వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/కన్యాశుల్కము

కన్యాశుల్కము (1961) - గురజాడ అప్పారావు

Download this featured text as an EPUB file. Download this featured text as a RTF file. Download this featured text as a PDF. Download this featured text as a Mobi. పుస్తకం దింపుకోండి!

పుస్తక ముఖచిత్రం

కన్యాశుల్కం తెలుగు జీవనాన్నీ, వాతావరణాన్నీ,మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించిన మొదటి సాంఘిక నాటకం. 19వ శతాబ్దపు చివరి దశకంలో హేయమైన మానవ నైజాలూ, జీవచ్ఛవాల్లాంటి బాలవితంతువులూ, సారామత్తులో ఉండే బైరాగులూ, దొంగ సాక్షులూ, వేశ్యలూ, లాయర్లూ, … నాటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని గురజాడ ఫొటో తీసి మన ముందుంచాడు. ఈ నాటక కథలో ఎక్కువ భాగపు సంఘటనా స్థలాలు విజయనగరానికి చేరువగా ఉన్న అగ్రహారాలు. నాటకం అప్పటి సామాజిక స్థితిగతులకు దర్పణంగా నిలచింది.


వెంకటేశం: మీవల్ల నాకు ఒచ్చిందల్లా చుట్ట కాల్చడం వొక్కటే. పాఠం చెప్పమంటే యెప్పుడూ కబుర్లు చెప్పడవేఁ కాని, ఒక మారయినా ఒక ముక్క చెప్పిన పాపాన్ని పోయినారూ?

గిరీశం: డామిట్‌. ఇలాటి మాటలంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్‌ ఇన్గ్రాటిట్యూడ్‌ , నాతో మాట్లాడ్డవేఁ ఒక ఎడ్యుకేషన్‌ . ఆ మాట కొస్తే నీకున్న లాంగ్వేజీ నీ మాష్టరుకుందీ? విడో మారియేజి విషయవై, నాచ్చి కొశ్చన్‌ విషయమై నీకు యెన్ని లెక్చర్లు యిచ్చాను! నా దగ్గర చదువుకున్నవాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కణ్‌ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెణ్‌ కాజెస్‌ ఫర్ది డిజెనరేషన్‌ ఆఫ్‌ ఇండియాను గూర్చి మూడు ఘంటలు ఒక్క బిగిని లెక్చరిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయి పోయినారు. మొన్న బెంగాళీవాడు ఈ వూళ్ళో లెక్చరిచ్చినప్పుడు ఒకడికైనా నోరు పెగిలిందీ? మనవాళ్ళు వుట్టి వెధవాయలోయ్‌ , చుట్ట నేర్పినందుకు థాంక్‌ చెయక, తప్పు పట్టుతున్నావ్‌ ? చుట్టకాల్చడం యొక్క మజా నీకు యింకా బోధపడక పోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్ట కాల్చబట్టే కదా దొర్లింత గొప్పవాళ్ళయినారు. చుట్ట కాల్చని యింగ్లీషు వాణ్ణి చూశావూ? చుట్ట పంపిణీ మీదనే స్టీము యంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా? శాస్త్రకారుడు యేవఁన్నాడో చెప్పానే.

సూత ఉవాచ: ఖగపతి యమృతముతేగా। భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్‌। పొగచెట్టై జన్మించెను। పొగతాగనివాడు దున్నపోతై బుట్టునూ ॥

ఇది బృహన్నారదీయం నాలుగో ఆశ్వాసంలో వున్నది. అది అలావుణ్ణీగాని నీ అంత తెలివైన కుర్రవాణ్ణి ఫెయిల్‌ చేసినందుకు నీ మాష్టరు మీద నావళ్ళు మహా మండుతోంది. ఈ మాటు వంటరిగా చూసి వక తడాఖా తీస్తాను. నువ్వు శలవుల్లో యిక్కడుంటావా, వూరికి వెళతావా?