విజ్ఞాన చంద్రికా మండలి/ప్రారంభదశ
విజ్ఞాన చంద్రికా మండలి
ప్రారంభదశ
1906 సంవత్సర మధ్యమందు 5 గురు ఆంధ్ర యౌవనులు గుంటూరు పట్టణమున సమావేశమై దేశభాషలగుండ మాతృదేశపు జనసామాన్యమునకు పాశ్చాత్య పరిజ్ఞానమును వ్యాపింపజేయుటకు సంకల్పించి ఒక మండలిగా నేర్పడిరి. ఈ సంకల్పమును నిర్వహించుటకు 100 పుటలుగల మాస పత్రికను ప్రకటించుట మంచిదా, ఉపయోగకరములగు అనేక విషయముల గూర్చి సులభమగు వేర్వేరు కరపత్రములను విరివిగ పంచిపెట్టుట మంచిదా, శాస్త్ర సంబంధమయినట్టియు చరిత్రాత్మకమయినట్టియు విషయములను గూర్చి వివరించు పటుతరము లగు గ్రంథములను నొక్కటొక్కటిగా ప్రకటించుట మంచిదా, అను విషయములను తర్కించి వీనిలో కడపటిపద్ధతి యనుకూలముగ నున్నదనియెంచి తక్షణమే పనికి ప్రారంభించిరి.
ఈ యుద్దేశ్యములను ఆశయములను సూచించుచు నొక చిన్న వ్యాసమును మేము మున్ముందుగా ప్రకటించిన అబ్రహాము లింకను చరిత్రయను గ్రంథము యొక్క పీఠికయందు ప్రచురించితిమి. ఇంత కాలము గడచిన పిమ్మట ఆ పీఠిక నిప్పుడు మన మొక్కసారి చూచినయెడల మండలి నిర్మాతలు, దాని భావ్యభ్యుదయము నంతగా నెరింగియుండలేదని బోధపడగలదు. రావుబహదూరు వీరేశలింగం పంతులుగారు దారి త్రొక్కి చూపించినను జీవశాస్త్రము రసాయనశాస్త్రము ఆర్ధికశాస్త్రము మొదలగు ఉత్కృష్టశాస్త్ర గ్రంథములను భాషాంతకరించుట యెన్నటికైన సాధ్యమగునా యని మన దేశీయులు సంశయించు దినములలో పుట్టి శాస్త్రజ్ఞానము జనసామాన్యమునకు వ్యాపింపజేయవలె నన్న దేశభాషల మూలముననే జేయవలె నని దృష్టాంత పూర్వకముగా నేటికీ రుజువు పరచగలిగితిమని సంతసించుచున్నాము.
మండలి ప్రథమ సంవత్సర కార్యవిధానము నంతయు కీర్తిశేషులైన రావిచెట్టు రంగారావు మనసబుదారుగారు హైదరాబాదు మూలస్థానముగా నేర్పరచుకొని దృఢానురాగ దీక్షతో నిర్వహించిరి. మండలియొక్క సంకల్పములతో ఏకీభావము వహించి దానిని జయప్రదముగా జేయుటకు వారుజూపిన అమూల్యభక్తికిని అపార పరిశ్రమకును మేమెంతయు కృతజ్ఞఉలము.
మండలివారు నాలుగు పుస్తకములు ప్రచురించు సరికి కార్యస్థానము హైదరాబాదులో బెట్టుకొని తమ కార్యములను చక్కగ జరగించుట యసాధ్యమయ్యెను. అందుచే 1908 సంవత్సర మధ్యమున కార్యస్థానము చెన్నపట్టణమునకు మార్చబడెను. అప్పటినుండియు పుస్తకముల నిక్కడినుండియే ప్రకటించుచున్నాము. మండలియు దినదినాభి వృద్ధిగాంచుచుండుటచే దానిచరిత్ర నిప్పుడు వ్రాయుటకు వేడుకగానున్నది.
పుస్తక ప్రకటన.
మండలి పక్షమున నింతవరకు 23 గ్రంథములు వెలువడినవి. 1-వ అనుబంధము చూడనగును. అందు 12 శాస్త్ర గ్రంథములు, 5 చరిత్రలు, 4 మహాపురుష జీవితములు, 2 చరిత్రాత్మకమగు నవలలు. సాధ్యమైనంత వరకు ఆ యా శాస్త్రములయందు ప్రవీణతగలవారినే గ్రంథనిర్మాణమున కేర్పరచి యున్నాము. గ్రంథముల ఆకార వైచిత్ర్యములను నానాటికి వృద్ధిచేసితిమి.
మండలి గ్రంథములను చెన్నపురి యూనివర్సిటీవారును, టెక్‌స్ట్‌బుక్కు కమిటీవారును (Text Book Committee) స్కూలుబుక్కు అండు వర్ణాక్యులరు లిటరరీ సొసయిటి (School Book and Vernacular Literary Society) వారూ, లోకలు బోర్డులవారును, ఎడ్యూకేషనల్ డిపార్టుమెంటువారును అభిమానించి యథాశక్తి పోషించియున్నారు. ఏయే పుస్తకము ఎన్ని ప్రతులు, ఎన్ని సారులు ముద్రితమైనదో తెలియపరచు పట్టీని రెండవ అనుబంధములో చేర్చియున్నాము.
బుక్కు డిపో.
1910 సంవత్సర ప్రారంభమున మండలి యొక్క చందాదార్లు 2700 మందియుండి తెలుగు భాషయందలి యితర గ్రంథములు గూడ మండలి పుస్తకములతోపాటు పంపవలసినదని కోరుచు తరుచు వ్రాయుచువచ్చిరి. అందుచే విజ్ఞాన చంద్రికా బుక్కు డిపో అనుపేర నితర పుస్తకముల విక్రయమునకై నొక శాఖనేర్పరుపవలసివచ్చెను. మండలియొక్క ప్రధానోద్దేశములకు భంగముకలుగు నేమోయను భయము చేత ఈ శాఖ నంతగా నభివృద్ధిలోనికి తెచ్చుటకు యత్నింపలేదు. అయినను చందాదారులకును గ్రంథకర్త లనేకుల కును, ఈ బుక్కుడిపో మిగుల యుపకరించినదని వ్రాయుటకు సంతసించుచున్నాము.
పరిషత్తు
మండలి మూలమునను ఇతర విధములను దినదినాభివృద్ధి యగుచున్న ఆంధ్రవాజ్మయ పఠనమును వృద్ధిచేయు నుద్దేశముతో 1910-వ సంవత్సర మధ్యమున రావుబహుదూరు కం. వీరేశలింగం పంతులుగారు అధ్యక్షులుగా నొక పరీక్షా సంఘమును విజ్ఞాన చంద్రికా పరిషత్తను పేరుతో నేర్పరిచి యున్నాము. దాని కార్యనిర్వాహకుల యొక్కయు పద్ధతుల యొక్కయు వివరములను మూడవ అనుబంధమున చూడనగును. 1911 సంవత్సరము జూన్ నెల కడపటి వారమునందు తెలుగు దేశమునందలి 20 ముఖ్యపట్టణములలో సాహిత్యము, చరిత్ర, శాస్త్రము, అను మూడు విషయములలో నీపరీక్ష జరుగునని ప్రచురపరచితిమి. తదాదిగ నేటేట అట్టి పరీక్షలను జరుపుచున్నాము. నేటివరకు 406 గురు విద్యార్థులను పరీక్షించి అందు కృతార్ధులైన 112 గురికి యోగ్యతాపత్రముల నిచ్చియున్నాము. కృతార్ధులైనవారి పేర్లను యోగ్యతాపత్రముయొక్క నొక చిన్నప్రతిమను 4-5 అనుబంధములలో నిచ్చియున్నాము. మొదటి సంవత్సరము 430 రూపాయలతో ప్రారంభించి కడపడి సంవత్సరం 516-0-0 లు వెలగల బంగారు పతకములను రొఖపు బహుమానములను ప్రతిసంవత్సరము ఇచ్చియున్నాము. బహుమానము పొందినవార్ల పేర్లను బహుమానము లిచ్చినవార్ల పేర్లను 6వ అనుబంధములో చేర్చియున్నాము. వరుసగ రెండు సంవత్సరముల యందు (1912-1913) స్త్రీలే హెచ్చు బహుమానములను పతకములను సంపాదించియుండుటయే, విద్యాభిరుచి వారికీ పరీక్షలచే హెచ్చినదనుటకు నిదర్శనము. ఈ పరీక్షలను జరుపుటయందు మాకు మిక్కిలి సహకారులైన పరీక్షకులకు మేము మిక్కిలి కృతజ్ఞఉలము. వారినామములను ఏడవ అనుబంధములో నిచ్చియున్నాము. వారి సహాయము లేనిది మేమి పని నెంతమాత్రము నిర్వహించియుండమని చెప్పకతప్పదు. పరిషత్పరీక్షా పత్రముల 14-వ అనుబంధములో నిచ్చియున్నాము.
బహుమతి నవల
దేశభాషల నభ్యసించుట యందును, దేశభాషల యందు గ్రంథములను రచించుటయందును, ఈమధ్య నొకవిధమయిన యుత్సాహము పుట్టియున్నది. ఇట్టి యుత్సాహమును పెంపొందించుటకై ఆంధ్రదేశమునకు సంబంధించిన యేదైన నొక కథను గైకొని నవలను వ్రాయువారలలో నుత్తమునికి మేము రు. 500 లు బహుమాన మిచ్చెదమని 1912 సంవత్సరములో ప్రకటించియున్నాము. ఆ ప్రకటనానుసారముగ 10 నవలలు మా కార్యస్థానమునకు చేరినవి. అందొకటి గడువుదాటిన తరువాత వచ్చినందున నిరాకరించితిమి. మిగతా 9 నవలల పరీక్షించుటకై నొక కమిటీని నేర్పరిచితిమి. ఆ కమిటీవా రేకాభిప్రాయముగ కృష్ణాజిల్లా అంగలూరి కాపురస్తుడు మ-రా-రా-శ్రీ, దుగ్గిరాల రాఘచంద్రయ్యగారు రచించిన విజయనగర సామ్రాజ్యము అను నవలకు అగ్రస్థానమొసంగిరి. కావున బహుమతి మొత్తము రూ. 500 లును వారి కొసంగుటకు మిగుల సంతసించు చున్నాము. ఇదిగాక "విజయసింహ" యను నామాంతరముగల రాయచూరు యుద్ధమును, అస్తమయము, శ్రీమణి, పాతాళభైరవి, అను నాలుగు నవలలు కూడ గణనీయములని కమిటివా రభిప్రాయపడియున్నారు. అత్యుత్సాహముతో శ్రమలకోర్చి నవలలను పంపిన లేఖకులను ఈ సందర్భముగ మిగుల ప్రశంసించుచున్నాము. ఈ పరీక్షకు శ్రీమతి ముడుంబి రంగనాయకమ్మ గారు రాయదుర్గము నుండి ఒక చక్కని నవలను పంపినందులకు మేమెంతయు సంతసించుచున్నాము.
రాబోవు బహుమతి పరీక్షకు కూడ వీరందరును పట్టుదలతో విడువక కృషిచేసి జయమును పొందుటకు ప్రయత్నింతురని తలచుచున్నాము.
రిజిస్ట్రేషను.
మండలి కార్యములు నానాటికీ ప్రబలి శాఖలధికమై ఆయా శాఖలయందలి పనులును వృద్ధియగుచువచ్చెను. మండలిని శాశ్వతముగా నుండులాగు జేయ నిశ్చయించి 1860 సం|| రము 21-వ నంబరు ఆక్టు ప్రకారము 'సాహిత్య సంఘము ' గాని దీని ' మండలి ' 1913-వ సంవత్సరము మార్చి 15 వ తేదీన రిజిష్టరుచేసి యున్నాము. (అనుబంధము 8)
ఆదాయవ్యయములు.
మునగాల పరగణా జమీందారు లగు మహారాజ రాజశ్రీ రాజా నాయని వేంకట రంగారావు బహదూరువారు ప్రీతిపూర్వకముగ నొసంగిన రు. 1000-0-0 లతో పనిని ప్రారంభించితిమి. 1907-వ సంవత్సరము మొదలుకొని 1913 వ సంవత్సరాంతమువర కాదాయపు మొత్తము రు. 54,379-9-1. వ్యయపు మొత్తము 53,575-1-3 లు. 1913-వ సంవత్సరాంతమున నిలవ 803-14-10 లు.
ఆదాయవ్యయ వివరములును, ఆస్తి వివరమును, లాభ నష్టముల పట్టికయు అనుబంధములలో గాననగును. ఇప్పటి వరకు మండలియాస్తి రు. 7812-11-3 లుగా నున్నట్టు తెలియుచున్నది. (9, 10, 11, 12, 13 అనుబంధములు చూడుము.)
ఆదాయపు మొత్తములో రు. 4172-7-0 లు విరాళముల రూపముగా వచ్చినది. ఈ దాతలందరకును, అందు ముఖ్యము బొబ్బిలి మహారాజాగారికిని, పిఠాపురము రాజా గారికిని, మునగాల రాజాగారికిని, ఉయ్యూరు రాజాగారికిని, పిఠాపుర రాణీగారికిని, మా కృతజ్ఞతను మనఃపూర్వకముగ నిచ్చుట సూచించుచున్నాము.
ప్రతిఫలము నపేక్షింపకయె మండలికి గ్రంథములు వ్రాసియిచ్చిన గ్రంథకర్తలందరకును మా కృతజ్ఞతను సూచింపక ఈ విషయమును ముగింపజాలము. సకాలమునందట్లు వారు సాయపడకుండినచో మండలియిట్లు వృద్ధిలోనికి రాకపోయి యుండును.
మండలి యనుకరణము.
మండలి స్థాపనానంతరము నిరువదింటికి పైగా నితర సంఘము లాంధ్రదేశము నందివే యుద్దేశములతో స్థాపితము లయ్యెనని తెలుపగలుగుటకు సంతసించుచున్నాము. ఈ సంఘములేగాక పలువురు గ్రంథకర్తలు గూడ గ్రంథములు వ్రాసితమంతట తాము ప్రకటించుచున్నారు. మాతృభాషను శృంగారింపగడంగి మాతో పనిజేయు నీ భాషాభిమానుల కందరకును మేము మనఃపూర్వకముగ స్వాగతమొసంగుచున్నాము.
ఈ సందర్భమున మాలో కొందరు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమును ఇప్రకటింప బూనిరని తెలుపుటకు సంతసించు చున్నాము. కార్య భారము మిక్కుటము; అనుకూలమో కొద్ది. అయినను అభిలాషమెండు. కాబట్టి విద్యాభిమాను లందరును ఈ యుద్యమమునకు తోడ్పడి జయప్రదము గావింతురుగాక!.
ఆంధ్ర వాచక ప్రపంచమును, ఆంధ్రరాజ చంద్రులును, విజ్ఞాన చంద్రికామండలికి తమ పోషకత్వమును ప్రాదించెదరుగాక. విజ్ఞాన చంద్రికా మండలి నానాటికి వృద్ధి చెంది యనేక గ్రంధ కుసుమములతో ఆచంద్రార్కము నాంధ్ర భాషామ తల్లిని పూజించుచు దేశ సేవ జేయును గాక! !
చెన్నపట్టణము: 12.4.14
- బ. నరసింహేశ్వరశర్మ.
- ఆ. లక్ష్మీపతి.
- కే. వి. లక్ష్మణరావు.
- వే. విశ్వనాథశర్మ
- గూ. రామచంద్రరావు.
- తా. వేంకట్రామయ్య.