వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/సుప్రసిద్ధుల జీవిత విశేషాలు
సుప్రసిద్ధుల జీవిత విశేషాలు (1994)- జానమద్ది హనుమచ్ఛాస్త్రి
"శ్రీ హనుమచ్ఛాస్త్రి ఎంతో శ్రమపడి విషయ సేకరణ చేసుకున్నాడు. ఆయన ఏ పనిచేసినా ఓర్పుతో సర్వ విషయ సేకరణ చేసేది ఆయన ప్రత్యేకత. 'ఏదో చేస్తిలే 'అనే ఆత్మవంచన చేసుకోడు తాను వ్రాసే విషయంపై ఎంతో సానుభూతితో గుణదోష వివేచనను మరువని వివేకంతో కలం కదిలిస్తాడు." అని డా. పుట్టపర్తి నారాయణాచార్య గారిచే ప్రశంసింపబడ్డ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి రచనలలో ఒకటి సుప్రసిద్ధుల జీవిత విశేషాలు.
దీనిలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన సి.పి బ్రౌన్ మరియు ఇతర విదేశీయులు, స్వాతంత్ర్యోద్యమంలో నాయకత్వం వహించిన ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, బాలగంగాధర తిలక్ లాంటి తెలుగు మరియు తెలుగేతర నాయకులు , సాహిత్య సేవ చేసిన జాషువా, కళా రంగానికి చెందిన బళ్లారి రాఘవ మరియు శాస్త్ర సాంకేతిక రంగంలో పేరుగాంచిన సర్.సి.వి.రామన్ , మోక్షగుండం విశ్వేశ్వరయ్య, యల్లాప్రగడ సుబ్బారావు మరియు స్త్రీ నాయకులలో దుర్గాబాయి లాంటి జీవితచరిత్రలను సంక్షిప్తంగా చూడవచ్చు. వీరిలో చాలామందితో రచయిత కు గల ప్రత్యక్ష అనుభవాలను చేర్చారు కాబట్టి అలనాటి మహామనుషులు వ్యక్తిత్వాలు చదువరులు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.
ఈ పుస్తకంలో వ్యాసాలు తొలిగా ఎన్.శివరామరెడ్డి గారి సంపాదకత్వంలో వెలువడిన రైతులోకం మాసపత్రికలో ధారావాహికగా ప్రచురించబడ్డాయి. ఆ తరువాత విశాలాంధ్ర ద్వారా పుస్తకం రూపంలో 1994లో ప్రచురించడ్డాయి.