వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/12-ప్రకరణము

12-ప్రకరణము

*కవిపండితసంఘము - ద్వితీయసమావేశము.

"దీనిచర్య సుబోధకమగుటకై లఘువుగా నుపోద్ఘాతము వలసియున్నది. వేంకటరాయశాస్త్రిగారీ మూడుగ్రంథముల నీనడుమవ్రాసిరి.

1. ప్రతాపరుద్రీయనాటకము - దీన నీచపాత్రములకు గ్రామ్య ముపయుక్తమయినది.

2. జక్కన విక్రమార్కచరిత్ర ముద్రణవిమర్శము - ఇది రాయదుర్గము నరసయ్యశాస్త్రిగారు శోధించినట్టి విక్రమచరిత్రమున వేంకటరాయశాస్త్రిగారు దోషములుచూపి దిద్దిపెట్టినగ్రంథము.

3. ఆంధ్ర ప్రసన్నరాఘవ విమర్శ - వేంకటరత్నము పంతులవారి గ్రంథమునందలి దోషములను వేంకటరాయశాస్త్రిగారు వెల్లడిచేసినారు.

ఇందులో ప్రతాపరుద్రీయపద్ధతిని నీచపాత్రములకు గ్రామ్యమే లక్షణసమ్మతమైనచో కృష్ణమాచార్యులవారి చిత్రనళీయము, వేంకటరత్నము పంతులవారి ప్రసన్నరాఘవము, నరసయ్యగారి శాకుంతలము, ఇత్యాద్యనేక నాటకములు లక్షణవిరుద్ధములగును. గాన గ్రామ్యమే అవలక్షణమని సిద్ధాంతీకరించుట కృష్ణమాచార్య ప్రభృతులకు హితము.

విమర్శలు తలయెత్తినచో కవులకు స్వాతంత్ర్యముడుగును. అపండితులు గ్రంథరచనచేసి కవియశస్సును పొందుట కలవిగాదు. కాన విమర్శలకు అపండితకవులెల్ల ద్వేషులేయగుదురు.

ఈమూడు గ్రంథములును వెలువడకమున్ను ఒకపరి బళ్లారిలో సరసవినోదిని సభవారు కృష్ణమాచార్యులవారితోగూడ కరతాళఘోషములతో వేంకటరాయశాస్త్రులవారిని 'నిక్కంపుంబండితులు. చొక్కంపువిమర్శకులు' అనిపల్కిరని కృష్ణమాచార్యుల బావమఱది బ్ర.శ్రీ. నృసింహాచార్యుల

____________________________________________________________________

  • కవిపండిత సంఘచరిత్రతత్త్వమునుండి. వారు శాస్త్రులవారికి జాబువ్రాసినట్లు శాస్త్రులవారు వక్కాణించియున్నారు. ....ఇపుడు వెలువడిన పెద్దవిమర్శ నిజమిత్రులైన కొక్కొండ వేంకటరత్నము పంతులుగారి గ్రంథముపయిదిగాన, ఇపుడు కృష్ణమాచార్యులవారికి శాస్త్రులవారివిమర్శలు పనికిరాకపోయినవి.

వేంకటరత్నముపంతులవారి ప్రసన్నరాఘవముపై విమర్శ వేంకటరాయశాస్త్రులవారు నిరుడు వేసవికాలముసెలవులలో వ్రాయుచుండిరి. నెల్లూరిలోని నిజమిత్రులకుందెలుపుచుండిరి. ఈవృత్తాంతమును పంతులవారికి తన్మిత్రులు నెల్లూరినుండి తెలిపిరట. అంతట పంతులవారు నిజపత్రికలో 'భువనావళి' యనుపేర అతిహేయోపమలతో 14 పద్యములువ్రాసి, అందు విమర్శకులు విమర్శలను లోకమునకుం బ్రకటింపక, రహస్యముగా కవికిందెలుపవలయుననియు, అట్లుచేయువారికి కీర్తికలుగుననియు, ప్రకటించినచో విమర్శకులు అకీర్తిపాలగుదురనియు, విశదపఱిచిరి. శాస్త్రులవారు అందలి సూచనలు లక్ష్యపెట్టక గ్రంథమును ముద్రింపసాగిరి. ఆవిషయము పంతులవారికితెలిసి వారు మఱల నిజపత్రికలో ప్రసన్నరాఘవమును విమర్శచేయువాడు తత్క్షణము మృతినొందుననియును, ప్రకటించిరి. దానింగూడ శాస్త్రులవారు సరకుగొనక ముద్రణము ముగించుచుండగా పంతులవారు ప్రతాపరుద్రీయమును కాల్చివేయవలసినదని పత్రికలో వ్రాసికొనిరి. విమర్శముద్రితమై వెలువడెను. వెలువడగానే వేంకటరత్నముపంతులవారును, వారికి ఆప్తులైన కోలాచలము శ్రీనివాసరావుగారును, వేంకటరత్నముపంతులవారికి శిష్యులనబడు ధర్మవరము రామకృష్ణమాచార్యులును, అట్లే పంతులశిష్యులైన వేంకటసుబ్బయ్యగారును అట్లే పంతులశిష్యులును వేంకటసుబ్బయ్యరుగారికి మిత్రులును అయిన వావిలి కొలను సుబ్బారావుగారును... విమర్శకులైన వేంకటరాయశాస్త్రులవారిని వారి గ్రామ్యమును విమర్శను ద్వేషింపసాగిరి.

మఱియు వేంకటరాయశాస్త్రిగారు తామువ్రాసిన యాంధ్ర ప్రసన్నరాఘవనాటక విమర్శము ముద్రించుచున్నారని కొక్కొండ వేంకటరత్నము పంతులవారి పత్రికలోని శాపములు లోకమునకెల్ల విదితములయినపిమ్మటనే యొకనాడు ద్వితీయసంఘము కూడుటకు ఇంక రెందు మూడు మాసములుండగా వేంకటరాయశాస్త్రులవారిని కృష్ణమాచార్యులవారు క్రిస్టియన్కాలేజిలో దర్శించి, విమర్శలప్రస్తావముందెచ్చి, 'ఇట్టివిమర్శలు మాత్సర్యముచే వ్రాసినవని లోకులు తలంతురు.' అనిరి. 'కారణమేమని యెవరూహించిననేమి, విమర్శలోనివిషయము సాధువైన లోకులు హర్షింతురు. దానశ్రేయముం బొందుదురు. మాత్సర్యకారణమును తమ కనర్హమయిన కవిపండితకీర్తి నపేక్షించి గ్రంథరచనలుసేసి సద్విమర్శలచే భగ్నులయిన యపండితులు కల్పించుకొందురుగాక. ఇతరులకు కారణాన్వేషణము సేయునంతప్రసక్తిలేదు. అని శాస్త్రులవా రుత్తరమిడిరి. అంతట కృష్ణమాచార్యులవారు 'ఇట్టివిమర్శలు వెడలకుండుటకై మేము కృతవిమర్శోపసంఘ మొకటి నిర్మించెదము' అనిపల్కిరి. 'మనము నిర్మింతము' అనిపల్కలేదు. 'ఉచితమేని నెఱవేరునుగాక' అని శాస్త్రులవారుత్తరమిడిరి. అంతట కృష్ణమాచార్యులవారు వెడలిపోయిరి.

విమర్శగ్రామ్యనాశోపాయములు - తత్సిధ్యుపాయములు - ఇందులకై కృష్ణమాచార్యులవారు కృతివిమర్శోపసంఘమని యొక యుపసంఘమును నిర్మించుటయుపాయముగా నిశ్చయించుకొన్నారు. అట్టి యుపసంఘము నిర్మాతవ్యమని మహాసంఘములలో నిర్ణీతమయ్యెనేని, అటుపిమ్మట ఆయుపసంఘము సాంఘికులను తనవారినిగానే చేర్చుటయు, వారిచే గ్రామ్యవిమర్శ నిరాస మాత్రమేగాక నిజేష్ట సిద్ధాంతము చేయించుచుండుటయు నీషత్కరముగదా.

శ్రీ శేషగిరిశాస్త్రులవారు అగ్రాసన మలంకరించి యుపన్యాస మొకటి చేసిరి. అందు పండితులు జిజ్ఞాసువులై మెలగవలయునని హితోపదేశము చేసిరి. ఆంధ్రభాషోత్పత్తినిగూర్చి చిరపరిశీలనోపలబ్ధములైన తమ యమూల్యాభిప్రాయములను తెలుపందొడంగిరి......

కృష్ణమాచార్యులవారు కృతివిమర్శోపసంఘమొకటి నిర్మింప దగినదని యుద్దేశించిరి. వారివారందఱును సరి యనిరి. వేంకటరాయశాస్త్రులవారు పనికి రాదనిరి. అంతట కృష్ణమాచార్యులవారు తెనుగును ఏటగలిపి ఇంగిలీషులో లైన్‌బైలైన్ క్రిటిసిసమ్‌స్‌' అని వేంకటరాయశాస్త్రులవారి విమర్శలను దూలనాడిరి. వేంకటరాయశాస్త్రులవారు 'వరడ్‌బైవరడ్ అండ్ సిల్లబిల్‌బై సిల్లబిల్ క్రిటిసిసమ్‌స్, నాట్‌లైన్ బై లైన్‌' అని బదులునుడివిరి.

తర్వాత పూండ్ల రామకృష్ణయ్యగారు, 'నాటకములందు నీచపాత్రములకు గ్రామ్యముంచతగునా తగదా?' అనువిషయము చర్చింపదగినది' అని నుడివిరి. వేంకటరాయశాస్త్రులవా రామోదించిరి. తత్పూర్వము పత్రికలలో గ్రామ్యమును నిషేధించుచుండిన కొక్కొండ వేంకటరత్నము పంతులవారును, అట్లే గ్రామ్యనిషేధవాదులైన కృష్ణమాచార్యులవారును.......ఏవమాదులు ఆవిషయము చర్చకు రాగూడదని యాక్షేపించిరి. 'ఇది విద్యావిషయముగదా ఏలరాగూడదని' వేంకటరాయశాస్త్రులవా రడిగిరి. అంతట కృష్ణమాచార్యులవారు, వేంకటరాయశాస్త్రులవారిని, 'మీతాత్పర్యము కొన్నిపద్యములు మాత్రము లక్షణభాషలోవ్రాసి కడమగ్రంథమెల్ల గ్రామ్యముగావ్రాసిన పనికివచ్చుననియా?' అని యడిగిరి. 'పాతివ్రత్యభంగమునకు ఎన్నిమారులు కక్కుర్తిపడవలయునని ధర్మశాస్త్రము?' అని శాస్త్రులవా రడిగిరి, ఎల్ల వారును ఊరకుండిరి. శాస్త్రులవారు మఱల 'పుటకెన్నిపంక్తులు గ్రామ్యముండవచ్చునని మీయభిప్రాయము? పండ్రెండా పదమూడా?' అనియడిగిరి. అందులకును ఎవ్వరుంబలుకకుండిరి. అంతట కృష్ణమాచార్యులవారు 'ఈసభవారి సిద్ధాంతము ప్రకారము తాము నడుచుకొందురా?' యని శాస్త్రులవారినడిగిరి. ఈ ప్రశ్నలో ఎంత కుట్రకలదో యాలోచింపుడు. ఈ ప్రశ్న యడుగవలసిన ప్రసక్తియేమి" ఇతరులు తమతమ యుద్దేశ్యములందెలిపినపుడెల్ల వారిని 'ఈ విషయమున సభవారి సిద్ధాంతముప్రకారము మీరు నడచుకొందురా?' అని అడిగినారా? వేంకటరాయశాస్త్రిగారిని మాత్రము ఈప్రశ్నయడుగనేల? శాస్త్రిగారు అట్లే నడచుకొనియెదనని చెప్పినయెడల, వెంటనే తొలుత ఆచర్చగూడదన్నవారెల్ల ఇపుడు కూడుననియొప్పి పిమ్మట వోట్లబాహుళ్యముచే గ్రామ్యము కూడదని సిద్ధాంతీకరించి శాస్త్రులవారిని నిబర్హణసేయుదురుగావలయు. శాస్త్రులవారు ఈసభకు దేశమందలి పండితులెల్ల రానందున ఈసభవారి సిద్ధాంతమునకు నెవ్వండును బద్ధుండుకానేరడనియు, చర్చించి యభిప్రాయముచెప్పు నధికారమేగాని బంధించు నధికారము ఈసభవారికి లేదనియు, అట్లు బద్ధులుకావలసినట్లు నిబంధన యేమియులేదనియు, ఆహూతులైవచ్చిన పండితులట్టినిబంధన కొడంబఱుపబడలేదనియు కావున తానెంతమాత్రమును ఈసభవారి సిద్ధాంతములకు ఒడంబడననియు పల్కిరి. అంతట కృష్ణమాచార్యులవారు 'ఈవిషయము కృతి విమర్శోపసంఘమువారికి తెలియును గాన మనము చర్చింపబనిలేదు.' అనిరి. 'వారిలోవైమత్యము తప్పించుటకై మనము చర్చించి సిద్ధాంతముందెలుపవలయును.' అని శాస్త్రులవారు నుడివిరి. అంతట వోట్లడిగిరి. ఇంతవివాదముపై కొందఱు ఈ విషయమును మఱునాడు ధ్వంసము చేయుదమని సంకల్పించి వోట్లిచ్చిరి....... పిమ్మట అగ్రాసనాధిపతిగారు ఆగ్రామ్యవిషయము చర్చించుటకు తనకు సమ్మతముకాదని నుడివిరి. అంతట అగ్రాసనాధిపతిగారికిష్టముగాని చర్చ యేల బలాత్కారముచేయవలయునని వేంకటరాయశాస్త్రులవారు తనవోటును ఉపసంహరించిరి. ఆవిషయము రేపు చర్చనీయము కాదని తీర్మానింపబడెను.......

వడ్డాది సుబ్బరాయడుగారు 'ఆంధ్రభాషకు లక్ష్యములుగా ప్రమాణగ్రంథములేవో తెలియవేని కృతివిమర్శోపసంఘసాంఘికులు విమర్శ యెట్లు చేయుదురు? ప్రమాణగ్రంథము లివియని యొక సిద్ధాంత మేర్పఱుపవలయును.' అని యుద్దేశించిరి. "ప్రమాణగ్రంథము లేవో తెలియరేని కృతివిమర్శోపసంఘసాంఘికులు గ్రంథవిమర్శ యెట్లుసేయుదురు? వారికావిషయము గ్రామ్యవిషయంబువోలె తెలిసియేయుండును, గాన నది యిట చర్చనీయము గాదు." అని శాస్త్రులవారు నిషేధించిరి. అదిత్యక్తమాయెను........

ఉపన్యాసక నియమనములో ....... వేంకటరాయశాస్త్రులవారికిని, పూండ్ల రామకృష్ణయ్యగారికిని తప్ప కడమయందరికిని ఉపన్యాసములు కుదిర్చిరి........ 1899 సం. జనవరి 1 తే. 12 ఘం. లకు సభ యారంభమాయెను. కుప్పుస్వామయ్యగారు నూతనమార్గముల గ్రంథములు రచింపవలసినదనియు, అన్యభాషాగ్రంథముల నాంధ్రీకరించుచో సాంకేతికపదములను గీర్వాణభాషలో.......నాటకములందు గ్రామ్యము ప్రయోగింపగూడదనియు నుపన్యసించిరి. వేంకటరత్నము పంతులవారు...... నాటకములలో గ్రామ్య ముపయోగింపగూడదని నుడివిరి.

పిదప నాత్మకూరు సంస్థానపు శ్రీనివాసాచార్యులవారు నాటకములలో గ్రామ్యముకూడుననియు కూడదనియు రసమునకు గ్రామ్యమే వలయుననియు నుడివిరి......

ఈ యుపన్యాసము లిట్లు జరుగుచుండగా సామాజికులు అగ్రాసనాధిపతిగారికి ముమ్మాఱు ఒకవిన్నపము, తొలుత ఒకరిద్దఱి చేవ్రాలతోను, రెండవమాఱు మూడవమాఱును పలువురి చేవ్రాలతోను ఒనర్చిరి. విజ్ఞాపననంగీకరించి అగ్రాసనాధిపతిగారు వేంకటరాయశాత్రిగారిని ఉపన్యాసార్థమై పిలిచిరి. శాస్త్రులవారప్పుడే యింటికి పోయివచ్చినందున, దేహమందారోగ్యము చాలనందునను, తన్ను మన్నించి యుపన్యాసము తప్పింపవలయునని అగ్రాసనాధిపతిగారినియడిగిరి. 'మీరు నాలుగుమాటలుచెప్పిన చాలును. ఏవిషయముచెప్పినను సరియే" యని రెండుమాఱులు అగ్రాసనాధిపతిగారు కోరగా మహానుభావులమాట నిరాకరింపజాలక యొడంబడిరి. అగ్రాసనాధిపతిగారు లేచి 'మహావిద్వాంసులైన వేదము వేంకటరాయశాస్త్రిగా రుపన్యసించెదరు. సావధానచిత్తులరైవినుడు.' అని సభవారిని హెచ్చరించి పల్కిరి శాస్త్రిగా రుపన్యాసపీఠము నధిష్ఠింపగానే సభ్యుల కరతాళఘోషములు 4-5 నిమిషములు మ్రోగుచుండినవి. (ఇట్టి గౌరవము, అగ్రాసనాధిపతిగారి చేతనేమి, సామాజికులచేతనేమి శాస్త్రిగారికిదక్క మఱియేయుపన్యాసకునికిం జరుగలేదు.) ఆఘోషలు నిలిచినతర్వాత, శాస్త్రులవారు అగ్రాసనాధిపతిగారిని ప్రకృతవిషయమేమని యడిగిరి. కృతివిమర్శోప సంఘనిర్మాణమని యగ్రాసనాధిపతిగారు చెప్పిరి. శాస్త్రులవారు చిత్తమని దానింగూర్చి యుపన్యసింపం దొరంకొనుచుండగా కార్యదర్శిగారు మేల్కొని, ఆవిషయమున కుద్దేశకుడు తాననియు, తనయుద్దేశనోపన్యాస మయినతర్వాత శాస్త్రులవా రుపన్యసింపవచ్చుననియు నుడివిరి. శాస్త్రులవారీవిఘ్నమునకు పరమానందభరితులై తత్క్షణమే గద్దియందిగి సామాజికులందు గూర్చుండిరి......అంత కృష్ణమాచార్యులవారు కృతివిమర్శనోపసంఘ నిర్మాణమునుగుఱించి యొక యరటావుకాగితము రెండు ప్రక్కలను తామువ్రాసికొని వచ్చినయుపన్యాసముమును అరగంటసేపు చదివిరి.

అంత అగ్రాసనాధిపతిగారు వేంకటరాయశాస్త్రులవారిని ఉపన్యసింపుమని కోరిరి. వేంకటరాయశాస్త్రులవారు మునుపటికంటె నధికముగా నభినందింపబడి 'పత్రికలలో విమర్శలు సరిగావనుట సరిగాదు. అముద్రిత గ్రంథచింతామణి శాస్త్రీయ విమర్శలకు బద్ధకంకణయై పండ్రెండు సంవత్సరముల నుండి కీర్తివడసియుండగా, అట్టి పత్రికను బహూకరింపక ధిక్కరించుట పండితసంఘమునకుదగునా .......కృతి విమర్శనోపసంఘము పనికిరాదు.' అని యీతీరున ఉపన్యసించిరి.

ఈ యుపన్యాసమధ్యంబున శాస్త్రులవారు గఘప్రాసమన్నప్పుడు, కృష్ణమాచార్యులవారు లేచి అగ్రాసనాధిపతిగారి చెవిలో 'పెర్సనాలిటి' అని యూదినారు. దానిని విని అగ్రాసనాధిపతిగారు శాస్త్రులవారికి హెచ్చరిక సేయుటకు లేచుచుండగా శాస్త్రులవారు వారిరువురింగని 'I know better' (నాకంతకన్న బాగుగాతెలియును) అని పల్కిరి. దాన నాప్రయోగము శాంతమాయెను.

శాస్త్రులవారి యుపన్యాసమున వాక్యములకును వాక్యాంతర్గత పదములకును సామాజికులహర్షోత్కర్ష సూచకకరతాళఘోషములచే వ్యవధానము కలుగుచుండినది. వారుపన్యసించిన కాలపరిమాణము 15 నిమిషము లుండును. వారి యుపన్యాసమునంగలిగిన సామాజికాది చిత్తావస్థను 'రాజహంస' యిట్లు వర్ణించినది. 'వేంకటరాయశాస్త్రిగారు.........పునాదిలేని సౌధమువలె నాంధ్రకవిపండితసంఘ మొక్కసారి నేలపడబోవుచున్నదా యనునట్లు సభ్యులయుల్లములు జల్లుమనునట్లు ప్రసంగించిరి. అగ్రాసనాధిపతిగారు సభ్యులవంకజూచిరి. సభ్యు లాచార్యులవంకజూచిరి. ఆచార్యులవా రాకాశమువంకంజూచిరి....' అని రాజహంస కూజితము. 'శాస్త్రులవారి వలన మనభాషకు ముప్పు తప్పినది, భాషకింకను మంచికాలము కొంతవఱకున్నది' అని దేవరాజపెరుమాళ్లయ్య లోనగు నాంధ్రపండితులు సంఘమందు మిత్రులతో వక్కాణించిరి.

శ్రీ శాస్త్రులవారి యుపన్యాసముగుఱించి, బ్ర.శ్రీ. కొక్కొండ వేంకటరత్నముపంతులవారు విళంబిపుష్యసంజీవనిలో నీవిధముగా నిందించి యున్నారు.

'బ్ర. వేదము వేంకటరాయశాస్త్రులవారును, బ్ర. పూండ్ల రామకృష్ణయ్యగారును ఝుంఝామారుతమువోలె మారుకొన్నందునన్, బ్ర.శ్రీ మచ్ఛతావధాని ధర్మవరము రామకృష్ణమాచార్యులవారి కృతి విమర్శనొపసంఘ విషయమైనవాదమను నౌక యాకాలమున సంగభంగభయమను సముద్రమునన్ మునింగె. ఆనావ వెండియు లోనుండి వెలువవరించుట కొకసంవత్సరము పట్టునని తెలియవచ్చె. వేయేల? ఈయోలగముయొక్క ముఖ్యేద్దేశము చక్కగా నెఱవేఱమికిత్తఱి బ్ర. వేదము వేంకటరాయశస్త్రిగారును, బ్ర. పూండ్ల రామకృష్ణయ్యగారును నను నీయిరువురే కారణభూతులని యందఱుం దలంచిరి. మఱి వచించిరి. ఈయాంధ్రకవిపండితసంఘ మహాసభ భవిష్యద్వర్షమున నెల్లూరులో జరుగునట్లు నిష్కర్షింపబడియెను. ఇక నిది యక్కడ నెక్కరణింజరుగునో? ఎందుకుగాని యీయిరువురుం జతపడుదురేని కృతివిమర్శనోప సంఘప్రతిష్ఠాపనాశయమ ద్రాక్షాలత నిష్ఫలమేగాని సఫలము గానేరదు. చిలుకకు తనముద్దేగాని యెదుటిముద్దెఱుగదు నావినమే? ఒరులమాట యేటికి. ఆయిరువురలోనే యాంధ్రగ్రంథవిమర్శనాధి కారమునకు మేమేయర్హులముగాక యన్యులుగారని వారివారి యభిప్రాయముండబోలును. కాన వీరిని మానజాలమేలు.' ఆంధ్రపండితులారా, ఆంధ్ర భాషాభిమానులారా!..........మేము మీకు నివేదించిన యీవిషయములనెల్ల మీరు చక్కగవిచారించి పూర్వోక్తప్రకారము సంఘమును సంస్కరింతురుగాత.

ఇట్లు పండితజనవిధేయులు.
శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి
కోవూరు సుబ్బరామయ్య
గుండ్లపూడి సుబ్బయ్య
సి. దొరస్వామయ్య.

ఈవిధముగా నాంధ్రకవిపండితసంఘము తుదముట్టెను. శాస్త్రూవారు మరల తమ బొందిలో నూపిరియుండగా నీ సంఘములేవదని వచించిరి. ఆవెనుక శాస్త్రులవారు వీరిలో రఘనాథపురం వెంకటసుబ్బయ్యరుగారును మఱియొకరును ప్రకటించిన కాళహస్తిమాహాత్మ్య ముద్రణమును విమర్శించి దానిని శారదా కాంచిక తృతీయకింకిణియని పేర్కొనిరి. 1900 సం. పాత్రోచితభాష ఆవశ్యకమని సంస్కృతాంధ్ర గ్రంథములనుండి ఆథారములు చూపి 'గ్రామ్యభాషా ప్రయోగనిబంధనము'ను రచించి శారదాకాంచిక నాలుగవకింకిణిగా ప్రకటించిరి.

తమ పాండిత్యాతిశయములను సమకాలికులు గ్రహింప లేదనియో లేక నిరంతరము తమ్ము దూషించువారికి దెబ్బగానో ఏకారణముచేతనో శాస్త్రులవారు ప్రతాపరుద్రీయములో నటిచే నీపద్యముం జెప్పించిరి.

ఉ. అంకెకుదార్చె నేరసికు నంగలభారతి ప్రౌడనీతి, నా
   కింకిరి నాంధ్రి ద్రావిడయు గేరుచు దైవియు గూడిరెవ్వనిన్,
   జంకు కళంకు లేనికవిచంద్రుడు తోషితకోవిదేంద్రు డా
   వేంకటరాయశాస్త్రికృతి వెంగలిమూక కెఱుంగ శక్యమే?

ఇంతవఱకును తమ జీవితములో జరిగిన విశేషములనెల్ల శాస్త్రులవారు తమ యుషానాటకమున నీక్రిందిపద్యమున మనోహరముగా వచించినారు.


సీ. ఛాత్రసాహస్రప్రచారంబుగా నాట
      కములు దన్నిగమంబు గఱపినారు,
   సర్వజ్ఞసింగమ సార్వభౌముని గద్దె
      యెక్కిన దొరమది కెక్కినారు,
   హూణరూపకరసం బుదరంబునిండార
      ద్రావిగఱ్ఱున ద్రేచి తనిసినారు,
   టాటోటుగవులు పటాపంచలైమాయ
      గాంచికవాణి కర్పించినారు,
   బల్లారిభవకవి పండితసంఘంబు
     మదరాసులో రూపుమాపినారు,

తే. కాళిదాసుశకుంతల నేలినారు,
   మించిన ప్రతాపకృతిని నిర్మించినారు,
   తగదొకోశాస్త్రిగారి గ్రంథమును గోర
   మహితవస్తుపరాయణ మానసులకు

___________