వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సాహిత్య విమర్శ/నా ఎఱుక
నా ఎఱుక పీఠిక 1 “నా యెఱుక” సర్వతోముఖ ప్రతిభా విజ్ఞాన ప్రపూర్ణులు, సంగీత సాహిత్య రత్నాకరులు, “హరికథాకర్త్మ కాలక్షేప పితామహ” బిరుదాంకితులు, ప్రసాదిత హరిదాసజన జీవనులు, ప్రముఖాంధ్ర మహాపురుషులు, కారణజన్ములు, చిరస్మరణీయులు అయిన శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారి స్వీయచరిత్ర. ఆధునికాంధ్రసాహిత్య యుగకర్తలుగా పేరెన్నికగన్న శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు, సి.వై. చింతామణి ప్రభృతులైన మిత్రప్రముఖుల ప్రోత్సాహముతో ఆత్మకథారచనమునకు పూనుకొంటిననియు, 'తెలుగు భాషలో స్వీయచరిత్ర రచనకిది ప్రథమ ప్రయత్న' మనియు తమ గ్రంథావతారికలో చెప్పియున్నారు. దీనినిబట్టి స్వీయచరిత్ర రచనాభగీరథులు కందుకూరి వారనిపించును. “తెలుగులో స్వీయచరిత్రలు లేవనియు, అట్టివానిని తాము వ్రాయవలయుననియు దాసుగారికి తోచెను. అంతట తన చరిత్రము ముప్పది యేండ్లవరకు దాసుగారు వ్రాసిరి. ఇంతలో వీరేశలింగం పంతులుగారి స్వీయచరిత్ర ప్రథమభాగము బయల్వెడలెను. దాసుగారు తాము వ్రాయుచుండిన స్వీయచరిత్రము నాపివేసిరి" - అని శ్రీ నారాయణదాసు జీవితచరిత్రకారులు (పే. 237) తెలిపినారు. శ్రీ వీరేశలింగంగారి స్వీయచరిత్ర ప్రథమభాగము 1903లో చింతామణీ ముద్రణా లయమున ముద్రణనొంది ప్రకటితమైనది. దీనినిబట్టి ప్రకటన దృష్ట్యా శ్రీ కందుకూరి వారి స్వీయచరిత్రకు ప్రాథమ్యమున్నను, రచనదృష్ట్యా శ్రీ ఆదిభట్లవారి “ఆత్మపరిచయమే" (నా యెఱుక' తెలుగున పుట్టిన తొలి స్వీయచరిత్ర అనవలసియున్నది. ఆదిభట్లవారే ఆత్మకథాభగీరథులు వారి 'నా యెఱుక'యే ప్రథమాంధ్ర స్వీయచరిత్ర రచన. ఆదిభట్ల నారాయణదాసుగారు పార్వతీపురమున కెనిమిది మైళ్ళ దూరముననున్న సువర్ణముఖీ నదీతీరమందలిఅజ్జాడ గ్రామములో రక్తాక్షి శ్రావణ శుద్ధ 446 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 చతుర్దశి బుధవారము నాడు (31-8-1864) అవతరించిరి. కారణజన్ములైన వీరు బాల్యమాదిగ శక్రధనువువలె శబలిత కాంతులతో శోభిల్లిన సహస్రమాస జీవితమును గడిపి, సర్వప్రయోజనములను సాధించి 2-1-1945లో నిర్యాణమొందిరి. పూర్ణపురుషాయుష జీవులైన ఈ మహనీయుల తొలి ముప్పది సంవత్సరముల జీవిత చరిత్ర (1864–1897) 'నా యెఱుక' అను స్వీయచరిత్రకు కథావస్తువు. 1903లో శ్రీ వీరేశలింగం పంతులు స్వీయచరిత్ర ప్రకటితమగుటకును, శ్రీ దాసుగారు తమ స్వీయచరిత్రను ఆపివేయుటకును గల సంబంధము అతర్కితోపనతము; కేవలము కాకతాళీయము. తెనుగున స్వీయచరిత్రలు లేని లోపమును తీర్చుటకై 'నా యెఱుక' ను రచింపనుద్యమించిన శ్రీ దాసుగారు, శ్రీ వీరేశలింగం పంతులుగారి ఆత్మకథాప్రకటనతో ఆ లోపము తీరినది గదాయని భావించి, తమ స్వీయచరిత్రను ఆపివేసిరనుట అంగీకరింపదగినది కాదు. శ్రీ కందుకూరివారి స్వీయచరిత్ర రచనారామణీయకమున గాని, సత్యార్థ ప్రకటనా వైశిష్ట్యమున గాని తమరచన కంటే మిన్నగ సాగినదనుటచే వెఱచి ఆపివేసి రనుట అపచారము. శ్రీ దాసుగారు మొదటినుండియు 'నా యెఱుక' లో తమ ముప్పది సంవత్సరముల జీవితమునే నిక్షేపించ నుద్దేశించినారు. తొలుత ప్రకటితమైన శ్రీ కందుకూరి వారి స్వీయచరిత్ర శ్రీ దాసుగారిని పునరాలోచనకు పురికొల్పి, తమ మొదటి ఉద్దేశమును దృఢతర మొనర్చుటకు తోడ్పడియుండును. "ముప్పదియేండ్ల జీవితకథతోనే తమ స్వీయచరిత్ర నేల ఆపివేసి?” రని ప్రశ్నించినపుడు, శ్రీ నారాయణదాసుగారు ఇట్లు చమత్కారముగ సమాధాన మిచ్చిరట! “ఎవ్వని చరిత్రమైనను ముప్పదియేండ్ల వఱకే లోకమెఱుగవలయును. ఆ పైని అనవసరము. ముప్పది యేండ్ల వరకే సుగుణముండును. ఆ పైన పేరాసయు, అసంతుష్టియు పెచ్చు రేగిపోవును. దైవత్వము నశించును. దేవతల నందుకే త్రిదశు లన్నారు. ముప్పదియేండ్లు దాటిన మీదట నందరు రాక్షసులే!" ఇందు శ్రీ దాసుగారు వెల్లడించిన అభిప్రాయములలోని సత్యాసత్యము లెట్లున్నను, స్వీయచరిత్రకు వారు మొదటినుండియు ఉద్దేశించిన వస్తువు తమ ముప్పదియేండ్లు జీవితకథ మాత్రమే అని ప్రస్ఫుటమగు చున్నది. 'ముప్పదియేండ్లు దాటిన మీదట అందఱు రాక్షసులే' అన్న శ్రీ దాసుగారి భావము ప్రముఖాంగ్ల సాహితీవేత్తలలో నొకడును, విశిష్టభావుకుడు, చమత్కారచతురుడైన జార్జి బెర్నార్డు సాహిత్య విమర్శ 447 షా వెలిబుచ్చిన "Every gentleman over forty is a scoundrel" అన్న ఛలోక్తిని స్మృతికి తెచ్చుచున్నది. 'నా ఎఱుక'ను శ్రీ దాసుగారు తమ ముప్పదియేండ్ల జీవితకథతోనే ముగించుట యందలి సామంజస్యమును మరొకరీతిగ భావింపవచ్చును. గురుముఖతః విద్యలార్జించువారు, ఆ గురువర్యులిచ్చు ప్రోత్సాహదోహదములతో విజృంభించి ఇంట గెలిచిన పిమ్మట రచ్చ గెలుచుచు జీవిత విజయపరంపరలను చేకూర్చుకొందురు. 'స్వశక్తితో విద్యలార్జించువారు, పరంపరాగతములైన ప్రోత్సాహదోహదములు సహజముగ సంప్రాప్తింపనందున వ్యతిక్రమమార్గమున స్వైర వీరవిహారము లొనర్చి తొలుత రచ్చగెలిచి తదుపరి ఇంట గెలిచి విజయపరంపరలను చేకొందురు. శ్రీ దాసుగారు రెండవకోవకు చెందిన ప్రతిభావంతులు. విద్వాంసులందలి స్పర్ధసంశయములు హేతువులుగా స్వస్థానమునందేర్పడిన వ్యతిరేకతలవలన వీరికి ఆరంభదశలోనే ఆత్మప్రభువులైన ఆనందగజపతుల ఆదరగౌరవములు లభించలేదు. అందుచే వీరు ప్రథమమున మైసూరు పర్యంతము పరస్థానములందు విద్యాజైత్ర యాత్రలొనర్చి, దిగ్విజయ గౌరవధన్యులై కీర్తిప్రతిష్ఠలతో తిరిగివచ్చి, విజయనగర ప్రభువుల ఆహ్వానసత్కారములందుకొనిరి. ఇట్లు "సర్వత్ర పూజ్యత" "స్వస్థల విజయ పరితృప్తి" లభించిన దశ శ్రీ దాసుగారి ముప్పదియేండ్ల వయసుతో ముగిసినది. శిష్యశిక్షార్థము ప్రదర్శింపవలసిన సమస్త ముఖ్యలక్షణములుగల వారి ప్రౌఢవ్యక్తిత్వము ఈ వయసునకు పూర్ణముగ రూపొందినది. లోకమునకు మార్గదర్శకములుగ వెల్లడింపదగిన జీవితానుభవములన్నియు వారి కీ కాలమునకే చేకూరినవి. ఈ సమస్త విశేషమును 'నా యెఱుక' రచనకు పూనుకొనుటకు ముందే సింహావలోకనమొనర్చి యుండుటవలననే, శ్రీ దాసుగారు తమ స్వీయచరిత్రకు ముప్పది సంవత్సరముల జీవితకథనే వస్తువుగా పరిమితమొనర్చి స్వీకరించియుందురు. శ్రీ దాసుగారి ముప్పదియేండ్ల జీవిత చరిత్రను వెల్లడించుటకు అనేకహేతువులు దృష్ట్యా వారే యోగ్యులు. అది స్వీయచరిత్ర రూపమున ప్రదర్శితమగుటయే సముచితము, పరమ ప్రయోజనకరము. శ్రీ దాసుగారు తరువాత గడిపిన ఏబది సంవత్సరముల జీవితము ఎంతగ రసవంతము, పండిత పామరజన సమ్మోహకరము, లోకజ్ఞతాప్రదర్శకము నైనదైనను, క్షుణ్ణమార్గమున మందాకినీ మహనీయతతో కొనసాగినది. కావున దానిని వారే చెప్పపని లేదు. భావికాల జీవితచరిత్రకారునకు, లోకమునకు విడిచిపెట్టవచ్చును. ఉచితజ్ఞులైన దాసుగారట్లే యొనర్చిరి. శిష్యులెన్నడైన ఆ ఏబది సంవత్సరముల జీవిత విశేషములనుగూర్చి ప్రశ్నించినపుడు, వారు "అందుకు లోకమే ప్రమాణమని దాని 448 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 రచన లోకమునకే విడిచిపుచ్చితిని” అని సమాధానమిచ్చినట్లును వినికిడి. “స్వయముగ చెప్పవలసిన అగత్యమున్నంతటి తన జీవిత కథను మాత్రమే స్వీయ చరిత్రకారుడు వస్తువుగా స్వీకరింపవలయును. అన్యమైన జీవితకథను ప్రదర్శించుపని జీవిత చరిత్రకారునిది” ఇది అనుభవజ్ఞులైన శ్రీ దాసుగారు సాహిత్యోపాసకుల కిచ్చిన అమలిన సందేశము. జీవిత చరిత్రను ప్రదర్శించు విషయమున ఇట్టి పరిణత దృష్టి గల శ్రీ దాసుగారి స్వీయచరిత్ర 'నా యెఱుక.’ - 2 'నా యెఱుక' స్వీయచరిత్ర అను సాహిత్య ప్రక్రియకు చెందిన కృతివిశేషము. వైషయికముగ స్వీయచరిత్ర, జీవితచరిత్ర ఒకేజాతిలోనివి. ఇవి ఆత్మకర్తృకమును, అన్యకర్తృకములై యుండుటయే ముఖ్యవిభేదము. శిల్ప విషయమున రెంటియందును వైధర్మ్యములకంటె సాధర్మ్యములే విశేషము. రెంటికిని మహాపురుష జీవితముపై నుదయించు ప్రణయగౌరవములే ప్రధానోద్బోధకములు. స్థూలదృష్టికి రెండును జీవిత చరిత్రలు. ఈ ఇరుతెగల కృతులు చెప్పినవారును జీవితచరిత్రకారులు. "ఉదాత్త జీవనుల జన్మమువలె ఉత్తమజీవిత చరిత్రకారులు జన్మమును అరుదు” “జాన్సను లెందఱో ఉండవచ్చును; బాస్వెలు లెన్నడో గాని ఉదయింపరు" - ఆంగ్ల భాషలోని ఈ జిజ్ఞాసాత్మక వాక్యము జీవిత చరిత్రకు అర్హులైన వ్యక్తుల ఆధిక్యమును, ఉత్తమ జీవిత చరిత్రకారుల అతిశయమును, వేనోళ్ళ చాటుచున్నది. జీవిత చరిత్రకారునకు మహాపురుష జీవితమునకు సంబంధించిన సత్యాంశకథనము ముఖ్యలక్ష్యము. కావ్య నాటకాది ప్రక్రియలను చేపట్టిన వారివలె నితఁడు విషయకల్పనలకు ఆసక్తి వహింపరాదు. సత్యప్రియులైన పాఠకలోకమును తృప్తిపరచి గౌరవానురాగములను చూరగొనుటకై ఇతడు గుణదోషములను రెంటిని యథాతథముగా ప్రదర్శింపవలయును. సౌందర్యోపేతముగ సత్యాంశకథన మొనర్చిన గాని ఇతని కృతి సాహిత్యసృష్టి కాఁజాలదు. సత్యసౌందర్యములు రెంటిని సమన్వయించుకొన్న జీవిత చరిత్రల విషయముననే “Biography is a literary work of art rivalling sculpture itself" అన్న విమర్శక వాక్యార్ధము చెల్లదగియున్నది. ఇట్టి సత్య సౌందర్య సమన్వయమును సంపాదింపని యెడ జీవిత చరిత్ర కేవల చరిత్ర రచన అనియో, కేవల సౌందర్య సృష్టి అనియో అనిపించుకొనును. ఉత్తమ జీవిత చరిత్రకారుడు మహాపురుష జీవితమునకు సంబంధించిన సత్యాంశములతో సాహిత్య విమర్శ 449 వినిర్మితమైన పంజరాకృతి నాధారముగ గ్రహించి, కళాకుశలుడై, నిత్యసౌందర్య పరిశోభితమైన జీవితప్రతిమను గండరింపవలయు నన్నమాట! జీవిత చరిత్ర ఇంతటి బృహద్భారనిర్వహణముతో గూడినదియు, క్లేశకరము, శ్రమసాధ్యమునైన దగుటవల్లనే అసిధారానృత్యమగుచున్నది. జీవిత చరిత్రలను గూర్చి యొనర్చిన ఈ జిజ్ఞాస స్వీయచరిత్రలకును అన్వయించుట సత్యము. అత్యంత ప్రాచీన కాలముననే పాశ్చాత్య దేశములకు ప్రాచీన గ్రీకు రోమను జీవిత చరిత్రల నిబద్ధమొనర్చి యిచ్చిన గ్రీకు జీవితచరిత్ర కారుడుగు ప్లూటార్క్ మహాశయుడు (క్రీ.శ. 64-120) జీవిత చరిత్రకారులు పాటింపవలసిన ప్రధాన సూత్రములనెల్ల నిర్దేశించి యిచ్చినాడు. కాని అవి అతనితోనే విస్మృతములైనవి. జీవిత చరిత్ర రచన మరల మధ్యయుగమునందు పుణ్యపురుష జీవిత ప్రశస్తులతో (Panegyrics of Saints) పునః ప్రారంభమైనది. అయినను 19వ శతాబ్దిలోని మహారచయితలైన జాన్సన్, బాస్వెల్, సథీ, కార్లయిల్, ప్రౌధే, మెకాలే, అబట్ల తీవ్రకృషి వలన గాని జీవిత చరిత్రకు ఒక సాహిత్యశాఖగా నెలవుకొను అవకాశము లభింపలేదు. ఈ రచయితలు తమ పాత్రల గుణములను మాత్రమే స్వీకరించి రచన సాగించుటవలన వీరు వ్రాసిన జీవిత చరిత్రలు వీర పూజను ప్రోత్సహించునవైనవి. ఈ జాతి జీవిత చరిత్రలకు కార్లయిల్ మహాశయుని “హీరో అండ్ హీరో వర్షిప్" చక్కని ఉదాహరణము. వీరి పాత్రలు భయగౌరవములను పొందగలిగిన దేవతాప్రతిమలైనవేగాని, సమకాలీన సహజీవనులైన ప్రజల అభిమానానురాగములను పొందలేకపోయినవి. ఇట్టి స్థితినుండి 20 వ శతాబ్దమున పాశ్చాత్య జీవిత చరిత్రను సముద్ధరించి, పునరుజ్జీవమును కల్పించి, బహుముఖీన వైభవవికాసములను ప్రసాదించిన ఉత్తమ రచయితలు ఎ.జి. గార్డ్నర్, లిట్టన్ స్ట్రాచీ, ఎమిల్ లుడ్విగ్, ఆండ్రూమారా ప్రభృతులు. జీవిత చరిత్రల మూలమున విషయబోధన మొనర్చుటకంటే, చిత్తాహ్లాదమును చేకూర్చుటయే (delight than teach) ముఖ్యాశయముగా 'ప్రాఫెట్స్, ప్రీస్ట్స్ అండ్ కింగ్స్' (1908), 'పిల్లర్స్ ఆఫ్ సొసైటీ' వంటి ఉత్తమ జీవిత చరిత్రలను రచించి ఎ.జి. గార్డ్నర్ ఆంగ్ల దేశమున నూతన శకారంభ మొనర్చినాడు. లాయడ్ జార్జి మొదలు చార్లీ చాప్లిన్ వఱకుగల అపూర్వ వ్యక్తులను ఇతడు భయసంకోచములు లేక యథార్థరూపములలో దర్శించి, ఆయా పాత్రలను మానవాతీతులనుగా కాక సమకాలీన సామాజికులనుగా ప్రదర్శించినాడు. 450 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 లిట్టన్ స్ట్రాచీ 1918లో “ఎమినెంట్ విక్టోరియన్స్” రచనతో ఆధునిక జీవిత చరిత్రకు స్వయం సంపూర్ణత నొసగి సకల ప్రపంచసాహిత్యకుల దృష్టి నాకర్షించినాడు. ఇతడు పూర్వులవలె పాండిత్య ప్రదర్శనకై అసంఖ్యాకముగ పాత్రల జీవితాంశములను సేకరించి వెల్లడించుటయెడ మిక్కిలి మక్కువను ప్రదర్శింపలేదు. పాత్రల అంతరిక వ్యక్తిత్వమును తేజోవంతముగ బహిర్గత మొనర్పగల అల్ఫాంశములతోనే ఇతడు వ్యక్తిత్వోన్మీలన మొనర్చినాడు. సమకాలీన ప్రజలచే మానవాతీతులుగ పరిగణితులు, పూజితులునైన విక్టోరియా నాటి స్త్రీ పురుషశ్రేష్ఠులం దీతడు, సామాన్యులలో కన్పట్టు దోషములను సహితము దర్శించి వెల్లడించుటకు వెనుదీయలేదు. ఖారటూంవీరుని మద్యపాన వ్యసనిగను, కార్డినల్ మానింగును సదా భావవైక్లబ్యునిగను రూపొందించుట ఇందుకు నిదర్శనము. ఇతడు చిత్రించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రజానీకము ఊహాతూలికలలో మనోభిత్తికల పై తీర్చిదిద్దుకొన్న అశ్వినీదేవతలను బోలిన అమరకాంత కాదు; ధైర్యసాహసములతో ప్రబల ప్రభుత్వమును ప్రతిఘటించి, "సైనిక వైద్యసేవ" (Army Medical Service) యందున్న దోషములను తొలగించుటకై పోరాడి విజయమును చేకొన్న వీరనారి. స్ట్రాచీ పాత్ర లెల్లరు బలదౌర్బల్య గుణదోషయుతులైన మానవులే కాని అందీయందని ఛాయామూర్తులు గాని, దిగమగొల్పు తేజోమూర్తులు గాని కారు. స్వీయచరిత్ర రచనయందు నూతనశకారంభ మొనర్చిన ఈతని తరువాతి కృతియైన “క్వీన్ విక్టోరియా" యందును ఇతడు విక్టోరియా రాజ్ఞిని, ఆమె భర్తను, మెల్బోర్న్ ప్రభువు వంటి అగ్రవర్గముల వారినైనను ప్రదర్శించుటకు పూనుకొనలేదు. ఇతడు స్త్రీజననైజ దోషములైన ఆత్మప్రామాణ్యము, ప్రగల్భత, కార్యశ్యములతో విక్టోరియా రాణిని, అట్లే ఇతరదోషములతో ఆమె భర్తను, మెల్బోర్న్ ప్రభువును ప్రదర్శించినను ఈ పాత్రలు గాని, లోపయుతములుగ ప్రదర్శితములైన ఇతని ఇతర పాత్రలు గాని శోభారహితములని భావింపరాదు. ఇతని పాత్రలన్నియు పటిష్ఠములై పాఠకుల దృష్టి నాశ్చర్యకరముగ నాకర్షింప జాలియున్నవి. విచిత్రమైన ఒక విడంబన ధోరణి లేదా అవక్షేపధోరణి (Mocking strain) లిట్టన్ (స్ట్రాచీ రచనారీతికి జీవాతువు. ఇతనినుండి ఉద్బోధమునొందిన ఆధునిక జీవిత చరిత్రకారులలో మటొక "క్వీన్ విక్టోరియా” చెప్పిన ఎడిత్ సిట్వెల్, శ్లాఘనీయముగ "అక్బరు"ను రచించి యిచ్చిన లారెన్స్ బినియన్, "పామెర్షన్" కృతితో ఘనవిజయమును గైకొన్న ఫిలిప్ గొయొడెల్లా ప్రముఖులు. ఎమిల్ లుడ్విగ్ అను జర్మను జీవిత చరిత్రకారుడు, మహాపురుష వ్యక్తిత్వమును అసాధారణ భావనాశక్తితో ఒడుచుకొని, కవితోద్వేగము, అతీంద్రియతలను ఊతగా సాహిత్య విమర్శ 451 జీవితచరిత్ర రచన యొనర్చినాడు. పాత్రలను గూర్చిన ఊహాచిత్రములతో బయలుదేరి, పురావస్తుశాలలందు అనుగుణమైన సాధన సామగ్రి నెన్నుకొని లుడ్విగ్ బిస్కార్క్ గెథీ, ది సన్ ఆఫ్ మాస్, త్రి టిటన్స్, క్లియోపాత్రా మొదలైన జీవిత చరిత్రలను చెప్పి పిదప "విలియం II" "నెపోలియన్" లను రచించినాడు. జీవితాంశముల బాహుళ్యమువలనను, సర్వాంశములకు నెత్తిచూపిన అసంఖ్యాక నిరూపణములవలనను మొదటి రచనలందు పాత్రోన్మీలనమును కొంతగ మరుగుపరచినట్లు కన్పించినను, ఇతడు "విలియం II" నెపోలియన్'లలో విషయ విస్తృతిని, ప్రామాణ్య ప్రదర్శనములపై ప్రీతిని విసర్జించి సముజ్జ్వలముగ పాత్రలను చిత్రించుటలో సిద్దహస్తతను సంపాదించినాడు. విశ్వవిఖ్యాతి నార్జించి యిచ్చిన “నెపోలియన్" (1925) ఎమిల్ లుడ్విగ్ జీవిత చరిత్ర రచనయందు ప్రత్యేకముగ సాధించిన చిత్త చిహ్నాత్మకము, ఆలేఖ్య ప్రాయమునగు కథాకథన స్వభావము (Impressionistic and Pictorial Nature of Narration), సముజ్జ్వలముగ ద్యోతకమగు చున్నది. ఆబట్ రచించిన 'నెపోలియన్' కంటే నితని 'నెపోలియన్' జీవిత చరిత్ర వేయిమడుగుల విశిష్టరచనగా కీర్తికెక్కినది. బైరన్, షెల్లీ మహాకవుల జీవిత చరిత్రలు కథావస్తువులుగా “బోరన్', 'ఏరియల్' అన్న అనితర సాధ్యకృతులను జెప్పి, ఆధునిక జీవిత చరిత్రకు అత్యధిక ప్రజానురాగమును చేకూర్చిన ఫ్రెంచి రచయిత ఆండ్రూ మారా. పాత్రను గూర్చిన నిశితదర్శనము గలవాడగుటవలన నితడు 'బోరన్' లో బైరను చిత్రమును సత్యసమ్మతముగను, చిత్తాకర్షకముగను ప్రదర్శించినాడు. షెల్లీ మహాకవి జీవిత చరిత్రను చెప్పునపుడు 'ఏరియల్' లో ఆండ్రూ మారా పూర్వరచనారీతిని పరిహరించి, సముజ్జ్వలమైన నూతన రచనాశిల్పము ననుసరించినాడు. ఇందు ఈతడు నిరూపించిన మార్గమును విమర్శకలోకము 'అఖ్యాయికాప్రాయ జీవిత చరిత్ర' (Fictional Biography) అని వ్యవహరించినారు. 'నా యెఱుక' శ్రీ నారాయణదాసుగారు స్వయముగ చెప్పుకొనిన జీవిత చరిత్ర. ఉత్తమ కథకులై అశేష జనానీకము నానందాబ్దిలో నోలలాడించిన శ్రీ ఆదిభట్ల వారి జీవిత చరిత్రలో ఉత్తమ జీవిత చరిత్రలందు కన్పట్టు సమస్త లక్షణములును సమన్వయము నొందినవి. 'నా యెఱుక' సత్యసౌందర్యముల సమ్మేళనమని సర్వత్ర నిరూపించుకొనినది. 1903కు పూర్వమే పుట్టినను 'నా యెఱుక'లో శ్రీ నారాయణ దాసుగారు రూపొందించుకొన్న వారి వ్యక్తిత్వము ఆధునిక జీవిత చరిత్రకారులు ప్రీతి పడినదియును, జనానురాగ గౌరవములను చూరగొన జాలినదియునైన గుణదోష మిశ్రమగు మానవమూర్తియే కాని, పూర్ణ సద్గుణ పుంజమై వీరపూజను ప్రోత్సహించు 452 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 దేవతామూర్తి కాదు. ఆధునిక జీవిత చరిత్రకారులకు అన్ని విషయములందును అగ్రగామియు, మార్గదర్శకుండునైన లిట్టన్ స్ట్రాచీ రచనామర్మములన్నియు, నాతనికి రెండు దశాబ్దులకు పూర్వమే తమ జీవిత చరిత్రను చెప్పుకొనిన శ్రీ దాసుగారి 'నా యెఱుక'లో కన్పట్టుట వారి ప్రజ్ఞాపాటవమునకు, సహజ సాహితీశిల్పనైపుణికి ప్రబల సాక్ష్యములు. తుదకు స్ట్రాచీ అనుసరించిన విడంబన ధోరణి (Mocking strain) సహితము 'నా యెఱుక' యందు తావు చేసికొనినది. శ్రీ దాసుగారు అక్కడక్కడ తమ్ముగూర్చి చెప్పుకొనువరకే ఈ అవక్షేపధోరణిని పరిమిత మొనర్చుకొనుటలో ఔచిత్యమును పాటించిరనుట సత్యము. పాత్రోన్మీలన వేళలందు కొన్నియెడల లుడ్విగ్ విధానము 'నా యెఱుక' లో కన్నట్టుట ఆశ్చర్యకరమైన అంశము. జీవిత కథనమునందు 'నా యెఱుక' అనేక రసవర్ఘట్టములలో అఖ్యాయికాప్రాయముగ సాగి, ఆండ్రూ మారా రచనలను తలపింపజేయుచు, ఇట్టి రచనాసౌందర్య విశేషమును 20వ శతాబ్ది ప్రారంభమునకు పూర్వమే దర్శించి ప్రదర్శించిన శ్రీ నారాయణదాసుగారికి కైమోడ్పు లర్పింప జేయుచున్నది. పరికించినకొలది శ్రీ నారాయణదాసుగారి 'నా యెఱుక’ యందు జీవితచరిత్ర రచనకు సంబంధించిన సర్వశిల్ప విశేషములును ఏదో ఒక తావున దర్శనమిచ్చి తీరుననుట అతిశయోక్తి కాజాలదు. 3 మహాపురుషుల సారవజ్జీవిత వైవిధ్యము, సాధించిన ఘనకార్యవైశిష్ట్యము, ఆదర్శప్రబోధములు, రసబాహుళ్య, రామణీయకతాది గుణవిశేషములు గౌరవానురాగములను కల్పించి జీవిత చరిత్ర రచనకు ప్రోత్సాహకము లగుచున్నవి. వివిధ జీవితరంగములలో పొందిన విశిష్ట విజయములను, స్వీయ గుణవర్తనలను, సాక్షీభూతులై భావించినపుడు ఉదార చరితులకు గలిగెడు స్వాభిమానము, స్వీయాదర్శాభివృద్ధి నాసించి ఒనర్పదలచిన శిష్యశిక్షణాసక్తి, పరులు అపార్థమొనర్చుకొని జీవిత చరిత్రలందెట తమ్ము సత్యేతర స్వరూపముతో ప్రదర్శించి ప్రయోజనావాప్తికి భంగపాటు కల్పింతురో అను భయసంశయాదులు స్వీయ కథారచనోద్బోధకములు, ఆత్మకథాజనన హేతువులు నగుచున్నవి. ఆత్మపరిచయ మొనర్చుటయం దాస్ఠ వహింపకుండుట భారతీయులకును, వారిలో అంతర్భాగమైన ఆంధ్రులకును నైజగుణము. "తన్ను గూర్చి వ్రాసికొనునపుడు ఈశ్వరముఖమును జూచి సత్యమునే చెప్పబూనినను, సమకాలమువారు ఆత్మస్తుతిగానో, పరనిందగనో చేకొని భావింపవచ్చు" నని స్వీయకథారచనమునకు మొన్న సాహిత్య విమర్శ 453 మొన్నటివరకు మనవారు చిత్తప్రవేశమును కల్పింపలేదు. అందుచే "పూర్వుల కంతగా రుచింపని” ఈ సాహిత్య ప్రక్రియాసృష్టికి భారతీయులకెట్లో ఆంధ్రులకు నట్లే పాశ్చాత్యులు మార్గదర్శకులు కావలసి వచ్చినది. పాత్ర సంశయములు కారణములుగా పాశ్చాత్యులందును సాహసికులైన ఏ స్వల్ప సంఖ్యాకులో తప్ప ఆత్మకథారచన నితరులాదరింపలేదు. అందువలన వారి దేశములోను జీవిత చరిత్రలవలె స్వీయచరిత్రలు పృథు సంఖ్యలో పుట్టలేదు. “I feel greatmen should tell the story of their lives., therefore I am telling mine" అన్నాడు మధ్యకాలమునాటి ఇటాలియను మహాశిల్పి సెలినీ. ఈ అభిప్రాయము స్థూలదృష్టికి అహంభావపూరితముగ తోచినను, ఒక చిరతరసత్యమును వెల్లడించుచున్నది. లోకోపకారబుద్ధితో చెప్పుకొన్న ఇతని స్వీయకథ శిల్పసాధకులకే కాక, సకల కళాజీవులకును దుర్గమ దేశములందు వెలుగుబాటలను జూపుచున్నది. తుదకు శృంగారశూరుడైన 'కాసనోవా' ఆత్మకథయును (Adventures of Casanova) మానవ మనస్తత్త్వమునకు మనోజ్ఞముకురమై చిత్తాహ్లాదనమును, జ్ఞానబోధనము నొనర్చుచున్నది. పాత్రలు స్వయముగ చెప్పికొనునవగుటచే ఇట్టి స్వీయ చరిత్రలు ఎట్టి శంకలకు తావీయక గాఢముగ విశ్వసింపబడుచు నధిక ప్రయోజనమును చేకూర్చుచున్నవి. 'నా యెఱుక' అనుపమములైన ఆత్మవిశ్వాస ప్రత్యయములు గల సర్వతోముఖ ప్రజ్ఞాశాలియగు శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారి ఆత్మ కథ. "లోకులచే నేనెఱింగినదియు, నాకు స్వయముగా తెలిసినదియు మదీయానుభూతి దెలుపగోరి యిద్దాని వివరించెద. బాల్యయౌవనదశలను గల యనుభవము నన్ను గూర్చియు, లోకము గూర్చియు నే దెలిసిన మట్టుకు వ్రాసెద" అని వారు స్వీయ చరిత్రను ఆరంభించినారు. ఈ వాక్యములను బట్టి వారు ఏ దృష్టితో స్వీయచరిత్ర రచనకు పూనుకొనునదియును, అందుకు వేనిని ప్రమాణములుగా గ్రహించినదియును తెలియుచున్నది. శ్రీ దాసుగారి అనుభూతిలో కొంత లోకులచే నెఱిగినదున్నది. ఇందధికభాగము బాల్యమునకు జెందినదై యుండును. వారు తమకు మూడేండ్ల వయసునుండియు కలిగిన జాగ్రత్స్వప్నానుభూతులలో మూడువంతులు జ్ఞప్తియందున్న వారు. స్వానుభూతి విజ్ఞానమును పరులనుండి విన్నదానితో సమన్వయ మొనర్చుకొని శ్రీ దాసుగారు ఆత్మ పరిచయ రచనమొనర్చిరన్నమాట! సంగీత సాహిత్య నాట్యావతారులైన శ్రీ నారాయణదాసుగారు ఆంధ్ర సరస్వతికి సమర్పించిన నవరత్నోపహారమిది. ఇది శ్రీ దాసుగారి అసాధారణ వ్యక్తిత్వ నికేతనమున 454 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 కెత్తిన రజతపతాక. నిత్యార్జిత కళాజీవనులైన వారు శిష్యకోటి యెడగల అనన్య వాత్సల్యాభిమానములతో అనుగ్రహించి యిచ్చిన జీవిత మార్గదర్శిక, వర్ధమాన కళాకారులకు సంశయభీరుతను (Decido Phobia) పోద్రోలి, భూరితరోపదేశము నీజాలిన గీతామహోపనిషత్తు, చిత్రవిచిత్రాను భవములకు శేవధి. లోకానుభవ విజ్ఞతలకు మణిమంజూష, రసవద్భావ భాషాసౌరభ్యములతో రసిక లోకమును రంజింపజేయు ప్రసవసముద్గుతము. 4 ఆంధ్ర సాహిత్యమునందు తొలి స్వీయచరిత్రగా ఉదయించినను “నా యెఱుక” స్వీయ కథాశిల్ప నైపుణ్యములనెల్ల పుణికిపుచ్చుకొనినది. ఇట్టి శిల్పశక్తి బహుభాషా కోవిదులైన శ్రీ దాసుగారికి పరభాషలలోని ఆత్మకథాగ్రంథములను పఠించుటవలన చేకూరిన శక్తి కాదు. స్వోపజ్ఞము. సరససాహిత్యకులు, శ్రోతల హృదయతంత్రులను మీటి ఉఱూతలూగింపగల ఉత్తమ కథకులునైన శ్రీ దాసుగారికి స్వీయచరిత్ర ప్రక్రియను ప్రత్యేకముగా నేర్వవలసిన పని యేమున్నది? “ఉద్రేక పూరితమైన మనస్సునందు ఉత్సాహవశమున దోచు వింత యూహలకు యథోచితమగు నక్షరసందర్భములను గూర్చుట రచన" అని శ్రీ దాసుగారు నిర్వచించినారు. "నా యెఱుక” ఈ నిర్వచనమునకు తగిన లక్ష్యమై సర్వరచనా రామణీయకములను సంతరించుకొని చక్కని ఆత్మకథగా అవతరించినది. “నా యెఱుక” యందు శ్రీ ఆదిభట్లవారు తమ జీవితమందలి సత్యకథాంశములను సౌందర్యపరిప్లుతములు గావించి ప్రదర్శించినారు. శ్రీ నారాయణదాసుగారిని స్వీయకథారచన కున్ముఖులను గావించిన ప్రబల హేతువులలో జనరంజకమైన వారి జీవితమునందలి రసరామణీయకత నంతర్ముఖులై గమనించుట యొకటి. స్వీయచరిత్రకు పూనుకొనిన పిమ్మట నీ సౌందర్యసంపాదనకై తమ జీవితమందలి ఏ ఘట్టముల నే దృష్టితో ప్రదర్శింపవలయునో శ్రీ దాసుగారు చక్కని సింహావలోకన మొనర్చి వాని నెన్నుకొన్నట్లు 'నా యెఱుక' సర్వత్ర సాక్ష్యమిచ్చుచున్నది. 'నా యెఱుక' యందు శ్రీ ఆదిభట్ల వారు ప్రస్తరించిన ఆత్మజీవిత సన్నివేశములన్నియు సౌందర్య సమునిషితములు. ఆత్మకథారచయిత తన జీవిత సన్నివేశములను చిత్రించునపుడు, దేనికదియే విలక్షణము, సుందరమునై యుండియు, పూర్ణకథలో నొదిగిపోవుచు దాని వైలక్షణ్య, సాహిత్య విమర్శ 455 రామణీయకములను పోషించునట్లు జాగరూకత వహింపవలయును. శ్రీ అజ్జాడవారు తమ జీవిత ఘట్టములను కథించునపుడు వానిని వ్యష్టిగాను, సమష్టిగను పోషించి, 'నా యెఱుక' యందు అంగాంగీభావ సంయోగమును సంపాదించి, సముచితమైన నిర్మాణ సౌందర్యమును (Structural Beauty) ప్రదర్శించినారు. కామేశముపంతులు ఔదార్యరసజ్ఞతలు, రామయ్య వీడ్కోలు, భీముడుగారి వేశ్యాశోధన, నరసన్న పేట వింత వేశ్య, బందరు అవధాన విశేషములు, గంగాధర రామారాయణింగారు చేసిన సన్మానము, మైసూరు జైత్రయాత్ర మొదలైన సన్నివేశములన్నియు నిందుకు సాక్ష్యములుగ నొప్పియున్న వనుట ఛిన్న సంశయము. ఎట్టి కథకైనను రామణీయకమును కల్పించు నంశములలో ప్రధానమైనది అందలి పాత్ర చిత్రణము. పాత్రలు సందర్భోచిత వేషభాషాచేష్టలతో సజీవమూర్తులై పాఠకుల మనోముకురములందు సుందరముగ ప్రతిబింబితములై రూఢికెక్క వలయును. శ్రీ నారాయణదాసుగారి 'నా యెఱుక' లోని పాత్రలు సిద్దహస్తుడైన కవి గండరించిన, అమృతపాత్రలవలె సహజోక్త సుందరములై నిజరూపములతో నిత్యత్వము నార్జించుకున్నవి. ఇందలి ప్రధానమైన పాత్రయైన శ్రీ దాసుగారు, సహగాయకుడు పేరన్న, జయంతి కామేశము, భీముడుగారివంటి మిత్రులు, మహీశూర మహారాజు, పిఠాపురము మహారాజు గంగాధర రామారాయణింగారు, విజయనగర ప్రభువు ఆనందగజపతి వంటి వదాన్య శేఖరులు, రసజ్ఞశేఖరులే కాక మాటతప్పిన వేశ్య, భీముడుగారి వేశ్య, నరసన్నపేట వేశ్య మొదలైన వారును, ప్రాసంగికముగ కథలో ప్రవేశించిన వైష్ణవ సంగీత సాహిత్య విద్వాంసులు విచిత్ర వివాహకర్త, మదరాసు ఆంధ్రభాషోపన్యాసకుడు, డిప్యూటీ కలెక్టరు, శ్రీ దాసుగారి లయజ్ఞానమును తప్పుబట్టిన వైణికుడు మొదలైన వాలెందరో “నా యెఱుక" లోని మరపునకు రాని పాత్రలు. 'నా యెఱుక'కు వింత సౌందర్యమును చేకూర్చిన విశేషములలో హృదయావర్జన మొనర్చుకొనగల వర్ణనసామర్థ్యమొకటి. "వర్ణనా నిపుణః కవిః" అని గదా! శ్రీ దాసుగారు సన్నివేశ చిత్రణమునందెంతటి సమర్థులో వర్ణనలందును నంతటి ప్రతిభావంతులు. శ్రీ దాసుగారి సన్నివేశములవలెనే, వర్ణనలును బహువిధ వైవిధ్యముతో నొప్పి వారి మేధానైశిత్యమును, విజ్ఞాన వివేకవిస్తృతులను, రసజ్ఞతారామణీయకతలను సర్వత్ర బహిర్గతము లొనర్చినవి. 'నా యెఱుక' లోని ప్రతి సన్నివేశమునందును నారాయణదాసుగారి వ్యక్తిత్వము కారణముగా నంతయో ఇంతయో వైచిత్రి ప్రవేశించినది. చిన్ననాడు రాజదుర్గయ్య పంతులు గారింట సాహసించి భర్తకై 456 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 వ్యంజనములు వడ్డించి ఉంచిన విస్తరిలో అన్నము పెట్టుకొని తిని, వారము సంపాదించుట, నిద్రపట్టక వేశ్య ఇంటికేగి "ఒంటరిగా పండుకొననిచ్చిన రెండు రూపాయలిత్తు" నని ఆమెను మోహపెట్టి పణ్యరహితముగ ననుభవించుట, భీముడుగారి వేశ్యాశోధన, విచిత్ర శివయోగిని వృత్తాంతము, వైష్ణవమిత్రునియింట పెద్ద గురుసేవ, హోటల్ కీపరుతో జట్టీ తెచ్చుకొనుట మొదలైనవి శ్రీ దాసుగారి స్వీయకథలోని విచిత్ర సన్నివేశములు ఎంతయు రమణీయములు. ఋతుపరిజ్ఞానము, బాల్యదశ, బరంపురము కోర్టు, పరీక్షలు, పడవ ప్రయాణము, వేశ్యల పరిచర్య, రాజమండ్రి టౌను హాలు, మదరాసు నేటివ్ క్లబ్, లాల్ బాగ్ పుష్ప ప్రదర్శనము, కార్తీక వనసమారాధనము మొదలైన మనోహర వర్ణనలు శ్రీ దాసుగారిని మహాకవికోటిలో చేర్పజాలినవై, “Style is the man” అను న్యూమన్ సిద్దాంతమునకు చక్కని సాక్ష్యములై యొప్పుచున్నవి. వీరి వర్ణనలు సౌందర్యపరిజ్ఞానపుంజములై నిరంతరమును "The poet's eye in a fine frenzy rolling...” అన్న షేక్స్పియర్ కవిచంద్రుని సుప్రసిద్ధ వాక్యమును జ్ఞప్తి యొనర్చుచున్నవి. ఏ దృక్కోణమునుండి పరికించినను 'నా యెఱుక' సౌందర్య సము పేతము. 55 5 శ్రీ దాసుగారు దృఢసత్త్వులు, సత్యనిరతులు, అతిపవిత్రులు, అనూచానులు జనించిన అమలిన వంశమున అవతరించిన ఆముష్యయణులు. సహజశేముషీ పాండిత్య ధురంధరులు. రూపతేజో బలసంపన్నులై 'సింహసంహననమూర్తి' తో విరాజిల్లిన విశిష్టవ్యక్తులు, విద్యకుదగ్గ రూపవిభవముగల అదృష్టవంతులనియు, భక్తిని ప్రేరేపించు నవ్యక్తశక్తి యుక్తులనియు జనప్రశస్తి నందుకొన్న మహనీయులు. పూవు పుట్టగనే పరిమళించు నన్నట్లు శ్రీ దాసుగారిని విశిష్టవ్యక్తులుగ రూపొందించిన గుణవిశేషములన్నియును వారియందు చిన్ననాడే కుదురుకొన్నవి. స్వశక్తిపై గాఢవిశ్వాసము, స్వయంకృషి, సాహసము, సత్యప్రియత్వము, స్వేచ్ఛా జీవనాసక్తి, యథాలాభ సంతుష్టి, కలహప్రకృతి, జయేచ్ఛ, అకారణ మిత్రత్వ శత్రుత్వములు, నిశిత పరిశీలనదృష్టి మొదలైనవి శ్రీ దాసుగారికి నైజగుణములు. వీరు బాల్యముననే ఆకలిని గూడ మరచి ఆత్మారాములై విహరించుచు మానవులందు తప్ప మిగిలిన చరాచర ప్రాణి విశేషములందన్నిటను దేవతామహిమను దర్శించిరి; మానవుల నెంతటి వారినైన నిర్లక్ష్యముగ జూచుట వీరి కా తొలిదశయందే అలవడినది. కవియై, జిజ్ఞాసువై, విచిత్ర సంకల్పమూర్తియై, తల్లిదండ్రులపై నైనను మమత్వమును సాహిత్య విమర్శ 457 వీడి, జీవన్ముక్తుని వలె మధురోహలతో వీరు బాల్యమున ఊహాలోక విహరణమొనర్చిరి. ఏదియో గొప్పపని చేయవలయునను సంకల్పము, చేయగలనను విశ్వాసము శ్రీ దాసుగారికి చిన్ననాడే అబ్బినవి. సహవాసదోషమువలన యౌవనారంభవేళనుండి శ్రీ దాసుగారికి స్త్రీ, 'గురు' సేవన వ్యసనము లలవడినవి. అపురూపరూపము, శృంగార పురుష వేషము, బహిరంగ కామవ్యాపారము లిందుకు తోడైనవి. దేవదత్తములైన ప్రజ్ఞాపాండిత్య బలములతో గౌరవమునకు భంగమురాని రీతిగ వారెంత ప్రవర్తించినను, నడవడి విమర్శకు లోనగుచు వచ్చినది. అసమాన పాండిత్యము గురుజనరాహిత్యము, బ్రాహ్మణకర్మపై నాస్థ, యజ్ఞకలాప వైముఖ్యము, హరికథాప్రవిష్ణుత - విలాసవేషము, రాజాదరణవలననే గాని ఘనముగ రాణింపని విద్యలు - స్వచ్ఛంద ప్రియత్వము - లోకాధారజీవనము వెఱపులేని బహిరంగ వ్యక్తి విమర్శ, సహజ సౌజన్యము - నైజకలహశీలము ఇట్టి అసంబద్ధతలు (incongruities) కొట్టవచ్చినట్లు కన్నట్టుటవలననే, శ్రీ దాసుగారికి వీడ్కోలిచ్చువేళ కంటతడివెట్టు కామేశము పంతులు కారణమడుగగా “సూరన్నా! లోకమెట నిన్నపార్ధ మొనర్చుకొని అగౌరవించునోయని చింతించుచున్నా' ననవలసి వచ్చినది. యౌవనదశలో కొంతకాలము తఱుచుగ గురుసేవలో నుండుటచే నొదవిన అలక్ష్యబుద్ధితో, కథలొనర్చువేళ పిన్న పెద్దలనక అభిప్రాయములు చెప్పి తట్టాబాజీలు తెచ్చుకొనుట, యథేష్ట వేషభాషలతో అహంకరించి తిరుగుట శ్రీ దాసుగారికి లక్షణములైనవి. ఈ సందర్భములందు వీరు తమపని చెడుటనైన గమనింపరు. వీరు ఆత్మదోషములను సైతమల్లే ప్రకటించి విమర్శించుకొనిన వారు. ఉత్తమ మిత్రులైన వీరు హృదయమిచ్చి పుచ్చుకొన నేర్చినవారు. మిత్రవియోగము బాధ పెట్టినపుడు నైజముగ నిశ్చింతగలవారగుటచే హాయిగ నుండగలవారు. తమ్ము ఘనముగ నాదరించిన కామేశముపంతులు, భీముడుగారి వంటి గాఢమిత్రులకే కాక కృతజ్ఞతాబుద్ధితో శ్రీ దాసుగారు విద్యార్థిదశయందలి మిత్రులకును, చంద్రశేఖరశాస్త్రి వంటి గురువులకును స్వీయచరిత్రయందు స్థానమును కల్పించి, చిరంజీవత్వమును ప్రసాదించుట శ్రీ దాసుగారి ఔదార్యమునకు దొడ్డ నిదర్శనము. జీవితము దోషావిష్టము గావున పదునారేండ్ల వయసునకు మించిన, పూర్వపరిచితులవి తప్ప, మిగిలినవారి పేర్లను చెప్పనని నియమేర్పరచుకొని, పాటించుట శ్రీ దాసుగారి ఔచిత్యపాలనమునకు తార్కాణము. 458 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 ఇట్లే శ్రీ దాసుగారికి తమ మనసు కెక్కిన విద్వాంసులను, రసజ్ఞులను, ఉదారవదాన్యులను సముచితరీతి ప్రశంసించు టాచారము. ఉపమోత్ప్రేక్షాదులతో నొప్పు వీరి పొగడ్తలు ఎంతటి ఘనులకోకాని దక్కెడివి కావు. మహమ్మదీయగాయకుని గంధర్వులను మెప్పింపజాలిన మేటి గాయకుడని మెచ్చుకొనుటయు, పదిసవరుల బంగారు కంకణములను చేతనుంచి ప్రార్థించి పల్లవిపాట విన్న వైశ్యోత్తముని రసిక శేఖరుడనియు ప్రశంసించుటయు వీరి గుణగ్రహణ పారీణత కులమత విచక్షణల కతీతమైనదని అభివ్యక్త మొనర్చుచున్నది. ఆడంబరత్వ, దౌష్ట్యములను శ్రీ దాసుగారు సహింపలేరనుటకు బిల్వేశ్వరీయకర్తను 'అమృతప్రవాహముగ నుపన్యసింప జాలినవా'డని పొగడిన వీరు విచిత్ర వివాహకర్తను తెగడుటయు, వీరి రచనలను స్వీయ రచనలుగా రాజుగారి యెదుట ప్రకటించుకొన్న డిప్యూటీ కలెక్టరును 'నేను ద్రావిడుడను. నీ దౌష్ట్యమును అడిగినవారికి అడగనివారికి తప్ప నింకెవ్వరికిని చెప్ప' నని ఛలోక్తి సహితముగ ధైర్యముతో బెదరించుటలు నిందుకు తార్కాణములు. బహిరంగముగ ప్రకటించుకొనుట లోక మంగీకరింపని స్త్రీ లౌల్య 'గురు' సేవన వ్యసనములను సభలలో వెల్లడించుటయే కాక, కలకాలము నిలిచిపోవునట్లు తమ స్వీయచరిత్ర కెక్కించుట శ్రీ దాసుగారి సత్య ప్రియత్వమునకు నిస్తుల నిదర్శనము. లోభరహితులైన వీరికి యాచాదైన్యము లేదు. ఆత్మాభిమాన, దైవపరత్వములు గల శ్రీ దాసుగారిని తెలియక ఎంతటి వదాన్యులైన 'ఏమి కావలయునో కోరుకొ" మ్మనినపుడు వారికి 'పరమేశ్వర కటాక్షముకంటె కోరదగిన దేదియును లేదు' అని రేవారాణి పొందిన సమాధానమే వచ్చితీరును, విద్యాపరీక్షణ మొనర్చి, పిదప చిన్నచూపు చూచి, అల్పమిచ్చినచో యథాలాభసంతుష్టి జీవలక్షణముగా గలవారైనను శ్రీ దాసుగారు మోమోటపడక 'ఏదైన ఖర్చునకు వచ్చును మీరే ఉంచుకొను' డని తిరస్కరించుటకు వెనుదీసెడువారు కారు. శ్రీ దాసుగారికి స్వతంత్ర జీవనాసక్తి చిన్ననాడే జితించినది. శ్వవృత్తి సమస్త శక్తుల నాహరించి దైవదూరులను, స్వలాభపరులను గావించునను విశ్వాసము కాలము గడచిన కొలదీ శ్రీ దాసుగారికి ప్రగాఢమైనది. విద్యాపరీక్షణమొనర్చి పరమానందము నొందిన పిమ్మట మైసూరు మహారాజావారు "సర్వీసు చేసెదవా?" అని ప్రశ్నించినపుడు శ్రీ దాసుగారు, క్షణమైన యోజింపక, “నేను మర్త్యులను గొల్వను" అని సమాధానమిచ్చి, వారిని కోపఘూర్జితనేత్రులను గావించుట వారికే తగియున్నది. తుదకు తమ హరికథలలో నొక్కదానినైనను నరాంకితము గావింపలేదని శ్రీ దాసుగారు సాహిత్య విమర్శ 459 సగర్వముగ జెప్పికొనినారు. శ్వవృత్తి గైకొన్నవారు ఎంతటి విద్యావంతులైనను స్వార్థపరులై తమ ప్రభువైన ఆనందగజపతిని అపమార్గములనుండి తప్పించి, దేశశ్రేయస్కరములైన సత్కార్యములకు ప్రోత్సహింపరని వీరు ఆక్రోశించినారు. 'భోగరాయుడ' నని పలుమారు ప్రకటించుకొన్న శ్రీ దాసుగారు శృంగార శేఖరులు. భోగలాలసులైనను వీరు పరస్త్రీని మాతృవతుగా దర్శించినవారు. నైజధర్మాభిరతిగల వీరిదృష్టిలో మిత్రులు ఉంపుడు కత్తెలును వీరికి ఆశింపదగనివారు. ఆప్తమిత్రులైన భీముడుగారిని ద్వితీయ వివాహమునకు ఉద్బోధించువేళ, వారికి పరమ పతివ్రతయని తమ వేశ్యపై గల భ్రాంతిని తొలగించుటకై, వారి అభ్యర్థనను గైకొనిగాని శోధించుటకు బూనుకొనకపోవుట ఇందుకు తార్కాణము. భోగినీజన చిత్తవృత్తిని గూర్చి శ్రీ దాసుగారికి గల పరిజ్ఞాన మపారము. వారకాంతలవలన నెంతటి సౌఖ్య మనుభవించినను వీరు తార్తీయపురుషార్ధమును సర్వోత్తమముగా భావింపలేదు. ఇరువది యొకటవ సంవత్సరముతో స్త్రీ వ్యసనమును, ఇరువది యేడవ యేటితో గురుసేవా వ్యసనమును విసర్జించి వీరు నిర్మలులైనారు. వీరు స్త్రీ వ్యసనమునకు దమ్మిడీయైన వ్యయమొనర్పకపోవుట విశేషము. శ్రీ దాసుగారి సద్యఃస్ఫూర్తికి, సంభాషణచతురతకు 'నా యెఱుక' యందు నిదర్శనములు సర్వత్ర గోచరించుచున్నవి. తమ సమ్మోహనరూపమును కాదని శివయోగినివలె నటించిన నరసన్నపేట వేశ్య నాకర్షించుటకు జావళిని విసరి లొంగదీయుట వీరి సద్యఃస్ఫూర్తి చేష్టలకొక నిదర్శనము. భీముడుగారి వేశ్యాశోధనవేళ నామె హృదయ రహస్యమును నెల్వరించుటకు "నా కడ విద్యనార్జించు శిష్యురాండ్రను కన్నబిడ్డలుగా చూచెదను” అని పల్కి, ఆమెచేత "నేను మీ శిష్యురాలను కాలేను సుండీ" అనిపించుట, గంగాధర రామా రాయణింగారు పారితోషికమిచ్చుచు 'సంతుష్టియేనా? అసంతుష్ట ద్విజోనష్టః' అన్నపుడు “సంతుష్ట ఇవ పార్థివ" అని గిలిగింతలు పెట్టించునట్లు, ఇతరులకంటే పైన అనుటయను తమ నైజగుణమును వెల్లడించునట్లు పలికి, అధిక గౌరవమును పొందుట మొదలైనవి సంభాషణ నైపుణ్యమునకు చిన్ని సాక్ష్యములు. "ఏమి హరికథలు వెధవ హరికథ" లని ఒకరన్నప్పుడు "పంతులుగారికి సహవాసబలము కాబోలు నెల్లపుడు విధవాస్మరణ చేయుచుందు" రనుట వంటి ఛలోక్తులు, శ్రీ దాసుగారి ప్రతిపక్ష ముఖవిధాన సమయస్ఫూర్తికి ఒక నిదర్శనము. “నయగారములు, నక్కటక్కులు, పలుపిచ్చవిద్యలు నెన్నతో బెట్టినరీతి నేర్చిన జాణలుగు వేశ్యలను" కొలను విడిచి కొండను దిగివచ్చిన 460 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 కలహంసది తప్పుగాని కాకిది తప్పా!" అను రీతి మందహాస సుందరముగ పలికి లోగొని, దాసురాండ్ర గావించుకొను నేర్పునందు దాసుగారు కడుదక్షులు. వీరి సంభాషణయందలి పరిహాసచాతుర్యమునకు "శారద చంద్రికా!” యందు తప్పు పట్టిన శ్రేష్ఠిగారితో నొనర్చిన సంభాషణము నిదర్శనము. ఇట్టి సమయస్ఫూర్తి, సంభాషణ రాసిక్యములు శ్రీ దాసుగారికి విద్యాజైత్రయాత్రలందు ప్రముఖ సాధనములైనవి. శ్రీ దాసుగారికి అపూర్వ వ్యక్తిత్వమును ఆర్జించియిచ్చిన విశేషములలో ప్రథమగణ్యములైనవి విజ్ఞాన పాండిత్యములు. 'నా యెఱుక' యందు “అంబాశబ్దమే నిశ్చయముగ “ఓమ్' అని పరిణమించెను. అంబా శబ్ద వివర్తరూపమే సర్వజగత్ప్రకృతి” ఇత్యాదిగా ప్రదర్శించిన యోజన వారి విజ్ఞానగంభీరత కొక చిన్న తార్కాణము. వారి సంగీత సాహిత్య వైదుష్యములు సహజసిద్ధములు. సచేతనములు. సృజనాత్మకములు, బహుముఖీనములు, నవనవోన్మేషములు. బహువిధమైన అంతస్తులతో గూడిన జన జీవితములతో పరిచయము గల శ్రీ దాసుగారి లోకజ్ఞత అతివిపులము నిశితము, గభీరము, ఇట్టి ప్రతిభావ్యుత్పన్నతలతో వారు, లోకమే విశాల కళాశాలగా, తామొక విశిష్ట సంచార విశ్వవిద్యాలయమై విద్యాప్రదాన ప్రబోధము లొనర్చి ధన్యులైనారు. శ్రీ దాసుగారు ద్రష్టలు, స్రష్టలు, ఉపదేష్టలు. సంస్కృతాంధ్రాంగ్ల ఉర్దూ పార్శీ అరబ్బీ భాషాకోవిదులైన శ్రీ దాసుగారు, ఇంగ్లీషు తప్ప మిగిలిన భాషలనెల్ల స్వయంకృషితో నార్జించిరి. సంగీతము నందును వీరు గురుశుశ్రూష వలన సంపాదించిన దల్పము. కావుననే వారు “నా సంగీత సాహిత్యములు సహజసిద్ధము”లని నిస్సంకోచముగ ప్రకటించినారు. కుశాగ్రబుద్ధులైన శ్రీ దాసుగారికి పండిత పామర జనరంజనమునందు ఏకసంథాగ్రాహిత్వము ఎన్నియో రీతుల తోడ్పడినది. బాటసారి, ఉమర్ ఖయ్యాము వంటి కావ్యరచనలతోను, అనన్యసాధ్యమైన హరికథారచనలతోను అపూర్వ సాహిత్యస్రష్టలనిపించుకొనిన శ్రీ దాసుగారు, హరికథాకాలక్షేప వేళల ప్రహ్లాద నారద పరాశరాది మహాభక్త కోటిలోని వారన్న ప్రఖ్యాతిగడించినారు. ఔత్తరాహ, దాక్షిణాత్య సంగీత విద్వాంసులలో నెంతటివారినైన మెచ్చని శ్రీ దాసుగారు, పరమేశ్వరదత్తములైన శ్రుతిలయ త్రిస్థాయి గౌళగాత్రముతోను, అన్యు లంచులనైన అందుకొనజాలని లయజ్ఞానముతోను సంగీత సభలలో అనన్వయా లంకారమునకు ప్రథమలక్ష్యముగ విలసిల్లినారు. సంగీత సాహిత్యములకు సమప్రాధాన్య మిచ్చుచు వీరు కావించిన నానావిధములగు అష్టావధానములు అన్యులకు దుర్ఘటములు. 1. రెండు పాదముల రెండు తాళములు, రెండు చేతులు రెండు తాళములు వేసి పల్లవి పాడుచు కోరిన జాగాకు కోరిన ముక్తాయిలు సాహిత్య విమర్శ 461 వేయుట 2. ప్రాబ్లము మెంటల్గా సాల్వు చేయుట 3. నల్వురకు తెలుగున, నల్వురకు సంస్కృతమున కవిత్వము చెప్పుట. 4. వ్యస్తాక్షరి 5. న్యస్తాక్షరి 6. ఇంగ్లీషున కోరిన విషయముపై నుపన్యాసము 7. పూలు, గంటలు లెక్కించుట 8. ఛంద స్సంభాషణములతో గూడిన బందరు అష్టావధానము వంటి వానియందు శ్రీ దాసుగారు ప్రదర్శించిన ప్రజ్ఞకదియే సాటి. ఇవి అసాధ్యాష్టావధానములు. ఇట్టి విద్యా ప్రదర్శనములను తిలకించి పండిత ప్రకాండులు "ప్రపేదిరే ప్రాక్తన జన్మవిద్యా" అని ప్రశంసించుటలో ఆశ్చర్యమేమున్నది? శ్రీ నారాయణదాసుగారి స్వీయచరిత్రయైన “నా యెఱుక” వారి వ్యక్తిత్వమును సమగ్ర రూపమున ప్రదర్శించి, వారి జీవన్మూర్తిని పాఠకుల కనులకు కన్నట్టు నల్లొనర్చుటలో కడుశక్తిమంతమైనది. 6 “నా యెఱుక" యందు శ్రీ నారాయణదాసుగారు సందర్భోచితముగ 19వ శతాబ్ది చివరిపాదమందలి ఆంధ్రదేశస్థితిగతులను, ప్రజాజీవితమును ప్రదర్శించిరి. నాటి ప్రభువుల విద్యాపరీక్షణ కీర్తిప్రియత్వములను, ప్రజల అన్నదాన విద్యాదాన పోషణాదులను శ్రీ దాసుగారు వెల్లడించిరి. వైదిక విద్యార్థుల జీవితమును రుచి చూపించిరి. నాటి యజ్ఞ ప్రియులైన బ్రాహ్మణులు ఇష్టులు జరుపుకొనుచుండెడి వారు. నీటికరువు వచ్చినపుడు వారుణ జపములు చేయుట, గంగాష్టకము పఠించుచు బావులు త్రవ్వించుట, నృసింహజయంతి, ఏకాదశి మొదలైన పుణ్యదినములందు అభీష్ట దేవతామంత్రజపములు చేయుట వారి కాచారము. గుడుగుడు కుంచము. గుజ్జనగూళ్లవంటి ఆటలేకాక, కోతిపిఱ్ఱ, గోనెబిళ్ల, కిఱ్ఱు గానుగ వంటివి బాలుర క్రీడలు. ఆ నాడు నాచురంగు (వేశ్యల నాట్యప్రదర్శన) లను ప్రభువులు, ప్రజలు ఆదరించిరి. వేశ్యలు సంఘమునందు అంతర్భాగమై యున్నట్లును, విద్వాంసులకు అందు ముఖ్యముగ సంగీత విద్వాంసులకు, వారితో గాఢమైత్రి యున్నట్లు తెలియుచున్నది. విద్వాంసులు “గురుసేవ" (మద్యపదార్థ వినియోగము) యొనర్చెడి వారు. ఆంగ్లవిద్య క్రమక్రమముగా దేశమున పాదుకొనిపోవుచున్నది. శ్రీ నారాయణదాసుగారు మహీశూర రాష్ట్రమున స్త్రీలు పురుషులతో సమానస్వత్వములను వహించి విద్యాభ్యాస మొనర్చుటయును, స్వైరవిహారము లొనర్చుటయును గుర్తించిరి. సంఘ గౌరవము ప్రభుత్వోద్యోగములను బట్టి కల్గుచుండెడిది. పంక్తి భోజనవేళల యందును గౌరవనిశ్రేణిక యీ క్రమముననే జమీందారీ ప్రాంతములందు 462 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 సాగుచుండెడిది. శ్రీ దాసుగారు “నా యెఱుక" యందు దాని నిట్లు తమ నైజమగు పరిహాసచతురతతో వెల్లడించినారు : "గవర్నమెంటు నౌకరు మొదట గౌరవనీయుడు. అందు క్రిమినల్ అధికారి శ్రేష్ఠుడు. సివిలు రెండవ రకము. మా వైపు భోజనము చేయువేళ ఫష్టుక్లాసు పంక్తిలో మొదటి విస్తరి డిప్యూటీ కలెక్టరుగారు తరువాత సిరస్తాదారుగారు తరువాత సబ్ మేజిస్ట్రీటుగారు తరువాత మునసబుగారు తరువాత ఇనస్పెక్టరుగారు తరువాత హెడ్ గుమాస్తాగారు తరువాత నాజరుగారు తరువాత ప్లీడరు తరువాత చిల్లర గుమాస్తాలు. రెండవ క్లాసు పంక్తిలో జీతమునుబట్టి తరగతిగా జమీందారీ యుద్యోగులు. మూడవక్లాసు పంక్తిలో స్కూలు మాస్టర్లు, పిదప దిక్కుమాలిన పంక్తిలో పండితులు, వైదికులు. కొట్టకొసకు గాయకులు, భిక్షుకులును.” శ్రీ దాసుగారు నాటిదేశీయ ప్రభువులు మొగదాళ్ళు త్రిప్పుట వంటి వ్యాయామ విశేషములు, బ్రాహ్మణుల భోజనపరాక్రమము, వేశ్యల కపట నటనాకౌశలములు మొదలగు విశేషములను, ఉచితభాషలో సందర్భానుసారముగ తమ ఆత్మకథ యందు నిబద్ధమొనర్చినారు. శ్రీ నారాయణదాసుగారు ఐహిక ఆముష్మికములైన భారతీయ సాహిత్య గ్రంథములతోను, ఆధునిక సంస్కృతితోను గాఢపరిచయ మబ్బుటవలన నెలకొనిన ఉత్తమము, విపులమునైన దృక్పథము గలవారు. జీవహింస, అనృతములను పాపములంటనివారు. విహంగమన్యాయమున జీవింప నిశ్చయించుకొని కేవలము ఆత్మానందమునకై విద్యార్జన మొనర్చినవారు. తాత్కాలికదృష్టితో కాక నిత్య సౌఖ్యావహమైన నిర్మల చిత్తవృత్తితో తమ పరిసరములందలి సంఘమును గాఢముగ పరిశీలన యొనర్చినవారు. తాము దర్శించిన గుణదోషములను వెఱ పెఱుగక వెల్లడించినవారు. శ్రీ దాసుగారు అతివిస్తృతమైన తమ యనుభవమును పురస్కరించుకొని బాల్యయౌవనములు, స్త్రీ పురుష విభేదములు, మిత్ర శత్రుత్వములు, సజ్జనత్వ దుర్జనత్వములు మొదలగు వానిని గూర్చిన పరిశీలనల నెన్నింటినో 'నా యెఱుక' యందు వెల్లడించినారు. శ్రీ దాసుగారు నెల్వరించిన భావములతో ఆధునికులు కొన్నిటితో నేకీభవింతురు. వర్ణవ్యవస్థ, స్త్రీ స్వాతంత్ర్యము, స్త్రీ పునర్వివాహము మొదలగు కొన్ని సందర్భములయందు ఆధునికులు వారిని ఛాందసులుగా పరిగణించెదరు. "పురోడాశమును రుచిమరిగియే కాబోలు పున్నమల కమావాస్యలకు ఇష్టి జరుపుచుందురు. క్రిష్టియానిటీకి అన్యమతస్థులయెడ దయ లేదు. బ్రహ్మసమాజము సాహిత్య విమర్శ 463 క్రిష్టియానిటీకి పెద్దప్పు; మహమ్మడానిజమునకు మేనత్త; లోకములో యోగులు, యోగినులు, హరిదాసులు, వేదాంతులు తఱచు సమయము తటస్థించువరకే ధూర్త బకములవలె ధ్యానమొనర్చెదరు. పిల్లి చాంద్రాయణమువలె కలికాలపు వైరాగ్యము నమ్మవాటము కాదు. త్రాగుబోతులందు మెట్టవేదాంతము క్షుద్రజనులలో దేవతావేశము తఱచుగ గోచరించును" - మొదలైనవి శ్రీ దాసుగారు మతములనుగూర్చి యొనర్చిన పరిశీలనలకు నిదర్శనములు. "తండ్రి వంక వారికంటే తల్లివంక వారెక్కువ ప్రేమింతురు. వెలబోటుల విశ్వాసము గగనారవిందము, పుణ్యాత్ములకు లాతివారి దోషములు కనిపింపవు. జూదము జరుగుతావున, తీర్థములందు, రైల్వే ప్లాటుఫారముల చెంత, వెలయాలియింటిలోను, మదిరాగృహములందు జనులకు త్యాగము మెండు. వ్యసనులు దయగల వారగుదురు. వ్యసనరహితు లెక్కడనో తప్ప గొడ్డువారివలె గార్హస్యదూరులవలె కఠినాత్ము లయ్యెదరు" - మానవ స్వభావాదులను గూర్చి శ్రీ దాసుగారొనర్చిన పరిశీలనలలో ఇవి కొన్ని. "తీయని పాట యమకింకరులను గూడ కరిగించు" నని సంగీతశక్తిని ప్రశంసించుచు పరిశీలన మొనర్చినను, శ్రీ దాసుగారు సంగీతమునకు గల దుష్టశక్తిని గూర్చి "సంగీతము మరగినవారు నిషాబాజులవలె మరెందుకు పనికిరారు. తలను మణిగల ఫణికి విషాభివృద్ధి సహజమగునట్లు సంగీత విద్యగలవారికి దుష్టవర్తనము స్వభావ సిద్ధము. సంగీతము వచ్చినవారిలో నిర్మలవర్తను అరుదగుటచేతనే గదా గాయకులపాత్రులని స్మృతులు తెల్పుచున్నవి. కులస్త్రీలకు సంగీతవిద్య మప్పరాదు” అని నిస్సంశయముగ భావించిరి. “విశాఖపట్టణములో పురుషులకు నీరసము, స్త్రీలకు పుష్టి నైజము. అరవలకు ధనలోభము, మర్కట చేష్టలు, కాపట్యము, మురికితనము, మోటరికము సహజములు" - ఇట్లు శ్రీ దాసుగారు తాము వసించిన నగరములను గూర్చియు, పరిచయము కలిగిన ప్రజలను గూర్చియు అభిమానింపక, జంకక, 'నా యెఱుక' యందు కొన్ని పరిశీలన లొనర్చిరి. “అనాదిగా నున్న వర్ణభేదమును తొలగించుట, స్త్రీ పునర్వివాహప్రేరణము చింత్యము" లని శ్రీ దాసుగారి పరిశీలన. స్త్రీలు "ఉస్కోయన" ఉస్కోయనునట్లు పురుషునితో సమానముగ వర్తింపరాదనియు వారు యథాపూర్వకముగ నుండుటయే మేలనియు, స్త్రీ గృహలక్ష్మీ రూపమున భర్త యోగక్షేమముల నరయుటయే ఎల్లలోకముల నుద్ధరించుట యనియు, తాత్పర్యమున 'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' యనియు శ్రీ దాసుగారి పరిశీలనము. పురుషుడు మగయాడువాడు, స్త్రీ ఆడు మగది - అని నేటి 464 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 లైంగిక మనస్తత్త్వవేత్తలు (Sex Psychologists) దర్శించి 'యూనిసెక్సు' అని వ్యవహరించుచున్న జీవ రహస్యమును, ప్రాణికోటియందలి 'యక్సు, వై' క్రోమోజోముల సంయోగ స్వరూపములు దర్శించిన ఆధునిక జీవ శాస్త్రజ్ఞుల (Biologists) పరిశీలనమును శ్రీ దాసుగారు ఎన్నడో గ్రహించుట ఆశ్చర్యకరమైన విశేషము!. “పరమపురుషుడు తప్ప పురుషుడు లేడు. చెరిసగము స్త్రీ పుంస్త్వములున్నవి. కనుకనే సంయోగాపేక్ష, నిండు మగవాడు శివునివలె కామశత్రువు" - ఇట్టి గభీరసత్యములను 'నా యెఱుక' యందు శ్రీ దాసుగారెన్నింటినో వెల్లడించినారు. .దాసుగారికి దేశమన్నను దేశీయ ప్రభువులన్నను, దేశీయ స్వాతంత్ర్య మన్నను అమిత గౌరవాభిమానము లున్నవి. 'గంధర్వమానవుడ' నని చెప్పుకొనుచు సంగీత సాహిత్యసభలతో కాలముగడుపుచున్నను, శ్రీ దాసుగారు దేశాభివృద్ధిని గూర్చి యోజనయొనర్పకపోలేదు. ఉద్యోగులైనవారు దేశీయ ప్రభువులును ప్రజాసంక్షేమ కరములైన కార్యకలాపము లొనర్చుటకు ప్రోత్సహించుటలేదని వారు ఆక్రోశించినారు. దేశీయులు వ్యవసాయము, వర్తకము అభివృద్ధి చేసికొనవలెగాని సాంఘిక సంస్కరణలపై దృష్టిని నిలిపి, కాలమును వ్యర్థపుచ్చరాదని వారి భావము. అందువలననే “శిరస్సు లేని మొండెమున కభ్యంగన మొనర్చినట్లు స్వాతంత్ర్యము లేని దేశమునకు సోషల్ కాన్ఫరెన్సు ఏలా? డాబులు చేయుటకు టప్పాలు కొట్టుకొనుటకు" అని శ్రీ దాసుగారు “నా యెఱుక” యందు అభిప్రాయపడిరి. 8 “నా యెఱుక” యందు శ్రీ దాసుగారి విషయకథనము, సన్నివేశ చిత్రణము, సంభాషణవిరచనము, వర్ణనాదులందు రసానుగుణము, ఔచిత్యశోభితమునైన సారవద్భాషను ప్రయోగించినారు. వీరి భాష ప్రసన్నమధురము చమత్కార విస్ఫురితము సూక్తి సుధావిలసితము. శ్రీ దాసుగారి శిష్టభాష ఎడనెడ వ్యంగమర్యాదలతో, ఆలంకారిక వైభవముతో విలసిల్లుచు “నా యెఱుక” కు కావ్యత్వమును సిద్ధింపజేయుటకు అధికముగ తోడ్పడినది. శ్రీ దాసుగారు అచ్చ తెనుగుపై ఇంచుక విశేషానురాగము కలవారైనను ఉచితజ్ఞులై, “నా యెఱుక” స్వీయచరిత్ర రచనమునందు తత్సమ అచ్ఛిక పద సంకలితమైన “ఆంధ్రభాష”పై మక్కువ వహించుట మెచ్చదగియున్నది. 'నా యెఱుక' యందలి భాష నుడికారపు సొంపులతో, జాతీయపుటింపులతో జీవవంతమై సాహిత్యలోకమునకు ఆదర్శముగ నొప్పియున్నది. శ్రీ దాసుగారి జీవితమువలెనే వారి శబ్దకోశము అతి విస్తృతము; సర్వతోముఖము; శక్తిమంతము; సంస్కృతీప్రదర్శకము. సాహిత్య విమర్శ 465 వాక్య యోజనయందు వారు పోయిన పోకడలు అనంతములు. సామాన్యుల రచననుండి కవిశేఖరుల రచనలను శృంగగ్రాహికగా పట్టిచూపునది వారి అలంకారిక భాష. కవివర్యులు విశేషముగ రూపకభాషపై (Metophorical language) మక్కువ చూపుచుందురు. శ్రీ దాసుగారు ఇట్టి భాషను నైజలక్షణముగ ప్రయోగించిరనుటకు "దొరగారు సంగీతకుఠారము; పెద్దయుజ్జీ నోడించుట సైంధవవధ; అక్కన్న మాదన్నగారలు వచ్చారండీ; నిమ్మకొయ్యజాతి గనక చొరవ మెండు; దాసుగారి పాట దేవదుందుభులు మ్రోగెను; నీవు గుడాకేశుడవయ్యా!; పేరన్న కట్టి; నేపల్ల” (చుఱుకైనవాడు, బరువు మోయువాడు) వంటి రూపకభాషా ప్రయోగములు నిదర్శనములు. “ఏ యెండ కా గొడుగు పట్టనివాడు కష్టములు పాలగును గదా! పుణ్యాత్ములకు లాతి వారి దోషములు గన్నింపవు గదా! కొలను నుండి కొండకేగిన కలహంసది తప్పుగాని కాకిది తప్పా?" వంటి అర్థాంతరన్యాస నిదర్శనాలంకార శోభితమైన భాష శ్రీ దాసుగారి రచనకు కావ్యత్వమును కొంతగ కల్పించినది. ఇందలి తుదివాక్యము వ్యంగ్యోక్తికిని, చమత్కారమునకును నిదర్శన మగుచున్నది. "ఆకసమున తామరలు మొలుచునా?" వంటి నిదర్శనాలంకారములును వీరి రచనకు శోభ నిచ్చినవి. “నా కండవాతజాడ్యము ననుగ్రహించిన వెలయాలు, గొట్టాలమ్మ (కలరా) వేంచేయు, ఏ పుణ్యాత్ముడో నా గావంచా కాజేసెను; విజయనగరమున హుక్కాసువాసన తప్ప మిగిలిన దెల్ల దుర్వాసన. అతడు నేర్పిన విద్య యెట్లున్నను మప్పిన చుట్ట శాశ్వతమాయెను. ఏకాక్షి త్రితయ (సబ్ మేజిస్ట్రీటు, అతని భార్య, అతని కుక్క) మొక్కచో ప్రోగయ్యెను” - మొదలైన ప్రయోగములు వ్యంగ్యచమత్కారయుతములై దాసుగారి పరిహాసచతురతకు సాక్ష్యములుగ నొప్పినవి. వారు క్లబ్బులో ప్రవేశించునపుడు “Love fifty” అను కేకలు వినిపించె ననుటయు, భీముడుగారి వేశ్యాశోధనము ముగిసిన పిమ్మట "నీతో పొందు చింత కాయ" అనియు, వైష్ణవమిత్రుల యింట పెద్దగురుసేవ చేయునపుడు "ముండదేవుడు కుదిర్చెను కదరా ముగ్గుర నొకమారు” అను పాటను కల్పించి పాడుటయు నిట్టి చమత్కార విశేషములే. శ్రీ నారాయణదాసుగారి భాషయందలి వైశిష్ట్యము విశేషముగ వారి ఉపమాప్రయోగమునందు కన్పట్టుచున్నది. వారి ఉపమలలో నూటికి తొంబది పాళ్లు స్వోపజ్ఞములు. ఇవి బాహ్యాంతరికములైన విశాల ప్రపంచములను తమయం దిముడ్చుకొని శ్రీ దాసుగారి నిశిత భావనాశక్తిని, సంస్కృతీవిలసనను వెల్లడించుచు 466 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 “ఉపమా కాళిదాసస్య” అన్నట్లు "ఉపమా ఆదిభట్టస్య" అన నొప్పుచు రసజ్ఞ లోకమును గిలిగింతలు పెట్టజాలియున్నవి. “చదువు కోటాకు వేసిన గురుజుపిట్టలా తిరుగుట; దైవమువలె కూర్చున్న బ్రహ్మ (యజ్ఞమును చేయించువారిలో ముఖ్యుడు); పుణ్యపుంజము వలె భర్త చెంగట నున్న సోమిదేవి; ధవళమేఘములవలె ప్రేలు ప్రత్తిచేలు; వేదహిత ధర్మముల మాడ్కి నొడ్డు చేర్చు నోడలు; వంగ మూడికవలె పిలక ఝాడించు; కామేశము పంతులు సవారిడేగ వలె వచ్చెను; (భార్య మరణానంతరము పునర్వివాహమాడుట) రాత్రిపడ్డ గోతిలో మరల పడినట్లు; డబ్బిచ్చి తద్దినము గొనినట్లు; వదలిన పీడను తిరిగి తెచ్చుకొన్నట్లు; పెండ్లిపిల్లలు బొడ్డు కోకతో నెండు రొయ్యవలె గన్పట్టిరి; నీరు మింటివఱ కుప్పొంగుటచే పండుగుల ముందు వెనుకల నున్న మనస్సువలె పడవ లాకున నున్నతమై పిదప మామూలు స్థితి వహించెను; పరపతి పోగొట్టు దబ్బరపల్కుల రీతి గాలిం గూడనీని తెఱచాపల ఛిద్రములు కేసు గెల్చుటకు వాదించు ప్లీడర్లవలె భోగేచ్ఛం బోరాడు వృషభంబులమాడ్కి నొండొరులు మీరి రాగ తానపల్లవుల బాడుచుంటిమి; సొరంగము నుండి రైలు బయటపడినపుడు కష్టముగడచినట్లు నిద్రమేల్కొన్నరీతి, రహస్యము నెఱిగినట్లు ననుభూతి నొందితిమి (భీముడు గారు తిరిగి మమ్మాదరించుటచే) క్రొత్త కుండలో జోరీగ చొచ్చినట్లైనది మా పని; వారింట భుజించి చెట్టువిడిచిన భూతమువలె తిరిగితిమి” ఇట్టివి వారి సహజసిద్ధములైన ఉపమలకు అల్పనిదర్శనములు. శ్రీ దాసుగారి బాల్యదశ బరంపుర మద్రాసుపయాణాది వర్ణనలకు చిత్రవిచిత్రములు, బహుసంఖ్యాకములు నైన ఉపమలు ప్రాణపదములు. శ్రీ దాసుగారు "రూపాజీవలు శ్మశానకుసుమముల వలె వర్ణనీయలు, పూలతావి మోసికొని వచ్చుటచేత సంతర్పణము తిన్న బ్రాహ్మణునివలె గాలులు మెల్లగ వీచుచున్నవి” - వంటి ఉపమలను పూర్వకవి గౌరవము వలనను, దేశాచారాభిమానము వలనను ఆదరింపకపోలేదు. పరిశీలింపగా ఔపమ్య, తర్క, న్యాయమూలాదులైన సర్వాలంకారములకు దాసుగారి “నా యెఱుక” యందు ఉదాహరణములు కన్పట్టకపోవు. - శ్రీ దాసుగారు ఆంధ్రజాతి సంస్కృతికి సుస్థిరసాక్ష్యములై యున్న సామెతల నెన్నింటినో "నా యెఱుక” యందు ప్రయోగించి, తమ రచనకు స్ఫూర్తిని చేకూర్చుకొనిరి. "నానాటికి తీసికట్లు నాగంభట్లు; జ్వరము తగిలి సందెకు దించినట్లు; దొంగిలింపబోయిన మంగలము దొరికినట్లు; దూదేకువారికి దుంపతెగులు; గ్రుద్దులాడుకొన్నగాని కులము బయటపడదు; చేయునవి మాఘస్నానములు దూరునవి దొమ్మరి గుడిసెలు; వినాయకుని చేయబోయిన; క్రోతియగు" - వంటి ప్రసిద్ధములైన సాహిత్య విమర్శ 467 పెక్కు సామెతలను సందర్భోచితముగ, కులవర్గ పక్షపాతరహిత దృష్టితో శ్రీ దాసుగారు ఆదరించి ప్రయోగించినారు. శ్రీ దాసుగారు బహుభాషా కోవిదులు. నేర్చిన భాషలన్నింటను వాని యందలి జాతీయ ప్రయోగ నైపుణ్యమును పుణికి పుచ్చుకొన్నవారు. చిన్ననాడే “All his love - in him” ను తరగతియందలి విద్యార్థులందరును పూరింపజాలనపుడు, “Centred" అని చెప్పి "that is very learned” అని ఆచార్యుని మెప్పుగొన్నవారు. అట్టి దాసుగారు “నా యెఱుక” యందు దేశీయములను, జాతీయములను కోకొల్లలుగ ప్రయోగించి, తమ రచనకు నిత్య తారుణ్యమును సంపాదించినారు. ఇందుకు "భరద్వాజవిందు, శృంగభంగము, కాష్ఠవాదము, కంకోష్ఠు పద్యము, శశవిషాణము, గగన కుసుమము, తిక్క శంకరయ్య, దాపుమూపు లెఱుగకపోవు, లెంపకాయ ఖర్చునకిచ్చు, వేలంవెట్టి గవ్వగ ఖర్చుపెట్టు, తొమ్మిదవ అర్థము పారాయణము చేయు, గురుడు పన్నెండింట నుండు, ఏకు మేకగు, బ్రహ్మానందమొందు" వంటి ప్రయోగములు కొన్ని నిదర్శనములు. “నా యెఱుక" యందు శ్రీ దాసుగారు సహజత్వమును సంపాదించుటకై మాండలిక శబ్దములను బహుభాషలనుండి స్వీకరించిన శబ్ద జాలమును ప్రయోగించినారు. ఆంగ్ల భాషలనుండి వీరు "College, Magistrate, Scoundrel, thanks వంటి ప్రత్యేక పదములనే గాక "Vice-versa, Love fifty" వంటి పదబంధములను, "It lulled me to sleep" వంటి వాక్యములను సైతము గ్రహించి ప్రయోగించినారు. ఆంగ్లభాషాశబ్దములతో "కంట్రీగురుడు" వంటి సమాసపదములను కల్పించుటకును వీరు వెనుదీయలేదు. వీరి రచనయందు “సీదా, రస్తా, జరూరు, కరారు, కైజారు, ఉమ్మేజువారి, నిషాబాజు, కావేషీ, నిసీబు, తైనాతు, నాజూకు, సాహెబు, ఫర్మాయించు” మొదలైన ఉర్దూ, పర్షియన్, అరబిక్ పదములు “నా యెఱుక” యందు అనంతముగ ప్రయుక్తములైనవి. శ్రీ దాసుగారు “తుంబ, తరవాణి, వంతర, వాణము (బండి), మొత్తములు, పల్ల, (చేతి) రువ్వ, మదిని (వదినె), పెయ్యమ్మ (పెత్తల్లి), తోచ్చి (పినతల్లి), ఆచ (అన్న), చిట్టి (పినతండ్రి), గోర్జెలు, లంకె, మప్పు, చీరె (వస్త్రము)” వంటి మాండలిక పదములను "బ్రహ్మ, పురోడాశము, ఇష్టి" వంటి వృత్తి మాండలిక పదములను; బాణమిచ్చు (ఐదు రూపాయలు సంభావన యిచ్చు) గురుడు (నల్లమందు, గంజాయి, బ్రాందీవంటి మద్యపదార్థము), గోవిందుడు (సారాయి సీసా), వంటి సాంకేతిక 468 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 పదములను ఝడితిస్ఫూర్తి నాసించి ప్రయోగించినారు. "దిబ్బ భడవ, గుంటడు, స్కౌండ్రలు, శుంఠలు (రసహీనులు)” వంటి తిట్లు సముచితముగ ప్రయోజితములైనవి. “నీ అమ్మకనులు మండ, గుంటడు" వంటి తిట్లు ప్రేమార్ద్రతను వెల్లడించుట యందును ఆంధ్రదేశాచారము ననుసరించి 'నా యెఱుక' లో ప్రయుక్తములయినవి. శ్రీ దాసుగారు నైజముగ లక్షణవిరుద్ధమైన భాష నాదరింపని వారు, శిష్ట భాషాప్రియులు. సామాన్య, సంక్లిష్ట, సంయోగవాక్యములను ఆవశ్యకత లెరిగి ప్రయోగింప నేర్చినవారు. చర్చకు వచ్చినపుడు క్వార్ధకము భిన్నకర్తృకమై యుండుటకు నన్నయ పెద్దనలనుండి ప్రయోగములు చూపనేర్చిన వ్యాకరణ పాండిత్యము కలవారు. ఐనను వీరు లోకభాష నాదరించుటచే "శివకోవెల, భరద్వాజ విందు, సర్పజెముడు, యుద్ధపుంజు" వంటి వైరి సమాసములు, “ముక్కోపి” - వంటి గ్రామ్య బహువ్రీహి. “పాటకుడు” (గాయకుడను నర్థములో దేశిశబ్దముపై సంస్కృత ప్రత్యయమును చేర్చుట), “అభినయకత్తె" (సంస్కృత శబ్దముపై తెలుగు ప్రత్యయమును చేర్చుట) “సభికులు” (జూదరులు సభ్యులను నర్థమున ప్రయోగించుట) - వంటి వ్యాకరణ విరుద్ధ పదప్రయోగములు "నా యెఱుక” యందు ఎడనెడ కన్పట్టుచున్నవి. ఇట్టివానిని వారాదరించుటకు వారి అనభిజ్ఞత హేతువనుకొనుట విజ్ఞత కానేరదు. “నా యెఱుక” సర్వతోముఖముగ ప్రశంసింపదగిన ప్రథమాంధ్ర స్వీయచరిత్ర. అపూర్వాంధ్రమహాపురుషులై అనేక రంగములందు అనుపమ స్థానమును ఆర్జించుకొన్న శ్రీ ఆదిభట్లవారి ఆత్మకథయగు నిది, అనతికాలములో ముద్రితమై ఆంధ్రుల గౌరవానురాగములను చూరగొనుచు, అనేక ప్రయోజనములను ప్రసాదించుగాక! శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి స్వీయ చరిత్ర 'నా యెఱుక' యొక్క పీఠిక - 1976 ముద్రితము సాహిత్య విమర్శ 469