వృక్షశాస్త్రము/రుద్రాక్ష కుటుంబము

రుద్రాక్ష కుటుంబము.


ఈ కుటుబపు మొక్కలు విస్తారముగ నుష్ణ దేశమునందు గలవు. ఆకులు ఒంటరి చేరిక, లఘు పత్రములు, కణుపు పుచ్చములు గలవు. మూడో, అయిదో పెద్ద ఈనెలున్నవి. లే గొమ్మలపైన మెత్తని రోమములు గలవు పువ్వులు చిన్నవి. రక్షక పత్రములును, ఆకర్షణ పత్రములు నైదేసి కలవు. కింజల్కములు చాల గలవు. అండాశయము మొక్కటి కీలము దీని మధ్య నుండియే బయలు దేరును. కీలాగ్రము చిన్నది. ఫలము ఎండు కాయ గాని, లో పెంకు కాయ గాని యగుచున్నది. ఈ కుటుంబము బెండ, గుర్రపు బాదము కుటుంబములను బోలి యుండును గాని దీని యందు గింజల్కములు విడివిడిగా నుండును. అవి పుట్టు చోట వృంతము కొంచము పైకి వచ్చినది. పుప్పొడితిత్తులు సన్నముగ నుండును. వీనియందు రెండుగదులు గలవు.

రుద్రాక్ష:- చెట్లు మన దేశమునందు బెక్కు భాగముల బెరుగుచున్నది. ఆకులు బల్లెపాకారము; పువ్వులు తెలుపు. దీనికాయలతో రుద్రాక్షలు చేసి తావళములను వేసికొందురు. వీని తోడనే ఈ మధ్య బొత్తాములు చేయు జూచు చున్నారు.

పేరంటకూర:- (గోనినారమొక్క) ఈ మొక్కలను బంగాళదేశము నందే పైరు చేయు చున్నారు. దీని నుండి తీసిన నారతోడనే గోని సంచులు నేయుదురు. ఈ సంచులది, జనప నార కాని, గంజాయి నార గాని, గోగు నార గాని కాదు. ఈ మొక్క లించు మించు ఎట్టి నేలలోనన్నను పైరు కాగలవు. రాగిడి నేలలును, ఒండ్రు మట్టి నేలలును మంచివి. ఇవి పెరుగుటకు వర్షములు సంవృద్ధిగ నుండవలెను. సార వంతమగు భూములగుచో పెంట యంతగ నక్కర లేదు. పొలము దున్ని విత్తనములను వెదజల్లుదురు. పుష్పింపక పూర్వము గోసిన యెడల నార గట్టిగ నుండును. కాయలు గాచిన వెనుక గోసిన యెడల గట్టిగానే యుండును గాని ముతగగనుండుడు. కావుల పుష్పించి కాయలు కాయక పూర్వము గోయుట మంచిది.

మొక్కలను గోసిన పిదప వానిని కట్టలు గట్టి దగ్గరనున్న చెరువులోనో, నీళ్ళ కుంట లోనో ఊర వేసెదరు. ఇందులకు ఉప్పు నీరు పనికి రాదు. ప్రవహించు చున్న నదులు గాని కాలువలు గాని మంచివి కావు. నికలడగ నున్న నీరు మంచిది. అట్టి నీటిపై గట్టల నొక దానిపై నొకటి చేర్చి నీటి లోమునుగునట్లు బరువు దేనినైన బెట్టుదురు. అవి చీకి నార సులభముగ వ చ్చుటకు శీతోష్ణ స్థితి గతులను బట్టి పది మొదలిరువది దినములవరకు బట్టును. అప్పుడు కట్టలను రోకళ్ళ వంటి వానితో గొట్టి నారను లాగి, నీటిలోనే గడిగి యార బెట్టుదురు. నార దీయుటకు యంత్రములున్నవి గాని వాని యవస్య మంతగ లేదు. చీక బెట్టి నార దీయుట వలన నంత చేటు ఖర్చును గాదు. మరియు మరలను గొనుట మాటలతో బని కాదు. డబ్బు పెట్టుబడి పెట్టుట కష్ణము. నారను శుబ్ర పరచి రకములగ నేర్పరచెదరు. ఈ నారతో మృథు వస్త్రములను, చొక్కాలకు బనికి వచ్చు బట్టలును ముతక బట్టలను గోని సంచులును నేయుచున్నారు. ఈనార తోడను, నారతో చేసిన వస్తువుల తోడను జేయు వ్యాపారము వలన మన దేశమునకు లాభమే కలుగు చున్నది.

ఈ మొక్క పచ్చి యాకుల అరసము పిండియు, ఎండాకులతో గషాయము గాచియు శగ రోగము, మూత్ర కోశ రోగములకు నిత్తురు.

పయిరు:- మొక్క ఆడవులలో బెద్ద చెట్ల నానుకొని పెరుగును. ఆకు అండాకారము అంచున రంపపు పండ్లు గలవు.

అల్పయరు:- కొండల మీద బెరుగు గుబురు మొక్క ఆకులు బల్లెపాకారము. పూతకి:- గుబురు మొక్క ఆకులు బల్లెపాకారము మూడు పెద్ద యీనెలున్నవి. ఆకుల కడుగువైపున రోమములు గలవు. కణువుపుచ్చములున్నవి.


మదనగింజల కుటుంబము.


ఈ కుటుంబములో గుల్మములును గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంతరి చేరిక, లఘు పత్రములు, సమాంచలము, కొన్నిటికి గణుపు పుచ్చములున్నవి. పుష్పములు మిధునములు, సరాళము, రక్షక పత్రములు 5 ఉండును. కొన్నిటిలో నివి అడుగున కలిసి యున్నవి. మొగ్గలో అల్లుకొని యుండును. ఆకర్షణ పత్రములు 5; కొన్నిటిలో మాత్రము 4 రక్షక పత్రములు, 4 ఆకర్షణ పత్రములు, గలుగు చున్నవి. ఆకర్షణ పత్రములు వృంతాశ్రితములు ఇవి మెలివెట్టి నట్లుండును. కింజల్కములు ఆకర్షణ పత్రములన్ని యుండును. గొడ్డు కింజల్కములు కూడ గలవు. కింజల్కముల మధ్యనైదు గ్రంధి కోశములున్నవి. అండాశయములో 3.....5. గదులుండును. కీలములు 3....5 గింజలపై పొర తరచుగా రెక్కల వలె వెడల్పై యుండును.

మదనగింజలు:- మొక్కలను హిందూస్థానము నందెక్కువగా బెంచు చున్నారు. ఈ మొక్కయు నన్నిపైరుల వ