వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/సంక్రాంతి-సూర్యోపాసన

సంక్రాంతి - సూర్యోపాసన



“బ్రహ్మస్వరూప ముదయే
మధ్యాహ్నేతు మహేశ్వరమ్‌।
సాయం ధ్యాయే త్సదా విష్ణుం
త్రిమూర్తిశ్చ దివాకరః ॥”

'వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి. వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి.' సంక్రాంతి మూడుదినాల పండుగ. అంధ్రులూ, తమిళులూ ఈ పండుగను మిగిలినవాటికంటే విశేషంగా గౌరవిస్తారు. దేశాచారాలు ఎన్ని విధాలుగా మారినా ప్రధానోద్దేశం మాత్రం సూర్యోపాసన. సంక్రాంతి పండుగ ముఖ్యంగా కాలంలోని మార్పును సూచిస్తుంది. సూర్యభగవానుడు సంక్రాంతి నాటికి ఉత్తర దిక్కుగా ప్రయాణం ప్రారంభించి (డిసెంబరు 21) రెండు వారాలు దాటి ఉంటుంది. కానీ ఉత్తరాపథానికి ఆది అయిన మకరంలో పుష్య శుద్ధ పూర్ణిమ (జనవరి 14) నాడు గాని ప్రవేశింపడు. అందువల్ల ప్రాచీన కాలంనుంచీ సూర్యుని ఉత్తరాయణమును సంక్రాంతినాటినుండే పరిగణించటం భారతీయ సంప్రదాయం.

ఆంధ్రదేశంలో 'కన్యకలు' ధనుర్మాసారంభం నుంచీ “గొబ్బిళ్ళు” పెట్టుకుంటారు. ఇంటి ముందు రంగవల్లికలు తీర్చి, గోమయంతో అర్ధగోళాక్ళతులుగా 'గొబ్బిళ్ళు' చేసి పసుపు కుంకుమలతో అలంకరించి, పూల గొడుగులతో నిలుపుతారు. వీటిని చూస్తుంటే పురాతన బౌద్ధ స్తూపాలు జ్ఞప్తికి వస్తుంటవి. స్తూపానికి 'గొబ్బ' అనే పర్యాయపదం ఒకటి బౌద్ధ సాహిత్యంలో కనిపిస్తుంది. దానికి, 'గొబ్బి'కీ సన్నిహిత సంబంధం ఉన్నదని ఊహింపవచ్చును. అనాది కాలంలో బౌద్ధమత ప్రాబల్యం మూలంగా ఇది మన దేశంలో నిలిచి ఉంటుంది. కొందరు ప్రాతఃకాలంలో సగం ఉదయించిన సూర్యుణ్ణి చూచి స్ధపతి (Architct) స్తూపరూపాన్ని చిత్రించి నిర్మించాడని అభిప్రాయ మిచ్చారు. బౌద్ధుల కాలపు స్తూపారాధనము (సూర్యారాధనము) తరువాత హిందూ సంఘంలో గొబ్బి పూజగా ఏర్పడి ఉంటుందని నా అభిప్రాయము. ఇది ద్రావిడ సంప్రదాయమనీ, ఆంధ్రదేశంలోకి ప్రాకివచ్చిందనీ కొందరు సాంఘిక శాస్త్ర వేత్తల అభిప్రాయం ఒకటి ఉన్నది. (M. N. Srinivas's - Folk songs, Journal of the University of Bombay Vo. XVIII part I) వీటి పౌర్యాపర్యాలను గురించి చరిత్రకారులు చర్చింపవలసి ఉంది.

ఆంధ్రదేశంలో ఈ సంక్రాంతి పండుగ మూడు దినాలను భోగి, సంక్రాంతి, కనుమ పండుగ లంటారు. భోగినాడు తెల్లవారక ముందే 'భోగిమంటలు' వేసుకొని తలంటి పోసుకుంటారు. ఇవి బలిచక్రవర్తి ఏలుబడిలో ఉండే దినాలని ఒక నమ్మకం కూడా ఆంధ్రదేశంలో ఉంది. ఇది ఇంద్రసంబంధమైన పండుగనీ, వర్షాలూ, చలీ అంతం పొందించినందుకు అతనిని పూజించటమనీ కొందరి అభిప్రాయం. భోగినాటి సాయంత్రం బొమ్మలు పెట్టిస్తారు. ఇది బాలబాలికలకు పూర్వకాలంలో చిత్రకళ శిల్చకళలతో పరిచయం కలిగించటమని భావించవచ్చును. అ నాడే 'గవిరమ్మ'లు పెట్టి ముత్తయిదువలు మూడునాళ్ళూ చందన తాంబూలాది సత్కారాలతోనూ, పూజా పునస్కారాలతో పూజించి కనుమనాడు సాయం కాలం నదులున్నచోట నదుల్లోనూ, లేకపోతే వాపీ కూపాదుల్లోనూ ఓలలాడిస్తారు. అంతకు ముందు మేళతాళాలతో ఊరేగింపు జరుగుతుంది.

'గవిరమ్మ పూజ' ఆశ్వయుజ మాసంలో జరగవలసిన పండుగ. గవిరమ్మ కృషికి అధిదేవత. అమెను పూజించటము భంగ్యంతరముగా చంద్రోపాసన. ఆయన కృపవల్ల పంటలు బాగా పండినందుకు కృతజ్ఞత చూపిస్తూ కార్తిక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి, 'చంద్రపూజ' చేయటము ఆర్య సంప్రదాయము. కర్షకులు 'గవిరమ్మ' పండుగను అతివైభవంగా జరుపుతారు. భోగినాడు రాత్రి ఒక రవికగుడ్డ, బియ్యం మోయిన, దక్షిణ తాంబూలంతో కమ్మరి ఇంటికి వెళ్ళి, అతడు అంతకుముందు నిర్మించి ఉంచిన సంక్రుమయ్య విగ్రహాలను మేళతాళాలతో తీసుకోవచ్చి, పండుగనాడు, కనుమనాడూ పూజించి గౌరమ్మతోపాటు ఓలలాడిస్తారు. భోగినాడు సాయంత్రం బిడ్డలకు పళ్ళు పోసి ముత్తయిదువలకు వాళ్ళచేత తాంబూలాలిప్పించి దీవెనలు పొందుతారు. కనుమ పండుగతో ప్రారంభించి నూతన వధువులు సావిత్రీ గౌరి నోములు ప్రారంభించి తొమ్మిది దినాలు తొమ్మిది నైవేద్యాలతో, అనేక నియమాలతో శ్రద్ధాభక్తులతో చేస్తారు. పుట్టింటి పాక శాస్త్ర విజ్ఞానాన్ని నేర్చుకోవటమా ఇది అనిపిస్తుంది - నేడు కొంచెం ఊహించేవాళ్ళకు ఈ సావిత్రీ గౌరీ నోములు. అకలంక పాతివ్రత్యము దీనికి ముఖ్యోద్దేశం. అ సందర్భంలో సావిత్రి ఆదర్శమూర్తి.

సంక్రాంతి పండుగను పితృదినంగా పెద్దలు భావిస్తారు. అ నాడు తర్చణాదికాలు వదిలి పెడతారు. శ్రద్ధాభక్తులతో 'సావిత్రి' జపిస్తారు. పూర్వరాజన్యులు హేమాద్రివ్రత ఖండంలోని దానాలు చేసేవాళ్ళు. ఆంధ్రదేశంలో రాజులు వేయించిన దానశాసనాలలో విశేషభాగం సంక్రాంతి పుణ్యకాలంలో జరిగినవై ఉంటవి. ఎంతటి పేద ఐనా, వైదికుడైనా ఆ నాడు తిలతర్పణాలు విడిచి అధమం ఒక కూష్మాండాన్ని దానం చేసుకుంటాడు. ఇది విశ్వాండానికి ప్రత్యామ్నాయమైన దానం. జగత్సంజ్ఞ (Symbol). సంక్రాంతినాడు 'పొంగలి' చేసుకొని గౌరమ్మకు, సంక్రుమయ్యకు, ఇతర దేవతలకు నైవేద్యం పెట్టటం కనిపిస్తున్నది. 'పొంగలి' ఒక భోజ్యవిశేషము.

అరవలు సంక్రాంతిని 'పొన్గాల్' అంటారు. 'పొంగలి' పండుగకు మొదటి నామమై, తరువాత ఆ నాటి భోజ్యపదార్థానికి పేరై ఉంటుంది. 'పొన్' శబ్దానికి బంగారు అని అర్థము. 'సంక్రాంతి'ని 'బంగారు కాంతులు' అని వారు వ్యవహరిస్తారు. ఆ సూర్యుని 'హిరణ్మయునిగా' గణించటం వైదికము. వారు 'తైపొంగల్' అంటారు. తై (మాఘం) నెలలో సంక్రాంతి రావటం దీనికి కారణము.

తమిళ దేశంలో పూజాగృహాలలో చక్రాకృతిగా సూర్యుని సంజ్ఞను ఏర్పరచి ఆయన్ను నారాయణస్వరూపుణ్ణిగా పూజిస్తారట. కొత్త పంటలు రావటమూ, దానికి సూర్యుడు కారకుడని భావించటమూ దీని తాత్పర్యార్థంగా వారిలోనూ కనిపిస్తుంది. 'పొంగల్' పండుగ మర్నాటి దినాన్ని తమిళులు 'మాట్టు పొంగల్' అంటారు. అంటే పశువుల పండుగ. వారి పంటకు కారణం అయిన పశువులను వారు పూజిస్తారు. వాటికి స్నానం చేయించి పసుపుకుంకుమలతో అలంకరించి పూజ చేసి హారతులిచ్చి గోవుల పాటలు, నంది పాటలూ పాడుతారు. తెలుగు దేశంలోనూ నందిపాటలు 'వీథి వీథులంట విడువరమ్మ మా నందినీ శివనందినీ' ఇత్యాదులు - వినిపిస్తుంటవి. 'రాగల్లుదున్న' పాట ఇటువంటిదే. సంక్రాంతికి తమిళదేశంలో కృషీవలుడు 'కోడె పందాలు' వేస్తుంటాడు. బాగా మేపి పందాలు కట్టి తవెటు, డోళ్ళు, మద్దెలలతో ఉత్సాహాలు కల్పించి కోడెలను పోట్లాడిస్తారు. ఇవి చూచి తీరవలసినవి. 'మాట్టు పొంగల్' పండుగలో 'జల్లికట్టు' చాలా ప్రళయంగా ఉంటుంది. కొంత ధనం సంచిలో పోసి మదించిన కోడె కొమ్ముకు కట్టి దానిని వశపరచుకున్న వాళ్ళకు దానిని బహుమతిగా ఇస్తారు. ఇందుకోసం అనేకులు బలశాలురు వచ్చి గాయాలకూ, రక్తస్రావాలకు ఓర్చి, పశువులను లొంగదీసి బహుమతులు పుచ్చుకుంటారు. సంక్రాంతినాడు ఆంధ్ర గ్రామాల్లో కోడిపందాలు జరుపుకోవడం తెలిసిందే.

'ఆంధ్ర'లో 'కోడిపందాలు’

పొంగలి పండుగ మూడవనాడు తమిళ దేశంలో 'కన్నెల పాటలు' స్త్రీలు పాడుతారు. ఇందులో ముఖ్యంగా కన్యలు పాల్గొంటారు. మూడవదినం ఉదయమే లేచి మామిడితోపులకు వెళ్లి అక్కడ ఉన్న ఏడుగురు కన్నెరాళ్ళ దగ్గిరకు వెళ్ళి, పూజ అయిన తరువాత చక్రాకృతిగా చేరి, చేతులతో తాళం వేస్తూ పాటలు పాడుతారు. వాటినే 'గుమ్మి తట్టర పాట్టు' అంటారు. వంగి (కన్నెలకు) చప్పట్లు చరుచు పాటలని వీటి అర్థము. ఈ కన్నెలు ఎవరనే విషయంలో అభిప్రాయభేదాలున్నవి. వీరు ఎందరు అనేవిషయంలోనూ అభిప్రాయ భేదం ఉంది. కొన్నిట్లో ఏడుగురు అని కనిపిస్తున్నది. కన్నెపాటల్లో 'ఇంద తెరువిలే ఆరుకన్ని, అంద తెరువిలే ఆరు కన్ని' అనే పాటలవల్ల పన్నెండు మందిగా వ్యక్తమౌతున్నది. కొందరు వీరు ప్రకృతి శక్తులన్నారు. జైగన్ బాల్ అనే శాస్త్రజ్ఞుడు 'శక్తినుంచి ఏర్పడ్డ నూతన శక్తులు' అన్నాడు. (Geneology of South Indian Gods, B. Ziegenbalg - Translated into English by G.J. Metzger, Madras - P P 36-7) కొందరు ఈ కన్నెలను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రకృతి శక్తులన్నారు. కొందరు 1. మారెమ్మ, 2. ఎల్లమ్మ, 3. అంకాలమ్మ, 4. భద్రకాళి, 5. పిండారి, 6. చాముండ 7. దుర్గ, 8. పురన్నై 9. పుడికాళైలన్నారు. ఇందులో చివరి ఇద్దరూ అయనారు భార్యలట. తమిళ నిఘంటువు వీరు ఏడుగురు అక్క చెల్లెళ్ళనీ, వరుసగా పిఠామణి, నవయాని, మోక్షేశ్వరి, కౌమారి, వారాహి, రుద్రాణి అని చెపుతున్నది. వీరు సంస్కృత సాహిత్యంలోని సప్తమాతృకలు.

దక్షిణ భారతంలో కనుపించే ఆచార వ్యవహారాలలో కొన్ని ఆర్యసంప్రదాయాలూ, కొన్ని ద్రావిడ సంప్రదాయాలూ కనిపిస్తున్నవి. ద్రావిడ సంప్రదాయాలలో విశేషాలన్నీ అరవ దేశంలో కనిపిస్తవి. ఒక రచయిత ఉద్దేశాన్ననుసరించి 'ఉత్తర సర్కారుల వారు అరవదేశం నుంచి గొబ్బిపూజ, పొంగలి నైవేద్యము గ్రహించినారు. వారు 'మాట్టు పొంగల్' ను గ్రహించలేదు. కడప, చిత్తూరు జిల్లాలకు, తమిళ దేశానికి దగ్గర సంబంధం ఉండటం వల్ల అక్కడ పశువుల పండుగ కూడా కనిపిస్తున్నది. కన్నడులు 'పొంగలి'కి పశుపూజను గ్రహించారు. కాని ధనుర్మాసంలో 'గొబ్బిపూజ' ను, అక్కడి గొబ్బిపాటలను నృత్యాన్ని గ్రహించలేదు. కాని గొబ్బి, ఆంధ్రదేశం నుంచి తమిళ దేశానికి వెళ్ళినట్లు కనిపిస్తుంది. బౌద్ధం ఆంధ్రంలో వ్యాపించినట్లు తమిళ దేశములో లేదు. గొబ్బి పాటలు తెలుగుదేశంలో విశేషంగా కనిపిస్తున్నవి.

సంక్రాంతి పండుగను ఉత్తరాయణ పుణ్యకాలం అని ఆంధ్రులు వ్యవహరిస్తారు. 'అయన' శబ్దానికి మార్గమని అర్థము. 'రషాభ్యాం నో ణస్సమానపదే' అనే పాణినీయసూత్రం వల్ల 'అయణము' ఔతుంది. సూర్యుడు పన్నెండు రాశుల్లో ప్రయాణం చేయటానికి పన్నెండు నెలల కాలం పడుతుంది. ఆయన కటకాది నుంచి మకరం వరకూ దక్షిణంగానూ, మకరం నుంచి కటకం వరకూ ఉత్తరంగానూ పయనిస్తాడు. అందువల్ల జ్యోతిష శాస్త్రజ్ఞులు సూర్యదేవుని మార్గాన్ని ఉత్తరాయణమూ, దక్షిణాయనమూ అని రెండు విధాలుగా విభాగించారు. 'పంచపాదం పితరం ద్వాదశాకృతం దివ ఆహుః పరే అర్ద పురీషిణమ్, అథేమే అన్య ఉపరే విచక్షణమ్ సప్తచక్రే షడర ఆహు రర్పితమితి' (ఋగ్వేదము 1-164-12). (కొందరు ఇతణ్ణి అయిదు పాదాలు పన్నెండు రూపాలు ద్వాదశమాసాలు కలిగిన పిత అనీ, ఏడు చక్రాలూ ఆరు ఆరాలు (షడృతువులు) కలవాడనీ, వర్ష ప్రదాత అనీ అంటారు) దీనిని బట్టి సూర్యుడు ప్రాణమనీ, కాలకర్త అనీ, విభక్త అనీ, జగత్పిత అనీ భారతీయులు ఋగ్వేదకాలంనుండే గ్రహించినట్లు అర్థమౌతున్నది. ఈ శ్రుతి ప్రమాణానికి అనుగుణంగా ప్రశ్నోపనిత్తులోని 'సంవత్సరోవై ప్రజాపతిః, తస్యాయనే దక్షిణాం చోత్తరం చ తథ్యేహవై తదిష్టాత్పూర్తే కృత మిత్యువాసరే, తే చంద్రమస వేన – లోకమభి జయంతే, తమేహ పునరావర్తతే, తస్మాదేతి ఋషయః ప్రజా కామా దక్షిణం ప్రతి ప్రతిపద్యంతే, ఏషహవై రయిర్యః పితృయాణః' (ప్రశ్నోపనిషత్తు ప్రథమ ప్రశ్న 9. సంవత్సరము ప్రజాపతి ఉత్తర దక్షిణాలు. ఆయన మార్గాలు. ఇష్టా పూర్తమొనర్చినాడు. చంద్రలోకాన్ని చేరుతాడు. ఇది పితృయానము. ) ఉత్తర ప్రయాణాన్ని దేవయానంగా చెప్పినారు. అందువల్లనే అది పుణ్యకాలం అయింది. 'శుభాన్ని' కలిగించేది కాబట్టి పుణ్యము. ఆదిత్యోహవై ప్రాణో; రైరేవ చంద్రమా (ఆదిత్యుడు ప్రాణము; పదార్థము చంద్రుడు) అని శ్రుతి ప్రమాణాలు కనిపించటం వల్ల, భీష్మాదులు ఉత్తరాయణ పుణ్యకాలంలో మృతి పొందటం వల్ల పునర్జన్మ కలగదనే భావంతో దానిని ఆశించి నిరీక్షించారు. సూర్యుడు ఉత్తరాయణం వేళ జ్యోతిస్సును లోకానికి ప్రసాదించటం వల్ల పుణ్యనదుల్లో స్నానమూ, కూష్మాండాది మహాదానాలూ అలాంటి వేళ చేయటం యుక్తమని ఆర్యులు భావించారు. ఇటువంటి విజ్ఞానంతో ఎవరైతే ఆయనను పూజిస్తారో, భావించి, దర్శిస్తారో వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందట. 'అథోత్తరేణ తపసా బ్రహ్మ చర్యేణ శ్రద్ధయా విద్యాత్మాన మన్విష్యాదిత్య మభిజయస్తే' అనేది దీనికి ప్రతి ప్రమాణము.

పతంజలి యోగశాస్త్రాన్ని లోకంలో ప్రవేశపెట్టిన తరువాత, ఈ ఉత్తర దక్షిణాయనాలు రెండూ సూర్య సంబంధమైన ఆదిత్యుని పరంగా అందులో ప్రవేశించినవి. కాశీ ఖండంలో మహాకవి శ్రీనాథుడు యోగశాస్త్ర విషయకమైన ఉత్తరాయణ దక్షిణాయన విభేదాన్ని క్రింది రీతిగా నిరూపించినాడు. 'ప్రాణంబ ఆదిత్యుండు ఆదిత్యుండ చంద్రుండు... ఇడా నాడియందు చంద్రుం డధివసించి యుండుం గావున నందు పవనం బుద్దమించు కాలంబు రాత్రి. ప్రవేశించు కాలంబు పగలు. పింగళానాడియందు సూర్యుం డధివసించుగావున మకరాయన సమయంబున దక్షిణ దిగవస్థితుండగు సూర్యుండు కర్కటాయన పర్యంతంబు నుత్తరంబు నడుచుటం జేసి ఉత్తరాయణం బయ్యె. ఈ చందంబున నుత్తరంబు పింగళాస్థితుండగు పవనుండు యావత్కాలంబు నీడయందు సంక్రమించునంత కాలంబుత్తరాయణం బీ ప్రకారంబున దక్షిణాయనంబు నెఱుంగునది. ఇది స్కాందపురాణ రహస్యము. మానవుని ప్రాణ ముద్గమించునట్లు జగత్ప్రణమైన సూర్యుడు నాక్షమునుండి బయలు దేరినాడు. తిరిగి నాక్షమును చేరినచో సూర్యగోళముండదు. '

సంక్రాంతిని ఉత్తరాయణ సంక్రాంతి అనటమే కాక సంక్రమణము అని అనటమూ కద్దు. 'సంక్రుమయ్య' సంక్రమణానికి ప్రతీక. ప్రతిమా రూపాన్ని పొందిన దేవత. సంక్రమణ శబ్దాన్ని యోగశాస్త్రపరంగా మహాకవి శ్రీనాథుడు కాశీఖండంలోనే 'మొదల సుషుమ్న జొచ్చు నిడబుట్టిన గాడుపు కొంతసేపునం బిదప సుషుమ్న బుట్టిన సమీపము జొచ్చునిడాఖ్య నాడికన్, మొదల పిమ్మటన్ బవనముల్ తిరుగంబడి చొచ్చు గాన, నయ్యదనులు సంక్రమంబులని యాడుదురాగమ తత్వకోవిదుల్' అని అన్నాడు. సూర్యుడు దక్షిణ మార్గాన నడుస్తున్నప్పుడు, ఆయన కిరణాలవల్ల పుట్టిన గాలులు ఉత్తరాపథాన నడవటం ప్రారంభించిన తరువాత పుట్టిన గాలులతో తిరగబడి పోరాటం వల్ల సంక్రమణం ఏర్పడుతుంది.

మకర సంక్రాంతిని భారతదేశంలోని కొన్ని ప్రాంతాలవారు అజసంక్రాంతి అని కూడా వ్యవహరిస్తారు. ఋగ్వేదంలో ఇంద్రుడు చేసిన అనేక ఘనకార్యాలలో ఒకటి, ఒక మేక చేత పులిని చంపించటం. అది 'అత్రేణ చిత్తద్వేకం చకా సింహ్యం చిత్వేత్వే నాజఘానం’ (Viii-18-17) అన్న సూక్తం వల్ల తెలుస్తున్నది. ఇది ఒకానొక జ్యోతిషాంశానికి పూర్వ ఋగ్వేద కవులు కల్పించిన కవితాస్వరూపమని నేటి భారతీయ, జ్యోతిష శాస్త్రవేత్తల అభిప్రాయము. సింహరాశి అస్తమిస్తేగాని అజరాశి (మకరం) ఉదయించదు. పూషుని రథాన్ని అజము లాగినట్లు ఋగ్వేదంలో అనేక వర్ణనలు కనిపిస్తున్నవి. ఇది కేవలం అజము కాదు; కొంత మీనము; కొంత అజము. అందువల్ల మన్మథుడు (ధనుస్సు) మొదట మీనకేతనుడు; తదుపరి అజము - మకరంగా భావితం కావటం ప్రారంభం కాగానే మకరకేతను డైనాడు.

సంక్రాంతి సూర్యోపాసన, 'రావణునితో యుద్ధం చేస్తూ అలసిపోయిన రామచంద్రునికి అగస్త్యులవారు ఉపదేశించినట్లు, ఆదిత్య హృదయాన్ని, మహర్షి వాల్మీకి చెపుతూ ఆదిత్యుడు సమస్త' మని చెప్పినాడు. 'సర్వదేవాత్మ కోహ్యేషు తేజస్వీ రశ్మిభావనః । ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధః ప్రజాపతిః | మహేంద్రో ధనదః కాలో యమస్సోమోహ్యపాంపతిః || పితరో వసవస్సాధ్యో హశ్వినౌ మరుతో మనుః । వాయుర్వహ్ని ప్రజాప్రాణా ఋతుకర్తా ప్రభాకరః ॥'

అని పలికి 'సూర్య ఆత్మా జగతస్తస్థు షశ్చ' అన్న శ్రుతి ప్రమాణాన్ని ప్రపంచీకరించాడు. ఆ అభిప్రాయాన్నే సంధ్యావందన మంత్రం 'హిరణ్య వర్ణాశ్శుచయః పావకా, యాసు జాతః కశ్యపోయా స్విన్ద్రః యా గర్భం దధిరే విరాపాస్థాన అపశర్మ్యధ్ స్యోనాభవంతు (బంగారు రంగులు కలవీ, పరిశుద్ధము లైనవీ, పావనం చేసేవీ, వేని యందు సూర్యుడు, ఇంద్రుడు పుట్టినారో, ఏ పరమాత్మ అగ్నిని గర్భాన ధరించినాడో, విశ్వరూపి ఐన ఆ పరమాత్మ మాకు శుభాలు ఇచ్చుగాక!' అంగీకరిస్తున్నది.

ఋగ్వేదంలో 'ఆదిత్యవర్గం' కనిపిస్తున్నది. అందులో సూర్యుడు తప్ప తక్కినవారు జ్యోతిర్గోళ స్వరూపాన్ని పొందినట్లున్నది. కొన్ని సందర్భాలలో వారు సూర్యునికి పర్యాయనామములుగా వర్ణితులైనారు. ఋగ్వేదం (మం. VII 36-2) సూర్యుడు, సావిత్రి ఉషానాథులనీ, (మం. VII ఋ75-5) సూర్యుడు అదితి పుత్రుడనీ ఉన్నది. సావిత్రీమైత్రేయులు అదితి పుత్రులట. (మం. VIII 18-3; 11-271). సూర్యుడు ఏడు గుర్రాల రథాన్ని ఎక్కి వస్తాడని (VII-60-3), సావిత్రి రెండు గుర్రాల రథము ఎక్కుతాడట (మం.1-35-2). వీరు దుస్స్వప్న దోషాపహర్తలనీ, పిశాచాలను పారద్రోలగలవారనీ (X-37 (4) 1-3-6) ఉన్నది. ఈశోపనిషత్తులో వర్ణితుడైన పురుషుడు ఆదిత్యవర్గంలోని వాడే. తదుపరి ద్వాదశాదిత్యులైనారు. సూర్యుడు విష్ణ్వంశ సంభూతుడైనాడు. విష్ణు పురాణంలోని 'వైష్ణవోం శబరస్సూర్యః అంతర్జ్యోతి రసంపం అయాయాత మోంకారం తస్య తత్ప్రేరకం పరమ్' అన్న వాక్యాలవల్ల సూర్యుడు విష్ణ్వంశ సంభూతుడనీ, ఓంకారము అతనిని ప్రేరేపించగలదనీ తెలుస్తున్నది. క్రమంగా ఆయన సూర్యనారాయణుడైనాడు.

యాస్క సిద్దాంతాన్ని బట్టి దేవతలు ముగ్గురే. 1. సూర్యుడు, 2. అగ్ని 3. వాయువు. భూలోకదేవత అగ్ని అంతరిక్ష దేవత వాయువు, ద్యులోక దేవత సూర్యుడు. మిగిలినవారు సూర్యునివల్ల ఉద్భవించినట్లు నిరుక్తం నిరూపిస్తున్నది. 'పత్య తేచాగ్ని దిత్య ఉదకం చందమాస్మృతః, శేషాణాం ప్రకృతిం సమ్యగ్వర్థ్య మాణాం నిబోధత' అన్న వాయుపురాణ వాక్యం వల్ల (53, 10) సూర్యునికి కారణం జ్యోతి అని అర్థమౌతున్నది. చాక్షుష మనువు కాలంలో అదితికి కాశ్యపునివల్ల విశాఖానక్షత్రాన సూర్యుడు పుట్టినాడనీ, (53,3) వర్షానికి అతడే కారకుడని (51, 21) విష్ణుపురాణ, వాయుపురాణాలవల్ల వ్యక్తమౌతున్నది. ఆదిత్య శబ్దాన్ని యాస్కాచార్యులు 'ఆదత్తే రసాన్ భాసాన్ జ్యోతిషి' అని నిర్వచించారు. పురాణాలవల్ల సూర్యుడికి సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వశ్రవ, సంయద్వను, అర్యవసు, స్వరలనే ఏడు కిరణాలు (సప్తాశ్వాలు) ఉన్నట్లు తెలుస్తున్నది. గురు శనులు సూర్యునిలోని మబ్బులట. బృహత్సంహితలో ఈ వైజ్ఞానిక విషయం నిరూపితమైంది. 'నక్షత్ర గ్రహతారాణా మధి పో విశ్వభావనః తేజస్వీ, ద్వాదశాత్మా నమోస్తుతే' అన్న విష్ణుపురాణ వాక్యం వల్ల (10-40) కాలాధినాథుడుగ సూర్యుడు ధ్యానితు డౌతున్నాడు.

సూర్యుణ్ణి గురించి అనేక ఇతిహాసాలు వేదాల్లోనూ, పురాణాలలోనూ కనిపిస్తున్నవి. ఋగ్వేదంలో (175-4) ఇంద్రుడు సూర్యుని రథ చక్రాలను గ్రహించినట్లు ఒక గాథ ఉంది. రాహు కేతువుల గ్రహణము రామాయణములో ఉన్నది. సూర్యునికి 'సూర్యా' అనే కుమార్తె ఉన్నట్లును, ఆమె అశ్వినీ దేవతలతో కలిసి వారి రథము మీద తిరిగినట్లు ఋగ్వేదమున అనేక స్థలములందున్నది. ఆమెకు పూషునితోనూ, చంద్రునితోనూ సంబంధమున్నట్లు (మం. VI ఋ 58-4) తెలియుచున్నది.

సూర్యుడు కవి ఐనట్లు ఋగ్వేద మంత్రము లున్నవి. యాజ్ఞవల్క్యునికి వేదార్థములను బోధించాడట. సూర్యుడు 'సంజ్ఞ'ను వివాహమాడగా నామె అతని ప్రతిభను సహింపలేక 'ఛాయ' యను పరిచారికను అతనికిచ్చి, అరణ్యములకు పోయి ఆడగుర్రపు రూపము పొంది ఉండగా సూర్యుడు మగ గుర్రమై ఆమెతో విహరింపగా అశ్వినీ దేవతలు జన్మించినట్లు ఒక ఇతిహాసమున్నది. సంజ్ఞాదేవి తండ్రి అల్లుని ప్రతిభను తగ్గించటానికి ఒక కొలత బద్ద నెక్కించి ఎనిమిదవ వంతు తెగగొట్టగా విరిగిన భాగం వల్ల విష్ణుచక్రము, శివుని త్రిశూలమూ, కార్తికేయుడి బరిసె కలిగినట్లు పురాణాల్లో కొన్ని ఇతిహాసాలు కనిపిస్తున్నవి.

భారత దేశంలో అనాది కాలం నుంచీ నానా రూపాల సూర్యోపాసన కనిపిస్తున్నది. ఛాందోగ్యాది ఉపనిషత్తులలోనూ, సౌరమంత్ర పాఠములలోనూ సూర్యకిరణారాధన మున్నది. సూర్యుడు భారతములో అష్టోత్తర నామాలతో కీర్తితుడైనాడు. స్కాందమున సూర్యుని అష్టోత్తరము, గాయత్రీ ప్రభావమూ కన్పించుచున్నవి. 'దైవమైన సావిత్రి 352 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 అప్రతిమానమహిమ నాకు ప్రాప్తించుగాక' అన్నది గాయత్రికి అర్థము. బౌద్ధ జాతకాలాలో సూర్యోపాసన ఉన్నది. బౌద్ధుల స్తూపమే ఉదయసూర్యునికి సంజ్ఞ.

భారతదేశంలోని సూర్యోపాసన వల్ల మొదట కొందరు పౌరులు ఏర్పడ్డారు. వారు క్రమంగా నశించి వైష్ణవులైనారు. ఒరిస్సాలో బౌద్ధం వైష్ణవ ప్రభావం వల్ల మారి సూర్యోపాసనగా మారింది. కోణార్క దేవాలయం భారతదేశ సూర్యదేవాలయాలలో అత్యుత్తమమైంది. భువనేశ్వరంలోనూ, ముల్తానులోనూ మరి రెండు దేవాలయాలు కనిపిస్తున్నవి. ఎల్లోరాలో కేవలం శిల్పమే ఉన్నది.

ఒరిస్సా చరిత్ర వ్రాసిన హంటర్ మహాశయుడు 'Sun-worship in Orissa formed one of the religions into which Buddhism disintegrated, a religion of Vaishnavite type, identified with the Vishnavite dynasty. From the earliest times, Vaishnavaism and Sun worship stand together in close affinity, indeed, in the Vedas, Vishnu who developed into the second diety of the Hindu triad, appears only as a form of the Sun' (Hunter's Orissapp. 228) ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చినాడు.

సూర్యదేవుని విగ్రహ నిర్మాణ విషయంలో శిల్పశాస్త్రాలు రెండు విధాలుగా ఉన్నవి. రథం మీద పద్మంలో కూర్చునిగాని, నిలుచొని గానీ సప్తాశ్వాలు లాగుతూ ఉన్నట్లు చిత్రితుడు కావలెనని నియమం ఉంది. ముందు అనూరుడు సారథిగా ఉంటాడు. కొన్ని సందర్భాలలో అతని భార్యలు ఇద్దరూ ఉంటుంటారు. ఉష కూడా ఉండవచ్చు, మూడవ భార్యగా. దండ, పింగళులు అతని ద్వారపాలకులు. పింగళుడు, కుంభోదరుడు. కత్తిగాని, మషీపాత్రను గానీ, పట్టుకొని ఉంటాడు. దండుడు చేతిలో కత్తి, దండము, శంఖములలో ఒకదానిని పట్టుకొని ఉంటాడు. మత్స్యపురాణంలోనూ, బృహత్సంహితలోనూ సూర్య విగ్రహాలు నిర్మించేటప్పుడు స్థపతి మోకాలి దగ్గిరనుంచి క్రింది భాగాన్ని చిత్రించకూడదని ఉన్నది. దానికి గొప్ప శాపం విధించారు. (Iconography of Buddhist and Brahminical Sculptures N.K. Bhattasati p. 157) అందువలన ఆ భాగం ఏ సూర్యవిగ్రహానికీ కనిపించదు. కొన్ని సందర్భాలలో నాగులు ఆయన రథాన్ని అడ్డుకుంటున్నట్లు చిత్రిస్తారు. దీనిని గురించి భోజరాజు ఆస్థానంలో ఒక వృద్ధ కవయిత్రి చెప్పిన చాటువులో 'రథస్యైకం చక్రం భుజగనమితాః సప్తతురగాః, నిరాలంబోమార్గః, చరణవికల స్సారథి రపి, రవిర్యాత్యేవాంతం, ప్రతిదిన మపారస్య నభసః, క్రియాసిద్ధిస్సత్తే భవతి మహతాం నోపకరణే' అని 'భుజగ నమితా’ అన్న పదం వలన అర్థమౌతున్నది. ఈ నాగులు మందేహరాక్షసులనీ, బ్రాహ్మణుల మంత్రజలాలవల్ల వారు తొలగిపోతారని ప్రమాణాలు కనిపిస్తున్నవి.

సమస్త జగదాధారభూతుడైన ఆదిత్యుణ్ణి భారతీయులు 'జోక్య సూర్యం దృశే బుద్ధితో పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం నందామ శరదశ్శతం మోదామ శరదశ్శతం, భవామ శరదశ్శతం, శ్రుణునామ శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శతం మజీతాస్స్యామ శరదశ్శతం మణభావాలకు ప్రబ్రవామ శరదశ్శత మజీతాస్స్యామ శరదశ్శతం' అని అర్థిస్తుంటారు. ఆయన్నే పరమాత్మ స్వరూపుణ్ణిగా ధ్యానిస్తారు. 'ఉద్యన్త మస్తంయన్త మాదిత్య మభిధ్యాయన్ కుర్వ నాహ్మణో విద్వాన్ సకలం భద్ర మశ్నుతే' (ఉదయాస్తమయాలు కలిగి స్వయం ప్రకాశం గల సూర్యుని ధ్యానం చేస్తూ, ప్రదక్షిణం చేస్తూ ఈ సూర్యుడే భగవంతునిగా ఎరిగిన జ్ఞాని సకల శుభాలనూ పొందుతాడు.) అన్న శ్రుతి ప్రమాణాన్ని శిరసా వహిస్తారు.

అడుగో - ఆదికవి; ద్రష్ట - ‘చిరుసాన బట్టించి చికిలి వేయించిన గండ్రగొడ్డలి నిశాగహనలతకు, గార్కొన్న నిబిడాంధకారధారాచ్ఛటా సత్రవాటికి వీతిహోత్రజిహ్వ, నక్షత్రకుముదకాననము గిల్లెడు బోటి ప్రాచీ నెత్తిన హస్తపల్లవాగ్ర, మరసి మింటికి మంటికైక్య సందేహంబు బరిహరింపంగ బాల్పడ్డ యవధి, సీ. తే.గీ. సృష్టి కట్టఱ్ఱ తొలుసంజ చెలిమికాడు, కుంటు వినతామహాదేవి కొడుకుగుఱ్ఱ, సవితృసారథి కట్టెర్రచాయ దెలుప నరుణుడుదయించె ప్రాగ్దిశాభ్యంతరమున. ' 354 - ఆంధ్రపతిక్ర - 1949 జనవరి 12 వావిలాల సోమయాజులు సాహిత్యం-4