వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సాహిత్య విమర్శ/తంజావూరు మహారాష్ట్ర నాయకులు: ఆంధ్రవాఙ్మయము

తంజావూరు మహారాష్ట్ర నాయకులు:

ఆంధ్రవాఙ్మయము

విజయనగర సామ్రాజ్యాస్తమయమునకు వెనుక రెండు శతాబ్దుల కాలమాంధ్రవాఙ్మయ పోషకులుగా నుండిన దక్షిణదేశ నాయకరాజులు స్వతంత్రించిరి. వీరు మొదట విజయనగర సమ్రాట్టులచే బ్రతినిధులుగా సంపబడిన తెలుగు నాయకులు. వీరి పాలనకాలములో తమిళ దేశమునకు దెలుగు తెగ లనేకములు వలస పోయినటుల స్థానిక చరిత్రలవలన దెలియుచున్నది. ఈ తెలుగు నాయకులు ఆంధ్రవాఙ్మయ పక్షపాతులై వెలలేని సాయమొనర్చిరి. తిరుచునాపల్లి, పుదుక్కోటల రాజులగు తొండమాన్ వంశజులు తమిళులైనను తెలుగు కవితాకుమారికి వశులై, సారస్వతాంబుధి నోలలాడిరి. ఈ కాలమున తంజావూరు, మధుర, తిరుచునాపల్లి, పుదుక్కోట లాంధ్ర వాఙ్మయమునకు విద్యాస్థానములై విలసిల్లినవని చెప్పవలయును. విజయనగర రాజులతో బ్రబంధయుగ మంతరించినది. ఈ యుగమున నాటకములు, వచన కావ్యములు విరివిగా అభివృద్ధిలోనికి వచ్చినవి. కావున నీ యుగమును 'నాటక వచన కావ్యయుగ’మనిగాని, దక్షిణ దేశమున నీ కాలమునం దాంధ్రవాఙ్మయ మభివృద్ధి బొందుటవలన 'దక్షిణ దేశ ఆంధ్ర వాఙ్మయ' (1600-1800) మని గాని పిలవవచ్చును. ఇది ప్రబంధ అధునాతన యుగములకు సంధియుగము.

పైన పేర్కొనబడిన విద్యాస్థానములలో తంజావూరును క్రీ.శ. 1535-1675 వరకు నాంధ్ర నాయకులు పరిపాలించిరి. వీరి తరువాత తంజావూరునందు క్రీ.శ. 1800 వరకును మహారాష్ట్రులు తమ పరిపాలనమును నెలకొల్పి, యాంధ్రభాషను బోషించి మహాయశస్సును గడించిరి. అన్యదేశీయులైనను వీరు శిల్పమునకు నా దేశమున పారంపర్యముగా వచ్చు నాంధ్ర సారస్వతమునకు జేయూత నిచ్చిరి. దక్షిణ హిందూ దేశమున వీరి పరిపాలనకాలమున గట్టబడిన దేవాలయములు, ప్రాచీన హైందవ చిత్రకళానైపుణ్యమును, శిల్ప నైపుణ్యమును జాటుచున్నది. వీరాంధ్ర వాఙ్మయమును బోషించుటలో నాంధ్ర నాయకుల యడుగుజాడలనుబట్టి నడచిరి. ఆంధ్ర సారస్వతమును బోషించిన యన్య దేశీయులలో నగ్రస్థానము వీరికే జెందవలసి యున్నది. పాఠకుల సౌకర్యార్థమై నీ రాజన్యుల వంశవృక్షము పొందుపరుపబడుచున్నది.

ఈ వంశవృక్షము రాబర్టు సూయల్ 'List of Antiquities - Part, ii ననుసరించి యీయబడినది. (పట్టిక కోసం తరువాతి పేజీని చూడండి)

ఇది చోళసింహాసనాధ్యక్ష భోసల ప్రతాపసింహ రాజ పూర్వపుణ్య పరిపాకస్వరూప యామునాంబికా గర్భశుక్తి మౌక్తికాయమానామరసింహ మండలాధీశ్వర నామాంకితంబైన' యని యుండుటచే పై పట్టికయందు చూపబడినది తప్పుగా దోచుచున్నది.

ఏకోజీ (క్రీ.శ. 1674-1684)

ఛత్రపతి శివాజీమహారాజు తమ్ముడగు నీతడు తంజావూరు ప్రథమ మహారాష్ట్ర పరిపాలకుడు. ఇతడు తంజావూరిని క్రీ.శ. 1674లో ముట్టడించెను. ఇతడు నాయక రాజ్య విచ్ఛేదమునకై బద్ధకంకణుడైన బీజాపుర సుల్తానుచే పంపబడిన సేనానాయకుడైనట్లు శాసన ప్రమాణములు గలవని, కురుగంటి సీతారామయ్యగారి తంజావూరి యాంధ్రనాయకుల చరిత్రలవలన దెలియుచున్నది. కాని 'ఏకోజి' తంజావూరి ఆంధ్ర నాయకులలో కడపటి వాడగు విజయ రాఘవుని ప్రేరణమున తంజాపురమును ప్రవేశించి, అతని మరణానంతరము బలవంతుడై సింహాసన మధిష్ఠించెనని శ్రీయుత జయంతి రామయ్య పంతులవారు నుడువుచున్నారు.1 తన రాజ్యకాలము నంతయు రాజ్యసుస్థాపనార్థమే వినియోగించిన యీ రాజన్యునకు సారస్వత సేవకు గాలము కరువయ్యెను. అందువలన నతని కాలమున సంస్కృత వాఙ్మయముగాని, తెలుగు వాఙ్మయముగాని, యే విధమగు పోషకత్వమును బడసినట్లు కన్పింపదు. శత్రు రాజులతో సమరములు సల్పి రాజ్యస్థాపన మొనర్చు మహారాజుల రాజ్యకాలములో వాఙ్మయ పోషణ మరుదు.

శాహజీ (క్రీ.శ. 1684-1710)

ఏకోజీ మహారాజు పరిపాలనానంతరము అతని జ్యేష్ఠపుత్రుడగు శాహజీ సింహాసన మలంకరించెను. తండ్రి రాజ్యమును సుస్థిరమొనర్చి స్వర్లోక ప్రస్థాన మొనర్చుటచే నీ రాజన్యునకు సారస్వత సేవ యొనర్చుటకు తగినంత విశ్రాంతి దొరికినది. ఇతడు దేవభాష యాంధ్రముల రెంటను అసమాన పాండిత్యము గడించిన కవి రాజన్యుడు. ఇతని యాస్థానకవి యగు విచిత్ర రాయావతంస కవి యీతనిని 'సరససాహితీ లక్షణవిభు' డని పొగడియున్నాడు. తానే తన 'విష్ణు పల్లకి సేవా ప్రబంధ’ మను నాటకమున తన్ను గూర్చి 'కవిత సంగీత తాన శ్రుతి స్వరసాధన
  • ఆంధ్రవిశ్వవిద్యాలయము వారిచే ముద్రింపబడిన తంజావూరు శరభోజీ సరస్వతీ మహల్ నందలి యాంధ్రతాళ పత్ర గ్రంథములు పట్టికలో అమరసింహుడు ప్రతాప సింహునకు కుమారుని కుమారుడుగా జెప్పబడియున్నది. కాని అమరసింహుడు ప్రతాప సింహుని కుమారుడే యనుట సమంజసము. అమరసింహుని యాస్థానకవియగు మాతృభూతుడు తాను రచించిన పారిజాతాపహరణ నాటకమునందు (తంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయ తాళపత్ర గ్రంథముల పట్టిక, నం. 543.) రాగాంగగాన క్రియాస్థాయి గనక ప్రబంధ ధాతు గాయనగణితానదర్గాహకుండ' (?) నని చెప్పుకొని యున్నాడు. కాని యితనికి కవితాకళ, గానకళలందు పాండితి యపారమని తెలియుచున్నది. స్వయముగా తాను కవియగుటయే గాక తన యాస్థానమునందనేక కవులకు గాయకులకు పోషణము కల్పించెను. ఈతడనేక కృతులకు భర్తయు కర్తయు నగుటయే గాక కృతులలో నాయకుడు గూడనై యున్నాడు. ఇతడిట్టు భాష కపారసేవ యొనర్చి తన నామమునకు వాఙ్మయ చరిత్రయందు చిరస్థాయిత్వము కల్పించుకొని యున్నాడు. ఇతనికి గాన కళాభిరుచి మెండు.

త్యాగరాజ స్వామివారి వంశకర్తలలో నొకడగు వెంగనార్యుడను గాయకశిరోమణి యీతని యాస్థాన మలంకరించెను. శాహజీ మహారాజు సంస్కృతమునం దసమాన ప్రతిభావంతుడై ‘చంద్రశేఖర విలాస' మను రసవత్కావ్యమును రచించెను. శాహజీ యాస్థాన మలంకరించిన సంస్కృత కవులలో నీలకంఠ దీక్షితుని తమ్ముడగు అతిరాత్రయాజి యొకడు. ఇతడు కవితారచనలో నఖండుడు. సర్వస్వతంత్రుడు. ఇతడు మృదుమధుర పదభూయిష్టమగు 'కుముద్వతీపరిణయ' మను నైదంకముల రూపకమును రచించెను. సంస్కృత వాఙ్మయముగల చంపువులలో నగ్రస్థానము వహింపదగిన 'ధర్మవిజయ' మను గ్రంథము నల్లదీక్షితకవిచే శాహజీ మహారాజు కోరికపై రచింపబడెను. శాహజీ మహారాజు పరిపాలన కాలమున అతనినే కావ్యనాయకునిగా నొనర్చి రచించిన కావ్యపరంపర బహుళము. అట్టి వానిలో సంస్కృతమునందు చొక్కనాథ కవిచే రచింపబడిన 'కాంతిమతీపరిణయ' మను రూపక మొకటి. అయ్యవాలనబడు శ్రీధర వెంకటేశ్వర కవి పండితుని శాహరాజాష్టపదియు, గంగాధర పండితుని భోసల వంశావళియు, లక్షణకవి శాహరాజ సభాసరోవర్ణనియు పై రకమునకు జెందిన గ్రంథములు, తంజావూరి మహారాష్ట్ర నాయక చరిత్ర వ్రాయదలచుకున్న చరిత్రకారులు కిట్టి గ్రంథములు ముఖ్యాధారములు.

ఇతని కాలమున సంస్కృతము కన్న హెచ్చు తెలుగు వాఙ్మయ మభివృద్ధి జెందినట్లు కన్పించును. ఇతడాంధ్ర వాఙ్మయమునందలి బహునాటకములకు కర్త. తంజావూరు విజయరాఘవుని కాలమునందువలెనే యీతని కాలమున హెచ్చు యక్షగానములు, నాటకములు, దండకములు, కొరవంజులు వ్రాయబడినట్లు కన్పించుచున్నది. ఆంధ్ర నాయకులగు రఘునాథ, విజయ రాఘవ నాయకుల కాలమునుండి వచ్చు నాటకములతో బాటు తాను కొన్ని నాటకముల రచించియు, నితర కవులను బ్రోత్సహించి వారిచే రచియింప జేసియు, రంగస్థలముపై వేషముల వేయించి, నటియింపజేసియు ప్రజల నానందాబ్ది నోలలాడించెను. ఇతని కాలమున రచింపబడిన పద్య కావ్యములు కన్పింపవు. ఇతని కాలమున తిమ్మయ్య ద్విపద మహాభారతము తిరుగ వ్రాయింపబడినట్టు దెలియుచున్నది. ఈ గ్రంథమే గాక తనకు బూర్వము వ్రాయింపబడినవియు, క్రిమీదష్టమై శిథిలత్వ మనుభవించుచున్నవి యునగు గ్రంథ పరంపర నుద్ధరించెను.

శాహజీ మహారాజు 'శృంగారంబున పొంగారు' 'గంగాపార్వతీ సంవాద' మను నాటకమును రచించెను. ఇందలి కథావస్తువు, 'సర్వేశ్వరుడు గంగతో వనమున విహరించువేళ నారదుడు వచ్చి గంగను స్తుతించి పార్వతిని నిందించిన సమయమున పార్వతి సఖి దానిని విని దేవికి దెలియుజేయుట, ఆ సమయమున సవతుల పోరాటము ఈశ్వరుడు వారి కయ్యమును మాన్ప నొకతెను శరీరమున, మరియొకతెను శిరమున ధరించుట.’ ఈతని నాటక రాజము లీతని పాండిత్యమును వెల్లడిజేయుచున్నవి. సహజవర్ణనలు, పాత్రోచితభాషలు, జాతీయములు ముఖ్యముగా జీవద్భాషలీ నాటకములకు బెట్టని శృంగారములు. ఇతడు 'కిరాతవిలాస'మను మరియొక నాటకమును రచియించెను. ఇతడు వ్రాసిన నాటకములలో మేలు బంతియని పొగడదగినది 'త్యాగరాజవినోద చిత్రప్రబంధనాటకము'. ఈ నాటకమున మహారాజు అష్టాదశవర్ణనల నినుమడింపజేసి ప్రబంధత్వము కల్పించెను. తన పాండితీప్రకర్షను వెల్లడి యొనర్చుటకై యీ నాటకమును సంస్కృతపద భూయిష్టముగా రచియించి, నాటకములన్న పండితుల కామోదమును రగుల్కొల్పెను. తన కవితాశక్తి కోర్చిన యీ నాటకమున కవి సంస్కృతము, మహారాష్ట్రము, తెలుగు భాషలకు సమ్మేళనము కల్పించెను. ఈ నాటకమునందలి పాత్రలు పై మూడు భాషలలోను ప్రసంగింతురు. ఈ నాటకమునకు బ్రేక్షకులు శిష్టులు గాని నిరక్షరులు కారు. పండిత పామర జనానందముగా నాటకములు రచియింపగల యీ కవిరాజన్యుడు, ద్రౌపదీ కల్యాణమును రచియించెను. నటరాజగు నీశ్వరుని యొద్ద చెంచు మొదలగు నాట్యకర్తలు తమ నటనాకౌశలమును జూపి బిరుదులను బడయుట కథావస్తువుగాగల 'పంచరత్న ప్రబంధ' మను నాటకమును శాహ మహారాజు కొలది కాలములో రచించితినని చెప్పుకొనెను. ఇతడు తన 'పార్వతీపరిణయ' మను నాటకమును 'వేషభాషాదియుతముగా’ విస్తరింతునని చెప్పెను. కాబట్టి శాహమహారాజుకు నాటకమన్న నెట్టి యభిప్రాయము గలదో తేటతెల్లమగుచున్నది. నాటకమున పాత్రోచితభాష, వేషము లేకపోయినచో నది దృశ్యకావ్య మనిపించు కొనదుగదా! అనగా శాహావనీపతికి నాటకము లెట్లు వ్రాయవలయునో, యెట్లు వ్రాసిన ప్రజల హృదయము రంజిల్లునో దెలియునన్నమాట.

శాహమహారాజు రచియించిన నాటకములలో ఖిలమైపోయినవి పోగా తంజావూరు నాఙ్మయసర్వస్వ మనిపించుకొనిన సరస్వతీ మహల్ గ్రంథాలయమున వ్రాతప్రతులుగా మిగిలియున్న వానిలో రతీకల్యాణ నాటకము, రుక్మిణీ సత్యభామా సంవాదము, వల్లీకల్యాణము (కుమారస్వామి వల్లీదేవుల వివాహము), విఘ్నేశ్వర కల్యాణము, శంకరపల్లకి సేవాప్రబంధము, సతీదానసూరము, సతీపతి దాన విలాసము, సీతాకల్యాణము, రామపట్టాభిషేకము, జలక్రీడలు, కంసవధ, సరస్వతీ విలాసము, శచీపురందరము, శాంతాకల్యాణము, విష్ణుపల్లకి సేవాప్రబంధము లను నాటకములు కొన్ని. పై నాటకము లన్నిటిలో సరస్వతీ కల్యాణకర్తృత్వమును గూర్చి కొంచెముగా జెప్పవలసి యున్నది. గ్రంథమున శేషాచలపతి రచించె ననియు, గ్రంథాంతమున శాహమహారాజు రచియించె ననియు చెప్పబడి యున్నది. సరస్వతీ మహల్ గ్రంథాలయము కేటలాగు సంపాదకులు గ్రంథ మంతయు శేషాచలపతి వ్రాసినదేగాని కారణాంతరమువలన మహారాజు హెచ్చు భాగమును వ్రాయుట వలననో యేమో శాహ మహారాజు పేరనే చెల్లుబడియగుచున్నదని చెప్పబూనిరి. కాని యంతకన్న శేషాచలపతి గ్రంథమును కొంతవరకు రచియించి స్వర్లోకమున కేగిన వెనుక, కొరవడిన యధికభాగమును శాహ మహారాజు పూరించుటచే నా గ్రంథము అతని పేరుననే చెల్లుబడి యగుచున్నదనుట సమంజసముగా దోచుచున్నది.

శాహమహారాజు తెనుగున రచించిన గ్రంథము లన్నియు నాటకములే. కొన్నిటికి నాటకములనియు, కొన్నిటికి ప్రబంధములనియు పేరుపెట్టి రెండవ రకము వానియందు సంస్కృత పదజాలము, సంగీత శాస్త్ర పాండితీ ప్రకర్ష చూపించెను. 'ప్రబంధం కల్పనా కథా' యను సూక్తి నాధారముగా గొని వర్ణనలు కల్పించి, ప్రఖ్యాత ఇతివృత్తములనే నాటకములుగా నొనర్చి నాటికి ప్రబంధత్వ మారోపించి, నాటకములయెడ పండితులకు గల గౌరవమును పెంపొందించెను. ప్రబంధములకు మిగిలిన రెండవ తరగతి 'నాటకము'లు పామర జనవేద్యములు. సంస్కృత వాఙ్మయమునందు వలెనే తెలుగు వాఙ్మయము నందును శాహమహారాజును నాయకుని జేసి రచించిన గ్రంథము లనేకములు గలవు. ఇట్టి గ్రంథములన్నియు నాతని పరిపాలనకాలముననే రచింపబడిన వనుట యుక్తము. అట్టివానిలో శాహజీ సాహిత్యము, శాహజీయము, శాహజీ దండకములు ముఖ్యములు.

శాహమహారాజు నాస్థానము నలంకరించిన తెలుగు కవులలో ప్రథమమున పేర్కొన దగినవాడు గిరిరాజకవి. ఇతడు అనిర్వచ్యమగు నోంకారమును నాదబ్రహ్మోపాసకుడై గానామృతమును విశ్వముపై నొలికించి బ్రహ్మానందమును గలుగజేసిన త్యాగరాజస్వామికి తాతగారు. ఈతడు వాదవిజయము, సర్వాంగసుందర విలాసములను నాటకములు రచించి శాహమహారాజున కంకితమిచ్చెను. ఇతడు శాహేంద్రచరిత్రమును యక్షగానముగ రచియించెను. అందలి గద్యలో

        'కండచక్కెరలీల కల్పించి రుచుల,
         గండుమీరిన యక్షగానంబు మిగుల
         గరిమను గిరిరాజకవి రచియించె'

అని చెప్పుకొని యున్నాడు. ఈతని కవిత సహజ మాధుర్యమును పొందియున్నది. ఇతని వర్ణనలు సహజములు. ఇతడు నాటకములందు హెచ్చుగా ప్రబంధపు పోకడల పోయెను. 'కొరవంజి'ని వ్రాసిన తెలుగు కవులలో నీతడే ప్రథముడుగా కన్పించుచున్నాడు. గిరిరాజకవి 'రాజమోహన కొరవంజి' యను నొక గ్రంథమును రచించి శాహమహారాజున కంకిత మొనర్చెను. ఈ గిరిరాజకవి రాజకన్యాపరిణయమను మరియొక కొరవంజిని రచియించి శాహమహారాజు మెప్పు వడసెను. శాహమహారాజు వాహ్యాళి వెడలుచుండగా జూచి రాజకన్యయొకతె ఆయనను ప్రేమించును. ఈ వృత్తాంతము నా రాజకుమారి తల్లిదండ్రులు తెలిసికొని, యామెను మహారాజున కిచ్చి వివాహము గావింతురు. ఇది యందలి ప్రధాన కథావస్తువు. గిరిరాజకవి బహు నాటకకర్త యని పేరుపొందినవాడు. కాని యితని నాటకములు మాత్రము నేడు మూడో నాలుగో కన్పించుచున్నవి. ఇతడు శాహజీ మరణానంతరము రాజ్యమునకు వచ్చిన యితని తమ్ముడగు శరభోజీ ప్రథమ రాజ్యవత్సరములలో జీవించియున్నట్లు తెలియుచున్నది. ఇతడొకానొక చోట గద్యలో 'గిరిరాజనుతలీల శరభోజిభూపాల” యని చెప్పుకొనుటయే గాక శరభోజీ భూపాలుని పేర నంకితముగా 'లీలావతీకల్యాణ' మను నాటకమును రచించెను. ఇతని కవిత రసవత్తరమైన దగుటయే గాక సహజ వర్ణనల గూడ కలిగియున్నది.

శాహజీ మహారాజు సభ నలంకరించిన కవులలో గిరిరాజకవి వెనుక పేర్కొనదగినవాడు, విజయ రాయావతంసకవి. ఇతడు తన గద్యములందు 'సలోహితగోత్రాహోబళార్యపుత్రకులపావన గిరిరాజ కవిపరానుజ' యని చెప్పికొని యుండుట వలన, నీతడు గిరిరాజకవి తమ్ముడని తెలియుచున్నది. ఇతడు తెనుగున 'అభినయ దర్పణ' మను నాట్యశాస్త్రమును రచించి ఖండోజీయను మహారాష్ట్ర సేనాని కంకితమిచ్చెను. బాలకవి యను మరియొక కవివరేణ్యుడు తాను శాహమహారాజు కోరికపై పంచకన్యా పరిణయమను నాటకమును రచించితినని చెప్పుకొనెను. మహారాజీ నాటకము నాంధ్రభాషలో వ్రాయవలసినదిగా కోరెనట. కాబట్టి యీతడు మరి యితర భాషలలో గూడ కవిత జెప్పగలిగినాడని యూహించుట కవకాశము కలుగుచున్నది. శాహ మహారాజ రాజ్యకాలముననే లీలావతీశాహరాజీయ మను నాటకమునకు కర్తయగు బాలకవి సుబ్బన్నయను నొక కవిపుంగవుడు కన్పించుచున్నాడు. పై బాలకవియు, నీ బాలకవి సుబ్బన్నయు నొకడేమోయని తలంచుట కవకాశము కలుగుచున్నది గాని, యొక్కరే యని చెప్పుటకు తగినంత యాధారము లేవియు లేవు. బాలకవి సుబ్బన్న 'లీలావతీశాహ రాజీయ' మను గ్రంథమున 'సరికవు లెన్నునట్లుగా వ్రాసినాడ’ నని చెప్పుకొనెను. కాబట్టి బాలకవి సమకాలీనులలో పేరుగన్న వాడన్నమాట. 'శేషాచల పతి' యను మరి యొక కవి 'శాహ మహారాజ విలాస' మను నాటకమును రచించెను. ఇతడు తన నాటకమున 'అష్టభాషా కవిత్వంబులమరు' నని చెప్పియున్నాడు. ఇతని పాండితీ ప్రకర్ష నిరుపమానమని యీ నాటక రాజము చెప్పకయె చెప్పుచున్నది.

శరభోజీ (క్రీ.శ. 1711-28)

శాహ మహారాజు మరణానంతరము అతని తమ్ముడగు శరభోజీ రాజయ్యెను. ఇతడు శాహ మహారాజువలె పండితుడు కవి కాకపోయినను కవులను పోషించెను. ఇతని కాలమున గిరిరాజకవి కొంతకాలము జీవించియున్నట్లు పైన బేర్కొని యున్నాను. ఈతని పరిపాలనకాలముననే త్యాగరాజస్వామి జీవించి, తన గానామృతమును వెదజల్లినది. త్యాగరాజు తాను జీవద్భాషలో వ్రాసిన దివ్యమైన కృతులు గాక 'నౌకాచరిత్రము', 'ప్రహ్లాద చరిత్రము' అను రెండు యక్షగానములు గూడ రచించెను. త్యాగ రాజాంధ్రుడు, బ్రాహ్మణుడు, ములికినాటి వంశజుడు. శాంతాదేవి - రామబ్రహ్మల గర్భశుక్తిముక్తాఫలము. చోళ దేశమునందలి పంచనద గ్రామనివాసి. తిరువది గ్రామనివాసి యని శ్రీయుత జయంతి రామయ్యపంతులవారు వ్రాసియున్నారు. త్యాగ రాజస్వామి తన నౌకాచరిత్రమున 'కాకర్లాంబుధి చంద్రుడు శ్రీకరుడగు త్యాగరాజ చిత్తనివేశా' యని పేర్కొనుటవలన త్యాగరాజు గృహనామము కాకర్లవారని తెలియుచున్నది.' త్యాగరాజ స్వామి నౌకాచరిత్రమున తన గురువర్యుడు రామకృష్ణానందమును


     కం. 'మ్రొక్కెద దేశికవరునకు,
          మ్రొక్కెద ధర్మార్థ కామ మోక్షదునకు (?),

      మ్రొక్కెద పదముల ననిశము,
      మ్రొక్కెద శ్రీ రామకృష్ణ మోదాఖ్యునకున్.'

అని ప్రార్థించి యున్నాడు. త్యాగరాజస్వామికి సంస్కృత ఆంధ్రవాఙ్మయముల యందు పరిపూర్ణ పాండిత్యము కలదు. తమిళ దేశమునందు నివసించుచున్నను శ్రీ స్వామివారికి తమిళం అంతగా రాదు. పండిత కవిగాయక వంశమున జన్మించిన త్యాగరాజస్వామి కవి, నాదబ్రహ్మోపాసకుడగుటలో నాశ్చర్యము లేదు. త్యాగరాజు తన కృతుల మాధుర్యయుతముగాను, సర్వజన ప్రియకరములుగాను జీవద్భాషలో రచియించెను. నేటివరకును అరవము, కన్నడము, మలయాళము, తుళు, తెలుగు మొదలగు ద్రావిడ భాషలందలి గానకళకు త్యాగరాజకీర్తనలే జీవనాధారములుగా నున్నవి. ఈ మహాత్మునికృప వలన నాంధ్రభాష దక్షిణదేశ సంగీత ప్రపంచమునకు సామాన్య భాష (Lingua Franca) గా నున్నది. తెలుగు భాషయందున్న త్యాగరాజు కృతులు ద్రావిడ కర్ణాటకుల సంగీత పాటకులుగా తీర్చి దిద్ది నిత్యారాధన మొందుచున్నవి. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, నీతి, ధర్మము మొదలగు గూఢ విషయములను గురించి ఇతని కృతులు అసంఖ్యాకములుగా నున్నవి. ఇతని కృతులయందు కావ్యాత్మయగు జీవిత విమర్శ (Criticism of life) తొలుకాడుచుండును. ఇతడు తన జీవితాంతిమ కాలమున కావేరిగట్టున కేగి ధనమునంతయు బీదసాదలకు పంచిపెట్టి సర్వసంగపరిత్యాగ మొనర్చి భగవంతుని గూర్చి ప్రార్థింపసాగెను. దక్షిణ దేశమున నపర బ్రహ్మయు, నాంధ్రకవికుల సూర్యుడునగు త్యాగరాజకవి 1698 (?) (క్రీ.శ. 1806) పుష్యబహుళ పంచమినాడు తన పాంచభౌతిక శరీరమును వదిలెను.8


తుళజ మహారాజు (క్రీ.శ. 1726-35)


ఇతడు సంస్కృత ఆంధ్రవాఙ్మయములు రెంటియందును పాండిత్యము కలవాడు, కవి, సంగీత శాస్త్రజ్ఞుడు. ఇతడు సంస్కృతమున 'సంగీత సారామృత'మను దాక్షిణాత్య సంగీత శాస్త్ర గ్రంథ మొకటి రచియించెను. ఇది కర్ణాటక జన్య రాగపద్ధతుల వివరించు గ్రంథము. ఇది సంగీత శాస్త్రజ్ఞులకు పాఠ్యమగు గ్రంథము. అతని గృహామాత్యుడు 'ఘనశ్యామ' పండితుడు భవభూతి యుత్తర రామచరిత్రమునకు 'ప్రజ్ఞాప్రతిష్ఠ' మను వ్యాఖ్యానమును రచించెను.9 ' ఇతడు 'కుమారవిజయ' మను మరియొక సంస్కృత కావ్యమును గూడ రచియించెను. ఈ ఘనశ్యామ పండితుని వ్యాఖ్యానము, కుమార విజయకావ్యము సంస్కృతభాషాభిజ్ఞుల మెప్పువడసినవి. ఇతని యాస్థాన


మలంకరించిన వారిలో సుందరి, కమల యను కవయిత్రులు ముఖ్యులు 10. వీరు సంస్కృతమున మంచి ప్రవేశమును సంపాదించి సంస్కృత వాఙ్మయము నందలి విద్ధసాలభంజిక యనునాటకమునకు వ్యాఖ్యానము రచించిరి.

తుళజ మహారాజు తెలుగున 'శివకామసుందరీ పరిణయ' మను నాటకమును రచించి ప్రదర్శింపించెను. ఈ నాటకము ఈ మహారాజు పాండితిని, గానకళాభిజ్ఞ తను వెల్లడి చేయుచున్నది.

ఏకోజీ (క్రీ.శ. 1735-1741)

ఇతడు తెలుగున రామాయణము సుందరకాండమును ద్విపదగా రచియించెను. విఘ్నేశ్వర కల్యాణమును గూడ నాటకముగా రచియించెను. ఏకోజీ ఈ గ్రంథమును రాజ్యమునకు వచ్చినవెనుక రచియించెనో, లేక తండ్రి జీవిత కాలముననే రచియించెనో నిర్ణయింపవలసియున్నది. అనేక పాపపరిహారార్థముగా సుందరకాండ పారాయణమొనర్చు నాచారముగా నున్నది. సంస్కృత సుందర కాండమును పారాయణ మొనర్పలేనివారలకు ఈ మహారాజు గానయోగ్యమగు నీ ద్విపద సుందరకాండమును రచియించి యండునని తలపవచ్చును. ఇతని జీవితకాలమున తల్లి రాజ్యమొనర్చు చున్నటుల తెలియుటచే, నీతడు రాజకుమారుడుగా నున్నట్లెంచవలయును.

శాహ మహారాజు (క్రీ.శ. 1741-49)

ఏకోజీ తరువాత నీతని కుమారుడగు శాహ మహారాజు క్రీ.శ. 1741 నుండి 1749 వరకు రాజ్యపాలన మొనర్చినవెనుక, అతని పదభ్రష్టుని గావించి యాతని సవతి తమ్ముడగు ప్రతాపసింహుడు రాజ్యమునకు వచ్చెను. ఈ శాహమహారాజు కాలమునగల వాఙ్మయ వికాసమును దెలిసికొనుటకేమియూ నాధారములు లేవు.

ప్రతాప సింహుడు (క్రీ.శ. 1749-64)

ఈ రాజన్యుడు విషయలోలుడై రాజ కార్యములందు మనస్సు పెట్టలేదు. కాని కవులను, ముఖ్యముగా కామకళ నెఱింగినవారలను పోషించినట్లు కన్పించును. ఇతని విషయలంపటతను సహింపజాలని 'వాంఛేశ్వరు' డను సంస్కృతకవి యన్యాపదేశముగ ‘మహిష శతకము' ను రచించి ఈ రాజన్యుని బుద్ధి మార్చుటకు బ్రయత్నించెను. వాంఛేశ్వరుడు రాజుగారి గృహామాత్యుడు, విద్వత్కవి. తెలుగున రాధికాసాంత్వనము

లేక ఇళాపరిణయమును రచించిన ముద్దుపళని ప్రతాపసింహుని యుంపుడుకత్తెయే.


ఈమె తండ్రి ముత్యాలు, తల్లి పోతి. ముద్దుపళని తన కావ్య గద్యమున "శృంగార రసప్రధాన సంగీత సాహిత్య భరత శాస్త్రాది విద్యాపారంగత తిరుమల తాతాచార్య పాదారవింద చోళ సింహాసనాధ్యక్ష ప్రతాపసింహ బహుకృతానేక చామీకరాంబరాభరణ” యని చెప్పుకొని యున్నది. సంగీత సాహిత్యములు, భరత శాస్త్రమున మంచి పాండిత్య ముండుటవలననే రాజు మనసును చూరగొనగలిగినది. చూరగొనినంతనే యూరకొనక శృంగార రసప్రధానునిగా నొనర్పగలిగినది. పళని గ్రంథమున సంస్కృతాంధ్ర సాహిత్య మున్నది. రాధికాసాంత్వనమును పళని రచియించెనా, లేక గురువగు వీర రాఘవ దేశికులు రచియించెనా యను సంశయము మొదట సి.పి. బ్రౌన్ దొరవారికి కలిగినది11. పళని మహారాష్ట్ర వనితగా కన్పించుట వలన నామె వ్రాసి యుండదని వారూహపడిరి. కాని పళని తల్లిదండ్రులను బట్టి చూచినచో నామె యాంధ్రదేశ స్త్రీగనే కన్పించుచున్నది. ఆంధ్రమున కొంత భాగమును, సంస్కృత పదభూయిష్ఠముగా కొంత భాగమును రచియించి యుండుటచే సంస్కృతమున్న భాగము వీర రాఘవాచార్యులు వ్రాసెననియు, తెలుగు భాగము పళని వ్రాసి యుండుననియు దొరవారను కొనుటలో తప్పున్నట్లు కన్పింపదు. అట్లు సమర్థించుటయే సమంజసమని నా యభిప్రాయము.

పళని రాధికాసాంత్వనము సంభోగ శృంగారరస ప్రధానము. ఇందు పళని స్త్రీజన స్వాభావికమగు సిగ్గును విడనాడి శృంగారమును పచ్చిపచ్చిగా వర్ణించినది. ప్రబంధకవులును సంభోగశృంగారమును విరివిగానే వర్ణించిరి గాని దానిని శైలీకాఠిన్యము వలననో, వ్యంగ్య ప్రాధాన్యమువలననో కప్పిపుచ్చుచువచ్చిరి. 'ఈ కావ్యము మృదు పదభూయిష్ఠమై సరసంపుపల్కుల కాకరమై యున్నను, (గ్రంథకర్త్రి ) కథాంతమువరకును ఆలుమగలాటను వర్ణించుట, వివిధ గతుల విస్తరించుట మొదలగు శృంగార వర్ణనలయందే తన నెఱజాణ తనమును గనబఱచెను. ఆమె కావ్యలక్షణము లను లక్ష్యము జేయక కొంకు కొసరు లేక రసంపుబెంపును సొంపుగా గూర్పదలచి కృతిని బూతులబుంగను జేసె'నన్న సర్వసామాన్య విమర్శనమునకు గురియైనది. గాని ఈమె ఏ గౌరవ పాత్రమైన గ్రంథమును రచించెనన్న మన్నన వడసినది లేదు. కవనము రసవంతమైనది. సజాతీయము. స్త్రీ హస్తము మాత్రము కవనమున కన్పించును. శృంగార రసవర్ణనలందు తిమ్మన పెద్దనల శృంగారపు బోలికలు, పోకడలు కలవు. పళనికి సంగీత ప్రావీణ్యము కలదన్నమాట యొప్పుకొనక తప్పదు. పళని రాధికాసాంత్వనమను గ్రంథముగాక సప్తపదులు కొన్ని రచించినది. (?)12 ఇవి

యరవభాషయందు గోదావరనామము ధరించిన చూడికొడుత్తనాచ్చియారు


రచించినట్లుగా వాడబడుచున్న తిరుప్పా వనుపాటకు తెలుగు సేత. ఇందు పదిపాటలు మాత్రము యున్నవి. కాని యరవమునందు (?) ఇరువదిపాటలు కన్పించుచున్నవి. ప్రతాపసింహుని కోరికపై నెల్లూరి శివరామకవి కామకళానిధియను రతిశాస్త్రమును రచించి మహారాజున కంకితమిచ్చెను.

కామకళకే ప్రాధాన్యమిచ్చిన యీ రాజన్యుని పరిపాలనమున కవులనేకులు రాజాదరణ లేకపోయినను గ్రంథములు రచించిరి. అట్టివారిలో పేర్కొనదగినవాడు రాఘవాచార్యులు. ఇతడు ముద్దుపళని గురువు. ఇతడు నలచరిత్ర, విష్ణుభక్త చరిత్ర అను రెండు ద్విపద గ్రంథములు రచించెను. ఇతడు వైష్ణవుడు. పండిత వంశజుడు. తండ్రితాతలు పండితులై సంగీతాది కళలయందనవద్యులై మెలగిరని చెప్పుకొనెను. ఇతని ఇంటిపేరు చక్రపురివారు. రాఘవాచార్యులు తన తాత 'చక్రపురి విహారుం' డని చెప్పియున్నాడు. ఈ చక్ర పురము ప్రస్తుతము చక్రపల్లియని పిలువబడుచున్నది. తంజావూరు జిల్లా పాపనాశనము తాలూకానందున్నది. ఈ గ్రామము నందు చక్రపల్లి వారనేకులున్నారు. వీరి కులగురువులుగా ప్రస్తుతమును కందాళవారే యున్నారు. ఇచ్చటి చక్రపురివారు రాఘవాచార్య దేశికకవి తమవంశము వాడనియు, తమ వంశము పండిత వంశమనియు సగర్వముగా చెప్పుకొనుచున్నారు. వావిళ్ల వారచ్చు వేయించిన రాఘవాచార్యుని 'నలచరిత్ర' మను గ్రంథమునకు కడప వాస్తవ్యులగు బ్రహ్మశ్రీ జనమంచి శేషాద్రిశర్మగా రుపోద్ఘాతమును రచించిరి. అందు బ్రహ్మశ్రీ శర్మగారు 'ఇతడు దత్తమండలమున ప్రచారమునందున్న మాటలను వాడుట వలనను, ఇతని ఇంటిపేరు గలవారును, ఇతని గురువంశజులును బెక్కు రుండుట చేతను నీ మహాకవి దత్తమండలవాసి యని యే బుధుండైనను దప్పక యొప్పుకొను' నని వ్రాసి యున్నారు. కాని ఇతని వంశజులు 'చక్రపురము' నందున్నారని రాఘవాచార్యులు పేర్కొనుట వలనను, ఇతని వంశజులు దత్త మండలమునకన్న తంజావూరు జిల్లా పాపనాశనము తాలూకాయందు హెచ్చుగ కన్పించుటవలనను, అదియునుగాక రాఘవాచార్యులు 'మా యూరివాడు', 'మా వంశములోని వా' డని సగర్వముగా చక్రపల్లిలోని చక్రపురివారు పేర్కొనుటవలనను' నే నీతని నివాస స్థానము తంజాపుర మండలముగాని, దత్త మండలము కాజాలదని తలచుచున్నాను. బ్రహ్మశ్రీ శర్మగారు చూపిన యాధారములలో చక్రపురి గురువులను గూర్చి ముచ్చటింప దగియున్నది. కాని కవి గురువంశమును బట్టి కవి దేశమును నిర్ణయింప జాలము. అదియును గాక కందాళ వారు రామేశ్వరము మొదలుకొని గోదావరి వరకు గల

దేశములో ననేక వైష్ణవ కుటుంబములకు గురువులుగా కన్పించు చున్నారు. తాళ్ళపాక


వారును అట్టివారే. కాబట్టి కందాళ వారిని బట్టి రాఘవాచార్యుని నివాసస్థానమును మనము నిర్ణయింపజాలము. బ్రహ్మశ్రీ శర్మగారు రాఘవాచార్యులు నలచరిత్రమున దత్తమండలపు మాండలిక పదముల నుపయోగించి యున్నాడని వ్రాసిరి. కాని నలచరిత్రమునందు గాని, విష్ణు భక్త చరిత్రమునందుగాని దత్తమండలములోని ప్రత్యేక పదములున్నట్లు కనుపింపవు. అట్టి మాటలన్నియు పూర్వ కవులు ప్రయోగించినవే. అదియును గాక రాఘవాచార్యుడు తన నలచరిత్రమున కందాళ దొడ్డయాచార్యుని ప్రస్తుతించెను. ఈ దొడ్డయాచార్యుని ప్రస్తుతించిన కవులందఱును తమిళ దేశమునందలి యాంధ్రకవులే గాని, యాంధ్ర దేశమునందలి యాంధ్రకవులుగా కన్పింపరు. కాబట్టి రాఘవాచార్యుని నివాసస్థానము తంజావూరు పాపనాశనము తాలూకా యని తేట తెల్లమయినది. రాఘవాచార్యుడు బాల్యము నంతయు తన జన్మస్థానమగు చక్రపురమునందే గడపి తరువాతి కాలమున తంజాపూరమును ప్రవేశించి తన పాండితీప్రకర్ష వలనను, సంగీత శాస్త్రజ్ఞానము వలనను ముద్దుపళనిని శిష్యురాలిగా బడయగలిగెను. ముద్దుపళని రాధికాసాంత్వనము నందలి సంస్కృతపద బాహుళ్య మంతయు రాఘవాచార్యుని సహాయమూలకమే. ఇతనికి ద్విపద కవిత్వమన్న నల్లేరుపై బండి. తిరుపతి ప్రాంతమువాడగుటవలన తాళ్ళపాకవారి అష్టమహిషీ కల్యాణము నందలి పదములనేకము లీతని విష్ణుభక్త చరిత్రమున13 గన్పట్టుచున్నవి. ఇతని కవిత్వము నిర్దుష్టము; అలంకార యుతము. కొద్దిపాటి దోషములున్నను త్రోసి వేయదగినవి. ఇతడు తన ద్విపద కావ్యములను కవిపామర జనవేద్యములుగా నొనర్చెను. పాల్కురికి సోమనాథ, రంగనాథాదు లెట్లు 'ద్విపద కావ్యంబు ముదికాంత దిడ్డికంత' యను నైచ్యభావమును బోగొట్టి కీర్తిపాత్రులైరో, యితడు నట్లే తన కావ్యమును నవరసభరితముగ, ప్రబంధ లక్షణములకు లోటు లేకుండ నన్ని వర్ణనల జక్కగ జేసి, మృదు మధురములగు పదములతో ద్రాక్షాపాకంబున రచించెను. ఇతడు తన నలచరిత్రమున పరదారాసక్తివలన గలుగు నష్టములు, వ్యసనాభిలాషవలన గలుగు కీడులు, బాతివ్రత్యము మొదలగు విషయములను జక్కగ పామరజన వేద్యములుగా రచియించెను.

తుళజ మహారాజు (క్రీ.శ. 1765-87)

ఇతని రాజ్యకాలమున సంస్కృతమున 'రామచంద్రశేఖర కవి' యనునతడు 'కళావతీనందక' మను కావ్యమును రచించెను. తుళజ మహారాజు సాహిత్యవేత్తగా

కన్పించుచున్నాడు. ఆంధ్ర వాఙ్మయమునందీతని కాలమున ముఖ్యముగా పేర్కొనదగిన


కవులిరువురే కన్పట్టుచున్నారు. అందు 'ఆంధ్ర కాళిదాసు', 'అభినవ కాళిదాసు' అను బిరుదులు పొందిన ఆలూరి కుప్పన కవి యొకడు. ఇతడు తన కాంధ్ర కాళిదాస బిరుదమును తుళజ మహారాజిచ్చినట్లుగా చెప్పుకొని యున్నాడు.14 ఇతడు బహుకావ్యకర్త. కాని యితని ఆచార్య విజయ, పార్థసారథి విజయములు15 తప్ప మిగిలిన కావ్యములను జూచు భాగ్య మటాంధ్ర సారస్వతవేత్తలకు లభింపలేదు. ఇత డాచార్య విజయమున తాను రచించిన యితర గ్రంథములను గూర్చి క్రిందివిధముగా చెప్పుకొనియున్నాడు :

     సీ. లీల పంచనదస్థలీపురాణము తెని
                   గించితి నారూఢి కవిత మెరయం
         బరగు రామాయణ భాగవతంబులు,
                   యక్షగానము జేసి తద్భుతముగ
         గరమొప్ప పరమభాగవత చరిత్రయు
                   కృతియొనర్చితిని యున్నతిదలిర్పఁ
         దెలివొందు నిందుమతీ పరిణయనామ
                   కృతి విరచించితి నతులగరిమ

     గీ. (?) గురుతరోజ్జ్వలసరణి హరి క,
         థాసుధాభిధకావ్య ముదారఫణితి
         గా రచించితి నెనలేని గద్యపద్య
         తతులు, లెక్కింప దఱమె తత్కృతులు జగతి.

ఈతని కావ్యములవలెనే యీ నాయకుల పరిపాలనమున రచియింపబడిన గ్రంథములు అనేకము లింతవరకును దృష్టిపథగోచరము కాకున్నవి. ఆలూరి కుప్పన కర్తృత్వమున 'పార్థసారథి విజయ’మను నొక తాళపత్రగ్రంథము మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమునందున్నది. కుప్పనకవి యాచార్యవిజయమున 'అనంతానందగిరి గురురచనా విశదంబు చేయంబూని' యని చెప్పియున్నాడు. ఇందు పేర్కొనబడిన అనంతగిరి సంస్కృత శంకరవిజయ కర్త కావలయును. ఈ సంస్కృత శంకరవిజయము కొలది కాలము క్రిందట ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారిచే సంపాదింపబడినట్లు దెలియుచున్నది.16 ఈ శంకరాచార్య విజయమును కవి చెన్నపురి ప్రజల కోరికపై రచియింతినని చెప్పుకొని యున్నాడు. ఇతని కవనము ప్రబంధ

కవుల కవితాధోరణి గల్గి రసవంతమై యున్నది.


ఇక రెండవ కవివర్యుడు 'కస్తూరి రంగకవి' ఆలూరి కుప్పనకవి తన గద్యమున 'కస్తూరి రంగ సద్గురు పాదారవింద భజనానందిత హృద్విలాస' యని చెప్పుకొనుటచే నితడతని శిష్యుడని వెల్లడియగుచున్నది. ఇతడు గొప్ప లక్షణ కవి. సర్వస్వతంత్రుడు. కుప్పనకవి రంగకవిని ప్రస్తుతించుచు,

     సీ. భారతి కేవిప్రవర్యునిజిహ్వ ని
                 త్యముగ వసించు నాస్థానవాటి
         వాణీవధూటి కెవ్వాని నున్బలుకులు
                 ధరియించునట్టి ముత్యములచాలు
         శారద కేసుధీస్వామిచేతోవీథి
                 యమరిన రత్న సింహాసనంబు
         పలుకుల వెలది కేభావజ్ఞుని గృహంబు
                 నెట్టుగా వసియించు పుట్టినిల్లు

     గీ. నలువ చెలువకు నెవ్వ డెన్న దగు పుత్రు
        డట్టి కస్తూరి రంగారు నచలధైర్యు
        నార్యమతచర్యు మద్గురువర్యు నెంచి
        ప్రణుతిగావింతు పలుమారు ప్రస్తుతింతు.

అని చెప్పియున్నాడు. రంగకవి గొప్ప లక్షణవేత్త. రంగకవి తన యానంద రంగరాట్ఛందము పీఠికలో 'జతుర్విధాంధ్ర కవితాసలక్షణ గ్రంథశోధన ధీసంయుతుడు ననియు, 'భావగర్భ పదపద్యాళి ప్రబంధానుబంధుడ' ననియు చెప్పుకొని యున్నాడు. ఇతడు లక్షణ చూడామణియను నామాంతరముగల 'ఆనందరంగరాట్ఛందమును, 'కృష్ణార్జునసంవాద' మను నైదాశ్వాసముల రసవత్కావ్యమును రచించెను. ఆ కాలమున పాండిత్యమున కస్తూరి రంగకవిని మించినవాడు లేడు. రంగకవి ఆనంద రంగరాట్ఛందమును ఫ్రెంచి గవర్నరగు డూప్లేకు ద్విభాషి (Translator) గా నుండి పుదుచ్చేరియందు నివాస మేర్పరచు కొనిన యానందరంగపిళ్లై కంకితమిచ్చెను17 . ఇతడు తన ఛందోగ్రంథము నందనేక కవులను, వారి ప్రయోగములను బేర్కొని యున్నాడు. ఇతడు సాంబనిఘంటువని పేరు వడసిన శబ్దకోశము నొకదానిని రచించెను. ఇది తాళ్లపాక వారి వేంకటేశ్వరాంధ్రము ననుకరించినట్లు కన్పించును. ఆయా పదముల కా నిఘంటువునందుగల పర్యాయ పదములనట్లే దీనియందు

నుంచెను. కాని వేంకటేశ్వరాంధ్రము కన్న రంగకవి సాంబనిఘంటువు కొంత


విపులముగాను, మరికొంత ప్రౌఢముగాను, మిగులు సలక్షణముగాను చూపట్టుచున్నది. ఇందు ప్రయోగసిద్ధములు గాక వ్యవహారైక శరణ్యములగు పెక్కు శబ్దములు కన్పించుచున్నవి. కస్తూరి రంగ కవితా 'నుమామహేశ్వర కరుణాకటాక్షలబ్ధ సాహితీవిభవుడ' నని చెప్పుకొని యున్నాడు. ఇతడు వెంకట కృష్ణార్యుని పుత్రుడు శ్రీ వత్సగోత్రుడు ఆర్వేల కమ్మనియోగి.

అమరసింహుడు (క్రీ.శ. 1788-98)

ఇతని కాలమున మాతృభూతుడను తెలుగు కవి పారిజాతాపహరణమను నాటకమును రచించెను. ఇతడు శాండిల్య గోత్రజుడు. ఈ నాటకమున కవి తన్ను గూర్చి 'మాతృభూత స్వామి మహిత కటాక్ష చాతుర్య పరిలబ్ధ సరస సాహిత్య, సంగీత మధుర వాగ్ఝరి గల్గువాడ, శృంగారరసము తెలిసిన మేలువాడ' నని వ్రాసి కొని యున్నాడు. గద్యయందు 'సుధాసార సంజనిత చతుర్విధ కవితానిర్వాహకుడ' నని చెప్పుకొనినాడు. ఇతడు తన నాటకమును ప్రబంధ ధోరణిని గానయోగ్యముగా నొనర్చెను. మాతృభూతకవి తండ్రి పేరు రంగకవి. ఇతడే గ్రంథములు వ్రాసెనో యెఱుక పడకున్నది. ఇతడు కస్తూరి రంగకవి మాత్రము కాడు. వారి గోత్రమును, వీరి గోత్రమును భేదించినవి.

శరభోజీ (క్రీ.శ. 1798-1832)

ఇతని కాలమున కవుల పోషణ మెట్లుండెనో తెలియరాదు. కాని తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయమును చక్కబరచి తాళపత్ర గ్రంథములకు ననేక ప్రతుల వ్రాయించి భద్రపరపించెను. ఇతడు తాళపత్ర గ్రంథములను తిరుగ వ్రాయించి భద్రపరపించుటకు గాను వరాహప్పయ్య దీక్షితులను ఫౌజుదారును నియమించెను18. ఇతడు వేగినాటి బ్రాహ్మణుడు. అందువలననే శరభోజీ పేరుననే తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయము పేర్కొనబడుచున్నది.

శివాజీ (క్రీ.శ. 1833-35)

ఈ రాజన్యుడు తెలుగున 'అన్న పూర్ణాపరిణయ' మను నాటకమును రచించెను. దానిని 'సకల విద్యాప్రవీణులైన సభ్యులు గల నాటకశాలలందు నటియింప జేయదలపెట్టితి’నని గ్రంథావతారికలో జెప్పుకొని యున్నాడు. ఇందు తంజా పురమునందలి కొంకణేశ్వర అన్నపూర్ణల వివాహోదంతము సొగసుగా వర్ణింపబడినది.

ఇతని యాస్థానకవి వెంకట కృష్ణయ్య. ఇతడు శివపారిజాతమను నాటకము నొకదానిని


రచించెను. అందలి గద్యలో 'శ్రీ శివాజీ మహీపాలుని తెలుఁగుకవి వెంకట కృష్ణాజెట్టి' యని వ్రాసుకొని యుండుటవలన, శివాజీ కొంతమంది సంస్కృత కవులను గూడ పోషించినట్లు ద్యోతకమగుచున్నది.

ఈ మహారాష్ట్ర నాయకుల పరిపాలనకాలమున సేనాపతులనేకులు వాఙ్మయాభిలాషులై వర్తించిరి. అట్టివారిలో ఖండోజీ యొకడు. ఇతడే మహారాష్ట్ర నాయకుని సేనాపతియో ప్రత్యేకముగా తెలియదు. ఇతడు కలిగిరి యను కవిని పోషించి రుక్మాంగద చరిత్రమను నేకాదశీ మాహాత్మ్యమును తెనుగున ద్విపదకావ్యముగ రచియింపజేసెను. ఈ కలిగిరి వెనుక శాహజీ కాలమున చెప్పబడిన శ్రీగిరికవి వంశజుడు.

మహారాష్ట్ర నాయకుల కాలమున వెలసిన ఆంధ్రవాఙ్మయమును సింహావలోకన మొనర్చినచో, వీరి కాలమున 'నాటక వాఙ్మయము' హెచ్చుగా నభివృద్ధి జెందినటుల కన్పించును. ఈ నాటకములు సంస్కృత వాఙ్మయము నందలి నాటకములతో నెట్టి సంబంధమును లేక సర్వస్వతంత్రములైనవి. 'ప్రతిభ' శిశిరసంచికలో శ్రీయుత చింతా దీక్షితులుగారు యక్షగానము లను శీర్షిక క్రింద ఆంధ్రనాటకముల యభివృద్ధిని గూర్చి విపులముగా చర్చించి యున్నారు. ఆంగ్ల నాటకములు గ్రీకు నాటక సంపర్కము లేకుండా సర్వస్వతంత్రముగా ఒపేరాల (Operas) నుండి పుట్టినట్లుగా నాంధ్ర నాటకములు తోలుబొమ్మలాట నుండి పుట్టినవి.

మహారాష్ట్రు లన్యదేశీయులైనను ఆంధ్రభాషను గౌరవించి పోషించిరన్నచో తెలుగుభాష తేనెతెరలవంటి దగుటయే గాక, దానికి గల శ్రవణపేయమగు శబ్దమాధుర్యము (Euphony) ఏ యితర దాక్షిణాత్య భాషలకు లేకపోవుటయే ముఖ్యకారణము. కావుననే కర్ణాటాధిపతియగు కృష్ణరాయలు 'దేశ భాషలందు తెలుగు లెస్స' యని పొగడియున్నాడు.

చ. జనని సమస్తభాషలకు సంస్కృతభాష ధరాతలంబునన్
     ఘనలలితార్థ గౌరవిభాసి తెనుం గభిరమ్యమంతకున్
     గనుగొనఁ జాతబీజమున కంటెను గోమలపత్త్రపుష్ప శో
     భనమృదుపల్లవాభినవ బాలరసాలము సొంపు నింపదే !

(శ్రీ పర్వత పురాణకర్త)


- ఆంధ్రపత్రిక బహుధాన్య సంవత్సరాది సంచిక

అధస్సూచికలు

1. J.A.H.R.S, Vol. ii, page. 173

2. మార్తాండకుల శాహమహీపాలుసభను కీర్తికెక్కినవాడు గిరిరాజసుకవి సంగీతకళా రహస్యము గన్నవాడు వెంగనార్యుండు వివేకధనుండు (Saraswati Mahal Telugu Manuscripts catalogue : Page, no. 124)

3. అనఘసన్నుతికి శాహావనీపతికి నింబాజి వ్రాయించె నిఖిలార్థవితతి కంభోధియగు చుండు నట్టి భారతము నిటలాక్షపదపద్మ నిహిత ప్రసన్న పటుచిత్తుడైన కుప్పయమంత్రిచేత.

4. తంజాపూరు సరస్వతీ మహల్ గ్రంథాలయ పట్టికయందు లేని గ్రంథములకు మాత్రమే యిచట నాధారములు చూపబడును. మిగిలిన గ్రంథము లా పట్టికలోనివే.

5. కొరవంజి శబ్దము దేశ్యము ఎఱుక వాడు, ఎఱుకది, సోదియని యర్థము. ఈ కవితావిభాగము (Poetic form) నకు ముఖ్య లక్షణము నాయికావిరహము, ఎఱుకది సోది జెప్పుట, తరువాత నాయికానాయకుల వివాహము. ఇందు కవి ప్రాచీనాంగ్ల నాటకములందలి ప్రస్తావన (Prologue) వలె కథావస్తువును దిజ్మాత్రముగా మొదట సూచించును. ఉదా : శ్రీ సుతుతుల్యుడై చెలువొందునట్టి భోసల కుల శాహభూపాలు మీద చెన్నుగా మోహితచిత్తయై రాజకన్నెకామణి సరికాంతలు గొలువ గరిమతోడుత మును కదలి వచ్చుటయు నెఱుకత వచ్చి తా నెఱుక జెప్పుటయు గురుతుగా శాహేంద్రుగూడి యుండుటయు అనియెడి రాజమోహన కొరవంజి

6. J.A.H.R.S., Vol, ii, 173.

7. ‘నౌకా చరిత్రము' - వేంకటేశ్వర ప్రెస్ మద్రాసు (1907)

8. Andhra Patrika, 22nd May 1937

9. See the famous introduction of Kane to Uttararamacharitra.

10. Quarterly Journal of the Mythic Society, July - October, 1935

11. "An amatory poem written by Palani...... It does not seem probable that the lady herself composed the whole poem, parts of which display much learning. Her name and the other names she introduces as her relations appear to be Maharatta, utterly different from Telugu appellations. Her tutor Vira Raghavachari probably assisted her, but the composition in other parts evinces a female hand and it may be observed that she uses only the changing meteres, those being the easiest and loosest rhymes such as, అఖండయతి and బయోర భేదయతి" etc.

C.P.Brown's Note on Radhika Santwana. - (Madras Oriental Mansucripts Library Catalogue, Vol II, part II, page 933

12. Madras Oriental Manuscrtipts Library Catalogue, Part II, pg 933 Part. III, No 221 (c)

13. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక, సం. 4, పుట. 30 చెన్నపురి ప్రాచ్య పుస్తక భాండాగారము, నం ॥

14. ఘనుఁడగు తుళజేంద్రుఁడు దయతనరగ నీ కాంధ్రకాళిదాసాభిధ మన్ననగా నొసంగెనట నీ యనుపమసాహిత్యమున కహా యెన గలదే? - (ఆంధ్రకవుల చరిత్ర, మూడవ భాగము. పేజి, 121)

15. Madras Oriental Library Catalogue, Vol. II, pt. ii. Page, 684.

16. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక, Vol. III, P, 20

17. చూడుడు : ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక, సం, VIII “ఆనందరంగపిళ్లై”

18. J.A.H.R.S, Vol. II, pts, 3 & 4, p. 173.