పూర్వకవు లెవరును నాటకములు వ్రాయలేదు. నాటకములు వ్రాయవలయునను బుద్ధి మనకు ఇంగ్లీషుభాషా సహవాసానంతరము వచ్చినది. ఈవిషయమును గుఱించి గ్రామ్యభాషాప్రయోగ నిబంధన మను నుపన్యాసమున శాస్త్రులవా రిట్లు వ్రాసియున్నారు-

"మనవారు మేకదాటుగా చిరకాలము పురాణముల నాంధ్రీకరించి తర్వాతం బ్రబంధంబుల విసిగి యిపుడు అన్యములం దొడంగినారు. మఱియు గీర్వాణనాటకముల నెఱింగియు హూణనాటకములం జదువువఱకు నాటకముల వ్రాయరైరి. గీర్వాణకథల నెఱింగియు హూణనవలలంగాచిన దనుక నవలలయిం బడరైరి మఱియు గద్యకవన మొకప్రజ్ఞ కాదట. ఆభావముచే నవలలు లేకపోయినవి. నాటకములు వ్రాయమికి అట్టి కారణమే యొకటిగలదు.

కావ్యాలంకారచూడామణి- <poem>

      'వినుత యశంబునంగలుగు విశ్రుతనాకనివాస; మయ్యశో
       జననము శ్రవ్యకావ్యముల సంగతినొప్పగు; శ్రవ్యకావ్యముం
       దనరు గవిప్రభావమున; దత్కవి సమ్మతిలేనిరాజులే
       పునవిహరింప; రవ్విభులు పోయినజాడ లెఱుంగబోలంనే.' (3-90.)
   మ. కవిసంసిద్ధపదంబు భావరస విఖ్యాతంబు లోకోచిత
వ్యవహారంబు నుదాత్తనాయకము శ్రవ్యంబుం జతుర్వర్గ సం

         భవసద్మంబును నైనకావ్య మిలనా పద్మోద్భవస్థాయియై
         కవిసంస్ఫూర్తియు దాతృకీర్తియుదగం గల్పించునెల్లప్పుడున్.

ఈవ్రాతంబట్టి చూడగా,- మనవారు శ్రవ్యకావ్యముమాత్రమె సప్తసంతానములలో చేరినదనియు, ఆముష్మికాభ్యుదయప్రదమనియు, దృశ్యకావ్య మట్టిది కాదనియు, తలంచిరని యొక రహస్యము వెలువడుచున్నది." (పుట 54)

"మఱియు పూర్వులు రూపకరచన సేయనే లేదనుట సరిగాదు. శ్రీనాథుడు వీథినాటకము రచించెనని ప్రసిద్ధము గదా. అతడు బూతులుచేర్పక యుండిన నప్పటినుండియే నాటకము లల్లుకొనియుండును." (పుట 55)

1880 సం. ప్రాంత్యమున తెనుగున కొందఱు సంస్కృతనాటకములను అనువదింపసాగిరి. సంస్కృతనాటకములను మొదట తెలిగించినవారు నడుమవచ్చిన ఇంగ్లీషు అనువాదముల మర్యాద నవలంబించి తమ యనువాదములయందు సంస్కృత మూలములందలి ప్రాకృతాది భాషాభేదములను నిర్వహింపక అంతటను వ్యాకృతాంధ్రమే పెట్టిరి. దీనిచే రసము చెడినది. నాటకముయొక్క ప్రయోజన మంతరించినది. 1891 సం. వేంకటరాయశాస్త్రులవారు నాగానందనాటకము నాంధ్రీకరించిరి. ఈ యాంధ్రీకరణ ప్రకటన మాంధ్రనాటక వాఙ్మయమునందు నూతనయుగ ప్రారంభమును సూచించు చున్నది. అప్పటి కింకను స్వతంత్రనాటకములు వెలువడలేదు. శాస్త్రులవారు నూతనమార్గములను కోరినవారు. "దృష్ట బహుప్రయోజనంబుగావునను, ముఖ్యముగా నానందనిష్యందిగావునను, పెద్దనాది లక్షణకారులచే ననుజ్ఞాతంబుగావునను, మఱియుం బ్రబంధములతో బ్రాణము విసిగిపోయినది గావునను, నాటకము మనకు ఉపాదేయమే." అని ఎల్లవారును నాటకములు వ్రాయవలసినదని తమ యభిప్రాయమును విశదీకరించుచు పలుతావుల ఉపన్యాసము లీయసాగిరి.

నాగానంద నాటకమున శాస్త్రులవా రొక క్రొత్తమార్గ మవలంబించినారు. సంస్కృతనాటకముల మర్యాదప్రకారము మూలములో సంస్కృతముండుచోట్ల సలక్షణభాషయు, ప్రాకృతాది భాషాభేదములుండుచోట్ల తెలుగు గ్రామ్యభేదములనుం బ్రయోగించి అనువదించిరి. ఆంధ్రవాఙ్మయమున పాత్రోచిత భాషయందు రచియింపబడిన ప్రథమనాటక మిదియే. శాస్త్రులవా రవలంబించిన యీక్రొత్తమార్గముంగని సహృదయులు కొందఱు పండితు లామోదించిరి.

మ.రా.రా శ్రీ వడ్డాది సుబ్బారాయకవిగారు శాస్త్రులవారికి ఇట్లువ్రాసిరి.-

"పండితోత్తమా, భవద్విరచితమగు నాగానందనాటకము పుటములుదీరిన హాటకమువలె గావ్యేందిర కలంకారమై ప్రకాశించుచున్నది. "నీచపాత్రములకు దెలుగు నాటకములయందు దమరుచూపినదారి నామట్టు కాదరణీయముగానే తోచుచున్నది. మఱియు దానివలన ననేకలాభములున్నట్టు నేను దలంచుచున్నాడను. గ్రామ్యములేవో యగ్రామ్యములేవో యెఱుంగనివార లనేకులుందురు గాన వా రివిగ్రామ్యము లివి యగ్రామ్యము లని తెలిసికొనుటకు వీలుకలుగుచున్నది. మఱియు వాడుకప్రకారము అట్టి గ్రామ్యరూపములు వ్రాయుట కష్టమే. నాకు జూడ దన్నాటకము బహు రసవంతముగానున్నది."

కొందఱు పండితులు ఔచిత్యాభిమానులు హర్షించినను ఇతరులు ఈపద్ధతికి వెంటనే హర్షింపలేదు. ఈవిషయము పండితులలో నొక యలజడి బుట్టించి వృద్ధి చేయుచుండినది.

1896 సం. శాస్త్రులవారు కాళిదాసమహాకవి విరచిత శాకుంతలనాటకము నాంధ్రీకరించి ప్రకటించిరి. మునుపటి వలెనే పాత్రోచితభాషం బ్రయోగించిరి. దాని పీఠికలో నిట్లు వ్రాసిరి. "నాగానందమున బ్రాకృతస్థానమున నే బ్రయోగించిన గ్రామ్యభేదములను నాంథ్రాంగ్లేయ భాషాపారీణులగు విపులహృదయ లామోదించిరి. దీనియందును గణ్వ కశ్యపులకును తలారిచెంబడులకును నేకవిధభాషణముం బ్రయోగించుట యనుచితమని కావలివాండ్రకు మత్స్యఘాతకునికిని గ్రామ్యముం బ్రయోగించితిని." శాస్త్రులవారి పద్ధతులంగని కొందఱు పండితులు తమ నాటకములలో నీచపాత్రములకు అచ్చతెలుగుం బెట్టసాగిరి. దీనింగూర్చి వారే తమ గ్రామ్యభాషాప్రయోగనిబంధనమున నిట్లు వ్రాసినారు.

"కొందఱు మదీయ నాగానందముంగని, భాషాభేద మావశ్యకమని గ్రహించియు, నామార్గ మవలంబించిన నా శిష్యు లగుదురని ద్వేషించి, నీచపాత్రముల కచ్చతెలుంగని యొక రసాభాసంపు నియమముం గల్పించుకొని నిర్వహించుకోలేక, పరమనీచ పాత్రములకు నిజనియమవిరుద్ధముగా తత్సమముంబెట్టుచు, ఋషికన్యాది సత్పాత్రములచే మాల మాదిగల చేతనుంబోలె మహారాజును 'పబువులు' అనిపించుచు, నీచనీచతరపాత్రములైన చేటికాదులచే సీతారాజ కన్యాదులను అతి నమ్రతతో అతి సుకుమార సంబోధన చేయవలసినచో, అతి తిరస్కార సూచకముగా, మౌండ్యకశాఘాతాంగ కర్తనాంక నిర్వాసనాది దండార్హముగా 'రాచకూతురా' యని సంబోధన చేయించుచు, నటిని సూత్రథారునిచే 'దేవీ' యని దేవిరింపించుచు గ్రామ్యనాటకములు వ్రాయుచున్నారు." (పుట 60)

1897 సం. శాస్త్రులవారి జీవితమున మఱువరానిది. ఈసంవత్సరమే వారు తాము బాల్యములో తమ తండ్రిగారు చెప్పగా విన్నట్టిదియు, వెనుక, తాము పెంపొందించి, కథగా జనవినోదినిలో ప్రకటించినదియునైన, ప్రతాపరుద్రుని కథను నాటకముగా రచించి ప్రకటించిరి. ఆంధ్రవాఙ్మయమునందలి మొదటి జాతీయనాటకము, స్వతంత్రరచన, ఇదియే. ఈ నాటకమందలి కథాసంవిథాన చమత్కారము, సన్నివేశ సౌభాగ్యము, సమన్వయసాలభ్యము, పాత్రనిర్మాణకౌశలము, రసపోషణము, కవనస్వారస్యము మొదలగువాని నిండు కలిమియటుండ, బహుపాత్ర నిర్మాణముంగావించి ఎనిమిది తొమ్మిదితెగల గ్రామ్యభేదములం బ్రయోగించి, తమ పాత్రోచితభాషాసిద్ధాంతమును స్థిరముగా నెలకొల్పుట మాత్రమేగాదు, శాశ్వతముగా రూపకవచనా విధానముం జూపినారు. 'ప్రౌడజనైకవేద్యరసం'బగు నీ నాటకము తమప్రాపక వరేణ్యులైన శ్రీ వేంకటగిరి మహారాజా వారికి తమ కృతజ్ఞతాసూచకముగా నంకితముం గావించినారు.

ఆ సంవత్సరమే మఱి రెండు స్వతంత్రనాటకములు వెలువడినవి. శ్రీ ధర్మవరము రామకృష్ణమాచార్యులవారు తమ చిత్రనళీయమును, శ్రీ గురుజాడ అప్పారాయ కవిగారు+ తమ కన్యాశుల్క ప్రహసనమును ప్రకటించిరి.

_______________________________________________________

+ శ్రీ అప్పారావు పంతులవారు తమ నాటకముయొక్క పీఠికలో శ్రీ శాస్త్రులవారే పాత్రోచితభాషకు ప్రాపకులని తెల్లముగా వ్రాసియుండ ఇప్పుడిప్పుడే ప్రసిద్ధికి వచ్చుచుండు కొందఱు రచయితలు, శాస్త్రులవారి గ్రంథములం జదువకయు, ఆంధ్రవాఙ్మయమున వారు చూపినమార్గము లేవోతెలియకయు, వ్యాసములు వ్రాయగడంగి, వానిలో శ్రీ అప్పారావు పంతులవారు పాత్రోచితభాషను ప్రారంభించిరనియు, వేంకటరాయశాస్త్రులవారు ఆమతమును అనుకరించిరనియు వ్రాయుట పొరబాటు. ఇట్లే పెక్కుపొరబాట్లు అల్లుకొనిపోయి యున్నవి. ప్రతాపరుద్రీయముంగాంచినంతన తెలుగు ప్రపంచమున చెప్పరాని యలజడియు ఆవేశమును జనించినవి. పాత్రోచితభాషావాదము బలపడినది. దేశమందు లెక్కలేని పండితులు ఆమోదించి శాస్త్రులవారికి జాబులును పత్రికలలో వ్యాసములును వ్రాసిరి. ద్వేషులు శాస్త్రులవారిమతమును కడతేర్పవలయునని పన్నాగములు పన్నందొడంగిరి.

పండితులు కొనియాడినవిధము

అముద్రితగ్రంథచింతామణ్యధిపతి శ్రీ పూండ్ల రామ కృష్ణయ్యగారు పెద్ద విమర్శను పదునొకండుపుటలలో ప్రకటించిరి. "ఈ ప్రతాపరుద్రీయనాటకము పాత్రల కుచితమగుసంభాషణ వాక్యములతో నిండి వినువారి వీనులకు విందై, యమృతంపుసోనలక్రందై వెలయుచున్నది... దీనివంటి యద్భుతనాటకమును మేము కని వినియెఱుంగము...ఇంతరసపుష్టి గలిగినట్టియు నింత ప్రౌడమగు నట్టియు నింత సలక్షణమైనట్టియు నాటకము వేఱొండుదానిని మేము చూడలేదనియు విన్నవించుచున్నారము."

కలావతిపత్రిక: ఇట్టి మంచినాటక మీ యాంధ్రభాషలో ఇంతవఱకు మఱియొకటి కానరాదు......

సత్వసాధని: ఇక్కవికి జాతీయ స్వాభావికజ్ఞాన పరిష్కరణప్రావీణ్యము సాక్షాత్కారము వర్ణనాంశములు వచ్చినచోట నైజప్రవర్తనము ననుసరించి వర్ణింపబడియున్నవి. ఆయాపాత్రములకు దగిన జాత్యాచారాది విషయములు వెలువడునట్లు భాషను ప్రయోగించియున్నారు. ఇది నాటకముగాన శ్రావణిక ప్రబంధమువలె పద్యము లల్ల బడక చాక్షుషిక ప్రబంధము ననుసరించి పాత్రములననుసరించియు పద్యము లల్లబడియున్నవి.

Madras Christian College Magazine September, 1898.

We Cannot but congratulate him upon the happy choice of subject he has made. We must congratulate him also on the success with which he has accomplished his task.

we shall content ourselves with saying that Prataparudriya by itself would suffice to answer those who seek to belittle the literary intellect of south India. The Drama however marks a new departure in Telugu literature. secondly, the drama is the work of one who has before now tried his skill in the interpretation of the Sanskrit dramatists and had made a name for exactness of rendering and for his high attainments in Telugu composition both in prose and verse. further, he has studied the dramatic art with special attention, not only for the gratification of his won scholarly instincts, but also with a view to the practical application of his studies and researches in the representation of the classical Sanskrit dramas. He has also cultivated a knowledge of the drama as understood and enacted by the Masters of the west. A work by such an author should certainly evoke the interest of the educated public. శశిలేఖ: ఈనాటకము నూతనఫక్కిని వ్రాయబడియుండుట చేతను, ఆంధ్రభాషయం దింతకుపూర్వ మిట్టినాటకములు లేకుండుటచేతను, పండితశిఖామణిచే వ్రాయబడిన యీ నాటకరత్నము.....

"ఈనాటకము ఇతర నాటకములవలెగాక నూతన పద్ధతిని వ్రాయబడి యుండుట చేతను........

"ఇన్ని నాటకములు మనభాషయందీ కొద్దికాలములో వ్రాయబడినను సంస్కృతమునుండి ఆంధ్రీకరింపబడిన నాలుగైదు నాటకములు తప్ప మనభాషకు గౌరవము కలుగజేయునవి లేవని మాయభిప్రాయము. అట్లగుటచే భాషాంతరీకరణము గాక స్వతంత్రముగ రచింపబడిన ప్రతాపరుద్రీయ నాటకము ఈలోపమును వారించు ప్రయత్నమునకు గణపతిపూజ యనందగియున్నది. వేంకటరాయశాస్త్రుల వారిచే జూపబడిన నూతనమార్గము పండితులచే నంగీకరింపబడునుగాక యని నమ్ముచున్నాము......

"ఈనాటకము ప్రదర్శింపబడినచో చూచువారు మిక్కిలి యానందమును చెందెద రనుటకు సందియములేదు. గ్రంథకర్త యొక్క లోకానుభవము అద్భుతముగనున్నది. ఆంధ్రదేశముల యందలి తురకలయు, చాకలివాండ్రయొక్కయు, అలవాటులను జక్కగ నెఱిగినవా రీనాటకమం దాపాత్రముల నిసర్గ మనోహరత్వమును గ్రహించి యద్భుతమొందక మానరు"