వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/1-ప్రకరణము

1-ప్రకరణము

తండ్రిగారు

నెల్లూరుజిల్లా కావలితాలూకాలో నిసుకపల్లెకు సమీపమున సముద్రతీరమున మల్లయపాళెమను గ్రామమును వేదము వారు పుదూరుద్రావిడ బ్రాహ్మణులు సోమపీథులు సర్వాగ్రహారముగా బడసి చిరకాలముగా ననుభవించుచుండిరి. వేదశాస్త్రము లందు బ్రఖ్యాతులగుటచే వీరికి వేదమువా రని పౌరుషనామము. ఈ వంశమున వేంకటరాయ శాస్త్రులవా రని, "వేదశాస్త్రములందు బ్రఖ్యాతులు, అప్రతిగ్రాహకులుండిరి." వీరిసతి అనంతమ్మగారు. ఈ దంపతులకు మువ్వురుకుమారులు జనించిరి - వేంకటేశ్వర శాస్త్రిగారు, వేంకటరమణశాస్త్రులవారు, విశ్వపతిశాస్త్రులవారు నని. మువ్వురును మంచి వైదుష్యము నార్జించిరి. వీరిలో వేంకటేశ్వరశాస్త్రిగారు. అధ్వర్యులుగానుండి పెక్కు క్రతువులు జరిపించినవారు. యజ్ఞాదికములలో వారుచెప్పినదే ప్రమాణము. తండ్రిగారు, వేంకటరాయశాస్త్రిగారు, మధ్యప్రాయమునందే చనిపోయిరి. వారి పెద్దకుమారులు కుటుంబము నిర్వహింపసాగిరి. వేంకటరమణశాస్త్రులవారు పండ్రెండవయేటనే 1830 సం. ప్రాంత్యమున యిలువీడి కంచికి విద్యాభ్యాసమై తరలిపోయిరి.

కంచిలో నివర్తి వేంకటరామశాస్త్రులవారు ఆకాలమున సుప్రసిద్ధపండితులు. నాటికి కంచి యింకను తనపూర్వవిద్యా గంధమును కోలుపోలేదు; విద్యావిషయములలో దక్షిణభారత దేశమున ప్రథానస్థానము నందియుండెను. ఆంగ్లనాగరికతదేశమున నాటికి మొలకలెత్తలేదు; దేశ మింకను తన పూర్వనాగరికతావైభవమును కోలుపోలేదు; మార్పు ప్రారంభము కాలేదు. ప్రాచీనకాలమున, ఎచ్చటెచ్చటి విద్యార్థులును, తక్షశిల, నలంద మొదలయిన విశ్వవిద్యాలయములకు చేరునట్లు, నాడు విద్యార్థులు కంచికి చేరుచుండిరి. వేంకటరమణశాస్త్రులవారు నాటికి పండ్రెండేండ్లవారే యైనను, గత్యంతరములేమిచే, కాలినడకను బయలుదేరి కొన్నినెలలకు కంచికి పోయిచేరిరి.

వారు కంచి చేరునప్పటికి సాయంకాలమగుచుండెను. ఒకానొకచోట సంపన్నగృహస్థు నొకనింగని, వేదములు వల్లించుచు వారి యింటికింబోయి, నమస్కరించి వారిని నివర్తి వేంకటరామశాస్త్రిగారి యి ల్లెచటనున్నదని ప్రశ్నించిరి. ఆగృహస్థు వెంటనే ఆబాలుని చూచి, ఆతని సౌజన్యమునకును, వచ:శుద్ధికిని చాలసంతోషించి, శిష్టసాంప్రదాయమునకు చెందినవాడనియు, తన సహాధ్యాయికి మేనల్లుడనియు గ్రహించి "అబ్బాయీ, అనివర్తిసాస్త్రులు నేనే, మీమేనమామ గారున్నూ నేనున్నూకూడా చదువుకొన్నాము. నీవు మా యింట్లోనేవుండి చదువుకో. నీకు అన్ని అనుకూలాలున్నూ నేను చేస్తాను." అని ఆదరించిరి.

వేంకటరమణశాస్త్రిగారు వెంటనే వారికి సాష్టాంగముగా నమస్కరించి తమవారు గురువునింట భోజనము చేయకూడదని చెప్పిరనియు తాము మధుకరముచే భోజనముచేయుచు చదువు కొనెదమనియు తమ దృడసంకల్పమును తెలిపిరి. అంతట వారే వీరికి వారములు ఏర్పాటు చేయించి అన్నిశాస్త్రములును బోధించిరి.

వేంకటరమణశాస్త్రిగారు విద్యార్థులలో మేలుబంతి. ఉపాథ్యాయునకు చాల విధేయులు. తా ముద్యోగమునందు ప్రవేశించిన యనంతరము చిరకాలము వఱకు తమ జీతమునుండి పదిరూప్యములు గురువునకు కానుకగా పంపుచుండిరి.

వేంకటరమణశాస్త్రిగారు ఎన్నడును తిరస్కారవాక్యమును సహించినవారుగారు. ఒకనాడు కంచిలో వారములు చేయునొకయింట వృద్ధయొకతె కోపముతో 'వారం బ్రాంహలు వస్తారు. ఒకరైనా విస్తళ్లు తెచ్చుకోరు. వీళ్లకు విస్తళ్లు కుట్టి పెట్టలేకుండా చచ్చిపోతున్నాను' అని వేంకటరమణశాస్త్రిగారు వచ్చుచుండగా వారికి వినబడునట్లు పలికెను. ఆవాక్యము విని వెంటనే ఆయన ఆయింట ప్రవేశింపకయే ఎచటికో పోయెను. వేళకు భోజనమునకు రాలేదు. ఉపాధ్యాయుడును సహాథ్యాయులును ఊరంతయు వెదుకసాగిరి. ఆవృద్ధ యేడ్చుచు భోజనముమాని వీధితిన్నెపై కూర్చుండెను. వెదుకగా వెదుకగా సాయంకాల మగుసరికి ఊరిబయట నొక మఱ్ఱిచెట్టుక్రింద ఆకులుకోసి కట్టలుకట్టి ఒకరు క్రింద పడవేయుచుండ నొక విద్యార్థి చూచి ఎవరో యని పరిశీలింప వేంకటరమణశాస్త్రి. వెంటనే అందఱువిద్యార్థులునువచ్చిరి. ఉపాథ్యాయుడు ఆరోషమునకును పట్టుదలకును చాల ఆశ్చర్యపడెను. నాడు విద్యార్థు లందఱను కూర్చుండి విస్తరాకులను కుట్టి ఆఱునెలలకు వలసిన విస్తళ్లను ఆవృద్ధయింట వైచిరి. ఆముసలామె నివ్వెఱబోయెను. అదిమొదలు వేంకటరమణశాస్త్రిగారిని అందరును చాల మర్యాదగా చూడసాగిరి. ఇట్టియుదంతములు ఎన్నేనియు గలవు.

వీరికి దయ్యములందుగాని శకునములు మొదలైనవాని యందుగాని ఎట్టినమ్మకమునులేదు. విద్యార్థిదశలోనే యొకప్పుడు వీరికిని వీరితోడి విద్యార్థులకును దయ్యముల విషయమై వివాద మేర్పడినది. వీరు అట్టి పిచ్చినమ్మకమునకు తావీయలేదు. అంతట విద్యార్థులందఱును పందెములు వేసికొని ఒక అమావాస్యనాడు రాత్రి శ్మశానమునకు బయలుదేఱిరి. ఒక్కొకరును చేత తమపేరువ్రాసిన తాటియాకు, ఒకచీల, ఆతాటియాకును శ్మశానము చెంత నొక చెట్టునకు కొట్టుటకు ఱాయి, వీనితో తరలిరి అర్థరాత్రివేళ. అందఱును కలసియే ప్రయాణమైరి గాని నాలుగడుగు లిడిన వెనుక ఒకరొకరు వెనుకకు పోసాగిరి. తుదకు వేంకటరమణశాస్త్రిగారు మిగిలిరి. ధైర్యముగాపోయి వల్లకాటి చెట్టున ఆ తాటియాకును చీలతోకొట్టి ఇటునటుచూడక వెనుకకు తిరుగగానే ఎవడో వెనుకనుండి వీరి పైపంచెను లాగుకొనెను. ఇంకను బాల్యమేగావున ఎవడో బేతాళుడని తలంచి పైపంచె వదలివేసి త్వరగా నిల్లుచేరిరి. విద్యార్థులకు ఈవృత్తాంతమును చెప్పి 'వాస్తవముగా దయ్యమే యైయుండునా?' అని యనుమానించుచు ప్రొద్దున విద్యార్థులతో పోయి చూడగా, ఆ పైమంచెనులాగినది దయ్యమునుగాదు పిశాచమునుగాదు, వారు తమ పైపంచమీదనే ఆ తాటియాకునుంచి చీలకొట్టి యుండిరి. అదిమొదలు దయ్యములన్న నమ్మకము పూర్తిగానే వదలివేసిరి.

వేంకటరమణశాస్త్రిగారు విద్యభ్యాసానంతరము తొలుత మదరాసులో సంస్కృతాంధ్ర ద్రావిడ పాఠశాలలో ప్రధాన పండితులుగాను, కాకినాడ స్కూలు సంస్కృతపండితులుగాను, నరసాపురం నార్మలు స్కూలు ప్రధానోపాధ్యాయులుగాను, పోడూరు స్కూలు హెడ్మేస్టరుగాను, పిమ్మట విశాఖపట్టణము నార్మలు స్కూలు పండితులుగాను, అనంతరము రాజమండ్రి కాలేజి సంస్కృత ప్రధానపండితులుగా నుండి రు 25 లు. విరామ వేతనముం బొందిరి.

వేంకటరాయశాస్త్రులవారే తమతండ్రిగారింగూర్చి ఇట్లు వ్రాసియున్నారు.

  • [1] "నాయనగారు తాతగారివలెనే విద్వాంసులు, అప్రతిగ్రాహకులు, మహాకుటుంబి, నిఱుపేదలు, వైయాకరణ పతంజలి యనియు, వేదవ్యాసులనియు ప్రఖ్యాతులు, మహారసజ్ఞులు, అద్భుత సాహిత్యమండితులు, సౌజన్యపరమావధి, శిష్టులు, సత్యసంధులు, కరుణాపరాయణులు, యథాశక్తిత్యాగి, వారి సౌజన్యవిశేషములను ఎంతచెప్పినను తనివితీరదు.

నాయనగారు శిష్టు కృష్ణమూర్తిగారికి గుంటూరు కాకినాడలలో పరిచితులు. కృష్ణమూర్తిగారికి చిన్నయసూరిగారితో కాళహస్తి, వేంకటగిరి సంస్థానములలో ఘర్శ్హణ. కృష్ణమూర్తిగారు బాలవ్యాకరణమును హరికారికలనుపేర సంస్కృతమున అనువదించుట. వారి యసత్యవాదము. అట్లు చేయగూడదని మా నాయనగారు కృష్ణమూర్తిగారిని హెచ్చరించుట.

పట్టిసము పుష్కరాలలో అమ్మవారిసన్నిధిలో కొండ మీద గుడిలో తపస్సు - ఆఱుమాసములు. అనంతభట్ల సుబ్రహ్మణ్య మనుపేర శిష్యుడు, జూవ్వలదిన్నెవాడు, తెచ్చియిచ్చు దోసెడు రేగుబండ్లు ఆహారము. వేఱు అన్నము లేదు. వారి శిష్యులు కాకినాడ పాఠశాలలో వారి యుద్యోగమును నిర్వహించి జీతముం దెచ్చి మా యింట ఇచ్చుచుండిరి."

వేంకటరమణశాస్త్రులవారు గొప్పవేదాంతులు, ఋషితుల్యులు. ఒకానొక పాఠశాలలో వారు పండితులుగా నుండు కాలమున ప్రిన్సిపాలుగా నుండిన దొర యొకడు విరామముం బొందగా క్రొత్తగా నొకడు వచ్చెను. ఆ సందర్భమున నందఱును ఆక్రొత్త ప్రిన్సిపాలు దర్శనము చేసికొనిరిగాని వేంకటరమణశాస్త్రిగారు మాత్రము ఆతనిదర్శనము చేసికొనలేదు. ఒకనెల గడచినయనంతరము ఆదొరయే వారిని పిలిపించి 'నీవేల మాదర్శనమునకు రాలే'దని వారిని అడిగించెను. అంతట శాస్త్రుల వారు 'నాధర్మమును నేను ఆచరించుచున్నాను. తమదర్శనము చేయకూడదని లేదు. చేయవలెనని తోచలేదు.' అని బదులు చెప్పిరి. 'మిమ్ము ఉద్యోగమునుండి నేను తొలగించిన నేమి చేసెదరు?' అని యాతడు మరల నడిగెను. వెంటనే శాస్త్రులవారు తడువుకొనక 'జిహోవా' యని బదులుచెప్పిరి. దొరకు ఆశ్చర్యమును సంతోషమును కలిగినవి. వారు గొప్ప వేదాంతులని గ్రహించి అది మొదలు వారిని గౌరవించుచుండెను. వేంకటరమణశాస్త్రులవారు బైబిలు చర్చలను విశేషముగా వినుచుండువారు. అందుచే 'జిహోవా' వారికి చిరపరిచితుడు.

వీరికి నలువురు కుమార్తెలును నలువురు కొమారులును జనించిరి. ప్రథమసంతానము కొమర్తె. ద్వితీయసంతానమే శ్రీ వేంకటరాయశాస్త్రిగారు. తృతీయులు వేంకటసుబ్బయ్యగారు. వీరింగూర్చి కథావశమున హెచ్చువ్రాయుదును. ఆఱవవారు ఎనిమిదిభాషలలో చక్కని వైదుష్యము సంపాదించి సుప్రసిద్ధచరిత్ర పరిశోధకులుగాను న్యాయవాదులుగాను ప్రసిద్ధిగాంచిన శ్రీ వేంకటాచలముగారు. తర్వాతివారు శ్రీ సూర్యనారాయణశాస్త్రులవారు. నెల్లూరు వేంకటగిరిరాజ పాఠశాలాథ్యాపకులుగా నలువది సంవత్సరములకన్న హెచ్చుగా పనిచేసి ప్రస్తుతము నెల్లూర విరామముగా నున్నారు.

ఈవిధముగా పుత్రులను పౌత్రులనుం గాంచి, 83 సంవత్సరములు జీవించి 1900 సం. మున 'అనాయాసేనమరణమ్, వినాదై న్యేనజీవనమ్' అని పెద్దలు వాంఛించునట్లుగా ధన్యజీవితముం గడపి, కుమారులపాండిత్య పరమోఛ్ఛ్రితిం గాంచి, హర్షించి పండుముసలితనమున నొకదినము సాయంకాలము, ఇంట నందఱకును భోజనము లయినవెనుక నిముసములో తనువు చాలించిరి. తమజీవితమంతయు నాధ్యాత్మిక చింతయందే గడపిరి. నిరాడంబరజీవి, నెమ్మదిగాను చిన్నగొంతుకతో మాటలాడువారు. ఆమాటలలో చమత్కారములు హాస్యమును గర్భితములై యుండెడివి. కుమారుల కలవడిన హాస్యధోరణియంతయు వీరిదే. తెనుగు ప్రబంధములలో నాముక్తమాల్యద వీరికి అభిమానగ్రంథము. అందును 'ఆనిష్ఠానిధిగేహసీమ' యను పద్యమును నిరంతరము వల్లించుచు అట్లే తామును నిరంతరము అతిథిసపర్య చేయుచుండవలయునని వాంఛించువారు. ఎట్టి చిరకాల బద్ధశత్రువులనైనను మిత్రులనుగా నొనర్చువా రని మా తాతగారే నాకు చెప్పియున్నారు. వారిసౌజన్య మట్టిది. అనవసరపు వాదములలో పాల్గొనలేదు. వీరు రచించిన గ్రంథములు రెండే - ఆత్మబోధ వివరణము, లఘువ్యాకరణము. విశేష గ్రంథరచనకును పూనుకొనలేదు. కాని ఆకొఱంతను వారి పెద్ద కుమారులు తీర్చిరి.

_________
  1. * శ్రీ శాస్త్రులవారే తమ జీవితచరిత్రను, నాయొక్కయు ఇంకను తమశిష్యులయు ప్రోద్బలమున వ్రాయదలమచి కొన్నిపుటలు చిత్తువ్రాసి ఓపికచాలమిచే త్యజించిరి. అందలిభాగములను ఇం దుదహరించుచున్నాను.