భారతేతిహాస పరిశోధక మండలి, పూనా, వారు ప్రకటించిన ‘గోల్కొండ్యాచీ కుతుబ్ శాహీ’, మెకంజీదొర వారి స్థానిక చరిత్రలనుండి, ‘హదికత్ -ఉల్-అలామ్’ అనుగ్రంథములను ఆధారంగా చేసుకొని గోలకొండ రాజు తానీషా దగ్గర మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నల చరిత్ర ను విపులంగా వ్రాసిన ఈ గ్రంథానికి 1951 సం. తెనుగుభాషాసమితివారి బహుమతి లభించింది.
“
గోలకొండ గొప్పపర్వతదుర్గము. కొండకు క్రింద మొదటి దర్వాజాకడనుండు తిన్నెలకడ దాదాఁపు తొంబది లేక వంద యడుగుల యెత్తు గోడలవిూఁద గండభేరుండపక్షులు చిత్రితములై యున్నవి. నేఁడును యాత్రికులు చూడవచ్చును. దర్వాజాకు ఆనుకొనియుండు తిన్నెలపై కూర్చుండి మాటలాడిన యెడల ఆశబ్దము పైకిపోయి కొన్నినిముసములు ప్రతిధ్వనించుచుండును. సింహద్వారము దాఁటగానే కొండ యడివారము మొదట మఱియొక దర్వాజా కలదు. దానికి ముందు పెద్దమంటపము; అందు కిటికీలులేవు గాని లోన వెలుతురు కలదు. అటనుండి మెట్లెక్కి పోవలయును. ఆకొండ యంతయు దుర్గాకృతిని రహస్యగృహముల చేతను వానికి వలసిన నీటి సదుపాయముల చేతను అమర్పఁబడి నేటికిని చూపరుల కాశ్చర్యము కలిగించుచున్నది. ఏచోటినుండి ఏ చోటికి పోవుటకు ఎచ్చటెచ్చట రహస్యమార్గము కలదో కొలఁది రక్షకులకు మాత్రమే తెలియును. నాలుగైదు అంతస్థులు దాఁటిన యనంతరము తానీషామందిరము కొండ నెత్తమున నున్నది.