విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ)/చతుర్థాంశము

శ్రీరస్తు

విష్ణుపురాణము

భావనారాయణకృతము

చతుర్థాశ్వాసము



రంజితమాళవభూ
మీరమణ సహస్రవాజిమేధఫలీభూ
తారూఢకల్పభూజా
కార మహానీలశైలకటకవిహారా.

1


గీ.

మఱియు నప్పుడు మైత్రేయమౌనివరుఁడు, హర్షసంభ్రమపరిపూరితాత్ముఁ డగుచు
శ్రీపరాశరుపాదరాజీవయుగళి, మౌళిఁ గీల్కొల్పి పల్కె సమ్మతి దలిర్ప.

2


చ.

ధీరకులాగ్రగణ్య సముదీర్ణభవద్వచనంబుల న్సదా
చారము సర్వధర్మములు చక్కఁగ వింటిఁ బ్రహృష్టమయ్యె హృ
త్సారస మింకనొక్కటి ప్రసన్నతఁ జెప్పుము రాజవంశవి
స్తార ముదారత న్విను ముదంబు మనంబునఁ బుట్టె దట్టమై.

3


వ.

అని విన్నవించిన శ్రీపరాశరుం డిట్లనియె.

4


చ.

కమలజుఁ డాదియై యశము గల్గి మహత్తరశూరయజ్వరా
ట్సముదయభూషితం బయి విశంకట మౌమనువంశ మీవు ప్రే
మమున వినందగు న్గలుషమండలి వాయుటకై తదీయది
వ్యమహిమపెంపు లెన్నఁ దరమా పరమార్థవివేకతత్పరా.

5


గీ.

వసుధ బ్రహ్మాద్యమగు మనువంశ మెవ్వఁ, డేని నిత్యంబు విను దృఢంబైన భక్తి
సకలకాలంబు నతనివంశంబు వృద్ధిఁ, బొందుచుండును శాంతిసంపూర్ణహృదయ.

6


వ.

సకలజగదనాదియై ఋగ్యజుస్సామాదిమయుండై భగవద్విష్ణుమయ
బ్రహ్మంబు మూర్తరూపంబైన హిరణ్యగర్భుండు బ్రహ్మాండంబునఁ బ్రథ
మం బావిర్భవించె. ఆబ్రహ్మ దక్షిణాంగుష్ఠంబున దక్షుండు పుట్టె నాదక్షు

నికి నదితి, యదితికి వివస్వంతుఁడు, వివస్వంతునకు మనువు, నామనువున కిక్ష్వా
కుండు, నృగుండు, ధృష్ట, శర్యాతి, నరిష్యంతప్రాంశు, నాభాగ, దిష్ట, కరూష,
పృషధ్రాఖ్యులు పదుగురుపుత్రులు పుట్టి రంత.

7


గీ.

మనువు మిత్రావరుణులకు మఘము చేసి, తనకుఁ దనయులు గావలెనని తలంప
హోతషపచారముననందు నుదయమయ్యెఁ, గన్య యొక్కతె యిల యనఁగా మునీంద్ర.

8


క.

ఆయిల మిత్రావరుణుల, యాయతకృప మగుడఁ బురుషుఁడై సుద్యుమ్న
స్ఫాయన్నామంబునఁ దగి, యాయెడ శాపమునఁ గన్య యయ్యె న్మగుడన్.

9


వ.

ఇట్లు సుద్యుమ్నుండు క్రమ్మఱం గాంతయై సోమపుత్రుండగు బుధుని
యాశ్రమసమీపమునం బరిభ్రమించుచుండ.

10


చ.

కుసుమశరాశుగప్రచయకుంఠితుఁడై శశిపుత్రుఁ డప్పు డ
బ్బిసరుహనేత్రపై మిగులఁ బ్రేమ వహించి రమించె నందు న
ప్పసముగ నేకతంబ శతపత్రవిలోచనఁ గాంచి భ్రాంతుఁడై
యసమశరార్తి నెట్టి బుధుఁడైఁనఁ జలింపక నిల్వనేర్చునే.

11


వ.

ఇట్లు రమించి బుధుం డిలయందుఁ బురూరవుం గనియె నంత

12


చ.

ఇలకుఁ బురూరవుండు జనియింప మహర్షులు యజ్ఞపూరుషుం
జలజదళాక్షు వేదమయుఁ జాలఁబ్రసన్నునిఁ జేసి యయ్యిలా
లలనకుఁ బుంస్త్వరూప మగు లా గొనరించి రనంతరంబ య
య్యలఘున కుద్భవించెఁ దనయత్రితయంబు నయంబు మీఱఁగన్.

13


వ.

ఇట్లు సుద్యుమ్నునకు నుత్కల, గయ, వినతులను మువ్వురు కొడుకులు
పుట్టిరి. సుద్యుమ్నుండు స్త్రీపూర్వుండు గాన రాజ్యభాగంబున కర్హుండు గాకున్నఁ
దండ్రి వసిష్ఠువచనంబున నతనికిం బ్రతిష్ఠానపురం బిచ్చిన నతండు తన
పుత్రుండైన పురూరవున కిచ్చె.

14


క.

మనుపుత్రుండగు పృషధృఁడు, తనగురువులగోవుఁ జంపి తా శూద్రుండై
జనగర్హితత్వమునఁ బడి చనియె, నెచటికేనియును విచారము గదురన్.

15


వ.

కరూషునివలన కారూషులను బలపరాక్రమసంపన్నులైన క్షత్రియులు కలి
గిరి. దిష్టునకు నాభాగుండు కలిగి వైశ్యుం డయ్యె. అతనికి బలంధనుండు నతనికి
వత్సప్రీతియు నతనికిఁ బ్రాంశువు నతనికిఁ బ్రజాపతియు నతినికి ఖనిత్రుఁడు నత
నికిఁ జాక్షుషుండు నతనికి వింశుఁడు నతినికి వివింశకుఁడు నతనికి ఖనినేత్రుఁడు
నతసికి నతివిభూతియు నతనికి గరందముండు నతనికి నవిక్షితుండు నతనికి
మహాబలుండైన మరుత్తుండు పుట్టె.

16

గీ.

అతనియధ్వరములఁ బోలు నధ్వరంబు, గలుగనేరదు భూమిచక్రంబునందు
హైమములె కాని యాగభూమ్యంతరమున, నన్యయాగోపకరణంబు లరయ లేవు.

17


చ.

సురపతి సోమపానమునఁ జొక్కి మదించె ధరామరేంద్రు లు
ద్ధురవరదక్షిణార్ధములఁ దుష్టి వహించిరి సభ్యఋత్విగు
త్కరములు దేవబృందము మదారసమర్హణముఖ్యలాలసా
భరమునఁ బ్రీతి పొందెఁ దలప న్వశమౌనె తదీయయజ్ఞముల్.

18


వ.

అమ్మరుత్తునికీర్తి నేడునుం జెప్పంబడు. చక్రవర్తియగు నమ్మరుత్తునకు నరిష్యం
తుండు పుట్టె. నతనికి దముండు, దమునకు రాజవర్ధనుండు జన్మించె.
నతనికి సువృద్ధియు నతనికిఁ గేవలుండును నతనికి సుధృతియు నతనికి నరుఁ
డును నతనికిం జంద్రుఁడును నతనికిఁ గేవలుండును నతనికి బంధుమంతుండును
నాతనికి వేగవంతుండును నతనికి బుధుఁడును నతినికిఁ దృణబిందుండు నాతనికి
నిలబిలయను నొకకన్యకయుఁ బుట్టె వినుము.

19


ఉ.

ఆతృణబిందుభూవిభుని నచ్చరలేమ యలంబుసాఖ్య కా
మాతురయై వరించి సుతు నర్కసముజ్వలతేజు లోకవి
ఖ్యాతు విశాలునిం గనియె నాతనిపేర విశాలయస్సము
జ్యోతితభూతి యౌ నగరి మొప్పె మహీమహిళావిభూషియై.

20


వ.

ఆవిశాలునకు హేమచంద్రుండు, నతనికిఁ జంద్రుండు, నతనికి ధూమ్రా
క్షుండు, నతనికి సృజయుండు, నాతనికి సహదేవుండు, నతనికిఁ గృశాశ్వుండు,
నతనికి సోమదత్తుండు పుట్టి శతాశ్వమేధంబులు చేసె. ఆసోమదత్తునకు జన
మేజయుండు, నతనికి సుమతి జనియించె. వీరలు వైశాలేయు లనం బ్రసిద్ధులై
వెలయుదురు.

21


గీ.

వినుము తృణబిందునిప్రసాదమున నృపాలు, రందఱును నుర్వి వైశాలు లనఁగఁ దగిరి
ధార్మికులు వీర్యవంతులు నిర్మలులు బ, లాయురున్నతులునునై మహామునీంద్ర

22


వ.

శర్యాతికి సుకన్యయను కుమారికయు, నానర్తుండను కుమారుండును గలిగిరి.
ఆసుకన్యకను చ్యవనుం డుద్వాహం బయ్యె. పరమధార్మికుం డైనయానర్తునకు
రేవతుఁడు పుట్టె.

23


క.

రేవతుఁడు తండ్రి యేలిన, భూవిదితానర్తవిషయములు పాలించెన్
శ్రీ వెలయంగఁ గుశస్థలి, నా విశ్రుతి కలుగు పురమున న్వసియించెన్.

24


వ.

రేవతునకు రైవతుండనఁ గకుద్మియనఁ బర్యాయనామంబులుగల పుత్రుండు
కలిగె. అతనికి రేవతియను కన్యక జనించి పెరుగుచున్నంత.

25

ఉ.

రైవతుఁ డాత్మపుత్రికిఁ గరగ్రహణార్థము రాజపుత్రుఁ డీ
భూవలయంబునందుఁ దలపోయఁగ నెవ్వఁడొకో యటంచు నా
రేవతిఁ దోడుకొంచు నిబిరీసగతి ప్రతిభాప్తిఁ బోయె రా
జీవభవాలయంబునకుఁ జిత్తము తత్తరపాటు నొందఁగన్.

26


వ.

ఇట్లు సత్యలోకంబునకుం బోయి తదంతికంబున హాహా హూహూనామ
గంధర్వు లతిరాగంబున దివ్యగానంబు చేయ వినుచుండె. అదివ్యగానంబు
శ్రీమార్గపరివృత్తం బైనను ననేకయుగపరివృత్తం బైనను ముహూర్తంబుగాఁ
దలంచుచుండి గీతావసానం బయిన నబ్జయోనిం గని సాష్టాంగనమస్కారంబు
చేసి యిక్కన్యకు యోగ్యుండైన వరుం డెవ్వరని యడిగిన రైవతునకుఁ జతు
రాననుం డిట్లనియె.

27


గీ.

వసుధ నీకు మనసు వచ్చిన యల్లుఁడే, పగిదివాఁ డటన్నఁ బార్ధివుండు
మ్రొక్కి స్వామిచి త్తమునకు వచ్చినవాఁడె, వనజముఖికి యోగ్యుఁ డనుచుఁ బలికె.

28


సీ.

వనజగర్భు డొకింతవడి విచారించి, భూపాగ్రణిఁ జూచి యిట్లనియె నీవు
తలఁచినవారిసంతతులు సపుత్ర, పౌత్రాదిగా వనుధపై నణఁగిపోయె
గానంబు వినుచుండఁగా బహుకాలంబు, పోయె నిప్పుడు భూమిఁ బొడమఁ గలిగి
యున్నది కలియుగం బిన్నలినాక్షి నెవ్వరి కిచ్చెదవు బంధువర్గకోశ


గీ.

బలము లెవ్వియు లేవు నీ కిల నటన్న, సాధ్వసము నొంది యారాజు జలజభవుని
కనియె “నిక్కన్య నింక నెవ్వనికి నిత్తు", ననినఁ దల వంచి మనసులో నరసి యజుఁడు.

29


వ.

నీ విచ్చటికి వచ్చినవెనుక నష్టావింశతిచతుర్యుగంబులు చనియె నని పలికి
యేకాగ్రమనస్కుఁడై సప్తలోకగురుండగు నంభోజయోని గృతాంజలియగు
రాజున కిట్లనియె.

30


సీ.

ఎఱుఁగలే మెప్పుడు నేజగన్మయుని, స్వభావస్వరూపసంపద్బలములు
కళమొదల్ యుగచర్య కడపలగాఁ గల, కాల మేవిభుభూతిఁ గడప లేదు
సృష్టిరక్షణనాశకృత్యార్థ మేదేవు, వలన మూర్తిత్రయం బెలమిఁ గలిగె
శక్రాదిరూపియై సకలలోకంబులు, పాలించు నేపరాత్పరుఁడు నియతిఁ


గీ.

జంద్రసూర్యాకృతులు దాల్చి జగతితమము సకలమును బాఱఁద్రోలు నేస్వప్రకాశుఁ
డగ్నిపవనాంబువియదవన్యాత్ముఁ డెవ్వఁ, డట్టిసర్వేశుఁ డవతార మయ్యె నపుడు.

31


వ.

జగంబులు తానయై గలుగఁజేసి రక్షించి త్రుంచునట్టి శ్రీవిష్ణుదేవుం డిప్పుడు
నిజాంశంబున నవతరించి మీకుశస్థలి ద్వారక యను పట్టణంబుగా నందు బల

దేవుండన నఖండప్రభావంబున నున్నవాఁడు. అమ్మహానుభావునకుఁ గన్యా
రత్నంబు నిమ్ము పొ మ్మనిన రైవతుండు భూలోకంబునకు వచ్చి.

32


గీ.

కుఱుచలై యల్పతేజులై గుణవివేక, బలసమృద్ధులఁ దక్కులై ప్రబలు ప్రజలఁ
గాంచి వెఱఁగొందుచును, ద్వారకానగరికి వచ్చి రామున కక్కన్య నిచ్చె నృపుఁడు.

33


చ.

బలుఁడు నతిప్రమాణయగు పద్మదళాయతచారులోచనన్
హలమున వంచి యంచితశుభావయవన్ఫుటగాత్రిఁ జేసి పెం
పలవడఁ బెండ్లియై ప్రముదితాత్మకుఁడై యనురాగభాగనే
కలలితకామభోగములు గైకొనియుండె నఖండసంపదన్.

34


క.

అనురూపవరున కాత్మజ, ననువొందఁగ నిచ్చి ప్రముదితాత్మకుఁడై యా
జనవిభుఁడు తపము చేయన్, జనియె హిమాచలమునకుఁ బ్రసన్నత్వమునన్.

35


వ.

రైవతుండు బ్రహ్మలోకంబునకుం బోయి రాకయున్న వెనుకఁ బుణ్యజనసంజ్ఞ
లుగల రాక్షసులు కుశస్థలిపై దాడి పెట్టిన రైవతుని తోఁబుట్టువులునూర్గురు
రాక్షసపరాజితులై నానాదిక్కులకుం బోయిరి. వారలయన్వయంబునం బుట్టి
నక్షత్రియులు సర్వదిక్కులందు నిలిచిరి. ధృష్టునకు ధర్షంబను క్షత్రియ
కులంబు పుట్టె. నాభాగునకు నాభాగుండు, నాభాగునకు నంబరీషుండు, నంబరీషు
నకు విరూపుండు, విరూపునకు వృషదశ్వుండు, వృషదశ్వునకు రధిరతుండు పుట్టి
వీరాంగీరసులను క్షత్రోపేతులైన ద్విజు లైరి.

36


క.

క్షుత మొనరింపఁగ మనువున, కతులఘ్రాణమునఁ బుట్టె నాత్మజుఁడు బలా
న్వితుఁ డిక్ష్వాకుఁ డనంగా, నతనికి [1]నూర్వురు కుమారు లైరి మునీంద్రా.

37


వ.

వారిలోపల మువ్వురు వికుక్షినిమిదండాఖ్యులు శ్రేష్ఠులు. శకునిప్రముఖు లేఁ
బం డ్రుత్తరాపథంబునకు రాజు లైరి. నలువదియెనమండ్రు దక్షిణాపథంబునకు
రాజు లైరి. అయ్యిక్ష్వాకుం డొక్కనాఁడు

38


సీ.

అష్టకాశ్రాద్ధకర్మారంభ మొనరించి, యర్హమాంసంబు తెమ్మనుచుఁ దనదు
కొడుకు వికుక్షిఁ బేర్కొని పిల్చి పంపిన, నడవికిఁ బోయి యర్ఘంబులైన
మృగముల వధియించి మించినయాకటఁ జనలేక యం దొక్కశశము దిని, క
డమమాంసమంతయుఁ దమతండ్రి కిచ్చిన, నది ప్రోక్షణము చేయ నరుగుదెంచి


గీ.

కులగురుండు వసిష్ఠుఁ డక్కొదవ యెఱిఁగి, కనలి యీమాంస మర్హంబు గాదు వీఁడు
మీఁదు వుచ్చెనటన్న నమ్మేదినీశుఁ డాత్మనందను విడిచె సంయమివరేణ్య

39

వ.

గురుండు కోపించి శశాదుం డని పలుకుటం జేసి వికుక్షి శశాదుం డనంబరఁగి,
తండ్రిపిమ్మట రాజయ్యె. ఆ శశాదునకుఁ బురంజయుండను పుత్రుండు పుట్టె.

40


సీ.

మునుపు త్రేతాయుగంబున దేవదానవ, తతులకు ఘోర యుద్ధంబు కలిగె
అందుబాహాబలులైన రాక్షసవర్యు, లమరసర్గమునెల్ల నాక్రమింప
విఱిగిపోయిన వనవికచపద్మదళాక్షు, భగవంతు నచ్యుతుఁ బ్రార్థనముల
నలరింప వరదుఁడై యఖిలజగత్పరా, యణుఁడు నారాయణుం డఖిలసురల


గీ.

నాదరించి గభీర వాక్యముల ననియె, నాత్మ నెఱుఁగుదు నేను మీయభిలషితము
వినుము భూమిస్థలి శశాదుఁడనునృపాలతనయుఁడు పురంజయుం డనఘనుఁడు గలఁడు.

41


వ.

అతని శరీరంబున స్వాంశంబునం బ్రవేశించి యశేషదోషాచరులం జంపెద.
మీరును బురంజయు నసురవధోద్యోగంబునకు నుద్యుక్తుం జేయుం డనినఁ
బుండరీకాక్షునకు నక్షీణభక్తితాత్పర్యంబునం బ్రణమిల్లి పురంజయుపాలికిం
బోయి సాదరంబుగా బృందారకు లిట్లనిరి.

42


ఉ.

క్షత్త్రియవర్య ప్రార్థనము గైకొను మిప్పుడు ఘోరనిర్జరా
మిత్రులతోడఁ బో రొదవె, మేము తదుద్ధతి కోర్వలేము, హే
తిత్రుటితాఖిలద్విషదధీశుఁడ వీవు సహాయమైన నా
శాత్రవకోటి నోర్చెదము చయ్యన నీచన విమ్ము లెమ్మనన్.

43


క.

సకలలోకాధినాథుఁ డీశతమఖుండు, స్కంధమున నన్ను మోవఁగాఁ గదలిపోయి
జాగ్రదుగ్రప్రతాపదుస్సాధదనుజ, కోటిఁ గెలిచెద నిది మీకుఁ గూడెనేని.

44


వ.

ఇవ్విధంబున కొడంబడిన సహాయంబు చేసెద

45


గీ.

అనిన నొడఁబడి రమరు లయ్యచలభేది యపుడు వృషభాకృతి వహించి నతనిమూఁపు
రంబుపై నెక్కి లీలఁ బురంజయుండు, కదలె శాత్రవకోటిపై ముద మెలర్ప.

46


వ.

ఇట్లింద్రుఁడు వృషభంబైనఁ దత్కకుదారోహణంబు చేసి వైష్ణవతేజోవిశే
షోపబృహింతుండై రాక్షనులఁ గెలిచి పురంజయుండు కకుదారోహణనిమిత్తం
బునఁ గకుత్స్థుం డనంబరఁగె. అతనికి ననేనుండు, నతనికిఁ బృథువు, నతనికి
విష్ణరాశ్వుండు, నతనికిఁ జాద్రుండు, నతనికి శాబస్తుండును బుట్టె. అతండు
శాబస్తి యనుపురి నిర్మించె. ఆశాబస్తునకు బృహదశ్వుండు నతనికిఁ గువల
యాశ్వుండును బుట్టె.

47


చ.

అమలచరిత్ర యాకువలయాశ్వుఁ డుదంకునకు న్మహాపకా
రము నొనరించు దుందుఁడను రాక్షసుతో సమరంబు చేసె దు

ర్గమతరవిష్ణుతేజమున రంజిలి యిర్వదియొక్కవేయుధై
ర్యమహితసారసాహసనిరంకుశు లాత్మజు లర్థిఁ గొల్వఁగా.

48


వ.

ఇట్లు యుద్ధంబు చేయునప్పుడు దుందుముఖనిశ్వాసాగ్నిదగ్ధులై యేకవింశతి
సహస్రనందనులు మృతులైనఁ గువలయాశ్వుండు దుందునిం జంపె. తన్నిమి
త్తంబున నతనికి దుందుమారుండను పేరు కలిగె. అతనికి దృఢాశ్వ చంద్రాశ్వ
కపిలాశ్వులన హతశేషులగు ముగ్గురుపుత్రులు గలరు. అందు దృఢాశ్వునకు
హర్యశ్వుండు, నతనికి నికుంభుండు, నతనికి సమతాశ్వుండు, నతనికి గృశా
శ్వుండు, నతనికిఁ బ్రసేనజిత్తు, నతనికి యువనాశ్వుండుఁ బుట్టె..

49


క.

ఆయువనాశ్వుఁ డపుత్రకుఁ, డై యతివిహ్వలత మునుల యాశ్రమములకున్
బోయి యుపాసించినఁ గరు, ణాయతత వారు నతని కభ్యుదయముగన్

50


వ.

మదిం దలంచి పుత్రోత్పాదనంబునకు నిష్టి గావించి యదియు మధ్యరాత్రం
బునకు నివృత్తం బగుచుండ మంత్రపూతజలపూర్ణకలశంబు వేదిమధ్యంబునం
బెట్టి యమహామునులు నిద్రించుటయు నవ్వేళ యబ్భూపాలుం డతితృష్ణాకు
లుండై యాశ్రమంబునకు వచ్చి ని ద్రాళువులైన యాకృపాళువుల మేలుకొలుప
నొల్లక యపరిమేయమాహాత్యమంత్రపూతకలశజలంబులు ద్రావిన నంత
మేల్కొని మును లజ్జలంబు గానక యిట్లనిరి.

51


ఉ.

ఎవ్వరు ద్రావి రీసలిలమేధితవైదికమంత్రభావితం
బివ్వసుధాతలేశసతి కిందుల నిందుల సత్సుతుండు మే
ల్నివ్వటిలంగఁ బుట్టి ధరణీవలయం బఖిలంబు నేలు ని
ట్లొవ్వమి వచ్చె నీపని కయో యనువాక్యము లాలకించుచున్.

52


చ.

జనపతి యేగుదెంచి మునిసత్తములార మదీయమౌఢ్య మి
ట్లనయము తెచ్చె నంచు వినయంబునఁ బల్కెడు నంత గర్భమై
దినదినవృద్ధిఁగాల మరుదెంచిన దక్షిణకుక్షి వ్రచ్చి నం
దనుఁ డుదయించె నయ్యవనినాయకుఁడు న్మృతిఁ బొందె గ్రక్కునన్.

53


వ.

మహామును లబ్బాలకుం డేనామంబు ధరియింపంగలండని పల్క.

54


గీ.

పాకశాసనుఁ డరుదెంచి బాలుఁ జూచి, “ఏషమాంధాస్యతి" యటంచు నెంచుకతన
దారకుఁడు దాల్చె నపుడు మాంధాతృనామ, మఖలలోకైకవిశ్రుతం బగుచునుండ.

55


వ.

అబ్బాలకునివక్త్రంబున నింద్రుం డమృతస్రావిణియైన నిజప్రదేశిని యిడిన
తదీయామృతపానంబుల నల్పదినంబులనే వృద్ధిఁ బొంది చక్రవర్తియై సప్త

ద్వీపంబుల నేకాతపత్రంబుగా ననుభవించె, తదీయశ్లాఘావరంబైన
యొక్కశ్లోకంబు కలదు. దానియర్థంబు వినుము.

56


గీ.

అర్కునుదయాస్తమయము లౌనంతమేర, యవనియెల్లను యువనాశ్వకువలయేశ
తనయ మాంధాతృమేదినీధవునిసొమ్ము, ఇతరులకుఁ దేరి చూడఁగా నెట్లు వచ్చు.

57


వ.

ఏవంవిధప్రభావుం డగుచు రాజ్యంబు సేయుచుండి

58


గీ.

బిందుమతి పేరుగల శశిబిందుతనయఁ, బరిణయంబయి మాంధాతృధరణివిభుఁడు
ననఘుఁ బురుకుత్సు విఖ్యాతు నంబరీషు ఘనుని ముచికుందుఁ గనియె నక్కాంతయందు.

59


వ.

మఱియు నేబండ్రుకన్యకలు గలిగిరి వినుము.

60


సీ.

వేదవేదాంతసంవేది సౌభరియను, ముని జలంబులయందు మునిఁగియుండ
ద్వాదశాబ్దంబు లవ్వారిలో సమ్మద, నామమౌ నొక్కమీనం బతిప్ర
మాణదేహంబుతో మానినీపుత్రపౌ, త్రాదిబంధువు లమేయములు క్రింద
మీఁదఁ బార్శ్వములఁ గ్రమ్మి చరింప సంతుష్టి, నొంది క్రీడించుచునుండఁ గాంచి


గీ.

మౌని యేకాగ్రతాసమాధాన ముడిగి, బళిర యీమీనవిభునిసౌభాగ్య మఖిల
బంధుసామగ్రి పుత్రసంపత్తి పౌత్రవృద్ధి దారవిలాసంబు నెన్నఁ దరమె.

61


వ.

ఏను నిట్టిసుఖం బనుభవింపవలదే యని జలంబులు వెల్వడి మాంధాతృమహీ
పతిపురంబునకుం బోయి తనరాక యెఱింగించి పుచ్చిన నమ్మేదినీకాంతుం
డెదుర్కొని యర్ఘ్యాదివిధులం బూజించిన నర్హాసనాసీనుండై సౌభరి
యిట్లనియె.

62


క.

తిరముగ సంసారంబున, నరవల్లభ నిలువఁదలఁచినాఁడ న్నీకున్
వరతనయలు గల రం దొక, తరుణీమణి నిమ్ము సమ్మదము దళుకొత్తన్.

63


వ.

కన్యార్థినై వచ్చితి. మదీయయాజ్ఞాభంగంబు చేయకుము. కకుత్స్థవంశసం
భవులైన రాజుల నడిగిన వారు రిత్త వోవుదురే యని సవినయంబుగాఁ
బ్రార్థించిన.

64


ఉ.

ఉచ్ఛూనతరసిరాప్రచ్ఛాదితశరీరుఁ బరికంపమానదుర్భరశిరస్కు
నాలంబమానవళీలక్షితానను శిథిలితనిపతితాశేషదశను
సంచ్ఛన్నపటలధూసరిరాక్షిగోళకు, శ్లేష్మఘుర్ఘురరవాశ్లిష్టకంఠుఁ
గోదండదండభంగురవిరుద్ధాకారుఁ బలితలోమశ్మశ్రుబద్ధకేశు


గీ.

భూరినిర్భరతరజరాభారజర్జ, రావయవు నమ్మునీంద్రుఁ గన్నారఁ జూచి
చూచి “యే మారు చెప్ప నీసున శపించు", నంచు నెంచుచుఁ జింతించె నవనివిభుఁడు.

65

వ.

ఇట్లు చింతించు మాంధాతృమహీమండలేశ్వరునకు మునీశ్వరుం డి
ట్లనియె.

66


గీ.

ఏల చింతించె దింత భూపాలవర్య, తగని మాటలు వల్కంగదా యెటైనఁ
గన్యకామణి నీయక కాని పోవ, రాదు సుమయ్య నన్నుఁ దిరస్కరించి.

67


మ.

అన మాంధాతృఁడు శాపభీతమతియై యయ్యా! మదీయాన్వయం
బునకు న్వన్నియ కాదె మీమనసు సమ్మోదంబు నొందించు టెం
దును మీమాటల నొచ్చెమున్నదె వచింతు న్నాకులాచారవ
ర్తన మాలింపుము కన్యతాన, వరు గోరుం బెండ్లి యౌ నెప్పుడున్.

68


వ.

ఇప్పుడును దత్సమయపరిపాలనంబే కర్తవ్యం బని తలంచెద ననిన మునిపతి
తనమనంబున.

69


ఉ.

బాలిక నీయలేక తడఁబా టొనరించి వచించె నీమహీ
పాలుఁడు మేలుగాక యెడఁబా టొనరించెదఁ గొంచ నేల యం
చాలసమానమానితతపోధికుఁ డిట్లను రాజుఁ జూచి చిం
తాలులితత్వ మేల కులధర్మము దప్పక చేయు మప్పనిన్.

70


వ.

నన్నుం గన్యాంతఃపురంబునకు ననిచిన కన్యకలలో నెవ్వతెయైన వరించిన మేలు.
'ధర్మో జయతు' అని వచ్చెద ననిన హర్షించి రాజు కన్యాంతఃపురచారియైన
యొక్కవర్షధరుం బిలిచి యమ్మునిం జూపి యితనిం దోడ్కొని కన్యాంతఃపురం
బునకుం బోయి కన్యకలకుం జూపి మదీయశాసనంబు చెప్పి యొప్పయ్యెనేని
యొక్కకన్యక యితని వరించుతమని చెప్పుమని యొప్పగించిన నాహెగ్గడియును
దోడ్కొనిపోవునప్పుడు.

71


క.

మారునిరూపము ధనదకు, మారునిసౌందర్యమును సమంచితనాస
త్యోరువిలాసము గైకొనె, బోరున నమ్మునివరుఁడు తపోవిభవమునన్.

72


వ.

ఇట్లు దేవగంధర్వమనుష్యాతిశాయియైన రూపంబు దాల్చి యంతఃపురంబు
ప్రవేశించిన మునిం జూపి కన్యకలతో వర్షధరుం డావృత్తాంతంబు
చెప్పుటయు.

73


క.

మహనీయరూపవిభ్రమ, సహితుని నమ్మౌనిఁ గాంచి జనపతిసుత ల
త్యహమహ మికఁ దత్పాణి, గ్రహణము చేసిరి నితాంతకామాతురలై.

74


గీ.

ఇతఁడ నాపతి యితఁడు నాహృదయనాథుఁ, డితఁడే నాప్రాణవల్లభుఁ డితఁడు నామ
నోనురంజకుఁ డనుచు నమ్మానవతులు, కలహమతులై వరించి రయ్యలఘుతేజు.

75

చ.

వనజదళాక్షులందఱు నవారితలై చనుదెంచి యత్తపో
ధనుని వరించు టెల్ల విశదంబుగ వర్షధరుండు చెప్ప న
జ్జనపతి యంతరంగమునఁ జాలవిచారము నొంది కొంతప్రొ
ద్దున కొకతీరు సమ్మతముతో శమితోత్సవలీల నున్నెడన్.

76


క.

మంగళసమాచరణ మొక, భంగి న్నడచుటయు నంతఁ బ్రతిభాన్వితుఁడై
యంగనలఁ దోడుకొని ముని, పుంగవుఁ డరుదెంచె నిజతపోవనమునకున్.

77


వ.

అచ్చటికి నశేషశిల్పకల్పనానల్పశర్మయగు విశ్వకర్మ రావించి తన
మనోవర్తనం బెఱిఁగించిన నతండును నొక్కొక్కకాంతకుఁ బ్రోత్ఫుల్లపంకజ
కూజత్కలహంసకారండవాదిజలవిహంగమాభిరామజలాశయసంచ
రన్మందపవనంబులగు నుపవనంబులును, సోపధానసావకాశసాధుశయ్యా
పరిచ్ఛదసప్రసాదంబులగు మణిప్రాసాదంబులు నిర్మించి చనిన నమ్మునీంద్రుం
డందు నిరపాయబహువిధనిధిసంపదల నావహించిన ననవరతభక్ష్యభోజ్య
లేహ్యాద్యుపభోగంబులచేతను ననేకభృత్యానీతకుసుమచందనభూషణాం
బరాదులచేతను నిరంతరం బాకాంతలు సకాంతలై యనుభవించుచుండి
రంత కొంతకాలంబు చనిన.

78


శా.

మాంధాతృక్షితిపాలశేఖరుఁడు శుంభత్పుత్రికాస్నేహసం
బంధం బాత్మఁ గలంప వృద్ధముని యేఁబండ్రం జలం బేర్పడన్
సంధాబంధురుఁడై వరించి నిజవన్యాభూమికిం బోయె ని
ర్బంధం బయ్యెఁ దనూభవామణులకుం బ్రాక్కర్మదౌష్ట్యంబునన్

79


గీ.

హారివస్త్రాన్నపురసౌధవారసార, తూలతల్పంబు లొందు నాదుహితలకును
నారచీరలువ న్యాశనము లటవు, లుటజములు భూమిశయ్యలు నొదవె నకట.

80


వ.

అని చింతించి యత్తపోధనవర్యుని యాశ్రమంబునకు వచ్చి యతిరమ్యోప
వసజలాశయంబును స్ఫురదంశుమాలాజటిలంబును నగు ప్రాసాదమండ
లంబు చూచి యందొక్కప్రాసాదంబు ప్రవేశించి తనూజం జూచి యాలింగ
నంబు చేసి కృతాసనపరిగ్రహుండై హర్షాశ్రువులు దొరుగ నిట్లనియె.

81


గీ.

అమ్మ సౌఖ్యంబు కలదె మహామునీంద్రుఁ, డెలమిఁ జనవచ్చునే మమ్ము నెప్పుడైనఁ
దలఁతువే యాత్మలో నన్నఁ దండ్రిపలుకు, విని తనూభవ పలికె సద్వినయమునను.

82


మ.

మునిశార్దూలుని సత్కృపామహిమ సొము ల్చీర లాస్వాదవ
ద్వినుతాన్న౦బు లుదారగంధసుమనోవీటీపటీరాదు లిం

దు నవీనద్యుతిసౌధముల్ గల వొకండుం దక్కువా యెంత యై
నను విభ్రాంతిఁ దలంపరే మగువ లన్నా! కన్నవారి న్మదిన్.

83


ఉ.

సంతతభోగసంపదలు సంభృతవైభవసంభ్రమంబు ల
త్యంతవినోదముల్ గల వహర్నిశముం బతి నన్నుఁ బాయఁ డి
ట్లెంతని చెప్పుదున్ భగిను లెన్నఁడు భర్తమొగంబు గాన రీ
చింత దురంతమై మనసు చిల్లులు పుచ్చుచునున్న దెప్పుడున్.

84


వ.

అని పలికిన నమ్మహీపతి యచ్చటనుండి మఱియునొక్కప్రాసాదంబునకు వచ్చి
యచ్చట నలంకృతయైన తనూభవం గాంచి కౌగిలించి కుశలం బడిగిన నదియును
మునుపు చెప్పిన కుమారిక పగిదిఁ జెప్పిన నిప్పగిది నందఱిప్రాసాదంబులకుం
బోయి యడిగిన నందఱు తమకుఁదమక సకలభోగంబులు కలవు. వల్లభుండు
తమతమక వశ్యుండని చెప్పిన సంతసించి యేకాంతావస్థితుండగు సౌభరిం
గాంచి సత్కృతుండై మాంధాతృం డిట్లనియె.

85


గీ.

మౌనికులనాథ నీతపోమహిమకొలఁది, తలఁప శక్యంబె దేవతాతతులకైన
భూరితరమైన దేవరవారిదివ్య, వైభవము గంటి నేత్రపర్వంబు గాఁగ.

86


చ.

అని కొనియాడి భూమిపతి యమ్మునిచేఁ బ్రతిపూజ నొంది య
త్యనుపమభోగభాగ్యవిభవాతిశయంబుల కాత్మ మెచ్చుచున్
దినములు కొన్ని యచ్చట నతిప్రమదంబున నిల్చి పోయె ది
గ్వినుతధనాదిసంపదలవిశ్రుతయౌ నిజరాజధానికిన్.

87


గీ.

అంతఁ గొంతకాల మరుగ నారాజక, న్యకలయందు వరుస నత్తపోభి
రాముఁ డర్థిఁ గాంచెఁ బ్రాజ్ఞుల నూటయేఁ, బండ్రునందనులఁ బ్రభావయుతుల.

88


నందనులఁ గాంచి పరమా, నందంబున నుండె మౌనినాథుఁడు వనితా
బృందము దానును బెనుచుచు, నందంద మహామమత్వ మగ్గల మైనన్.

89


సీ.

బాలురనునుముద్దుఁబల్కు లెన్నఁడు వినఁ, గలుగునో యని కోరఁ బలుకనేర్చి
రవనిమీఁద కుమారు లడుగిడి నడుచు టె, న్నడొకో యనుచు కోర నడవనేర్చి
రర్భకు లారూఢయౌవను లగుటెన్నఁ, డో యని కోరఁ బెంపొందెఁ బ్రాయ
మాత్మజు లుద్వాహ మగుట యెన్నఁడెకో య, నుచుఁ గోరఁ బెండ్లిండ్లరుచులు గనిరి


గీ.

సుతులు గనఁజూతురో యన సుతులఁ గనిరి, ప్రోదిమనుమల నెత్తుదురో యనంగ
మనుమలం గనుఁగొనుభాగ్యమహిమఁ గనిరి, సౌభరికుమారకులు పితృస్వాంత మలర.

90


వ.

ఇవ్విధంబున దినదినప్రవర్ధమానవిషయలాలసుండై యమ్ముని యిట్లని చిం
తించె.

91

గీ.

లక్షవర్షంబులకు నైననక్షయత్వ, గరిమ గైకొని క్రొత్తలై కడలుకొనియె
నాకుఁ గోర్కెలు గలుగ దంతంబు వీని, కౌర యౌర మదీయమోహాతిశయము.

92


చ.

నిపుణతఁ బుత్రకు ల్నడవనేర్చిరి బాల్యము వీడనాడి ర
చ్చపునవయౌవనంబునఁ బ్రసన్ననిశాకరబింబవక్త్రలన్
విపులయశస్కులై మిగులవేడ్క వరించి సుపుత్రపౌత్రవృ
ద్ధిపసలు గాంచి రెప్పటికిఁ దీరవు మామకకాముకక్రియల్.

93


క.

మనుమల మనుముల మమతలు, పెనుపంగాఁ గంటి మిగులఁ బెరుగంజొచ్చెన్
ఘనతరసంతానస్పృహ, దినదినమును నాకు విషయతృష్ణావశతన్.

94


చ.

అనఁ బని లేదు గాకశకులా, గ్రణి జోకయె కాదె మోహసం
జనననిదానమై తపము సందడిపాలుగఁ జేసె మన్మనో
వినుతసమాధిఁ గూల్చె నతివిస్మయ మందఁ బరిగ్రహంబు కీ
డనరె? మును ల్వధూమణుల నక్కట యేల పరిగ్రహించితిన్.

95


వ.

కాంతాపరిగ్రహంబునంగాదె పుత్రపౌత్రాదులు గలిగిరి. వీరివలన మోహంబు
విస్తరిల్లె. పరమదుఃఖహేతువై మమతాసాగరంబునం ద్రోచె. మఱియును.

96


సీ.

నిర్ద్వంద్వవృత్తిమానితసుదుశ్చరతపశ్చర్య పూనితి నేల జలములోన
తపము చేసిన నేమి చపలమీనకుటుంబ, సంగబంధం బేల సంభవించె
సంగ మొందిన నేమి జంగమనిరయాభ, బాలాపరిగ్రహం బేల కలిగె
సతులు కల్గిన నేమి సంపూర్ణపుత్రపౌ, త్రాభివృద్ధి యి దేల యతిశయిల్లె


గీ.

ప్రజలు పుట్టిన నేమి నిర్భరమనస్స, మాధిగిరిభిదురీభవన్మహితమోహ
మేల నను ముంచె విషయకల్లోలజాల, లోలదుస్తరభవవార్ధిలోన నకట.

97


చ.

చతురత ముక్తి నొందు, దుర సంగమునన్ యతిపుంగవు ల్మహా
ద్భుతగతి దోషసంఘముల దూకొనుసంగము కర్మయోగసి
ద్ధత గలయోగియైనఁ జెడుఁ దథ్యము సంగముచేత నన్నచో
మతకరియల్పసిద్ధిగల మర్త్యుకథల్ మఱి చెప్ప నేటికిన్.

98


గీ.

ఘనబలిష్ఠపరిగ్రహగ్రాహగళిత, బుద్ధినై మోసపోయినఁ బోదుఁ గాని
యింకనైన మదాత్మకు హితము చేయు, వాఁడ సంసారసంబంధవాంఛఁ దొరఁగి.

99


వ.

సర్వంబునకు ధాతయై యచింత్యరూపకుండై యణువునకు నణువై యతి
ప్రమాణుండై సితాసితుండై యీశ్వరులకు నీశ్వరుండైన శ్రీవిష్ణుదేవు
నారాధించెద.

100

గీ.

ధన్యుఁ డవ్యక్తవిస్పష్టతనుఁ డనంతుఁ, డఖిలరూపుఁ డశేషతేజోతిశాయి
యనఁగఁ బొగడొందు శ్రీవిష్ణునందు నాదు, చిత్త మిడి ముక్తిఫలము వాంఛింతు నెపుడు.

101


క.

గురువులకుఁ బరమగురువగు, సరసీరుహపత్రనేత్రు శరణార్థిజనో
త్కరసుఖదాయకుఁ గరుణా, భరణున్ శ్రీవిష్ణుదేవుఁ బ్రార్థింతు మదిన్.

102


వ.

అని యివ్విధంబున సౌభరి తనుదాన యుపశమించుకొని పుత్రగృహాసన
శయనపరిచ్ఛదాదికంబగు వస్తుజాతంబును విడిచి సకలభార్యాసమేతుండై
వనంబు ప్రవేశించి యందు ననుదినంబును వైఖానసనిష్పాద్యంబగు ననేక
క్రియాకలాపంబు నిష్పాదించి క్షపితసమస్తపాతకుండును బరిపక్వమనో
రథవృత్తియు నగుచు నగ్నుల నాత్మారోపణంబు చేసి భిక్షకుండై యజన్మ
వికారమరణాదికంబగు నచ్యుతపదంబు నొందె. ఇది మాంధాతృదుహితృ
సంబంధాఖ్యానంబు.

103


ఉ.

ప్రేమఁ దలిర్ప సౌభరిచరిత్రము విన్నఁ బఠించి చెప్ప ను
ద్దామవిభూతి జ్ఞానము సదాతనధర్మము నిర్మమత్వమున్
గామజయిత్వముం గని సుఖస్థితి మానవుఁ డొందు మోక్షల
క్ష్మీమహనీయసౌఖ్యము భజించు నచంచలత న్మునీశ్వరా.

104


వ.

ఇంక మాంఛాతృపుత్రసంతతి వివరించెద. మాంధాతృపుత్రుండైన
యంబరీషునకు యువనాశ్వుండు, యువనాశ్వునకు హారీతుండు, హారీతున
కాంగిగసులన షట్కోటిసంఖ్యాతులు పుత్రులు పుట్టిరి. రసాతలంబున మౌనేయ
నామగంధర్వులు నాగకులంబుల ధనరత్నాధిపత్యంబులు హరించిన
గాంధర్వవీర్యావధూతులై నాగపతులు చని.

105


సీ.

అఖిలదేవేశు నుద్యత్పుండరీకలో, చను యోగనిద్రావసానసుప్ర
సన్నుఁ బన్నగశాయిశరణుఁ జొచ్చి భుజంగ, పతు లెల్ల తమపడ్డపాటు విన్న
వించిన నిందిరావిభుఁ డాదరించి కొం, దల మేల మీకు మాంధాతృపుత్ర
కుఁడు పురుకుత్సుఁ డనురుబలాఢ్యుఁడు గలఁ, డతనిశరీరంబు నధివసించి


గీ.

దుష్టగంధర్వతతి నెల్లఁ ద్రుంతుఁ బోయి, యతనిఁ బురికొల్పుఁ డనుచు దేవాదిదేవుఁ
డందఱును జూడఁగా నదృశ్యత్వ మొందె, భుజగపతులును నిజపురంబునకు వచ్చి.

106


మ.

జగతీశర్మదనర్మదన్ భుజగరాజన్యాగ్రణు ల్వంప శీ
ఘ్రగయై యాపురుకుత్సభూవిభునిఁ జేరంబోయి తత్కార్య మ
చ్చుగఁ జెప్ప న్విని వచ్చి విష్ణుఘనతేజోవర్ధితుండౌటఁ బ
న్నగలోకంబు సుఖింపఁ గీటడఁచె గంధర్వేంద్రుల న్వ్రేల్మిడిన్.

107

వ.

ఇట్లు.

108


క.

పురుకుత్సుఁడు గంధర్వో, త్కరముల వధియించి చనియెఁ దనపురమునకున్
హరికరుణ రసాతలమునఁ, బరమానందంబు నొందెఁ బన్నగకులమున్.

109


వ.

సకలపన్నగపతులును నర్మదం జూచి యెవ్వండేని నిన్నుఁ బేరుకొను వానికి
సర్పవిషభయంబు లేదని వరం బిచ్చిరి. ఇందుల కొక్కశ్లోకంబు గలదు.
వినుము.

110


శ్లో॥

నర్మదాయై నమః ప్రాతర్నర్మదాయై నమో నిశి।
నమోస్తు నర్మదే తుభ్యంత్రాహిమాం విషసర్పతః॥

111


వ.

ఇట్లని యుచ్చరించుచు నంధకారంబు ప్రవేశించిన సర్పంబులు కఱవవు.
ఇది స్మరించుచు భుజించిన విషం బరుగు.

112


క.

ధరణి భవత్సంతానము, పరఁగు నవిచ్ఛిన్నమై శుభస్థితి నంచున్
బురుకుత్సునకు భుజంగో, త్కరములు వర మిచ్చె నధికగౌరవ మొప్పన్.

113


వ.

ఆపురుకుత్సుండు నర్మదయందు త్రసదశ్వునిం గనియె. త్రసదశ్వునకు ననర
ణ్యుండు పుట్టె. అతని రావణుండు దిగ్విజయంబునందు వధియించె. అయ్యన
రణ్యునకు హర్యశ్వుండు, నతనికి హస్తుఁడు, నతనికి సుమనుఁడు, నాతనికిఁ ద్రిధ
న్వుండు, నతనికిఁ ద్రయ్యారుణియు, నతనికి సత్యవ్రతుండును గలిగె. ఆసత్య
వ్రతునకుఁ ద్రిశంకుండను నామంబును గలదు. అతడు కర్మవశంబునం
జండాలుఁడై యుండి.

114


సీ.

ధరణిపై ద్వాదశాబ్దంబు లనావృష్టి, యైన నన్నము లేక గ్లాని పొంది
పొగులు విశ్వామిత్రపుత్రమిత్రకళత్ర, ములకుఁ బ్రతిగ్రహకలితదోష
మంటకయుండ నిత్యము గంగదరి మఱ్ఱి, మ్రానితో వనమృగమాంస మంట
గట్టిపో నందుచేఁ గఱవు వెళ్లించి కౌ, శికుఁ డాత్రిశంకునిచేఁత మెచ్చి


గీ.

తనతపశ్శక్తి నాతని తనువుతోన, స్వర్గమున నిల్పె నిట్టి యాశ్చర్యమహిమ
గలుగునే యన్యమునులకు గాధిపట్టి, కట్టిమహిమ ఘటిల్లె సంయమివరేణ్య.

115


వ.

ఆత్రిశంకునకు హరిశ్చంద్రుండు, నతనికి లోహితాశ్వుండు, నతనికి హారీ
తుండు, నతనికి జంచుండు, నతనికి విజయ, వసుదేవులన నిద్దఱుపుత్రులుఁ
గలిగిరి; అందు విజయునకు రురుకుండు, రురుకునకు వృకుండు, నతనికి
బాహుకుండుఁ గలిగె; ఆబాహుకుండు హైహయతాలజంఘాదులచే నపజి
తుండై గర్భిణియగు మహిషియుం దానును వనంబు ప్రవేశించె నందు.

116

గీ.

సవతి తనయీర్ష్యచేత రాజన్న్యుసతికి, గర్భసంస్తంభనమునకై గరము వెట్టె
విషవశంబున గర్భంబు వ్రీలిపడక, సప్తవర్షంబు లుండె నాశ్చర్యముగను.

117


సీ.

బాహుకుం డతిజరాభారపీడితుఁడయి, యౌర్వాశ్రమము చేర్ప ననుచయ౦బు
వీడినఁ దత్పత్ని విభునితో ననుగమిం, పఁదలంప నదియెల్ల మది నెఱింగి
యౌర్వుండు కాలత్రయాభిజ్ఞుఁ డరుదెంచి, యాసాధ్వితోడ నిట్లను మృగాక్షి
యీయసద్గ్రాహ మి ట్లేల చేసెదవు నీ, కడుపున లోకవిఖ్యాతికీర్తి


గీ.

తనయుఁ డుదయించి శాత్రవతతులఁ
ద్రుంచి, యమితదక్షిణ లిచ్చి జన్నములు చేసి
నిఖిలభూమండలము నేలు నిపుణమహిమ, వెలయ జక్రవర్తి కాఁగలఁడు సుమ్ము.

118


ఉ.

సాహస మేల నాపలుకు సత్యము నమ్ముము నీవనం దదు
త్సాహము మాని యాశ్రమపదంబునకుం గొనివచ్చి మౌని సం
దోహవిభుండు ప్రోవఁగ మనోభవసుందరుఁ గాంచెఁ బుత్రకుం
బాహుబలాఢ్యు బాహుకనృపాలకగేహిని యద్భుతంబుగన్.

119


గీ.

గరముతోఁ గూడఁ బుట్ట సగరుఁ డటంచు, నామధేయం బొసంగి మాణవకునకును
నౌర్వుఁ డుపనయనము చేసి సర్వవేద, శాస్త్రములు చెప్పి దివ్యాస్త్రసమితి యిచ్చె.

120


వ.

ఆగ్నేయాస్త్రభార్గవాస్త్రాదు లొసంగిన బుద్ధిమంతుండై యొక్కనా డక్కుమా
రుండు తల్లి కిట్లనియె.

121


గీ.

అమ్మ మన మేల యుంటి మీయడవిలోన, మజ్జనకుఁ డెందుఁ బోయె సమ్మద మెలర్పఁ
జెప్పుమన్నఁ దనూజుతోఁ జెప్పె నప్ప, తివ్రతామణి సర్వంబు దెలియఁబడఁగ.

122


వ.

సగరుండు పితృరాజ్యాపహరణామర్షితుండై హైహయతాలజంఘాదివధంబు
నకుఁ బ్రతిజ్ఞ చేసి యందు మిక్కిలియు హైహయులం జంపె. అంత శకయవన
కాంభోజపారదపల్లవులు హస్యమానులై సగరకులగురుండుగు వసిష్ఠుని శర
ణంబు చొచ్చిన వారల జీవన్మృతులంగాఁ దలంచి సగరున కిట్లనియె.

123


క.

పాపఁడ జీవన్మృతు లీ, యాపన్నులు వీరిఁ గావవయ్య ద్విజత్వ
శ్రీపాతితులై ద్విజసం, గాపాయము నొంది రేమి యనఁగల దింకన్.

124


వ.

వీరలు స్వధర్మపరిత్యాగులైన నీప్రతిజ్ఞ చెల్లెనని నందద్గురువచనం బభినందించి
వారలకు హాస్యవేషంబు చేసె. ఎట్లనిన నయ్యవనుల ముండితశిరస్కులను, శకుల
నర్ధముండితులను, పారదులఁ బ్రలంబకేశులను, బల్లవుల శ్మశ్రుధరులను, నన్య
క్షత్త్రియుల నిస్స్వాధ్యాయవషట్కారులను జేసె. వారలు నాత్మధర్మపరి
త్యాగంబున బ్రాహ్మణులచేత విడువంబడి మ్లేచ్ఛత్వంబు నొందిరి. సగరుండును

స్వాధిష్ఠానంబు నొంది యస్ఖలితచక్రుండై సప్తద్వీపవతియైన వసుంధర నే
కాతపత్రముగా నేలె.

125


క.

సుమతియుఁ గేశినియును నను, ప్రమదలు కశ్యపవిదర్భపతిసుత లాభూ
రమణునకు భార్యలై రు, త్తమపాతివ్రత్యనిత్యధర్మము వెలయన్.

126


వ.

ఆసుమతికేశిను లిరువురు పుత్రార్థినులై యౌర్వునిం ప్రార్థించిన నత్తపోధ
నుండు వారి కిట్లను. ఒక్కతె వంశకరు నొక్కపుత్రుని, నొక్కతె బలపరా
క్రమసంపన్నులగు నఱువదివేలపుత్రులను గనంగలరు. వలయునట్లు కోరుఁ
డనిన నట్ల కాక యని కేశిని వంశకరుం గోరి యల్పదినంబుల కసమంజసుండను
పుత్రునిం గనియె. సుమతి యరువదివేలపుత్రులం గనియె. అసమంజసునకు నంశు
మంతుండు కలిగె. అయ్యసమంజసుఁడు బాల్యంబునుండి పాపవృత్తుండైనఁ
దండ్రి చింతించి బుద్ధిమంతుండు కాఁడని పుత్రకు న్విడిచె. తక్కిన యఱువది
వేవురును నసమంజసునట్ల పాపవృత్తులై జగంబున యజ్ఞాదిసన్మార్గంబులు
చెఱిచిన.

127


సీ.

పురుషోత్తమాంశసంభూతుండు నిర్దోషుఁ, డఖిలవిద్యామయుండైన కపిల
మునిపాలి కేతెంచి మ్రొక్కి దేవత లెల్ల, విన్నవించిరి దేవవిశ్వమునకు
సాగరుల్ చేయు నల్జడి చెప్పఁదరము గా, దీయుపద్రవ మింక నెన్నఁ డణఁగు
ధరణి రక్షింప దేవరవార లీరీతి, నవతరించుటఁ జేసియైన కార్య


గీ.

మంతయును విన్నవించితి మనిన నల్పదివసములలోన సాగరు ల్తీరిపోవఁ
గల రనుచు దేవతలతోడఁ గపిలమౌని, తెలియ నానతి యిచ్చె మైత్రేయ వినుము.

128


క.

అంతటిలో సగరమహీ, కాంతుఁడు హయమేధమఖము కావించి సుదు
ర్దాంతులగు సుతుల హయసమనంతరగాములుగఁ జేసి యంపిన వెనుకన్.

129


క.

తురఁగము మ్రుచ్చిలి మాయా, పురుషుఁడొకఁడు ధరణిఁ జొచ్చిపోయిన నత్యు
ద్ధురులై సుమతికుమారులు, ధర నొక్కొకయోజనంబు త్రవ్విరి వరుసన్.

130


ఉత్సాహ.

ధర రసాతలంబుదాఁకఁ ద్రవ్వి యచ్చటం బరి,
స్ఫురణనున్న యశ్వరత్నముం దదంతికంబునన్
వరవిభావిశేషజితదివాకరుం దపోధురం
ధరునిఁ గపిలుఁ గాంచి రపుడు ధారుణీశనందనుల్.

131


క.

కని వీఁడె హయమలిమ్లుచుఁ, డనుకంపఁ దొఱంగి పొడువుఁ డడువుఁడు చంపుం
డని చుట్టుముట్ట నమ్ముని, కినియక యలవోక కంటిక్రేవఁ గనుఁగొనన్.

132

క.

స్వకృతాపరాధతనుభవ, వికటదవానలశిఖాభివృతరాజకుమా
రకనీరసతరగహనము, సకలంబును నపుడు భస్మసాత్కృతమయ్యెన్.

133


క.

తనతనయు లెల్ల నీవిధిఁ, జనినతెఱం గపుడు వచ్చి చారులు చెప్పన్
విని హయము తేర జనపతి, మనుమని మతిమంతు నంశుమంతునిఁ బంపెన్.

134


చ.

మహితగుణాభిరాముఁ డసమంజసపుత్రకుఁ డంశుమంతుఁ డ
మ్మహిబిల మర్థిఁ జొచ్చి నడుమ న్మహనీయమహామహోన్నతిన్
గ్రహపతిఁ బోలు నాకపిలుఁ గాంచి సమంచితభక్తి మ్రొక్క లో
కహితచరిత్రుఁ డిట్లనియె గౌరవ మొప్పఁగ నక్కుమారుతోన్.

135


ఉ.

పాపఁడ సాగరుల్ స్వకృతపాపముఁ జే సిటులైరి వీర లు
ద్దీపితనాక మొందుటకుఁ దెచ్చు భవత్సుతపుత్రకుండు ది
వ్యాపగ నివ్వసుంధరకు నధ్వరవాహముఁ గొంచు పొమ్ము దీ
క్షాపరుఁడైన తాతకు వికాసము పుట్టఁగ నీక్షణంబునన్.

136


వ.

భవత్పౌత్రుండు మందానికిం దెచ్చి భస్మీభూతులైన సాగరులం దడిపి స్వర్గంబు
నొందింపంగలండు. సాక్షాద్భగవత్పదాంగుష్ఠనిర్గతంబగు గంగాజలంబు
జగతి నెవ్వరిశరీరాస్థిచర్మభస్మస్నాయుమేధఃకేశంబులఁ దడుపు వారు స్వర్గం
బారోహింతురు. తన్మాహాత్మ్యంబు వర్ణింప శక్యంబే యనిన నమ్మునీంద్రునకు
నక్కుమారుండు.

137


గీ.

మ్రొక్కి యశ్వరత్నముం గొని వేగంబె, తాతకడకుఁ బోవ ధరణివిభుఁడు
సప్తతంతువిధి సమాప్తంబు గావించి, పుణ్యగరిమఁ ద్రిదివమునకుఁ జనియె.

138


వ.

ఆసగరుండు పుత్రవాత్సల్యంబున సాగరంబుం బుత్రునిగాఁ జేసికొనియె.
తత్పౌత్రుం డంశుమంతునకు దిలీపుం డతనికి భగీరథుండు గలిగె. అతండ కదా స్వ
ర్గంబుననుండి భూమికి మందాకినిం దెచ్చి భాగీరథీనామంబు గావించె. ఆభగీ
రథునకు సుహోత్రుండు నతనికి నాభాగుండు నతనికి నంబరీషుండు నతనికి
సింధుద్వీపుండు నతనికి నయుతాయుండు నతనికి ఋతుపర్ణుండు గలిగిరి.
అతండ కదా నలసహాయుండై యక్షహృదయజ్ఞుం డయ్యె. ఋతుపర్ణునకు
సర్వకాముండు నతనికి సుదాసుండు నతనికి సౌదాసుండు పుట్టె. అతండ
మిత్రనహుండును ననంబరఁగు.

139


ఉ.

ఆనృపుఁ డొక్కనాఁడు మృగయారతుఁడై వనభూమిఁ ద్రిమ్మరం
గా నొకరెండుబెబ్బులులు గన్పడఁ బన్పఁడ వీనిచేత ని

క్కానఁ మృగవ్రజం బణఁగెఁ గాన వధించుట మంచి దంచుఁ జేఁ
బూనినహేతి నొక్కపులి బొండుగఁ జించిన నాక్షణంబునన్.

140


క.

మృతిఁ బొందె రక్కసుండై యితరవ్యాఘ్ర మనె మంచి దిది మఱవకు నేఁ
బ్రతి దీనికిఁ జేయుదునని, యతనినె వెఱపించి మాయమైపోయె వడిన్.

141


ఉత్సాహ.

అంత గొంతకాలమునకు నరివిభేది యమ్మహీ
కాంతుఁ డొక్కమఘము చేయఁగా వశిష్ఠమౌని య
త్యంతనియతిఁ దత్త్రియల్ ప్రయత్నిమున నొనర్చి యా
చాంతికొఱకుఁ బోవ రాక్షసపతి తా వశిష్ఠుఁడై.

142


క.

చనుదెంచి మాంసయుతభో, జన మొసఁగుము నాకు ననిన జనపతి యౌఁగా
కన మగిడి వత్తునని వే, గన చని యాయసుర సూపకారుం డగుచున్.

143


సీ.

మనుజేంద్రుననుమతి మానవమాంసంబు, తెచ్చి పక్వము చేసి దీప్తకనక
పాత్రికనం దీయ ధాత్రీవిభుఁడు గురుం డేతేర ముందర నిడినఁ జూచి
యౌర యీరాజు దుశ్చారిత్ర మామిషం, బిడవచ్చునే యిది యేమియొక్కొ
యనుచు లోఁ దలపోసి మనుజమాంసంబుగాఁ దెలిసి మహాక్రోధకలుషితాత్ముఁ


గీ.

డై శపించె నృపాలకు ననిశమును మ, నుష్యమాంసంబు దినుచునుండుదువుగాక
యని మఱియు జ్ఞానదృష్టిచే నరసి దనుజ, కృత మనుచు సత్కృపాపరిస్పృష్టుఁ డగుచు.

144


వ.

ద్వాదశాబ్దంబులకు శాపనివృత్తి యయ్యెడమనియె. అమ్మహీపతియును,
శాపంబుఁ బరిగ్రహించి మగిడి శాపోదకంబులు చేపట్టి గురునిం బ్రతిశపింపఁ
దలంచిన.

145


క.

మదయంతి యనెడు నవ్విభు, సుదతి కడున్వెఱచి భర్తఁ జూచి కులగురున్
సదమలదివ్యజ్ఞానా, స్పదమూర్తిం దగునె యకట శప్తునిఁ జేయన్.

146


వ.

శపించుట ధర్మంబు గాదని ప్రార్థించిన శపియించుట మాని జగద్రక్షణార్థంబు
శాపోదకంబులు భూమ్యాకాశంబులఁ జల్లక నిజపాదంబులపైఁ జల్లుకొనినఁ
బాదంబులు గాలి కల్మషవర్ణంబు లగుటం గల్మాషపాదుం డనంబరఁగి గురు
శాపంబున రాక్షసభావంబు నొంది వనంబునం దిరుగుచు ననేకులైన మాన
వుల భక్షించుచుండి.

147


క.

ఒకనాఁ డొకముని ఋతుకా, లకృతస్నానన్ స్వభావలావణ్యవతిన్
వికసితముఖుఁడై కదియఁగఁ, బ్రకటితుఁడై రాజు దనుజభావముతోడన్.

148

చ.

కనలుచు నార్చి పట్టుకొనఁగాఁ బఱతెంచిన వారు భీతులై
వనమునఁ బాఱిపోవఁగ జవంబున వెన్నడిపోయి విపునిం
బనుపడఁ బట్టుకొన్నఁ గని బ్రాహ్మణి యిట్లను విప్రుఁ బుణ్యవ
ర్తనుని మదీయవల్లభుని ధర్మము తప్పి వధింపఁ బాడియే.

149


గీ.

అకట యిక్ష్వకువంశంబునందుఁ బుట్టి, నట్టినృపతులు ధర్మమార్గైకరతులు
నీవు తత్కులమునఁ బుట్టి నింద్యకర్మ, మాచరింపంగఁదగునయ్య నీచవృత్తి.

150


వ.

నీవు మిత్రసహుండను మహారాజవు, రాక్షనుండవుగావు; స్త్రీధర్మసుఖాభిజ్ఞుం
డవు; మన్మనోరథంబు గాకుండ మద్వల్లభుని వధియింపవలదని బహుప్రకారం
బుల విలపించుచుం బ్రార్థించిన వినక వ్యాఘ్రంబు పశువుం జంపినవిధంబున
బ్రాహ్మణుం జంపి భక్షించె. అంత నాబ్రాహ్మణి యగ్నిప్రవేశంబు చేయం
దలంచి కోపోద్దీపితమానసయై.

151


గీ.

నామనోరథమునకు విఘ్నంబు చేసి, భర్తఁ జంపితి వీపాపఫలముకతన
నంగనామణిఁ గవిసిన యపుడు నీవు, పంచత భజించు మనుచు శపించె నపుడు.

152


వ.

ఇట్లు శపించి పతి ననుగమించె. నంత ద్వాదశాబ్దంబులు నిండిన శాపకృత
రాక్షసభావంబు పోయిన మిత్రసహుండు నిజపురంబునకు వచ్చి నిజపత్ని
యగు మదయంతి రావించి మదనక్రీడ లపేక్షించిన నద్దేవియు శాపప్రకారం
బెఱింగినదై వారించె. ఆతుడును రతిపరాఙ్ముఖుఁడై యుండె నంత.

153


క.

అనపత్యుఁడై నృపాలుఁడు, తనగురుని వశిష్ఠమౌనిఁ దగఁ బ్రార్థింపన్
మునియును మదయంతికి ము, ద్ఘనచిత్తాంబురుహుఁ డగుచు గర్భము చేసెన్.

154


గీ.

కాంత మదయంతి యేడేండ్లు గర్భభరము, పూని వేసరి యొకఱాతఁ బొడిచికొనిన
గర్భము కలంగి సుతుఁడు భాస్కరనిభుండు, పుట్టె నశ్మకుఁ డని జగంబులు నుతింప.

155


వ.

అయ్యశ్మకునకు మూలకుండగు పుత్రుండు కలిగె. అతండె కదా పరశు
రాముండు భూతలంబు నిఃక్షత్త్రంబు సేయునెడ వివస్త్రలైన స్త్రీలచేతం
బరివృతుండై రక్షింపంబడి నారీకవచుం డనం బరఁగె. అట్టి మూలకునకు ద
శరథుండు నతనికి నిలిబిలి యతనికి విశ్వసహుండు నతనికి ఖట్వాంగుండు
కలిగె.

156


సీ.

ఖట్వాంగమేదినీకాంతుండు దేవాసు, రాహవంబున సమభ్యర్థితుఁ డయి
సురలకుఁ దోడ్పాటు చూపి దైతేయులఁ, బరిమార్చి గెల్చిన సురలు మెచ్చి

వరము గోరుము ధరావర యన వర మీయ, నాత్మ గోరితిరేని యస్మదాయు
రవసాన మెఱిఁగింపుఁడనిన నొక్కముహూర్త, మని చెప్ప వేగియై యవని కరుగు


గీ.

దెంచి యిట్లని తలఁచె భూదివిజు లడుగఁ, దాల్మిమై దేహమైనను దాఁపకిత్తు
విహితధర్మంబు లేమర వృక్షమనుజ, పశుతృణాదులయందు శ్రీభర్తఁ గాంతు.

157


వ.

ఎప్పుడును నిట్టివాఁడనై చరింతు నింకను.

158


చ.

మునిజనభాగధేయము సమున్నతవేదశిఖావతంస మా
ర్యనివహకల్పకంబు సచరాచరసర్వజగత్స్వరూపమై
పనుపడు వాసుదేవుఁడను బ్రహ్మము నెమ్మది నాశ్రయింతు నం
చనితరభక్తియుక్తి వసుధాధిపుఁ డస్పృహచిత్తవృత్తియై.

159


వ.

వాసుదేవబ్రహ్మంబునందు లీనుండై ముహూర్తంబున ముక్తుఁ డయ్యె.

160


గీ.

పుడమిఁ ఖట్వాంగభూపతిఁ బోలునృపతి, కలఁడె దివముననుండి భూస్థలికి వచ్చి
రెండుగడియలఁ జేరె నిశ్రేయసంబు, ననుచుఁ బొగడిరి సప్తర్షు లతనికీర్తి.

161


వ.

ఆఖట్వాంగునకు దీర్ఘబాహుండును, దీర్ఘబాహువునకు రఘువు, రఘువునకు
నజుండు, నజునకు దశరథుఁడును గలిగె.

162


సీ.

శ్రుతిశిరోవ్యాహారవితతి కింతింతని, కొలఁది పెట్టగరానియలఘుమహిమ
మరవిందభవభవేంద్రాదిదివ్యులకు, దుష్ప్రాపతమంబైన పరమపదము
సనకాది పరమహంసవతంసముల దహ, రాంబరస్థలిఁ ద్రోచునతులతేజ
మణుమహత్పరిమాణగణితాఖిలప్రపంచాంతఃస్థమైన యనాదినిధన


గీ.

మమల మవితర్క్య మక్షయ్య మప్రమేయ, మైన నారాయణబ్రహ్మ మవతరించె
రాముఁ డనఁ దారకబ్రహ్మనామసోమ, ధామ ముద్దామమై పర్వ దశరథునకు.

163


వ.

రామలక్ష్మణభరతశత్రుఘ్ను లన నాలుగురూపంబుల నుదయించి.

164


చ.

జనకునియాజ్ఞఁ గౌశికునిజహ్నము గావఁగఁ బోవఁ ద్రోవలో
ఘనవిజిఘాంసయై యెదురుగాఁ బఱతెంచిన తాటకానిశా
టని నలవోక ద్రుంచుచుఁ, దటాలున నధ్వరవిఘ్నకర్తలౌ
దనుజుల గెల్చి కాచె గుణధాముఁడు రాముఁడు మౌనియాగమున్

165


సీ

కఠినశిలీభవద్గౌతమప్రేయసి, కలుషవహ్నికిఁ దొలుకారుమొగులు
చండీశకోదండపుండ్రేక్షుకాండంబు, నకును ... ... ఉన్మదగజంబు
పృథ్వీతనూభవాదృక్చకోరికలాల, సమునకుఁ బూర్ణిమాచంద్రబింబ
ముదయభార్గవసముద్యద్దర్పశిఖరిని, ర్భేదనక్రీడకు భిదురధార

గీ.

అడుగు నెత్తమ్మిరజము బాహాబలంబు, చక్కఁదనము పరాక్రమసౌష్ఠవంబు
దనకు ననుకూలగతి నొప్ప ధరణిఁ బరఁగె, శ్రీమహితదివ్యవిభుఁడు శ్రీరామవిభుఁడు.

166


గీ.

జనకసత్యవచఃప్రతిష్టాపనమున, కనుజసీతాసమేతుఁడై యటవి కేగె
మునికృతతపఃఫలంబు చేరినవిధమున, వల్కపరిధానుఁడై జటావళి ధరించి.

167


చ.

అహరధిపప్రతాపుఁడు జనాధిపుఁ డాదరణీయవైఖరిన్
గుహవరివస్యఁ గైకొని మనోహరకాననచిత్రకూటస
న్మహిభృదధిత్యకాస్థలుల మౌనులగోష్ఠి వసించె నిచ్చలున్
మహితనయానుజన్ములు సమగ్రతఁ దన్ను భజించుచుండఁగాన్.

168


సీ.

కౌసల్య మొదలుగాఁ గల్గుతల్లులతోడ, వరమూలబలముతో గురులతోడ
శత్రుఘ్నుఁడుం దాను జనుదెంచి భరతుండు, సాగిలి మ్రొక్కి రాజన్యవరుని
కడఁ జెప్పి తత్క్రియల్ గడపినపిమ్మట, ధరణిఁ బాలింపఁ బ్రార్థనము చేయ
నంగీకరింపక యామ్నాయమస్తక, న్యస్తప్రశస్తము న్యాత్మభావ


గీ.

భవ్యపాదూద్వయం బిచ్చి పంపి మగిడి, మగిడి వచ్చెద రిం దుండి మనుట గూడ
దనుచు ననుచు సముత్సాహ మగ్గలముగ, నగ్గిరీంద్రంబు డిగ్గి రామావనిపుఁడు.

169


వ.

కతిపయప్రయాణంబుల దక్షిణపథంబు పట్టి చనిచని.

170


సీ.

గంధదంతావళోత్కరకరోచ్చైఃక్షిప్త,వమధువర్షత్రసద్వనచరంబు
గిరిదరీపరిసరద్ధరిఘనారభటీవి, నిర్దళద్గర్భకైణీగణంబు
బిలనిద్రితద్వీపివలమానఘుటఘుట, స్వానస్వనితకుంజపుంజితంబు
తరునిష్కుహాంగణస్థభుజంగమఫణాగ్రరత్నదీపనిరస్తరజనితమము


గీ.

ప్రోల్లసత్పాదపోల్లలద్భల్లుకేంద్ర, సాంద్రతనుమేచకప్రభాశంకనీయ
తతకుహూమధ్యరాత్రం బుదగ్రదాన, వైధితము దండకారణ్య మెదుటఁ గాంచి.

171


వ.

తఱియం జొచ్చి చనునప్పుడు.

172


శా.

స్వర్ణావణ్యవతీవిహారఘనవిస్రంభార్హగోదావరీ
వార్లోలల్లహరీవికంపితవిభావత్పంకజాతోత్సలాం
తర్లీనభ్రమరాతిగీతి రసకర్త ల్పంతతాయోగినీ
దుర్లంఘంబులు దండకానిలము లేతుల్ చూపె భూపాలుపై.

173


ఉ.

ఆరవివంశవర్ధనుఁ, డుదారధనూరవభిద్యదుగ్రకాం
తారమృగీపలాయనవిధానమున న్ధరణీతనూజ వి

స్మేరముఖాబ్జఁ జేయుచు గమించుచుఁ దార్కొనఁ ద్రుంచెఁ గల్పిత
క్రూరనిరోధు దుస్సహవిరోధు విరాధు నిశాతహేతిచేన్.

174


క.

శరభంగ సుతీక్ష్ణమునీ, శ్వరపుణ్యాశ్రమములకు వివస్వద్వంశో
త్తరుఁడు చని తత్సపర్యలఁ, బరితుష్టిం బొంది యనుజభార్యాన్వితుఁడై.

175


పంచచామరము.

అగస్త్యమౌని యున్న పావనాశ్రమంబు చేర నా
ప్రగల్భతాపసుండు శాస్త్రభంగి పూజ చేసి కాం
తి గల్గు నైంద్రకార్ముకంబు దివ్యఖడ్గ మక్షయా
శుగంబు తూణయుగ్మకంబు చోద్యలీల నిచ్చినన్.

176


వ.

పరిగ్రహించి యచ్చట నివాసంబు చేసి యుండునంత.

177


సీ.

జటిలులు వల్కలాచ్ఛాదను ల్కృష్ణాజి, నోత్తరీయాంతరీయోరుతనులు
దండకమండలుధారులు కాషాయ, పటవసానులు తపోధారకృశులు
పవనభోజులు జీర్ణపర్ణఖాదనులు, నీవారముష్టింపచోదారవృత్తు
లంబుభక్షణులు శాకాశనుల్ మూలకం, దఫలశిలోంఛవర్తనమహితులు


గీ.

యాయజూకులు బ్రహ్మవిద్యానిపుణులు, దండకారణ్యసతతవాస్తవ్యు లవని
వినుతతేజోనిరస్తదమునులు మునులు, వేడ్కఁ జనుదెంచి రారామవిభునిఁ జూడ.

178


చ.

ఎదురుగ నేగి వారికి నభీష్టత సాగిలి మ్రొక్కి భక్తి లోఁ
బొదలఁగఁ దోడి తెచ్చి నయము న్భయముం దగ నర్హపీఠులన్
ముదమున నుంచి యంచితమనోగతి నర్ఘ్య మొసంగి మాధురీ
సదుదితరీతి స్వాగతము చక్కఁగ నీయఁగ నత్తపోధనుల్.

179


వ.

పెక్కుదెఱంగుల నాశీర్వదించుచు నిట్లనిరి.

180


గీ.

విశ్వవిశ్వంభరాచక్రవిపుల భార, మాని ప్రజనెల్లఁ బ్రోచు మీయభ్యుదయము
గోరుకొని మీకు ధర్మంబుఁ గోరు పెట్టు, కొనుచునుండుదు మెపుడు నీవనములోన.

181


సీ.

త్రిషవణవ్రతులఁ గాఱియ పెట్టి నీళ్లఁ ద్రొ, క్కుదురు ముక్కున నూర్పు మెదలకుండ
వ్రేలఁగట్టుదురు బల్విడిఁ దలక్రిందుగా, వరకపాలాసనాదరులఁ దరుల
ఐణపట్టములఁ గూయఁగ డింభకులమోము, బిగఁగట్టుదురు పట్టి బీతు కుడువ
కెరలి యంగములపై ఘృతము చల్లుచు, దుందుముల యాజకుల నేర్తు రలమటింప


గీ.

పలితదీర్ఘజటావల్లిభరము పట్టి, పట్టి బెడ్డలపై నెత్తు రుట్ట జరఠ
తాపసుల నీడ్తు రాశ్రమస్థలుల ఖలులు, రక్కసులు పిక్కటిలి దురారంభు లగుచు.

182

మ.

భయదవ్యాఘ్రమదేభసింహకిటిరూపంబుల్ దగంచాల్చి దు
ర్నయతం బల్లెలు చొచ్చి హెచ్చిన మదాంధత్వంబున న్సత్తపః
ప్రియుల న్మౌనులఁ బట్టి చంపుచు, ననల్పీభూతనిర్ఘాతని
ర్దయఘోరారభటీకులై దనుజభర్తల్ పోదురిఛ్ఛాగతిన్.

183


సీ.

దర్భ గుప్పెఁడు మోవఁదాళని, జీర్ణసన్మునులు గుఱ్ఱపుగడ్డి మోసిమోసి
జలకుండి దేర వేసరు సమాంసలభిక్షు లాసక్థ్యమున నీళ్లు మోసిమోసి
యిధ్మమేరఁగలేనివృద్ధయజ్వలు పాకములకుఁ గట్టెలదిండ్లు మోసిమోసి
భైక్షపత్రపుటి కోపని జరద్వాచంయములు బోనగావళ్లు మోసిమోసి


గీ.

విసిగి యీడ్గిలఁబడ మెడ ల్విఱుగ గ్రుద్ది, దిక్కులేమికి నగుదురు రక్కసులు ని
జాశ్రమంబులఁ దిగు తుడు మాలకించి, దూరముగఁ గాలు గలవారు పాఱిపోవ.

184


ఉ.

ఈసున బాసఁ దిట్టి మెడలెల్ల బడల్ పడ గ్రుద్ది గెంటుచున్
దీసుకపోయి దండములు దెచ్చి భుజంబులఁ బెట్టి దైత్యు లెం
తేసుఖలీల నందలము లెక్కిన మోతుము తన్నితాంతపీ
తాసవవాసవాసనల యావడిఁ బ్రేవులు వాతఁ దొట్టఁగన్.

185


వ.

యాగంబు లాగంబు లయ్యె, యోగంబులు వియోగంబు లయ్యె, సాంఖ్యం
బులు సంఖ్యంబు లయ్యె, జపంబులు నెపంబు లయ్యె, తపంబు లాతపంబు
లయ్యె, గాత్రంబులు ముష్టిఘట్టనపాత్రంబు లయ్యె, ఆశ్రమంబు లా
శ్రమంబు లయ్యె, వ్రతంబులు గతంబు లయ్యె, స్నానంబులు కుంజరస్నానంబు
లయ్యె, కందమూలాదిభోజ్యంబులు త్యాజ్యంబు లయ్యె, అధ్యయనంబు లాధ్యయ
నంబు లయ్యె, శాస్త్రంబులు శస్త్రంబు లయ్యె. శ్రీరామచంద్ర! సాంద్ర
భవత్కరుణాకటాక్షంబుల మమ్ము నీక్షించి రాక్షసబాధ మాన్పు మని
విన్నవించిన.

186


గీ.

పరమఋషిపుంగవుల విన్నపములు విన్న, యన్నరాధీశువదననభోంగణమున
భ్రూకుటివ్యాజకేతువిస్ఫురణ మఖిల, దానవవినాశపిశునయై కానిపించె.

187


క.

శ్రీరాముఁడు కారుణ్య, శ్రీరామారమణుఁడై ఋషిప్రవరులకున్
ధీరత నభయం బిచ్చి, యుదారాలాపముల నిట్టు లనుచుం బలికెన్.

188


గీ.

శంబదంభప్రహేళసారంభశుంభ, దాత్మదోస్స్తంభఖడ్గధారాంచలమునఁ
బాపకర్తుల రాక్షసభటులఁ బట్టి, చక్కుచీరికఁ జేయుదుఁ జనుఁడు మీరు.

189


వ.

ఇవ్విధంబునఁ బరమఋుషుల నాదరించి.

190

క.

చొక్కు మదిలోఁ దలంచుచు, రక్కెస చనుదేర హాస్యరసముగ నసిచే
ముక్కును జెవులును గోసె న, సృక్కణములు మోనువెంట జిలజిలఁ దొరగన్.

191


చ.

అరితతి వేఁటలాడు వసుధాధిపసూనుఁ డనల్పనైపుణీ
వరకరలాఘవంబున నవారణ నేయు విచిత్రపత్రి యా
ఖరముఖదైత్యనాథులను కైదుల బోరలు సించి క్రొవ్వు ని
ష్ఠురవరవిక్రమాప్తిఁ జవిచూచె గనుంగొనువారు మెచ్చఁగన్.

192


శా.

మారీచాంతకుఁడై కబంధవధశుంభత్సాయకుండై చమ
త్కారోత్ఖండితసప్తభూమిరుహుఁడై దర్పోజ్వలద్వాలిహృ
ద్ఘోరాద్రిప్రవిచారణోగ్రపవియై దుర్వారుఁడై యాసమి
చ్చూరాగ్రేసరుఁ డేలెఁ గింకరునిఁగా సుగ్రీవు నుగ్రాంశుజున్.

193


చ.

భవుకసితాబ్జపత్రరుచి పక్కున నవ్వు నృపాలువాలుఁగ
న్గవకొనకెం పొకించుగఁ దొగర్చఁగఁ దద్విశిఖాంచలంబునన్
దవిలెఁ బయోనిధాన మవధానముగాఁ దరుశాఖ నొప్పు కెం
జివురుతుద న్వసించు నొకచిన్నతుషారలవంబుచాడ్పునన్.

194


సీ.

స్నానకృత్యముఁ దీర్చె సంచరన్మకరాక్ష, రాక్షసోదరమహాస్రస్రవంతి
నాపోశనం బెత్తె నధికదృష్యత్కుంభ, కర్ణదీర్ణోర్వసృగర్జములను
ప్రాణాహుతులు వేల్చెఁ బటునిశాటభటప్ర, కాండచ్యవన్మాంసఖండములను
భోజనం బొనరించె భూరిరత్నకిరీట, కలితరావణశిరఃకబళములను


గీ.

సుఖశయన మొందె మణివిభాశోభమాన, మాననీయనిషంగధామంబునడుమ
ఎంత నిష్ఠాగరిష్ఠమో యినకులీన, చంద్రుబాడబసమదివ్యసాయకంబు.

195


వ.

ఇట్లు రావణవధంబు చేసి లంకారాజ్యంబున విభీషణునిఁ బట్టము గట్టి సీతాసమే
తుండై శ్రీరామవిభుం డయోధ్యానగరంబు ప్రవేశించి రాజ్యంబు పాలించె నంత.

196


గీ.

కడఁగి మూఁడుకోట్లు గంధర్వనాథుల, బాహుబలము మెఱయఁ బట్టి చంపి
వారిదేశములు బలారూఢిఁ గైకొనె, భరతుఁ డధికకీర్తిభరితుఁ డగుచు.

197


మ.

అరిజైత్రు న్మధుపుత్రకున్ లవణు మద్యద్బాహుసాహాయ్యకో
ద్ధురుఁడై యాహవకేళిఁ గీటణఁచి శత్రుఘ్నుండు గట్టించె భా
సురలీల న్మధురాఖ్యపట్టణము సంస్తుత్యంబుగా నందు సుం
దరసంపత్ప్రతిభాఢ్యులై జనులు సాంద్రప్రీతి వర్ధిల్లఁగన్.

198

వ.

ఇట్లు రామలక్ష్మణభరతశత్రుఘ్నులు జగంబులకు సుఖస్థితి సంపాదించి
దివంబునకుం జనిరి. భగవదంశసంభూతులగు వారియందు ననురాగంబుగల
కోసలజానపదులు తన్మనస్కులై తత్సాలోక్యంబు నొందిరి. రామునకుఁ
గుశలవులును, లక్ష్మణునకు నంగదచంద్రకేతులును, భరతునకుఁ దక్షపుష్క
రులును, శత్రుఘ్నునకు సుబాహుశూరసేనులును గలిగిరి. అందు కుశునకు న
తిథి, నతిథికి నిషధుండు, నిషధునకు నలుండు, నలునకు నభుండు, నభునకుఁ
బుండరీకుండు, పుండరీకునకు క్షేమధన్వుండు, క్షేమధన్వునకు దేవానీకుండు,
దేవానీకునకు నహీనగుండు, నహీనగునకు రురుండు, రురునకుఁ బారియాత్రుండు,
పారియాత్రునకు దేవళుండు, దేవళునకు వచ్చలుఁడు, వచ్చలునకు నుత్కుఁడును,
నుత్కునకుఁ దైలుండు, తైలునకు ఉక్తుండు, ఉక్తునకుఁ వజ్రనాభుండు, వజ్రనా
భునకు శంఖణుండు, శంఖణునకు ద్యుషితాశ్వుండు, ద్యుషితాశ్వునకు విశ్వస
హుండు, విశ్వసహునకు హిరణ్యనాభుండు గలిగె. అతండు జైమినిశిష్యుండైన
యాజ్ఞవల్క్యునివలన యోగం బభ్యసించి యోగీశ్వరుం డయ్యె. ఆహిరణ్యనా
భునకుఁ బుష్యుండు, పుష్యునకు ధ్రువసంధి, ధ్రువసంధికి సుదర్శనుండు, సుదర్శ
నునకు నగ్నివర్ణుండు, నగ్నివర్ణునకు శీఘ్రగుండు, శీఘ్రగునకు మరుండును గలిగె.
అతండు యోగీశ్వరుండై కలాపపురంబున నున్నవాఁడు. ఆగామియుగంబు
నందు సూర్యవంశవర్తకుండు కాఁగలఁడు, అమరునకుఁ బ్రశుశ్రుకుండు నాతనికి
సుసంధి నతనికి సమర్షణుండు నతనికి విశ్వభవుండు నతనికి బృహద్బలుండును
గలిగె. బృహద్బలుండు కదా భారతయుద్ధంబున నర్జనపుత్రుండైన యభిమన్యుని
చేత హతుండయ్యె. వీర లిక్ష్వాకువంశభూపాలకులముఖ్యులు. వీరలచరితం
బులు వినిన సర్వపాపక్షయం బగునని చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

199


సీ.

ధన్యుఁ డిక్ష్వాకునందనుఁ డైననిమి సహ, స్రాబ్దయజ్ఞం బొక్క టాహరింపఁ
దలఁచి ప్రార్థించె హోతవు గమ్మనుచు వశి, ష్ఠుని నమ్మునీంద్రుఁ డిట్లనియె నింద్రుఁ
డిపుడు పంచశతాబ్దకృత్యాధ్వరము చేయ నూహించి పిలిచిన నొప్పినాఁడ
వజ్రికార్యము దీర్చి వచ్చి నీమఘము సా, గించెదనని పోయె క్షితివరుఁడును


గీ.

గౌతమాదులఁ గూర్చి యాగంబు చేయు, చుండె నంతటిలో వశిష్ఠుండు మఘవు
మఘము సేయించి భూమికి మగిడివచ్చి, యన్యుచే జన్న మొనరించునధిపుఁ గాంచి.

200


క.

జన్నము సేయించుటకై, నన్ను నొడంబఱిచి పిదప నాయాగమనం
బెన్నక యిటు గావించిన, యిన్నీచునిదుష్టకృత్య మే మనవచ్చున్.

201


వ.

అని కోపించి.

202

క.

మోహతిరేకమున సం, దేహింపక యిజ్య కొకరిఁ దెచ్చుకొనినయీ
సాహసికగ్రామణి నిజ, దేహ మెడలుఁగాక తా విదేహుం డనఁగన్.

203


చ.

అనుచు శపింప మేలుకని యక్కట యేమరి నిద్ర నున్ననన్
గినిసి శపించె నాయెడల కిల్బిషమింతయుఁ జూడ లేదు గా
వున మునియున్ స్వకీయతనువుం బెడబాయుత మంచుఁ బల్కి య
జ్జనపతి మేనుపొ త్తెడలె సభ్యులు విస్మయవార్థిఁ దేలఁగన్.

204


వ.

నిమిశాపంబున వసిష్ఠునితేజంబును మిత్రావరుణులతేజంబునం బ్రవేశించె
ఊర్వశీదర్శనంబున మిత్రావరుణులకు రేతఃపాతంబైన నందువలన వశి
ష్ఠుండు దేహాంతరంబు నొందె. నిమిశరీరంబును నతిమనోహరతైలగంధాది
సంస్క్రియమాణంబై క్లేదాదిదోషంబుల నొందక యుండె. అంత యజ్ఞ
సమాప్తి యగుచునుండ యాగభాగంబులకు వచ్చిన దేవతలం జూచి ఋత్విజు
లి ట్లనిరి.

205


గీ.

మాననీయాత్ముఁడగు యజమానునకును, వర మొనంగుఁ డటన్న దేవతలు వేఁడు
మనిన నిమి వారితోడ నిట్లనియె వినయ, సంభృతత్వంబు దీపింప శ్లక్ష్ణఫణితి.

206


సీ.

కఠినకీకససముత్కరనిరంతరకీర్ణ ముల్లసద్బహుసిరావేల్లితంబు
సాంద్రరోమపరీతచటులచర్మపినద్ధ, ముద్వేలమాంసనిషద్వరంబు
నవవిధద్వారసంతతగళద్ధుర్గంధ, మస్రపూయక్రిమివ్యాచితంబు
మూత్రపురీషసంపూర్ణకుతూప్రాయ, మామయాధిరుజాశుగాకరంబు


గీ.

పాతకము దేహ మిది పాయుభాగ్య మబ్బె, నొల్ల నిఁక దానితోడును నే నుండఁగోరి
నాఁడ జంతుతతులలోచనములయందు, నీవరం బిండు నాకు నభీష్టకరము.

207


వ.

అనిన దేవతలును నతఁడు కోరిన వరం బిచ్చిరి. నిమియును సకలప్రాణులలో
చనంబులయందు వసించె. అదిమొదలు ప్రాణులకు న్మేషనిమేషంబులు
గలిగె. అంత నరాజకభీరువులై యూజకు లపుత్రకుండగు నిమిశరీరం బరణి
యందుఁ బెట్టి మథించిన నందు కుమారుండు గలిగి జననంబు కతంబున జన
కుండు, మథనంబు కతంబున మిథియుఁ, దండ్రి విదేహుం డగుట కతంబున వైదే
హుండు ననునామంబులఁ బరఁగె. ఆజనకునకు నుదావసుండును, నతనికి నంది
వర్ధనుఁడు, నతనికి సుకేతుండు, నతనికి దేవరాతుండు, నతనికి బృహదుక్థుండు,
నతనికి మహావీర్యుండు, నతనికి సుధృతి, నతనికి దృష్టకేతుండు, నతనికి హార్య
శ్వుండు, నతనికి మనుండు, నతనికిఁ బ్రతికుండు, నతనికిఁ గృతరథుండు, నతనికి
దేవమీఢుండు, నతనికి విబుధుండు, నతనికి మహాధృతి, యతనికిఁ గృతరాతుం
డు, నతనికి మహారోముండు, నతనికి స్వర్ణరోముండు, నతనికి హ్రస్వరోముండు,

నతనికి సీరధ్వజుండును గలిగె. అతండు పుత్రార్థంబు యజనభూమి దున్ను
పపుడు సీరసీతాముఖంబునఁ గుమారికయైన సీత జనించె. ఆసీరధ్వజునకు
సాంకాశ్యాధిపతియైన కుశధ్వజుండు కలిగె. నతనికి భానుమంతుండు నతనికి
శతద్యుమ్నుండు నతనికి శుచి నతనికి నూర్జుండు నతనికి శతద్ధ్వజుండు నతనికి
కృతి యతనికి నంజనుండు నతనికి గురుచిత్తును నతని కరిష్టనేమి యతనికి శ్రుతా
యువు నతనికి సుపార్శ్వుండు నతనికి స్వజయుండు నతనికి క్షేమాని యతనికి
ననేనుండు నతనికి భౌమిరథుండు నతనికి సత్యరథుండు యతనికి నుపగుండు
నతనికి స్వాగతుండు నతనికి స్వానందుఁడు నతనికి సువర్చుఁడు నతనకి సుపా
ర్శ్వుఁడు నతనికి సుభాషుఁడు నతనికి సుశ్రుతుండు నతనికి జయుండు నతనికి
విజయుండు నతనికి ఋతుండు నతనికి సునయుండు నతనికి పీతహవ్యుండు నతనికి
ధృతి యతనికి బహుళాశ్వుండు నతనికిఁ గృతి యాకృతియందు జనకవంశంబు
నిలిచె. వీరు మైథిలులు. ఆత్మవిద్యాప్రవీణులైన భూపాలు రని చెప్పిన శ్రీ
పరాశరునకు మైత్రేయుం డిట్లనియె.

208


చ.

వరగుణశాలులైన రవివంశనృపాలురఁ జెప్పి మన్మనో
దురితము బాఱఁదోలి పరితోష మొనర్చితి రింక సద్గుణా
కరమగుచంద్రవంశ మెఱుఁగ న్మదిఁ గోరెదఁ జెప్పుమయ్య త
ద్గురుతరవంశవారినిధిఁ దోఁచెఁ గదా బహురాజరత్నముల్.

209


వ.

అని యడిగిన శిష్యున కాచార్యుం డిట్లనియె.

210


గీ.

మునికులోత్తంస పరఁగ సోముని పవిత్ర, వంశమందు జనించిరి వరగుణాఢ్యు
లైననహుషయయాత్యర్జునాదిరాజు, లిందుకులభూషణములై సమిద్ధమహిమ.

211


వ.

అట్టి చంద్రవంశంబు చెప్పెద వినుము. అఖిలజగత్స్రష్టయై భగవంతుఁ
డైన శ్రీమన్నారాయణుని నాభిసరోజంబునం దబ్జయోనియై బ్రహ్మ పుట్టె,
బ్రహ్మకు నత్రి యత్రికి సోముండు కలిగె. అశేషౌషధీద్విజనక్షత్రాధిపత్యం
బునకుం జతురాననుం డతని నభిషిక్తునిం జేసె. అంత.

212


గీ.

అనుపమితవైభవస్ఫూర్తి యాధిపత్య, గర్వసంపూర్తియును గూడఁగాఁ బ్రకాశ
విశదసత్కీర్తి జగమెల్ల వెలయఁజేసె, నంబుభవసూతి రాజసూయాధ్వరంబు.

213


చ.

అపరిమితాధిరాజ్యవిభవాతిశయంబున రాజసూయయా
గపరమకర్మకృత్త్వమున గంజవిరోధి మహావిరోధియై
విపులమదాతిరేకమున వేలుపుటొజ్జయనగుటాలి బ్రా
యపుజవరాలిఁ దారయను నంబుజలోచనఁ దెచ్చె నింటికిన్.

214

గీ.

బలిమి నాంగీరసునిభార్యఁ బట్టి, తెచ్చి, నగరిలో వేసికొని నిరంతరము మదన
కేళిఁ దేలుచు శశి యుండె జాలి పొంది, గురుఁడు త న్నెంత వేఁడినఁ గొమ్మ నీక.

215


క.

మోహితుఁడై హిమధాముఁడు, ద్రోహ మనక యాచరించెఁ దోడ్తో గురుప
త్నీహరణము "భువి కామాం, ధోహి న పశ్యతి"యటన్న నొడువు నిజము గాన్.

216


క.

రాజంట చక్కనివాఁడఁట, రాజస మది యౌవనంపురహియఁట విభవ
శ్రీజయగర్వోద్ధతుడఁట, పూజితులకు నిజనివాసములు గలుగునోకో.

217


సీ.

కాలకంఠకఠోరకంఠకోటరస ము, ద్భటవిషానలకీల ప్రాపుచూపు
దుర్వారతరమహాగర్వసర్వస్వని, ర్దిష్టదుష్టవిచేష్ట తేటమాట
కుహనాపరంపరా గహనావిషహ్యసాం, ద్రీభవద్దుర్మాయదినుసు మనసు
బహుతరద్రోహసంభవదఘౌఘప్రభా, గణనీయనిర్ణయాప్తికడక నడక


గీ.

రాజు లేయూరు పూజ్యవర్గప్రసన్న, దృష్టి యేయూరు తిమిరౌఘతేజములకుఁ
గలుగదు కదా సమానాధికరణలాభ, మధిపతులపొందు భుజగనాయకులవిందు.

218


వ.

అది యట్లుండె.

219


చ.

అంటినయార్తిచేఁ బొగిలి యాంగిరసుం డతిదీనవృత్తి నిం
టింటికిఁ బోయి నైజకథయెల్లను మెల్లనఁ జెప్పి చెప్పి క్రీం
గంట జలంబు దెచ్చుకొనఁ గంజభవాదిసురల్ హిమాంశువె
న్వెంటనె పోయి చెప్పిన గణింపఁడ తద్వచనేరితార్థముల్.

220


వ.

వినకున్నం గోపించి.

221


సీ.

పవి ఝుళిపించె జంభసురారిదమనుండు, కెరలి కీలలు చూపెఁ గృష్ణవర్త్మ
కోరమీసలు నులిగొల్పె దండధరుండు, తళుకుఁగోరలు దీఁపె దనుజవిభుఁడు
వలిత్రాటిమెలి విప్పె జలరాశినాథుండు, మృగిఁబల్ల కట్టె సమీరణుండు
గదబెట్టు ద్రిప్పె వేడ్క మనుష్యధరుండు శూలంబు సారించెఁ గాలగళుఁడు


గీ.

సురలు పెనుబొబ్బ లిడిరి యక్షులు ధనుర్గు, ణధ్వనులు చేసి రఖిలగంధర్వగరుడ
వరులు పరవళ్లు ద్రొక్కిరి వారిజారి, దలఁచి కయ్యంబునకుఁ గాలు ద్రవ్వుకొనఁగ.

222


వ.

ఇట్లు కడంగిన నింద్రాదులం గూర్చుకొని బృహస్పతి చంద్రునిపై నడిచె. నంత.

223


గీ.

అంగిరునివద్ద రుద్రుఁ డభ్యస్తసకల, విద్యుఁడైనకతంబున విప్రవర్య
యాంగిరసునకు సాహాయ్య మాచరించెఁ, బ్రమథగణములు దాను సంభ్రమము వెలయ.

224

వ.

బృహస్పతిమీఁది ద్వేషంబున శుక్రుండు చని యింద్రుని పార్క్ష్ణి
గ్రాహుండై నిలిచె; శక్రారులై జంభకుంభపురోగములైన దైత్యవీరులు
చంద్రునకుఁ దోడై సురలపై సమరోద్యమంబు చూపిరి. ఇట్లు తారాపథ
మునఁ దారకై తారకామయంబైన సంగ్రామంబు ప్రవర్తిల్లె. అందు దైత్య
దానవులు దేవగణంబులమీఁద దివ్యాస్త్రంబులు ప్రయోగించి రంత సకల
జగన్నిర్మాణచతురుండైన చతురాననుం డేతెంచి సొచ్చి రుద్రపురోగము
లైన దేవతలను జంభకుంభాదులైన దైత్యులను సమ్మతించి సన్నాహంబు
లుడిపి సుధాకరుని బోధించి గురునకుం దార నిప్పించిన నవప్రసవయై యున్న
తారం జూచి గురుం డిట్లనియె.

225


గీ.

అంబురుహనేత్ర నాభార్య వకట యొరుని, కొడుకు నీగర్భమునఁ బెట్టుకొనఁగవలెనె
విడువు మన నట్ల చేసె నప్పడఁతి యప్పు డనఘ సతి దేవతామణి యౌటఁ జేసి.

226


వ.

ఇట్లు గర్భం బొక్కయీషికాస్తంబంబుపై విడిచె. ఆ క్షణంబున సకలజన
మనోహరుండైన యతనిసౌందర్యసౌకుమార్యంబులఁ జూచి చంద్రబృహ
స్పతులు సాభిలాషు లౌట యెఱింగి దేవగణంబులు తారతో నిట్లనియె.

227


ఉ.

నిక్కము చెప్పు మంబురుహనేత్ర యపత్రప యేల నీకు నీ
చక్కనిచొక్కపుంగొడుకుఁ జందురుసంగతిఁ గంటివో! కడు
న్మక్కువ మున్ను జీవునిసమాగమనంబునఁ గంటివో మదిన్
జిక్కిన సంశయం బుడుగఁజేయుము పాయుము సాధ్వసక్రియన్.

228


క.

అని సుర లడిగిన నయ్యం, గన లజ్జాసాధ్వనములఁ గడచెప్పకయుం
డిన తనయుఁడు కుపితుండై, జనయిత్రిం బలికె నధికసంరంభమునన్.

229


గీ.

తరిమి యెం తడిగినను మాతండ్రిపేరు, చెప్ప వటుగాన నిన్ను శిక్షింపవలయు
శాప మిచ్చెదఁ గొను మనిశమును మందబుద్ధివై యుందుగాక యీపూన్కి తరిగి.

230


వ.

ఇట్లు శపియించెను నంత.

231


ఉ.

తా నపు డబ్జసూతి వనితామణి నల్లన చేరఁ బిల్చి యో
మానిని తప్పు లేదు వినమా కనమా యిటువంటికృత్యముల్
పూనిక మీఱ నీతలనె పుట్టెనె పుట్టినమాట చెప్పుమెం
దైనను బుత్రజన్మకథ లారయ తల్లియధీనలౌఁ గదా.

232


వ.

అని బుజ్జగించి యడిగిన.

233

గీ.

తార కేల్దమ్మిదోయి మస్తకముఁ జేర్చి, మోము వాంచి పాదాంగుష్ఠమున ధరిత్రి
వ్రాయుచు విధాతఁ బలికె నల్పంపుఫణితి, నలినవైరికి గంటి నందనుని ననుచు.

234


వ.

ఇట్లు తార తేరనాడిన నానందాశ్రుధారాసారంబు జార నుదారపులకావారంబు
తోరంబుగా శృంగారంబు దొంగలించినభంగి నంగంబులఁ బొంగ నఖండహాస
సుధామండలఖండంబులు గండమండలంబులం దాండవింప సుధాకరుండు
కుమారు నాలింగనంబు చేసి సాధువాదంబుల నాదరించి ప్రాజ్ఞుండ వైతివని
బుధుండను పేరు పెట్టె. ఆబుధుం డిలాకన్యయందుఁ బురూరవుండను పుత్రునిం
గనియె. అతండు చక్రవర్తి యయ్యె.

235


ఉ.

దానపరుండు యజ్వ విశదస్థిరకీర్తి ఘనుండు సత్యవా
క్యానుపమానుఁ డాహవవిహారవినోది మనోజ్ఞరూపరే
ఖానవసూనకార్ముకుఁ డఖండవిభూతి పురూరవుండు తే
జోనిధి యేలెఁ బ్రాభవము చూపుచు నేపున నెల్లదీవులన్.

236


సీ.

ధరణిసురేంద్ర మిత్రావరుణుల శాప, మున నూర్వశీకాంత మనుజలోక
మున వసింపఁగఁ గోరి భూమికి వచ్చి పు, రూరవు నధికసురూపుఁ జూచి
కామించె నతఁడును గమనీయరూపలా, వణ్యవతి యగునవ్వనితవలన
మదనాతురుం డయ్యె నుదితమనోజవ్య, ధోపేతచిత్తులై యొండుపనులు


గీ.

మానియుండి రంత మనుజాధిపుఁడు దేవ, వనితఁ జూచి పలికె మనసిజాస్త్ర
విధ్ధతనుఁడ నైతి వెలఁది నన్బరిణయం, బై మనోజకేళి నాదరింపు.

237


చ.

అనుటయు హావభావలలితాకృతియై సురకాంత వల్కె నో
జననుత సత్యశీల బలసంయుత, యీసమయంబు చేసినన్
నిను వరియించుదాన నన నిక్కము తత్సమయంబు చెప్పు మీ
వన వనజాక్షి యిట్లనియె నాదృతి నాధరణీతలేశుతోన్.

238


గీ.

వసుమతీశ్వర బిడ్డలవలెనె పెంచు, కొంటి నీమేషముల రెంటి నంటి వాయ
నింక నాశయనము చేర్వ నెపుడు నుండ, నీయవలయును వీని నా కిష్ట మిట్లు.

239


క.

విను నగ్నత్వముతో నా, కనుఁగవకుం గానఁబడుట గా దీవు ఘృతా
శన మొనరించుచునుండుదు, ననఘా నీయొద్దఁ జేయు మాసమయంబున్.

240


వ.

ఇట్టిసమయంబు చేసిన నీకు భార్య నగుదు, సమయభంగం బయినం బోవుదాన
ననిన నొడంబడి యారాజు రాజవదనయుం దానుం గూడి.

241


సీ.

అలకాపురాదిదివ్యపురీమణీహేమ, కమనీయతుంగసౌధములయందుఁ
జైత్రరథాదిరాజన్నిర్జరవిహార, శృంగారవనతరుశ్రేణులందు

మానసాదిసరోవరానూనతరదర, న్నవపుండరీకషండములయందు
హిమనదాదిమహేంద్రసముదారశృంగశుం, భఝ్ఝురీకుంజగర్భములయందు


గీ.

బహువిధవిచిత్రసురతసంబంధబంధ, బంధురత్వంబు దీపింపఁ బార్థివుండు
నూర్వశియుఁ గ్రీడ సలిపి రొండొరులమీఁది, ప్రేమ దినదిననూత్నమై వృద్ధిఁ బొంద.

242


వ.

ఇవ్విధంబున ననేకవర్షంబు లూర్వశి యయ్యుర్వీశ్వరునితో సంభోగక్రీడలం
దగిలి స్వర్లోకసుఖంబులు మఱచియుండె.

243


గీ.

సురపురీభోగ్యసౌభాగ్యగరిమకెల్ల, నూర్వశీకాంత లేకున్న నొప్పు దఱిగె
నపుడు సమయజ్ఞుఁ డగుట తా నరుగుదెంచి, ఠీవి గంధర్వవిభుఁడు విశ్వావసుండు.

244


వ.

ఊర్వశీపురూరవులసమయం బెఱింగినవాఁడై, విశ్వావసు డొక్కనాటినిశా
సమయంబున వచ్చి యూర్వశిశయనసమీపంబున నున్నమేషంబులలో నొక్క
దానిం బట్టుకొని యాకాశంబునకుం బోయిన దానిశబ్దంబు విని యూర్వశి
యిట్లనియె.

245


గీ.

మోహమునఁ బెంచుకొన్న నాముద్దుకొడుకు, నకట యెవ్వఁడు గొనిపోయె ననద నైతి
నరసి యెవ్వరు విడిపించెదరు మదీయ, దీనదశ మాంచియిప్పు డుద్వృత్తి మెఱసి.

246


వ.

అని పలుకు నూర్వశివచనంబులు విని రాజు తద్దర్శనభయంబునం బోకయున్న
గంధర్వులు రెండవపోటేటినిం బట్టుకొని పోయిన దానికూఁత విని యూర్వశి
యిట్లనియె.

247


చ.

అకట యనాథ నైతిఁ బురుషార్థము చేపడి శౌర్యహీనుఁ డీ
పురుషుఁ డదెట్లు నాకొడుకుగుఱ్ఱల పట్టుకపోవుచున్న మో
షకుని వధించి తేఁగలఁడె చాలనవజ్ఞ ఘటిల్లె నాకు నీ
వికలత వాప నేరి నిఁక వేడుదు నేఁడు దురంతదుఃఖినై.

248


వ.

ఇ ట్లార్తయై పలుకుచున్న యన్నలినానన పలుకులు విని కోపించి కించిదరుణాయ
మాననేత్రాంచలుండై రాజపంచాననుం డంధకారంబు కావున సుధాంధః
కాంత తన్నుం జూడదని తలంచి దిగంబరత్వంబున లేచి ఖడ్గం బంకించి చోరులకు
నాముందర నెక్కిడికిం బోవచ్చునని వెన్నుదగిలిన గంధర్వులు మాయావిద్యు
త్పరంపర యుత్పాదించిన నావెలుఁగున నతనినగ్నత్వంబు చూచి యూర్వశి
చనియె. రాజును గంధర్వులం దోలి యురణకద్వయంబుం గొనివచ్చి శయన
తలంబున నూర్వశి లేకుండుట చూచి నగ్నభావంబున నున్మత్తరూపకుండై
యయ్యంగన వెదకుచు నెల్లెడల పరిభ్రమించుచు.

249

ఉ.

క్షత్రియవర్యుఁ డీగతి దిశ ల్వరికించుచుఁ బోయి యాకురు
క్షేత్రమునందుఁ బద్మసరసీతటిఁ గాంచె మనోజ్ఞదేవకాం
తాత్రితయంబుతో మెలఁగు తామరసావన నూర్వశిన్ సుమా
స్త్రత్రుటితావిజేయవిలసత్ప్రవిజాగ్రదుదగ్రధైర్యుఁడై.

250


ఉ.

చూచి నృపాలుఁ డోమృగకిశోరవిలోచన! జాయ వీవు నా
కీచటులాటవీస్థలుల నేల చరించెదు రమ్మటన్న వ్యా
కోచపయోజపత్రములఁ గొంకఁగజేయుకటాక్షవీక్ష నా
రాచతనంపుబూమెవలరాయనిఁ జూచి లతాంగి యిట్లనున్.

251


వ.

మహారాజా యీయవివేకచేష్టితంబు చాలింపుము, ఇప్పు డేను గర్భిణియై
యున్నదాన, ఒక్క సంవత్సరంబునకు మగిడిరమ్ము. కుమారుండు జనియింపం
గలండు, నీ కిత్తు నొక్కనాఁడు నీతోడం గూడి యుండెదనని పొమ్మన్న హర్షించి
నిజపురంబునకుం జనియె నంత.

252


గీ.

అచ్చరలు విస్మయం బంది యడుగ, నూర్వశీలతాతన్వి చెప్పెఁ దెచ్చిత్రచరిత
మౌర యీరాజుఁ గూడుభాగ్యంబు మాకుఁ, గలుగునా యని యాత్మఁ దలంచి రపుడు.

253


వ.

సంవత్సరంబు పూర్ణంబైన పురూరవుం డచ్చటికిం బోయిన నూర్వశియు నాయు
ర్నామధేయుం గుమారు నాతని కిచ్చి యారాత్రి యతనిం గూడియుండి పంచ
పుత్రోత్పత్తినిమిత్తంబైన గర్భంబు దాల్చి యారాజుతో నిట్లనియె, అస్మ
త్ప్రీతికరులై గంధర్వులు నీకు వరం బీయ వచ్చిరి కోరు మనిన గంధర్వులం జూచి
పురూరవుం డిట్లనియె.

254


గీ.

అఖిలరిపుకోటి గెలిచితి నమితకోశ, బంధుబలసంయుతుండ నెప్పట్టునందుఁ
గొదవ నా కింతయును లేదు మదిఁ దగిలిన, దీలతాతన్వియందు నభీష్టలీల.

255


వ.

కావున నీయూర్వశిసాయుజ్యంబు గలుగు వరం బిం డనిన గంధర్వు లతనికి
నగ్నిస్థాలి యొసంగి యిట్లనిరి. ఆమ్నాయానుసారంబున నగ్ని౦ద్రిధావిభ
జించి యూర్వశిసాలోక్యంబు నుద్దేశించి యజింపుము, నీయభిలాషంబు
సాయుజ్యంబు సఫలం బగు ననిన నగ్నిస్థాలిఁ గొని చనుచు నిట్లని చింతించె.

256


క.

ఆలలన లేనియగ్ని, స్థాలి యి దేమిటికి డించి చనియెద నిచటన్
హాలి పురంబున కని చని, యాలోన నిశీధసమయ మరిగినపిదపన్.

257


వ.

నిద్ర లేక యిట్లని తలపోయు. అక్కటా! యూర్వశిసాలోక్యార్థంబు గం
ధర్వు లిచ్చిన యగ్నిస్థాలి యరణ్యంబునం బెట్టి వచ్చితిఁ బోయి తెచ్చెదనని
లేచి వచ్చి యచ్చట నగ్నిస్థాలిఁ గానక "శమీగర్భంబైన యశ్వత్థం బయ్యె.

ఇదియే పురంబునకుం గొనిపోయి యరణి చేసి మథించి యిందు నుత్పన్నంబైన
యగ్ని నుపాసించెద"నని పురంబునకుం బోయి యరణినిర్మాణంబునకై గాయ
త్రిని బఠించిన గాయత్ర్యక్షరసంఖ్యాంగుళీప్రమాణంబులైన యరణి
త్రయంబైన నందు నగ్నిత్రయంబు మథియించి యూర్వశిసాలోక్యంబు
గోరి యామ్నాయానుసారియై వేల్చి గంధర్వలోకంబు నొంది యూర్వశిం
గూడి సుఖంబుండె. అగ్ని యొక్కం డయ్యును, నీమన్వంతరంబునఁ బురూరవునిచే
ద్రివిధంబై వికల్పింపంబడియెనని శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

258


క.

వరగురుఁడైన పురూరవు, చరితం బిది చెప్పితిం బ్రసన్నహృదయతా
స్ఫురితుఁడవై తద్వంశము, పరిపాటిని వినుము నిగమభవ్యాచారా.

259


వ.

పురూరవున కాయువు, ధీమంతుండు, నమావసుండు, విశ్వావసుండు, శ్రుతా
యువు, శతాయువు, నయుతాయువు నను నార్వురు పుత్రులు గలిగి రందు
నమావసునకు భీముండు, భీమునకుఁ గాంచనుండు, కాంచనునకు సుహో
త్రుండు, నతనికి జహ్నుండు పుట్టె.

260


సీ.

నుతకీర్తియైనజహ్నుఁడు పరస్మాత్పరు యజ్ఞపూరుషు కమలాధినాథుఁ
గుఱిచి యాగము చేయుతఱి రంగదుత్తుంగభంగపరంపరాభంగ యగుచు
గంగ తన్మఘవాటి గలయముంచినఁ జూచి కోపించి యారాజకుంజరుండు
పరమయోగిసమాధిపరతఁ దద్గంగాజలం బెల్లఁ ద్రావ నుల్లమునఁ దలఁకి


గీ.

మునులు చనుదెంచి యారాజముఖ్యు నధిక, వినయమున వేఁడి గంగ నీతనయ దీని
విడువుమని సన్నుతించిన విడిచె నృపతి, యదిమొదలు గంగ జాహ్నవి యనఁగఁ బరఁగె.

261


వ.

ఆజహ్నునకు సుమంతుండు, నతనికి నజకుండు, నతనికి బలాకాశ్వుండు, నతనికిఁ
గుశుండు, కుశునకుఁ గుశాంబకుశనాభాధూర్తరజోవసువులను నలుగురు
పుత్రులు గలిగిరి. అందుఁ గుశాంబుండు.

262


చ.

శతమఖతుల్యుఁడైన సుతుఁ జయ్యనఁ గాంచెద నంచుఁ గోరియున్
వ్రత మటు సేయ నింద్రుఁడు ధరావరుఁ జేరఁగవచ్చి నేన నీ
సతికిఁ దనూజభావమున జన్మము నొందెద నంచుఁ బోయె న
క్షతభుజవీర్యశౌర్యనిధి గాధి జనించెఁ గుశాంబుఁ డుబ్బఁగన్.

263


వ.

కుశాంబపుత్రుండైన గాధికి సత్యవతియను కన్యక పుట్టె, భృగువంశోత్త
రుండగు రుచికుండు వచ్చి యాసత్యవతి నడిగిన గాధి కోపించి.

264


గీ.

వృద్ధుఁ డీబ్రాహ్మణుండు సమృద్ధరూప, శీలసౌభాగ్యయైన యీచిగురుఁబోఁడి
నెవ్విధంబున నడిగె నె ట్లిచ్చువార, మైన నొకనేర్పు కలదని యతనిఁ జూచి.

265

వ.

ఒక్కచెవి నలుపును, శరీరంబెల్ల తెల్లనయు, వాయువేగంబునుం గల యశ్వ
సహస్రం బిక్కన్నియకుంకువఁబెట్టి పరిగ్రహింపు మనిన నమ్మునియును వరుణు
నడిగి యశ్వతీర్థసముత్పన్నంబగు తాదృశతురగసహస్రంబు తెచ్చి యారా
జున కిచ్చి సత్యవతినిం బరిణయంబై యక్కాంతకు నపత్యంబుఁ గోరి చరు
నిర్మాణంబు చేసిన సత్యవతి తమతల్లికిఁ బుత్రుండు కావలెనని పతిం బ్రార్థిం
చినఁ దత్ప్రార్థితుండై క్షత్రియవరపుత్త్రోత్పత్తికారణంబైన యొక్క
చరువు నిర్మించి సత్యవతి కిట్లనియె.

266


గీ.

బ్రహ్మతేజోఘనుండైన పట్టి నీకుఁ, గలుగు నిందుల నిందుల నలఘువీర్య
ధనుఁడు క్షత్రియుఁ డుదయి౦చుఁ ద్వత్సవిత్రి, కెలమితో నుపయోగింపుఁ డిపుడు మీరు.

267


వ.

అని చెప్పి వనంబునకుఁ బోయినఁ జరూపయోగకాలంబున సత్యవతి జూచి
తల్లి యిట్లనియె.

268


గీ.

పుత్త్రి విను మెవ్వరైనను బుత్త్రుఁ డధిక, గుణునిఁగోరుట యెందు నిక్కువముసుమ్ము
భార్యతమ్మునిగుణములు పాటిగొనరు, మునియు నిజపుత్త్రు ఘనునిఁగాఁ గనకపోఁడు.

269


వ.

బ్రాహ్మణునకు బలవీర్యసంపద లేల? క్షత్రియునకైన సర్వభూమండలం
బును నేలుఁ గావున నీచరువు నా కిచ్చి నాచరువు నీవు గైకొనుమనిన నట్లకాక
యని సత్యవతి తనచరువు తల్లి కిచ్చి తల్లిచరువు తా నుపయోగించె. అనం
తరంబ వనంబుననుండి చనుదెంచి రుచికుండు సత్యవతిం జూచి యిట్లనియె.

270


ఉ.

పాతకురాల యేమి తడఁబా టొనరించితి వత్యుదగ్రరౌ
ద్రాతుల మయ్యె నీయొడల నర్హపథంబున మాతృభావవి
స్ఫీతచరూపయోగ మపభీతి నొనర్చితి వో నృపాలకా
ర్హాతికఠోరభీకరగుణాకర మాచరు వెన్ని చూచినన్.

271


క.

అనఘంబు బ్రహ్మతేజో, భినుతము నీచరువు దానిఁ జెడచేఁత భవ
జ్జననికి నిచ్చితి వకటా! కనఁగలవె మహోగ్రదుష్టకర్మునిఁ గొడుకున్.

272


చ.

అన విని కంపమానహృదయాంబుజయై లలితాంగి భర్తప
ద్వనజయుగంబుఁ బట్టుకొని వల్లభ యే నపరాధినిన్ ననున్
వినుతదయావలోకననవీనసుధాప్లుతి నాదరింపు నం
దను గననోప నిష్ఠురగుణప్రవణప్రతిభాసమేతునిన్.

273


వ.

పుత్రుండు క్రూరుం డౌట కోప నవ్విధంబు వాఁడు మనుమండుగా ననుగ్ర
హింపవలయునని ప్రార్థించిన నట్ల యనుగ్రహించె, ఆసత్యవతియు జమ
దగ్నిం గనియె, సత్యవతితల్లియు విశ్వామిత్రునిం గనియె, సత్యవతియుఁ గౌశిక

యనునది యయ్యె, జమదగ్నియు నిక్ష్వాకువంశోద్భవుండైన రేణుకుని పుత్రిక
యైన రేణుక నుద్వాహంబై యక్కాంతయందు భగవంతుండైన శ్రీనారా
యణునియంశంబైన పరశురామునిం గనియె, వినుము.

274


సీ.

క్షత్రియసానుమత్సమితి కెవ్వనికోప, మదయనిష్ఠురఘోరభిదురధార
రాజన్యరాజీవరాజి కెవ్వనికనుం, గొనచూపు సమదదిక్కుంభికరము
బాహూద్భవాటవీపటలి కెవ్వనినట, ద్భృకుటి దవానలస్ఫురితకీల
పార్ధివాంబోధిసంపదల కెవ్వనియట్ట, హాసరేఖ యగస్త్యహస్తచుళుక


గీ.

మవనినాథాంధతమససంహతికి నెవ్వ, నిమహితోద్దండభుజదండనిహితపరశు
దీప్తియుదయాద్రిశిఖరప్రదీపితార్క, బింబ మారాముఁ డాహవభీముఁ డొప్పు.

275


వ.

భార్గవుండైన శునశ్శేఫుండు విశ్వామిత్రునకు దేవతలచేత నియ్యంబడి దేవ
రాతనామంబున విశ్వామిత్రునకుఁ బుత్రుం డయ్యె మఱియు విశ్వామిత్రునకు
మధుచ్ఛంద, ధనంజయ, కృతదే, వాష్టక, కచ్ఛప, హరితాఖ్యులు పుత్త్రులు
కలిగిరి. వారలకు ననేకంబులైన కౌశికగోత్రంబుల ఋష్యంతరంబులయందు
వైవాహ్యంబులు గలిగెనని చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

276


గీ.

ప్రచురవిజ్ఞాన విను పురూరవునియగ్ర, నందనుం డాయు వతఁడు కన్యాలలామ
రాహుపుత్రికఁ బెండ్లియై ప్రకటబలులఁ, బుత్రకులఁ గాంచె నేవురఁ బుణ్యమతుల.

277


వ.

వారలు నహుష, క్షత్రవృద్ధ, రంభ, రజ్యసేనులను నైదుగురు. అందు క్షత్ర
వృద్ధునకు సుహోత్రుండును, సుహోత్రునకుఁ గాశ్యప కాశ గృత్సమదులను
మువ్వురుపుత్త్రులు గలిగిరి. అందు గృత్సమదునకు శౌనకుం డనం గలిగి చాతుర్వర్ణ్య
ప్రవర్తకుం డయ్యె. కాశ్యపునకుఁ గాశేయుండు నతనికి రాష్ట్రుండు కలిగె. రాష్ట్రు
నకు దీర్ఘతపుండు, దీర్ఘతపునకు ధన్వంతరి కలిగె. అతండు శ్రీనారాయణునిచేత
వరంబు వడసి కాశీరాజగోత్రపతియై యెనిమిదిప్రకారంబుల నాయుర్వేదంబు
నిర్మించె. ఆధన్వంతరికిఁ గేతుమంతుండు, కేతుమంతునికి భీమరథుండు, భీమరథు
నకు దివోదాసుండు, దివోదాసునకుఁ బ్రతర్దనుండు పుట్టె. ఆతండు భద్రశ్రేణ్య
వంశవినాశకారి యగుట శత్రుజయంబు కారణంబుగా, శత్రుజి త్తనంబరఁగె;
ఆతనికి వత్సుండు పుట్టె. ఆతండు సత్యపరుం డగుట ఋతధ్వజుం డనంబరంగె. కువల
యం బనునశ్వంబు గలుగుటం జేసి కువలయాశ్వుం డనంబరఁగె. అట్టివత్సునకు
నలర్కుండు గలిగె, నయ్యలర్కుం డఱువదాఱువేలవత్సరంబులు మనోజ్ఞ
యౌవనుండై మేదినీభాగం బనుభవించె. నయ్యలర్కునకు సన్నతి, సన్నతికి సు
నీధుఁడు, సునీధునకు సుకేతుండు, సుకేతునకు ధర్మకేతుండు, ధర్మకేతునకు సత్య
కేతుండు, సత్యకేతునకు విభుండు, విభునకు సువిభుండు, నతనికి సుకుమారుండు,

సుకుమారునకు దృష్టకేతుండు, దృష్టకేతునకు వీతిహోత్రుండు, నతనికి భార్గుండు,
భార్గునకు భార్గభూమి పుట్టె. అతనివలనఁ జాతుర్వర్ణ్యంబునుం బ్రవర్తించె.
వీరు కాశ్యపరాజు లింక రజిసంతతి వినుమని శ్రీపరాశరుండు మైత్రేయున
కిట్లనియె.

278


క.

రజికిఁ దనూభవు లాహవ, విజయులు సత్కీర్తిధనులు విఖ్యాతమహా
భుజవీర్యధుర్యు లేనూ, ఱజితులు గల్గిరి జగన్ముదావహు లగుచున్.

279


వ.

అక్కాలంబున దేవాసురులు పరస్పరజిగీషువులై యుద్ధంబునకు నుపక్రమించు
వారై చతుర్ముఖుపాలికిం బోయి మ్రొక్కి యిట్లనిరి.

280


క.

సరసిజసంభవ దేవా, సురులము మే మాహవమ్ము చోద్యభుజావి
స్ఫురణమునఁ జేయఁదలఁచితి, మిరువాగున విజయలక్ష్మి యెవ్వరిదొక్కో.

281


వ.

అని యడిగిన దేవాసురులకుఁ జతురాననుం డిట్లనియె.

282


క.

రజి యెవ్వరికిం దోడై, భుజవిస్ఫురణంబు చూపుఁ బోర న్వారిన్
విజయశ్రీ చేరు ననన్, రజనీచరవరులు చనిరి రజికడకు వడిన్.

283


వ.

ఇట్లు చని తమకు సహాయంబు కోరిన నసురలకు రజి యిట్లనియె.

284


ఉ.

మీకు సహాయమై యతిసమృద్ధభుజాబలలీల దేవతా
నీకముతోడఁ బోరెద నని న్నను నింద్రునిఁ జేసి కొల్వుఁ డెం
తేకుతుకాప్తి మీర లన నిట్లని రింద్రుఁడు మాకు నాహవా
స్తోకభుజావలేపబలధుర్యుఁ డవార్యుఁడు శౌర్యలీలలన్.

285


వ.

ప్రహ్లాదుం డుండ ని న్నింద్రుఁ జేయనొల్లము. తదర్ధంబ యుద్ధంబును నని యసురులు
చనిన సురలు రజికడకు వచ్చి సహాయంబు వేఁడిన రజి దేవతల కిట్లనియె.

286


గీ.

అసురతతుల గెల్తు నాహవంబున నను, నింద్రుఁ జేసి కొలువుఁ డీర లనిన
యుక్త మనుచు దాని కొప్పి తో కొనిపోవ, రజియుఁ గలన దనుజరాజి నడచె.

287


ఉ.

అంత శచీవిభుండు వినయంబున నన్నరనాథుఁ బాదపీ
ఠాంతికభూమిఁ జేరి చరణాంబుజముల్ తల సోక మ్రొక్కి భూ
కాంతభయంబు మాన్పితివి గావునఁ దండ్రివి గావె నీవు నా
కెం తనవచ్చు నీమహిమ యిన్నిజగంబులుపుత్త్రుఁ డేలినన్.

288


వ.

అని చాతుర్యపురస్సరంబుగాఁ బ్రార్ధించిన రజియు మందస్మితవదనారవిం
దుండై యట్లకాక యనుచు నిజపురంబునకు వచ్చి కొంతకాలంబునకుఁ బరలోక
గతుండైన యనంతరం బారజిపుత్రులు రాజ్యంబు చేయుచున్నంత.

289

ఉ.

నారదుఁ డొక్కనాఁడు నరనాథతనూభవు లున్నచోటికిన్
గౌరవ మొప్పఁ బోయి బలఘాతి భవత్పితృపుత్రకుండు త
ద్భూరివిభూతికీరును బ్రభుల్ చని కైకొనుఁ డంచుఁ దెల్పినన్
వారు నతిత్వరం జని దివస్పతిఁ గని పల్కి రల్కతోన్.

290


ఉ.

నీవును నేము నారజికి నెయ్యపుఁబుత్త్రుల మౌట మాకు సం
భావన స్వర్గరాజ్యపరిపాలన మర్హ మటన్న నీక వాం
ఛావృతి నున్న యింద్రుని విశంకటవృత్తి జయించి స్వఃపురీ
భావుకరాజ్యమంతయు నభంగురులై వడి నాక్రమించినన్.

291


వ.

ఇంద్రుండు పరాజితుండై తొలంగిపోయె. బహుకాలంబు చనిన నొక్కనా
డేకాంతంబున బృహస్పతిం జూచి యల్లన దివస్పతి యిట్లనియె.

292


గీ.

క్రతువు చొరనీయ రేలాగ బ్రతుకవచ్చు. దాఁచ నేటికి మొకమెల్ల వాఁచె నిట్టి
కడిఁది యెఱుఁగఁ బురోడాశఖండ మొక్కరేగుపండంతయైన వారింప కిడరు.

293


వ.

అనిన బృహస్పతి యిట్లనియె, ఇత్తెఱంగు మున్నును నెఱింగించితివి. అందులకు
బ్రతికార్యంబు విచారించుచున్నవాఁడ, నెట్లైనను నీకు రాజ్యంబు కలుగు
నుపాయంబు చూచెద, అని పలికి రజిపుత్రుల బుద్ధిభ్రంశంబునకును నింద్రుని
తేజోభివృద్ధికొఱకును నొక్కయిష్టి కల్పించి వేల్చె. అందుకతంబున రజిపుత్రులు
బుద్ధి చలించి వేదోక్తకర్మత్యాగులై బ్రహ్మద్వేషులై ధర్మపరాఙ్ముఖులై రంత
యపేతధర్మాచారులైన వారి నింద్రుండు నిర్జించి పురోహితాప్యాయితతేజుండై
త్రిదివం బాక్రమించి ఎవ్వరేనియు నీయింద్రుని స్వపదచ్యవనారోపణం
బులు విందురు స్వపదభ్రంశంబు గాదు, దౌరాత్మ్యంబు తొలంగు. రంభుం డ
నపత్యుం డయ్యె. క్షత్త్రవృద్ధునికిఁ బ్రతిక్షత్త్రుం డతనికి సంజయుం డతనికి
జయుం డతనికి విజయుం డతనికిఁ గృతుం డతనికి హర్యశ్వుం డతనికి సహదేవుం
డతనికి నదీనుం డతనికి జయత్సేనుం డతనికి సంకృతి యతనికి క్షత్త్రధర్ముండు
పుట్టె. వీరలు క్షత్త్రవృద్ధునివంశంబువార లింక నహుషునివంశంబు చెప్పెద.
నహుషునకు యతి, యయాతి, సంయా, త్యాయాతి, వియాతి,కృతిసంజ్ఞు లార్గురు
పుత్త్రులు కలిగి రందు యతి రాజ్యం బొల్లఁ డయ్యె, వినుము.

294


సీ.

అతులతేజుండు యయాతి రాజై కావ్యు, నితనూజ దేవయానియును దనుజ
పతి వృషపర్వునిపట్టి శర్మిష్ణయు, భార్యలు గాఁగ భూభాగ మేలె
యదుఁడు దుర్వసుఁడును నన దేవయాని యి, ద్దఱునందనులఁ గాంచె దైత్యపుత్రి
ద్రుహ్యుఁడు ననుఁడు పూరుఁడు నన మువ్వుర, సుందరాకారుల సుతులఁ గాంచె

గీ.

నంత కావ్యుఁ డలిగి యల్లుని నతిజరా, పీడ నొందుమని శపించుటయును
నృపతి మామపాదనీరేజముల వ్రాలి, తాళఁబట్టి ప్రతివిధాన మెఱిఁగి.

295


వ.

కొడుకుల రావించి యందు నగ్రనందనుండైన యదువున కిట్లనియె.

296


ఉ.

తామసుఁడై యకాలము గదా యని యెంచక మించి నీదుమా
తామహుఁ డల్గి యిచ్చె నతిదారుణశాపము నీవు నాజరా
భూమిక పూని నా కొసఁగు భోగ్యభవన్నవయౌవనంబు ని
త్యామితభోగము ల్గని సహస్రసమాప్తిగ నిత్తుఁ గ్రమ్మరన్.

297


వ.

యదుండును జరాగ్రహణంబున కంగీకరింపకయున్న రాజ్యంబున కర్హత లే
కుండునట్లుగా శపించి క్రమంబున దుర్వసు ద్రుహ్వ్యసువుల నడిగిన వారును
నొడంబడక యున్న శపించి వారి కందఱికిన్ గనిష్ఠుండగు పూరునిఁ బిలిచి యావ
నం బడిగిన నతండు.

298


ఉ.

సాగిలి మ్రొక్కి లేచి కరసారసము ల్ముకుళించి యోమహా
భాగ కృతార్థతాగరిమ వాటిలె మీవచనంబు చేయుటన్
బాగగుయౌవనంబుఁ గొని పాటిలు నీజర నాకు నిచ్చి సు
శ్రీగురుభోగభాగ్యములు చేకొనుఁ డంచు నొసంగెఁ బ్రీతితోన్.

299


వ.

ఇట్లు పూరుండు యౌవనం బిచ్చిన బుచ్చుకొని యయాతి తనజర పూరున కిచ్చె,
ధర్మావిరుద్ధంబులును యధాకాలోపపన్నంబులును యధోత్సాహనిర్వర్త్యం
బులును నైన కామోపభోగంబులు వేయేం డ్లనుభవించి తనవి చనక యొక్క
నాఁ డిట్లని గానంబు చేసె.

300


చ.

విసువక యెన్నినా ళ్లనుభవించిన శాంతి వహించ దెంతక
క్కసము భళీర కామము నికామము నాజ్యసమర్పణంబునన్
బస చెడునే హుతాశనుఁడు మర్త్యుఁడు దీనికి లొంగెనేని సం
తసము లభించఁగాఁ గలఁడె నాకముఖాఖిలరాజ్య మేలినన్.

301


క.

దంతములు వదలె కేశము, లెంతయు పలితంబు లయ్యెఁ దృష్ణయు బ్రతుకన్
భ్రాంతియుఁ దరుణమ లయ్యెడు, నంతంతకు నెట్టిచిత్ర మతివృద్ధునకున్.

302


ఉ.

పూనిక భూరివైషయికభోగమహానుభవంబు చేయఁగా
నే నినుపారి నూఱుపదు లేండ్లు చనె న్విషయంబులందు నిం
తైనను దృష్ణ మానదు నిరంతరముం ఘనవృద్ధిఁ బొందెడుం
గాని విచిత్ర మిత్తెఱఁగుఁ గానముగా వివరింప నెందులన్.

303

వ.

కావున నీతృష్ణం బరిత్యజించి వాసుదేవబ్రహ్మంబునందు మానసంబు చేర్చి
ద్వంద్వంబులు గెలిచి మమకారంబు విడిచి వనంబున మృగంబులం గూడి
చరించెదనని తలంచి పూరునకు యావనం బిచ్చి తనజర మగుడంబుచ్చుకొని
దక్షిణపూర్వదిశయందు దుర్వసుని, బ్రతీచియందు ద్రుహ్యుని, దక్షిణ
దిశయందు యదువును, నుదీచియందు ననువును మండలాధిపత్యంబునకుఁ
బూరు నభిషిక్తుం జేసి వనంబునకుం జనియె నని చెప్పి శ్రీపరాశరుండు మైత్రే
యున కిట్లనియె.

304


చ.

అనుపముఁ డాయయాతిసుతుఁడైన యదుండు తదన్వయంబు పా
వనము తదీయకీర్తన మవారితభూరితరాఘకోటినా
శనము శుభప్రదంబు సురసన్నుతిపాత్రము నీకుఁ జెప్పెదన్
వినుము మునీంద్రచంద్ర శ్రుతివీథుల పండువు చేయుచుండఁగన్.

305


చ.

కలగొనఁ బద్మజాండమునఁ గల్గు సురాసురమర్త్యపన్నగా
దులు తప మాచరించి పరితోషమునం బురుషార్ధవర్గ మే
యలఘుతరానుభావుకృప నందుదు రట్టి పరాత్పరుండు శ్రీ
నిలయుఁడు విష్ణుఁ డంబురుహనేత్రుఁడు పుట్టెఁ దదన్వయంబునన్.

306


వ.

అట్టి యదువునకు సహస్రజిత్, క్రోష్టు, నల, నహుష సంజ్ఞలుగల నలు
గురుపుత్రులు గలిగి రందు సహస్రజిత్తునకు శతజిత్తు, శత్రజిత్తునకు హైహ
య, హేహయ, వేణుభయులను ముగ్గురుపుత్రులు పుట్టి రందు హైహయునకు
ధర్ముండు, ధర్మునికి ధర్మనేత్రుండు, ధర్మనేత్రునకుఁ గుంతి, కుంతికి సహజిత్తు,
సహజిత్తునకు మహిష్మంతుండు, మహిష్మంతునకు భద్రశ్రేణ్యుండు, నతనికి
దుర్దముండు, నతనికి ధనకుండు, ధనకునకుఁ గృతవీర్య, కృతాగ్ని, కృతధర్మ,
కృతౌజనులన నల్వురుపుత్రులు జనించి రందుఁ గృతవీర్యునకు.

307


ఉ.

బాహుసహస్రసంభృతివిభాసి మహాసివినిర్దళద్రిపు
వ్యూహుఁడు సప్తసాగరపయోవృతివిస్ఫూరితాంతరీపసం
దోహనిఖాతయూపుఁడు మనోహరసత్యవచోవిశేషణో
త్సాహుఁడు పుట్టె నర్జునుఁ డుదగ్రయశోమహిమాభిరాముఁడై.

308


వ.

అక్కార్తవీర్యార్జునుండు సప్తద్వీపాధిపతియై భగవదంశభూతుండును నత్రి
పుత్రుండునునగు దత్తుని నారాధించి యమ్మహాత్మునివలన బాహుసహ
స్రం బధర్మసేవానివారణంబుగా ధర్మంబునఁ బృథివి జయించునట్లుగా
ధర్మంబునఁ బృథివి పాలించునట్లుగా నపరాజయంబుగా నఖిలజగత్ప్రఖ్యాత
పౌరుషంబు కలుగునట్లుగా మృత్యువు లేకుండునట్లుగా వరంబు వడసి యట్ల

సకలధరాస్థలంబులుం బాలించి యజ్ఞసహస్రంబులు చేసి రాజులెవ్వరు
నశేషగుణంబులఁ దనకు సాటిలేనట్లుగా మెలంగి యెనుబదేనువేలేండ్ల
వ్యాహతారోగ్యశ్రీబలపరాక్రమసమేతుండై మాహిష్మతీనగరంబు
రాజధానిగా నుండు సమయంబున.

309


సీ.

కాంతాసమేతుఁడై కార్తవీర్యుఁడు వేడ్క, నర్మద నవగాహనంబు చేయ
సకలదిగ్విజయంబు సాధించి దశకంఠుఁ, డాహవోత్సాహుఁడై యటకు వచ్చి
పొడచూప నారాజపుంగవుం డపు డల, వోక నాదను జేంద్రుఁ బొదివిపట్టి
నిఖిలసురాసురానీకసంగరరంగ, విజయగర్వం బెల్ల వీటిఁబుచ్చి


గీ.

చెలఁగఁ జేతులు వెనుకకు నులిచి తీసి, మొఱ్ఱపెట్టంగ లాకలు మోయవిఱిచి
కట్టి పసరమువలెఁ ద్రాటఁ బట్టి తెచ్చి, గేలిఁ బెట్టించి తనచెఱసాలఁ బెట్టి

310


వ.

పంచాశీతివర్షసహస్రోపలక్షణకాలావసానంబున శ్రీమన్నారాయణాంశ
భూతుండైన పరశురామునిచేత నుపసంహృతుం డయ్యె. అయ్యర్జునునకుఁ
బుత్రశతంబు పుట్టె నందు శూరసేన, వృష, మధు, జయధ్వజ, సంజ్ఞులు
శ్రేష్ఠు లందు జయధ్వజునకుఁ దాలజంఘుం డతనికిఁ దాలజంఘాఖ్యగల పుత్త్ర
శతంబు పుట్టె. అందు జ్యేష్ఠుఁడు వీతిహోత్రుఁడు. వేఱొక్కండు భరతుండు.
అతనికి వృషుఁడు, వృషునకు మధువు, మధువునకు వృష్ణిప్రముఖపుత్రశతంబు
గలిగె. అందువలన వీరిగోత్రంబునకు వృష్ణిసంజ్ఞ గలిగె. మధువువలన మధుర
గలిగె. యదుకులసంభవు లగుట యాదవులైరి. మఱియు యదువుపుత్రుండైన
క్రోష్టువునకు ధ్వజినీవంతుడు నతనికి స్వాతి యతనికి రుశంకుండు నతనికిఁ
జిత్రరథుం డతనికి శశిబిందుండు పుట్టి చక్రవర్తి యయ్యె.

311


మ.

శశిబిందుం డలరున్ సమస్తధరణీచక్రేశుఁడై పూర్ణిమా
శశిబింబాస్యల లక్షభార్యల విలాసక్రీడలం దేల్చుచున్
దశలక్షాత్మజులన్ మహాభుజులఁ బొందం గాంచి హర్షించుచున్
దశదిగ్భిత్తులఁ గీర్తిచంద్రికలు నిత్యస్ఫూర్తి నిండించుచున్.

312


వ.

ఆశశిబిందుపుత్రులలోఁ బృథుయశుండు, పృథుకర్ముండు, పృథుజయుండు,
పృథుకీర్తి, బృథుదానుండు, పృథుశ్రవుండును నన నార్వురుశ్రేష్ఠు లందు
పృధుశ్రవునికిఁ బృథుతముండు నతనికి నుశనుండు పుట్టె. అతండే కదా వాజి
మేధశతం బాహరించె. అయ్యుశనునకు శితవుండు, నతనికి రుక్మకవచుం, డతనికి
పరవృత్తు, నతనికి రుక్మేషు పృథు జ్యామఖ వలిత హరితసంజ్ఞు లైదుగురు
పుత్రులు. అందు జ్యామఖుండు రా జయ్యె వినుము.

313

గీ.

అవనిలో భార్యలకు వశులైన భూత, భావిభవదధిపతులతో నేవిధమున
జ్యామఖుఁడె శ్రేష్ఠుఁ డనుచు నుద్దామలీల, జనులు చెప్పుదు రెపుడు నాశ్చర్యముగను.

314


వ.

ఆజ్యామఖుండు భార్యయైన శైబ్యకు వశుండై యుండు. అతం డనపత్యుం
డయ్యును శైబ్యకు వెఱచి భార్యేతరపరిగ్రహంబు చేయక పెద్దకాలం బుండె.

315


ఉ.

జ్యామఖుఁ డొక్కనాఁడు చతురంగబలంబులు గొల్వ జైత్రయా
త్రాముదితాత్ముఁడై కదిలి ప్రస్ఫురితప్రకటప్రతాపరే
ఖామితలీల శాత్రవధరాధిపులం బరిమార్ప వారు సం
గ్రామభయార్తులై నిజపురంబులు వెల్వడి పాఱిపోయినన్.

316


వ.

తదీయనగరంబులు సొచ్చి సర్వధనంబులు గొల్లగొట్టుకొని విజయంబు గైకొని
మగుడునప్పు డొక్కయెడ.

317


సీ.

భయచంచలీభవన్నయనాంచలాంచిత, ద్యుతి చంచలల దిశల్ దొంగలింపఁ
ద్రాసకంపితకుచస్తబకవేల్లితతనూ, వల్లి చూపఱకు భావంబు గొలుప
నిబిడీభవదీర్ఘనిశ్వాసభరపీడ, చేత లేఁగెమ్మోవిచిగురు కంద
నయనాశ్రుబిందుసంతతి మీనముఖవాంత, సరసముక్తాపరంపరలఁ బోల


గీ.

నన్న రక్షించు కావంగదయ్య తండ్రి, తల్లి ప్రోవుమటంచు నార్తస్వరమున
సొలసి యేడ్చుచు దిక్కులు చూచురాజ, కన్యకామణి నొక్కతెఁ గాంచె నృపుడు.

318


వ.

ఇట్లు గాంచి యనపత్యుండైన నాకు దైవయోగంబున నిక్కాంత గలిగె. దీనిం
బరిణయంబై యపత్యంబులం గనియెద, నరదంబుపై నిడికొని శైబ్యాను
మతంబునఁ బరిణయం బయ్యెదంగాక యని యరదంబుపై నిడికొని బల
సమేతుండై పురంబునకుం జనినఁ పౌరామాత్యమూలబలంబులతో గూడి
శైబ్య వల్లభున కెదురువచ్చి రథంబుపై నున్న కన్యకం గాంచి కించిదుద్భూతా
మర్షస్ఫురదధరపల్లవ యగుచు వల్లభున కిట్లనియె.

319


గీ.

అతిచపలచిత్త నీ వీమృగాయతాక్షి, నెచటఁ దెచ్చితి విది యెవ్వ రేల యనిన
భీతి మరుమాట తోఁచ కిన్నాతి నీదు, కోడ లన నవ్విభునకు నాకొమ్మఁ పలికె.

320


క.

మనుజవర పుత్రకుని నే, గనుటయె లే దన్యకాంత కలుగదు నీకున్
దనయుని గనుటకు విను మే, యనువున నిది కోడ లయ్యె నని పల్కుటయున్.

321


వ.

నిజప్రేయసీకోపకలుషితవివేకుండై భయంబున దురుక్తిపరిహారార్థంబుగా
ని ట్లనియె.

322


గీ.

కాంత నీవు సుతుని గనియెద వింక నా, తనికిఁ బెండ్లి చేయఁదలఁచి దీనిఁ
దెచ్చినాఁడ ననిన దేవి నవ్వుచు తాను, నతఁడు గూడి నగరి కరిగె నంత.

323

వ.

వయఃపరిణత యయ్యును, నల్పదినంబులలోన శైబ్య గర్భంబు దాలిచి కుమా
రునిం గనియె. అతనికి జ్యామఖుండు విదర్భనామం బిడియె. అతండు సంప్రాప్త
యౌవనండై స్నుషయగు నారాజకన్యం బరిణయం బయ్యె. వారి కిద్దఱికి గ్రధ,
కైశిక, రోమపాదులను మువ్వురుపుత్రులు పుట్టిరి. అందు రోమపాదునకు
బభ్రుండు, బభ్రునకు ధృతి పుట్టె. కైశికునకుఁ జేది చేదిసంతతియందుఁ జైద్యు
లను రాజులు పుట్టిరి. అందు గ్రధుండను స్నుషాపుత్రునకుఁ గుంతి, కుంతికి
ధృష్టి, ధృష్టికి నిధృతి, నిధృతికి దశార్హుండు, దశార్హునకు వ్యోముండు,
వ్యోమునకు జీమూతుండు, జీమూతునకు వికృతి, వికృతికి భీమరథుండు, భీమ
రథునకు నవరథుఁడు, నతనికి దశరథుఁడు, నతనికి శకుని, శకునికిఁ గరంభి, కరంభికి
దేవరాతుండు, దేవరాతునకు దేవక్షత్రుండు, దేవక్షత్రునకు మధుండు, మధు
నకుఁ గుమారవంతుండు, కుమారవంతునకు ననుండు, ననునకుఁ బురుమిత్రుండు,
పురుమిత్రునకు నంశుండు, నంశునకు సత్వతుండు, సత్వతునకు సాత్వతులు
గలిగిరి. ఇది జ్యామఖునిసంతతి. దీని సమ్యక్ఛ్రద్ధావంతులై వినినఁ బాపం
బులం బాయుదురని చెప్పి శ్రీపరాశరుఁడు మైత్రేయున కిట్లనియె.

324


క.

మునివర సాత్వతవంశము, వినుము తదీయశ్రవణము వివిధాఘహరం
బనుపమసంపత్కారణ, మనవరతశుభాస్పదము ప్రియంబు తలఁపఁగన్.

325


వ.

సాత్వతునకు భజన, భజమాన, దివ్యాంధక, దేవాపృథ, మహాభోజ, వృష్ణి
సంజ్ఞులు పుత్రులు కలిగిరి. అందు భజమానునికి నిమి, వృక, వృష్ణులను
పుత్రులు పుట్టిరి. మఱియుఁ దద్ద్వైమాత్రులు శతజి త్సహస్రజి దయుతజి త్సం
జ్ఞులు పుట్టిరి. దేవాపృథునకు బభ్రుండు కలిగె.

326


క.

దేవాపృథుఁడును బభ్రుఁడు, నేవిశ్వములోన నధికు లెన్నినచోటన్
భావిభవద్భూతధరి, త్రీవల్లభకోటిలోనఁ బృథుగుణగరిమన్.

327


వ.

దేవాపృథుండు దేవసముండు. అక్కాలంబునఁ బదునాల్గువేలున్నఱువ
దార్గురు పురుషులు, బభ్రుదేవాపృథులవలన నమృతత్వంబు నొందిరి. మహా
భోజుం డతిధార్మికుం డతనియన్వయంబున భోజ, మార్తికావరులు పుట్టిరి.
వృష్ణికి సుమిత్రుండు, యుధాజిత్తునుం బుట్టిరి. యుధాజిత్తునకు ననమిత్రుండును
సేనియును, ననమిత్రునకు నిఘ్నుండును, నిఘ్నునకుఁ బ్రసేనసత్రాజిత్తులు
పుట్టిరి. ఆసత్రాజిత్తునకు భగవంతుండైన సూర్యుండు సఖుండయ్యె వినుము.

328


క.

జలనిధితీరమునకు నిశ్చలమతితో నేగి యచట సత్రాజితుఁ డ
త్యలఘుతరభక్తియుక్తిన్ జలజాప్తుం గొలిచి పొగడె సారస్తుతులన్.

329

క.

స్తవమునకు మెచ్చి భానుం, డవనీపతియెదుట నిలిచె నపుడ స్పష్ట
ప్రవిమలతనుఁడై యది గని, రవికిఁ గరద్వయము మొగిచి రా జి ట్లనియెన్.

330


గీ.

వహ్నిపోగు వోయువడువున నభమున, సంచరింతు రెపుడు స్వామివారు
అవ్విధమున నిటకు నరుదెంచినారు మీ, దివ్యమూర్తి యెట్లు తెలియువాఁడ.

331


వ.

స్పష్టంబుగా దేవరవారిదివ్యదేహంబు నాకన్నులకుం గానంబడదేని మీరు
ప్రసన్నం బౌటకు ఫలం బేమి యనినఁ గృపావశంవదుండై యాదిత్యుండు తన
కంఠంబునం బెట్టిన స్యమంతకనామ దివ్యమణిశ్రేష్ఠంబు తీసి యాకడం బెట్టిన.

332


గీ.

హ్రస్వమై తప్తతామ్రాభమై సమంచ, దీషదాపింగళాతక్షమై యెసఁగుభాను
దివ్యదేహంబు గాంచి పార్థివవరుండు, హర్షియై మ్రొక్కి యున్నఁ బద్మాప్తుఁ డపుడు.

333


క.

వర మడుగు ధరణివర యన, సరసిజహితుఁ జూచి నృపుఁడు స్వామీ నా కీ
వరమణి నిమ్మన నాయం, బరమణి యది యొసఁగి చనియె మగుడం దివికిన్.

334


వ.

సత్రాజితుండును నమ్మహామణి కంఠంబునం ధరించి యాదిత్యుండునుంబోలె
తేజోవిశేషంబున దిగంతరంబులు వెలిగించుచు ద్వారకకు వచ్చినఁ బౌరు
లెల్లను విస్మయము నొంది జగద్భారావతరణార్థంబు మానుషరూపధారియైన
యాదిపురుషుం బురుషోత్తముఁ గాంచి యిట్లనిరి.

335


చ.

కమలదళాక్ష మాధవ జగత్పరిరక్షణదక్ష, కృష్ణ య
క్కమలహితుండు మీచరణకంజము లిప్పుడు గొల్వవచ్చె ని
క్క మనుచు విన్నవించిన వికస్వరహాసవిభాసితాస్యప
ద్మ మలర వారి కిట్లనియె దానవభేది తదర్థవేదియై.

336


క.

ఇతఁడు రవి గాఁడు సత్రా, జితుఁ డింతేకాని భాను సేవించి తదూ
ర్జితకృప స్యమంతకంబను, నతులితరత్నంబు దెచ్చెనని చెప్పుటయున్.

337


వ.

పౌరులెల్ల విశ్వసించి చని రంత, సత్రాజితుం డంతఃపురంబు ప్రవేశించి స్యమం
తకంబును దాఁచె. అమ్మణియును బ్రతిదినంబును నెనిమిదిబారువులకన
కం బీనుచుండు తత్ప్రభావంబున రాష్ట్రంబున కుపసర్గానావృష్టివ్యాళాగ్ని
తోయదుర్భిక్షాగ్నిభయంబులు లేకయుండె. అంత.

338


సీ.

పుండరీకాక్షుఁ డెప్పుడు కోరు నద్దివ్య, మణి యుగ్రసేనభూమండలేశ్వ
రునకె యోగ్యం బని మనమున నట్లయ్యు, గోత్రభేదభయం బగు న్యథార్థ
మని మణి గొననొల్లఁడయ్యె సత్రాజితుం, డచ్యుతుం డడుగునో యనెడుశంక
భ్రాంతి యింతయు లేక భ్రాత కిచ్చిన నాప్ర, సేనుండు నమ్మణిఁ జెలఁగిగొనియె

గీ

అదియుఁ దన్ను దాల్చునతఁడు శుద్ధుండైన, సర్వసంపదలు నొసంగు నట్లు
గాక యశుచి యగుచుఁ గైకొన నతనినే, సాగి బ్రతుకనీక సంహరించు.

339


వ.

ఆప్రసేనుండును నమ్మణి కంఠంబున ధరించి తురగారూఢుండై యటవికి మృగ
యావినోదార్ధియై చనిన.

340


క.

సింగంబొక్కటి తుంగా, భంగత్వరఁ బాఱుదెంచి పార్థివసుతునిన్
రంగత్తురంగమముతో, డం గీ టడఁగించి మణి తటాలునఁ గొనియెన్.

341


గీ.

నోటఁ గఱచుకొని మనోవేగమునఁ బోవ, నడుగుజాడ వట్టి యంటి దానిఁ
జంపి పుచ్చుకొనియె జాంబవంతుండు , దీప్యమానమైన దివ్యమణిని.

342


ఉ.

భల్లుకవల్లభుండు రవిభాస్వరమౌమణిఁ గొంచు నంధకా
రోల్లసదద్రిగహ్వరగృహోత్తమ మత్తఱిఁ జొచ్చి వేడ్క సం
ధిల్లఁగ నందు నాత్మసుతుని న్సుకుమారునిఁ జూచి వానికిన్
సల్లలితోరుఖేలనము సాగుటకై మణి వ్రేలఁగట్టినన్.

343


వ.

మణిసమాలోకనోత్సుకుండై బాలుండు క్రీడించుచుండె.

344


గీ .

హరికి మణిమీఁద స్పృహగల దడిగికొనుట, లాఘవంబని తఱి వేచి లాఁచియుండి
విపినమునకుఁ బ్రసేనుండు వేఁట పోవఁ, జంపి మణి హరియించె నాశార్ఙ్గధరుఁడు.

345


వ.

అని సమస్తయదులోకంబును మెల్లన గుజగుజలం బోవ లోకాపవాదంబు
వచ్చెనని భగవంతుండైన యచ్యుతుఁడు యదుసైన్యపరివృతుండై ప్రసేనుని
తురంగంబు వోయిన మార్గంబుఁ బట్టి చనిచని.

346


మ.

అనివార్యద్విపవైరినిష్ఠురచపేటాఘాతనిర్భిన్నసం
హసనప్రస్రవదన్రపంకిలదరణ్యాంతంబునం గూలి చ
చ్చినవాహంబు ప్రసేనునిం గని ప్రహర్షస్వాంతుఁడై దైత్యసూ
దనుఁ డాచందము దేల్చె నందఱికి నిందావాదము ల్మానఁగన్.

347


క.

హరిజాడ నేగి యాముం, దర కుప్యద్భలుకేంద్రనఖనిర్దళిత
ద్విరదారిఁ జూపి యందలి, పరిపాటిం దెలిపి ఋక్షపతి చనుత్రోవన్.

348


వ.

భల్లుకేంద్రునిజాడఁ బట్టి చనిచని ముందర నొక్కమహాశైలంబుఁ గాంచిత తత్త
టంబున సేనల నిల్పి తద్బిలంబు ప్రవేశించి.

349


ఉత్సాహ.

సింగమొకటి వెంటఁబడి ప్రసేను జంపి దాని ను
త్తుంగభజబలప్రభాసితుండు జాంబవంతుఁడు

ప్పొంగి చంపె నీకు మణి ప్రభుత్వ మమరఁజేరె నే
డ్వంగనేల యోకుమారవర్య యంచు నందునన్.

350


వ.

సుకుమారునిదాది జోల పాడ నాలించి పాంచజన్యధరుండు స్యమంతకంబు
దొరకెనని తలంచి లోపలికిం బోయి దాదిచేతఁ దేజోజాజ్వల్యమానంబగు
మణిం గాంచి పుచ్చుకోఁదలంచునంత.

351


గీ.

ఎన్నఁడును విని కనియును నెఱుఁగనట్టి, భూరిసౌందర్యనిధియైన పురుషమణినిఁ
గాంచి యాదాది మదిలోవ ముంచుకొన్న, భీతి మొఱవెట్టె నప్పుడు బెట్టుగాను.

352


వ.

ఇట్లు దాది మొఱయిడిన.

353


చ.

ఉదుటున నచ్ఛభల్లపతి యోడకుమేఁ గలుగంగ నీకు నీ,
యదవదయేల వచ్చితి మదద్భుతదుస్సహబాహుసారసం
పద కెదిరింపఁగాఁగలఁడె మానవుఁ డంచు నుదగ్రమూ ర్తియై
చదలద్రువంగ నార్చి మురశాసను దాఁకె నియుద్ధపద్ధతిన్.

354


వ.

అట్లు దాఁకినఁ బరస్పరజయకాంక్షులై మహారోషంబున నిరువదియొక్కదినం
బులు ఘోరయుద్ధంబు చేసి రంతకుమున్న యదుసైనికులు సప్తాష్టదినంబు లెదు
రుచూచి కృష్ణుఁడు రాకున్నఁ బగరచేఁ జిక్కవలయు లేకున్న నిమ్మహానుభావు
నకు శత్రువధకై యిన్నిదినంబులు పట్టునే యని నిశ్చయించి ద్వారకకు వచ్చి
బంధువులకుఁ జెప్పిన యథోచితక్రియలు నిర్వర్తించియుండి రంత.

355


గీ.

బంధువర్గం బతిశ్రద్ధఁ బాత్రముల స, మిద్ధమృష్టాన్నపానంబు లిడుటఁ జేసి
పంకజాతాక్షునకు బలప్రాణపుష్టి, లాభ మొనఁగూడె ఘనతరోల్లాస మొదవ.

356


క.

ఋక్షాధిపతికి లోకా, ధ్యక్షునిముష్టి ప్రహరతతులకతమునన్
లక్షించి చూడ బలపు, ష్టిక్షీణత నాఁడునాఁట సిద్ధంబయ్యెన్.

357


సీ.

మదిలో వివేకసంపదపెంపు దీపింప, జాంజవంతుఁడు జగత్స్వామిపాద
ముల వ్రాలి యోజగన్మూలకారణభూత, నారాయణుఁడ వీవు నాఁడు జలధి
బంధించి రావణుఁ బట్టి చట్టలు చీరి, తారకబ్రహ్మమంత్రపదదివ్య
నామధేయం బొప్ప న న్నేలి రక్షించి, నావు ని న్నెదిరింప దేవగణము


గీ.

లైన నోపవ టన్నఁ దిర్యక్కులప్ర, జాతమద్విధజంతుప్రసక్తి యెంత
తెలియ కిప్పుడు నిన్ను నెదిర్చినట్టి, తప్పు లోఁగొని ననుఁ గావు దైత్యదమన.

358


వ.

అని ప్రార్థించిన జాంబవంతుని శరీరంబు కరంబున నిమిరి విగతవేదనునిం జేసినఁ
బునఃప్రణామం బాచరించి, జాంబవతియను తనపుత్త్రిం దోడ్కొనివచ్చి

"గృహంబునకు వచ్చిన దేవరకు నర్ఘ్యంబు సమర్పించుటకు నర్హవస్తువులు
లేవు. ఈకన్యకామణిం బరిగ్రహింపు" మని సమర్పించి ప్రణతుండై స్యమం
తకమణియును సమర్పించినం గైకొననొల్లకయు బంధువులకుం జూపవలసి గై
కొని జాంబవంతు నునిచి బాంజవతిం దోడుకొని ద్వారకాపురంబునకు వచ్చిన.

359


క.

శ్రీ విలసిల్లె గృహంబుల, భావంబులు పరమహర్షభరితము లయ్యెన్
కేవలవృద్ధజనములకు, యౌవన మరుదెంచె నప్పు డాహరిరాకన్.

360


వ.

ఇవ్విధంబునఁ బురప్రవేశంబు చేసి జాంబవతి నంతఃపురప్రవేశంబు చేయించి
సత్రాజితుం బిలిపించి సమస్తయాదవసమక్షంబున నధోక్షజుండు మణివృత్తాం
తంబుఁ దెలిపి మిథ్యాపవాదకల్పనాలఙ్జితుండగు నతనికి మణి యిచ్చిన.

361


గీ.

హృదయముననే పరాత్పరు నిడిన నిఖిల, పాపములు వాయు నప్పద్మపత్రనేత్రు
మీఁద నపరాధ మిట్లు నిర్మించినట్టి, నాకు నిష్కృతి కలదె యెన్నటికినైన.

362


వ.

అని సత్రాజిత్తు నిర్వేదించి యపరాధక్షమార్పణంబునకై తనకూఁతు సత్య
భామ నచ్యుతున కిచ్చె. అంత.

363


సీ.

జతగూడి యక్రూర కృతవర్మ శతధన్వ, వజ్ర ప్రముఖయదువరులు పరులు
వినకుండఁ దారుమంతన మాడి రందు నా, శతధన్వుఁ బలికి రీచంద మెందుఁ
గంటిమె మనలోనె కలికి నిచ్చెదనని, పలికి యిప్పుడు సత్యభామ నచ్యు
తున కిచ్చె సత్రాజితుఁడు వీనిఁ జంపు మి, ప్పని కేము నీకుఁ దోడ్పడుదు మబ్జ


గీ.

నయనుఁ డిందుల కల్గె నాభయము వలదు, సూడు దీరిన చాలు నీచొప్పు చేయు
మనిన శతధన్వుఁ డగుఁ గాక యనుచు దాని, కుత్సహించి ప్రతిష్టించి యుండె నంత.

364


చ.

లఘుగతిఁ బాండునందనులు లక్క నొనర్చిన యిండ్ల నగ్నిచే
నమపరిభూతు లౌట విని యచ్యుతుఁ డప్పుడు రాజరాజుదు
ర్విఘటన చిత్తగించియుఁ బ్రవీణతతోఁ జనె వారణావతా
ఖ్యఘనపురీలలామమున కాదృతి వారలకార్య మారయన్.

365


సీ.

హరి వారణావతపురి కేగ శతధన్వుఁ, దర్థరాత్రమున నిద్రాప్తి నుండ
సత్రాజితునిఁ బట్టి చంపి రత్నము గొని, చనియె రథం బెక్కి సత్యభామ
హరికడ కేగి దుఃఖార్తయై నిజపితృ, వ్యాపాదవము చెప్ప నజ్జనాభుఁ
డడరి సత్యాయుతుండై ద్వారకాపురి, కరుదెంచి హలపాణి నపుడు చూచి


గీ.

కంటి రేనాఁడు పెంటలోఁ గాలవశత, నణఁగిపోయెఁ బ్రసేనుఁడు గ్రాసిధారఁ
దునిమె సత్రాజితుని శతధనుఁడు నేడు, మానికము వీరి కొమ్మదుగా నిజంబు.

366

వ.

శతధన్వునిం జంపవలయు రథం బెక్కుఁ డనిన నట్ల కాక యనియె. ఇట్లు రామ
కృష్ణులిద్దఱు సన్నద్ధు లగుచు నుండి రంత.

367


గీ.

రామకృష్ణులఘనరోషరభస మెఱిఁగి, తలఁకి కృతవర్మకడ కేగి తనకుఁ దోడు
పిలుచుశతధన్వుఁ బలికె నాకొలఁది యగునె, హరికిఁ బగ చేయ ననుచు నయ్యదుకులుండు.

368


వ.

ఇట్లు కృతవర్మచేత నిరాకృతుండై యక్రూరునికడకుఁ బోయి తోడు పిలిచిన.

369


చ.

పదకమలప్రహారమునఁ బద్మభవాండము బ్రద్దలై పడున్
మదవదపారదైత్యబలమండలయంతృనితాంతతివ్రతా
స్పదవిదితారిదీధితివిభాసితహస్తుఁడు లోకశస్తుఁ డా
యదుపతి కోపగించిన నహా మన మెంతటివార మెంచుమా.

370


గీ.

ప్రబలహలముఖనిర్భిన్నభానుజామ, హాప్రవాహుండు బలుఁడు మహామహుండు
తద్విరోధంబు సేయుట దహనకీల, సముచితంబుగ నొడిగట్టుకొనుట గాదె.

371


క.

చను మెచ్చటికైనను నీ, వని యక్రూరుండు పలుక నాశతధన్వుం
డును మణియైనను దాఁచుము, నను దాఁపఁగ నోపవేని నాపై కరుణన్.

372


క.

అన విని ప్రాణాంతంబై, నను నెక్కడఁ జెప్పవేని నాకడ నిడు మీ
వినుతమణి యనినఁ గాని, మ్మని యమ్మణి యతని కిచ్చి యరిగె న్బెలుచన్.

373


వ.

ఇట్లు.

374


ఉ.

తామసవర్తనుండు శతధన్వుఁడు బెగ్గిలి యొక్కనాఁట నూ
ఱామడ పోవుగోడిగ నహంకృతి నెక్కి తొలంగిపోవ ను
ద్దాములు రామకేశవులు తత్పదవిం జని రద్భుతత్వరా
శ్రీమహనీయమౌ రథము శీఘ్రత నెక్కి మహోగ్రలీలతోన్.

375


వ.

శతధన్వునిగోడిగయు నూఱామడ చనియె. మఱియుం దఱిమిన మిథిలాపురోప
వనోద్దేశంబునఁ బ్రాణంబులు విడిచె. పడినబడబ నచ్చోట విడిచి పాదచారియై
పరువెత్తిన శతధన్వుం జూచి యచ్యుతుండు బలదేవున కిట్లనియె.

376


గీ.

శైబ్యసుగ్రీవమేఘపుష్పప్రధాన, మైన యీరథ్యనికురుంబ మలసినట్లు
దోఁచె నిచ్చోటు ద్రొక్కినఁ దురగములకుఁ, గీడు వాటిల్లుఁ గాఁబోలు చూడు మిపుడు.

377


వ.

ఈరథంబుపై మీ రిచ్చట నిలువుండు, పగఱు పదాతియై పాఱిపోయె. ఏనును బదా
తినై వెనుదగిలి చక్కంబెట్టి వచ్చెదనని బలదేవుని నిలిపి హరి తానే వెనుచని
క్రోశమాత్రంబునం గూడముట్టి.

378

క.

అరినికరభయదతేజ, స్స్ఫురణ నుహాదివ్యచక్రమునఁ దల ద్రుంచెన్
దురితప్రవణాచరణా, దరుఁ దరుగుల్మాంతరితు నధను శతధనునిన్.

379


వ.

ఇట్లు శతధన్వుం జంపి వానిశరీరాంబరాదులయందు బహుప్రకారంబుల వెదికి
మణిఁ గానక మగిడి బలదేవుపాలికి వచ్చి.

380


గీ.

ద్రోహి శతధన్వుఁ డూరకే త్రుంగె వాని, చేత రత్నంబు లే దన సీరపాణి
మండిపడి యిట్టు వల్కునీమాట లెల్ల, నర్థలోభికి నీకు నిత్యములు కావె.

381


వ.

నన్నుఁ బ్రమోషించి మణి యపహరించితివి. భ్రాతవు గాన ని న్నే మనవచ్చు
నీతెఱువునం బొమ్ము.

382


గీ.

నాకు ద్వారక యేల బాంధవులతోడి, కూట మది యేల నీతోడి గొడవ యేల
పోయెదనటంచు మిథిలకుఁ బోయె బలుఁడు, జనకుఁ డెదురుగ వచ్చితోడ్కొనుచుఁ బోవ.

383


వ.

ఇట్లు బలదేవుండు కోపించి పోయిన వాసుదేవుండు ద్వారకానగరంబున కరు
దెంచె. నక్కడ.

384


ఉ.

శ్రీలు చెలంగ సద్గుణవశీకృతుఁ డాజనకుండు నిచ్చలున్
లాలనఁ జేయుచుండ మిథిలాపురి నుండె హలాంకుఁ డంతటన్
లాలస మొప్పఁ గౌరవకులప్రవరుండు సుయోధనుండు మే
ల్చాలఁగ రామునొద్ద గదసాదన నేర్చుట కేగుదెంచినన్.

385


వ.

సుయోధనునకు గదాకాశలంబు శిక్షించుచున్నంత వర్షత్రయంబు నిండిన
బభ్రూగ్రసేనప్రభృతియాదవులు మిథిలకుం బోయి కృష్ణుండు మణి హరి
యించుటలేదని బలరామునకుఁ బ్రత్యయం బగునట్లుగాఁ దెలిపి ద్వారకకుం
దోడితెచ్చి ఱంత.

386


సీ.

అక్రూరపక్షీయులైన భోజులు సాత్వ, తుని ప్రపౌత్త్రకుని శత్రుఘ్ననాముఁ
జంపి యచ్చట నుండ శంకించి యక్రూరసహితులై పురి వాసి చనిరి యనఘుఁ
డక్రూరుఁ డరిగినయది మొదల్ ద్వారకా, పురమున దుర్భిక్షదురితమారి
కాదిదోషములు హెచ్చైన నచ్యుతుఁడు పె, ద్దలనెల్ల రావించి పలికె నిట్లు


గీ.

ఘోరదుర్భిక్షముఖదోషకోటి యొక్క, మాటుగా వచ్చె నిది యేమిమాడ్కియొక్కొ
హేతు వరయుఁడు మీ రన్న నిట్టు లనియె, నంధకాహ్వయుఁ డొకవృద్ధయాదవుండు.

387


క.

వినుడు శ్వఫల్కుం డనఁగా, ఘనుఁ డీయక్రూరుతండ్రి గలఁ డతఁ డెం దుం
డిన నచట లేవు దుర్భి, క్షనితాంతావగ్రహాదికలుషము లెల్లన్.

388

క.

మును కాశీపతిదేశం, బున వానలు లేక కరువు ముంచుకొనిన న
జ్జనపతి శ్వఫల్కు నచటికి, వినయంబునఁ దోడి తేర విస్మయ మొప్పన్.

389


క.

పెళపెళ నుఱుముచు మెఱపులు, తళతళ మన సాంద్రకరకతతు లెల్లెడలన్
జలజల రాలఁగ మేఘం, బులు జోరున వాన గురిసె భూస్థలి నిండన్.

390


సీ.

మునుపు కాశీపతివనిత గర్భము దాల్పఁ, గన్యక యందుండి కాలమైన
వెడలకయుండె నావడువునఁ బండ్రెండు, సంవత్సరంబులు చన్నఁ దండ్రి
గర్భంబులో నున్నకన్యకఁ బలుకు నో, పుత్త్రి యిదేటికిఁ బుట్ట వీవు
మోము చూచెడివాంఛ ముప్పిరిగొనె నాకు, వెడలిర మ్మనుడు నప్పడుచు తల్లి


గీ.

కడుపులోనుండి పలుకు నిప్పుడు మొదలుగ, దినము నొకగోవు చొప్పున ద్విజుల కిమ్ము
మూఁడుసంవత్సరము లంత ముదము పొదల, నుదయ మొందుదు నిట్లు చేయుము మహీశ.

391


వ.

అనినఁ గాశీపతియును నట్ల చేసిన సంవత్సరత్రయంబు గడచిన కన్యక పుట్టిన
నక్కన్యకకుఁ బ్రతిదినగోదానంబు కతన గాందిని యనునామం బిడియె న ట్లు
పకర్తయు గృహాగతుండును నగు శ్వఫల్కునకు నర్ఘ్యంబుగా గాందిని నిచ్చిన
నమ్మిథునంబునకు నీయక్రూరుండు గలిగె. ఇతనికిఁ దండ్రిప్రభావంబు గలదు.
ఇతండు పోయిననాటనుండియు నీయుపద్రవంబులు పుట్టె. ఇతనిం దేవలయునని
చెప్పిననంధకుని వచనంబులు విని యక్రూరునకు నభయం బిచ్చి ద్వారకకుం దె
చ్చిన సర్వోపద్రవంబులు శాంతిఁ బొందె నంత.

392


చ.

పనివడి యెన్ని చూచిన శ్వఫల్కునిగౌరవ మల్ప మెట్టు లీ
ఘనవిపదార్తి వాపెడిని గా దిది సౌరమణిప్రభావ మీ
యనువని విందు మీయనకు నమ్మణి యాశతధన్వుఁ డిచ్చె లే
దనిన నజస్రయాగకరణాధికసంపద లేడ గల్గెడిన్

393


చ.

అని వనజాతనేత్రుఁడు నిజాత్మగతంబున నెన్ని యొక్కనాఁ
డనుపమితోత్సవంబు నిలయంబున వర్తిలఁజేసి గాందినీ
తనయుఁడులోనుగాఁ గల ప్రధానయదూత్కరమున్ సమాదరం
బునఁ బిలిపించి ప్రస్తుతము పుచ్చి ప్రసంగము తెచ్చి నవ్వుచున్.

394


మందరశైలధారి మతిమంతుఁడు భక్తుఁడు నైన గాందినీ
నందనుఁ జూచి నీకు నలనాఁడు మణిన్ శతధన్వుఁ డిచ్చు నా
కందువ నే నెఱంగుదు సుఖస్థితి నీవ పరిగ్రహింపు మే
మందును గామపాలుహృదయాబ్జము నమ్మదు నన్ను నెంతయున్.

395

వ.

బలదేవునకుఁ బ్రత్యయంబైనవెనుక నీవ పరిగ్రహించెదవు గాని మణి చూపు
మనిన నక్రూరుం డవ్వేళ మణి తనవద్దన యుండుటం జేసి యిట్లని చింతించె.

396


క.

లేదని బొంకిన మాటలు, గాదని శోధించి మానికము గొను నీదా
మోదరుఁ డీదానవకుల, భేదికిఁ గీ డాచరింప భీతి యొదవదే.

397


వ.

అని నిశ్చయించుకొని యక్రూరుం డిట్లనియె.

398


గీ.

నేఁట రేపట నెల్లుండి నీరజాక్ష, నయనుఁ డడిగెడు నిచ్చెద నాకు దాఁపఁ
దరమె యని దాఁచిదాఁచి వేసరితి ననుచు, ముందటం బెట్టె మణి తనముల్లె విడిచి.

399


వ.

దివ్యరత్నప్రభాప్రభావితులై సభాసదులు సాధువాదంబుల నగ్గించి రప్పుడు
బలదేవుండు కృష్ణునకుం దనకు సమానంబైనను నమ్మణియం దభిలాషం బిడియె.
పితృధనంబు గావున సత్యభామ సకామ యయ్యె. ఇవ్విధంబు చిత్తగించి ముకుం
దుండు గాందినీనందనున కిట్లనియె.

400


సీ.

ఓదానపతి విను నుగ్రాంశుకారుణ్య, దత్తమౌ నీస్యమంతకము దాల్చు
నాతఁడు శుచియు నుద్యద్బ్రహ్మచర్యుండు, కావలె నారీతి గానివాఁడు
ధరియించెనేనియుఁ దాన నాశము నొందుఁ, గావున నిది తాల్ప నీవె తగుదు
వరయ రాముఁడు మదిరాస్వాదముఖభోగ, ములు మానలేఁడు నాకొలఁది చూడ


గీ.

షోడశసహస్రవనితలజోడు వదల, నెన్ని విధముల మేము వహింపలేము
మారుమాటాడవలదు మామనవి వినుము, సౌరమణి పూను లోకోపకారమునకు.

401


వ.

అనిన నగుంగాక యని యక్రూరుండు నిర్భయంబున మణి కంఠపథంబునం ధరించి
తేజోవిరాజమానుండై వెలింగె.

402


గీ.

జలజలోచన మిథ్యాభిశస్తిహరణ, మైనయీచరితము విన్న యనఘమతికి
జగతి నెన్నఁడు మిథ్యాభిశస్తి లేదు, పాపహరమున నగు మునిప్రవరతిలక.

403


వ.

అనమిత్రునకు శని, శనికి సత్యకుండు, సత్యకునకు సాత్యకి కలిగె. అతండ యు
యుధానుండును ననంబరఁగు. ఆసాత్యకికి సంజయుండు, నతనికిఁ గుకుణి, యత
నికి యుగంధరుడు గల్గిరి. వీరలు శైనేయులు. అనమిత్రుని యన్వయంబునఁ
వృష్ణి, వృష్ణికి శ్వఫల్కుండు గలిగె. అతనిప్రభావంబు వింటివికదా! ఆశ్వ
ఫల్కునికిఁ గనిష్ఠభ్రాత చిత్రకుండు. శ్వఫల్కునివలన గాందినియందు నక్రూ
రుండు కలిగె. మఱియును సమద్గ మృదామద విశ్వారి మేజయ గిరిక్షత్రోప
క్షత్త్ర శతఘ్నారిమర్దన ధర్మదృగ్దృష్ట ధర్మగంధ మోజవాహ ప్రతివా
హాఖ్యులు పుత్త్రులు సుతారయను కన్యకయుం గలిగె. అక్రూరునకు వేదవంతుం
గడును, నుపవేదుండును నను నిద్దఱు పుత్త్రులు కలిగిరి. చిత్రకునకు పృథు విపృథు

ముఖ్యులు పుత్త్రులు గలిగిరి. అంధకునకుఁ గుకుర, భజమాన, శుచి, కంబల,
బర్హిషాఖ్యులు నలుగురు గల్గిరి. కుకురునకు ధృష్టుడు నతనికిఁ గపోతరోముండు
నతనికి విలోముండు నతనికిఁ దుంబురుసఖుండైన యనుండు ననునకు నానక
దుందుభి, నతనికి నభిజిత్తు, నతనికి బునర్వసుఁడు నతనికి నాహుకుండును,
నాహుకియను కన్యయుం గలిగిరి. అయ్యాహుకునికి దేవకుండును నుగ్రసేనుం
డును గలిగిరి. దేవవ దుపదేవ సహదేవ దేవరక్షితాఖ్యలు నలుగురు పుత్త్రులు
దేవకునకుం గలిగిరి. ఈనలుగురికిఁ వృకదేవ యుపదేవ, దేవరక్షిత, శ్రీ దేవ,
శాంతిదేవ, సహదేవ, దేవకి యనునేడ్వురు తోఁబుట్టిన కన్యకలు. ఈయేడ్వు
రను వసుదేవుండు పెండ్లియాడె. ఉగ్రసేనునికిఁ గంస, న్యగ్రోధ, సునా
మానక, శంకు, సుభూమి, రాష్ట్ర పాల, యుద్ధ, తుష్టి సుష్టి మత్సంజ్ఞులు పుత్త్రులు
కలిగిరి. మఱియుఁ గంస, కంసవతి, సుతనువు రాష్ట్రపాలిక యనుకన్యకలుం
గలిగిరి. భజమానునికి విదూరథుండు, నతనికి శూరుండు, నతనికి శమి, యత
నికిఁ బ్రతిక్షత్రుండు, నతనికి స్వయంభోజుండు, నతనికి హృదికుండు, నతనికిఁ
గృతవర్మ శతధను దేవార్హ దేవగర్భాదులు పుత్త్రులు గలిగిరి. దేవగర్భునకు
శూరుండు, శూరునకు మారిష యనుకాంతయందు వసుదేవాదులు పదుగురు
పుత్త్రులు పుట్టిరి. అవ్వసుదేవునిజన్మకాలంబున భగవదంశావతారంబు నిరీ
క్షించి దేవతలు దివంబున నానకదుందుభులు మొఱయించిన వసుదేవునికి
నానకదుందుభి నామంబు కలిగె. అవ్వసుదేవుని భ్రాతలు దేవభాగ దేవ
శ్రవాష్టక కకుచ్చక్ర వత్సధారక సృంజయ శ్యామ శమిక గండూష సంజ్ఞులు
తొమ్మండ్రు గలరు. పృధ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాధిదేవి యను
నామంబులం గలకాంతలు వసుదేవాదులకుఁ దోఁబుట్టినవారు. శూరునకుఁ
గుంతియను సఖుడు కలఁడు. అతం డపుత్రకుండై యుండ నిజపుత్త్రియైన
పృథ నతనికి విధిపూర్వకంబుగఁ బుత్త్రింగా నిచ్చె.

404


చ.

భరితయశోవిశాలుఁడగు పాండునృపాలుఁడు పెండ్లియాడె భా
స్వరకమలేక్షణం బృథ నవంధ్యత ధర్మమరున్మరుత్పతి
స్ఫురదతులప్రభావమునఁ బుట్టిరి ధర్మజభీమఫల్గునుల్
వరగుణు లాపృథాసతికి వారిజవైరికులప్రదీపులై.

405


గీ.

కన్య యగుచుఁ దండ్రికడ నుండి యాపృథా, వనిత కమలబంధువరమువలన
కర్ణుఁ గనియె జగతిఁ గానీనుఁ డన నాతఁ, డధికకీర్తిశాలి యగుచుఁ బరఁగె.

406


క.

ధవళాయతాక్షి యాపృథ, సవతికి మాద్రికి సురూపసంపన్నులు సం
భవిలిరి నందను లిద్దఱు, సవినయు లాశ్వినులు నకులసహదేవు లనన్.

407

వ.

శ్రుతదేవను వృద్ధధర్మ యనుకారూశుండు పెండ్లియాడె. అయ్యంగనయందు
దంతవక్త్రుండను మహాసురుండు పుట్టె. శ్రుతకీర్తిని గేకయరాజు పెండ్లియాడె.
అయ్యంగనయందు సంతర్దనాదులు కైకయు లేవురు పుట్టిరి. రాజాధిదేవిని నవంతి
పతి పెండ్లియాడె. అయ్యంగనయందు విందానువిందు లననిద్దఱు పుట్టిరి. శ్రుత
శ్రవను జేదిపతియగు దమఘోషుండు వెండ్లియాడె. అయ్యంగనయందు శిశు
పాలుండు పుట్టె.

408


సీ.

ఆదిపూరుషుఁ డొక్కఁ డాది హిరణ్యక, శిపునామదైత్యుఁడై విపులబుద్ధి
త్రైలోక్యజనులఁ బరాభవింపఁగ రమా, ధిపుఁడు శ్రీనరసింహదేహుఁ డగుచు
విదళింప నమ్మేను విడిచి యవక్రప, రాక్రమక్రముఁడు సర్వజగదధిక
సంపత్తిధుర్యతాశ్లాఘ్యుండు నగు రావణాసురుం డయి పుట్టి వాసవాది


గీ.

సురలఁ బీడింప హరియు దాశరథి యగుచు, తలలు ద్రుంచిన దమఘోషధరణిపతికి
బుట్ట శిశుపాలుఁడై వానిఁ బట్టి చంపె, చక్రి శ్రీకృష్ణుఁడై వాఁడు చనియె దివికి.

409


వ.

భగవంతుండు ప్రసన్నుండై భక్తుని కభిలషితంబు లేవిధంబున నొసంగు నవ్వి
ధంబున నప్రసన్నుండయ్యును వధించి యభిలషితంబు లొసంగునని చెప్పి
శ్రీపరాశరునకు మైత్రేయుం డిట్లనియె.

410


మ.

అరవిందాక్షునిచే హిరణ్యకశిపుండై రావణుండై మహా
పురుషుం డాహవభూమిఁ జచ్చి విలసద్భోగౌఘము ల్చెంది ని
ష్ణురవృత్తి న్శిశుపాలుఁడై బుధజనిస్తుత్యారిధారాహతిన్
త్వరసాయుజ్యము చెందెనంటిరిగదా ధర్మజ్ఞ చర్చింపఁగన్.

411


క.

మునుపటి రెండుభవంబుల, వనజాక్షుఁడు చంపె నపుడు వరసాయుజ్యం
బొనరక మూఁడవభవమున, నొనరుట కిది యేమి హేతు వోమునినాథా.

412


వ.

ఈయర్థంబు సమర్థింప మీరె సమర్థులని ప్రార్థించిన శ్రీపరాశరుండు మైత్రే
యున కి ట్లనియె.

413


చ.

పురుబలుఁ డాహిరణ్యకశిపుండు రణాంగణభూమి శ్రీనృకే
సరి నతిఘోరవిక్రమవిశంకటజంతువుగాఁ దలంచి భీ
కరుఁడు దశాస్యుఁ డాహవముఖంబున రాముని నొక్కమర్త్యుఁగా
గరిమఁ దలంచి ముక్తినిధిఁ గానక గాంచి రభీష్టభోగముల్.

414


వ.

ఇట్లు హిరణ్యకశిపుండు శ్రీనరసింహదేవుని జంతుమాత్రంబుగాఁ దలంచి రావ
ణుండు రామచంద్రు మర్త్యుగాఁ దలంచి కామాతురుండై జానకీసమాసక్త
చిత్తుండై మృతిం బొంది ముక్తి చేరక హరిచేతం జచ్చుట కారణంబుగా నవ్యా

హతైశ్వర్యసంపన్నుండగు శిశుపాలుండై పుట్టి భగవన్నామంబులందు విరో
ధంబు చేసి యనేకజన్మసంవర్ధితవిద్వేషానుబంధిచిత్తుండై వినిందనతర్జ
నాదులయందుఁ దన్నామంబు నుచ్చరించుచు.

415


సీ.

సజలజీమూతభాస్వరదేహు నురువిధాలాలితాజానుప్రలంబిబాహు
వలమానమకరకుండలకర్ణుఁ ద్రిజగతీకమనీయదివ్యశృంగారపూర్ణు
వైజయంతీసముజ్జ్వలవక్షు శరదాగమావదాతాంభోరుహాయతాక్షు
హేమకౌశేయసంహితకటీరు నుదారహీరకోటీరోరుతారహారు


గీ.

శంఖచక్రగదాహస్తు సకలలోక, సుప్రశస్తుని శ్రీకృష్ణుఁ జూచి చైద్యుఁ
డనిశవైరానుబంధుఁడై యాత్మ దలఁచి, చక్రమునఁ ద్రుంగి సాయుజ్యసరణిఁ జెందె.

416


వ.

ఇత్తెఱంగు నీకుం జెప్పితి, వినుము.

417


గీ.

పలుకఁ దలపోయ వైరానుబంధకలనఁ, జలము గొని తూలనాడ నేచందమైన
పుండరీకాక్షుఁ డిచ్చు నద్భుతవిముక్తి, భక్తులకు నిచ్చుననుచుఁ జెప్పంగ నేల.

418


వ.

వసుదేవునకుఁ బౌరవీ, రోహిణీ, మదిరా, భద్రా, దేవకీప్రముఖలు బహు
భార్యలు కలరు. అందు రోహిణికి బలభద్ర, శకసారణ, దుర్మదాదులు
పుత్త్రులు కలిగిరి. అందు బలదేవుండు రేవతియందు విశఠోల్ముకుల సుపుత్రుల
నిర్వురం గనియె. మఱియు సార్ష్టిమార్ష్టిశిశుసత్యసత్యధృతిప్రముఖులు సారణ
పుత్త్రులు. భద్రాశ్వ, భద్రబాహు, దుర్దమ, భూతాదులు రోహిణీకుల
జాతులు. నందోపనందకృతకాదులు మదిరాపుత్రులు. ఉపనిధి, గదాదులు
భద్రాపుత్త్రులు. కాశికుఁడు వైశాలీపుత్త్రుఁడు. దేవకీదేవికిఁ గీర్తిమత్సు
షేణోదాయుభద్రసేనఋజదానభద్రదేవాఖ్యు లార్వురు పుత్త్రులు పుట్టిరి.
వారలఁ గంసుఁడు చంపె. అనంతరంబ భగవత్ప్రహితయై యోగనిద్ర
యర్ధరాత్రంబున దేవకిసప్తమగర్భంబుఁ గొనివచ్చి రోహిణిజఠరంబునం
బెట్టిన బలభద్రుండు పుట్టి గర్భసంకర్షణంబున సంకర్షణుం డనంబరఁగె. అనం
తరంబ.

419


సీ.

స్థావరజంగమాత్మకజగత్తరుమూల, మసమవేదాంతవేద్యాభిధాన
మమలయోగీంద్రచిత్తాంభోజువాస్తవ్య, మనుపమానందకందాలవాల
మఖిలసురాసురాభ్యర్చితాంఘ్రిసరోజ, మవితర్క్యనిబిడమాయానిధాన
మాశ్రితశ్రమపరిహారిభూరిమహీధ్ర మసురాంధతమసబాలార్కబింబ


గీ.

మాద్య మవ్వాసుదేవాఖ్యమైన బ్రహ్మ, మజుఁడు ప్రార్థింప భూమిభారాపహార
మాచరింపంగ నవతారమయ్యె దేవ, వధూటికి శ్రీకృష్ణదేవుఁ డనఁగ.

420

చ.

హరిమహితప్రభావమహిమాతివివర్ధితయోగనిద్ర సుం
దరసుగుణాభిరామ యగు నందవధూమణికుక్షిఁ బుట్టె న
త్తఱి గ్రహతారకాళి విశదస్థితిఁ బొల్చె నపేతభీతియై
పరఁగె జగంబు ధర్మమయపద్ధతివర్తిజనానుభావ్యమై.

421


గీ.

భూమిభారంబు వారింప భూతలమున, నవతరించినఁ బుండరీకాక్షునకును
భూరిశృంగారవతులు పదాఱువేలు, నూఱునొక్కరు భార్య లైనారు సుమ్ము.

422


వ.

అందు రుక్మిణీసత్యభామాజాంబవతీప్రముఖ లెనమండ్రు పట్టమహిషు లైరి.
అనాదినిధనుండైనహరి యక్కాంతలయందు నెనుబదిలక్షల పుత్రులం
గనియె. వారిలోఁ బ్రద్యుమ్న చారుధేష్ణ సాంబాదులు పదుముగ్గురు శ్రే
ష్ఠులు. అందు.

423


గీ.

ఘనుఁడు ప్రద్యుమ్నుఁ డధికవిఖ్యాతి మేన, మామ రుక్మితనూభవ మహితసద్వి
నయ కుముద్వతి యనెడుకన్యాలలామఁ, బ్రేమ దళుకొత్తఁగా వేడ్క బెండ్లియాడ.

424


వ.

వారలకు ననిరుద్ధుండు పుట్టె. ఈయనిరుద్ధుండు రుక్మిపౌత్త్రి సుభద్రం పెండ్లి
యాడె. వారికి వజ్రుండు వజ్రునకుఁ బ్రతిబాహుండు పుట్టె. ప్రతిబాహునకు
సుచారుండు గలిగె. ఇ ట్లనేకపురుషసంఖ్య గల యదుకులంబుపుత్త్రసంఖ్య
వర్షశతంబులకైన లెక్కింప శక్యంబు గాదు. అక్కుమారవర్గంబులకు విద్య
లఁగఱపు గురువులు మూఁడుకోట్ల యెనుబదియెనిమిదిలక్షలు దేవాసుర
యుద్ధంబున హతులైన మహాబలు లగుదైతేయులు మనుజలోకంబునం బుట్టి
జనోపద్రవకారులై యుండ వారల వధించి భూభారంబుఁ బాపుటకై భగవం
తుం డగు హరి యదుకులంబున నవతరించి ముఖ్యంబైన యదుకులశతంబునకుఁ
బ్రభువై యుండె. ఇట్లు యాదవులు వృద్ధిం బొందిరి. ఈయాదవసంపత్తి విన్న
వారు పాపంబులఁ బాయుదురని చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

425


క.

యదువంశం బెఱిఁగించితిఁ, బదపడి దుర్వసునివంశపద్ధతి నీకున్
విదితంబుగ నెఱిఁగించెద, హృదయం బేకాగ్రవృత్తి నెసఁగఁగ వినుమా.

426


వ.

తుర్వసునకు వహ్ని, వహ్నికి భార్గుండు, భార్గునకు భానుండు, భానునకుఁ గరం
దముండు, కరందమునకు మరుత్తుండు పుట్టె, అతం డనపత్యుండై పౌరవుండైన
దుష్యంతుని బుత్రునింగాఁ గల్పించుకొనియె. ఇట్లు యయాతిశాపంబున
దుర్వసువంశంబు పౌరవవంశంబు నాశ్రయించె. ద్రుహ్యునికి బభ్రువు నతనికి
సేతువును గల్గిరి. సేతువున కారబ్ధండు, నతనికి గాంధారుండు, నతనికి ధర్ముండు,
నతనికి ఘృతుండు, ఘృతునకు దుర్దముండు, నతనికిఁ బ్రచేతుండు, నత

......ర్ముండు పుట్టె. నతఁడు ధర్మబహుళులైన యుదీచ్యమ్లేచ్ఛులకు
......అని చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

427


క.

...యాతికిఁ గలఁ డనుఁడను నాలవకుమారుఁ డతనికిఁ బుత్రుల్
...ర్కులు మువ్వురు, సునిశితబుద్ధిప్రణుతులు శూరాగ్రవరుల్.

428


వ.

......నల చక్షుఃపరమేషుసంజ్ఞులు. అందు సభానలునకుఁ గాలానలుండు
గాలానలునకు సృంజయుండు నతనికిఁ బురంజయుండు నతనికి జనమేజ
యుండు నతనికి మహాశాలుండు నతనికి మహామనుండు నతనికి నుశీనర,
......నిరువురు పుత్త్రులు పుట్టిరి. ఉశీనరునకు శిబి, నృగ, నవ, కృమి,
లైదుగురు పుత్త్రులు గలిగిరి. అందు శిబికి వృషదర్భ, సువీర,
ధ్రకులు నల్వురు పుత్త్రులు గలిగిరి. తితిక్షునకుఁ రుశద్రధుండు
......ముండు హేమునకు సుతపుండు నతనికి బలి పుట్టిరి. అతని క్షేత్ర
......ర్ఘతమసాంగ, వంగ, కళింగ, సుహ్య, పౌండ్రాఖ్యం బైనబాలే
......లంబు పుట్టె. తన్నామసంతతిసంజ్ఞలం గలిగి యైదువిషయంబులు
......లయ్యె. అంగునకు ననపానుండు నతనికి దివిరథుండు నతనికి ధర్మ
......తనికిఁ జిత్రరథుండు గలిగె. నతండు రోమపాదసంజ్ఞం బరఁగు. అనప
త్యుఁడగు యారోమపాదునకే కదా యజపుత్త్రుండైన దశరథుండు శాంతయను
కన్యను కూఁతుంగా నిచ్చె. రోమపాదునకుఁ దురంగుండు తురంగునకుఁ బృథు
......నతనికిఁ జంపుండు గలిగె. అతడు చంపనామనగరంబు నిర్మించె.
......హర్యంగుండు హర్యంగునకు భద్రరథుండు నతనికి బృహద్ర
థుండు నతనికి బృహత్కర్ముండు బృహత్కర్మునకు బృహద్భానుండు నత
నికి ...న్మనుండు నతనికి జయద్రథుండు జయద్రథునకు విజయుండు
విజయునకు ధృతి ధృతికి ధృతవ్రతుండు నతనికి సత్యకర్మ సత్యకర్మకు
యతిరథుండు పుట్టె. అయ్యతిరథుండు కదా గంగకు వచ్చి మందసంబులోఁ దేలి
వచ్చిన పృథాపవిద్ధునిఁ గర్ణనామధేయుఁ బుత్త్రునిగాఁ గైకొనియె. కర్ణునకు
......డు గలిగె. వీర లంగపతులు. పూరునివంశంబు వినుము.

429


క.

......గల్గె బుత్త్రుఁడు, ధీరుఁడు జనమేజయుం డుదీర్ణత నతఁ డ
......లీలఁ గాంచెన్, శ్రీరాజితగుణగణుని బ్రచిన్వంతు సుతున్.

430


వ.

ప్రచిన్వంతుతునకుఁ బ్రవీరుండు ప్రవీరునకు మనస్యుండు, మనస్యునకుఁ
......డు వానికి సుద్యుండు నతనికి బహుగతుండు బహుగతునకు
సంయాతి సంయాతికి నహంయాతి యహంయాతికి రౌద్రాశ్వుండు
రౌద్రాశ్వునకు ఋతేషుప్రముఖులు పదుండ్రుపుత్త్రులు గలిగిరి. అందు ఋతే

షునకు నంతినారుండు నంతినారునకు సుమత్యప్రతిరథధ్రువులను మువ్వురు
కొడుకులు గలిగి రందు అప్రతిరథునకుఁ గణ్వుండు కణ్వునకు మేధాతిథి గల్గిరి.
అతనివలనఁ గణ్వాయనులగు ద్విజులు గల్గిరి. అప్రతిరథునకు మఱియు నైలీ
నుఁడను పుత్రుండు గలిగె. అతనికి దుష్యంతాదులు నలుగురు పుత్త్రులు కలిగి
రందు దుష్యంతుండు ముఖ్యుం డయ్యె.

431


శా.

ఆదుష్యంతధరాతలాధిపతి కుద్యద్భాహుశౌర్యోజ్జ్వల
శ్రీదుర్వారుఁ డఖర్వగర్వరిపురాజిభ్రాజితక్ష్మాధర
హ్రాదిన్యాభుఁడు సంభవించె భరతుం డాశాంతదంతావళ
ప్రోదగ్రశ్రుతిమూలచామరితవిస్ఫూర్జద్యశోభారుఁడై.

432


వ.

ఆభరతునకు మువ్వురు భార్యలయందుఁ దొమ్మండ్రు పుత్త్రులు గలిగిన భర
తుండు చూచి యిప్పుత్త్రులు నాకుం దగినవారు కా రనిన వారితల్లులు నిజపరి
త్యాగభయంబునఁ బుత్త్రులం జంపిరి. ఇట్లు పుత్త్రజన్మంబు వితథంబైనఁ బు
త్రార్థియై భరతుండు మరుత్తులఁ గూర్చి యాగంబు చేసిన బృహస్పతితేజంబు
న నుతద్ధ్యపత్నియైన మమతయందుఁ బుట్టిన భరద్వాజుని మరుత్తు లనుగ్రహిం
చిరి. ఆభరతునకుఁ దొల్లి పుత్త్రజన్మంబు వితథం బగుటం జేసి వితథుండను
నామాంతరంబు గలిగె. అవ్వితథునకు మన్యుండు, మన్యునకు బృహత్క్షత్ర,
మహావీర్య, నగర, గర్గులన నలువురు పుత్త్రులు గలిగిరి. అందు నగరునకు సంకృతి
సంకృతికి గురుప్రీతి రంతిదేవులు గలిగిరి. గర్గునకు శిని యతనికి శైన్యులను
క్షత్రోపేతులైన ద్విజులు కలిగిరి. మహావీర్యునకు దురుక్షయుండు నతనికిఁ
ద్రయ్యారుణి పుష్కరణ కవులను యనుపుత్త్రత్రయంబు గల్గి విప్రత్వంబు
నొందె. బృహత్క్షత్ప్రునకు సుహోత్రుండు నతనికి హస్తి కలిగెను. అతండు
హస్తినాపురంబు నిర్మించె. ఆహస్తికి నజామీఢ, ద్విజమీఢ, పురుమీఢు
లన ముగ్గురునందనులు గల్గిరి. అం దజామీఢునకుఁ గణ్వుండు నతనికి మేధా
తిథి గల్గెను. అతనివలన గణ్వాయననాములైన ద్విజులు పుట్టిరి. అజామీ
ఢునకు మఱియును బృహదిషుండను పుత్రుండు గలిగె. అతనికి బృహద్ధనుండు
నతనికి బృహత్కర్మ యతనికి జయద్రథుండు నతనికి విశ్వజిత్తు నతనికి సేన
జిత్తు నతనికి రుచిరాశ్వకాశ్యదృఢహనువత్సహనుసంజ్ఞులు గలిగిరి. అందు
రుచిరాశ్వునకుఁ బృథుసేనుండు నతనికిఁ బారుండు నతనికి నీలుండు అతనికి
నూర్గురుపుత్త్రులు గల్గిరి. అందుఁ బ్రధానుండు కాంపిల్యాధిపతియైన సమ
రుండు. సమరునకుఁ బొర, సుపార, సదశ్వులను మువ్వురు పుత్త్రులు గలిగిరి.
అందు సుపారునకుఁ బృథుండు, పృథునకు సుకృతి, సుకృతికి విభ్రాజుండు,
విభ్రాజునకు ననుహుండు పుట్టిరి. అతండు శుకునిపుత్త్రికయగు శుర్తిని బెండ్లి

యాడె. అయ్యనుహునకు బృహదత్తుండు నతనికి విష్వక్సేనుండు నతనికి నుద
క్సేనుండు నతనికి భల్లాభుండు కలిగె. ద్విప్రమీఢునకు యవీనరుండు సతనికి
ధృతిమంతుండు నతనికి సత్యధృతి యతనికి దృఢనేమి యతనికి సుపార్శ్వుండు
నతనికి సుమతి యతనికి సన్నతిమంతుండు నతనికిఁ గృతుండు కలిగె. ఆకృతు
నకు హిరణ్యనాభుండు యోగంబు నేర్పెను. ఆకృతుండు చతుర్వింశతిసామ
సంహితలు చేసె. అట్టికృతునకు నుగ్రాయుధుండు గలిగె. అతండు నీపక్షత్త్రియ
క్షయంబు చేసె. అయుగ్రాయుధునకు క్షేమ్యుండు నతనికి సుధీరుండు నతనికిఁ
రిపుంజయుండు నతనికి బహురథుండు కలిగె. వీరలు పౌరవులు. అజామీఢు
నకు నళినియను పత్నియందు నీలుండను పుత్రుండు గలిగె. అతనికి శాంతి శాంతికి
సుశాంతి సుశాంతికిఁ బురంజయుండు నతనికి ఋక్షుండు నతనికి హర్యశ్వుండు
నతనికి ముద్గలిసృంజయబృహదిషుయవీనరకాంపిల్యులు గలిగిరి. వీర లీపంచవిష
యంబులు రక్షింప సమర్థులని పితృదత్తనామంబున పాంచాలసంజ్ఞం బొందిరి.
ముద్గలునకు మౌద్గల్యులన క్షత్రోపేతులైన ద్విజులు గలిగిరి. ముద్గలునకు
హర్యశ్వుండు నతనికి దివోదాసుండును నహల్యయు నన మిథునంబు పుట్టె.
ఆయహల్యను గౌతముండు వరించె. ఆయహల్యయందు గౌతముండు శతా
నందుం గనియె. శతానందునకు ధనుర్వేదపారగుండైన సత్యధృతి గలిగెను.

433


సీ.

దేవాభుఁడగు సత్యధృతి యొక్కనాఁ డప్స, రశ్రేష్ఠమైన నూర్వశి నిజాగ్ర
ధరఁ జూచినపుడ రేతఃపాత మయ్యె నత్తేజంబు రెల్లుపైఁ దెట్టు గట్టి
రెండుభాగములై పరిస్ఫుటంబుగఁ గన్య, కయుఁ గుమారుండునై రయనియుక్తి
కురుపతి శంతనుక్షోణీశ్వరుఁడు వెంట వచ్చి యాశిశువులవంకఁ జూచి


గీ.

కృపకతంబున వారికిఁ గృపియుఁ గృపుఁడు, ననుచుఁ బేరిడి ముదమునఁ బెనిచె నందుఁ
గృపిని ద్రోణుండు వరియించి పృథుభుజాచ, లాభిశోభితుఁ బుత్రకు నధిపుఁ గాంచి.

434


వ.

అశ్వత్థామ యనుపే రిడియె. దివోదానునకు మిశ్రాయువు మిశ్రాయువునకుఁ
జ్యవనుండు చ్యవనునకు సుదాసుండు సుదాసునకు సౌదాసుండు సౌదాసు
నకు సహదేవుండు సహదేవునకు సోమకుండు సోమకునకు జంతుండు పుత్ర
శతజ్యేష్ఠుండై పుట్టె. వారలలోఁ గనిష్ఠుండు పృషతుండు. పృషతునకు ద్రుప
దుండు ద్రుపదునకు ధృష్టద్యుమ్నుండు, ధృష్టద్యుమ్నునకు దృష్టకేతుండు పుట్టె.
అజామీఢునకు మఱియును రుక్షనామకుండు పుత్రుండు గలిగె. రుక్షునకు
సంవరణుండు సంవరుణునకుఁ గురువు కలిగె. అతండ కదా తనపేరఁ నిక్కురు
క్షేత్రంబు చేసె. కురువునకు సుధనుర్జహ్నుపరీక్షిత్ప్రముఖులు గలిగిరి. సుధ
నువునకు సుహోత్రుండు నతనికిఁ జ్యవనుండు నతనికిఁ గృతకుండు నతని కుపరి

చరవసువు నతనికి బృహద్రథ, ప్రత్యగ్ర, కుశాంబ, కుచేల, మాత్స్య
ప్రముఖు లేడ్వురు గలిగిరి. బృహద్రథునకుఁ గుశాగ్రుండు నతనికి వృష
భుండు నతనికిఁ బుష్పవంతుండు నతనికి సత్యహితుండు నతనికి సుధన్వుండు
నతనికి జతుండు గలిగె. మఱియు బృహద్రథునకుఁ గుమారశకలద్వయంబు
పుట్టె. అది జరచేత సంధింపంబడుటం జేసి జరాసంధుండనఁ బుత్రుండు
గలిగె. అతనికి సహదేవుండు నతనికి సోమపుండు నతనికి శ్రుతిశ్రవుండు
కలిగె. వీరలు మాగధులను భూపాలు రైరని చెప్పి శ్రీపరాశరుండు మైత్రే
యున కిట్లనియె.

435


క.

వినుము మునీంద్ర! పరీక్షి, జ్జననాథున కాత్మజులు విశాలయశస్కుల్
జనియించిరి నలువురు, తద్ఘనచరితము నీకుఁ జెప్పెదం బరిపాటిన్.

436


వ.

పరీక్షితునకు జనమేజయశ్రుతసేనోగ్ర సేనభీమసేనులు నల్వురుపుత్రులు
కలిగిరి. జహ్నునకు సురథుండు సురథునకు విదూరథుండు, విదూరథునకు
సార్వభౌముండు, సార్వభౌమునకు జయత్సేనుండు, జయత్సేనునకు నారా
ధితుండు, నారాధితున కయుతాయువు, నయుతాయువునకు నక్రోధనుండు,
నక్రోధనునకు దేవాతిథి, దేవాతిథికి ఋక్షుండు, ఋక్షునకు భీమసేనుండు,
భీమసేనునకు దిలీపుండు, నతనికిఁ బ్రతీపుండు, ప్రతీపునకు దేవాపి, శంతను,
బాహ్లీకులు ముగ్గురు పుత్రులు పుట్టిరి. అందు దేవాపి కొండుకనా డర
ణ్యంబు ప్రవేశించిన శంతనుండు రాజయ్యె వినుము.

437


క.

శంతనుఁ డశేషశాత్రవ, కృంతనుఁడై జలధివృతనిఖిలభూవలయా
క్రాంతి మహనీయతరవి, క్రాంతి విభాసితుఁడు వెలసె రవిచందమునన్.

438


గీ.

చేతనంటినవృద్ధుండు చిఱుతవయను, నొంది మహనీయశాంతిఁ బెంపొందుకతన
శంతనుం డని తను జనుల్ సన్నుతింప, వెలసెఁ గొనియాడదరమె యవ్విభునిమహిమ.

439


వ.

ఇట్లు రాజ్యం బేలుచున్నంత.

440


ఉ.

శంతనుఁ డేలుదేశము ప్రజల్ బెగడొందఁగ వృష్టి మాన్చె జం
భాంతకుఁ డద్భుతం బొదవ నబ్దములాఱును నాఱు నమ్మహీ
కాంతుఁడు నంత విప్రతతిఁ గన్గొని నాయపరాధ మేమి దు
ర్దాంతనితాంతలోకభయదప్రళయావహవృష్టిహానికిన్.

441


క.

అని తము నడిగిన యాశం, తనుఁ గనుగొని విప్రవరులు నరనాయక! యీ
యనుపమితావగ్రహ మి, ట్లొనరుటకుం గలదు హేతువొక్కటి వినుమా.

442

అన్న దేవాపి యాది రాజ్యార్హుఁ డుండ, నీవు మేదిని నేలుచున్నావు దీన
నవనినాయక! పరివేత్త వైతి వేత, దఘముకతన ననావృష్టియయ్యెఁ జువ్వె.

443


వ.

అనిన శంతనుం డింక నే నేమి చేయవలయుననిన నెంతకాలంబు దేవాపి
పతనాదిదోషములచేత నభిభూతుండు గాకయుండు నాపర్యంతంబును
రాజ్యంబునకు నతం డర్హుం డతనికి రాజ్యం బీయవలయుననిన విని శంతనుని
మంత్రి ప్రవరుం డరణ్యంబునకుం బోయి తపస్వుల వేదవాదవిరోధవక్త
లంగాఁ బ్రయోగించిన వారిచేత దేవాపి ఋజుమతి యయ్యును మతి
భ్రంశంబు నొంది వేదవాదంబులు దూషించి పతితుం డయ్యె. అంత బ్రాహ్మ
ణులు శంతనుపాలికిం జని యిట్లనిరి.

444


గీ.

రమ్ము నృపవర యింత నిర్బంధ మేల, శాంత మయ్యె నవగ్రహాక్రాంతిదోష
మితర మిఁక నేల దేవాపి పతితుఁ డయ్యె, కేరి వేదంబు దూషించుకారణమున.

445


వ.

అన్న పతితుండైనఁ దమ్మునికిఁ బరివేతృత్వంబు లేదు, రమ్మని పిలిచిన శంతనుండు
పురంబునకు వచ్చి రాజ్యంబు చేసె. దేవాపి పతితుండైనఁ బర్జన్యుండు వర్షించె.
అఖిలధరామండలంబున సస్యసంపదలు వొదివె. బాహ్లికునకు సోమదత్తుండు
సోమదత్తునకు భూరిభూరిశ్రవశ్శల్యసంజ్ఞలుగల పుత్రత్రయంబు గలిగె.
శంతనునకు జాహ్నవియందు నుదారకీర్తియు నశేషశాస్త్రార్థవేదియు నైన
భీష్ముండు గలిగె. ఆశంతనునకే సత్యవతియందు చిత్రాంగదవిచిత్రవీర్యులను
నిద్దఱుపుత్రులు గలిగిరి. అందుఁ జిత్రాంగదుండు బాలత్వంబునన చిత్రాంగ
దుండను గంధర్వునితోఁ బోరి తెగిన విచిత్రవీర్యుఁడు రాజై కాశిరాజదుహి
తల నంబికాంబాలికలం బెండ్లి యాడి నిరంతరతదుపభోగంబున రాజయక్ష్మ
గృహీతుండై యస్తమించిన సత్యవతీదేవి తత్పుత్రుండైన కృష్ణద్వైపాయను
నియోగించిన మాతృవచనంబు పాటించి విచిత్రవీర్యక్షేత్రంబుల ధృతరాష్ట్ర
పాండులను, దత్పరిచారికయందు విదురునిం గనియె. ధృతరాష్ట్రుండును దుర్యో
ధనదుశ్శాసనప్రధానంబైన పుత్రశతంబుం గనియె. పాండుండును నరణ్యం
బున మృగశాపోపహతప్రజననసామర్థ్యుండై, ధర్మవాయుశక్రులవలనఁ
గుంతియందు యుధిష్ఠిరభీమసేనార్జునులం గనియె. అశ్వినులవలన మాద్రి
యందు నకులసహదేవులం గనియె. ఇట్లు పాండవు లేవు రైరి. వారలకు ద్రౌపది
యందు గ్రమంబునఁ బ్రతివింధ్య, శ్రుతసేన, శ్రుతకీర్తి, శతానీక, శ్రుత
కర్ములనం గలిగిరి. మఱియును యుధిష్ఠిరుండు యౌధేయియను కాంతయందు
దేవకుండను పుత్రుం గనియె. భీమసేనుండు హిడింబయందు ఘటోత్కచుం
గనియె. మఱియు భీమసేనుండు కాశియను కాంతవలన సర్వగుండను
పుత్రునిం బడసె. సహదేవుండు విజయయందు సుహోత్రునిం గనియె. నకు

లుండు రేణుమతియందు నిరమిత్రునిం గనియె. అర్జునుం డులూపి యను
నాగకన్యకయందు నిలావంతుండను పుత్రునిం గనియె. మఱియు నర్జునుండు
మణిపూరపతి పుత్త్రియైన చిత్రాంగదయందుఁ బుత్రికాధర్మంబున బభ్రు
వాహునుం గనియె. సుభద్రయందు బాలుం డయ్యును నతిబలపరాక్రమాసమ
స్తాతిరథవిజేత యైన యభిమన్యునిం గనియె.

446


క.

ఉత్తర పెండిలియై లో, కోత్తరుఁ డభిమన్యుఁ డురుగుణోజ్వలు ధరణీ
భృత్తిలకాయితుఁ గరుణా, యత్తు పరిక్షిత్తుఁ గనియె నద్భుతచరితున్.

447


వ.

అప్పరిక్షితుండు తల్లిగర్భంబున నున్నయప్పు డశ్వత్థామ యపాండవంబుగా
దివ్యాస్త్రంబు ప్రయోగించినఁ జరాచరగురుండగు హరి కరుణించి రక్షించె.
కులంబు క్షీణించుతఱిం బుట్టుటం జేసి పరిక్షిన్నామం బితనికిం గలిగె. అప్ప
రిక్షితుం డిప్పుడు ధర్మక్రమంబున భూమండలం బేలుచున్నాఁడని శ్రీపరా
శరుండు మైత్రేయున కిట్లనియె.

448


క.

భరితవివేక భవిష్య, న్నరపాలుర వినుము సజ్జనస్తవనీయో
త్తరకీర్తికౌముదీవృత, ధరణీకకుబంతరుల సుధాకరనిధులన్.

449


వ.

ఇప్పుడు భూమండలం బేలు పరిక్షిత్తునకు జనమేజయశ్రుతసేనోగ్రసేనభీమ
సేను లన నలువురు పుత్రులు పుట్టెదరు. అందు జనమేజయునకు శతానీకుండు
పుట్టును. ఆ జనమేజయుండు యాజ్ఞవల్క్యునివద్ద వేదంబు చదివి కృపుని
వలన దివ్యాస్త్రంబులు పడసి విషయవిరక్తచిత్తుండై శౌనకోపదేశంబున
నాత్మవిజ్ఞానప్రవీణుండై పరమనిర్వాణంబు నొందఁగలండు. శతానీకునకు
నశ్వమేధదత్తుండు నతనికి నధిసీమకృష్ణుండు నతనికి నిచక్నుండు పుట్టును.
అతఁడు హస్తిపురము గంగాపహృతము కాఁగాఁ గౌశాంబియందు నివసింపఁ
గలడు. అతనికి నుష్ణుండ నతనికి విత్రరథుండు నాతనికి శుచిరథుండు
నతనికి వృష్ణిమంతుండు నతనికి సుషేణుండు నతనికి సునీధుండు నతనికి నృపచ
క్షుండు నతనికి సుఖబలుండు నతనికిఁ బరిప్లపుండు నతనికి సునయుండు నతనికి
మేధావియు నతనికి రిపుంజయుండు నతనికి నుర్వుండు నతనికిఁ దిగ్ముండు నత
నికి బృహద్రథుండు నతనికి వసుదానుండు నతనికి శతానీకుండు నతని కుదయ
నుండు నతనికి విహీనరుండు నతనికి దండపాణి యతనికి నిమిత్తుండు నతనికి
క్షేమకుండును గలుగంగలరు. ఇట్లు బ్రహ్మక్షత్రకారణంబును, దేవర్షి
సత్కృతంబును నైన సోమవంశంబు క్షేమకునినుండి నాశంబు నొందంగల
దని చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

450

గీ.

వరతపోధన యిక్ష్వాకువంశ్యులైన, భావిభూతలపతుల నేర్పఱుతు వినుము
చటుల భారతరణమహీస్థలిని శాత, బాణహతుఁ డయ్యె నాబృహద్బలుఁడు ఘనుఁడు.

451


వ.

ఆబృహద్బలునికి బృహత్క్షణుండు నతనికి నురుక్షయుండు నతనికి వత్సవ్యూ
హుండు నతనికిఁ బ్రతివ్యోముఁడు నతనికిఁ దివాకరుండు నతనికి సహ
దేవుండు నతనికి బృహదశ్వుండు నతనికి భానురథుండు నతనికిఁ బ్రతీతా
శ్వుండు నతనికి సుప్రతీకుండు నతనికి మరుదేవుండు నతనికి సునక్ష
త్రుండు నతనికిఁ గిన్నరుండు నతనికి నంతరిక్షుండు నతనికి సుపర్ణుండు
నతనికి మిత్రజిత్తు నతనికి బృహద్భాజుండు నతనికి ధర్మి యతనికిఁ గృతం
జయుండు నతనికి రణంజయుండు నతనికి సంజయుండు నతనికి శాక్యుండు
నతనికి శుద్ధోదనుండు నతనికి రాహులుండు నతనికిఁ బ్రసేనజిత్తు నతనికి
క్షుద్రకుండు నతనికిఁ గుండకుండు నతనికి సురథుండు నతనికి సుమిత్రుం
డునుం గలిగెదరు

452


గీ.

పరమసువ్రత యిక్ష్వాకువంశ మవని, కలియుగమున సుమిత్ర౦డు కడపలగను
నాశమొందెడు మగధభూనాథవంశ, భావిభూతలపతుల నేర్పఱుతు వినుము.

453


వ.

మగధవంశప్రభుండగు జరాసంధునకు సహదేవుండు, సహదేవునకు సోమాపి,
సోమాపికి శ్రుతశ్రవుండు, శ్రుతశ్రవున కయుతాయువు, నయుతాయువునకు
నిరమిత్రుండు, నిరమిత్రునకు సునేత్రుండు, సునేత్రునకు బృహత్కర్ముండు,
బృహత్కర్మునకు సేనజిత్తు, సేనజిత్తునకు శ్రుతంజయుండు, శ్రుతంజయునకు
విప్రుండు, విప్రునకు శుచి, శుచికి క్షేమ్యుండు, క్షేమ్యునకు సువ్రతుండు,
సువ్రతునకు ధర్ముండు, ధర్మునకు సుశ్రవుండు, సుశ్రవునకు దృఢసే
నుండు, దృఢసేనునకు సుబలుండు, సుబలునకు సునీతుండు, సునీతునకు సత్య
జిత్తు, సత్యజిత్తునకు విశ్వజిత్తు, విశ్వజిత్తునకు రిపుంజయుండును బుట్టఁగలరు.
వీరలు బార్హద్రథులు; రాజులై వెయ్యేండ్లు భూపాలనంబు చేయఁగలరు.
ఆరిపుంజయుని యమాత్యుండు మునికుండనువాఁడు స్వామియైన రిపుంజ
యునిం జంపి ప్రద్యోతుండను తనపుత్రునిం బట్టంబు కట్టంగలండు. ఆ ప్రద్యో
తునకు బలాకుండను పుత్రుండు గలుగు. వానికి విశాఖయూపుండు, వానికి
జనకుండు, వానికి నందివర్ధనుండు, వానికి నందియుఁ గలుగుదురు. ఈ ప్రద్యోత
వంశ్యులు నూటముప్పదియాఱేండ్లు భూమి పాలింతురు. తదనంతరంబ శిశు
నాభుండు, వానికిఁ గాకవర్ణుండు, వానికి క్షేమధర్ముండు, వానికి క్షతౌజుండు,
వానికి విధిసారుండు, వానికి నజాతశత్రుండు, వానికి నర్భకుఁడు, వాని కుదయనుండు,
వానికి నందివర్ధనుండు, వానికి మహానంది పుట్టెదరు. వీరు శిశునాభవంశంబు
భూపాలకులు. మున్నూట యిరువదాఱేండ్లు భూమి పాలించెదరు. అంత.

454

గీ.

మునివవరేణ్య మహాపద్ముఁ డనెడురాజు, ధరణి యేకాతపత్రమై తనరుచుండఁ
దనదుశానన మొరులకు దాఁటరాక, యుండఁ బాలించు సత్కీర్తు లుప్పతిల్లి.

455


వ.

ఆమహాపద్మునకు సుమాల్యాదు లెనమండ్రు పుత్రులు పుట్టి నూఱేండ్లు భూ
మండలం బేలెదరు. తొమ్మండ్రు నందులను గౌటిల్యుండను బ్రాహ్మణుండు
సముద్ధరింపంగలండు. వారు వోయినపిమ్మట మౌర్యులు పృథివి యనుభవింపం
గలరు. అక్కౌటిల్యుండు చంద్రగుప్తునికి రాజ్యంబునకుఁ బట్టంబు గట్టం
గలండు. చంద్రగుప్తునకు బిందుసారుండు, నతనికి నశోకవర్ధనుండు, నతనికి
సుయశుండు, నతనికి దశరథుండు, నతనికి సంయుతుండు, నతనికి శాలిశూకుండు,
నతనికి సోమశర్ముండు, నతనికి శతధన్వుండు, నతనికి బృహద్రధుండునుం
గలిగెదరు. ఇట్టి మార్యులు పదుండ్రును నూటముప్పదేడు సంవత్సరంబులు
భూమి యనుభవించెదరు. తదనంతరంబ శుంగులు భూమి యనుభవించెదరు.
పుష్యమిత్రుని సేనాపతి స్వామిం జంపి రాజ్యంబు చేయఁగలఁడు. అతనికి నగ్ని
మిత్రుండు, నతనికి సుజ్యేష్ఠుండు, నతనికి వసుమిత్రుండు, నతనికి నుదంకుండు,
నతనికిఁ బుళిందకుండు, నతనికి ఘోషవసుండు, నతనికి వజ్రమిత్రుండు, నత
నికి భాగతుండు, నతనికి దేవభూతియుం గలిగెదరు. వీరు పదువురు శుంగులును
నూటపండ్రెండేండ్లు భూమి ననుభవింపంగలరు. అంతట నివ్వసుంధర కణ్వుల
పాలు కాఁగలదు. శుంగరాజైన దేవభూతి వ్యసనియై యుండ నతని యమా
త్యుండు కణ్వవసుదేవనామకుండు నిజస్వామియైన దేవభూతిం జంపి యవని
యనుభవింపఁగలఁడు. అతనికి భూమిమిత్రుండు, నతనికి నారాయణుండు,
నతనికి సుశర్ముండునుం గలిగెదరు. ఈ కాణ్వాయనులు నలువురును నలువది
యేనేండ్లు భూమి ననుభవింపంగలరు. ఆసుశర్ముని దద్భృత్యుండు నాంధ్ర
జాతీయుండు బలిరపుచ్ఛకనాముండు చంపి వసుధ యనుభవింపఁ
గలఁడు. తదనంతరం బాతని భ్రాత కృష్ణనామధేయుండు రాజు కాఁగలఁడు.
అతనికి శ్రీశాతకర్ణి, యతనికిఁ బూర్ణోత్సంగుండు, నతనికి శాతకర్ణి, యతనికి
లంబోదరుండు, నతనికి పిలకుండు, నతనికి మేఘస్వాతి, యతనికిఁ బటు
మంతుండు, నతనికి నరిష్టకర్ముండు, నతనికి హలాహలుండు, నతనికిఁ బలలకుండు,
నతనికిఁ బుళిందసేనుండు, నతనికి సుందరుండు, నతనికి శాతకర్ణి, యతనికి
శివస్వాతి, యతనికి గోమతిపుత్రుండు, నతనికి నలిమతుండు, నతనికి
శాంతకర్ణి, యతనికి శివశ్రితుండు, నతనికి శిరస్కంధుండు, నతనికి యజ్ఞశ్రీయు,
నతనికి ద్వియజ్ఞుండు, నతనికిఁ జంద్రశ్రీయు, నతనికిఁ పులమాపియునుం
గలిగెదరు. వీరు నన్నూటయేఁబదియాఱేండ్లు భూమి యనుభవింపంగలరు.
ఆంధ్రభృత్యు లేద్వురును ఆభీరులు పదుండ్రును, గర్దభులును భూభుజులుగా

గలరు. అనంతరంబ యెనమండ్రు యవనులు, పదునలుగురు తురుష్కారులు
పదుముగ్గురు ముండులు పదునొకండ్రు మౌనులు నను వీరిందఱు వెయ్యి
మున్నూటతొంబదేండ్లు భూమి యనుభవించెదరు. వీరు పోయిన కైంకిలు
లైన యవనులు నమూర్థాభిషిక్తులు భూపతులు కాఁగలరు. వారలకు
వింధ్యశక్తి వింధ్యశక్తికిఁ బురంజయుండు వానికి రామచంద్రుండు నత
నికి ధర్ముండు నతనికి వంగుండు నతనికి నందనుండు నతనికి సునంది పుట్టెదరు.
అతనిభ్రాత యగునంది యశుండు శుక్రుండు ప్రవీరుండును వీరుండును నూట
యాఱువర్షంబులు భూమి యనుభవించెదరు. వారిపుత్రులు పదుమువ్వురు
బాహ్లికులు మువ్వురు తదనంతరంబ పుష్యమిత్రపటుమిత్రులు పదుమువ్వురు
నాంధ్రు లేడ్వురును కోసలయందుఁ దొమ్మండ్రును భూపతులు కాఁగలరు. వారె
నైషధులు. మాగధయందు విశ్వస్ఫటికసంజ్ఞుం డన్యవర్ణంబులఁ గల్పింపఁ
గలఁడు. అఖిలక్షత్త్రకులంబు నణించి మగధులు గంగాప్రయాగసమీపం
బునఁ బద్మావతీపురంబున నుండి భూమి ననుభవింపఁగలరు. కోసలాంధ్ర
పుండ్రతామ్రలిప్తసమతటపురములను దేవరక్షిత యనువాఁడు రక్షింపఁ
గలండు. కళింగమాహిషమహేంద్రజనపదంబులను భౌమపురంబును
గుహు లనుభవించెదరు. నైషధనైమిషకకాలకోశకజనపదంబులను మణి
ధాన్యకవంశబు లనుభవింపఁగలరు. త్రైరాజ్యముషికజనపదంబులను కన
కాహ్వయుఁడు భుజించును. సౌరాష్ట్రావంత్యశూద్రాభీరదేశములను నర్మదా
మరుభూమివిషయములను వ్రాత్యద్విజాభీరశూద్రాదు లనుభవించెదరు.
సింధుతటదావికోర్వీచంద్రభాగాకాశ్మీరవిషయంబులను వ్రాత్యమ్లేచ్ఛ
శూద్రాదు లనుభవించెదరు. వీరు కలియుగమున సకాలికులగు రాజులు కాఁ
గలరు. వినుము.

456


సీ.

అల్పప్రసాదులు నధికకోపులు సర్వకాలానృతాధర్మలోలమతులు
స్త్రీబాలగోవధాదికపాపకర్తలు పరధనహరణస్వభావరుచులు
స్వల్పసారకు లుదితాస్తమితప్రాయు లల్పతరాయుష్యు లధికకాము
లల్పధర్మారంభు లగుదురు భూపతుల్ వా రేలుజనపదవాసు లెల్ల


గీ.

పతులకైవడి నన్యాయపథచరిష్ణు, లగుచు మ్లేచ్ఛులనడవడి నధికకలుష
కర్ములై నాశ మొందంగఁ గలరు పరమ, యోగసంపన్న! యక్కలియుగమునందు.

457


వ.

అనృతకార్యంబులే వ్యవహారహేతువులుగా స్త్రీత్వంబే యుపభోగహేతువుగా
నధర్మతామూలంబే వృద్ధిహేతువుగా బ్రహ్మసూత్రంబే బ్రాహ్మణత్వ
హేతువుగా లింగధారణంబే యాశ్రమహేతువుగా నన్యాయంబే వృత్తి
హేతువుగా నభయప్రగల్భోచ్చారణంచే పాండిత్యహేతువుగా స్నాన

మాత్రంబే ప్రసాధనహేతువుగా, స్వీకరణమాత్రంబే వివాహహేతువుగా,
నద్వేషధారణమాత్రంబే పాత్రంబుగా, దూరానయనోదకమాత్రంబే
తీర్థంబుగా ని ట్లనేకదోషంబులు గలిగి కలివేళ భూమండలంబున సర్వవర్ణం
బులు క్షీణంబులు కాఁగలవు. వినుము.

458


క.

ఏజాతియైనఁగానీ, భూజనములలోన బలిమి పొదలినవాఁడే
రా జగు కలియుగవేళ ధ, రాజనముల నొడిచికొని కరము గైకొనుచున్.

459


వ.

ఇవ్విధంబున.

460


ఉ.

లోలవిహారశీలు లతిలోభులు క్రూరులునై ననీచభూ
పాలకు లేచఁ బీడవడి పాడియుఁ బంటయు లేక భూప్రజల్
శైలవనప్రదేశముల చక్కి వసింతురుగాక కందముల్
మూలఫలంబు లున్మధువులు న్దళపుష్పములున్ భుజించుచున్.

461


క.

తరువల్కపర్ణచీరా, వరణు లగుచు శీతవాతవర్షాతపదు
ర్భరపీడ కోర్చి గాఢా, తురత నశరణత్వ మందుదురు ప్రజలెల్లన్.

462


గీ.

ఏడనైనను నిరువదిమూఁడువత్స, రములు బ్రతుకఁడు నరుఁడు ధరాస్థలమునఁ
గలియుగవసానమున ని ట్లఖిలజగంబు, లనుదినంబును నాశంబు నందఁగలవు.

463


వ.

శ్రౌతస్మార్తధర్మంబులు విప్లవంబు నొందిన నచరాచరంబైన జగంబు క్షీణ
ప్రాయంబైన కలియుగంబు నంతంబున.

464


సీ.

అఖిలజగత్స్రష్టయై చరాచరగురుండై సర్వమయుఁడయి యప్రమేయుఁ
డై బ్రహ్మమై సముద్యచ్ఛక్తిచే నొప్పు వాసుదేవుని యనిర్వాచ్యమైన
యంశంబు శంబరాఖ్యగ్రామముఖ్యుఁడౌ విష్ణుయశుండను విప్రునకును
కల్కినా జనియించి కలుషాస్పదీభూతకలివసానోద్భూతకలితపాత


గీ.

కాఖిలమ్లేచ్ఛతతుల దీవ్యత్కరాగ్ర, జాగ్రదుగ్రలసన్మండలాగ్రఘోర
ధారఁ జక్కాడి ధారుణీస్థలమునందుఁ, బొందుగా నిల్పుఁ గృతధర్మములు మునీంద్ర.

465


వ.

అనంతరం బశేషకల్యవసాననిశావసానంబున జనపదంబులయండు శేషించిన
జలకు విమలబుద్ధి జనించు, కృతయుగంబునకు బీజభూతులగు నశేష
మనుష్యులకుఁ దత్కాలంబున నపత్యంబులు పుట్టి కృతయుగధర్మానుసారులై
వృద్ధిఁ బొందుదురు. వినుము.

466


గీ.

అబ్జుఁ డర్కుండు తిష్యంబు నమరగురుఁడు, నేకరాశిస్థు లయ్యెద రెన్నఁడేని
నాఁడె కృతము ప్రవేశించు నవ్యధర్మ, జననకారణనిజసముచ్ఛ్రయము వెలయ.

467


వ.

అతీతవర్తమానానాగతభూపాలుర నీ కెఱింగించిని. పరీక్షిత్తుజన్మంబు మొదలు
కొని నందాభిషేకపర్యంతంబు వేయునేఁబదివత్సరంబులు సప్తఋషుల

లోపలను బూర్వోదితులగు నిద్దఱినడుమ సమంబుగా నేనక్షత్రంబు గానం
బడు దానితోఁ గూడి యాసప్తర్షులు మనుష్యమానంబున నూఱేం డ్లుండుదురు.
పరీక్షిత్తునికాలంబున సప్తర్షులు మఘానక్షత్రమున నుండుదురు. అది మొదలు
ద్వాదశాబ్దశతాత్మకంబైన కలి ప్రవేశించి యుండు.

468


చ.

నవసరసీజనేత్రుఁడు జనస్తవనీయుఁడు కృష్ణుఁ డెన్నఁ డే
దివమున కేగు నాఁడె జగతిం గలి వొందెఁ దదీయదివ్యప
ద్భవరజ మంటి మేదిని శుభస్థితి నుండెడునాఁడు చేర రా
దవిరళపాపయుక్తిగల యక్కలికిన్ మునిలోకపూజితా.

469


వ.

భగవంతుండైన పుండరీకాక్షుండు దినంబునకుం బోయిన కలి ప్రవేశించిన
తదనంతరంబ విపరీతంబులగు దుర్నిమిత్తంబులు చూచి యుధిష్ఠిరుండు పరీక్షిత్తు
నభిషిక్తుం జేసి మహాప్రస్థానంబు చేసె. ఎన్నఁడేని సప్తర్షులు పూర్వాషాఢం
బ్రవేశించెదరు నా డనందుఁడు కడచను. అచ్చటనుండి కలి ప్రవృద్ధంబగు.
అట్టి కలియుగసంఖ్య వినుము.

470


క.

అరయఁగ లక్షత్రయమును, నఱువదివేలుఁ నగు మానుషాబ్దంబులు నీ
వెఱుఁగుము కలియుగమునకున్, సరి డెబ్బదిరెండువేలు సంధ్యబ్దంబుల్

471


వ.

ఏతత్పరిణామంబగు కలియుగంబు నిశ్శేషంబైన కృతయుగంబు ప్రవేశించు.
యుగయుగంబున మహాత్ములగు బ్రాహ్మణక్షత్రియవైశ్యులు గలరు. వారికులం
బులు నామధేయంబులును ననేకంబు లగుట జేసి యెఱింగింపనైతినని చెప్పి
శ్రీపరాశరునకు మైత్రేయుం డిట్లనియె.

472


సీ.

పౌరవవంశసంభవుఁడు దేవాపియు, నిక్ష్వాకుకులజుఁడై యెసఁగు మరుఁడు
పరమయోగాభ్యాసపరత కలాపక, గ్రామంబునం దుండి కలియుగంబు
చన్నచోఁ గృతయుగసమయంబునందు, క్షత్రప్రవర్తకు లయ్యెదరు మునీంద్ర
యుగముల మూఁటియం దుర్వి పాలింతురు, మనుతనూభవు లీక్రమంబు వెలయ


గీ.

కలియుగంబున నితరజాతులు ధరిత్రి, యేలుదురు నీకుఁ జెప్పితి నెల్లనృపుల
వంశకర్తల సంక్షేపవర్ణనమున, నంతయును జెప్ప నలవియె యజునకైన.

473


వ.

పృథివిగీతల యర్థంబు వినుము.

474


మ.

ఇది నాభూమి మదీయపుత్రకుఁడు వీఁ డేలంగలం డింకఁ జం
పెద విద్వేషులఁ దద్ధరాస్థలము పేర్మింబెంపుతో నేలెదన్
సదయం బొందెద నంచు నయ్యుగచతుష్కక్ష్మాపతిశ్రేణి దు
ర్మదమోహంబులఁ ద్రుంగెఁ గాని పరమార్థజ్ఞానిగాఁ డెవ్వఁడున్.

475

గీ.

ధరణిపై ఘోరసంగరస్థలములందు మడియురాజులఁ జూచి యిప్పుడమి నవ్వు
నహహ తమసొమ్మనానే ననర్థమైన, మమత నూరక మూఢులై సమసి రంచు.

476


ఉ.

ఎంతని యెంచవచ్చు ధరణీశులమోహమహాతమంబు వి
భ్రాంతి నమాత్యభృత్యులను బౌరులఁ గెల్చి యనంతరంబ వి
క్రాంతి నరాతులం గెలిచి గహ్వరియంతయు నాక్రమించి ని
శ్చింతత నేలువారమని శీఘ్రము చెందుదు రుగ్రమృత్యువున్.

477


వ.

సాగరసంవృతంబైన భూమండలం బాక్రమించినను జిత్తశాంతి కల్గునే, చిత్త
శాంతి గల్గి యాత్మజయంబు చేసి ముక్తిఫలంబు చెందవలయు.

478


గీ.

తాతతండ్రు లొకింతయుఁ ద్రవ్వి నన్నుఁ గొంచుఁబోవుట లేదుగాఁ గుటిలు లగుచుఁ
దనయు లేటికి మన్మమతాలతాని, బద్ధులై కూలెదరు ఘోరయుద్ధభూమి.

479


క.

ఎన్నక తండ్రులఁ దమ్ముల, నన్నలనైన న్వధింతు రక్కట నాకై
ము న్నేనరపతులైనను, నన్ను సతము చేసి నిలిచినారా యెందున్.

480


గీ.

మమత నఖిలోర్వి యేలిన మనుజపతులు, పోవఁజూచియు నిలిచిన భూమిపతులు
నిది మదీయమహీస్థలి యేమ యనుభ, వింతుమని నాశ మొందెంద రెంతవింత.

481


ఉ.

నామహి నీకు నేలనగునా, యిదె వేగ నతిక్రమించి నా
నామదమోఘసాయకగణంబుల మున్ను వధించి కొందు నా
భూమియటంచు దూతలఁ బ్రభుత్వమునం బరరాజుపాలి కు
ద్దామతనంపువారిఁ గని తాల్తు దయారసమందహాసముల్.

482


వ.

అని యిట్లు తొల్లి యంసకుండనుముని జనకునకుం జెప్పిన పృథివీగీతార్థంబు
చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

483


క.

ధరణిగీతార్థము విను, పురుషులహృదయముల మమత పొలియు నుదయభూ
ధరశిఖరారూఢాహ, స్కరుఁ గని హిమచయము పొలియుకైవడి మఱియున్.

484


వ.

ఇమ్మనువంశంబు నీకుఁ జెప్పితి. ఇందు భగవదంశభూతులైన రాజులు పుట్టిరి.
వీరిచరితంబు విన్న నశేషపాపక్షయంబును బుత్రపౌత్రధనధాన్యాయు
రారోగ్యంబులును నభివృద్ధియునగు. సూర్యసోమాన్వయసంభవులగు నిక్ష్వాకు,
జహ్ను, మాంధాతృ, సగరావిక్షితరఘువులను, యయాతినహుషాదులను,
విన్నఁ బురుషునకు మమత్వాదిదోషంబులు పొరయకుండు.

485


గీ.

క్రతువు లొనరించి దానధర్మములు చేసి, ఘోరరణముల వైరులఁ గూల్చి సర్వ
వసుమతియు నేలి మేదినీవరులు పొలిసి, పోయిరే కాక నిలిచిరే భూమిమీఁద.

486

సీ.

అఖిలలోకముల నవ్యాహతగతియైన, వైన్యుండు నిలిచెనే వసుధమీఁద
ఇల యేడుదీవులు నేలిన కార్తవీ, ర్యార్జునుం డుండెనే యవనిమీఁద
సార్వభౌమత్వప్రశస్తుఁడౌ మాంధాతృ, ధరణీశుఁ డుండెనే ధరణిమీఁద
గంగావతరణవిఖ్యాతిమంతుఁడు భగీ, రథుఁడు నిల్చెనె యుర్వరాస్థలమున


గీ.

గురుయశస్కులు సగరకకుత్స్థరామ, రావణయుధిష్ఠిరాదిభూరమణు లిపుడు
నామమాత్రావశేషు లైనారు గాని, నిలిచియుండుటలేదు మౌనికులవర్య.

487


వ.

ఇది యెఱింగి పండితుండు సమస్తవస్తువులయందు మమత్వంబు నొందండని
శ్రీపరాశరుం డానతిచ్చిన.

488


శా.

శ్రీమద్దారవదేహ దేహభృదతిక్షేమాపవర్గప్రదో
ద్దామాశ్చర్యపదోహ దోహనవిధాంతస్తోషసంవర్ధిత
ప్రేమప్రాపితమాహ మాహసమయక్రీడార్థసంకౢప్తభ
ద్రామాంగళ్యవివాహ వాహవితతీంద్రస్నేహమోహావహా.

489


క.

శాండిల్యకండుమునిమా, ర్కండేయాదికమునీంద్రరక్షణచణమా
ర్తాండఘనమండలాంత, ర్మండితమణిసౌధమధ్యమస్థిరనిలయా.

490


వనమయూరము.

భాసురమణీవిసరబద్ధమహితోద్య
చ్ఛ్రీసహితసౌధఘనశృంగనిహితారియు
గ్భాసిరుచిదీప్తితనభఃకకుబిలాంతా
హాసరుచిరానన సుధాంశురుచికాంతా.

491


గద్య.

ఇది శ్రీసుభద్రాకరుణాకటాక్షవీక్షలబ్ధకవిత్వతత్వపవిత్ర వేంకటామాత్య
పుత్త్ర, కందాళ శ్రీరంగాచార్య కృపాపాత్ర, సజ్జనమిత్ర, శ్రీహరిగురుచర
ణారవిందవందనపరాయణ కలిదిండి భావనారాయణ ప్రణీతంబైన శ్రీవిష్ణు
పురాణంబునందు మనువంశావతారంబును, బురూరవజన్మంబును, మరుత్
తృణబిందులచరిత్రంబును, రేవతివివాహంబును, నిక్ష్వాకుచరితంబును,
బురంజయోపాఖ్యానంబును, గువలయాశ్వ యువనాశ్వ మాంధాతృల చరి
త్రంబును, సౌభరిచరితంబును, పురుకుత్సత్రిశంకుసగరులచరితంబును, గపిల
ప్రభావంబును, భగీరథుండు భాగీరథి దెచ్చుటయును, మిత్రసహఖట్వాంగుల
చరితంబును, శ్రీమద్రామాయణకథనంబును, నిమిచరిత్రంబును, జంద్రవంశ
సూచనంబును, జంద్రునిచరిత్రంబును, బుధజన్మంబును, జహ్నుప్రభావంబును,
గాధిచరితంబును, విశ్వామిత్ర జమదగ్ని రాములజన్మప్రకారంబును, రజి

చరితంబును, నహుషయయాతులచరిత్రంబును, యదువంశావతారంబును,
శశిబిందుజ్యామఘులచరిత్రంబును, దేవాపిసత్రాజిత్తులచరిత్రంబును,
స్యమంతకమణిప్రభావంబును, నక్రూరవసుదేవాదులజన్మప్రకారంబును,
గర్ణపాండవశిశుపాలజన్మప్రకారంబును, శ్రీకృష్ణావతారసూచనంబును,
దుర్వనుద్రుహ్వ్యనుపూరులవంశప్రకారంబును, శంతనుచరిత్రంబును,
దుర్యోధనాదులజన్మప్రకారంబును, బాండవసంతానప్రకారంబును, భవి
ష్యద్రాజవర్ణనంబును, గలియుగరాజకథనంబును, గలియుగలక్షణంబులును,
బృథివిగీతలును ననుకథలంగల చతుర్థాంశంబునందుఁ జతుర్థాశ్వాసము.

మంగళమహశ్రీ

శ్రీకృష్ణార్పణ మస్తు

శ్రీసీతారామార్పణ మస్తు

  1. “నతనికి నేకశతపుత్రు లైరి మునీంద్రా.” ?