వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సాహిత్య విమర్శ/గేయరచనలు : ప్రాచీనులు-ఆధునికులు

గేయరచనలు : ప్రాచీనులు - ఆధునికులు నారాయణ భగవంతమ్ శివ నారాయణ భగవంతమ్ గోసాయిలు మాట గొడ్డటి దెబ్బ సాదుల మాట సర్పము కాటు నారాయణ భగవంతమ్ శివ నారాయణ భగవంతమ్ భిక్షుక గీతం ఏది విన్నా, నాలుగేళ్ళనాడు నాగవరంలో నిద్ర లేచేటప్పటికి తన చేతులలో ఉన్న తాంబూరా మీటుతూ ధ్రువాగీతిలో బావాజీ పాడిన ఈ పాట మనస్సులో ప్రత్యక్షమవటం పరిపాటి ఐపోయింది. అంతకుముందు పాటలు, పదాలు విన్నాను. కానీ, నాకు ఆనాటినుంచే గేయసారస్వతం మీద గౌరవం, ఆదరాభిమానాలు, కృషిచేతామన్న అభిలాష పొడచూపినవి. ఏ సాహిత్యంలోనైనా శ్రోతను గాని, పరితనుగాని రస ప్రపంచయాత్ర చేయగలిగించేవి గేయరచనలే. రసికులను రంజింపజేయటానికి రమ్యమైన పదరచన ఉపయోగించినట్లు రసవంతమైనా పద్యం ఉపకరించదు. అవి లయ తాళబద్ధాలుగా ఉండి గానకళతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటమే దీనికి ప్రబల కారణము. ఒక దేశంలోని మత విపరిణామాలను, మనస్తత్వాలను, ఆచార వ్యవహారాలను, అన్యోన్య అనురాగాలను, సౌందర్య సౌభాగ్యాలను ప్రతిబింబిస్తూ దేశ జాతీయ దర్పణాలుగా ప్రవర్తిల్లడమే వీటిలో ఉన్న ఉత్కృష్టత. పరదేశీయ సాహిత్య ప్రభావం వల్ల, పాండితీ ప్రకర్షభిలాష వల్ల, ప్రౌథోక్తులవల్ల, పద్యసారస్వతము దేశీయతను, జాతీయతను విరివిగా వెల్లడించలేదు. ఆంధ్రభాషలో ఏదైనా వ్యక్తిత్వము, జాతీయత 470 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 కలిగిన రసవంతమైన కవిత ఉన్నదా అంటే అది పద వాఙ్మయములోనే ఉన్నదని నా అభిప్రాయము.

శ్రీనాథునికి అంటగట్టబడ్డ అపవాదాన్ని ఆధారం చేసుకొని ప్రతివ్యక్తీ పదకర్తలను, కృతులను నిందించటానికి సాహసిస్తారు. విదేశీయ సాహితిలో అభివృద్ధి నొందినట్లు పదవాఙ్మయం అందువల్లనే మన సాహిత్యంలో ప్రవర్ధమానం కాలేదు. ఉన్నదాని మీద ఆదరము శూన్యముగా ఉన్నది. సంస్కృత భాషలో కృష్ణకర్ణామృతము, భజగోవింద శ్లోకాలు, అష్టపదులు అనుభవించే ఆదర్శపూజ్యత ఆంధ్రంలో ఒక గేయకృతికైనా లేదు. వంగభాషలో చండీదాసు, విద్యాపతి, రామమణి, గోవిందదాసు మొదలైన పదకర్తలను మహాకవులుగా పరిగణిస్తారు. హిందీ భాషలోని నూరు పదావళీ కబీరు కీర్తనలకు ఆదర్శపూజ్యత. తుకారాం, మీరాబాయి మొదలైన కృతికర్తల మహారాష్ట్ర అభంగాదులకు అత్యంత ప్రతిష్ఠ. ప్రపంచ విఖ్యాతిని చూరగొన్న రవీంద్రుని రచనలలో ముప్పాతికవంతు పదాలే.

సంతోషం కలిగినప్పుడు ప్రథమ మానవుడు చిందులు వేస్తూ కూనరాగా లాపనముతో సామాన్య పదకవిత్వము ప్రారంభిస్తాడు గాని, సంస్కృతపదభూయిష్ఠమైన పద్యకవిత్వం మొదలు పెట్టడు. అందువల్లనే సాహిత్యవేత్తలు పద్యంకన్నా పదమే మొదట ఏ సారస్వతంలోనైనా ఉద్భవిస్తుందనటంలో ఏకీభవించారు. అదే విధిగా మన భాషలోనూ ప్రథమంలో పదసాహిత్యము జన్మించి ఉంటుంది. ఆదిగ్రంథమైన భారతానికి పూర్వం పుట్టిన గేయకృతులన్నీ, పాండితీప్రభ సాగే రోజులో రూపుమాసి పోతూ జనసామాన్య గౌరవం పొందుతూ, భిక్షుక గీతాల్లోను, భక్తుల గేయాల్లోను, స్త్రీల సారస్వతములోను, సాములయ్యల గరిడీలలోను, తమ ప్రాణము నిలుపుకొంటూ వచ్చినవి. కాని పదఛందస్సులైన 'తరువోజ', 'మధ్యాక్కరలు' ప్రథమ కావ్యంతో పరిచయము కలిగించుకోగలిగినవి.

ఒక శతాబ్ద కాలము మళ్ళా పదవాఙ్మయ చరిత్ర అజ్ఞాతంగా ఉన్నది. ఇంతలో వీర శైవమత విజృంభణము దక్షిణాపథాన్నంతా కలవరపరచినది. దాక్షిణాత్య భాష లన్నిటిలోను ముఖ్యంగా కన్నడ, తెలుగు సారస్వతాలలో దేశీయ కవిత్వము మొదలు పెడుతుంది. మత ప్రాబల్యానికి సామాన్య భాషలో గ్రంథరచనము అవసరమని ఆ నాటి మత ప్రవక్తలు గుర్తించారు, ఈ మత ప్రాబల్య ఫలితాలే పాల్కుర్కి సోమనాథుని 'పండితారాధ్య చరిత్ర', 'బసవపురాణ' ద్విపదలు. ఈ శతాబ్దిలో పదవాఙ్మయము పండిత పామర జనానుమోదమైన పలుకుబడి సంపాదించుకున్నది. అందువల్లనే ఈ కాలంలో పద్యకవిత్వము కనిపించటం లేదు. సోమనకు పూర్వమున్న గేయ కవితాస్వరూపము మనకు బసవపురాణములోని - 'కర మర్థి నూరూర సిరియాళ చరిత పాటలుగా గట్టి పాడెడువారు అటుగాక సాంగభాషాంగ క్రియాంగ పటునాటకంబులు నటియించువారు' అనీ, పండితారాధ్య చరిత్రలోని శ్రీశైల వర్ణన సందర్భములో - 'మది నుబ్బి సంసార మాయాస్తవంబు పదములు, పర్వతపదము లానంద పదములు, శంకర పదముల్ నివాళి పదములు, వాలేశుపదములు, గొబ్బి పదములు, వెన్నెల పదములు, సెజ్జ వర్ణన మణిగణ వర్ణన పదము లర్ణవ ఘోషణ ఘూర్ణిల్లుచుండ' భక్తులు శ్రీశైల పర్వతారోహణ చేశారని చెప్పే రెండు ద్విపదలవల్లా తెలుస్తుంది. తెలుగులో దేశీయ నాటకములు కూడా ఈ రోజులలోనే సదస్సును సంతోషపరచి ఉంటవి. పదకవితల ప్రభావము తరువాత కవులమీద చాలమట్టుకు కనిపిస్తుంది. మొదట సంప్రదాయాలు కాని ఛందస్సులను - రగడలు, షట్పదులు, చౌపదులు, ద్విపదలు, పురాణ ప్రబంధ కవులు ఆమోదించి కృతియోగ్యాలుగా స్వీకరించారు. జాను తెనుగు ప్రభావ ప్రవాహానికి ఎదురీదటానికి నన్నెచోడ తిక్కనలు గూడా సాహసించలేదు. - వీరశైవ మత విజృంభణము నెమ్మదిగా వెనుకదారిపట్టి, హరిహరనాథాత్మకమైన అద్వైత సిద్ధాంతము మీదికి దేశంలో అభిమానం ప్రబలింది కొంతకాలానికి. అప్పుడు నాచన సోముడు ఉత్తర హరివంశమే కాకుండా, 'వసంత విలాసమనే గోష్ఠీ విషయక ఏకాశ్వాస ప్రబంధము రచన చేశాడు. తెలుగు తోటలో ఉపలబ్ధ మౌతూ ఉన్న ప్రథమ గేయసుమము మనకు ఆ కావ్యంలో కనిపిస్తుంది. అది 472 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 'వీణాగానం వెన్నెలతేట రాణమీరగా రమణుల పాట పేరుచెప్పిన పినబ్రాహ్మణు వీట జాణలు మెత్తురు జాజరపాట' అనేది. జాజర అనేది ఏదైనా వాద్యవిశేషమా? లేక పదభేదమా? కవిసార్వభౌముడు శ్రీనాథుని జీవితకాలానికి పదఛందస్సులను కావ్యార్హత ప్రస్పుటమైనది. ద్విపదలో సోమన రచనలు అంతకుపూర్వమే ఉన్నా, అవి మతవిషయిక పురాణాలు కాని రసవత్కావ్యాలు కావు. ఈ యుగంలోనే శ్రీనాథుని పల్నాటి వీరచరిత్ర, గౌరన హరిశ్చంద్రోపాఖ్యానము, నవనాథ చరిత్ర ద్విపదలు. శ్రీనాథుడు పదకవిత్వాన్ని 'ముదివిటులు వెధవలంజలు పదకవితలు (?) మాఱు బాపన వార ల్చదువని పండితవర్యులు కదనాస్థిర వీరవరులు కడిదిపురమునన్" అనే పద్యంలో పలుచగా చూచాడని అంటారు. హాస్యరస ప్రధానమైన మోటు చమత్కారాలు. మొరటుతిట్లు నెత్తిన వేయించుకోవటానికి తెలుగు సారస్వతంలో తెనాలి రామలింగడు, శ్రీనాథుడు, ఏ అన్నెం పున్నెం ఎరక్కపోయినా, అసభ్య రసిక లోకానికి చిక్కుతారు.అతడు గేయరచనలు నిజంగా నిరసించినట్లైతే ఆ దేశీయ ఛందస్సులో పల్నాటి వీరచరిత్రను ఎందుకు వ్రాస్తాడు? శ్రీనాథునికి పదకవితలంటే ఎంతో ఇష్టం అనటానికి ప్రబలప్రమాణాలు ఇంకా ఉన్నాయి. భీమఖండంలో దక్షారామాన్ని వర్ణిస్తూ 'కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి' అని జనసామాన్య గేయ ప్రబంధాకృతిని ఉల్లేఖిస్తాడు. ఇతని పోషకులైన రెడ్డి రాజన్యులకు మహేశ్వరునికి వసంతాభిషేకము చేయటము అలవాటు. ఆ సమయంలో స్త్రీలు వల్లకి, చక్కి, కాహళము, వంశము, డక్క, హుడుక్కు, ఝల్లరి మొదలైన వాద్యవిశేషాలతో పదాలు పాడుతూ నర్తనం చేసేవారని భీమఖండంలోనే - సాహిత్య విమర్శ 473 'వల్లకి చక్కి కాహళము వంశము డక్క హుడుక్కు ఝఝురుల్ ఝల్లరి యాదిగా గలుగు శబ్దపరంపర తాళశబ్దమై యుల్లసిలం బ్రబంధముల నొప్పుగ నాడుదు రుగ్రవేది పైఁ బల్లవపాణు లీశ్వరుని పంటమహీశులు పూజసేయగన్' అని వర్ణిస్తాడు. అటువంటి శ్రీనాథుడేమిటి, పదసారస్వతాన్ని పరిహసించటము ఏమిటి? దిగ్విజయార్థము బయలు దేరుదామనుకున్న కృష్ణరాయలకు అపరిమితోత్తేజము కలిగించిన ఆ నాటి జానపదుని కొండవీడు మనదేరా! కొండపల్లి మనదేరా! కాదను వాడుంటే కటకం దాకా మనదేరా! అనే గేయం ఆంధ్రలోకానికి అపరిచితం కాదు. ప్రబంధ యుగంలో ప్రత్యేక గేయరచనలు వెనుకపడ్డా, పుష్పాపచయాలలో పద ఛందస్సులు కనిపిస్తున్నాయి. ప్రబంధ నాయికలకు పదసారస్వత మంటే పరమానందము కూడాను. నాయకరాజుల పరిపాలనకాలంలో మళ్ళా పదకర్తలు తల ఎత్తారు. పద్య కవులతో సమాన గౌరవం లభించింది. ఎన్నో యక్షగానాలు ఉద్భవించినవి. రంగాజీ, రామభద్రాంబ, కృష్ణాజీ మొదలైన కవయిత్రులు పదరచనల్లో పాల్గొన్నారు. విజయరాఘవ నాయకుడు క్షేత్రయ్య, తదితర వాగ్గేయకారాగ్రగణ్యులను పోషించటమే కాకుండా, ఎన్నో చౌపదులు, ద్విపదలు, యక్షగానములు రచించాడు. ఈతని కాలినడకలనే అనుసరించి మహారాష్ట్ర నాయకులలో ప్రముఖులైన శాహజీ ప్రభృతులు పదసారస్వతసేవ చేశారు. ప్రబంధయుగంలో పదరచనలు చేయటానికి దడిచినట్లు పండితకవులు పోయిన రెండు శతాబ్దులలో వెనుదీయలేదు. ఎలకూచి బాలసరస్వతి, కంకంటి పాపరాజు, 474 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 కందుకూరి రుద్రయ్య, గోగులపాటి కూర్మనాథకవి, ఆలూరి కుప్పన మొదలైన పండిత కవులు, జంకు లేకుండా ప్రజాసాహిత్యాభివృద్ధికి ప్రౌఢయక్షగాన కృతులు రచించి పేరుతెచ్చుకున్నారు. ఇరవయ్యో శతాబ్ది ప్రథమదశలో గేయరచనలకు గౌరవం తగ్గింది. ఇప్పుడిప్పుడే ఆధునికుల అపార శ్రమ, అప్రతిమాన ప్రతిభ వల్ల ప్రతిష్ఠ సుస్థిరమైనది. మన ప్రాచీన గేయవాఙ్మయాన్నంతా కొన్ని ముఖ్యశాఖలుగా విభజనలు చేయవచ్చు. అవి జానపదుల పదకవిత, మతవేదాంత భక్తి రచనలు, జావళీలు, స్త్రీల సారస్వతము. జానపదుల పదకవిత : కర్షక గీతాలు, దంపుళ్ళ పాటలు, బండిపాటలు, పడవపదాలు, పల్లీజన ప్రేమగీతాలు, జంగం పాటలు, ఏలపదములు, చందమామ పదములు, నూరుపుళ్ళ పాటలు, మొదలైనవన్నీ జానపద వాఙ్మయం క్రిందికే వస్తవి. స్వచ్ఛందభావము, నిరలంకారత, సమాజకవితాపటిమ, జాతీయత, రసపుష్టి వీటిలో ఉన్నంతగా నాగరిక కవితలో కనుపించదు. ఏరుమీద ఆధారపడే కర్షకులకు ఏరువాక ఒక వరవడిదినం ఆబాలగోపాలము ఆనందంలో పొంగిపోతారు. నూతన పరికరాలను సేకరించుకొని ఏరు ఎప్పుడు వస్తుందా ఎదవేద్దామని కాచుకొని, స్వాతివానకు ముత్యపుచిప్పలలాగా నోరు తెరచుకొని కూర్చున్న రైతులకు, ఏరు రాగానే హృదయం పొంగి సహజకవిత ఉద్భవిస్తుంది. ఏమని 'ఏరు వాకొచ్చింది ఏరు వాకమ్మ ఏళ్ళు నదులూ పొంగి వెంబడే వచ్చాయి నల్లమేఘాలలో నాట్యమాడింది కొండ గుట్టలమీద కులుకులాడింది ఇసుక నదిలో దూరి బుసలు కొట్టింది పాడుతూ కోయిలా పరువులెత్తింది ఆడుతూ నెమిలి అలసిపోయింది నవ్వుతూ మా అయ్య బువ్వతిన్నాడు' అని. సాహిత్య విమర్శ 475 జానపదులకు కవిత కష్టాలకూ వస్తుంది, సుఖాలకు వస్తుంది. ప్రవాస దుఃఖము అనుభవిస్తూ ఉన్న పల్లెపడుచు ఏరురావాలనీ, వస్తే బావ వచ్చి లాలిస్తాడని తొలకరినుంచే వెర్రితలపులు తలచుకుంటూ పాట పాడుకుంటుంది. 'తొలకరి ఒక మబ్బు తొంగి చూచింది మబ్బులో ఒక మెరుపు మెరసిపోయింది పెరటిలో ఒక జల్లు కురిసి వెలిసింది. జల్లులో నా మనసు జారిపోయింది ఏ కొమ్మ మీదనో ఎండ తాకిన పిట్ట ఏటి త్రోవలు పట్టి ఎగిరిపోయింది ఏరువాక నాటి కేడాది దాటింది ఎదురు చూచి గుండె చెదిరిపోయింది పిట్ట పిట్టా ముద్దు పెట్టుకున్నాయి గోవులన్నీ ఇల్లు చేరుకున్నాయి ఏటిగాలికి చిలుక లెగిరిపోయాయి ఎందుకో నా ఆశ లెగిరిపోయాయి ఏటి ఒడ్డున నేను పాట పాడేవేళ నవ్వుతూ మా బావ పువ్వులేరేవేళ కొంటె కోయిలపైన కూతకూ సేవేళ లేతమనసులు విచ్చి పూత పూసేవేళ బావొచ్చి నాతోటి బాసలాడాలి ముద్దోచ్చి నాతోటి మురిసిపోవాలి ఏరువాకమ్మ మా కెదురు రావాలి తలవంచి మము చూచి దీవించి పోవాలి' ఎంత ప్రకృతి సిద్ధ భావౌన్నత్యము! సౌకుమార్యం! ఇటువంటి పల్లిజన ప్రేమ “వెంకయ్య - చంద్రమ్మ” పాటలో ప్రదర్శితమౌతుంది. 476 'తెలిచందమామలో తియ్యపానకముంది తెచ్చి పెడుదువు గాని రారో రెంకయ్య!' అన్నప్పుడు చంద్రమ్మ అమాయకత్వమూ, వావిలాల సోమయాజులు సాహిత్యం-4 'రావి చెట్టెక్కేవు రాగాలు తీసేవు రాలి పోతవు గండుకొడుకో రెంకయ్య' అన్నప్పుడు ఆమె హృదయారాటము బహిర్గత మౌతున్నవి. ప్రియునితో సరస సల్లాపాలకు ఏకాంత ప్రదేశం అభిలషిస్తూ ఒక పల్లెపడుచు, “సముద్రాలు దాటి పోతే సక్కనైనా తోపులుండై సల్లగా ఆ చెట్టు నీడల సరస మాడుదమా! మామా తాలి పోవుదమా?” అని అంటుంది. ప్రబంధ నాయికానాయకులకు వంద పద్యాల వర్ణన పట్టే వనం ఉంటేగాని సల్లాపాలు సాగవు. 'చల్ మోహనరంగా' పాట గూడా నవరసోపేతమైన ప్రణయగాథ. పదవాఙ్మయములో ఆ పాట విని ఏ రసజ్ఞుడు ముగ్ధుఁడై పోడు? కరుణప్రధానాలైన కమ్మని పదాలు భిక్షుకుల నోట్లో తాండవిస్తూ ఉన్నాయి. ముష్టిమనిషి చంకన జోలెలో పసిపిల్లను వేసుకొని ఇంటింటిదగ్గరా - "జోడుకొండల నడుమ నినుగంటి తండ్రి ఏడువకు ఏడువకు వెర్రి అబ్బాయి ఏడిస్తె నిన్నెవరు ఎత్తుకుంటారు? చెట్లే చుట్టాలు మరి రాళ్లె దేవుళ్ళు” అని పాడుకుంటూ తన జీవనాధారం చూసుకుంటుంది. అది పాడేటంత సేపూ మనకు వనాంతరాల్లో వనితామణి సీత పసిపిల్లవాణ్ణి సముదాయించలేక పడే పాట్లు జ్ఞప్తికి వస్తాయి. ఏదో ఒక పదం పాడుతూ పనిచేసుకోవటము పల్లెవాసులకు పరమానందం. దంపుతూ ఉంటే చూచాను. “సువ్వని నేనొక్క పోటేసితేను చుక్కల్లు పిక్కటిలు సూరన్న కదలు సాహిత్య విమర్శ 477 అస్సని నేనొక్క పోటేసితేను ఆకసము తల్లడిల్లు ఆరాము గదలు” అని పాడుతూ ఉంటారు. పాములవాడు కాటుకు మందు వేయబోతూ 'దిగు దిగు నాగన్న, దివ్యసుందరనాగ! నిండుపున్నమనాడు పండు వెన్నెల గాచు స్వల్ప గ్రహణం నాడు చందమామను మ్రింగు దిగు దిగునాగన్న దివ్యసుందర నాగ! దిగకున్న మంత్రాన దింపించుతానురా నాగ దిగురా నాగన్న దిగరా నాగా దిగర' అని పదంపాడి ఏదో మూలిక వేసి సర్పదష్టుడైన సామాన్యజీవికి ప్రాణం పోసి పంపిచేస్తాడు. ఇటువంటి జానపదసారస్వతాన్నంతటనీ సేకరించి గ్రంథస్థం చేయటము ఆంధ్రుల కర్తవ్యము. మతవేదాంత భక్తి రచనలు లెక్కకు మీరి మన భాషలో ఉన్నవి. మన దేశపు మత విపరిణామ చరిత్రకు పట్టుకొమ్మలు అవే. వీరశైవమత విజృంభణ కాలంలో “శివ శివ యన మేలు తుమ్మెదా - శివ యంటేను వినమేలు తుమ్మెదా శరణన్న మేలె ఓ తుమ్మెదా శ్రీకంఠుడును పువ్వు తుమ్మెదా మూడులోకము లాయెనే తుమ్మెదా - పరమైకాంతమును జూడు తుమ్మెదా” అనే పదం పాడేవారు భక్తులు. ఈ తుమ్మెదపదంలో అన్యాపదేశము, వ్యంగ్యత మూర్తీభవించాయి. సాధారణంగా వేదాంతపదకర్తల రచనాధోరణి ఇదేవిధంగా ఉంటుంది. ఆంధ్రజ్ఞానులలో ప్రత్యేక వ్యక్తిత్వం కలవాడు వేమన. తత్త్వోపదేశం జాను తెనుగులో నూరిపోసి మధుర కవులలో తన పేరుకు చిరస్థాయిత్వం కల్పించుకున్నాడు. ఆ నాటి మతాచారాలతోను, వేదాంత మార్గంతోను విసుగు జెంది, 478 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 "జాతర జాతర జాతర సుమ్మీ జాతరతీతుడు వేమన సుమ్మీ వేదాతీతుడు వేమన సుమ్మీ వేమన చెప్పిన వేదము సుమ్మీ వేదశాస్త్రములు వాదులు సుమ్మీ వాదుల నోళ్ళకు బూదిడు సుమ్మీ కన్నవారు మరి చెప్పరు సుమ్మీ చెప్పిన నెవ్వరు చేయరు సుమ్మీ చేసినవారే సిద్దులు సుమ్మీ సిద్ధులమాట ప్రసిద్ధము సుమ్మీ” అనే గేయంలో ఉదోషించాడు. బాపనయ్య, నందమయ్య, వీరబ్రహ్మ యోగి మొదలైన జనసామాన్య వేదాంతుల రచనలన్నీ ఎంతో తీపిగా ఉంటాయి. ఇంత వరకూ ఈ గీతాలకు బైరాగుల నోళ్ళలోనే నివాసం. 'పంచదశి' సారాన్ని అంత చిన్న ఉయ్యాలపదంలో పెట్టిన బాపనయ్య - 'ఓం నమశ్శివాయ ఆరక్షరముల తొట్టి ఆరంభమాయెనే ఉయ్యాలా ॥ రక్షకుడు చిన్మయా తొట్టిలోపల తాను ఊగుతూ ఉన్నాడు ఉయ్యాలా ॥' అనే ఉయ్యెలపదం పూర్వసువాసినులు పాడుతూ ఉంటే, ఎందుకో మన ఒళ్ళు పులకరిస్తుంది. ఇటువంటిదే తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించీ నాలుగూ వేదములు గొలుసు లమరించీ ॥ అనే వేదాంత ప్రతిపాదక పదము. ఈ శ్రేణికి చేరిన తోట నరసింహదాసు ఛందస్సులో క్రొత్తకల్పన చేశాడు చూడండి. ||జో అచ్యుతా|| - వేదాంతి రామదాసు శతకములో సాహిత్య విమర్శ 479 'మాయచీకటి కోనలో కొన్నాళ్ళు మార్గంబు గానరాక యే యుపాయంబు గానక జన్మముల నెత్తితిని రామరామ!' ఆంధ్రభక్తులలో త్యాగయ్యది అగ్రతాంబూలం. వాగ్గేయకారాగ్రణి, వ్రాసిన ఛందస్సులో వ్రాయకుండా రెండువేల కృతులకు పైగా రచన చేశాడు. భక్తిరస ప్రధానమైన ఈతని కృతులకు సారస్వతగౌరవం లేకపోవుట శోచనీయము. అసలు కవిగా కూడా లెక్కలోకి రాడంటారు మనవాళ్ళు. త్యాగయ్య కవి ఐనదీ, కానిదీ ఈ క్రింది భాషాంతరీకరణాలు పరిశీలిస్తే తెలుస్తుంది 480 “O the breath of my life! The fruit of my choice! Though king of kings! O, the light of my vision! My rose's perfume! The flowers of my worship! I bow to thee. Tell me, lord, this secret. Does the babe go to the mother. or the mother fondly runs to the crying babe? Does the cow follow licking her tender calf? Does the crop follow the cloud Or the cloud descends to tend the crop? Does the sweet heart follow the lover Or the lover follows closely in her foot-steps? Tell me the secret, Lord, And show me thy face." వావిలాల సోమయాజులు సాహిత్యం-4 భాషాంతరీకరణము చదివిన ఇతర సాహిత్యవేత్తలు, త్యాగయ్యను మనము కవిగా పరిగణింపకపోతే రమ్యావలోకన చేయలేమని నిరసిస్తారన్నమాట మన వాళ్ళింకా గ్రహించలేదు. ఇతనిని అరవవారికి అరణమిచ్చామే, ఎల్లా తీసుకుందామా అని సంశయిస్తున్నారా? జావళీలన్నీ శృంగార రసప్రధానమైన పదసారస్వతం క్రిందికి వస్తాయి. 'రేపు వత్తువుగాని తూరుపు తెల్లవారెపోరా ఈ వేళకు' అనే జావళి 'చెరగుమాసె ఏమి సేతురా, దరిజేరగనైన వీలుకాదురా’ అనే జావళీ సంభోగ శృంగారాన్ని సూచిస్తున్నా వాటి కూర్పులో గొప్పదనం, భావనలో ఔచితీ కనిపిస్తవి. పదసంయోజనంలోను, భావవైఖరిలోనూ, విన్యాసక్రమంలోనూ తనతో ఏ పదకర్తా పోలలేకుండా పదకృతులు చేసిన క్షేత్రయ్యలో, నవీనులు అందుకోలేని రమ్యత కనిపిస్తుంది. శృంగారనాయికలు ఎన్నెన్ని రకాలో అన్ని రకాల పదాలు మువ్వగోపాలుని మీద రచించాడు. ఏ పదము తీసినా ఆధునిక భావచైతన్యము స్ఫురిస్తుంది. ఉదాహృతి మగువ ఏకాంతమందిరము వెడలెన్ నగకాడ, మా కంచివరద! తెల్లవారె ననుచు ॥ మగువ ॥ విడగారు గొజ్జంగి విరిదండ జడతోను కడుచిక్కుబడి పెనగు కంఠసరితోను నిడుదకన్నులదేరు నిడుదమబ్బులతోను తొడరి పదయుగమున దడబడెడు నడతోను సొగసి సొలయని యలవు సొలపు జూపులతోను వగవగల ఘనసారవాసనలతోను జిగి మించు కెమ్మోవి చిగురు కెంపులతోను సగము కుచముల విదియ చందురులతోను సాహిత్య విమర్శ ॥ మగువ ॥ ॥ మగువ ॥ 481 తరితీపుసేయు సమసురతిబడలికతోను జరతపాపడ చెరగు జార్బైటతోను ఇరుగడల కైదండ లిచ్చు తరుణులతోను పరమాత్మ, మువ్వగోపాల తెల్లవారె ననుచు ॥ మగువ ॥ భావకవిత్వమేదో ఈతనితో పుట్టినట్లుందే? స్త్రీల సారస్వతములో ఇది ఉన్నది, ఇది లేదనటానికి వీలులేదు. సర్వశాస్త్రాలు, పురాణాలు, ఉపాఖ్యానాలు, ప్రాచీనులు ప్రత్యేకంగా స్త్రీలకోసం పదాలుగా రచన చేశారు. కుసలాయకము, కుచ్చెలకథలు, సీతసురటి, గంగాగౌరీ సంవాదము; లంకాయాగం, లక్ష్మణ దేవరనవ్వు - కోవెల రాయబారము, చిలుక రాయబారము - ఎన్నో పాటల పుస్తకాలు ముద్రితమై ఉన్నాయి. వీటిని గురించి వ్రాయడం ప్రత్యేకంగా పెట్టుకోవలసిన పని. పదకర్తలకు ఉపకరించే ఛందస్సులు తరువోజ, రగడలు, ద్విపదలు, మంజరులు, ముత్యాల సరాలు, మధ్యాక్కరలు మొదలైన జాతీయఛందస్సులు. అంతమాత్రంతోటే కొన్ని కృతులు వృత్తాలుగా ఉండవనటానికి వీలు లేదు. 'చింతచెట్టు చిగురు చూడు చిన్నదాని షోకు చూడు' అనే పదాన్ని విభజిస్తే సుగంధివృత్తమౌతుంది. ఇవన్నీ ఇంచుమించు మాత్రాఛందస్సులు, గురజాడ అప్పారావుగారు చేపట్టిన నాటినుండీ వీటికి మళ్ళా ప్రాణప్రతిష్ఠ కలిగింది. ఆధునికులు నూతన ఛందస్సులను సృష్టి చేసి కావ్యరచన చేస్తున్నారనే అభిప్రాయం ప్రబలింది. కాని అది అపోహ. అన్నీ పూర్వకవి ప్రయుక్తాలే. ముత్యాల సరమనే పేరు క్రొత్తదైనా ఆ ఛందస్సు పూర్వ సాహిత్య ప్రసిద్ధమే. గోకులపాటి కూర్మనాథకవి మృత్యుంజయ యక్షగానంలో హిమవన్నగాన్ని వర్ణిస్తూ ఇదే ఛందస్సు ఉపయోగించాడు చూడండి. 482 'సాలతాల తమాలతిలక ర పాలకురవక కుందవిచికిల మాలతీసుమ ఫలము లందున జాలగా నమరున్. కమ్ము కస్తురి కల్కి తావుల గ్రమ్ము జవ్వాజి యను తుహిన జ వావిలాల సోమయాజులు సాహిత్యం-4 లమ్ము కప్పురమందు నెప్పుడు నిమ్ములను మీరున్.” కృతియోగ్యానుసారంగా నూతన ఛందస్సులను ఆధునికులు కల్పించుకుంటే మాత్రము ఏమి మునిగిపోతుంది? పురాతన ఛందస్సంప్రదాయానుసారంగా గేయకృతులను రచించినా, ఈ నాటి పదకర్తల మీద, వారి రచనల మీద అకారణంగా నిరసన భావము చూపిస్తున్నారు. అటువంటి వారికి ప్రాకృతకవితపట్ల ఆ నాటి సాంస్కృతికుల మనుకొనేవారు అసహనము చూపించినప్పుడు, జయవల్లభుడు చెప్పిన సమాధానము ఒప్పజెప్పడము సమంజసము. ప్రాకృత కావ్యం పఠితుం గుంఫితుం తథా చ కుటజ ప్రసూనం కుపితాం చ ప్రసాదయితుం అద్యాపి బహవో న జానంతి ప్రాకృతకావ్యం చదవటం గాని, వ్రాయటం గాని, కుటజ ప్రసూనమాలిక కూర్చడము, కుపితురాలైన ప్రియురాలిని ప్రసన్నను చేసుకోవటము మీకు తెలియవు. ఆధునికులు "The nightingale thought I have sung songs but never a one so gay For the sings of what the world be When the year have died away" నవ్యసాహిత్యం పుట్టీపుట్టకముందే అర్వాచీనుల దృష్టి గేయఛందస్సుల మీదికి ప్రసరించింది. సాహిత్య ప్రపంచంమీద విప్లవం చేసి నూతన కవితారీతులు ప్రవేశ పెట్టదలచుకున్న అన్ని దేశాలలోని కవులూ, తమతమ ప్రజాసారస్వతంలోని పదఛందస్సులలో కవిత్వం చెపుతారు. ఆంగ్ల సారస్వతంలో పోపుడ్రైడనుల కవితాపద్ధతుల మీద తిరుగుబాటు చేసి నూతన సంప్రదాయములను, కవితా వస్తువును కొనివచ్చిన రొమాంటిక్ కవుల విషయంలో అంతే జరిగింది. వారు మరుగు పడిపోయిన పూర్వపద ఛందస్సులను ఎన్నిటినో పునరుద్ధరించారు. మన వారు చేసిన పనీ అంతే. మరుగుపడి పోవడమంటే మహాకవులు వాటిని చేపట్టకపోవటమన్నమాట. సాహిత్య విమర్శ 483 గేయకవితా ఛందస్సులను నవ్యకవిత్వం పుట్టకముందూ, పుట్టేరోజుల్లో యక్షగాన నాటకాల్లో విరివిగా వాడుకజేసేవారు. మిగిలిన అనేకంతో పాటు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేవిగాని, వాటికి ప్రత్యేక స్థితి లేదు. ఆ యక్షగానాల పేరు గానాలైనా, వాటిలో అన్ని గేయఛందస్సు లుండవు. క్షేత్రయ్య, త్యాగయ్య మొదలైన వాగ్గేయకారుల కృతులలో అన్నీ గేయఛందస్సులే అయినప్పటికీ వాటిలో కవితాగుణము తక్కువే అని ఒప్పుకొని తీరాలి. యక్షగానాల విషయం గూడా ఇంతే! అవి కేవలమూ సంగీత దృష్టితో పల్లవి, అనుపల్లవులు కల్పించి వ్రాసిన “కృతులు”. ఆ కారణం చేతనే వాటిలో సంగీత సాహిత్యాల ఎక్కువతక్కువలు కనిపిస్తవి. ఈ గేయఛందస్సులకు సంగీత సాహిత్యాల సమరత్వము నవకవుల వల్ల ఏర్పడ్డదే. నేటి కవుల గేయం పాశ్చాత్యుల గేయ లక్షణానికి అనుగుణంగా ఉంటున్నది. "సంగీత సాహిత్యాల సంయోగం వల్ల ఏర్పడి, ఏకభావాశ్రయమై, ఆలాపన కనుయుక్తమైన లయతో కూడిన ఆత్మకావ్యము గేయమని వాని నిర్వచనము. ' "As a Union of Poetry and music, it (Song) may be defined as a brief Lyrical poem... .... to which is added a melody for the purpose of singing it” స్థూలంగా గేయాలను పాశ్చాత్యులు రెండు రకాల క్రింద విభజించారు. 1. కావ్యశిల్ప గీతాలు (Art Songs), 2. జానపదగీతాలు (Folk Songs). సుఖదుఃఖాది అనుభూతులు కలిగినప్పుడు సూటిగా పల్లీయజనుల హృదయకుహరాలను బ్రద్దలు చేసుకొని బయటపడేవి జానపదగీతాలు. సంస్కృతిరహితులైన జానపదులు వాటి కవులు. సహజమైన ఆవేశము కొన్ని కట్టుబాట్లకు లోనై కవి శిల్పి చేతిలో చిత్రణము పొందేవి రెండోరకము. ప్రజాసాహిత్యం మీది ఆకాంక్షవల్ల నేటి రచయితలు గేయఛందస్సులను విరివిగా ప్రయుక్తం చేసి రకరకాలుగా రచనలు సాగిస్తున్నారు. సింహావలోకనంచేస్తే చివరకు క్రిందివిధముగా విభజన చేయవచ్చు ననిపిస్తుంది. కథాగమన గీతికలు (Narrative Songs), గీతినాటికలు (Song - Dramas), గోగీతికలు (Pastoral Songs), జాతీయ గీతాలు (National Songs), జానపద గీతాలు (Folk Songs), సాంఘిక గేయాలు (Social Songs), ఆత్మ గీతాలు (Personal Songs), ప్రేమ గీతాలు (Love-Songs), ఆధ్యాత్మిక భక్తిగీతాలు (Philosophical and devotional 484 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 - Songs), బాలగేయాలు (Children's Songs), ప్రచార గీతాలు (Songs of propaganda), విప్లవ గీతాలు (Revolutionary Songs). కథాగమన గీతాలు ఒకటో రెండో తప్ప లేవు. ఉన్న వాటిలో కూడా కథాకాలం నాటి సాంఘికాది పరిస్థితులకు స్థానం తక్కువ. చరిత్రాత్మకమైన పాత్రల పేర్లు వున్నంతమాత్రాన అది చరిత్రాత్మక కథాగమన గీతిక కాదు. గేయాలలో కూడా తక్కిన ఇతర కావ్యాలలో మాదిరిగానే దేశకాల పరిస్థితులు, ఆచార వ్యవహారాలు ప్రతిఫలించాలి. గీతినాటికారచనలకు ప్రయత్నించే కవులు మనలో అరుదు. దానికి ఎంతో వ్యుత్పత్తి కావాలి. "నాటకాంతం హి సాహిత్యమ్" అని ప్రాచీనులు నాటక విషయంలో అన్నారు. “న తత్ శ్రుతం న తత్ శిల్పం, న సా విద్యా న సా కళా, నాసౌ యోగో న తత్ కర్మయ న్నాట్యే స్మిన్న దృశ్యతే" అని భరతుడు. కేవలం నాటక విషయమే ఈ విధంగా ఉంటే దానిని ఛందోబద్దము చేయటానికి ఇంకా ఎంత ప్రజ్ఞ కావాలో ఆలోచించండి. కేవలం ఆత్మానుభూతులను వచ్చినది వచ్చినట్లుగా అభివర్ణించాలనే మతము పోయే అంతవరకూ ఈ కావ్యపద్ధతికి (Poetic form) ముక్తి రాదు. గ్రీసుదేశంలో మొదట కవులు తమ కష్టసుఖాలకు తాము గోపాలకులై, అనుభూతి గోపాలక ప్రపంచానికి సంభవించినట్లుగా భావించి కావ్యరచనలు చేశారు. వాటినే గోగీతిక (Pastoral Songs) లనే వాళ్ళు. తరువాత తరువాత అవి అన్నిదేశాల సాహిత్యాలలోకీ ప్రాకిపోయినవి. మన ఆధునికులూ అటువంటి రచనలు కొన్ని చేశారు. కానీ వాటికింకా ఆంగ్ల సారస్వతంలో ఉన్న గోగీతికలకు కలిగినంత ప్రత్యేకత రాలేదు. జాతీయ గీతికలు ఆధునిక సాహిత్యంలో బహుముఖముగా వికసించినవి. కానీ వాటిలో ఎక్కువ భాగము పాడుకోవడానికి నిరుపయోగంగా కనిపిస్తున్నవి. విమలభావనతో, జాతీయ జీవనాన్ని ఒలక బోసుకుంటూ హృదయవీథులలో విహరించే శక్తి వేళ్ళమీద లెక్కపెట్టదగ్గ ఏ కొన్నిటికో మాత్రమే ఉన్నది. వీటిలో కొన్ని సంకుచిత జాతీయభావాన్ని ప్రదర్శిస్తున్నవి. భారతదేశమంతా నాదనుకున్న జాతీయగీతికాకర్తలు తక్కువ. ఆంధ్రాభిమానం ఉండటం తప్పు కాదు. కానీ అది భారతదేశాభిమానాన్ని ధిక్కరించేదిగా ఉండకూడదు. 'భారత (చీ) కాదు ఆంధ్ర మాతకు జై' అన్న “శ్రీ" గీతాన్ని చదివినప్పుడు విశాల జాతీయదృష్టి గల పరితకు ఏయే భావాలుత్పన్న మౌతనో ఆలోచించండి. ఆత్మగీతాలు తరువాతివి. నేటి రచయితలలో ఇవి బహుళము. కవులు కష్టసుఖాదులు వీటికి వస్తువు. స్వానుభవాలు కాబట్టి, ఆవేశ పూరితమైన హృదయము, అప్రయత్నత (Inevitability) వీనిలో పరాం కోటికి చేరాయి. సాహిత్య విమర్శ 485 ఆధునికుల ప్రేమగీతాలు చాలా గొప్పవి. వారు స్త్రీని జగదంబ స్వరూపిణిగా దర్శించారు. ఆ కారణం చేత ఈ శ్రేణికి చెందిన గేయాల్లో అపవిత్రతగాని, అంగసౌష్ఠవ వర్ణనగాని కనిపించవు. ఒకవేళ వీరి దృష్టి అంగప్రత్యంగవర్ణన మీదికి పోయినా, అది శిల్పిదృష్టి. పరమేశ్వరిని చిత్రించే శిల్పి దేవి పీనవక్షోజాలను ఏ దివ్యదృక్కుతో, పవిత్రభావనతో వీక్షించి చిత్రిస్తాడో, వీరూ అదేరీతి. ప్రకృతి పురుష స్వరూపులైన జగదేకమాత, లోకేశ్వరులిద్దరే ఆధునికుల భక్తికి అధిష్ఠానదేవతలు, నిర్గుణతత్త్వాన్ని నిరసించరుగాని సగుణమంటే సంతోషము అధికం, బహుమూర్తులను ఆరాధించినా బ్రహ్మపదార్థం ఒకటేనని వీరి విశ్వాసం. ముముక్షుమార్గానికి భక్తులు అవలంబించే పంచభావాలలో దాస్య, వాత్సల్య మధురాల మీద మక్కువ. వెతికితే శాంతం కూడా అక్కడక్కడ కనిపించకపోదు. ద్వైతాద్వైతాది జిజ్ఞాసలలోకి దిగరు. ఇది నేటి ఆధ్యాత్మిక భక్తిగీతాలలోని విషయము. రచనా నాస్తికమత ప్రబోధం చేసే గేయాలు కూడా ఒకటి రెండు వచ్చాయి. వాటికి సమాధానాలు కూడా గేయరూపాలే ధరించాయి. చిన్నపిల్లల విజ్ఞానానందాల కోసం ప్రస్తుతము అన్ని దేశాలలో కవులు గేయాలు చెపుతున్నారు. నిజంగా కవిని పట్టిచూస్తే రచనలు బాలబాలికల అనుభవాలలోను, చేష్టలలోను, ముఖ్యంగా వాళ్ళ భాషలోను కవి సుపరిచితుడు కావాలి. వాళ్ళ చిలిపి చేష్టలను చూచి కవి తాను గూడా పిల్లవాడై ఆనందించి అప్రయత్నంగా వాళ్ళ నోటివెంట వచ్చే భావాలకు ఉప్పొంగి, వాళ్ళ ఆటపాటలు పరిశీలించి, వాళ్ళ మానసిక తత్త్వ నిరూపణ చేసికొని గాని అతడు వాళ్ళకోసం పాటలు వ్రాయగూడదు. ఆ శక్తి లేనివాళ్ళు వ్రాస్తే రసికలోకానికి రక్తి కడితే కట్టవచ్చుగాని, పిల్లలకు నిరుపయోగం. కవి పోయి చెప్పకుండానే వాళ్ళు తెలుసుకొని ఆనందించే టంత అందుబాటులో ఉండాలి. మనలో ఆ ప్రయత్నం చేసే కవులు ఇద్దరో ముగ్గురో తప్ప లేరు. వ్రాయటము మట్టుకు చాలామంది వ్రాస్తున్నారు. ఈ రచనలు చాలా భాగం గంభీర భావాలతోను, అల్లిక జిగిబిగువులతోను, ఛందోరహితంగాను ఉన్నవి. వస్తువును బాలబాలికల దృష్టితో వీక్షించక పోవడము వల్ల ఏర్పడే లోపం వీటిలో ఎక్కువ. బాలగేయాలకు ప్రత్యేకంగా లయ అత్యవసరము. నడక సాధ్యమైనంతవరకు సాఫీగా ఉండటము మంచిది. లేకపోతే పిల్లలు తికమక పడతారు. ఇటువంటివి పారంపర్యంగా వచ్చే పాటలు ఆంధ్రదేశంలో అన్ని మూలలా దొరుకుతవి. వాటిలో మట్లు ఆదర్శపాత్రమైనవి. అనుకరణ యోగ్యాలు. కొత్త మట్లు కనిపెట్టవద్దని కాదు. అప్పుడు కూడా పాతమట్లను దృక్పథంలో 486 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 పెట్టుకోవటము మంచిది. పిల్లలకు వ్రాసే గేయాల్లో అందుకోరాని సౌందర్యోపాసన, నాస్తికత ఇత్యాది శూన్య సిద్ధాంతాల కన్నా అహింస, ధార్మికత, ప్రేమ, సత్యము, నిరాడంబరత్వము, భక్తి మొదలైన విశ్వశ్రేయ విషయాలు వస్తువులుగా తీసుకొని, కొద్దిపాటి వ్యంగ్యంతో చిత్రించి చూపడము మంచిది. ప్రకృతిలోని విచిత్రాలను చూపిస్తూ వాటితో పిల్లలకు విజ్ఞానాభివృద్ధి కలిగేటట్లు చేయటము ఈ శ్రేణికవులకు ఆశయమైతే బాగుంటుంది. వయసుమీరిన బాలబాలికలకే ఈ గేయరచనా పద్ధతులు నేర్పి వారిచేతనే ఈ రచనలను పెంపొందజేయటము సమంజసమే. సాంఘిక గేయరచయితలు కొద్దిమంది ఛందోబంధాలను త్రెంచి వేయకుండా, దేశీయమైన సంఘ దురాచారాలను ఎత్తిచూపుతూ మానవ హృదయంలో కరుణకు స్థానం కల్పిస్తున్నారు. ఈ గీతాలు విరివిగా రావలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రస్తుత ప్రచారక గేయాల్లో కవితావస్తువు బొత్తుగా లేనే లేదు. దీనికి మూలకారణము వ్రాసినవాళ్లు కవులు కాకపోవటమే. ఛందో విషయంలో అనవధానత ఎక్కువ, ప్రచారక గేయాలు ఎంత ఛందోబద్దంగా ఉంటే సంగీతోత్పత్తి అంతగా కలిగి, ప్రచారోద్దేశ్యము అంత గాఢంగా ప్రజాహృదయంలో నాటుకు పోవటానికి అవకాశం కలుగుతుంది. ఇటువంటి రచనలను కూడా కవులు చేపట్టి రసవంతంగా చేస్తారని నమ్ముతున్నాను. ఆధునిక విప్లవగీతాలు శైలి వస్తువులు రెంటిలోనూ అన్యసారస్వత వాసన పరిమళిస్తున్నది. వీటిలో కొన్నిటికి అనుకరణలమీద అనుకరణలు బయలుదేరాయి. “అన్నమయ కోశాన్ని” అంటిపెట్టుకొన్న ఈ శ్రేణికవులకు భావి, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులమీద దృష్టి తక్కువేమో. కేవలం ఆదర్శాలే గాని, నిశ్చితాభిప్రాయాలు ఉన్నట్లు కనపడవు. సర్వమానవ సౌభ్రాతృత్వము, విశ్వ శ్రేయస్సు కోరే ఈ కవుల రచనలు చాలాభాగం అందరికీ అందుబాటులో ఉండవలసినది పోగా, సాహితీ విమర్శకులకు కూడ కొన్నిచోట్ల అవగతం కాకుండా ఉంటున్నవి. ఈ రచయితలలోని ఉత్సాహము, ఉద్రేకము, విప్లవతత్త్వము మెచ్చుకోదగ్గవి. వారి రచనలను గ్రహించడానికి ఇంకా కాలం పడుతుందని కొందరి సమాధానము. అలా అయితే వారు తేదలచుకున్న విప్లవం గూడా దానితోపాటు వెనక్కు పోతుందనే విషయం గూడా గ్రహించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా కాకుండా నేటి గేయసాహిత్యాన్ని పరిశీలిస్తే మంచిచెడ్డలు రెండూ గోచరిస్తవి. ఆధునికుల అపార శ్రమవల్ల ఈ రచనలకు మిగిలిన కవితావిభాగాలతో సాహిత్య విమర్శ 487 పాటు సమాన గౌరవము, ఆదరాభిమానాలు సిద్ధించినవి. సంఖ్యలో అతిశయించినవి. ఆత్మానుభూతులను హృదయానికి నాటేటట్లు చెప్పటంలో పరాకాష్ఠనందుకున్నవి. ఆవేశ ప్రాధాన్యములో అందెవేసినవి. దేశానికి ఎంతో మేలు కలిగింది. సిద్ధహస్తుల విషయంలో అప్రయత్న, ఆవేశము, కవితాదీక్ష, విమల భావన, జీవిత విమర్శ, పరిశీలన, సుస్పష్ట రూపకల్పన, హృదయాకర్షణశక్తి. రసోజ్జృంభణము, ఉన్నతాశయములు, స్వచ్ఛమైన సంప్రదాయ సిద్ధి కలిగాయి. వీరు కవితాకైలాస శిఖరాలను చూపించి భావి కవులకు మార్గదర్శకులైనారు. గేయరచనల్లో ఏర్పడ్డ లోపాలు చాలామట్టుకు దేశంలో ప్రబలిపోయిన కొన్ని నూతన సిద్ధాంతాల వల్ల కలిగినవి. కొందరి మతంలో గేయానికి ఒక విధమైన ఊపు వస్తే చాలునని ఊపే ప్రధానంగా పెట్టుకొని రచన చేస్తే ఊపుతో చదవటానికి వీలుంటుందేమోకాని, పాడుకోటానికి వీలులేదు. గేయానికి కావలసిన ముఖ్యలక్షణాలలో ఒకటైన సంగీతానికి స్థానం తక్కువన్నమాట. వీటిని లక్షణ యుక్తమైన గేయాలనడం కన్నా, ప్రత్యేకమైన మరి ఒక ఊపు గేయ పద్దతనటం చాలా బాగుంటుంది. మరికొందరు రచయితలు కేవలము మాత్రలు సరిపోయినవా, లేదా అనే చూస్తున్నారుగాని, లయమీద దృష్టి నిలపటం లేదు. ఇది ఒక నవ్యత అని వారి సిద్ధాంతము, మాత్రలు సరిపోయినా కొన్నిచోట్ల గేయం నడవదు. శ్రుతిమించిన భావన చేసి దానిని స్ఫురింపచేసే సంప్రదాయసిద్ధమైన పరిభాష ఉపయోగింపక, పఠితను అయోమయంలో పడవేసే గేయరచనలు అపరిమితంగా వస్తున్నవి. భావించిన రూపకల్పన సంప్రదాయానికి కట్టుబడక పోయినా, సహృదయులైన రసికుల తార్కిక దృష్టికైనా పొడకట్టాలి. అలా జరగనప్పుడు వారి భావన ఒక విధమైన ఉన్మత్తత క్రిందికి వస్తుందని క్రోషి మతము. "All imagination beyond reason is a bit of insanity." భావన ఎంత విచిత్రంగానైనా చేసి అనుభవించవచ్చు. "హృదయంతో అనుభవించగలిగినది అంతా మాటలతో వెల్లడి కాదు. దాని ఛాయను వెల్లడించే శక్తి కూడా మాటలకు ఉన్నదో లేదో - అందుచేత కవి తన అనుభవాన్ని స్ఫురింపజేసే పరిభాషను ఉపయోగిస్తాడు. ఆ పరిభాష సంప్రదాయసిద్ధంగా ఉంటేనే కాని, పద బంధము మాటున ఉన్న భావ ప్రపంచములోకి వెళ్ళలేము. కవి ఆ విషయములో ఎంత శ్రద్ధాళువై ఉంటే కావ్యానికి అంత శోభ వస్తుంది" (వేదుల కల్యాణకింకిణి పీఠిక). ఇది ముఖ్యముగా గమనించవలసిన లోపము. 488 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 ఆధునిక కవులు కొందరు వాస్తవిక ప్రపంచానికి దూరమైపోయినారు, కల్పిత లోకాల్లో దారి తెలియక తారుమారై పోతున్నారు. కేవల భావనాజగత్తులలో కవులు విహరించడం వల్ల లోకజ్ఞత, వాస్తవ జగత్తులోని జీవిత విమర్శ (Criticism of life) అడుగంటినవి. వస్తు వైవిధ్యము సన్నగిల్లిపోతున్నది. కవి వాస్తవ జగత్తులోని వస్తువును చేపట్టి అన్యానుభూతిని యథాతథంగా ప్రదర్శించక, స్వాయత్తం చేసికొని వస్తుతత్త్వం చెడకుండా కొన్ని నూతనాంశాలను భావించి చేర్చుకొని కావ్యరచన చేస్తాడు. వాస్తవ లోకాన్ని వదిలి కేవల భావనాప్రౌఢ వీధుల్లో విహారం చేసే కవి నేల విడిచి సాము చేసే వాడన్నమాట. వివిధరకాలైన గేయాలు విరివిగా రాకపోవటము, ఉన్నవాటిలో వైవిధ్యము లేకపోవటమూ చాలామటుకు పై కారణం వల్లనే. నూతనత్వం మీద అత్యధికమైన ఆకాంక్ష పెట్టుకొని కొందరు గేయరచయితలు అర్థపుష్టి, అన్వయసౌలభ్యాలను నీట కలుపుతున్నారు. నూతనసృష్టి మీద దృష్టి ఉండవలసిందే. “కాని నూతనత్వ మనేది భాషానియమోల్లంఘనాల వల్ల సిద్ధించదు. కవి సమయాలు పాటిస్తే నూతనత్వానికి భంగం రాదు. అర్థపుష్టి. అన్వయ సౌలభ్యమూ మొదలైన గుణాలు లేకపోతే నూతనత్వానికి కాదుగదా, కవితకే భంగం కలుగుతుంది. భావాలు నూతనంగా ఉండవచ్చు. పద సంఘటనలు క్రొత్త తీరుగా కూర్చవచ్చు. నూతనత్వం కోసం అర్థము పాడయ్యేటట్లు కూర్చటంలో నూతనత్వం లేదు.” సంప్రదాయానికి ఇమడని అన్యసారస్వతాలలోని మెలకువలను అనుక రించటంవల్ల, కొన్ని కొన్ని గేయాలు విచిత్ర రూపాన్ని ధరించాయి. ఆ విచిత్ర రూపం కూడా ఒక సౌందర్యమనే కొందరి సమర్థన. ఆధునిక గేయ రచయితలలో ప్రత్యేకత కలిగి ప్రసిద్ధి పొందిన కొందరి రచనా పద్ధతులు, కవితావస్తువులు, ప్రత్యేకతలు చూపించవలసిన బాధ్యత కొంత ఉన్నది. గురజాడ అప్పారాయకవి నేటి గేయకవితాపితామహుడు, నీతి, దేశభక్తి, అస్పృశ్యత, పాశ్చాత్య వ్యామోహాది సంఘసంస్కరణము వీరి వస్తువు. వీరి దేశభక్తి యావద్భారతాన్నీ అనుసరించింది గాని, కేవలమూ ఆంధ్రదేశాన్ని మాత్రమే అంటిపెట్టుకొని కూర్చున్నది కాదు. కొద్ది మాటలలో పెద్ద భావాన్ని ఇమడ్చడము, రచన రససిద్ధిని పొందిగాని చేయకపోవటమూ వీరి ప్రత్యేకశక్తులు. ప్రజాదరణ పొందిన ముత్యాల సరాన్ని “పార్శీగజల్ వరుస” లో మొదట యీ కవి ప్రవేశపెట్టాడు. ఎంతో కాలము పరిశ్రమ చేస్తేనేగాని వీరు గేయాలలో వాడిన కండగల జాతీయ జీవద్భాష చేత చిక్కదు. అటువంటి భాష ఉపయోగించడము వల్లనే ఆయన భావాలు సూటిగా వచ్చి సాహిత్య విమర్శ 489 హృదయానికి తాకుతవి. చిన్న పిల్లలకోసం వ్రాసిన “పూర్ణమ్మ పాట” మొదలైన గేయాలలో చిక్కనైన తేటతెనుగు తొణికిస లాడుతుంది. వీరి ఎత్తుబడులు ఎంతో మనోహరంగా ఉంటవి. దేశభక్తి అంటే, "దేశమును ప్రేమించుమన్నా మంచి యన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టిమేల్ తలపెట్టవోయ్" స్వంతలాభం కొంత మానుకు పొరుగువారికి తోడు పడవోయ్ దేశ మంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్!" అని ఆంధ్రదేశంలో ప్రథమ శంఖధ్వానం చేసిన కవితాత్వికుడు (Poet - Thinker) నాటకరచయిత, ప్రథమ కథకుడు, విమర్శకుడు, నవ్య సాహిత్యానికి మూల పీఠము. ఒకవిధంగా రచనలు ఎక్కువభాగం వాచ్యంగా ఉండడం వల్ల కవితాశిల్పము కొంతవరకు లోపించిందేమో అని అనిపిస్తుంది. భాషావిషయంలో గురజాడ కవిని అనుకరించటానికి బసవరాజు ప్రయత్నించాడు. కానీ వారిని వీరందలేదని ఒక మతము. ఇది విచారణీయాంశము. బసవరాజు నిరంతరమూ గానం చేసిన కవికోకిల. పాట కోసమే తన జీవితము మీదు కట్టాడు. ఆయన జీవితాశయమే అది. కవి - “పాట పాడుతుండగ నా ప్రాణి దాటి ఏగేనా ప్రాణి దాటి ఏగుతుండ పాట నోట మోగేనా" - అనే గేయంలో ఆ విషయాన్నే సూచించాడు. “కావ్యమె జీవంగా గడపిన కవి.” “కావ్యపానం చేసి కైపెక్కి" తన ఆత్మశక్తిని గుర్తించాడు. "గుండు రా రా మంచు కొట్టినట్టుగ నేటి 490 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 పండితులు ఠారెత్తి పరుగుచ్చుకోవాలి” అని పాండితీబంధనాలకు స్వస్తి చెప్పే సాహసము, ఆత్మశక్తిని గుర్తించిన స్వాభిమానమూ ఈ కవికి మొదటినుంచీ పట్టుబడ్డవి. ఆత్మానుభవాలను కొద్దిపాటి కల్పనతో పాటలుగా కూర్చి పఠితలను పరవశులను చేశాడు. రసమయమైన అనేక జీవిత ఘట్టాలే ముఖ్యమైన వస్తువు. వైవిధ్యము, దానికి తోడు దివ్యమైన కవితావేశము, సహజమైన పవిత్రభావన, ఉన్నతాశయాలు, స్వచ్ఛసంప్రదాయము, నగ్న సౌందర్యము, నిరాడంబర కవితాశిల్పము, వీరి గేయకవితా సుందరికి పెట్టని అలంకారాలు. ఆమె “చిన్నతనం నుంచీ రాగిణి. భావనోద్దీపిత, గానలోల." శ్రోతలను ఒకచోట నవ్విస్తుంది. ఒకచోట నాట్యం చేయిస్తుంది. ఒకచోట కన్నీరు కార్చేటట్లు చేస్తుంది. ఒకచోట భయపెడుతుంది. చివరకు అభయమిస్తుంది. మనోహరమైన మహోన్నతభావాలను జీవద్భాషలో పెట్టి చేతికందించే శక్తి ఈ ఒక్కడి సొమ్మే. తికమకలు తక్కువ. పఠితలను పట్టిచూడటం కాదు ఆయన పద్ధతి; హృదయానికి నాటేటట్లు చెప్పడం. “వాగీశుడే వచ్చి దాసోహమని పాట వ్రాసి వల్లించాలి" అని ఆయన చెప్పిన ముక్కలో ఉన్న సత్యం ఈ కారణం వల్ల కలిగిందే! గీతికా రచనకు తత్త్వ, ఓఘ, ఘనాలతో పరిచితి అత్యవసరము. నృత్య వాద్యాలతో కలిపి పాడినప్పుడు తౌర్యత్రికసిద్ధి కలిగి ఆయన పాటల్లో పట్టు తెలుస్తుంది. బసవరాజు సతతసౌందర్యోపాసి, పిపాసి, చిన్న చిన్న వస్తువులలో చిన్మయమూర్తిని చూచి చూపించే శక్తి కలవాడు. ఆశాభంగాలు కలగటం వల్ల అంతరంగవేదనాక్షుభితమై పాటగా అప్పుడప్పుడూ మోగినా, దాన్నే అంటిపెట్టుకొని కూర్చోడు. కష్టసుఖాలను రెంటినీ సమదృష్టితో చూడమనే అద్వైతి. 'బ్రతుకే చేదని అంటావే బ్రతికెదరేలా దేవతలూ?' అని ఆయన ప్రశ్న. దుఃఖమయ ప్రపంచాన్ని సంతోష సాగరంగా మార్చుకోటానికీ వీలున్నదనే భావుకుడు. భక్తి, ప్రేమ, దానికి ఆయన సూచించిన సాధనాలు. అస్తికుడై ఈ కవి మిథ్యావాదులను భక్తిమార్గంలో పడిపోయి జీవితంలోని అశాశ్వతత్వాన్ని పోగొట్టుకొండని దారి చూపి ప్రబోధించాడు. జిజ్ఞాసాపూర్వముగాని జనసామాన్య మత మీయనది. ఈ కవి ప్రేమతత్త్వము ధనప్రాణాదులను, స్వార్థాన్ని మించి పోయింది. ప్రేమ మృదులతను కూరుస్తుందని, కలుషాలు కడిగి వేస్తుందని, అహంకారాన్ని అణగద్రొక్కుతుందని ఆయన నమ్మకము. సాహిత్య విమర్శ 491 "ఎద మెత్తనౌటకై గద అంత మందిలో అహమ్మెల్ల వదలి పోవునురా!” అని ఆయన ప్రవచనము. "ప్రేమించు ప్రేమకై ప్రేమించు ముక్తికై ప్రేమించు ప్రేమకై” అన్న మాటలలోని మొదటి స్వార్థపరత్వమూ, చివరకు తద్రాహిత్యము కవిప్రేమ సిద్దాంత పరిణామాన్ని సూచిస్తున్నది. ఆయన వ్రాసిన కొన్ని జాతీయగీతాలు, దేశీయ గీతాలు కూడా ఉన్నవి. ఆయన దేశభక్తి గురజాడ కవివలే యావద్భారతానికీ సంబంధించింది. రాజకీయంలో కాంగ్రెసు వాది, విశ్వశ్రేయస్సు ఆకాంక్షించి, విమల భావాలు దేశానికి నూరిపోసి ప్రజాదరాన్ని పొందుతూ ఉన్న ఈ కవి కలకాలం నిలిచేవాడు. జానపద భాషను, వాతావరణాన్ని అవలంబంగా పెట్టుకొని ఆత్మానుభవాలను జానపద గీతాలుగా కృషి చేసిన అమరకవి నండూరి. జానపదాల వ్యవహారంలో ఉన్న కొంచెం భాషతోనే కమనీయ కావ్యమే కాదు కదా, శాస్త్రార్థాలు గూడా అందుకోలేని అతిలోక విషయాలను రూపించాడీ కవి. ఇదే ఆయన ఉపజ్ఞ. కవులము కావాలని ఉబలాటపడేవారికి మొదట వీరి మార్గం కొంత సులభంగా కనిపించినా, అనుభవంలో పునీతమైన సంస్కారం వినా దుస్సాధ్యంగా తేలిపోయింది. వీరి యెంకిపాటలలో కమ్మని సంగీతము, సహజమైన పవిత్ర భావనలు, ఉక్తి సౌలభ్యము ముఖ్యంగా హృదయా కర్షణశక్తి కనిపిస్తవి. ఈ పద్ధతికి వీరే మార్గదర్శకులు. ఎంతమంది ఆ విధంగా వ్రాయటానికి ప్రయత్నాలు చేసినా ఏదో లోపం కలుగుతునే ఉన్నది. గేయ కవితాలోకంలో పాత్రసృష్టి చేసిన కవులు బహుకొద్దిమంది. నండూరి యెంకి కవికీ, తనకూ విశిష్టత గడించింది. "పూలమొక్కల నీటిజాలు గని నిలుసుండి పూలన్నీ నీపాటే ఆలించె" అనే సునిశిత భావనాబలము, "అందాలు చూచుకోటానికి అద్దాలెందుకు? కనుపాపలు లేవా” అనే సహజరసికత, 'యెనక జల్మంలోన ఎవరమో?' అని నాయుడు బావ అన్నప్పటికీ ముగ్ధత్వమూ, “ముందు మనకేజల్మ ముందో లె” 492 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 అన్నప్పటి అమాయకత్వము. "ఎన్నాళ్ళో మనకోలె ఈ సుకము” అన్నప్పటి బేలతనము., కడుపులో చెయ్యేసి కలచే ఆమె చేష్టలు, మాటలూ రసికలోకం ఎలా మరచిపోవటం! ఆలోచించినకొద్దీ యెంకిలో ఎన్నో అందాలు బయటపడతవి. ఆ పాత్ర తరిగిపోని అమృతకలశము. ఎన్ని 'గాలిదుమారాలు' రేగినా, ఏ కోశానా చెక్కు చెదరలేదు, చెదరదు, చెదరబోదు.! కావ్య శిల్ప గీతికలను, జానపద గీతాలను రెంటినీ కవితాదృష్టితో వీక్షించి, సమాన గౌరవం చూపి గేయరచన చేసిన కవి అడివి బాపిరాజు. నండూరి అభినయించిన జానపదజీవితంతో సారూప్యాన్ని పొంది పదకవితలు పలికాడు. గ్రామీణుల వివిధ జీవిత సంఘటనలను, వారి పదఫణితిలో పాడుకున్నాడు. నాయుడు బావ, ఎంకి, కవిలోని భావపారిశుద్ధ్యరసావేశాలలో ప్రభవించారు. బాపిరాజు స్వయంగా జానపదుడై సూటిగా బోళాతనంతో పఠితను తన వశం చేసుకుంటాడు. ఇక్కడ బుద్ధిని రంజింపజేసే తళుకుబెళుకులకు, నగిషీలకూ స్థానం లేదు. పుష్కలమైన జీవిత సుఖదుఃఖాలలో నుంచీ పొంగి పొరలే హృదయావేశం ఒక్కటే స్ఫురిస్తుంది. ఈయన పల్లెపట్టు దాటి కావ్యాల్లోనికి అధిగమించి ఒక స్వాప్నికత్వాన్ని మనగేయ సారస్వతంలోకి పట్టుకొచ్చాడు. ఆమెను "శశికళ"గా రూపించి మన ఎదుట ప్రదర్శిస్తున్నాడు - శశికళ సౌందర్య బాలిక. ఆమెను గురించి కవే అన్నమాటలివి. “శశికళ” నాకు సత్త్వం, ఆమె నా ప్రేమ విధానము. నా గొంతుకలో బయలుదేరిన సన్నని రాగం గానీ, నా కళ్ళలో ప్రతిఫలించిన రంగుల చిత్రం గానీ ఆమె విలాసాలే. ఆమె నాకు తోచని క్షణాలు భయంకర ప్రదర్శనమే. కాలగర్భంలో నుంచి బయలుదేరిన మరుక్షణం నుండీ నా చేయి ఆమె, ఆమె చేయి నేనూ పట్టుకొని నడుస్తున్నాము. ఈ యాత్ర కాలాన్ని దాటిన ఆనందం వరకూ, ఆనందమే మాకు దారి. ఆనందమే గమ్యము.” వస్తుతః దివ్యశిల్పి కావటం చేత ఆయన శశికళ పాటలలో రేఖాకార చిత్రలేఖనపు నగిషీలు కనబడతవి. "ప్రతి వాక్యమూ చిన్న బొమ్మలా నయనాలయందు నర్తిస్తుంది.” ఇది ఆయన ప్రత్యేకత. దివ్యపథాలలో ఈ కవితో యాత్రలు సలిపే పవిత్ర నవ్య సాహితీ మూర్తులు, Dante, Rosette మొదలైన పాశ్చాత్య రచయితలు కవికి ఈ సౌందర్య బాలికాసాహచర్యంలో తోడు. సంగీతానికి మొదట సుశరీరం, సుశబ్దం కావాలి. “కవిత్వమునకు కావలసినది భావనాస్ఫోరకత్వము (Suggestiveness), హృదయాకర్షణము, రసోజ్జృంభణము ఛందోబద్ధమగు మనోహర శబ్దసముదాయము” (కృష్ణశాస్త్రి - ఏకాంతసేవ పీఠిక) సాహిత్య విమర్శ 493 చక్కని పదములు, కూర్పు అంటే కృష్ణశాస్త్రికి అపరిమితానందము. అది ఆయనలోని ఉపజ్ఞ. ఏ గేయమైనా తీర్చి దిద్దిన శిల్పఖండంలా, చెక్కుచెదరని దివ్యవనితలా మోహపెడుతుంది. కవితాశిల్ప ప్రధానమైన గేయాలకు ఈయనను చెప్పి చెప్పాలి. శబ్ద ప్రయోగము పట్టు ననుసరించి ఉంటుంది. కూర్పులో ఒక తడవ “పైదలి కుత్తుకలోని పల్లటీకూతలు”, ఇంకోమారు “ప్రళయకాల మహోగ్ర భయదజీమూతోరుగళ ఘోరగంభీర ఫెళ ఫెళార్భటులు" వినిపిస్తవి. "కవి తన హృదయావేశాలకు బద్ధసభ్యుడు కావాలే గాని ప్రజాభికాంక్షకు పట్టుపడ కూడ”దనే రవీంద్రుని మతంలో వాడుగా కనిపిస్తాడీ కవి. "Poets have to be true to their best moments and not to the people's requirements. 55 ఈ విషయమే కృష్ణశాస్త్రి 'స్వేచ్ఛ' అనే గేయంలో “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు ? నా ఇచ్చయే గాక నాకేటి వెరపు?” అని వాడుకున్నాడు. ప్రేయసివైపు హృదయం ప్రవహిస్తే ప్రేమగీతాలు, పరమేశ్వరుని పాదసాన్నిధ్యంలో భక్తిగీతాలు, భారతజనయిత్రి సుందర ప్రశాంతరూపం కళ్ళకు కట్టినప్పుడు జాతీయగీతాలు, 'ఆకలి' వేసినప్పుడు అకలి పాటలు అల్లుకున్నాడు, పాడాడు, కురిశాడు, అందించాడు, ఉన్నట్లుండి ఉబుసు పోనప్పుడు ఊహాగీతికలు (Fancy Songs) వ్రాశాడు. ఆయనలో కలిగిన అన్ని సంస్కారాలనూ అన్ని రకాల గీతాలలో పెట్టాడు. ప్రేమ గీతాలలో ఎక్కువగా ఉన్మాదావస్థ కనిపిస్తుంది. "అతడు నా వలెనే ఉన్మత్త భావశాలి" అనే వాక్యంలో ఈ విషయం ఆయననే చెప్పుకున్నాడు. పిచ్చివాడు, ప్రియుడు, కవిభావనాసౌధం మీద ఒకే అంతస్తులో ఉంటారు. "The lunatic, the lover and the poet and all in imagination compact” అనే సిద్ధాంతానికి కృష్ణశాస్త్రి ప్రియుడుగాను, కవిగాను, స్వచ్ఛమైన తార్కాణము. ఏకేశ్వరోపాసకుడైన ఈ కవి భగవంతుని పాదసన్నిధికి ప్రేయసిగాను, ప్రియపుత్రుడుగాను, ప్రియసేవకుడుగానూ చేరుకుంటాడు. మధుర, వాత్సల్య, దాస్యభావాలు స్థూలదృష్టికి భక్తిగేయాలలో కనిపిస్తవి. అహం గ్రహసంబంధమైన 494 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 ఉపాసన (ఆత్మచింతనకు సంబంధించినది) ఆయన భక్తి గీతాలలో బలవత్తరము. తన్మూలంగా కవి దీనతాభావాన్ని పొంది, దీనుడనని, పాపినని ప్రభువుముందు విలవిస్తాడు. బ్రహ్మ సమాజమత ప్రభావము దీనికి మూలకారణము కావచ్చు. జాతీయ గీతాలు కమ్మని సంగీతంతో కళకళ లాడుతుంటవి. ఆకలిపాటల అంతరార్థమేమిటో ఇంకా ఆలోచించవలసిన విషయము. ఇవి విప్లవగీతాలు కావేమో! 'ప్రతిభావ్యుత్పత్తులలో ప్రతిభ గరీయసి. ' కాని వ్యుత్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే ప్రతిభ అంత రాణిస్తుంది. ప్రతిభకు అండ ఆకాశము. వ్యుత్పత్తి వల్ల భావనకు బలం కలుగుతుంది. అది లేని కవిలో వస్తువైవిధ్యము తక్కువ. ఈ రెంటిని ఏకముఖం జేసుకొని గేయరచనలు చేసిన కవి విశ్వనాథ. పాడాలనే ప్రకామ్యస్థితి (Power of irresistable will) పొందినవారు ఈశత్వము (Power of Commanding), వశిత్వము (Power of subjugating) ఆయన కే నాడో హస్తగతమైనవి. వీరి కల్పనాశిల్పము, భావనాబలము, రససిద్ధి ఏ పట్టులో చూచినా గోచరిస్తాయి. 'శృంగారవీథి'లోని 'స్నానసుందరి'లో ఆయన చెప్పుకున్న 'ఊరక రసాత్మతనే స్రవియించిపోదు' అన్న మాటలలో అతిశయోక్తి లేదు. రసానికి ఆయన ప్రాణము. ఆయన జీవితమే ఒక రసమయమైన కావ్యము. అది 'వేయి పడగల'లో వెల్లివిరిసినది. జాతీయతలోని జిగి మెరపులు చూస్తే వీరిలోనే చూడాలి. నవ్యత్వానికి ఎంత నవసిపోతాడో, సంప్రదాయానికి అంత చక్కగా లోబడతాడు. ఒక సామాన్య భావాన్ని చిత్రించడానికి ఈ కవి దృగ్గోచర రూపం గల ఒక సంజ్ఞ (Symbol) ను మొదట్లో ఏరుకుంటాడు. ఇది ప్రతికవికీ సహజమే. ఈయన ప్రత్యేకత అక్కడ బయలుదేరుతుంది. ఆ సంజ్ఞ ఎప్పుడైతే చేత చిక్కుతుందో అప్పుడా సామాన్యభావాన్ని మఱచిపోయి ఆ రూపాన్ని మనస్సులో ధారణ చేసి దాని సౌందర్యాన్ని మనస్సులో సూక్ష్మపరిశీలన (Minute Analysis) చేసి వేయివిధాలుగా నగిషీలు దిద్ది సర్వాంగ సుందరమైన చిత్రాన్ని బయట పెడతాడు. సామాన్యుల చేతిలో సాఫీగా ఒక గేయం కింద మారే కిన్నెర ఆయనలోని ఈ ఆత్మాంశ (Personality) వల్ల పుట్టి, నడకలు నడిచి, నాట్యం చేసి, సముద్రుడంత వాణ్ణి తనకోసం నవసిపోయేటట్లు చేసి, గోదావరి తల్లి గర్భంలో తలదాచుకుంటుంది. కోకిలమ్మ విషయమూ ఇంతే. పటుత్వం గల పెంపకంలో ఈయన ప్రజ్ఞ కిన్నెరసాని రూపచిత్రణము రససౌందర్యాల రమణీయతను పొంది కవి సృష్టి శిల్పానికి విశిష్టత చేకూర్చింది. కిన్నెర 'ఉద్విగ్న హృదయ' పతివ్రత, అత్తపోరు పడలేక అడవులపాలై కరిగి నీరై, నాగై ప్రవహిస్తుంది. ఆవేశహృదయంతో ఆమె చేసిన తప్పిదానికి పశ్చాత్తాప పడుతుంది. ఇంట్లోనుంచి ఏ సాహిత్య విమర్శ 495 కారణం చేత యువతులు లేచి వచ్చినా వాళ్ళ విషయం మన్ననకోసం ఇతరుల చెవిలో వేస్తుంటారు కొంతమంది. వాళ్ళే గాలిపిల్లలు, మబ్బుకన్నెలు. పతివ్రతలని కూడా భావించకుండా, గొడ్డు ఈనిందంటే గాట కట్టేయమనే రకం వాళ్ళు. వాళ్ళను పొందాలనే వాంఛతో ప్రయత్నాలను చేసే ప్రజలున్నారు. లోకంలో అటువంటివాడే సముద్రుడు. ఇంట్లోనుంచి ఈ కారణం వల్ల లేచి వచ్చిన వాళ్ళను పొగిడేవాళ్ళూ లోకంలో ఉన్నారు. వారే భూదేవత, పికిలిపిట్ట, కోకిల ప్రభృతులు. వారిని ఆదరించే గోదావరీ తల్లి లాంటి పుణ్యవనితలు కూడా ఉన్నారు. ప్రపంచంలో ఇదంతా విశ్వనాథ కిన్నెరసాని పాటలో చూపించిన మనస్తత్వము (Psychology). అన్య సంపర్కాలను ఆహ్వానించి, జాతిధర్మాన్ని నాశనం చేసేవారిని దేశం ఎంతోకాలం ఆదరించదనే “కోకిలమ్మ పెండ్లి" లోని సామాన్య సిద్ధాంతమైనట్లు స్ఫురిస్తుంది. వీరి భాష రసస్ఫూర్తిని బట్టి రకరకాలుగా పర్వెత్తుతుంది. గేయరచనలలో వీరు అనేక కొత్త నడకలు చూపించారు. అక్కడక్కడా శ్రుతికటువైన శబ్ద ప్రయోగం కనిపిస్తుంది. దానికి ప్రత్యేకమైన కారణాలేమన్నా ఉన్నవేమో! ఈ యుగంలో యెంకిపాటలు వంటి పాటలు వస్తే రావచ్చు కాని కిన్నెరసాని వంటి పాటలు మాత్రం ఆ కవి నోట తప్ప, రావని నా మూఢవిశ్వాసం. నిరీక్షిద్దాము. "సాహిత్య ప్రపంచంలో కొత్తరీతులకు దోవ చూపించింది, కొత్త రుచులు ఎరిగించింది, కవితాకన్యను మనోహరంగా, చూడ ముచ్చటగా అలంకరించింది. ఆమెకు క్రొత్త పోకడలు నేర్పింది నవకవులందరిలోకీ తొలుదొల్త శ్రీ శివశంకర శాస్త్రిగారే. ఆయన చూపని సులభోపాయం లేదు. కావ్యరచనావిధానానికి, అవుననక పోయినా అనుకరించని ఆధునికులూ లేరు" (రామకృష్ణ శాస్త్రి - కృష్ణాపత్రిక) శివ శంకర శాస్త్రి సంప్రదాయం చెడకుండా గేయకవితాకన్యకు ఎన్నో నూతనాలంకారాలు చేశాడు. అంతకుముందు తెలుగుకవికి తెలియని గీతికాస్వగతాలు, గీతినాట్యాలు, గీతికాసంవాదాలు, గేయ నాటికలు తెనుగులోకి తెచ్చాడు. ఈ రచనావిధానమే ఆయన విశిష్టత. నడకల్లో నానారూపాలు చూపించి ప్రసన్నతాగుణానికి తిరిగీ ప్రాణం పోసి గేయరచనలు చేస్తాడీ కవి. ప్రణయ చిహ్నంగా ప్రేయసీదత్తమై వాడిపోయిన వకుళమాలిక ముఖతః ప్రేయసీ హృదయాంతరాళాలను విప్పి చెప్పి, ఆత్మ పరిశీలన చేసుకొని చూపించాడు. అద్భుత సంఘటనలు, అమరగానము అన్ని మూలలా కావ్యంలో కళ్ళకు కనిపిస్తవి. చెవికి వినబడుతుంది. భావనాప్రపంచం నిజమని నమ్మించే శక్తి ఈయనలో పరసీమ 496 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 నందుకున్నది. ప్రణయతత్త్వము ఈ కవి గేయనాటికల్లో గంభీరమైన దివ్యలోకాలవైపు దృష్టిని త్రిప్పుతుంది. ప్రేమ నగరానికి దారి కష్టమైనదని, అది సాధన వల్లగాని సుగమము కాదని ఆయన సూచించే భావము. "ప్రేమ నగర కే రాహ కఠిన హై ప్రేయసి కయి నే నేయది యైనన్ సంతోషముతో సలుపగ నేర్తున్” అని పాడుకున్నాడు. అంత పండితుడైనా అనవసరంగా శబ్దకాఠిన్యానికి లొంగడు. ఈ గుణము పండిత కవులైన వాళ్ళల్లో ఉండటం అరుదు. శ్రుతి పుటాలకు చిన్నెలు దిద్దే గేయానికి రంగస్థలం మీదికి పరిపూర్ణ స్వరూపం రప్పించటానికి ప్రయత్నం చేసిన ప్రథమకవి శివశంకర శాస్త్రి. చిన్న పిల్లలకు చక్కని పాటలు వ్రాయడంతో దీక్షితులదే ఉపజ్ఞ. చక్కని జాతీయ భాష, శైలీ సౌలభ్యము, చక్కని మెట్లు, గానయోగ్యత, నాతిగంభీరభావనలు, పరిశీలన, వాతావరణము వీరి పిల్లల పాటలలో ప్రస్ఫుట మౌతవి. ఉత్తమ శ్రేణికి చెందే కావ్యశిల్ప గేయరచనలు కూడా కొద్దిగా చేశారు. మనస్సు సంతోషంతో గిలిగింతలు పెట్టించే వింత వింత భావాలమీదికి వెళుతుంది ఈ 'కథక చక్రవర్తి' మనస్సు. నవ్య గేయరచనలలో రెండు పద్ధతులు ఏర్పడ్డవి. ఒకటి భావకవుల రచనాపద్ధతి. రెండు క్రాంతిగీత రచనాపద్ధతి. ఇందులో మొదటి పద్దతిని అందరికీ అందుబాటులో ఉండకుండా సుదూరం పొడిగించిన కవి మల్లవరపు కమ్మని పదముల కూర్పంటే ఈ కవికి చాలా ఇష్టం. కొన్నిచోట్ల అర్థపుష్టి ఎంతవరకున్నదనే విషయం ఆలోచనీయాంశము. సంప్రదాయానికి ఇమడని అన్యసాహిత్య రచనాపద్ధతులేవో ప్రవేశపెట్టటానికి ప్రయత్నం చేయటం వల్ల, కొన్నిచోట్ల అన్వయ కాఠిన్యము గోచరిస్తుంది. మాత్రలు, యతులు పాటించి, లయను పాటించక పోవటము వల్ల ఏర్పడే కుంటుతనమున్నది కొన్నిచోట్ల. మల్లవరపు నిజంగా కవితాహృదయం గల 'ఒక మహాగర్వి కవికుమారుడు' మధుకీల. కల్యాణకింకిణి వీరికావ్యాలు. సంగీతానికి స్థానమిచ్చి వ్రాసిన ప్రేమ గీతాలు రెంటిలోనూ కనిపిస్తవి. ప్రేమోజ్జ్వలత, ఉన్మత్తత, 'ఉద్రేక తాండవము' గోచరిస్తుంటవి. మొదటి రచనలో కృష్ణశాస్త్రి, నాయని, బసవరాజుల ప్రోద్బలము “చాల ఉత్సాహం, చాల అపరిపక్వత, చాలా కావ్యదోషాలు ఉన్నవి. వాటిలోనే అంతర్లీనమై ఆశలు సాహిత్య విమర్శ 497 గొల్పుతూ ఒక కవితాకాంతి గూడా మెరుస్తూ ఉన్నది." రెండవ రచనలో ఈ లోపాలు కొన్ని లోపించి "స్వకీయమూ, పరిపూర్ణమూ అయిన వ్యక్తిత్వం” ప్రదర్శించాడు. నాటినుండీ వీరికి దేశంలో అనుయాయులేర్పడినారు. వీరి రచనలో కొన్ని అత్యుత్తమ శ్రేణికి చెందినవని ఒప్పుకొని తీరాలి. నూతన గేయరచనోద్యమాన్ని బయలుదేరదీసి దానికి నాయకుడైనవాడు శ్రీ.శ్రీ. 'అల్లకల్లోలమైన సుడిగుండంలా' ఈ కవి 'ఒక్కడే అనేకమంది యువకులను తనలోకి లాక్కుంటున్నాడు.' 'ఈ సుడిగుండంలో పడి' వ్యక్తిత్వం గల యువక హృదయాలు 'ఉక్కిరిబిక్కిరై' పోతున్నవి. కాని ఉద్యమనాయకుడెప్పుడూ ఋజుమార్గంలోనే ఉంటాడు. తన పూర్వులకు శైలీసౌలభ్యంలో సన్నిహితుడుగా ఉంటాడు. వారి ననుసరించే వారు చిత్రచిత్రాలు చేసి చివరకు ఒకప్పుడు అయోమయంలో పడిపోవటానికి అవకాశం కలుగుతుంది. విశ్వ శ్రేయస్సు కోరి, పరిస్థితులు మారటానికి విప్లవము సాధనగా నమ్మి, దేశాన్ని ప్రబోధిస్తూ ప్రపంచంలో ఘోరహత్యలు జరిగినవీ, జరుగుతున్నవీ, కళ్ళకు కట్టేటట్లు ఆవేశపూరిత హృదయంతో కవిత్వం చెప్పాడు శ్రీ.శ్రీ. 'అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి జగమంతా బలివితర్ది' నరజాతికి పరివర్తన - అనేది ఆయన నిశ్చయ లక్ష్యం ఇంత ఘాటైన కవితావేశం గల కవి తెలుగు నేలమీద ఎన్నడూ పుట్టలేదనే చెప్పాలి. 'ఉండాలోయ్ కవితావేశం కావాలోయ్ రసనిర్దేశం దొరకదటోయ్ శోభావేశం కళ్ళుంటే చూసే వాక్కుంటే వ్రాసే ప్రపంచ మొక పద్మవ్యూహం కవిత్వ మొక తీరనిదాహం - అని అంటాడీ కవి. 498 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 నూతన కవితావస్తువు, రచనాపద్ధతి కవితావేశం ప్రవేశపెట్టుటకు వీరి ప్రత్యేకత వీరి రచనామార్గాన్ని అనుసరించే వారిలో వీరి సౌలభ్యము, తత్త్వనిర్దేశము కేవల సంజ్ఞాపరిపోషక దృష్టిలోనూ, అతిశయ వ్యంగ్యసిద్ధిలోను, అతివేలమైన ఆవేశంలోనూ మాటుమణిగి పోతున్నవి. ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు, రాయప్రోలు సుబ్బారావు, తురగా వెంకట్రామయ్య, వేదుల సత్యనారాయణశాస్త్రి, బొడ్డు బాపిరాజు, దువ్వూరి రామిరెడ్డి, రామచంద్ర అప్పారావు, కొడాలి సుబ్బారావు, కొడాలి ఆంజనేయులు, శివరామం, అత్తిలి సూర్యనారాయణమూర్తి, ఉమామహేశ్, కుందుర్తి నరసింహారావు, కృత్తివాసతీర్థులు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, పిలకా గణపతిశాస్త్రి, పురిపండా అప్పలస్వామి, శ్రీరంగం నారాయణబాబు, రుక్మిణీనాథ శాస్త్రి, జనమంచి కామేశ్వరరావు, టేకుమళ్ళ కామేశ్వరరావు, కందుకూరు రామభద్రరావు, రజనీకాంతరావు, దేశిరాజు కృష్ణశర్మ, చిరంజీవి ప్రభృతులు వివిధ రకాలుగా గేయాలు వ్రాసి పేరు పొందారు, పొందుతున్నారు, పొందుతారు. ఆధునికులు గేయరచనలమీద అభిమానోత్సాహాలు ఇనుమడించి రసవంతమైన రచనలు చేస్తారని నమ్ముతూ, చెప్పవలసినది క్లుప్తంగా ప్రతిపాదించాననే తృప్తితో విరమిస్తున్నాను. ప్రతిభ, జూలై 1940, అక్టోబరు 1941 సాహిత్య విమర్శ 499