విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ)/ఉపోద్ఘాతము
ఉపోద్ఘాతము
ఈ విష్ణుపురాణమును దెనిఁగించిన కవి భావనారాయణ. ఆశ్వాసాంతగద్యముల నీతని యింటిపేరు కలిదిండివా రని కలదు. కాని కృత్యాదిపద్యములలో స్వవిషయమును జెప్పుకొన్న—
"సీ. | సమధికస్ఫూర్తి కృష్ణాగౌతమీమధ్య, దేశంబునకు భవ్యతిలక మగుచుఁ, | |
అనుపద్యమునుబట్టి యింటిపేరు 'అడవి' వారనుటయుఁ గలిదిండియనునది యీతనినివాసగ్రామముపేరే కాని యింటిపేరు కాదనుటయు స్పష్టము. కాని యితనిముత్తాత రాచయమంత్రి కలిదిండి కధిపతియై యుండుటను బిమ్మట మూఁడుతరములు కడచునప్పటికి (భావనారాయణునినాఁటికి) మొదటియింటిపేరు పోయి చిరకాలనివాసమువలన గ్రామనామమే గృహనామముగా సిద్ధించెనేమో? అట్లు జరుగుటయుఁ బెక్కుచోట్లఁ గలదు.
| "తరముల్ నాల్గయి చెందు నెందునగుఁ, దత్తత్ గ్రామనామంబులన్ | |
అను పింగళి సూరనార్యోక్తి యిప్పట్లఁగూడ సార్థక మైనదేమో? అట్లుగాక గద్యలో 'కలిదిండి' అని పడుట వ్రాయసకాండ్ర ప్రమాదమైనఁ గావచ్చును. ‘కలిదిండి' ప్రస్తుతము 'బందరు' పట్టణమునకు సుమా రిరువదిమైళ్లదూరమునఁ గలదు. ఆయూర నిప్పటికిని గోటయను పేర వ్యవహరింపఁబడు నొకప్రదేశము కలదు. అచ్చటఁ బూర్వ మొకదుర్గ ముండెనఁట. ఉండె ననుటకుఁ దార్కాణముగా నా ప్రదేశమున నిప్పటికిని గోడలయు, బురుజులయు జాడలు గలవు. రాచయమంత్రి యాదుర్గాధిపతియో, లేక కేవలము గ్రామకరణకుఁడో యయియుండును.
కాలము
ఈకవికాలమును నిర్ణయించుటకు గ్రంథస్థనిదర్శనము లేమియుఁ గానరావు. కాని యితరగ్రంథములో నొకదానింబట్టి కొంత యాధారము చిక్కినది. దీనిని బట్టియైనను సిద్ధాంతము చేయ సాహసింపక బలవత్తరమైన యాధారము లభించువఱకు నిదియే యుపాదేయము కావచ్చునని కైకొంటిమి.
సుదక్షిణాపరిణయకర్తయైన తెనాలి అన్నయ్యకును, నీ భావనారాయణకును గురుస్థాన మొకటియే.
క. | కందాళ భావనార్యుల, నందను శ్రీరంగగురుని సతబుధరక్షా | |
(సుదక్షిణాపరిణయము)
కందాళభావనార్యుని కుమారుఁడైన శ్రీరంగాచార్యులే మనయడవిభావనారాయణకవికిని గురువని యూహించుట కాధారము, రెంటను దండ్రిపేరుకూడ సరిపోవుటయే.
ఈ సుదక్షిణాపరిణయకృతీశ్వరుఁడు కోనేటి రామరాజు మంత్రియైన పులిజాల సోమనామాత్యుఁడు. ఈ కోనేటి రామరాజు, సదాశివరాయలకుఁ బ్రతినిధిగా విజయనగరసామ్రాజ్యము పాలించి 1565 లోఁ దల్లికోటయుద్ధమున గతించిన అళియరామరాజునకుఁ బెదతండ్రికొడుకు మనుమఁడు. అళియరామరాజు చిరకాలజీవి. అతనికి మరణకాలమునాఁటికే యెదిగిన మనమలు కలరు. కాన నాతని పెదతండ్రి కొడుకునకును నాతల్లికోటయుద్ధమునాఁటికే మనుమఁ డుండియుండివచ్చును. ఆ మనుమఁడు (కోనేటి రామరాజు) రాజ్యాధిపత్యము వహించుటకుఁ గొంత యెక్కువకాలమే పట్టినదనుకొన్నను, నట్టిది క్రీ॥శ॥ 1600 సంవత్సరప్రాంతముల జరిగియుండవచ్చును. కనుక సుదక్షిణాపరిణయకృతీశ్వరుని ప్రభువు క్రీ॥ శ॥ 1600 సంవత్సరప్రాంతములవాఁడు. కాఁగా సుదక్షిణపరిణయకర్తయు నాకాలమువాఁడే యగును. మన భావనారాయణయు నాతనికి సమకాలికుఁ డగుటచే నప్పటివాఁడే యైయుండును. అనఁగా క్రీ॥శ॥ 16 శతాబ్దితుదిభాగమువాఁడని మాత్రమే చెప్పవచ్చును.
భావనారాయణ శ్రీ పురుషోత్తమస్వామిభక్తుఁడు. సుభద్రాదేవతోపాసకుఁడు. కావుననే "సుభద్రాకరుణాకటాక్షలబ్ధకవిత్వతత్వపవిత్రుండ" నని చెప్పికొనెను. (ఆ 1 ప 10) కందాళ శ్రీరంగాచార్యు లీతని గురువు. గురు వనఁగాఁ గులగురువేగాక, విద్యాగురువని కూడ నూహించుట కాధారముగా "కందాళ శ్రీరంగగురుని మద్గురుని భజింతు నభీష్టార్థరూఢికొఱకు" (ఆ 1 ప 6) అని గురుశబ్దము రెండుమార్లు ప్రయుక్తమైనది. గురుదేవతాభక్తి కలవాఁడగు నీకవి విద్యాగురు నొకని వేఱుగాఁ బేర్కొనకపోవుటయు నీ యూహకుఁ బ్రోద్బలముగానున్నది.
ఈపురాణమునకుముం దీకవి పురుషో త్తమఖండమను నొకప్రబంధము వ్రాసెనఁట.గీ. | ఘనత శ్రీపురుషోత్తమఖండ మాంధ్ర | |
(ఆ 1 వ 11)
ఈ పురాణమును మూలముతోను, వెన్నెలగంటి సూరని విష్ణుపురాణముతోడను బోల్చి చూచితిమి. తఱచి చూడఁగాఁ దెనుఁగుపురాణములలో నింతయథామాతృక మైన రచనయే కన్పట్టదు. వెన్నెలకంటి సూరన విష్ణుపురాణము భారతాదులవలె మూలమునకు యథోచితానుసరణమేగాని దీనివలె యథామాతృకము కాదు. తనకుఁ బూర్వము సుప్రసిద్ధమైన యొకవిష్ణుపురాణము తెనుఁగున నుండగాఁ దానును నా గ్రంథము రచింపఁబూనుటలో నీకవి సంకల్పము స్ఫర్థాహంకారప్రేరితముగాక మూలవిధేయతను సంపాదించు కోర్కెవలనఁ గలిగి యుండును. నేఁడు బ్ర ॥ శ్రీ వే. కవిరాజ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి భారతరచనాసంకల్పము వంటిదే యీ భావనారాయణకవి సంకల్పమై యున్నది. ఇందీతఁడు కృతార్థుఁ డయ్యెననియే చెప్పవచ్చును. ఎడనెడఁ గొలఁది మూలాతిక్రమణము లున్నను నవి యంతగాఁ బాటింపఁడగినట్లుగా నగపడవు. అయినను నెచ్చో స్వతంత్రరచనలున్నవో, వానినన్నిటి నేరి యీక్రింద బొందుపఱచెదము.
1. యజ్ఞవరాహావిర్భావఘట్టమున మూలములో లేనితన్మూర్తివిశేషవర్ణన మిందుఁ గలదు. మూలమున
| సామస్వరధ్వనిః శ్రీమాన్, జగర్జపరిఘర్ఘరః | |
అని యున్న యేకవాక్యమును బురిస్కరించుకొని యీ కవి,
సీ. | తనువు విదర్ప సంస్తబ్ధతనూరుహో, ద్ధతి నజాండంబురంధ్రములు వోవ | |
గీ. | హరియె యజ్ఞత్రయీమయంబైనఘోణిరూపధేయంబు దాల్చి యారూఢమహిమ | |
(ఆ 1 ప 98)
| తందృష్ట్వాతే తదాదేవాః, శంఖచక్రగదాధరమ్ | |
అనునొకశ్లోకము కలదు. ఈ శ్లోకార్థమును నీ కవి యెంతగాఁ బెంచెనో చూడుఁడు—
సీ. | ఎద బొదల్ సిరిమేననొదుగు నుంజాయల మక్క డించిన పైడిమణుఁగువాని | |
గీ. | చతురకలశాంబునిధి సుధాసౌధవీథి, జిలుగుతరగల ముత్యాలచేర్లు సిరుల | |
(ఆ 1-ప 208.)
వెన్నెలగంటి సూరన గ్రంథములో నిట్టిదే యొకవర్ణన కలదు. ఇది వాని యనుకరణమని తోఁచెడిని.
సీ. | శతకోటిభాస్కరసందీప్తతేజునిఁ, బ్రావృట్పయోధరభవ్యగాత్రు | |
గీ. | పుండరీకాక్షు జగదేకపూతచరితు, సతతకరుణాకటాక్షవీక్షణసమస్త | |
(వే. సూ. విష్ణుపురాణ, ఆ 1 ప 166.)
3. పాల్కడలిని లక్ష్మి యావిర్భవించుఘట్టమున మూలములో లేనివర్ణన మిందు చాలఁగలదు. (ఆ 1 ప 224-230) ఇట్టి వర్ణన వెన్నెలగంటి సూరన గ్రంథములోను లేదు.
ఇందీకథయంతయు యథామాతృకమే గాని తపము చేయఁబోవుధ్రువుఁడు తల్లితో—
చ. | అమితపరాభవానలశిఖావృతి గందిన నింక నుత్తమో | |
| త్నిమదికి విస్మయంబొదవఁ దెల్లము తండ్రియుఁ బొందనోపఁ డు | |
అనియాడినమాట మూలములో లేదు. ఈ యతిక్రమణమువల్ల నేమేని గుణము లభించినదా యన్న, ధ్రువున కహంకారము కూర్చినదేకాని గుణము కూర్పలేదు. ఈ కథకు మూలమున లేని వన్నె తెచ్చినవాఁడు వెన్నెలగంటి సూరన. రససంపాదనార్థ మాతఁ డీకథను గొంత విపులముగఁ బెంచి వ్రాసి సంకల్పసిద్ధుఁ డయ్యెను, సర్వథా యీ ఘట్టమున సూరనయే మేలు చేయి యనవచ్చును. ఉదాహరణార్థ మొకసందర్భము చూపెదము. సవతితల్లిచే వేటువడి బిక్కుమొగముతో ధ్రువుఁడు తల్లి చెంతకుఁ బోవుటను.
క. | ధ్రువుఁ డపు డవిరళకోపో, ద్భవుఁడై యచ్చోటు వాసి తనునొందుపరా | |
క. | పరిభవపీడితు నీషత్, స్ఫురితాధరుఁ దనయు నపుడు చూచి జనని యా | |
అని భావనారాయణ చిత్రించెను. దీనినే సూరన.—
చ. | |
కనుగవ నశ్రుపూరములు గ్రమ్మగ వీడిన కాక పక్షముల్ వెనుకకు వీల దైన్యరసవేదన నిల్వఁగ లేక యేడ్చుచున్ జనని నికేతనంబునకుఁ జయ్యనఁ బోయి ధ్రువుండు దీనుఁడై తన పెదతల్లి సేతయును దండ్రియుపేక్షయుఁ జెప్పెఁ జెప్పినన్
గీ. | కొడుకుకన్నుల బాష్పముల్ తుడిచి తల్లి, శిరము మూర్కొని కౌగిటఁ జేరియేడు | |
అని సరళతాసుందరములును, హృదయంగమములు నైన పద్యములలో వర్ణించెను.
4. కండుముని చరిత్ర.
ఈ మునితపము సేయ దొరకొనఁగాఁ దక్షోభ కొఱకు సురేంద్రునిచేఁ బ్రమ్లోచయను నప్సరస ప్రయుక్తయై యామునిని గలఁచెనఁట.
| నతేపే సుమహత్తపః, | మూలము |
ఈ ఘట్టము వర్ణనానుకూలవిషయముగాన నీకవి యాముని చేయుతపము వేఁడిమి దుర్వారమై లోకముల బెగ్గిడిలఁజేసెననియు, నంత దేవేంద్రప్రేరితయై వచ్చి ప్రమ్లోచ యా మునిమ్రోల శృంగారచేష్టావిలాసములు నెఱవె ననియు, నంత నాతనితపము కలతవడి చెడెననియు, నేమేమో పెంచి కొన్ని రసవంతములైన పద్యములు పొందుపఱచినాఁడు, (1 ఆ వ 406 412) ఇది మూలాతిక్రమణమే యైనను రససంపాదన హేతువే యైనది. మఱియుఁ గండుముని మరల నెఱుక గలవాడై యప్సరస నుజ్జగించి కాలక్రమమున శ్రీ పురుషోత్తమక్షేత్రము చేరి స్వామిని సందర్శించు సందర్భమున నిందు గల పద్యములకు మూలమున నాధారములేదు. (ఆ 1450 477 ప.) కవి యిచ్చట నింత విపులవర్ణనము చేయుట కేవల మిష్టదేవతాపక్షపాతగరిమచేతనే యనవచ్చును.
5. ప్రహ్లాద చరిత్ర.
భాగవతప్రసిద్ధమైన నృసింహావిర్భావము విష్ణుపురాణమున లేనేలేదు. హిరణ్యకశిపుఁ డనుతప్తుఁడై కుమారునిఁ బ్రేమపూర్వకముగాఁ గైకొని శేషించిన జీవితకాలము సుఖముగా గడిపిన ట్లొకశ్లోకమున నున్నది. అట్లయ్యును దరువాతిశ్లోకమునఁ బ్రహ్లాదరాజ్యాభిషేకమునకుఁ గారణముగాఁ దండ్రి నృసింహునిచే నంత మొందింపఁబడఁగాఁ బ్రహ్లాదుఁడు రాజయ్యెనని కలదు. ఇది సందర్భరహితముగానున్నది.
| ఇత్యుక్త్వా౽తర్దధే విష్ణుః, తత్ర మైత్రేయ పశ్యతః। | |
మూలమున నిట్లుండఁగా నీ తెనుఁగుసేఁతలో నృసింహరూపము మాటయే వదలి జనకుఁడు దివి కేగఁ బ్రహ్లాదుఁడు రాజయ్యెనని కలదు.
సీ. | జనకుండు దివికిఁ బోయిన దైత్యపతి యయ్యెఁ బ్రహ్లాదుఁ డంత | |
(ఆ 1 ప 657)
వెన్నెలగంటి సూరన్న గ్రంథములో నింకను భిన్నముగానున్నది.
(ఆ 2 వ 329 etc)
6. జడభరతోపాఖ్యానము
ఈ గాథ యిందు మూలమును సూరనరచననుగూడ ధిక్కరించుచున్నది. భాగవతముతోఁగూడఁ బోల్చిచూడ భావనారాయణ రచనయే సర్వాతిశాయియై కనుపట్టినది. ఒక తార్కాణము, భరతాశ్రమమున లేడిపిల్ల సంచారము వర్ణించుపట్టు.
మూలము.
| చచారాశ్రమపర్యంతే తృణాని గహనేషునః। | |
సూరన
సీ. | పూరి మేయగ దవ్వుపోయి బెబ్బులిపిండు, దిగులునఁ గ్రమ్మఱఁ దిరిగివచ్చు | |
గీ. | పర్ణశాలచుట్టు పరువులు పెట్టుచు, లేతయైన పూరి మేత మేయు | |
భాగవతము.
చ. | గురువులు వాఱి, బిట్టుఱికి కొమ్ముల జిమ్ముచు నంతకంత డ | |
(పంచమస్కందం 106 - ప.)
భావనారాయణ
సీ. | నటనగా నుటజాంగణమున గంతులు వేయు, మురియుచు నవకుశముష్టి మేయు | |
గీ. | కెలనఁ దననీడఁ గన్గొని క్రేళ్లు దాటు, నేల మూర్కొని పలుమారు నింగి చూచు | |
7. రామచరితము.
రామునిపుట్టుక, రామునిమహిమ, దక్షిణాపథము, ఋషిజనస్తోత్రము మొదలగువిషయములు మూలమున లేనివి యిందు కల్పించి వ్రాయఁబడినవి.
(ఆ 45వ 165 -193)
ఈయాశ్వాసమునందే పరశురామవర్ణనగల 276 పద్యమునకు మూలాధారము లేదు. గ్రంథమంతయు మూలముతోఁ బోల్చి చూడఁగా స్వకల్పితములని చెప్పందగిన ప్రకరణము లివిమాత్రమే. గ్రంథబాహుళ్యమును బట్టి యీస్వల్ప ముపేక్షించితిమేని, రచన మొత్తముమీఁద యథామాతృక మనుట సత్యేతరము కాఁజాలదు. ప్రాసంగికముగా సూరన విష్ణుపురాణమునుగూడఁ దడవి ప్రకరణవశమునఁ జెప్పఁదగిన తారతమ్యములఁ దెల్పితిమి. కాని యింకొక్క విషయము. సంస్కృతపురాణ మాఱంశలు గలది. సూరన దాని నంతయు నెనిమిది యాశ్వాసములుగాఁ దెనిఁగించెను. ఈ గ్రంధమున నాల్గంశలు మాత్రమే గలవు. తక్కు రెండును నీకవి తెనిఁగింపనే లేదో, యట్లుగాక గ్రంథమే నష్టమైనదో, యుభయపక్షముల నేదియైనను నిదిమాత్ర మసమగ్రగ్రంథమే యైనది.
శైలి:
సాధారణముగాఁ బురాణములయందలి శైలికిని, ప్రబంధముల శైలికిని స్థూలదృష్టికిఁ గూడ గోచరించు వాసి యుండును. మొదటిది ప్రసన్నగంభీరమైన శరన్నదీప్రవాహమువంటిది. రెండవది దరులొరసి కొనుచు, తరంగితమై పొంగిపొరలు ప్రావృట్ప్రవాహమువంటిది. తెనుఁగున భాగవతమువంటియే యొకటి రెండో లతక్క, తక్కినపురాణము లన్నియు నీ ప్రమాణమునకు విధేయములే. తెనుఁగునఁ బ్రబంధరచనయుఁ, దత్పఠనమును మిక్కిలిగా సాగినపిమ్మట బయలు దేరిన పురాణములు కాలధర్మ మతిక్రమింపఁజాలక ప్రబంధఫక్కినే నడచినవి. కంకంటి పాపరాజకృతోత్తరరామాయణ మిందుకుఁ దార్కాణ. ఈ భావనారాయణ విష్ణుపురాణమును నిట్టిదియే. వెన్నెలగంటి సూరన గ్రంథమునకును దీనికిని ముఖ్యభేద మిచ్చటనే కలదు. సూరనశైలి సర్వథా పురాణవిలక్షణశోభితము. ఇది ప్రబంధలక్షణసంయుతము.
8. శబ్దప్రయోగవిశేషములు.
కొన్నివ్యాకరణములను ప్రమాణములుగా గైకొని యీగ్రంథమును బరీక్షించినచోఁ దప్పులని చెప్పఁదగిన ప్రయోగములు కొన్ని పొడగట్టును, కాని మేము వానికిఁ దప్పులనక ప్రయోగవిశేషము లందుము. ఏమన స్వతంత్రుఁడును, బహుగ్రంథకర్తయు నగు కవిని నసమగ్రలక్షణమునకు విధేయునిఁ జేయుట శాస్త్రవిరుద్ధము అట్టి ప్రయోగవిశేషముల నీక్రిందఁ బొందుపఱచుచున్నాము.—
ఆ ప విశేషము
1 23 — కార్మొగుల్ పసగెల్వ (కార్మొగుల పసలనియర్థము)
481 — కార్మొగుల్ నిగనిగల్ (కార్మొగుల నిగనిగలు)
538 — మిక్కిలీ భూవలయంబునన్. (మిక్కిలి యీభూవలయంబునన్)
64 — మిక్కిలయ్యున్
578 — గట్టైయుండన్ - (కట్టియైయుండన్)
105 — ఒనరు దేను (ఒకరుదున్, ఏను)
111 — కేశవాచ్యుత ( కేశవ! అచ్యుత!)
182 — చేసిటు - (చేసి+ఇటు)
చుట్టిచ్చి - (చుట్టి+ఇచ్చి)
190 — ఎక్కుక - ఎక్కుకొని
208 — ఎదబొదల్ - ఎదబొదలు.
206 — చొరవఁగా - చొరఁగా
408 — సతుల వెయ్యింటిఁ గనియె, వేయిమందిని అనుట.
568 — అని దై త్యేంద్రుని సమ్మతించి - సమ్మతింపఁ జేసి
2 71 — 2పా॥ సంపూర్ణ స్ఫూర్తి-ర్ణ -లఘువు చేయబడినది.
78 — క్రొవ్వునఁ గోడలిఁగూఁతురుఁ గలిసిన.
235 — తనయుకు - (తనయునకు)
3 74 — పథ్యుకు - పథ్యునకు
4 184 — తీసుక - తీసికొని
ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమున నీగ్రంథము ప్రతి యొక్కటియే కలదు. అందెక్కుడు తప్పులు గాని గ్రంథపాతములుగాని లేవు. ఇదిగాక డాక్టర్. బుజ్జా శేషగిరిరావు పంతులుగారు యమ్, ఏ. పిహెచ్, డి. (ఆంధ్రభారతీతీర్థాధ్యక్షులు విజయనగరము) వారియొద్దఁ గల వేఱక ప్రతి యాదరమున నొసంగిరి. మాయొద్ద నున్నప్రతిలో సందిగ్ధములై యున్న కొన్నిపాఠములు దానినిబట్టి చక్కఁజేసితిమి. ఈ రెంటను తీరని సందేహములను మూలమును బట్టి సంస్కరించితిమి. ఈ రెండు ప్రతులలోనుగూడ నర్ధవైశద్యము కొఱకని గాఁబోలును తఱచుగా విసంధి పాటింపఁబడినది. ఇది వ్రాయసగాని యజ్ఞతవలనఁ గలిగినదిగాఁ దోపకుండుటచేఁ బెక్కుస్థలముల యథామాతృకముగా దానినట్లే యుంచినారము గాని సంస్కరింప సాహసింప లేదు.