విక్రమార్కచరిత్రము/చతుర్థాశ్వాసము

శ్రీరస్తు

విక్రమార్కచరిత్రము

చతుర్థాశ్వాసము

శ్రీమదపారకృపారస
సామాగ్రీవర్ధమానసకలార్థిజన
స్తోమబహువిభవ, యనితర
సామాన్యగుణాభిరామ జన్నయసిద్ధా!

1

విక్రమార్కునకు నారదుఁడు రాజనీతి నెఱిఁగించి, విదర్భరాజపుత్రి సౌందర్యమును వర్ణించి తెలుపుట

వ.

అమ్మహీశ్వరుండు తదుపదిష్టప్రకారంబున వసుంధరాపరిపాలనపరాయణుండై యుండునంత నొక్కనాఁడు.

2


శా.

ఆలోలామలదీపవల్లికలతో నాకాశసంచారి యై
కైలాసం బిటవచ్చు టెట్లుకొ యనంగా, శోణచంచజ్జటా
జాలం బొప్పఁగఁ బాండురద్యుతులతో, సాక్షాత్కరించెన్ మహీ
పాలాగ్రేసరుమ్రోల నారదుఁడు భూభాగంబు భూషించుచున్.

3


ఉ.

అమ్మునినాథశేఖరుని నర్థి నెదుర్కొని, భక్తిమైఁ బ్రణా '
మ మ్మొనరించి సన్మణిసమంచితకాంచనపీఠి నుంచి నె
య్యమ్మున నర్ఘ్యపాద్యవిధు లాదిగఁ బూజ యొనర్చి యెంతయున్
సమ్మద మొందఁజేసి, సురసంయమితోడ నరేంద్రుఁ డిట్లనున్.

4


చ.

తలకొని యున్నతొంటిసుకృతంబుకతంబున వచ్చి, మీఁదటం
గలిగెడు శోభనంబులకుఁ గారణమై, మఱవర్తమానని
శ్చలదురితంబులం దలఁగి సన్మునినాథకులావతంస! ని
ర్మలభవదీయదర్శనము మా కొనరించెఁ ద్రికాలయోగ్యతన్.

5


వ.

అనిన నమ్మునీశ్వరుండు సర్వంసహాధీశ్వరున కిట్లనియె.

6

సీ.

పరమధర్మజ్ఞత బ్రాహ్మణప్రవరుల
        నరసి రక్షింపుదే యనుదినంబుఁ
బ్రజఁ దల్లిదండ్రులపగిదిఁ బాలింపుదే
        పరులొత్తొరవు లేక బ్రదుకునట్లు
దివిజభూజముఁబోలె దీనార్థిసమితికి
        నభిమతాథము లిత్తె యాదరమున
ననిఁ బ్రాణమిచ్చినయట్టివారల వారి
        కెల్లతేజంబులు నిచ్చి మనుతె?


తే.

యాజ్ఞపొత్తిక సంపద లర్థి నిచ్చి
బంధువర్గంబుఁ బోషింతె బహువిధముల?
సకలవర్ణాశ్రమాచారసరణి తప్ప
కుండ నియమించెదే మహీమండలమున?

7


క.

సప్తాంగరక్ష సేయుదె
సప్తోపాయములఁ బరుల సాధింతె మదిన్
సప్తవ్యసనము లుడుగుదె
యాప్తుల రక్షింతె సాహసాంకమహీశా?

8


క.

మంత్రంబును రక్షింపుదె
తంత్రాచరణంబులందు దత్పరమతివై
మంత్రము పరమంత్రిమన
స్సంత్రాసకరప్రభావసంపన్నులతోన్.

9


క.

ఆజ్ఞ వెలయింతె దిక్కుల
యజ్ఞాధిక్రియల సురల నలరింతువె? నీ
తిజ్ఞులఁ బరిపాలింపుదె
సుజ్ఞానపరీక్ష చేసి సుకవుల మనుతే?

10


[1]క.

అని కుశలప్రశ్నముగతి
ననిమిషముని రాజనీతి యాద్యంతంబుం

దన కెఱుఁగ నానతిచ్చిన
విని, వినయముతోడ మనుజవిభుఁ డిట్లనియెన్.

11


చ.

పరిచితసర్వశాస్త్రపథపారగు లైనవసుంధరేశ్వరుల్
నిరుపమలీలమై నడచునీతిపథంబున సంచరింప నా
తరమె మహాత్మ మీకృపకతంబున నింక నిరంకుశక్రమ
స్ఫురణమహామహీభరణభూరినయోన్నతి నుల్లసిల్లెదన్.

12


వ.

అనిన నన్నరేంద్రచంద్రునకు మునికులాగ్రగణ్యుం డిట్లనియె.

13


చ.

అలఘువినూత్నరత్నములకన్నింటికిం గుదురైనరోహణా
చలపతిరీతి నీవఖలసద్గుణశాలుల కాలవాలమై
వెలయుట, నిన్ను వాసవుఁడు వేయివిధంబులఁ బ్రస్తుతించు, ను
జ్జ్వలతరభాగ్యసంపద భవత్ప్రతిమానులె యన్యభూపతుల్?

14


ఉ.

ఇట్టి భవన్మహత్త్వ మిదియెల్ల విదర్భవిభుం డెఱంగి, నీ
పట్టపుదేవి గాఁదగినపట్టి వరంబునఁ గోరి యీశ్వరున్
గట్టిగఁ గొల్చి తత్కరుణఁ గాంచె మనోభవరాజ్యలక్ష్మికిం
గట్టనుగైనమూర్తి గుణగణ్య ననంగవతీకుమారికన్.

15


ఆ.

వెలఁదిసోయగంబు వీక్షింప వినుతింప
వేయికన్ను లమరవిభున కిచ్చి
రెండువేలజిహ్వ లండజాధీశున
కొసఁగబోలుఁ బంకజోద్భవుండు.

16


సీ.

భామినీమణిమధ్యభాగంబు కృశ మని
        కటితటంబున నిల్పె గౌరవంబుఁ
దొయ్యలివలిచన్నుదోయి కర్కశ మని
        యడుగుల మార్దవం బలవరించెఁ
గమలలోచనకుంతలములు వక్రములని
        తనువల్లికకుఁ జక్కఁదన మొసంగెఁ

బూఁదీఁగఁబోఁడిచూపులు చంచలము లని
        మెలవు నెన్నడపున మేళవించె


తే.

నబలనఖములు క్రూరంబు లని తలంచి
సౌమనస్యంబు గుణమున సంతరించె
నీరజాసనుఁ డెంతకు నేరఁ డనుచు
జగము గొనియాడ నొప్పు నాచిగురుఁబోఁడి.

17


తే.

తమ్ము లాకొమ్మనెమ్మోముతమ్ము లనఁగ
బింబ మాయింతికెమ్మోవిబింబ మనఁగ
జాతి యానాతిలేనవ్వుజాతి యనఁగ
రామ యొప్పారు లోకాభిరామ యగుచు.

18


సీ.

తులకు వచ్చియు రాదు తళుకులగని యైన
        గోమలి కాంతితోఁ గుందనంబు
సరియయ్యుఁ గాదు నిశ్చల మైనజిగి నొప్పు
        కాంతయూరులతోడఁ గరభయుగము
[2]ప్రతివచ్చియును రాదు సతతాచ్ఛవిచ్ఛవి
        తరుణికంధరతోడ దరవరంబు
[3]జోడయ్యుఁ గాదు మించులనటించుచునున్న
        చానచన్నులతోడఁ జక్రమిధున


తే.

మింతినెమ్మోము ప్రతిచేసి యెన్నుచోటఁ
జందురునిమేను పూర్వపక్షంబు నొందు
ననఁగ జగమున నావిదర్బావనీశు
ననుఁగుఁదనయకు నెనయైనయతివ గలదె?

19


శా.

ఆవారీమణి, తండ్రిసమ్ముఖమునం దశ్రాంతముం గ్రొత్తగా
నానాగాయకపాఠకోత్తము లొగిన్ సంగీతసాహిత్యవి

ద్యానైపుణ్యము మీఱ నీగుణవిలాసాకారరేఖాదుల
న్వేనోళ్ళన్ గొనియాడఁగా విని రసోన్మేషంబు సంధిల్లగన్.

20


వ.

పంచశరశరప్రపంచచంచలాయమానమానసమై యుండునంత.

21


తే.

సిద్ధపుర మేలురాజు ప్రసిద్ధబలుఁడు
శకమహీనాథచంద్రుఁ డాచంద్రవదన
నడుగఁ బుత్తెంచి యీకున్న నాగ్రహించి
యేపున విదర్భుమీఁద దండెత్తఁదలఁచె.

22


వ.

కావున.

23


క.

హరువరమున జనియించిన
వరపుత్త్రిక యగుననంగవతి ననురాగ
స్ఫురణమ్మున వరియించుట
కరణీయము నీకు నిపుడు కరుణాభరణా.

24


క.

నావుడు నాకార్యము వసు
ధావల్లభుఁ డెంతయేని తాత్పర్యముతోఁ
గావింప నియ్యకొనుటయు
నావిబుధమునీంద్రముఖ్యుఁ డరిగెను బిదపన్.

25


క.

వేసవివేఁడి సహింపక
వేసఱుజీవులకు నెల్ల విశ్రాంతికర
శ్రీసంపాదనమై
యాసన్నంబయ్యె నంబుదాగమ మంతన్.

26


సీ.

గగనరత్నము కట్టుమొగులతో నుదయించెఁ
        జరమదిక్కునఁ దోఁచెఁ శక్రధనువు
పూర్వాపరవ్యాప్తిఁ బొలుపారె జలరేఖ
        లాలోలగతి వీచె మూలగాలి

మెఱుఁగుమొత్తంబులు మెఱసె నుత్తరమున
        గడఁగె దక్షిణపుమేఘములగములు
ప్రాలేయభానుండు పరివేషగతుఁ డయ్యెఁ
        జాతకంబులు నింగి సంచరించె


తే.

నెఱలపెనుపట్టె నేలపైఁ గొఱలఁజొచ్చె
మొనసి చీమలగమిగ్రుడ్డు మోవఁదొణఁగెఁ
గుజముకొనగొమ్మ డిగి క్రిందికొమ్మమీఁది
నిలుపుఁగైకొనుపులుఁగులయెలుఁగు లెచ్చె.

27


ఉ.

తూనిఁగలాడెఁ, దోయనిధిఁ దోరపు మోత జనించెఁ, బంక్తులై
కానఁబడెన్ బలాకములు, కప్పయెలుంగు చెలంగె నిర్జల
స్థానములందుఁ, గుంజముతుదం గృకలాసము నిల్చి నింగికై
యాననమెత్తె, భూమిరజ మంగములన్ బెరయించెఁ బిచ్చుకల్.

28


క.

తదనంతరంబ, జనముల
కిది పగ లిది రాత్రి యనుచు నేర్పఱుపంగా
హృదయముల కగోచరమై
చదలం బొదలంగఁజొచ్చె జలధరవితతుల్.

29


క.

ధారణి గలమేలెల్లను
ధారాళకరాళవర్షధారలచేతన్
నీరామని గాఁగల దని
పూరాల్చినభంగి ముసురు పొరిఁబొరి గురిసెన్.

30


సీ.

ప్రథమోదబిందులఁ బల్లవించె ననంగ
        నింద్రగోపద్యుతి నిలఁ దనర్చె
భానుచంద్రుల సూడుపట్టి గెల్చె ననంగఁ
        గంధరపటలాంధకార మడరె
జలదానిలంబునఁ బులకించెనో యనఁ
        గుటజభూజంబులు కోరగించె

స్తనితమర్దళరవంబునకు నాడె ననంగ
        వనమయూరములు నర్తనము చేసెఁ


తే.

బాంథజనచిత్తచిత్తసంభవమహాగ్ని
ఘనతరజ్వాలజాలానుకరణనిపుణ
వివిధవిద్యుత్పరంపరావిభ్రమంబు
లఖలహరిదంతరంబుల నతిశయిల్లె.

31


మ.

దళితానంతదిగంతమై ఘుమఘుమధ్వానంబు సంధిల్లగాఁ
గలయం రాముల వ్రేలగట్టినటు, లుగ్రవ్యగ్రలీల న్నిర
ర్గళధారాళకరాళమై కురిసె వర్షం; బెందు నేయింటివా
రలుఁ బొర్గింటికి నేఁగకుండఁగ నహోరాత్రంబుఁ జిత్రంబుగన్.

32


తే.

ధరణియెల్లఁ గదంబపుష్పరచితంబు
దిక్ప్రకరమెల్ల సరసనర్తితమయూర
మంబరంబెల్ల నీరదాడంబరంబు
విరహిజనచాతకము లెందు విశ్రమించు.

33


మ.

రమణియోన్నతసౌధసీమల విహారప్రౌఢి సంధించుచోఁ
దమకుం గర్జితఘోరఘోషములు నిద్రాభంగముం జేసినం,
బ్రమదం బందిరి కాముకుల్ సమదశుంభత్కుంభికుంభద్వయ
క్రమవక్షోరుహమండలీమదవతీగాఢోపగూహోన్నతిన్.

34


చ.

లలితగతి న్మయూరికలు లాస్య మొనర్పఁగ, [4]భేకభామినీ
కలకలనాదము ల్సెలఁగ, గర్జనవాద్యము లుల్లసిల్లఁ గం
దళకుసుమాంజలుల్ వెలయ, నర్తనశాలయనం దనర్చె భూ
తలము విచిత్రవారిదవితానతిరస్కరణీసమేతమై.

35


ఉ.

హారిమయూరవిభ్రమము లంచలఁ జెందె దటిద్విలాసముల్
తారలఁ జేరెఁ, బుష్పితకదంబవిజృంభణ సప్తవర్ణనా

నారుచిర ప్రసూనభజనం బొనరించె, శరత్సమాగమం
బారయ నంబుదాగమ మహామహిమోన్నతి నాక్రమించినన్.

36


శరదృతు వర్ణనలు

చ.

శరదుదయప్రభావమునఁ జంద్రదినేంద్రులతేజ మెక్కి త
ద్గరిమలఁ గైరవాంబుజవికాసము మించెఁ, దదీయవాసనం
బరఁగె మదాలిమాలికలు, భావసముద్భవవర్తనోన్నతిం
బొరసి నిశాహముల్ సిరులఁ బొంది సుఖింతురు మేదినీజనుల్.

37


మ.

జలజచ్ఛత్రరుచిం బ్రకాశతరకాశశ్రేణికాచామరం
బుల భద్రాసనకాంతి రాజ్యపద మొప్పుల్ మీఱఁ గుంభోద్భవుం
డెలమిన్ దక్షిణదిక్కునం దుదితుఁ డయ్యెం; జంద్రతారాబలం
బుల మేలైనదినంబు లెవ్వరికి సమ్మోదంబు సంధింపవే!

38


ఉ.

బాలలు లీలతో, బలుసుఁబండులచాయఁ దనర్చి పండి కై
వ్రాలినరాజనంబులకు వచ్చుశుకంబులఁ జేరనీక పోఁ
దోల రవంబుతోఁ జెఱకుఁదోఁటలనీడల నుండి పాడి రు
న్మీలితహావభావరమణీమకరాంకుని సాహసాంకునిన్.

39


వ.

ఇవ్విధంబున శరదాగమంబు దనప్రయోజనంబునకు ననువర్తనసూత్రం బగుటయు, దండయాత్రానముత్సుకసేనాసనాథుండై, సాహసాంకమహీనాథుండు, తగిన కాలరులం బంచుటయు సుమతిసూనుండు లేఖాముఖంబున నంతయు నెఱంగి, రాగమంజరీపుత్త్ర మిత్రుండైన చిత్రరథుండను గంధ్వరపతిని జంద్రపుర రాజ్యసింహాసనాసీనుం గావించి యాక్షణంబ.

40


సీ.

రథివిక్రమప్రౌఢరథికలీలారూఢ
        నానావిధస్యందనములతోడ
సహజదానోద్దండచండశుండాదండ
        బంధురసింధురప్రతతితోడఁ
జారుమూర్తికమహాశ్చర్యసంచారణ
        కమనీయతరతురంగములతోడఁ

బరభూవరవ్యూహభయదోగ్రసన్నాహ
        గర్వతసుభటవర్గములతోడ


తే.

మందరాచలమంధానమధ్యమాన
నిరవధికనీరనిధిఘోషనిర్విశేష
పటుపటహముఖ్యవాద్యజృంభణముతోడ
భట్టి చనుదెంచి వసుమతీపాలుఁ గాంచె.

41


తే.

అర్థి దండప్రణామంబు లాచరింప
నమ్మహామంత్రి ముఖ్యుని, నా నరేంద్రుఁ
డతిముదంబున నాలింగనాదులైన
సముచితోపచారంబుల సత్కరించి.

42


వ.

సాదరావలోకంబున నాలోకించి లోకవృత్తాంతంబు నడుగుటయు, నతనికి సుమతిసూనుం డిట్లనియె.

43


సీ.

ఏరాజునకుఁ జెల్లునెంతయు నరుదైన
        మణిపాదుకాదులు మహిమఁ గొనఁగ
నేరాజునకుఁ జెల్లు నింద్రుని మెప్పించి
        నవరత్నసింహాసనంబు వడయ
నేరాజునకుఁ జెల్లు నీరజాసనుసభ
        బ్రహ్మాస్త్రలాభసంపద వహింవ
నేరాజునకుఁ జెల్లు నితరదుర్లభమైన
        యుట్టిచేరులుగోయు దిట్టతనము


తే.

దేవపతి యైనశ్రీమహాదేవుదేవి
కాళికాదేవి యేరాజుకడిమి మెచ్చి
లీల నుజ్జని వేయేఁడు లేల నిచ్చె
ననుచు నినుయెల్ల దేవర నభినుతించు.

44


చ.

అనిన దరస్మితాస్యుఁడగు నమ్మనుదేంద్రునితోడ భట్టి యి
ట్లను, జగదంబ వత్సరసహస్రము రాజ్యము నీకు నిచ్చె, నా

యినుమడియేండ్లు లిద్దరణి యేలు నుపాయము సేయువాఁడ నే;
ననుటయు నవ్విభుండు మది నచ్చెరువంది వినంగఁ గోరుటన్.

45


వ.

అవధరింపు మని మనుజవల్లభునకు భట్టి యిట్లనియె.

46


సీ.

జగదంబ భవదీయసాహసోన్నతి మెచ్చి
        యిచ్చె నుజ్జయిని వేయేఁడు లేల
నావరం బెబ్బంగి ననుభావ్య మైనది
        యటుగాన నొకయుక్తి యవధరింపు
మేఁటేఁట నొనరింపు మితరదేశవిహార
        మాఱునెలలు రాజ్య మాఱునెలలు
నిమ్మెయి రెండువేలేఁడులు చెల్లినఁ
        బురి నున్నయట్టివత్సరము లెల్ల


తే.

శాంభవీవరలబ్ధవత్సరసహస్ర
మయ్యె, దేశాంతరాంతరావాప్తివలనఁ
జనిన వెయ్యేండ్లు మనబుద్ధిసంచితములు
ఘనయశస్సాంద్ర విక్కమార్కక్షితీంద్ర!

47


వ.

అనిన నతనిమనీషావిశేషంబునకు సంతోషించి.

48


విక్రమార్కుఁడు సిద్ధపురీశునిపైకిఁ దండెత్తిపోవుట

మ.

అతఁడుం దానును గార్యలబ్ధిగతి నేకాంతంబ యూహించి, స
మ్మతితో సిద్ధపురీశుపైఁ జనుటకు న్మౌహూర్తికోత్తంస ని
శ్చితవేళన్ మొరయింపఁ బంచుటయు, మించెన్ దండయాత్రాసము
ద్ధత నిస్సాణధణంధణంధణధణంధాణంధణధ్వానముల్.

49


సీ.

పాలమున్నీటిలోఁ బవ్వళించినయట్టి
        నీలవర్ణుఁడు నిద్రమేలుకొనియె
వెగడొంది రవితేరినొగలఁ గట్టినయట్టి
        వాహంబు లణకలు వైచుకొనియె
నదరిపాటున బిట్టు బెదరి పర్వతపుత్రి
        కందర్పదమనునిఁ గౌఁగిలించెఁ
బన్నగంబుల కెల్ల భయము మిక్కుటముగాఁ
        బాతాళలోకంబు బమ్మరిల్లెఁ

తే.

గమలజుని వేదపఠనంబు కవలువోయె
నద్రు లెల్లను నచలత్వ మపనయించె
దిగ్గజంబులు జిఱజిఱదిరిగి మ్రొగ్గె
వారిరాసులు పిండిలివండు లయ్యె.

50


వ.

అంత.

51


క.

సంగరములు గలుగుటఁ జతు
రంగమ్ములు సమ్మదాంతరంగము లగుచున్
గంగాతరంగసంగత
రంగములై బెరసె నెరసి రంగక్షోణిన్.

52


ఉ.

చుట్టము లైన రాహుతులు సూరెలఁ బేరెలమిన్ జవోజ్జ్వలా
రట్టజవాహరోహణవిరాజితులై తనుఁ జేరి కొల్వఁగాఁ,
బట్టపుదంతి నెక్కుకొని భట్టి నృపాలునిసేన కంతకుం
బెట్టనికోటయై నడచె భీకరసన్నహనాభిలాషుఁడై.

53


మ.

 జయలక్ష్మీసతితో నన గవతి నిచ్చం గైకొనం గోరి, యు
జ్జయినీనాథుఁడు దివ భూషణవిలాసం బొప్ప నాయోధన
ప్రియుఁడై పెండ్లికి నేగుభంగి వెడలెం; బృథ్వీజనశ్రేణికా
నయనానందద రత్నకాంచననవీనస్యందనారూఢుఁడై.

54


వ.

ఇవ్విధంబున రాజమందిరద్వారంబు వెడలి, యాంగికంబులగు శుభసూచకంబులు ననుకూలసమీరసంచారంబులును నానాదర్శాదిమంగళద్రవ్యసందర్శనంబులు, నవనీసురాశీర్వాదంబులు వగణ్యపుణ్యాంగనాముక్తమౌక్తికశేషావిశేషంబులును, నభంగతురంగహేషాఘోషంబులు నంగీకరించుచు, నిరర్గళప్రసాదశరణారిశరణుడై పురంబు నిర్గమించి, సకలసేనాసమన్వితుండై కదలి కతిపయప్రయాణంబుల విదర్భానగరంబు చేరంజన, నప్పురంబునకుం గ్రోశమాత్రంబున నతిపవిత్రంబైన వేత్రవతీతటంబున, నతిమాత్రవిశాలరమణీయంబును సమస్థలంబును నైనస్థానంబున, నత్యాశ్చర్యకరణప్రచండంబయిన యోగదండంబున వ్రాసినం దత్క్షణంబ.

55

సీ.

బంధుర కాంచన ప్రాకారములతోడఁ
        బరిభాజలౌఘసంపదలతోడ
మహనీయతరదివ్యమందిరంబులతోడ
        రమణీయదివ్యసౌధములతోడ
మణిమయబహుసభామండపంబులతోడ
        నగణితదివ్యగేహములతోడ
వర్ణితశృంగారవనవితానముతోడఁ
        గమలకైరవవనోత్కరముతోడ


తే.

నప్రమేయాతివిస్తరాయామ మగుచు
నొక్కపుర ముద్భవిల్లిన నుచితభంగి
సకలసామంతపరివారసమితితోడ
విక్రమాదిత్యవనుమతీవిభుఁడు విడిసె.

56


చ.

తలఁచినమాత్ర, బాత్రిక సుధామధురాన్నము లుద్భవింపఁగాఁ,
బలుమఱుఁ గంథ రాల్చిన నపారధనంబులు సంభవింపఁగా,
గొలఁదికి మీఱుసైన్యములకుం బరితృప్తి యొనర్చె ధారణీ
తలపతి యిష్టభోజనవిధానమునన్ విపులార్జసత్కృతిన్.

57


వ.

ఇవ్విధంబున సకలసైనికులను సంతోషితస్వాంతులు గావించి, పేరోలగం బున్నసమయంబున శకమహీశ్వరురాయబారి చనుదెంచి, సముచితప్రకారంబునం బ్రవేశించి నిశ్శంకంబుగా సాహసాంకనరేంద్రుని కిట్లనియె.


శకనృపాలుని రాయబారము

ఉ.

మున్ను శకక్షమారమణముఖ్యుం డనంగవతిన్ వరింప, వే
డ్క న్నిజసర్వసైన్యబలగర్వము మీఱ విదర్భుమీఁద, న
త్యున్నతశక్తిమై విడిసి యుండఁగ; నీ వొకపోటుబంటపై
మిన్నక వచ్చి తేల, పులిమీసల నుయ్యెలలూఁగ వచ్చునే?

58


సీ.

ప్రియతనూజులసే వెట్టి పెంపొందిరి
        మాళవసాళమగధపతులు
ఏటేఁటఁ గప్పంబుచ్చి వర్ధిల్లిరి
        సౌవీరసౌరాష్ట్రనగరనృపులు

పుత్త్రుల గిరవులు పుత్తెంచి బ్రతికిరి
        కుంతలావంతీశకుకురవిభులు
కన్యలఁ గొనితెచ్చి కానుకఁగా నిచ్చి
        మనిరి కాశకరూశమద్రపతులు


తే.

జగతి నేరాజు మారాజుచరణయుగము
గాంచి కొలువనివాని నేఁ గాన నెందు,
గాదమున మాటుపడియున్న కాయవోలె
నుజ్జయిని డాఁగియున్న నీ వొకఁడుదక్క.

60


తే.

కాకతాళీయముగ మహాకాళికరుణ
నుజ్జయినిరాజ్యవైభవ మొనరెఁ గాక
యుట్టిచేరులు గోయుట లెట్టియరిది
యెలుక గొఱుకదె యటువంటి వెన్నియైన.

61


క.

ఇప్పుడు శకవిభుఁ జెనకుట
యొప్పుదుమా! మున్న బొంతయును లాతమునుం
గప్పెరయును బాదుకలును
జొప్పడినవి, బ్రతుకుటొప్పు జోగియుఁబోలెన్.

62


చ.

పలుకులు వేయు నేటి కిఁక, బ్రాహ్మణసూనుఁడ వీవు, నీకు దో
ర్భలమున కేమి కారణము; బాఁపనపోటును గప్పకాటునుం
గలదె ధరిత్రి? భట్టిమొన గట్టిగ నమ్మకు మోసపోకు, నీ
కొలఁదులె రాచకార్యములు కోమటిబుద్ధులఁ దీర్పఁ దీఱునే?

68


ఆ.

శకనరేంద్రచంద్రచరణాబ్జసంసేవ
విడిచి, యావిదర్భవిభునిఁ గలసి
వచ్చు; టోడ విడిచి [5]వదరు పట్టుట సుమీ
చెప్పఁదగినమాట చెప్పినాఁడ.

64

వ.

అనిన విని ప్రహసితముఖారవిందుండై సుమతిసూనుం డాక్షేపవాగ్గర్జితంబుగా నిట్లనియె.

65


క.

ఇట్టి వివేకమహోన్నతి
యిట్టినయోచితవిహార మేరికిఁ గలదే?
యిట్టినిను దూతఁగాఁ జే
పట్టినపతి వేఱె భాగ్యపరుఁ డన నేలా!

66


వ.

అని మఱియు నిట్లనియె.

67


తే.

తొల్లి యొకకాకి రాయంచఁ దొడరినట్లు
శకుఁడు సమరనిశ్శంకుని సాహసాంకుఁ
జెనకఁజూచుట యెన్న, నీతనికిఁ దనకు
హస్తిమశకాంతరము గాదె యలవుకలిమి.

68


క.

మాటలు పదివేలాడినఁ
బోటరియై రణములోన భుజబల మెల్లం
దేటపడఁ జూపకుండిన
మేటియశం బేల కలుగు మీరాజునకున్.

69


శా.

భూచక్రాఖిలరాజ్యభోగ మొనరుం బోరన్ జయం బందినం,
బ్రాచీనాయకలోకలోలనయనాపంచాస్త్రకేళీకళా
వైచక్షణ్యము సంభవించుఁ గదనవ్యాపారతన్ మాలినన్;
“కా చింతా మరణే రణే" యనుట నాకర్ణింపవే యెన్నఁడున్.

70


ఉ.

ఇంచుక సూదివేదన సహించినమాత్ర నృపాంగనాకుచో
దంచితసౌఖ్యకేళి సతతంబును [6]గంచులి గాంచు, నాజి ని
ర్వంచనఁ దీవ్రబాణనికరక్షతదేహుల కబ్బవే మరు
చ్చంచలలోచనాఘనకుచస్తబకద్యుతిసంగసౌఖ్యముల్.

71


క.

కావున, మీభూవిభునకు
నీవిధ మంతయును దెలియ నెఱుఁగించి, రణ

శ్రీవిక్రమంబు నెఱపఁగ
రావింపుము, రజ్జులాట రాజోచితమే?

72


వ.

అనియె, ననంతరంబ విక్రమార్కమహీపాలుండు శకభూపాలుదూతకుఁ గనకమణిభూషణాంబరతాంబూలాదిసత్కారంబు లొనరించి, వేత్రవతీతటంబు పుణ్యస్థలంబు గావున నెల్లి యుద్ధంబునకు సిద్ధపురీశ్వరుం డిచ్చటికి సన్నద్ధుండై వచ్చునట్లుగా నెఱింగింపుమని వీడ్కొలిపి, తద్వృత్తాంతం బంతయు విదర్భేశ్వరునకుం జెప్పిపంపి, తదానీతంబు లైనయుపాయనంబు లంగీకరించి, నిజభృత్యామాత్యులం దమతమనివాసంబులకుఁ బోవంబనిచిఁ సముచితప్రకారంబున నుండి మఱునాఁడు ప్రభాతసమయంబున.

73


క.

నానామంజులమాగధ
గానధ్వను లెసఁగ మేలుకని, సంధ్యాదుల్
పూని యొనరించి, బహువిధ
దానానందితవిశిష్టధరణీసురుఁడై.

74


క.

తరుణాంగరాగమాల్యా
భరణప్రభ లలర, నుదయపర్వతముపయిం
గరమొప్పునరుణుఁడో యన
నరదముపై నెక్కి విక్రమార్కుఁడు వెడలెన్.

75


క.

దక్షిణనయనాస్పందము
దక్షిణపవనానుకూలతయు నిజవిజయం
బక్షయముగ నెఱఁగింపఁగ
నాక్షణమున సాహసాంకుఁ డానందించెన్.

76


క.

అటమున్న భట్టియనుమతిఁ
బటుగతిఁ బడవాళ్లు సైన్యప్రతతులకెల్లం
జటులతరసమరలీలా
ఘటనకు వెడలుఁడని యెఱుఁగఁగాఁ జెప్పుటయున్.

77

విక్రమార్క సిద్ధపురీశుల యుద్ధము

సీ.

సంగరసన్నాహసమయం బెఱంగించు
        నిఖలమంగళతూర్యనిస్వనములుఁ
గట్టుమట్టుననుండి కదలించినఁ జెలంగు
        భీకరశుండాలబృంహితములు
రథములఁ గట్ట సారథులు ముట్టిన మిన్ను
        దన్నెడి [7]రథ్యనిధ్వానములును
బంతంబు లొండొండ ప్రకటించుసుభటుల
        సాహసోచితవాక్యసంకులములుఁ


తే.

గలసి విలసిల్లుసాహసాంకక్షితీంద్ర
చంద్రుశిబిరాంగణస్థలి సాంద్రరవము
పూర్ణచంద్రోదయోదీర్ణఘూర్ణమాన
మగుమహార్ణవఘోషంబు ననుకరించె.

78


క.

సందీపితరిపుకుంజర
సందళనక్రీడనైకసాహసలీలా
నంద మలర, సింగంబుల
మందగతి న్వీరభటసమాజము నడచెన్.

79


మ.

విలయారంభవిజృంభణంబున సముద్వేలంబులై, కుంభినీ
వలయంబుం గబళింపఁ గైకొను మహావారాకరానీకవీ
చులభంగిన్, జవసత్త్వవిస్ఫురణలం జూపట్టి యప్పట్టునన్
విలసిల్లెం దురగంబు లాశ్వికులకున్ వీర్యం బవార్యంబుగన్.

80


చ.

కలలితగండమండలము సన్మదధారల నివ్వటిల్లఁగా
నలఘువినూత్నరత్నకనకాంచితభూషణదీప్తు లొప్పఁగా
వెలువడె నున్మద ద్విరదబృందము, నిర్ఝరదీప్రవల్లికా
కులకలితంబు లైననడగొండలతండముఁ గ్రేణిసేయుచున్.

81


క.

దివినుండి భువికి డిగ్గిన
దివిజవిమానము లనంగ, దివ్యమణివిభా

నివహము దిశలకు నిగుడఁగ
నవలీలన్ వెడలె నప్పు డరదములగముల్.

82


మ.

ప్రతివీరప్రళయాంతకుండగు విదర్భక్షోణిపాలుం డినా
యతతేజుండని సాహసాంకమనుజేంద్రాలోకసంభావనో
చితసంభాషణమాధురీమహిమచేఁ జిత్తంబు లార్జించుచుం
జతురంగంబులఁ దోడుసూపె సమరోత్సాహైకసన్నాహుఁడై.

83


ఆ.

దేశకాలబలము దెలిసి దైవబలంబు
కలిమి నచ్చి బాహుబలము బెరయ
మూలబలముతోడ మోహరంబుగఁ దీర్చి
సుమతిసుతుఁడు సైన్యసమితి నడపె.

84


క.

ద్విరదములకు నరదములును
నరదములకు నశ్వములును, నశ్వంబులకున్
వరభటులును, వరభటులకు
నరిగెలవారలును బన్ని రగ్రేసరులై.

85


ఉ.

అంతకు మున్న, సిద్ధనగరావనినాథునిదండనాథుఁ డ
త్యంతబలాభిరాముఁడు మహారథనాముఁడు సర్వసైన్యమున్
సంతనకట్టె, బాహుబలసారధనుండు విదేహధారణీ
కాంతుఁడు శాలివాహనుఁడుఁ గయ్యపువేడుకతోడఁ దోడుగన్.

86


క.

ఆరెండుసేనలందును
వీరాగ్రేసరులు సమరవిక్రమకేళీ
ప్రారంభజృంభణాహం
కారత నొండొరులమీఱి కనుపట్టి రొగిన్.

87


క.

భీకరసంగరలీలా
లోకనకౌతుకదిగీశలో కేశసురా
నీకవిమానంబులచే
నాకాశము నిరవకాశమై విలసిల్లెన్.

88

వ.

ఇవ్విధంబునం బ్రతిఘటించి, పూర్వాపరసముద్రంబులుంబోలె వీరరసోద్రేకంబున విజృంభించి.

89


సీ.

అరుణదృగ్రుచులును నాయుధప్రభలును
        మార్తాండదీప్తితో మాఱుమలయ
హుంకారములు భేరిభాంకారరవములు
        వలయాద్రిఁ బ్రతివిరావముల నినుప
సింహనాదంబులు శింజినీధ్వనులును
        నాశాకరులగుండె లదరఁజేయ
నట్టహాసంబులు హయహేషితంబులు
        గగనంబు తోరణకట్టికొనఁగ


తే.

నుభయబలములసుభటులు నుగ్రవీర
రసవిజృంభణ మరుదుగా రహిఁ గడంగి
కదియునప్పటిపటుపాదఘట్టనమున
నుర్వి యంతంత నుఱ్ఱూఁత లూగదొణఁగె.

90


ఉ.

అత్తఱి, సాహసాంకమనుజాధిపు బంధురగంధసింధురో
దాత్తకపోలమండలమదద్రవధారలతావు లెక్కినం,
జిత్తము లత్తటిం జెదిరి సిద్ధపురీంద్రచమూగజేంద్రసం
విత్తమదంబు లింకె, వరిబృందము డెందము చిన్నవోవఁగన్.

91


వ.

అంత.

92


మ.

దివిజస్త్రీకుచకుంభకుంకుమముతో, దివ్యాంగనావీటికా
నవకర్పూరరజంబుతో, నమరకాంతాదేహహారిద్రపం
కవిశాలోన్నతితో, సురినిటలభాగన్యస్తకస్తూరితో
నవనీరేణువు సాటియై పరఁగె నాశాకాశసీమంబులన్.

93


చ.

కలయఁగ ధూళి దృగ్రుచులు గప్పిన, జోదులు శబ్దవేదులై
పెలుచఁ గడంగి, నేమిరవబృంహితహేషితసింహనాదసం

కులముగ నుల్లసిల్లు రధకుంజరఘోటక సద్భటావళిం
గొలఁదికి మీఱఁగా ధరణిఁ గూల్చిరి బాణపరంపరాహతిన్.

94


ఉ.

అప్పుడు, కుండలీకృతశరాసనులై విలుకాండ్రు తూపులం
గప్పిరి నింగి, నాంగికముగాఁ గయిసేసినవన్నె లన్నియుం
జిప్పిలు దట్టపుంజెమటఁ జిందఱవందఱగాఁగఁ జాల నిం
పొప్పఁగఁ దీవ్రభానుకిరణోగ్రత నడ్డము చేసిరో యనన్.

95


ఉ.

చాపము లింద్రచాపములచందము చూపఁగఁ, గెపుసొంపువా
ల్దూపులక్రొమ్మెఱుంగులకుఁ దోడుగఁ దర్జనగర్జ లొప్పఁగాఁ,
జాపధరాంబువాహములు సాయకవృష్టులయేపుసూప, ను
ద్దీపితరక్తవాహినులఁ దెప్పలఁ దేలెను భూతసంఘముల్.

96


చ.

బలములు రెంటఁ బేరుగలబంటులరోషమహానలంబులం
దొలిదొలి ధూమముల్ నిగిడి తోన శిఖావళు లంకురించి ని
ప్పులు ధరమీఁదఁ బేర్చుక్రియ భూరజముల్ దివిముట్టిరక్తధా
రలు గనుపట్టి తొట్టె సమరస్థలి నెల్లను మాంసఖండముల్.

97


వ.

అట్టియెడ నుభయబలంబుల నుభయబలంబులునుసు, సేనాముఖంబుల సేనాముఖంబులును, గణంబుల గణంబులును, వాహినుల వాహినులును, నక్షౌహిణుల నక్షౌహిణులును, దలపడి సన్నాహంబుల సముత్సాహంబులు పోషించఁ, గోపంబు లాటోపంబుల భూషింప, హుంకారంబు లహంకారంబుల ముదలింపఁ, జలంబు లచలంబులం బొదలింప, నవార్యంబు లగుశౌర్యంబులు, నఖర్వంబు లగుగర్వంబులు, నశాంతంబు లగుపంతంబులు, నవరోధంబు లగువిరోధంబులు, నఖేదంబు లగుసింహనాదంబులు, నద్భుతారంభంబు లగుసంరంభంబులు నుల్లసిల్లఁ జలంబులు వదలక , బలంబులు ప్రిదులక, భీరంబు లెడలక, బింకంబులు సడలక, బిగువులు దక్కక, బిరుదులు స్రుక్కక, వెలవెలంబాఱక, వెన్ను చూపి జాఱక, తాలిమి దింపక, మాలిమిఁ బెంపక, తలఁగక మలఁగక, విఱుగక సురుఁగక, కేడింపక జోడింపక, వెఱవక చేమఱవక, అత్తళంబులఁ గత్తళంబులుసించియు, శరంబుల శిరంబులు ద్రుంచియుఁ, గుంతంబుల దంతంబులు పొడిచేసియు,

నారసంబుల నీరసంబుల నేసియు, పరిఘంబులఁ గేతనంబు లడిచియు, శూలంబుల ఫాలంబులు వొడిచియుఁ, గత్తుల నెత్తులు వగిలించియు, బల్లెంబుల సెల్లెంబుల నొగిలించియుఁ, గుఠారంబులఁ గఠారంబుల మరల్చియు, వీరావేశంబుల విహరించునవసరంబునం, బతి యవసరంబు నెఱపం దెఱపి గని, వెఱవిడి తఱుకొన్న విధంబున శిబిరంబు చొచ్చి, బలుమగలం బరిమార్చి యార్చి, పేరువాడి వీరాలాపంబు లాడువారును, ఱొమ్ములుగాఁడి వీఁపులవెడలి నేలం గీలుకొనియున్నతోమరంబు లాధారంబులుగా నిలిచి, గతప్రాణు లయ్యును సమీరసంచారంబునఁ జలించుకతంబునఁ జేతనులుంబోలెఁ బరులకు భయం బాపాదించువారును, ద్విరదంబు లరదంబులంబొరల నెత్త నొరగినయీరసంబున నాభీలంబు లగుకరవాలంబులు వెఱకి దంతకాండంబులతోడన కండతుండెంబులుగా ఖండించి, చిత్రలీలావిలాసనిరవధికులని యమరవరులచేతం బొగడువడయువారును, బహుముఖంబు లగుశరముఖంబుల మర్మోద్ఘాటనంబు సేయుతఱి వర్మంబులతోడన చర్మంబులు సించిన రక్తప్రసిక్తంబు లగుశరీరంబులు చెందిరపుఁగీలుబొమ్మలట్ల చెలంగం, గలన నెక్కటికయ్యంపునెయ్యంబునం బెనంగువారును, గరవాలభిండివాలప్రముఖప్రహరణంబులు ప్రతిహతంబు లగుటయు రయంబునం బ్రతిభటప్రయుక్తంబు లగునాయుధంబులు గైకొని పరాక్రమించువారును, నెత్తురుల జొత్తిల్లినయంగకంబులు పల్లవితంబులైనయశోకంబులును, బుష్పితంబులైనకింశుకంబులును, శలాటుకీలితంబులైనవటంబులును, ఫలితంబులైనకింపాకంబులునుంబోలె నుల్లసిల్లం బెల్లగిలక కయ్యంబుసేయువారును, నయిదుపదిసేయక యవక్రవిక్రమంబునం బరాక్రమించి చని, దేదీప్యమానంబులయిన దివ్యవిమానంబు లెక్కి, కృతాలింగనలైన సురాంగనలకు హర్షోత్కర్షంబుగాఁ దమచేత వికలాంగంబులైన చతురంగంబులం జూపి పౌరుషంబులు ప్రకటించువారునునై , కలహభోజననయనపారణంబైన దారుణరణవిహరణం బొనరించుసమయంబున.

98


ఉ.

ఏమెయి రెండువాహినుల నెక్కువతక్కువ యింతలేక సం
గ్రామము సేయునప్పుడు, పరాక్రమ మొప్పఁగ శాలివాహన

క్ష్మామహిళేశ్వరుండు విలసద్బలసంపదసొంపు చూపినం,
దామరపాకునీటిక్రియఁ దల్లడమందెను వైరిసైన్యముల్.

99


క.

నిజబలము వీఁగఁబాఱిన
భుజబల మలరఁగ విదర్భభూవరుఁడు మహా
గజ మబ్జినిఁ జొచ్చినగతి
విజిగీష విదేహసైన్యవితతిఁ గలంచెన్.

100


చ.

అతనిమహోగ్రవిక్రమసమగ్రత సైఁపక, శాలివాహనుం
డతిశితశక్తి వైచిన, నహంకరణస్ఫురణన్ విదర్భభూ
పతి యతితీవ్రబాణముల భగ్నము సేయుటయు, న్విదేహరా
జతులితచావహస్తుఁ డయి యవ్విభుపై శరవృష్టి నించినన్.

101


చ.

కనుఁగవఁ గెంపుసొంపడరఁగా నతఁ డానరనాథుచాపముం
దునిమి, హయంబుల జదిపి, తోడనె సారథి నేపుమాపి, కే
తనము ధరిత్రిఁ గూల్చిన, రథంబును గ్రక్కున డిగ్గి యాతఁడుం
గినుక దలిర్ప సైనికుల గీటణఁగించెఁ గృపాణపాణియై.

102


క.

అంత విదర్భేశుఁడు విల
యాంతకుగతి నాక్రమించి, యవ్విభు నడిదం
బెంతయు బెడిదపుఁదూపుల
నింతింతలుతునియలై మహిం బడనేసెన్.

103


తే.

ఏసి, కంఠము గుఱిచేసి యేయఁ దలఁచి
శరము దొడిగినమాత్ర నచ్చెరువుగాఁగ
నారితోడనకూడ బాణాసనంబుఁ
దునిమె నొక్కమ్మున మహారథుండు గడఁగి.

104


వ.

ఇవ్విధంబున సురక్షితదేహుండై విదేహుండు తత్సమయసమానీతం బగునొండురథం బెక్కి పరాక్రమించుటయును.

105

తే.

అమ్మహారథ శాలివాహనులమీఁద
భల్లనవకంబు నేసిన భట్టిమేన
వాకలును నేసి రన్నేసి వాలుటమ్ము
లాహవమ్మున నీడుజోడాడినట్లు.

106


వ.

మఱియును.

107


క.

ఆయిరువురు నమ్మెయిఁ దను
నేయుశరావళుల నెల్ల నిసుమంతలుగాఁ
జేయుచు భట్టియుఁ దద్ఘన
కాయనిషంగముల సాయకంబుల నించెన్.

108


క.

ఆసమరప్రౌఢికి మది
రోసించి, విదేహనరవరుండు చమూపా
గ్రేసరులకుఁ జెయివీచిన
నాసురగతి శకబలంబు లతనిం బొదివెన్.

109


వ.

ఇట్లు పొదువుటయును.

110


సీ.

మొక్కలంబుగఁ జొచ్చి ముక్కొనప్రయ్యఁగా
        భటకోటిచట్టలు వాపిపాపి
యారోహకులతోన హయములఁ గబళించి
        వేమాఱు నేలతో వ్రేసివ్రేసి
భద్రేభములు వీడుపడఁ దాఁకఁ గోల్కొని
        గుండెలు వగులంగఁ గ్రుమ్మిక్రుమ్మి
రథ్యసారథులతో రథము లుద్ధతిఁ బట్టి
        దిర్దిఱ వినువీథిఁ ద్రిప్పిత్రిప్పి


తే.

విమతరాజన్యవరసైన్యకమలషండ
ఖండనోద్దండవిహరణక్రమనిరూఢి
నెదురులేక రణంబులో నేపుచూపె
కట్టి జగజెట్టి దీకొల్ప భద్రగజము.

111

తే.

ఆకరీంద్రునియీటోప మపనయించి
మాఱుకొన్నవిదర్భేశుఁ బాఱఁదోలి
సాహసాంకక్షమానాథచంద్రు నెదిరి
సిద్ధపురినాథుఁ డిట్లనుఁ జేవ మెఱసి.

112


సీ.

అత్యద్భుతము లైనయన్యులసొమ్ములు
        కుటిలమార్గమునఁ గైకొనఁగవచ్చు
నింద్రజాలపువిద్య నెచ్చోట నైనను
        బయలు పట్టణముగాఁ బన్నవచ్చుఁ
గపటంపుఁగంథచేఁ గలిగినయర్థంబు
        సకలార్థులకు వెదచల్లవచ్చు
నాకలోకాధీశు నటనమాటలఁ దేల్చి
        వరరత్నపీఠంబుఁ బడయవచ్చుఁ


తే.

గాక, పరిపంథిదర్పాంధకారహరణ
సుప్రతాపప్రదీపవిస్ఫురణశరణ
పటుతరాయససుకృపాణపాణి నైన
నను నెదుర్కొని, యని నీకుఁ జెనక వశమె?

113


మ.

అని, సంరంభవిజృంభణస్ఫురణమై, నావిక్రమార్కక్షితీం
ద్రునిపై నంపపరంపరల్ గురియఁగాఁ, దోడ్తో నతం డన్నియున్
ఘనశస్త్రాహతిచే నణంచి, విలసత్కాండప్రకాండంబులం
దునిమెం గేతనరథ్యసారథిరథస్తోమంబుఁ జిత్రంబుగన్.

114


ఉ.

ఒండొకతేరు గైకొని సముద్ధతి సిద్ధపురీశ్వరుండు కో
దండగుణధ్వనుల్ చెలఁగఁ దచ్చతురంగవరాహవక్రియా
పండితమూర్తియై మెఱసి పావకసాయక మేసె, నాత్మలో
మండెడుకోపవహ్ని నరిమండలిపైఁ బచరించుపోలికన్.

115


క.

ఆవిశిఖశిఖికిఁ దలఁ కొక
యావంతయు లేక విక్రమాదిత్యధరి

త్రీవరుఁడు వనధివల్లభ
దైవత్యం బైనశర ముదగ్రత నేసెన్.

116


సీ.

మెఱుఁగులు గ్రమ్మెడుమేఘాస్త్ర మేసినఁ
        బవనబాణంబునఁ బరిహరించె
విషము లుమియుకాద్రవేయాస్త్ర మేసిన
        గరుడబాణంబున గర్వమణఁచె
సమధికోన్నత మైనశైలాస్త్ర మేసిన
        నింద్రబాణంబున నేపు మాపె
దృఙ్నిరోధం బైనతిమిరాస్త్ర మేసిన
        నరుణబాణంబున విరియఁ జేసె


తే.

నిత్తెఱంగున శకధారణీశదివ్య
శరపరంపరఁ బ్రతిబాణసమితి నణఁచి
యడరి పుంఖానుపుంఖనానాస్త్రశస్త్ర
వితతి నందంద యతనిపై వెల్లిగొలిపె.

117


వ.

ఇట్లు నిరర్గళప్రసారంబు లైనశరాసారంబులకు మిసిమితుండుగాని శకమహీకాంతునిం జూచి యాశ్చర్యధుర్యుండై, సాహసాంకనృపవరుండు భట్టితో నిట్లనియె.

118


ఉ.

ఇంతకుమున్ను నన్ను నొరుఁ డెవ్వఁడు మార్కొని యింతసేపు వి
క్రాంతి వహించి మించి భుజగర్వము చూపినవాఁడు లేఁడు, నేఁ
డెంతయు మేటియై శకమహీపతి దివ్యశరప్రయోగదు
ర్దాంతనితాంతనైపుణధురంధరుఁడై యనిసేయు టెట్లొకో?

119


వ.

అనిన సుమతిసూసుం డిట్లనియె.

120


క.

ఉగ్రుం డితఁ డొనరించిన
యుగ్రతపంబునకు మెచ్చి, యొసఁగినవరసా
మగ్రి యిది, యితని నొరుఁడు ర
ణాగ్రంబున నెదిరి గెలుచు టరిది నరేంద్రా!

121

వ.

దీనికిం బ్రతివిధానం బొకటి విన్నవించెద నది యవధరింపు మని యిట్లనియె.

122


మ.

చరణాబ్దంబులు యోగపాదుకలతో సంధించి, యాకాశసం
చరణారంభవిజృంథమాణరణదీక్షాదక్షత న్మించి, వా
విరి బ్రహ్మాస్త్రము నిన్నరేశ్వరునిపయిన్ వేగం బ్రయోగింపు; సు
స్థిరలీలన్ సమకూరు నీకు జయలక్ష్మీనిత్యసాంగత్యముల్.

123


తే.

అనిన సౌమతేయునిబుద్ధి కాత్మ నలరి
చరణములఁ బాదుకలు మెట్టి చదల నిలిచి
మంత్రతంత్రానుసంధానమార్గశుద్ధి
వెలయ, బ్రహ్మాస్త్ర మేసె నవ్విమతుమీఁద.

124


శా.

ఆదివ్యాస్త్రము భీషణానలశిఖాహంకారశంకావహ
ప్రాదుర్భూతపటుస్ఫులింగపటలీప్రచ్ఛన్నదిగ్భాగమై,
యౌదార్యంబున వాసవాదిసకలాశాధీశహృన్మూలముల్
భేదిల్లం జని సంహరించె జగదాభీలున్ శకక్షోణిపున్.

125


వ.

ఇవ్విధంబున శకక్షోణీశ్వరుండు హతుం డగుటయు నద్దివ్యబాణంబు నుపసంహరించి, హతశేషులైనవిరోధివరూథినీనాథులకు నభయప్రదానంబు దయచేసి, ప్రధానపురస్సరుండై వచ్చి శరణంబుసొచ్చిన శకమహీనాథునందనుం గనుంగొని కరుణించి తదీయసామ్రాజ్యంబునం బ్రతిష్ఠించి.

126


సీ.

నవరత్నమయభూషణస్ఫారరణభూమి
        విలసిల్లుకల్యాణవేది గాఁగ
దళితకుంజరకుంభకలితమౌక్తికరాజి
        కమనీయశేషాక్షతములు గాఁగ
సమరసంక్రీడనసందర్శనాగత
        సురకోటి పెండిలిదొరలు గాఁగ
బహువిధజయతూర్యపటునిస్వనంబులు
        రమ్యమంగళవాద్యరవము గాఁగ

తే.

నుచితకాలజ్ఞుఁడగుభట్టి యొజ్జ గాఁగఁ
జటులమైన ప్రతాపాగ్ని సాక్షిగాఁగ
విజయలమ్మసముద్వాహవిలసనమున
సాహసాంకమహీనాథచంద్రుఁ డొప్పె.

127


వ.

అప్పుడు తదీయమహనీయపరాక్రమప్రభావంబునకు హర్షించి, శతమఖప్రముఖబర్హిర్ముఖు లతనిపై దివ్యప్రసూనవర్షంబులు గురియించి, తమలో నిట్లనిరి.

128


సీ.

పాథోనిధానంబు బాణాగ్రమున నిల్పి
        గరిమమీఱిన చాపధరుఁడు దక్కఁ
బెనుఁగూపమునఁ బడ్డ పృథుకందుకము బాణ
        తతిఁ బుచ్చియిచ్చిన ధన్వి దక్క
నఖలరాజులు చూడ యంత్రమత్స్యము నేసి
        ప్రౌఢిమించిన ధనుఃపాణి దక్క
ననిలోనఁ బరశురామునకు మిక్కుటముగాఁ
        గడిమిచూపిన విలుకాఁడు దక్క


తే.

జిత్రకోదండవిద్యావిశేషసహజ
సాహసక్రమవిక్రమోత్సాహలీల
విక్రమాదిత్యవసుమతీవిభునిఁ బోల
నన్యరాజన్యవరులకు నలవి యగునె!

129


వ.

అని యనేకప్రకారంబులఁ బ్రశంసించుచు నిజనివాసంబులకుం జనిరి. తదనంతరంబ పటుపటహభేరీమృదంగాదిమంగళతూర్యనిస్వనంబులును. బాఠకపఠనరవంబులును, మాగధగీతికానినదంబులును, వందిసంకీర్తనస్వనంబును, సముద్భటసుభటవీరాలాపకలకలంబును నభంబు నైసర్గికగుణంబు నాపాదింపఁ, ద్రిభువనభవనమోహనాకారరేఖారమానందనుం డైనరాగమంజరీనందనుండు, నిజసౌందర్యసందర్శనాలోల లోలలోచనాలోచనకువలయితగవాక్షలక్షితప్రాసాదశోభాకరంబైన విదర్భానగరంబు ప్రవేశించి, ప్రాగ్ద్వారవేదికానివేశితసముదీర్ణపూర్ణకుంభంబును, రంభాస్తంభసంభావనానందనందనమాలికావిలసనంబును. భూసురాశీర్వాద మేదురంబును,

విశాలవిజృంభితజగజ్జేగీయమానగౌరీకల్యాణగానపరికల్పితకర్ణపారణంబును, విదర్భేశ్వరదర్శితంబునైన తదీయప్రధానాగారంబున విడిసి, సకలసైన్యంబును సముచితప్రదేశంబుల విడియింప సుమతిసూను నాజ్ఞాపించి, విదర్భేశ్వరుని నిజనివాసంబునకుఁ బోవ నియమించిన, నతం డిట్లనియె.

130


విక్రమార్కుఁడు విదర్భరాజపుత్రికను వివాహమాడుట

క.

దురమున నెదురై యేరికిఁ
బరిమార్పఁగ రాకయుండఁ బరమేశ్వరుచే
వరములు గాంచినశకవిభుఁ
బొరిగొంటివి, నీకు నితరభూపతు లెనయే?

131


చ.

కుమతి శకుండు మత్పురముకోటపయిన్ విడియంగ, నెంతయుం
గమలదళంబుమీఁదియుదకంబునుబోలె జలించునాదుడెం
దము, భవదీయశౌర్యసముదగ్రతప్రాపున నుల్లసిల్లి, సిం
హము మెడగంటవోలె నభయంబునఁ బొందె వసుంధరేశ్వరా!

132


చ.

హరునివరంబునం గనినయాత్మజఁ, బట్టపుదేవి గాఁగ నో
నరవర! నీకు నిత్తు నని నామదిఁ గోరిక సంభవింప సు
స్థిరతరకీర్తిసంపదలఁ జెంది సుఖింపఁగఁ గంటి, రాజశే
ఖరునకుఁ గూఁతు నిచ్చి నుతి గాంచినశీతనగేంద్రుకైవడిన్.

133


చ.

జనవర! నీపురోహితుల శాస్త్రరహస్యనిరూపణక్రియా
వనజభవప్రభావు లగువారి, ముహూర్తము నిశ్చయింపఁగాఁ
బనుపు, 'శుభస్యశీఘ్ర' మనుపల్కు నిజం బొనరింపు మన్న, గొ
బ్బనఁ బతిచిత్తవృత్తిఁగని భట్టి విదర్భుఁడుఁ దాను వేడుకన్.

134


క.

ఉభయపురోహితసమ్మతి
శుభలగ్నము నిర్ణయించి, సొంపుగఁ బురికిన్
విభవోచితశృంగారము
నభినవముగఁ జేయఁ బనుచు నాక్షణమాత్రన్.

135


సీ.

కుడ్యభాగంబులఁ గుంకుమంబులు పూసి
        వేదికాస్థలుల జవ్వాది నలికి

కస్తూరి ముంగిళ్లఁ గలయంపిగాఁ జల్లి
        నిగ్గుఁగప్పురమున మ్రుగ్గు పెట్టి
కంబాలఁ జీనిచీనాంబరంబులు చుట్టి
        గోపురంబులఁ బైఁడికుండ లెత్తి
మేడల ముత్యాలమేలుకట్టులు గట్టి
        రత్నదీపిక లగారముల నుంచి


తే.

కనకకాండరంభాస్తంభకలితముకుర
పట్టపటపుష్పచామరపల్లవాది
తోరణము లెల్లవీథులఁ దొంగలింపఁ
జేసి కైసేసి రభినవశ్రీలు మెఱయ.

136


వ.

అంత.

137


సీ.

మెఱుఁగులగతిఁజూపు మెఱుఁగుఁగన్నులచూపు
        పసిఁడికమ్మలమీఁదఁ బరిఢవింప
మొలకవెన్నెలనవ్వు మురిపంపులేనవ్వు
        చెక్కుటద్దములపైఁ జెంగలింవ
జక్కవకవమించు చనుఁగవనగుమించు
        మణిహారదీప్తితో మచ్చరింప
హరినీలములఁగప్పు నలకల నునుఁగప్పు
        కస్తూరితిలకంబు గారవింప


తే.

నతివ మోహనమంత్రదేవతయొ నా, న
నంగవతి కాంక్ష మన్నించు ననుఁగుబోటి
యగు చకోరికయను చకోరాక్షి వచ్చి
సాహసాంకమహిపాలచంద్రుఁ గాంచి.

138


తే.

ప్రణతి యొనరించి సరససంభాషణముల
రాగమంజరిసుతుమనోరాగ మెఱిఁగి
చిత్త మౌచిత్యవృత్తి వశీకరించి
విన్ననువుమీఱ నిట్లని విన్నవించె.

139

క.

నినుఁ జూచినచూపులనే
తనుఁ జూడఁగ, నవును మననతాపోపశమం
బనుచు విదర్భేశ్వరుసుత
పనుపఁగ, నినుఁ జూచు వేడ్కఁ బనివింటినృపా!

140


వ.

ఎట్లనినం దదీయదశావిశేషంబు లవధరింపుము.

141


క.

దేవరమోహనలీలా
లావణ్యవిలాసగుణకలాపము లెమ్మై
భావింతురొ, యిట్లని నుతి
గావింతు రనంగవతిసకాశమునఁ జెలుల్.

142


సీ.

కాంతామనోహరాకారుఁ డౌ మారుండు
        సర్వజ్ఞకలహనిశ్చయుఁడు గాని
శ్రితపరిరక్షణస్థేముఁ డౌ రాముండు
        వరపుణ్యజనభయంకరుఁడు గాని
మహితదివ్యాస్త్రసమర్థుఁ డౌఁ బార్ధుండు
        గురుసుతాప్రియగుణకరుఁడు గాని
సంతతవిభవనిస్తంద్రుఁ డౌ నింద్రుండు
        కులగోత్రభేదనోగ్రుండు గాని


తే.

యనుచు వారలగుణముల నపహసించు
సరణి, సర్వజ్ఞులును బుణ్యజనులు గురులు
గులనగేంద్రులుఁ గొనియాడఁ గొమరుమిగిలె
విక్రమార్కమహిపాలచక్రవర్తి.

143


ఉ.

అరసికాగ్రగణ్యునిసమంచితరూపగుణప్రసన్నగం
భీరతఁ గన్నఁ గామినులపేరిటిరాలయినం గరంగు, సం
సారఫలంబు గాదె యెలజవ్వని! నీకుఁ దదీయనర్మలీ
లారసనర్మకేళిరతిలాలితసౌఖ్యము సంభవించుటల్.

144

వ.

అని యి ట్లనేకప్రకారంబుల.

145


చ.

పలుమఱు నెచ్చెలుల్ సెవులపండువుగా నినుఁ బ్రస్తుతింపఁ, ద
త్సలలితసారభాషణసుధారసధారలఁ దొప్పఁదోఁగి, తొ
య్యలి హృదయాలవాలమునయం దనురాగలతావితానముల్
మొలచు టెఱింగి యంగజుఁడు, మోహనబాణము నారిఁ గూర్చినన్.

146


సీ.

నిలువుటద్దము సూడ, నెచ్చెలితో నాడ
        సరసోక్తులకు నవ్వ, సరులు గ్రువ్వఁ
జిత్తరువులు వ్రాయఁ, జిలుకఁ బెండిలి సేయ
        సరసాన్నము భుజింప, మరు భజింపఁ
దల్లిచిత్తము పట్టఁ, దారహారము వెట్టఁ
        క్రొవ్విరు ల్వెడఁ గూర్పఁ, గురులు దీర్పఁ
గనకసౌధము చేరఁ, గమ్మజాజులు గోర
        నాట్యరంగము ద్రొక్క, నటన కెక్క


తే.

హంస నడపింప, జలకేళి కగ్గలింప
వీణె వాయింపఁ, బాన్పుపై విశ్రమింప
నెఱుఁగ; కి ట్లొక్కనాఁ డొకయేఁడు గాఁగ
బాల వలపంతఁ జింతించుకీ లెఱింగి.

147


వ.

ఆకాంత కేకాంతంబున నిట్లంటి.

148


ఉ.

ఇంత విచార మేల తరళేక్షణ? యెంతటివాని నైన నీ
కాంతునిఁ జేయుదాన, రతికాంతునిపాదము లాన, నీకు నా
యంతటిబోటి గల్గఁ దగవా వగఁ జెందఁగ? నీమనోరథం
బింతయుఁ జెప్ప, వేమిటికి నేనుఁగు నెక్కియు దిడ్డి దూఱఁగన్?

149


క.

నావుడుఁ దొంగలిఱెప్పల
కేవల నునుసిగ్గు లంకురింపఁగ, నాపై
భావానుకూలలీలా
భావితముగఁ జూడ్కి నిలిపి, బాలిక తనలోన్.

150

ఉ.

చెప్పఁ దలంచు, సిగ్గు తనుఁ జెప్పఁగనీమికి సంచలించుఁ, దాఁ
జెప్పెడుమాట యెవ్వరికిఁ జెప్పకుమీ! యనఁ జూచు, నంతటం
జెప్పక యుండ రాదు మఱి చెప్పఁగ రాదని కొంకు, నెమ్మెయిం
జెప్పక పోదు పొ! మ్మనుచుఁ జిత్తము నూల్కొనఁ జేసి యిట్లనున్.

151


తే.

'నిజకరస్పర్శ మొనరించి నీరజముల
నర్కు డలరించునది యెంత యన్నకరణి
వినినయంతన విక్రమవినుతుఁ డైన
యర్కుఁ డలరించె నాహృదయాంబుజంబు'.

152


వ.

అని భావగర్భితంబుగా నిన్నుఁ బేర్కొనుటయు.

153


మ.

తలఁపోఁతల్ దల లెత్తెఁ, దాల్మి సడలెం, దాపంబు దీపించెఁ, జేఁ
తలు డిందెన్, ధృతి వీడుకోలు గొనియెన్, దైవాఱెఁ గన్నీరు, కో
ర్కులు గోవావులకోడెలై నిగిడె, సిగ్గుల్ దూరమై పోయె, న
గ్గల మయ్యెం దమకంబు పద్మముఖికిం గందర్పుచే నెంతయున్.

154


వ.

ఆసమయంబునం బ్రదీపించు నుద్దీపనవిభావప్రభావంబు భావించి, సోపాలంభంబుగా నెచ్చెలు లిట్లనిరి.

155


సీ.

కుంభోదకముఁ బోసి యంభోజముఖ వెంపఁ
        జూతంబు కొమ్ములు సూపఁదొణఁగె
ఫలరసంబులు వోసి బాలిక పోషింపఁ
        జిలుక మో మెఱ్ఱగాఁ జేసికొనియె
మూలమూలల దాఁచి ముద్దియ పాలింప
        నలరులు ములుకులై యంటఁదఱిమెఁ
బ్రాణంబుగా నింతి భావింపఁగా గాలి
        యంతకు దెసనుండి యాక్రమించె


తే.

వెలఁది చేసినమే లెల్ల వీటిఁబుచ్చి
యివి యకారణవైరులై యేఁపఁ జొచ్చె

జలజముఖులార! యన్యపుష్టముల కెందుఁ
గొమ్మఁ గొనిపోవు టారయ గుణముగాదె!

156


వ.

అనుచు నమ్మదవతి మదనవికారంబులకుఁ బ్రతికారంబులు శీతలోపచారంబులుగా విచారించి.

157


క.

నవమకరందయుతంబై
ప్రవిమలనీహారసలిలపరిమిళితంబై
యివతాళించుజలమ్మున
నువిదకు మజ్జనవిధాన మొనరించి తగన్.

158


తే.

జిగి దొలంకెడు చెంగల్వసెజ్జ నుంచి
గంద మందంద డెందంబునందు నలఁది
తరుణరంభాదళాంభోజతాళవృంత
పవనంపాదనక్రియాప్రౌఢి మెఱసి.

159


ఉ.

కట్టిరి సన్నపుందనుపుఁగావి కటీతటి, మేనితీఁగపై
నొట్టిరి కమ్మపుప్పొడి, సమున్నత మైనకుచద్వయంబుపై
బెట్టిరి క్రొత్తముత్యములపేరులు, కంకణనూపురాకృతిం
జుట్టిరి పాణిపాదములఁ జొక్కముగా బిసకాండకాండముల్.

160


వ.

మఱియును.

161


సీ.

చంద్రకాంతపుఁగోరఁ జల్లనిపన్నీరఁ
        దొరఁగెడుకన్నీరు తుడిచి తుడిచి
మంచునఁ దోఁగినమించులేఁజిగురాకు
        లొయ్యనఁ గరముల నొత్తి యొత్తి
తేటి ముట్టనిపువ్వుఁదేనియఁ బుప్పొడి
        మెదిచి, పాదంబుల మెత్తి మెత్తి
పిర మైనపచ్చకప్పురము గందముతోడఁ
        గలిపి పాలిండ్లపై నలఁది యలఁది

తే.

మలయపవనుండు పలుమాఱు మలయకుండ
నలరుటింటిగవాక్షంబు లరసి యరసి
యెందుఁ గందర్పతావంబు డిందుపడమిఁ
జెలువ నీరాక మది నపేక్షించునంత.

162


క.

ఆవెలఁదిభాగ్యదేవత
యావిర్భావంబుఁ బొందిన, ట్లిచ్చటికిన్
దేవర విజయం చేసిరి
గావునఁ దత్తపముఫలము గానఁగవచ్చెన్.

163


క.

ముట్టడి మాన్పి విదర్భకుఁ
బట్టముగట్టితి విదర్భపతి, నతనిసుతం
గట్టుము మరురాజ్యమునకుఁ
గట్టిగఁ బట్టం, బవశ్యకర్తవ్య మగున్.

164


క.

ననుఁ బాసి యొక్కనిముసము
తనయంతన యుండ దావిదర్భేశ్వరునం
దన, నేను నట్లకావున
నను ననుపఁగ, నవధరింపు నయతత్త్వనిధీ!

165


వ.

అని విన్నవించుచకోరికం గనుంగొని, సాహసాంకనరేంద్రచంద్రుం డిట్లనియె.

166


ఉ.

నారదమౌనిచేత నొకనాఁడు వినోదముపోలె విన్నమీ
నీరజనేత్రసోయగము, నేఁడును నామదిఁ బాయదన్న, ని
చ్ఛారతిఁ గూడిమాడి యనిశంబును నొక్కెడ నున్నయట్టినీ,
కారమణీవియోగమున కాత్మ యొడంబడునే చకోరికా!

167


చ.

అని సరసప్రసంగముల నమ్మదిరాక్షిని గారవించి, కాం
చనమణిభూషణావళు లసంఖ్యము లిచ్చి, ప్రియంబు మీఱఁగా

ననిచి, యథోచితక్రియల నమ్మనుజేశ్వరుఁ డుండునంత, స
ద్వినయధనుండు భట్టి చనుదెంచి నమస్కృతి చేసి, యిట్లనున్.

168


క.

పురిశృంగారముఁ జూచిన
నరులకు నెల్లను నవాఙ్మనసగోచరమై
కర మొప్పుచున్న, దెల్లియ
పరిణయలగ్నంబు, వలయుపను లొడఁగూడెన్.

187


శా.

భూపాగ్రేసర! యుష్మదీయచరు లుద్బోధింప నానావిధ
ద్వీపానీతగజాశ్వరత్నరమణీదివ్యాంబరశ్రేణిచే
నీపాదాంబుజసేవ సేయుటకునై నెయ్యంబుతో వచ్చినా,
రాపూర్వాపరదక్షిణోత్తరదిగంతానంతధాత్రీశ్వరుల్.

170


వ.

అని విన్నవించి వారలఁ గానిపించుటయు.

171


క.

సకలనృపప్రకరంబును
బ్రకటితముగ సాహసాంకుపదపీఠికకున్
మకుటమణిదీపకళికా
నికరము నీరాజనముగ నిర్వర్తించెన్.

172


వ.

అప్పు, డప్పుడమిఱేఁడు తదానీతంబులైనపావడంబులు గైకొనియె, నంతం దదనుమతి వడసి భట్టియు రాజలోకంబును నిజనివాసంబులకుం జనిరి. మఱునాడు శకమర్దనుండు ప్రభాతసమయసముచితకృత్యంబులు నిర్వర్తించునంత, నక్కడ.

173


చ.

హితులఁ బ్రధానవర్గముఁ గవీంద్రుల బంధుల మిత్త్రులం బురో
హితులను దండనాథుల మహీపతులం బరివారముం గళా
వతులను మాగధోత్తముల వందిజనంబు దిగంతరాగత
క్షితిపతులన్ విదర్భపతి శ్రీ వెలయంగ సభాంతసీమకున్.

174


వ.

ప్రియపూర్వకంబుగాఁ బిలిపించి, గంధాక్షతకర్పూరతాంబూలంబు లాదిగా సత్కారంబు లొనరించె, ననంతరంబ.

175

వివాహవర్ణనము

సీ.

సంప్రీతిఁ గిన్నరేశ్వరుఁడు పుత్తెంచిన
        రమణీయచీనాంబరములు గట్టి
కడువేడ్క నాకలోకస్వామి యనిపిన
        మందారకుసుమదామములు దాల్చి
వినయంబున దినేంద్రతనయుండు పంచిన
        బంధురశ్రీగంధపంక మలఁది
భక్తితో భువనాధిపతి దూత తెచ్చిన
        నవరత్నమయభూషణములు దొడిగి


తే.

తనువిలాసంబు కనుఁబాటు దాఁకకుండఁ
గా నొనర్చిరి గాక శృంగార మనఁగ
పతియుఁ బతియును వచ్చి రప్రతిమలీల
సఖులు దోడ్తేర నుద్వాహసదనమునకు.

176


క.

అత్తఱి విదర్భభూపతి
చిత్తంబున సంతసంబు చిగురొత్తఁగ, వి
ప్రోత్తములు వేదమార్గా
యత్తంబుగ నాచరించి రౌచిత్యంబుల్.

177


వ.

తదనంతరంబ, మౌహూర్తికదత్తశుభముహూర్తంబున.

178


క.

సారోదారసుధారస
ధారాహారానుసారి ధరణీదివిజో
దీరితవేదధ్వనితో
గౌరీకళ్యాణమధురగానము మెఱసెన్.

179


ఉ.

శ్రీ మెఱయం, బురోహితవిశిష్టమతంబున విక్రమార్కధా
త్రీమహిళేశ్వరుండు సముదీర్ణత నించిన సేసఁబ్రాలు, కాం
తామణికేశభారమునఁ దద్దయు నొప్పె; మరుండు లీలతోఁ
గోమలనీలగుచ్ఛములఁ గూర్చినముత్తెపుజల్లియో! యనన్.

180

వ.

తదనంతరంబ.

181


సీ.

పసిడికుండలమించు పాలిండ్లనునుమించు
        కరమూలములకాంతిఁ గౌఁగిలింపఁ
గరమూలములకాంతి కడలెత్తి యందంద
        కేయూరదీప్తులఁ గీలుకొనఁగఁ
గేయూరదీప్తులు గిఱికొని నెరసుతోఁ
        గంకణద్యుతిమీఁదఁ గాలుద్రవ్వఁ
గంకణద్యుతి సోయగముమీఱఁ బలుమాఱు
        రత్నాంగుళీయకప్రభలఁ జెనకఁ


తే.

దనదు మెఱుఁగారుకెంగేలుఁదమ్ము లెత్తి
ప్రాణవిభుమౌళిపైఁ దలఁబ్రాలు వోయు
సపుడు, కాంతకు మైపుల్క లంకురించి
కోరకితమల్లికావల్లి కొమరుదాల్చె.

182


ఆ.

ఇరువురందు నప్పు డెక్కువ తక్కువ
యింత లేక, కూర్మి యెఱుకపడియె
సహజరీతిఁ బుష్పశరుఁడు త్రాసునఁ దూఁచి
ప్రియముతోడఁ బంచిపెట్టినట్టు.

189


క.

ఆలో, నాలోలేక్షణ
కేలం దనకేలుఁదమ్మి గిలించి, మహీ
పాలశిఖామణి లీలా
ఖేలగతి వివాహవేదికిం జనుదెంచెన్.

184


వ.

చనుదెంచి హోమకార్యం బనుసంధించి.

185


క.

సూరిజనసస్యసమితి న
పారముగా సాహసాంకపర్జన్యుఁడు, సొం
పారఁగఁ గంధాబంధుర
ధారాళకరాళకనకధారలఁ దనిపెన్.

186

ఉ.

అంత, శకాంతకుండును దిగంతనృపాలకులున్ సమస్తసా
మంతులు భట్టియాది యగుమంత్రిజనంబు, విదర్భధారణీ
కాంతుఁడు దోడితేరఁ జని, గారవ మొప్పఁగ భుక్తిమండపా
భ్యంతరవీథిఁ దత్తదుచితాసనపంక్తి సుఖోపవిష్టులై.

187


సీ.

మించుకన్నులు గోరగించు రాజాన్నంబు
        నుపమింపరాని సద్యోఘృతంబు
నమృతోపమానంబులగు పిండివంటలు
        నుజ్జ్వలంబై యొప్పు నొలుపుఁ బప్పు
మది కింపుఁబెంచు కమ్మనిపదార్థంబులు
        బహుపాకరుచులైన పాయసములు
దగువాసనావాసితములైన పచ్చళ్లు
        వడియఁగట్టిన యానవాలపెరుఁగు


తే.

సరసమధురరసావళిసముదయములు
పంచసారసమంచితపానకములుఁ
గమ్మకస్తురినెత్తావిఁ గైవుచేసి
యూరుఁగాయలుఁ జల్లనియుదకములును.

188


వ.

మఱియుఁ బచనరచనారంజితంబులగు బహువిధమాంసవ్యంజనంబులును, రసికరసనాతపఃఫలంబులగు పరిపక్వఫలంబులును, యువతికరనిర్మథితంబు
లగు మథితంబులు నుపయోగించి, రంభోరూకరాంభోజశాతకుంభసంభరితంబులును సుగంధబంధురంబులునగు జలంబులం గృతాచమనులై, విదర్భేశ్వరుండు ప్రియపూర్వకంబుగా నొసంగుతాంబూలాంబరమణిభూషణాదిసత్కారంబులు గైకొని, వివాహోత్సవస్తుతికథాముఖరులై, దిగంతరాగతు లగుమహీపతులను మఱియునుం దగువారును బాంధవులును దమతమదేశంబులకుం జనిరి. తదనంతరంబ.

189


మ.

జవసత్త్వప్రభవ ప్రభావభరితాజానేయవాహంబులన్
శ్రవణోత్సారితచంచరీకమదచంచద్వారణవ్రాతమున్

నవరత్నాభరణవ్రజంబు నయనానందారవిందాక్షులన్
నవశస్త్రావళులన్, వధూవరులకున్ వైదర్భుఁ డిచ్చెం దగన్.

190


క.

చుట్టములసురభి వీవని
భట్టికిఁ, దగఁ బ్రియము చెప్పి, పంకజనయనా
పట్టాంశుకమణిభూషా
రట్టజహయగంధసింధురంబుల నొసఁగెన్.

191


క.

ఆసమయమునఁ గుమారిం
గైసేసి, తదీయజననిఁ గాన్పించి, చకో
రీసుదతి సుప్రయాణ
శ్రీసూచన చేసి, ప్రణతి సేయించుటయున్.

192


తే.

తల్లిపాదంబులకు మ్రొక్కి తలిరుఁబోఁడి
యశ్రుపూరంబు ఱెప్పల నప్పళింపఁ
గలికికన్నులు మకరందజలము గ్రమ్ము
కమ్మతమ్ములతమ్ములై కరము మెఱసె.

193


వ.

అత్తెఱం గెఱింగి, యమ్మహాదేవి యక్కుమారీరత్నంబు నక్కునం జేర్చి, చెక్కుటద్దంబులు పుణుకుచు నిట్లనియె.

194


సీ.

ఏరాజు నుజ్జయినీరాజ్యపదమున
        నంబికాదేవి పట్టంబు గట్టె
నేరాజు తనసభ కేతెంచిన విరించి
        యచ్చెరువంది బ్రహ్మాస్త్ర మిచ్చె
నేరాజు నాట్యవిద్యారసజ్ఞత మెచ్చి
        భద్రాసనం బిచ్చె బలవిరోధి
యేరాజునకుఁ గల్లె నీశ్వరవరగర్వ
        యుతుని సిద్ధపురీశు నోర్చుకడిమి


తే.

యట్టిరాజు పట్టపుదేవివైన నీవు
సకలరాజన్యకాంతలు చరణయుగముఁ

గొలువఁ గొలువుండుదువు గాక, కోమలాంగి
నీకు నేలమ్మ కన్నుల నీరునింప.

195


క.

పతికనుసన్నల మెలఁగుము
పతిహితు లగువారి నెఱిఁగి పాటింపు, మదిం
బతి దైవముగాఁ దలఁపుము
పతియ సుమీ యేడుగడయు భామామణికిన్.

196


వ.

అని బోధించి పునఃపువరాలింగనంబు చేసి, తదీయనర్మసఖియగు చకోరికం జూచి యిట్లనియె.

197


సీ.

పతియును నేనును బార్వతీపతిచేత
        వరముగా గొంటి మీవాలుఁగంటి
నర్కతేజుఁడు విక్రమార్కక్షమానాథుఁ
        డల్లుఁ డయ్యెడిభాగ్య మబ్బె మాకు
రమణునితోడ దూరముగాఁగ నేగుచో
        బొలఁతికి నీయట్టిబోటి గలిగె
నేమిటఁ జూచిన నీయింతి తొలుమేన
        సుకృతంబు సేయుట ప్రకటమయ్యె


తే.

వింక నిటమీఁదఁ దగుబుద్ధి యెఱుఁగఁజెప్పి
విభునిచిత్తముపార్జించువెరవు గఱపి
పొడయు నీడయుఁ బోలె వీడ్వడక మెలఁగి
యబలకంటికి ఱెప్పవై యరయవమ్మ.

198


వ.

అని యప్పగించి యనుపుటయుఁ, జకోరికాప్రముఖసఖీసహస్రంబు గొలువ నాందోళికారూఢయై, చనుదెంచినప్రియాంగనం గనుంగొని సంతుష్టాంతరంగుండై సాహసాంకమహీనాథుండు.

199


చ.

వినయముతో విదర్భపతి వీడ్కొని, దేవియుఁ దాను రత్నకాం
చనరథ మెక్కి, వందిజనసంస్తుతి మాగధగానమంజుల

ధ్వనులను హృద్యవాద్యనినదంబును దిక్కులు పిక్కటిల్లఁగాఁ
జనియె, రమాసమేతుఁ డగుసారసనేత్రుని శ్రేణి సేయుచున్.

200


విక్రమార్కుఁడు భార్యతో నిజపురిఁ బ్రవేశించుట

వ.

అటమున్న సర్వసన్నాహసమేతుండై వెడలి భట్టియుం జనుదేర విదర్భానగరంబు నిర్గమించి, పయనంబున యోగదండప్రకాండకల్పితానల్పపురనిరూపణంబుల, దివ్యపాత్రికావిచిత్రాన్నపానసంతర్పణంబులఁ, గంధానుసంధీయమాన నావానిష్కవిరచితద్రవ్యంబుల నాత్మనిర్విశేషంబుగా నశేషసైనికులకుం బరితోషం బొనరించుచుఁ జని, నిజాగమనోత్సవాలంకృతంబైన యుజ్జయినీపురంబుం బ్రవేశించునప్పుడు.

201


క.

అన్నరపతిచంద్రుని, నొక
కన్నియ మణిసౌధజాలకంబునఁ జూడం,
గన్నులవలఁ గన్నులతో
నున్న ట్లున్మీలనయనయుగయై యొప్పెన్.

202


సీ.

నెరసుఁజూపులతోన నెయ్యంబు కూర్మికి
        నెరపైన తియ్యంబు నిగుడుచుండ
విరులగాదిలియైన వేణీభరముతోన
        కేలిమై గనయంబు కీలుసడల
హృదయంబులోపల నెసఁగుకోర్కులతోన
        మేదీఁగెఁ బులకలు మెండుకొనఁగ
విలసితలీలారవిందముతోడన
        చెలిమూఁపుఁ గీల్కొన్నచేయి సడల


తే.

మఱపు వేడ్కయు మదిలోన మచ్చరింప
చెమరుఁ గలపంబు గ్రొమ్మేన జిగిఁ దనర్ప
నింపుఁ దమకంబు మనములో నినుమడింప
రమణియొక్కతె వసుమతీరమణుఁ జూచె.

203


చ.

నెఱవుగ వన్నెవెట్టి,రమణీమణి పయ్యెద సంతరింపఁగా
మఱచి, నరేంద్రుఁ జూడఁగ నమందగతిం జనుదేర, హార మ

య్యిఱిచనుముక్కులం దగిలి యెంతయు నొప్పె, రథాంగదంపతుల్
తెఱఁ గొదవంగఁ బట్టి తరితీపులఁ బెట్టు మృణాళమో! యనన్.

204


చ.

మలయజకర్దమం బలఁది మౌక్తికభూషణభూషితాంగియై
పొలఁతుక యోర్తు రాచిలుకబోద కరాగ్రమునంద యుండ, భూ
తలపతిదర్శనంబునకుఁ దత్పరతం జనుదెంచి నిల్చె, ను
జ్జ్వలరుచితో నృపాలునకు శారద సన్నిధి చేసెనో! యనన్.

205


ఆ.

రాజవరునిఁ జూచురాజబింబాస్యల
లికి మెఱుఁగుఁజూపుగములు పర్వి
కలువతోరణములు గట్టినవిధమున
నప్పురంపువీథు లొప్పుమిగిలె.

206


చ.

సమధికచంద్రికాధవళసౌధసమున్నతచంద్రశాలలం
బ్రమదము మీఱ నిల్చి, పురభామలు సేసలు చల్లుక్రొత్తము
త్తెములు దనర్చె, నమ్మదవతీమనుజేంద్రులమీఁద వేలుపుం
గొమిరెలు కల్పభూజనవకోరకముల్ గురియించిరో! యనన్.

207


వ.

ఇవ్విధంబున సర్వజననయనపర్వంబులగు నపూర్వవిలాసవైభవంబులు మెఱయం జని రాజమందిరంబు ప్రవేశించి, రథావతరణంబు సేసి యనంగవతీమహాదేవిని సఖీజనసమేతంబుగా నంతఃపురంబున కరుగ నియమించి, యాస్థానమండపంబున మణివిచిత్రద్వాత్రింశత్సాలభంజికాభవ్యంబైన దివ్యసింహాసనంబున నాసీనుండై యున్న యవసరంబున.

208


సీ.

కాంచనమణిముద్రికాప్రభాజాలంబు
        పసిఁడిపళ్ళెరములమిసిమిఁ జెనకఁ
గలికిక్రేఁగన్నులఁ గ్రమ్ముక్రొమ్మెఱుఁగులు
        వరదీపకళికల వన్నెవెట్టఁ
గమ్మపువ్వులతావి కర్పూరవర్తికా
        సౌరభంబులతోడ సరసమాడఁ

గంకణంబులఝణత్కారంబు తోరమై
        యాశీర్నినాదంబు నాదరింపఁ


తే.

దరళతాటంకమౌక్తికోదారకాంతి
గండదర్పణదీప్తుల గారవింప
రాజముఖులు గావించి రారాజమణికి
రచితరుచి చక్రవాళనీరాజనములు.

209


వ.

తదనంతరంబ.

210


తే.

సౌమతేయాదిసామంతసముదయంబు
నాత్మసదనంబులకు నేఁగ నానతిచ్చి
యంతపురమున కేఁగి, ధరాధినాథుఁ
ఢుచితలీలానురక్తుఁడై యుండునంత.

211


చ.

అరవిరిదమ్మిఁ దేనియక్రియ న్మది రాగరసంబు గాఢమై
పరఁగ, విహారసౌధమణిబద్దగవాక్షము చేరి, వేడ్కఁ బ్రొ
ద్దరయు విదర్భరాజతనయం గరుణించినభంగి దోఁపఁగాఁ
జరమదిశామహీధరముచాటున కేఁగె దినేంద్రుఁ డత్తఱిన్.

212


తే.

కణఁక నన్యోన్యసంభోగకాంక్ష నున్న
సాహసాంకవిదర్భరాజన్యసుతల
హృదయరాగంబు పుంజమై యెసఁగె ననఁగ
నుదయరాగంబుతోఁ జంద్రుఁ డుల్లసిల్లె.

213


శా.

తత్కాలోచితకృత్యముల్ నడపి, రత్నస్నిగ్ధభూషావలీ
సత్కాంతిప్రకరంబు రాగరససాక్షాద్భావముల్ పూనఁగా,
నుత్కంఠైకసఖీసహాయుఁ డయి, రాజోత్తంసుఁ డుండెన్ సము
ద్యత్కేళీసదనాంతకాంతబహుశిల్పాకల్పతల్పంబునన్.

214


క.

అంతఁ జకోరిక మొదలగు
కాంతలు వైదర్భతనయఁ గై సేసి, మహీ

కాంతుం డున్నవిహారగృ
హాంతరమున కెలమిఁ దెచ్చునాసమయమునన్.

215


చ.

పదములఁ దొట్రుపా టొదవఁ బ్రాణసఖీజనభాషణంబులన్
మరిఁ దమకంబు లజ్జయును మచ్చరికింప, వణంకుమేనితో
మదవతి మందమందగతి మార్ధవ మొప్పఁగ వచ్చెఁ బైపయిం
బొదలుచు నున్నరాగరసపూరముతో నెదిరించుకైవడిన్.

216


వ.

వచ్చి విహారగేహగేహళీప్రదేశంబున నిలిచి.

217


క.

లోపలికి నరుగ నులుకుచుఁ
భైపై మిథ్యారహస్యభాషలఁ గాల
క్షేపము సేయుచుఁ, జెలితోఁ
ద్రోపాడుచుచుండె సబల తోరపులజ్జన్.

218


సీ.

కలువఱేకుల మీఱు కలికికన్నులకాంతి
        మేల్కట్టుముత్యాల మెఱుఁగు వెట్ట
నిండుఁజందురు నేలు నెమ్మొగంబు బెడంగు
        నిలువుటద్దమునకుఁ జెలువు నొసఁగ
నరుణాబ్దముల మించు నడుగుల నునుఁజాయ
        నెలకట్టుకెంపులనిగ్గుఁ జెనకఁ
గారుమెఱుంగులఁ గైకొను తనుదీప్తి
        కనకకుడ్యప్రభ గారవింప


తే.

సారఘనసారధూపాదిసౌరభంబు
లలఁతియూర్పుల నెత్తావి నతిశయిల్ల
మందిరాభ్యంతరము సొచ్చె మ్రానుదేఱి
భీతమృగనేత్ర ప్రియసఖీప్రేరణమున.

219


చ.

వలభుజముం గపోలమును వంచి మలంచిన మోము లజ్జయున్
లలితకటాక్షముం బ్రియవిలాసముఁ జిత్తముఁ జిత్తజాతుఁడుం

దలఁపులుఁ గోర్కులున్ బెరయఁ దద్దయు నొప్పె విహారశయ్యపై
విలసితలీల బాల బొటవ్రేల నిలాతలమున్ లిఖించుచున్.

220


చ.

అతులితభావగర్భితములైన మృదూక్తులచేతఁ గేలికిం
బుతపుత వోవుచున్ననృపపుంగవుచిత్త మెఱింగి, నిర్గమో
ర్గతమతి యైననెచ్చెలికిఁ గన్నుల మ్రొక్కులతాంగిభావ మూ
ర్జితరతిరాజరాజ్యపదసీమకుఁ బట్టముగట్టె భూవిభున్.

221


వ.

తత్సఖీనిర్గమనానంతరంబున.

222


సీ.

మేలంపుమాటల మెచ్చులు పచరించి
        తోరంపుసిగ్గును దొలఁగఁ దోలి
పరమసౌఖ్యాయత్తపరిరంభణంబున
        దనువల్లిఁ బులకలుదళము కొలిపి
పారవశ్యదములై పరఁగు చిట్టంటులఁ
        జనవున గనయంబు సడలఁజేసి
క్రొత్తలయందెల్లఁ గ్రొత్తలై పరఁగెడు
        కామతంత్రంబుల గరిమ గఱపి


తే.

బాలికామణి సుఖవార్ధి నోలలార్చి
కాముసామ్రాజ్యలక్మికిఁ గర్త్రిఁ జేసెఁ
బ్రసవశరశాస్త్రమతకళాపారగుండు
సాహసాంకమహీపాలచక్రవర్తి.

223


చ.

చిలివిలిపోవుకోరికలు చిత్తములం దల లెత్తి, దేహముల్
పులకల నీనఁగాఁ దమకముల్ నిగుడన్, సుఖపారవశ్యతం
దలఁపుల కందగింపఁ, బ్రమదంబునఁ బట్టినచోటు లెల్లనుం
గళలకు నిక్కలై మెఱయఁగా, రతిసల్పిరి వేడ్క దంపతుల్.

224


క.

సురతావసానలీలా
పరిరంభము మీఁద రతికిఁ బ్రారంభముగాఁ

దరుణియు వరుఁడు రమించిరి
కర మరుదుగఁ జతురశీతికరణప్రౌఢిన్.

225


సీ.

తొంగలిఱెప్పలతుదలు గైవ్రాలినఁ
        గొసరుఁజూపులయందు మిసిమి దోఁపఁ
దారహారముల నర్తనఁ గళాసించినఁ
        గుచకుంభములు మీఁదఁ గొంతనిక్కఁ
గుంతలంబులత్రుళ్లగింతలు సడలినఁ
        గెమ్మోవిచుంబనక్రీడ కెలయ
మణికాంచివలయంబు మౌనంబు గైకొన్న
        నురునితంబము కేళి కుత్సహింపఁ


తే.

జెమటచిత్తడి మైపూఁత దెమలి చనిన
నెమ్మనంబునఁ దమకంబు నివ్వటిల్ల
నున్నజలజాక్షియొప్పు నృపోత్తమునకు
మదనపునరుద్భవవికారమంత్ర మయ్యె.

226


సీ.

సంపూర్ణపూర్ణిమాసాంద్రచంద్రాతప
        విలసితశశికాంతవేదికలను
మంజరీసంజాతమకరందనిష్యంద
        మాకందమాధవీమండపముల
శృంగారవనమహాశృంగారమణిశృంగ
        హాటక శైలశృంగాటకముల
సంపుల్లహల్లకసహవాసవాసనో
        జ్జ్వలదీర్ఘదీర్ఘికాసైకతముల


తే.

గగనగంగాతరంగిణిగంధవాహ
బంధురోదగ్రసౌధాగ్రభాగములను
నవనవోల్లాసరతికళానైపుణములఁ
బ్రతిదినంబు రమించిరి పతియు సతియు.

227

వ.

ఇత్తెఱంగున సాహసాంకమహీనాథుండు చిత్రానందంబుగ విదర్భరాజనందనం దగిలి కందర్పలీలావిలాసంబులం జతురుదధివలయవలయితమహామహీపరిపాలనఖేలనంబులం బ్రవర్తిల్లుచు మఱియును.

228


శా.

నారీచిత్తసరోమరాళ, నవనానాగంధసౌగంధ్యవి
స్తారోదారభుజాంతరాళ, ప్రతిభాసర్వజ్ఞ, సోమాబ్జవి
స్మేరాకార శరన్నిశాకరకరాశ్లేషప్రియంభావుక
స్ఫారక్షీరపయోధిలంఘనకళాజంఘాలకీర్తీశ్వరా!

229


క.

భూరిమణిహేమభూషా
పూరితకన్యాప్రదానపుణ్యచరిత్రా
పేరయనన్నయవరతన
యారత్నశ్రీమదక్కమాంబాపుత్త్రా!

230


బంధురవృత్తము.

విలసితబహుధనవితరణకరుణా, విశ్రుతవీరగుణాభరణా
జలకుహనవదళసలలితచరణా, సత్కవిసన్నుతసంచరణా
కలుషవిమతధరఘనమదహరణా, కాంతినవీనసుధాకిరణా
జలనిధివలయితజగదుపకరణా, సారయశోధనతాభరణా!

231


గద్యము.

ఇది శ్రీమదఖిలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కననామధేయప్రణితంబైన విక్రమార్కచరిత్రం బను మహాప్రబంధమునందుఁ జతుర్థాశ్వాసము.

  1. పా.క. అన విని మనమున నలరుచు
    ననిమిషమునినాథుతోడ నతిగంభీర
    స్వనమునఁ బ్రియపూర్వకముగ
    వినయముతోడుతను మనుజవిభుఁ డిట్లనియెన్.

  2. ప్రతియయ్యునుం గాదు బహువిలాసములకు రమణిరూపముతోడ రత్నపుత్రి
  3. సమతనొందియు నొంద దమితశృంగారంబు గలయింతినాసతోఁ గాంచనంబు
  4. భేకజంపతీకలకలనాదముల్. వావిళ్ళ. 1926.
  5. సొరకాయ
  6. ఱవిక
  7. రథ్యనితానములును. అని వా. 1925.