వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/22-ప్రకరణము

22-ప్రకరణము

కొన్ని సత్కారములు

1919 సం. మదరాసులో ఆంధ్రసారస్వతసభ జరిగినది. అందు సభ్యులు తాతగారికి 'మహోపాధ్యాయ' బిరుదము నొసంగుచు 1116 రూప్యములను సమర్పించిరి. గొప్ప సత్కారము జరిగినది. ఈసందర్భమున వారొక యుపన్యాస మొసంగిరి. అందలివాక్యముల కొన్ని-

"యేనామకేచిదిహ.......' అని భవభూతి చెప్పుకొన్న తీరున - ఇన్నాళ్ళకు నన్ను నేదిష్ఠనికటదూరదవిష్ఠ ప్రదేశములవారు మీరలు అభినందించితిరి.

పూర్వము నవద్వీపమందు మహోపాథ్యాయ, మహా మహోపాథ్యాయ బిరుదములు నొసంగు తెఱంగును పెద్ద లిట్లు చెప్పుదురు. పరీక్ష్యుడు ఏదేశమునుండియేని వచ్చును.... అది అభిజ్ఞమార్గము, అందు భీ గలదు. మదీయము భీ లేనిది, ఆజ్ఞమార్గము, వాగ్దేవతోపాసనారూపము.

ఉపాసనయందును లఘు లఘియో లఘిష్ఠ ప్రకారములు కలవు. అందు మదీయము లఘిష్ఠము. బాలోచిత కతిపయాల్పగ్రంథరచనా రూపము. మదీయజన్మాంతరపుణ్యవశంబున అంతపాటికే యుష్మద్రూపవాగ్దేవత వర మొసంగినది. మఱియు దేవతను ప్రసన్నయగువఱకు నుపాసింపవలయును. గాని త్వరపడినం బ్రయోజనమేమి. అట్లే నేను 40 సంవత్సరము లుపాసింపగా ఇప్పటికి మీప్రసాదము కలిగినది.

మదీయ భాషాభిమాన వివరము........

మదీయవాగ్దేవతాపూజలో - ఆవాహనము స్త్రీ పునర్వివాహదుర్వాదనిర్వాపణము, ఆసనసమర్పణము కథాసరిత్సాగరము, అర్ఘ్యము ప్రతాపరుద్రీయనాటకము, పాద్యము మేఘసందేశాంధ్రటీక, అలంకారము ఆంధ్రప్రసన్న రాఘవ నాటకాది విమర్శకింకిణీగణశింజానశారదాకాంచిక, నై వేద్యము శృంగారనైషధసర్వంకషవ్యాఖ్య........"

ఆంధ్రసాహిత్యపరిషత్తువారి యష్టమ వార్షిక సమావేశమునకు తాతగా రగ్రాసనాధిపతులుగానుండిరి.

నెల్లూరి వర్ధమానసమాజమువారు వీరిని 'అభినవ మల్లినాథ' బిరుదముతో గౌరవించిరి.

తిక్కనసోమయాజివిజయము ఉపన్యాసము. నెల్లూరి వర్ధమానసమాజమువారి కోరికమెయి తత్సమ్ముఖమున, పౌరసభలో 1919 సం, మేనెలలో పఠించిరి. ఇందు తిక్కనంగూర్చి పెక్కువిషయములం దెల్పిరి. అందు చమత్కారముగా నిట్లు చెప్పిరి. - "కారణవిశేషములచే కొందఱు గోదావరిజిల్లావారు 'తిక్కన నెల్లూరి తెలుగువెట్టి భారతమును పాడు చేసినాడు.' అని నిజమతిని మిత్రులతో దెలుపుకొనుటయు, వారు దానిని నెల్లూరి యువరసికులమ్రోలం బలుకటయు వీరు అందులకు కక్కసించుటయును సంభవించినది. అందులకుం బ్రతిమల్లముగా గుంటూరివారు తిక్కన తమ కృష్ణామండలమువాడనియు, భారతమునందు తమసీమ తెనుంగుంబెట్టి దానిని పుణ్యకృదాస్వాద్యమయిన సుథాతరంగిణిం గావించినాడనియు, వాదించుచున్నారు. - ఇప్పటికిని కృష్ణాపినాకినుల తెలుగులకు ఎక్కుడుభేద మగపడదు. సామ్యమే మెండు...తిక్కన నెల్లూరితెనుంగునే భారతమునంబెట్టినమాట వాస్తవమేగాని పాడుచేసెననుట పాడిగాదు. పాడిచేసెనని గుడికట్టించుట ఇహపర సాధకము."

ఇట్లు కాలము గడుచుచుండగా మదరాసునగరమునకు శ్రీ ఐదవజార్జి చక్రవర్తిగారి కుమారులు యువరాజుగా వేల్సు రాజకుమారులైనవారు (ఇప్పుడు విండ్సర్ ప్రభువు) 1922 సం. విచ్చేసిరి. ఆసందర్భమున మదరాసు విశ్వవిద్యాలయమువారి కోరికమెయి దక్షిణభారతదేశమందలి పండితులనెల్ల యువరాజుగారు సత్కరించిరి. శ్రీ తాతగారు ఆంధ్రపండితులలో ప్రథములుగా బంగారుతోడా, జోడుశాలువలచే సత్కరింపబడిరి.

నాటిదినచర్య కొంత వినోదముగా నుండును. ఆకాలమున నసహాయోద్యమము (N.C.O.) దేశమున ప్రవర్తిలు చుండెను. దేశమంతయు అట్టుడికిన ట్లుడికిపోవుచుండెను. ఆదినము (జనవరి 14 తేది, 1922 సం) ఊరిలో అల్లరులు హెచ్చుగా నుండినవి. జనులు ప్రోగై ఆపీసరులను, మోటారులలో పోవువారిని, ఆంగ్లవేషములవారిని పోనీయక ఆపుచు, వీథిమరమత్తు లకై పోసియుండినరాలను రువ్వుచు 'గంధికిజై, మహమ్మదాలీ షౌకతాలీకి జై' అని భీకరముగా నఱచుచుండిరి.

ఆదినము ద్వితీయాంధ్రపండితులుగా సత్కారముబొంద వలసినవారు శ్రీ చదలవాడ సుందరరామశాస్త్రులవారు. వారు, ఈగుంపును తప్పించుకొని ఎట్లు యువరాజుగారి దర్శనమున కేగగలమను సంశయముతో, తమ ఉడుపులను మూటకట్టుకొని కొమారుని వెంటబెట్టుకొని చొక్కాయలేకయే, ఎవడో పౌరోహితునివలె మాయింటికి వచ్చిరి. తాతగారును భోజనము ముగించుకొని మోటారుకారుకై కాచుకొనియుండిరి. ఇంతలో నదియు రాగా వేషములను ధరించి బయలుదేరిరి. తంబుసెట్టివీథిచివరకు పోకమునుపే అల్లరిమూక వీరిని అడ్డినది. గుంపంతయు చేత రాలుతీసికొనిరి. ఇక రువ్వువారే. బండిలోనివారి కందఱకును మతిపోయినది. భయపడసాగిరి. తాతగారు మాత్రము భయపడక డ్రైవరును పిలిచి 'గంధికిజై అని అరవరా' అనిచెప్పిరి. వెంటనే 'గంధికి జై'అని ఆత డనెను. గుంపు వెంటనే రాలురువ్వుటమాని వీరిని పోనిచ్చినది.

మెల్లగా నీయుపద్రవమును తప్పించుకొని సెనేటుహాలు సమీపమునకు పోగా పోలీసు సార్జంటు నివారించెను. అతడు ఆజానుబాహువు, గుఱ్ఱముమీదనున్నాడు. ఒకరిమాట వినిపించుకొనుస్థితిలో లేడు. కొన్నివందల మోటారుబండ్లు నిలిచి యుండినవి. మెల్లగా తాతగారే అతనిని పిలిచి తాము యువ రాజుగారి దర్శనమునకు ఆహ్వానముచేత పోవుచున్నార మని తెలుపగా నాతడు వీరిబండినిమాత్రము పోనిచ్చెను.

లోనికిపోయినంతట వీ రాసీనులైరి. మొదట తాతగారిని సంస్కృతమున కగ్రగణ్యులనుగా బహూకరించుట కేర్పాట్లు జరిగియుండినవి. ఒకానొక ఆచార్యులవారికికూడ గౌరవము జరుగవలసియుండెను. ఒకవిశ్వవిద్యాలయోద్యోగస్థుడు తాతగారితో, వారు (తాతగారు) సంస్కృతాంధ్రములలో రెంటను స్థానమందగలవారనియు, ఆయాచార్యులు ఒక సంస్కృతమందే ప్రధానస్థానమునకు యోగ్యులుగాన, ఈయవకాసము పోయినమరల వారికి అవకాశముదొరకదనియు, అందుచే తాతగారు ఆంధ్రపండితులలో ప్రథానస్థానము నందుట కంగీకరింప వలయు ననియు ప్రార్థించెను. తాతగారు తమకియ్యది చాల గౌరవకరమని పలికి ఆంధ్రమందే బహుమతినందిరి.

ఎన్నిసత్కారములు జరిగినను, ఎంతద్రవ్యము వచ్చినను సముద్రమునవైచిన చక్కెరవోలె కుటుంబభరణమునకును వైద్యములు చేయించుకొనుటకును వ్యయమై పోవుచుండెను. ముసలితనములో నిబ్బందులు పడలేకగదా ముద్రాక్షరశాలను విక్రయించిరి. కాని ఇబ్బందులు వారిని వదల లేదు. ఎన్నియవాంతరములు వచ్చినను తాతగారు దైర్యము మానలేదు; దైన్యము వహింపలేదు. మరల నేదోయొకవిధముగా మంచికాలము రాక తప్పదనియే తలంచుచుండిరి.


___________