వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము
ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము -చిలుకూరి వీరభద్రరావు
ఆంధ్ర దేశచరిత్రమును దెలిసిగొనుటకు బూర్వము "ఆంధ్రదేశ" మననెట్టిదియో, దానిలెల్ల లెవ్వియో, విస్తీర్ణమెంతయో, అందలి జనుల వేషభాషామతంబులెట్టిదో, ఎట్టి నాగరికతవహించి యుండిరో, గొంచెముగానైన దెలిసికొనుట యావశ్యకము. హిందూదేశము యొక్క మధ్యప్రదేశము నలంకరించి యుండిన వింధ్యపర్వతమునకు పైభాగ మార్యావర్తము లేక ఉత్తర హిందూస్థానమనియి క్రింది భాగము ధక్షిణాపథములేక దక్షిణ హిందూస్థానమనియు వ్యవహరింపబడుచున్నవి. భరతఖండమునందలి దక్షిణాపథ దేశములలో నాంధ్రదేశము సుప్రసిద్దమయినదిగ నున్నది. (ఆంధ +రస్ =ఆంధ= దృష్టువఘాతే యనిధాతువు)మనుష్యులు వసియింప శక్యముకాని యంధకారము కలది యగుటచే నొత్తరాహులీదేశము నాంధ్రదేశమని వాడుచువచ్చిరని కొందరు పండితులు చెప్పుచున్నారు. ఆంధ్రులు నివసించుచుండు దేశముగాన దీనికి నాంధ్రదేశమని పేరుగలిగినదని మరికొందరు పండితులు తలంచుచున్నారు. ప్రాచీనకాలమునందు నాగరికులు వసియింప శక్యముకాని యంధకారబంధురమయిన మహారణ్యమధ్యమునందు మొదట వీరు నివసించియుండిన వారగుటజేసి యౌత్తరా హులయిన యార్యులు వీరిదేశము నాంధ్రదేశమనియు, వీరి నాంధ్రులనియు బిలిచిరని చెప్పుమాట యుక్తియుక్తమయినదిగానే యుండును.