వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/20-ప్రకరణము
20-ప్రకరణము
సూర్యరాయాంధ్రనిఘంటువు.
సూర్యరాయాంధ్ర నిఘంటు సంపాదకత్వము శాస్త్రుల వారిజీవితమునం దొక విషాదఘట్టము. వా రార్థికక్లేశములలోనుండి శ్రీ వేంకటగిరిరాజావారి సాయ మపేక్షించు చుండినకాలమున శ్రీ రాజాగారి సహాయముతోపాటు ఈసంపాదనాధికారము శాస్త్రులవారికి వాడిన చేనికి వర్షమువలె నైనది. శ్రీయుత గుమ్ముడూరి వేంకటరంగ రావుగారు శాస్త్రులవారిని పలుమార్లు ఈవిషయమై హెచ్చరించిరి. శ్రీ రాజా మంత్రిప్రెగడ భుజంగరావుగారు నిఘంటు సంపాదకత్వము వహింపవలసినదని శాస్త్రులవారికి లెక్క లేని జాబులువ్రాసిరి. పరిషత్తువారును ఈనిఘంటువునకు శాస్త్రులవారే ప్రథానసంపాదకులుగా నుండవలయునని కోరిరి. ప్రతిష్ఠాపకులలో నొకరైన శ్రీ వేంకటగిరి మహారాజాగారన్ననో శాస్త్రులవారుతప్ప నితరులాపదవికి అనర్హులని తమయభిప్రాయముందెలిపి వారే సంపాదకులుగా నుండవలయుననిరి. అంతట శాస్త్రులవారు నిఘంటు సంపాదకత్వమును, నెలకు రు. 250 వేతనముపై, వహించిరి. ఇయ్యది సాస్త్రులవారినివేదిక. -
ఆంధ్ర సాహిత్య పరిషత్ప్రవర్తిత
శ్రీ సూర్యరాయాంధ్రనిఘంటు కార్యనిర్వహణము.
తొలిరెండు సంవత్సరముల పనిం గూర్చిన నివేదనలేశము
ప్రధానసంపాదక కృతము.
కార్యస్థానము పుదుపేటలో నున్నంతకాలము, దానికి దాపున ప్రాగ్దక్షిణదిశలయందు మునిసిపాలిటీ వారి నగరజన పురీష నిర్హరణ శకటవ్రాతముల నిలువరపుఠావులగుటంబట్టి, ప్రధాన సంపాదకుడును ఆ లేఖకులును మఱియొక లేఖకుడును మఱుగుబెరటిలో కట్టివైపంబడిన జనులయొక్క దుర్దశను అనుభవించు చుండిరి. మఱియు కార్యస్థానమైన గృహమందు మఱుగు బెరడు లేనందున ప్రధానసంపాదకుడు బహిశ్శంకకు పోవలసివచ్చిన సమయములయందు మునిసిపాలిటివారి సార్వజనిక పురీషాలయములకు పోవుటయు, అందు వర్ణనకు మనస్సొప్పని దు:ఖకర ఘోరానుభవములకు పాలగుటయు, సంభవించు చుండెను. కార్యస్థానమున వాయుమార్గములను మూసినచో ఊపిరిసలుపదు. తెఱచినచో పుర్వోక్తములైన మునిసిపాలిటీబండ్ల దుర్గంధము అలుగులుతెంచుకొని వెల్లువపాఱి ప్రధానసంపాదకుని ప్రాణవాయువును ముంచి కొట్టుకొనిపోవును. ఇప్పుడుసయితము చింతాద్రి పేటలోని కార్యస్థానాలయమునందు అన్నిగదులలోను మేలయిన ప్రధానసంపాదకుని గదియు ఇంచుక తక్కువగా ఉక్తదుర్గంధదశకే లోనయియున్నది. ఆంధ్రభారతగత సర్వపదములను అకారాదిక్రమమున అర్థవిహీనముగా నొకగ్రంథముగా వ్రాయుట యనుపని యొకటి ఆదినుండి యీనిఘంటు నిర్మాణకార్యములో నొకభాగముగా నియమింపబడినది. కొంతకాలమైన తర్వాత ఆపనికి ప్రత్యేకముగా నొకపాఠకుడు రు 30 నెలజీతమున కేర్పఱుపబడియెను. ఆత డిప్పటికి సుమారు సంవత్సరమునుండి ఆపని చేయుచున్నాడు; దానిని ముగించుటకు ఇంకనుం గొన్నిసంవత్సరములు పట్టును, సిద్ధమయినప్పుడును దానివలన నిఘంటు సంపాదనకృత్యమునకు ఏపాటియు నుపయోగముండదు. మఱియు నిఘంటుగ్రంథలేఖన ప్రారంభమునకు ముందుగా ఈ భారతపదసూచియేమో సిద్ధము కానేరదు.
ఈభారతపదసూచియేగాక ఇట్టివే ఒకవత్సరమునుండి మఱియైదు గ్రంథములకు వ్రాయబడుచున్నవి. ఆఱుగురు పాఠకులు ముప్పదేసి రూపాయల జీతాలవారు వ్రాయుచున్నారు. అవి యింకను భ్రూణదశలోనే యున్నవి. పూర్తి చెందుటకు సమర్థతముల చేతులలో ఇంక నొక సంవత్సరము పట్టును, సిద్ధమయినను నిఘంటుకార్యమునకు అవి ఇంచు కేనియు పనికిరావు.
ఈపదసూచికలపై, నిఘంటుకార్యముపేర సంవత్సరమునకు రు. 12x30x6=రు. 2160 ల ధనమును ఇంక లేఖనసాధనములును వ్యర్థముగా వ్యయింపబడుచున్నవనుట స్పష్టము. పరిషత్తువారికి ఇవి కార్యాంతరమునకై వలయునేని వీనికై నిఘంటుకార్యార్థ ముద్దేశింపబడిన ధనమునుగాక వేఱు ధనమును వినియోగించి వేఱువిచారణలో రచియింపించుకొనుట యుచితము. పాఠకులను నియమించుటకు నిఘంటు నిర్మాణసభవారు నిశ్చయించుకొను నప్పుడు ప్రధానసంపాదకుడు ఆయుద్యమమును మాన్పుటకై సభలోమాత్రమేగాక సభ్యులను కొందఱను ప్రత్యేకముగా సందర్శించి వేడియుంగూడ యత్నించెను. కాని యాతనిమాట నెవ్వరును పాటిసేయరైరి.
పాఠకులకు బదులుగా నలుగురైదుగురు పండితులను ఎక్కువ తెలివిగలవారిని రు. 40 ల పాటి జీతములకు, శబ్దరత్నాకరములో లేనివియు అందున్నవే అయినను అందుచెప్పని యర్థములలో ప్రయుక్తములును అగు పదములను గ్రంథములనుండి వెదకి సమకూర్చుటకై నియమించుట మంచిదని ప్రధానసంపాదకుడు బోధించెను. ఆపనిని నిఘంటు సభవారు చేసినవారుకారు. ఆపని చేసియుండినయెడల ఇప్పటికి పదాన్వేషణకార్యము సమాప్తి జెందియుండును.
పదాన్వేషణనిమిత్తమై అధమపక్ష 200 పుస్తకములను పఠింపవలయునని నబంధించినారు. అందులకై 110 పుస్తకముల జాబితాను ప్రధానసంపాదకుని కిచ్చినారు. వానిలో ఆతడు స్వయముగా భారాతాదికములగు పుస్తకములనుచదివి వానినుండి పదప్రభృతులను సంకలించియున్నాడు. ఆ 20 గ్రంథము లెవ్వియెన:-
1. ఆంధ్రభారతము
2. కాశీఖండము
3. లక్ష్మీనరసింహపురాణము
4. నన్నెచోడుని కుమారసంభవము. పూర్వభాగము
5. అదే ఉత్తరభాగము
6. కృష్ణరాయవిజయము
7. భీమఖండము
8. కేతనదశకుమారచరిత్రము
9. వేంకటపతి సారంగధరము
10. హరవిలాసము
11. నిర్వచనోత్తరరామాయణము
12. ఉత్తరహరివంశము
13. కళాపూర్ణోదయము
14. ఆముక్తమాల్యద
15. రామరాజీయము
16. శృంగారనైషధము
17. యాజ్ఞ వల్క్యస్మృతి
18. వేంకటపతి విజయవిలాసము
19. ఎఱ్ఱనహరివంశము పూర్వభాగము
20. అదే ఉత్తరభాగము.
1. మనుచరిత్రము
2. పారిజాతాపహరణము
3. పరమయోగివిలాసము
4. పాండురంగమాహాత్మ్యము
5. భోజరాజీయము
6. శ్రీ కాళహస్తిమాహాత్యము
7. నరసరాజీయము
8. కవికర్ణరసాయనము
9. గౌరనహరిశ్చంద్ర ద్విపద
నిఘంటుసభానియమములవలనను తత్కార్యాలయములవలనను సంభవించిన యిబ్బందులు లేక పగటివేళ చల్లనిసమయములలో, కంపు, శ్వాసనిరోధము, కన్నులయెదుట మింటి యుగ్రదీప్తి, ఎండవడయు, లేనితావులయందు, కాలనిర్భంధములేక, పనిచేయుచో తాను ఏపాటిపనిచేయగలడో చూచికొనవలయునను నుద్దేశ్యముతో ప్రధానసంపాదకుడు ఆవిరామ మాసములో ఆగ్రంథములను పఠించినాడు: ఆదినములలో ఆతనికితోడుగా నొకపండితుడుండెనేని, 9 కి బదులు 18 గ్రంథములను చదివియుండును. ఇందువలన పరిషత్కార్యస్థానములో ఆతనిపని కేర్పడిన సంవిధానములు శీఘ్రకరణమునకు ప్రతికూలము లగుట తెలియనగుచున్నది.
ఈ రెండుసంవత్సరములలో రు 50, 40, ల జీతగాడు ఒక పండితుడు సాయముగా నీయబడి యుండినయెడల, ప్రధానసంపాదకుడు తనకావించిన పనికి రెండింతలుచేసియుండును. అట్టి పండితుని ఇచ్చుట ఆవశ్యకమని ఆతడు ఒకటియునర సంవత్సరమునకుపైగా విసువక నిరంతరము హెచ్చరింపగా, 5 నెలలక్రిదట రు 35 ల జీతమున నొకనిని నియోగించినారు.
నిఘంటుకార్యస్థానములో జరుగుచున్నపనులలో నిఘంటువు నిమిత్తమై ప్రయోజనపడునట్టినది - ఇంతకాలము అసహాయుడుగాను , ఇప్పుడు ఆ సహకారితోను ప్రధానసంపాదకుడు చేయుచున్నపని యొక్కటియే.
ప్రధానసంపాదకుడు చేయుచుండిన పనియొక్క గుణమును రీతిని బోధచేసికొనక నిఘంటుసభవారు ఒకప్పుడు కొందఱు సభ్యులయుత్సాముచే అతనియందు అలసతాదోషమును ఆరోపింపనెంచిరి. అంతలో మరల, ఆత డొక్కడు చేయుచున్నదిమాత్రమే కార్యస్థానమందలి కార్యము లన్నిటిలోను నిఘంటూపయోగియని తెలిసికొనిరి.
ఇట్లుండగా వెండియు సందేహము కలిగినవారై ఆతనిని పదసంగ్రహణ రూపమైన మంచిపని మానిపించి అందులకుబదులుగా తనజ్ఞాపికలను ఎవ్వడేనియు ఏపాటివాడేనియు నిఘంటువులో ప్రవేశపెట్టుటకు తగినయట్లుగా విస్తరింపుమని యాజ్ఞాపించిరి. అంతట సంపాదకుడు జ్ఞాపికలను విస్తరింపవలసినతీరును ఏర్పరించుటయనెడి యుత్కృష్ట (సంపాదక) కృత్యమును, దానితో గూడ ఆవిస్తరమును తానే వ్రాయుటయనెడి నికృష్ట (లేఖక) కృత్యమును, రెంటిని తానొక్కడే చేయవలసినవాడాయెను. ఆతడు పలుమాఱు తెలుపుడుచేసికొనగా, తుదకు, పూర్వోక్త నికృష్టకృత్యమును గావించుపనికి ఒక పాఠకుని రు. 35 లు జీతముచేసి నియమించినారు.
సంపాదకుడు 11/2 సంవత్సరము తావ్రాసిన 19 జ్ఞాపికాపుస్తకములలో భారతమునకు సంబంధించిన 8 పుస్తకములను ఇప్పటికి విస్తరలేఖనమునకు తగినతీరున పున:పరిశీలనచేసినాడు, పూర్వోక్తపాఠకుడు వానిని విస్తరించుచున్నాడు. సంపాదకుడు కోరినప్రకారము ఆదినుండియు ఇరువురు సహకారులను అతనికిచ్చియుండిన ఈ పున:పరిశీలనము అనావశ్యమగును. జ్ఞాపికలును సగముకాలములోనే వ్రాయబడియుండును.
పాఠకులకు ఇంకను పదసూచికలు వ్రాయుటకు అముద్రితగ్రంథము లీయబడలేదు. ఉన్నముద్రణములు పదసూచికాలేఖనమునకు అర్హమగునట్లు శుద్ధముగానున్నవని తలంచుట యొక పొరబాటు.
సంపాదకుడు నిఘంటుసభవారికి వారమువారము తా జేసినకార్యమును నివేదనచేయవలసినట్లుగా నిబంధన యొకటికలిగినది. అందువలన ఆతనిపని కంటితోకొలువదగినదిగాను కాగితముల సంఖ్యచే తెలియవలసినదిగాను ఏర్పడినది. ఈనియమనముమూలముగా అతనిపనికి మిక్కిలి ఆటంకముకలిగినది.
ఆతడు ఎప్పుడును నిఘంటుపని త్వరలో ముగియు నుపాయములను పన్నుచుండెను. వానిని వేనిని సభవారు కైకొనక వానికిబదులుగా ధనమును మంచికాలమును పాడుసేయునవైన యసాధ్యాసంభావ్యోద్యమములను కల్పించుచుండిరి.
ఈనడుమ నిఘంటుసభవారు పదసంగ్రహణార్థమై బయటి పండితులకు కొన్నిగ్రంథములను నియమించుచు వానిలో ఇంతకుపూర్వమే ప్రధానసంపాదకుడు పఠించి జ్ఞాపికలు వ్రాసినపుస్తకములలో నాలుగింటిని-
1. నన్నెచోడుని కుమారసంభవము
2. శ్రీనాథుని హరవిలాసము
3. కేతనదశకుమారచరిత్రము
4. రామరాజీయము.
అనువానినిచేర్చిరి. ఇందుల కాతడు ఆశ్చర్యపడియు తా జేయుపనికిని బయటి పండితులుసేయుపనికిని గలుగు తారతమ్యము తనకును నిఘంటుసభవారికిని ఆయేర్పాటుమూలముగా బోధపడునుగాక యనుతలంపున దానిని ఆక్షేపింపక యూరకుండెను.
సభ్యులు కొందఱు కాకతాళీయముగా ప్రధానసంపాదకుని వ్రాతలందు ఏపుటలోనేని ఏపంక్తినేని తిలకించి అందలి సూక్ష్మ విషయములంగూర్చి 'ఈపదము వ్రాసి యుండవలసినదిగాదు; ఈపదము అనావశ్యకముగా వివరింపబడినది; ఈయర్థమునకు ప్రమాణములు అనావశ్యకముగా వ్రాయబడినవి?" అని యీతీరున నభివ్రాయములను అసాధువులనే వాక్రుత్తురు. అతడు చేయుచున్నపనిలోని గుణమును విశేషజ్ఞులుమాత్రమేగ్రహింపగలరు. వారేనియు కాలము వినియోగించి యవధానమొసంగిననేగాని యెఱుంగనేరరు. సాధుత్వమునకు ప్రామాణికత్వమునకును వలసినంతయాదరమును సభవారు వహింపలేదని సంపాదకు డభిప్రాయపడుచున్నాడు.
నిఘంటువును ఒక్కటేకట్టడముగా సమకట్టుటకును, దానిభాగములను యౌగపద్యమునంగాని, యథాక్రమమునంగాని, ఏవరుససరియో యావరుసను, కట్టించుటకై సంవిధానముసేయుటకును, సభవారు సంపాదకునికి అవకాశ మిచ్చుటలేదు. పునాదికంటె ముందుగా గోడలను లేపుమందురు, గోడలకంటె కంబములకంటెనుముందుగా మిద్దెకట్టుమందురు. ఆతనిని తనపద్ధతులనే అవలం బించి పనిచేయనిచ్చియుండిన ఇప్పటికి గ్రంథములనుండి శబ్దాన్వేషణమయినను ముగిసియుండును.
నిఘంటుసభ కార్యసాధకముగాదు.
సంపాదకుడు ఇట నుదాహరించుటకు తాను ఇచ్చగింపని కొన్నిప్రబల కారణములచేత ఈయనంతరవిషయమును రూడిగా జెప్పుచున్నాడు:-
నిఘంటుకార్యస్థానమును, పరిషత్కార్యస్థానమునగాక దానితో నెట్టిసంబంధమునులేనిదిగా దానికి కడుదూరముగా వేఱొకగృహములో, ఉంచి, నిఘంటుసభయిక్క సమావేశములును దానిచర్చలును ప్రధానసంపాదకునికిందక్క కడమ నిఘంటుకార్యస్థాన నియుక్తులకును, పరిషత్కార్యస్థాన నియుక్తులకును బొత్తిగా తెలియకయుండునట్లు సాధించియుండినయెడల, ఈజరిగిన నిఘంటుకార్యము ఇంతకన్న మిక్కిలి చక్కగా నెఱవేఱియుండును.
- ప్రధానసంపాదకుడు,
- వేదము వేంకటరాయశాస్త్రి.
- మదరాసు.
- 1-11-17
అయ్యా, ఈక్రిందిపంక్తులను సానుగ్రహులై చిత్తగింపబ్రార్థించు చున్నాడను.
ఈనివేదనమును నేనువిశదీకరణార్థమై మొక్కపాటి సుబ్బారాయుడు గారికి పంపితిని. ఆంధ్రసాహిత్యపరిషన్మంత్రిసభలో తామొకసభ్యులైన సుబ్బారాయుడుగారు, 3-11-1917 తేదిలో ఆసభలో దీనిని మదనుమతింజెంది పఠించి యిందులవిషయములకు తమయంగీకారముందెలిపిరి. అందఱు నంగీకరించిరి. అగ్రాసనాసీనులైన శ్రీయుత జయంతి రామయ్యపంతులుగారు మాత్రము ఇందుపన్యస్తములయిన కాయికక్లేశములు నాకొక్కనికే చెందినట్టివని వక్కాణించిరి. అందులకు నేను "నేనిపుడు పనిచేయగూర్చుండుచోట ఇంచుకసేపు కూర్చుండువారికెల్ల ఆబాధలెల్ల సంభవించును." అని వచించితిని.
శ్రీ పిఠాపురము రాజాగారు తమకోరినప్రకారము నిఘంటునిర్మాణ కార్యమును మదరాసునుండి కాకినాడకేని పిఠాపురమునకేని కొనిపోయి తమ సమీపముననే, తమయాధ్యక్షముననే, అట్లయినను ఆంధ్ర సాహిత్యపరిషత్తు వారి పరామరిక్రింద జరుపుకొనవచ్చుననియు, మదీయ సంపాదకత్వము 4-11-17 తేదినుండి మూడునెలలకు మదరాసులోనే నివర్తిల్లుననియును ఆసభలో నిర్ణయములు చేయబడినవి. పరిషత్తువారి పరామరికంగూర్చి నాతోగూడ శ్రీయుతులు వేమవరపు రామదాసుపంతులు బి.ఏ., బి.ఎల్., గారును, నాగపూడి కుప్పుస్వామయ్య బి.ఏ., గారును "ఈనిఘంటుకార్యము మనచేతినుండి తొలగి దూరదేశమునకు పోయినపిమ్మట దీనిపై మన పరామరిక యేల." అని యాక్షేపించిరి. ఆయాక్షేపము రామయ్యగారికి అసమ్మతుముగా నుండినది, సభలో అది నెఱవేఱలేదు.
నిఘంటు సభాసమ్మేళకులయిన శ్రీయుత గుమ్ముడూరి వేంకటరంగరావు ఎం.ఏ., గారు, 1914 సం. లో మదరాసులోను, 1915 సం. లో నెల్లూరిలోను, నాతో "మీరు ఏతన్నిఘంటుసంపాదనాధికారమును వహింపవలయునని పరిషత్తువారి యభిమతము; దానిని మీరు నెఱవేర్చిన ఆంధ్రలోకమునకు ఉపకారమును మీకు కీర్తియును గలుగును; కావున మీరీయధికారము నంగీకరింపదగును." అని బోధించిరి. వెంటనే నెల్లూరిలో మదరాసులోని యొకానొక పరిషత్సభ్యుని బంధుమిత్రుల వలననుండి పారంపరీణముగా "ఈ యధికారమున ఈయనను రెండుసంవత్సరములే యుంతురు, అప్పటికి ఫలాని వారలు రాజకీయోద్యోగ విరతులై స్వయముగానే దీనిం బూనుదురు." అని యొక కింవదంతి కలిగినది. అనంతరము నేను మదరాసులో వేంకటరంగారావు గారిని దర్శించి ఆకింవదంతిని నివేదించి "ఏమట్లు జరుగునా? అట్లేజరుగునేని, ఈయుద్యోగంపు జీతముపాటి యాయతిని నాకొసంగందగిన ముద్రాశాలా వ్యాపారమును దీనికై మానుకొని ఇదివిరమించినంతట నిరాధారుడనగుదునే!" అని యడుగగా, వారు "నేను సమ్మేళకుడనుగా నుండగా అట్లు జరుగనేరదు." అని వాక్రుచ్చిరి. ఆమాటపై ఈపనిని 5 ఏండ్లనియోజనమును, 2 ఏండ్ల కనంతరము ఇరుపక్షములను 3 నెలల హెచ్చరికచే విరామనియమనమునను, గైకొంటిని. ఆరెండేండ్లునయినవి, కింవదంతియు నొకవిధముగా నెఱవేఱినది. ఈయుద్యోగమున్నంత కాలము నాయచ్చుకూటంపు బనులం జూచు చుండినవారు వంచకులై నష్టములు కల్పించి ఈరెండేండ్లు మదీయ సంపాదక వేతనమును ఇంకనధికమును హరించిరి. అందువలన నాకు సంభవించిన యొడుదొడుకులను దిద్దుకొనుటకై అచ్చకూటంపు సామానులను నిశ్శేషముగా విక్రయించి ఆవ్యాపారమును త్యజించి తాను మిగిలియున్నాడను.
లోకక్షేమదీక్షీతులైన మీహృదయమందలి పరమాత్మ ఈవృత్తమును అవధరించును గాక.
- ఇట్లు విన్నవించుకొనువాడు
- దేశక్షేమపరాయణుల విధేయుడు
- వేదము వేంకటరాయశాస్త్రి.
నిఘంటుసంపాదకత్వ మీవిధముగా తేలిపోయినది. శృంగారనైషధ ముద్రణానంతరము శాస్త్రులవారికి చిక్కులువచ్చినవి. మదరాసునుండి నెల్లూరికి అచ్చాపీసునుమార్చినది పొరబాటైనది. వ్యాపారముచెడినది. ఇంతలో ఆశ్రిత కల్పవృక్షము శ్రీ మహారాజావారు సాయపడిరి. కాని ఆసహాయముయొక్క ఫల మనుభవించులోపల నిఘంటూపద్రవమువచ్చినది. ఇంతలో ఆప్రభువు నిష్క్రమించెను. నైషధవ్యాఖ్యానకృతిపతి శ్రీ లక్ష్మీనరసారెడ్డి గారును గతించిరి. శ్రీనాథుని చరమదశవలె నేర్పడినది. నిఘంటువైనను తమపేరిట వెలయునుగదాయని మనశ్శాంతి చేసికొనుటకులేక ఆసంపాదకత్వమును చాలించు కొనవలసి వచ్చినది. శాస్త్రులవారికి మరల నచ్చాపీసే గతియైనది. నిఘంటువు శాస్త్రులవారి చేతినుండి తప్పిపోయినదిగదా యనుచింత శాస్త్రులవారి స్నేహితులకేగాక ప్రతివాదులకును ఏర్పడినది.
- ___________