వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/శ్రీగణవతి

శ్రీగణపతి

"గణానాం గణపతిగ్ం హవామహే
కవిం కవీనా ముపమశ్రవ స్తమమ్ |
జ్యేష్ఠరాజమ్ బ్రహ్మణామ్ బ్రహ్మణస్పత
ఆనః శ్రుణ్వ న్నూతిభిః సీద సాదనమ్||" ఋగ్వేదము 11-28-1

“ఈ సమస్తమైన దేవతాగణాలన్నిటికీ నీవే ప్రభువు, నాయకుడవు, బుద్ధిమంతులలో నీవే బుద్ధిమంతుడవు. ప్రఖ్యాత పురుషుల్లో అగ్రగణ్యుడవు. మా ప్రార్థనలూ, పూజలూ, యజ్ఞాలూ మొదలైన సమస్త కర్మలకూ నీవే రాజువు ఓ బ్రహ్మణస్పతీ! యజ్ఞస్థానాన్ని అధిష్ఠింపుము.”

గణపతి విఘ్నకర్తగానూ, విఘ్నహర్తగానూ భక్తగణాల పూజ లందుకుంటున్న దేవతామూర్తి. అయితేనేం, విఘ్నేశ్వరుడి పెళ్ళికి వేయి విఘ్నాలన్న సామెత తెలుగుదేశంలో నిత్యమూ ప్రచలితమౌతున్నది. ఈ విఘ్నాలను హాస్యరస ప్రియుడైన ఆయన కల్పించుకున్నవేనా? సమస్తకార్యారంభాలలో విఘ్ననాథుణ్ణి కొలవవలసిన ఆచారం భారతీయులలో ఉంది. అది ఆయన జన్మించినప్పటినుంచీ వచ్చి ఉంటుందా? ఆయనకు తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరుల వివాహానికి విఘ్నేశ్వరపూజ సప్తర్షులు జరిగించినట్లున్నది. ఇదేమిటి, ఇటువంటి వైరుధ్యాలే ఆయన రూప విషయంలోనూ ఎన్నో గోచరిస్తున్నవి. అంతటి మహామూర్తికి ఆ మూషకవాహనం ఎక్కడ చాలుతుంది? ఇదీ హాస్య ప్రియత్వమా? ఏకదంతం, శూర్పకర్ణద్వయం, గజాననం ఇత్యాది లక్షణాలను పేర్కొంటున్న ఆ అష్టోత్తర శతాలే ఆయన్ను నవమన్మథుడని స్తుతిస్తున్న వేమిటి? దేవగణాధిపత్యానికి, హాస్యరస ప్రియత్వానికి ఏ దిక్కుకే దిక్కు? అందుకనే భావుకులకు వినాయకుణ్ణి (విశేషమైన నాయకుడు, విశిష్టమైన నాయకుడు) వైరుధ్యాలకు ఒక సంజ్ఞామూర్తి (Symbol of Incongruieties) గా మన ప్రాచీనులు భావించి రూపకల్పన చేసి ఉంటారని తలపోయటానికి అవకాశం కలుగుతున్నది1.

ఆయన బ్రహ్మచారిట! అయితేనేం సిద్ధి, బుద్ధి ఇద్దరూ ఆయన భార్యలు. ఇదీ ఈ హాస్య రసాధిదేవతకు ఉచితమైన చేష్టగానే కనిపిస్తున్నది. గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మచర్యం నడపవచ్చుగదా అనుకుంటే అటువంటివాడికి ఏ సిద్ధి, బుద్ధి చాలదా అని శంక కలుగుతుంది. అందువల్ల ఈ బహుపత్నీత్వ బ్రహ్మచర్యం హాస్యాభిమానాన్ని వెల్లడిస్తున్నది. సాహిత్య గ్రంథాలు పరికిస్తే ప్రత్యేకంగా ఈ రసాభిమానం ఆయనకు చిన్ననాడే అలవడ్డది. అప్పకవి చెప్పిన ఆయన చిన్ననాటి చేష్ట యిందుకో గొప్ప ఉదాహరణ - "తను గని యెత్తుననె దక్షజయం, నిటలాక్షుడు, న్ముదంబున నిరు చెక్కులం గదిసి ముద్దు గొనంగ, నొకింత నెమ్ముగ బనువుగ వెన్కకుం దిగిచి, యత్నవిహీన పరస్పరాస్యచుంబనములు, తల్లిదండ్రులకు బన్నుగ గూర్చు, గజాస్యు గొల్చెదన్.”

భారతదేశంలో వినాయకుణ్ణి హిందువులు, బౌద్ధులు, జైనులు మూడు మతాలవారూ కొలుస్తున్నారు. ఈ దేవతామూర్తి కేవలం భారతదేశంలోనే కాదు, నేపాళము, చైనీయ తుర్కీ స్థానము తిబ్బత్తు, బర్మా, సయాం, ఇండోచైనా, జపానుదేశాల్లో భక్తవత్సలుడై పూజాదికాలను అందుకుంటున్నాడు. హీనయానబౌద్ధులు గణాధిపతిని ఎరుగరు. ఆయన మహాయాన వజ్రయాన బౌద్ధాలలో ప్రవేశించాడు. బుద్ధ భగవానుడు రాజగృహంలో, గణేశ శక్తిగా భావితమౌతూ వున్న గణేశ మహామంత్రాన్ని ప్రియశిష్యుడైన ఆనందునికి చెప్పినట్లు, మహాయానబౌద్దులు పలుకుతున్నారు. వారి సంప్రదాయంలో ఈ మంత్రానికి గణేశ హృదయమని నామం'2. నేపాళము, తిబ్బత్తులలో ఉన్న శిల్పంలో ఆయన విగ్రహాలు అనేక రీతులలో శిల్పితాలై ఉన్నవి. వాటిలో ఆయన కేవలం ఒక దేవతామూర్తి మాత్రమే కాడు, బౌద్ధ దేవతలందరితో పోరాడే రాక్షస శ్రేష్ఠుడు. చైనీయులు, జపానీయులు గణపతిని రూపద్వయ మూర్తినిగా దర్శించి శిల్పించుకున్నారు. ఆ రెండు రూపాలలో ఒక రూపం భారతదేశంలో సర్వసామాన్యంగా కనిపిస్తున్నది. రెండవ రూపానికి ఉదాహరణలు భారతదేశంలో లేవు. అది 'అర్ధనారీ - గణపతి' మూర్తి. భారతదేశంలో గణాధిపతి విద్యాధనదేవత, క్షేత్రపాలకుడు. గ్రామాలకు నలుమూలలా వుండి ఆయన రక్ష చేస్తుంటాడు. శాక్తేయం ప్రబలిన కాలంలో దాని ప్రభావం వల్ల తంత్ర గ్రంథజాలం అభివృద్ధి పొందింది. వాటి ప్రభావం బౌద్ధంలో ప్రవేశించిన కాలంలో ఇటువంటి 'అర్ధనారీ గణపతి' రూపాన్ని శిల్పి దర్శించి ఉంటాడని ప్రతిమా శాస్త్రజ్ఞులు (iconographists) అభిప్రాయ మిస్తున్నారు.

రుద్ర గణాలకు అధిపతి గణపతి. అథర్వశిరోపనిషత్తులో రుద్రుడే గణపతి అయినట్లు ఒక సూక్తం కనిపిస్తున్నది. మహాభారతం ఆనుశాసనిక పర్వంలో కొందరు గణేశ్వరులూ, వినాయకులు కొందరూ వున్నారు. శతరుద్రీయంలో గణపతి అత్యుత్తమమైన దేవతామూర్తి అనీ, మానవకర్మలకు ఆయన సాక్షీ భూతుడనీ నిరూపితమైంది. మానవగృహ్య సూత్రంలో నలుగురు గణపతులు కనిపిస్తున్నారు. వారు నలుగురూ విఘ్న నాయకులు. యాజ్ఞ్యవల్క్యస్మృతిలో బ్రహ్మ, రుద్రుడూ, ఇరువురూ కలిసి షణ్ణామధారి అయిన గణపతిని సృజించి, మానవలోకానికి కామ్యార్థ సిద్ధ్యర్థం ప్రసాదించినట్లు చెప్పి ఉంది. గుప్తుల కాలంలో ఉన్న శిలా లేఖనాల్లో గణాధిపుని నామం కనిపించటం లేదు. కాని వారి కాలంలో నాటినది, ప్రసిద్ధి పొందిన పాలై దేవాలయ స్తంభ శిల్పాలల్లో, గణాధిపుని రూపం కనిపిస్తున్నది. ఎల్లోరాలోని రెండు గుహల్లో గణపతి శిల్పాలున్నవి. అందువల్ల గుప్తులకాలంలో అప్పుడప్పుడే ఆరంభమైన గణాధిపుని పూజ, క్రీ.శ. 3, 8 శతాబ్దాల మధ్యకాలంలో భారతదేశాన ప్రాచుర్యం వహించి ఉంటుందని చరిత్రజ్ఞులు పలుకుతున్నారు. క్రీ.శ 376 నాటి శిలాశాసనంలోని రచనవల్ల ఆ నాటికి వినాయకునికి గజానన మున్నట్లు లేదట! అది ఎలా వచ్చింది అర్థం కావటం లేదని 'మిశ్రబంధు' ఒకచోట వ్రాసినారు. ఈ గజాననము భవభూతి గ్రంథజాలంలోనూ, ఎల్లోరా శిల్పాలలోనూ, పాలై శిల్పాలలోనూ కనిపిస్తున్నది. ఋగ్వేదంలో బ్రహ్మణస్పతి సూక్తాన బృహస్పతి, గణపతి ఇరువురూ గణపతి యయినట్లు వున్నది. ఆయన రూపం క్రమక్రమంగా నేటి మూర్తిని తాల్చి వుంటుంది. ఆయనకు త్రిమూర్తుల కంటే అధికమైన స్థానం వచ్చి వుంటుంది. క్రీ.శ. 10వ శతాబ్ది నాటికి, ఆయనకు ప్రత్యేక దేవాలయాలు వచ్చినవి. తిరుచ్చి గుహా దేవాలయాలలోని 'ఉచ్చిప్ప పిళ్ళయార్ కోయిల్' కేవలం గణపతి దేవాలయంగా ప్రసిద్ధమై ఒప్పుతున్నది.

వినాయక చతుర్థినాడు మనమందరమూ మృద్గణేశుణ్ణి పూజిస్తున్నాము. శివుడు గజాసుర సంహారానికి వెళ్ళిన సందర్భంలో పార్వతి అభ్యంగన స్నానం చేస్తూ నలుచుకున్న మట్టితో ఒక విగ్రహాన్ని చేసి ప్రాణం పోసి తండ్రిని లోపలికి రానీయకుండా వాకిట చౌకీదారుగా నియమించిందట. ఆయన వచ్చి లోపలికి ప్రవేశించబోతూ ఉండగా ఇతడు అడ్డుకున్నాడని, శిరస్సు ఖండించిన తరువాత పార్వతి వల్ల సమస్తమూ తెలుసుకుని గజాననము తెచ్చి అతికించిన పిమ్మట విఘ్న నాయకుడు గజాస్యుడైనాడని మార్కండేయ పురాణ కథ వల్ల వ్యక్తమౌతున్నది. ఈ కథ వంగదేశంలోనూ ప్రచారంలో ఉంది. ఈ విషయాన్ని దుర్గాషష్ఠిని పరిశీలించటం వల్ల నిర్ధారణ చేయవచ్చును. భారతదేశంలో అనేక ప్రాంతవాసులు దుర్గాపూజ జరిపే సందర్భంలో విఘ్నేశ్వరుణ్ని ఆచారాన్ని బట్టి అయిదు దినాలో, వారము దినాలో ఉంచి తల్లితో పాటు నదికి తీసుకుపోయి అందులో కలుపుతున్నారు. దాన్ని ఆధారంగా చేసుకొని శబ్ద శాస్త్రవేత్తలూ, మానవశాస్త్రజ్ఞులు (Ethnologists) గణేశుణ్ణి భాద్రపద మాసంలో వచ్చే పంటదేవతగా (Harvest god) నిరూపించటానికి యత్నించారు. ఈ విషయాన్నీ గుప్తే మహాశయుడు ఆయన హిందువుల పండుగలు అనే గ్రంథంలో ఇలా వ్రాసినాడు.

"Philologists and Ethnographists have tried to trace the origin of Ganesh to the Harvest season, comparing Parvati to the earth, and the clay of which the figure was made, to the alluvial crust found on the banks of the rivers soon after the Bhadra pada crop. Some derive his origin from the letter 'Om' but a recent examination of the signs of the zodiac discloses the origin of the belly, from the big body of the crab, or Cancer (Karkataka) which stands in heaven just near SHIVA, who as the male part of the GEMINI (Mithuna) intervenes between the female part of that sign (Parvati) and the Zodaical sign of Cancer or the crab of big belly."*

గణాధిపతి ప్రధాన లక్షణాలను అనుసరించి పైరీతిగా ఆయనను భాద్రపదమాసంలోని పంటదేవతగా భావించటానికి అవకాశం ఉంది. పైరీతిగా భావించిన వారు ఆయన మూషకవాహన లక్షణాన్ని కూడా సమన్వయించారు. మూషకశబ్దం (ముష్) ధాతువువల్ల జనిస్తున్నది. పంటపొలంలో ఉండే దొంగ ఎలుకలను పట్టుకోడానికి పంటదేవత అయిన విఘ్నేశ్వరుడు మూషకవాహనుడు కావలసివచ్చిందని వారు భావించారు. ఆయన గజాననము బహుశః కర్షకుని రూపం నుంచి వచ్చి ఉండవచ్చునని వారి అభిప్రాయం. కర్షకుడు, తలమీద కోసిన ధాన్యాన్ని మోసుకొని వస్తుంటే వేలాడే చివరలను చూచినవానికి ప్రథమంలో గజాననుని రూపం గోచరించి ఉంటుందనీ, దానిని అందరూ అంగీకరించి ఉంటారని వారన్నారు. ఆధిక్యమును ఏనుగుతో పోల్చటం కద్దు. అందువల్ల అధికమైన పంటను తెలియజేసే దేవతతో గజసంబంధాన్ని కల్పించి ఉంటారని కొందరు ఊహించారు. ఆయన లంబోదరత్వము పంటను దాచి ఉంచే గాదెలను సూచించవచ్చునని వారిలో మరికొందరు అభిప్రాయ పడ్డారు. కాళియదమనుడు విజయసూచకంగా ఫణి ఫణాగ్రాలమీద నృత్యం చేసినట్లు, తాను ఎలుకలబారినుండి రక్షించిన పంటను చూచి, మిమ్మల్ని నేను జయించాను చూచారా, అన్న విజయ భావాన్ని సూచించటానికే పూర్వులు ఈ పంట దేవతకు మూషక వాహనాన్ని కల్పించి ఉంటారని కొందరన్నారు.

గణేశుని ఏకదంత శూర్పకర్ణాలకు కూడా వారిలో కొందరు ఇటువంటి ఊహలు చేయకపోలేదు. ఆయన ఏకదంతము నాగలి, శూర్పములు నూతన ఫలసాయానికి చిహ్నాలుగా నిశ్చయించి నాగలిమీద అటూ ఇటూ క్రొత్తచేటలు వేసుకొని వస్తూ వున్న రూపము గజముఖాన్ని జ్ఞప్తికి చేస్తుందనీ, అందువల్ల అనాది భావుకుడు విఘ్నేశ్వరుడిని గజాననుడిగా దర్శించి ఉంటాడనీ కొందరు ఊహించారు. ఆయన ఆహారం కూడా క్రొత్తపంటనే తెలియజేస్తూ ఆయన పంట దేవత అని అనటానికి అవకాశం కల్పిస్తున్నది వారి మతం. అన్నీ భాద్రపదమాసానికి సంబంధించినవి. పిండి మోదకాలు, ఇక్షురసం, నారికేళము ఇత్యాదులు. ఆయన లంబోదరం మీద నాగపాశాలు పొలంలో ఉండే ఎలుకలను భక్షించే పాములకు చిహ్నాలని కూడా పైవారు ఊహించారు.

ఈ రీతిగా మానవశాస్త్రజ్ఞులు (Ethnographists) గణేశుని మెక్సికో దేశంలోని ధాన్యదేవతతోనూ, టోంగాద్వీపాలలోని ఆలో ఆలోతోను, గ్రీకుల డిమిటర్, రోమనుల సిరీస్తోనూ పోల్చుకుంటూ వచ్చి, ఆయన లక్షణాలను భాద్రపదమాసం నాటి కర్షక జీవితంలోని అంశాలతో సమన్వయించినారు. సంఘం అభివృద్ధి పొందిన తరువాత తాత్త్వికాభివృద్ధి వల్ల సమస్త సిద్ధి ప్రదాతయై విఘ్నహర్త అయి ఉంటాడని వారు నిశ్చయించినారు.

మనదేశంలో శ్రావణ గౌరిని సాగనంపడంలో గడచిన ఋతువు మృతిని వ్యక్తం చేస్తారు. ఆమెతో బాటు కొన్ని ప్రాంతాల్లో మృద్గణేశుని తిరిగి త్వరగా రమ్మని పంపుతారు. పశ్చిమ భారతదేశంలోని కొన్ని జాతులవారు గణపతిని ‘బొప్పా, మోరియా?' అని వ్యవహరిస్తారు. మహారాష్ట్ర దేశంలో పిల్లలు దానికి 'పుధారియా వర్షీ లౌ కారియా' అనే మాటలను కలిపి గణపతిని త్వరగా తిరిగి రమ్మని వేడుకుంటారు. ఇందులోని మోరియా శబ్దాన్ని సామాన్యకర్షకుడు మోహేరాయా (అందరికంటే త్వరగా రా) అని ఉచ్చరిస్తాడు. ఈ రూపాన్ని తరువాత కాలంలో విద్యాధికులు మరొక విధంగా అర్థం చేసుకొని ఉండటం వల్ల మహారాష్ట్ర దేశంలోనూ, పశ్చిమ భారతంలోని మరికొన్ని ప్రాంతాలలోనూ గణపతిని మయూరేశ్వరుడుగా భావించి, మహాగణపతిని మయూరవాహనుడిగా రూపిస్తూ ఉన్నారు.

గణపతికి సంబంధించిన అనేక కథలు పురాణాల్లో కనిపిస్తున్నవి. బ్రహ్మ వైవర్తపురాణంలో, శివపార్వతులు క్రీడాపరాయణులై ఉన్న సందర్భంలో దేవతలు వచ్చినట్లూ, ఆ సమయంలో శివవీర్యం నేలమీద పడటం వల్ల విఘ్నేశ్వరుడు ఉదయించినట్లు, ఒకానొక కశ్యపశాపం వల్ల అలా ఉదయించిన పుత్రుణ్ణి శివుడు చూడగానే అతని శీర్షం బ్రద్దలు కాగా, దేవతలు పుష్పభద్రనదీ తీరంలో ఉన్న గజము శిరస్సు తీసుకోవచ్చి ఆ బాలునికి అతకటం వల్ల అతడు గజముఖుడైనట్లూ, ఒక కథ ఉంది. వెనుక పేర్కొన్న కథ కాకుండా మార్కండేయ పురాణంలో విఘ్నేశ్వరుణ్ణి గురించి మరొక కథ కనిపిస్తున్నది. జలానికీ, భూమికీ, రూపం ఉంది కానీ ఆకాశానికి లేదు. ఒక సందర్భంలో శివుడు ఆకాశంవైపు తీక్షంగా చూచాడట! ఆ సమయంలో ఆకాశాన గజాస్యుడు సుందర రూపంతో జన్మించాడు. అతనిమీద పార్వతికే మోహం జనించింది. అతణ్ణి సంహరించటంకోసం శివుడు రుద్రగణాలను సృజించాడు. వారికి ఆయన చెమట బిందువులలో నుంచి జన్మించిన ప్రముఖుడు గజాననుడు అధిపతి అయినాడు. ఆ నాటినుంచీ గణపతి రుద్రగణాలకు అధిపతిగా అభిషిక్తుడైనాడట! శివ పురాణంలో విఘ్నేశ్వరుని బుద్ధి వైశద్యాన్ని తెలియజేసే ఒక కథ చెప్పి ఉంది.

కుమార విఘ్నేశ్వరుల నిద్దరినీ పిలిచి మీలో ముందుగా ఎవరు భూప్రదక్షిణం చేసి వస్తే వారికి వివాహం చేస్తామన్నారు. కుమారుడు మయూరవాహనాన్ని, విఘ్నేశ్వరుడు మూషకవాహనాన్ని అధిరోహించి భూప్రదక్షిణానికని బయలుదేరారు. బుద్ధిమంతుడైన విఘ్నేశ్వరుడు వెంటనే తిరిగివచ్చి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి నా భూప్రదక్షిణమైపోయింది, నాకు వివాహం చెయ్యమని కోరినాడట. అతని తెలివితేటలకు సంతోషించి పార్వతీపరమేశ్వరులు, సిద్ధి, బుద్ధి, నిచ్చి వివాహం చేశారు. ఆయనకు సిద్ధివల్ల క్షేముడు, బుద్దివల్ల లాభుడు అనే ఇద్దరు పుత్రులు జన్మించారు.

గజాననుని ఏకదంతానికి సంబంధించిన క్రింది కథ బ్రహ్మాండపురాణం వల్ల తెలుస్తున్నది. కార్తవీర్యుని సంహరించి పరశురాముడు గురువర్యుడైన శివుని దర్శించటానికి వచ్చిన సందర్భంలో ఆయనకు విఘ్నేశ్వరునితో పోరాటం సంభవించింది. ఆయనను గణపతి తొండంతో పైకియెత్తి ఏడు లోకాలూ చూపించాడు. పరశురాముడు దిగ్భ్రామ చెంది పరశువుతో కొట్టినాడు. గజాస్యుని దంతం ఒకటి నేల మీద పడ్డది. అందువల్ల గణపతి ఏకదంతుడైనాడు.

ముద్గల పురాణంలో గణపతికి ముప్పదిరెండు మూర్తి భేదాలున్నట్లు చెప్పి ఉంది. వాటిలో సిద్ధి వినాయకుడు, సత్య వినాయకుడు, చోరగణేశుడు, మహా గణేశుడు, హేరంబగణేశుడు, హరిద్రగణేశుడు, ఉచ్ఛిష్ట గణపతి మొదలైనవారు ముఖ్యులు. సుదాముడు, మదనావతులకు సంబంధించిన బ్రహ్మాండ పురాణాంతర్గతమైన కథ సత్యవినాయకునికి సంబంధించినది.

జపం చేస్తూ ఉన్న సందర్భంలో జపమాలలోని అక్షాలను లెక్కపెట్టటంలో మోసం చేసినా, మరచిపోయినా లెక్క వేస్తూ పట్టుకొనేవాడు చోర గణపతి. సిద్ధి వినాయకుణ్ణి గురించి మహాభారతంలో ధర్మరాజుకు కృష్ణభగవానుడు ఇలా చెప్పినట్లుంది. యుద్ధసన్నద్ధులై కురుక్షేత్రంలో కౌరవ పాండవులు నిలచినప్పుడు 'ఏ దేవత మనకు సిద్ధిని చేకూరుస్తాడు?' అని యుధిష్ఠిరుడు కృష్ణ భగవానున్ని ప్రశ్నిస్తే, ఆయన సిద్ధి గణేశుని నామాన్ని ఉచ్చరించి ఆయనను పూజింపవలసిన విధానాన్ని విపులంగా పేర్కొన్నాడు. ఆయనకు ఇరువది ఒక్క పత్రి, దూర్వాంకురాలూ ఇష్టమని చెప్పినాడు. బంగారు గణేశ విగ్రహాన్ని బ్రాహ్మణునికి దానం చెయ్యవలెననీ, సమస్త దేవతాపూజకు ముందూ సిద్ధివిఘ్నేశ్వర పూజ జరిగించాలనీ, గణేశపూజ వల్ల చండికామాతృశ్రీ సంతోషిస్తుందనీ, భాద్రపద శుద్ధ చతుర్థినాడు గణేశపూజ చేస్తే దానికి కైలాసంలో దేవతలందరూ సంతోషిస్తారనీ, పరాశర మహర్షి శాపకారణంగా ఆ పండుగనాడు చంద్రుని చూడగూడదనీ ఆ భారత భాగం వల్లనే కృష్ణ భగవానుడు ధర్మరాజు కుపదేశించినట్లు తెలుస్తున్నది. ఒకవేళ పొరబాటున ఆ నాడు ఎవరైనా చంద్రుణ్ణి చూడటం సంభవిస్తే "సింహప్రసేన మవధి త్సింహే జాంబవంత హంతః” అని అనవలెననీ, దానికి మూలకారణమైన శమంతకమణి కథనాన్ని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పినట్లు స్కాందపురాణంలో ఉంది.

యాస్కాచార్యులవారు 'గణ' శబ్దాన్ని వాక్కుకు ముప్పదియెనిమిదవ నామంగా లెక్కపెట్టి నారు. ముప్పదియవ నామము ఘోషము. స్కంద స్వామి దానికి "ఉచ్యతే యితి వాక్. ఇంద్రియమ్, తత్కార్యః శబ్దాప్యుచ్యతే ఇతి వాక్ తదధిష్ఠాత్యపి దేవతా వా గణిష్యతే" అని వ్యాఖ్యానించినాడు. క్షీరస్వామి "గణః గణనాత్ సహి గణ్యతే వసుసంయోగాత్ గుణశ్చ గుణాపి గణనాదేవ, అసావహిహి గణ్యత ఏవ - ద్విగుణః, త్రిగుణః" అనినాడు., అందువల్ల గణపతి అష్టోత్తర శతాలలో నాగధిష్ఠాన దైవతము, శబ్దగమ్యుడు అయినాడు.

గణపతి గణేశ మంత్రానికి ప్రధాన బీజాక్షరం 'గం' దీని శక్తులు 1. తీవ్ర (ధా) తీవ్ వ్యాపించు, అనంతమైన, తీక్షమైన, 2. జ్వాలినీ - మండు: 3. నందా: సౌఖ్యము, సమృద్ధి 4. భోగదా : సౌఖ్యానుభవము, సంపద (ధా. ఘుజ్) 5. కామరూపిణీ 6. ఉగ్ర 'గణ'కు శక్తిగా ఉన్న ఉచ్ నుంచి వచ్చినది. 7. తేజవతీ 8. సత్య 9. విఘ్ననాశినీ గణేశమంత్ర ద్రష్టను తంత్రగ్రంథాలు 'గణకర్షి' (Calculator) అని పేర్కొన్నవి. అతడు కుంకుమ వంటినాడు. త్రినయనుడు. కుండబొజ్జవాడు. చేత ఒక దంతాన్ని ధరించి ఉంటాడు. ఒక అంకుశము ధరించి ఉంటాడు. ఈ వర్ణనంతా ఆ తంత్రాలలోనే కనిపిస్తున్నది. వక్రతుండుడు, ఏకదంతుడు, లంబోదరుడు, మహోదరుడు, గజాననుడు, వికటుడు - అతని అనుచరులు. గణకర్షి రూపాన్ని అనుసరించి గణపతికి నేటి దేవతామూర్తి వచ్చి ఉంటుందని కొందరూహిస్తున్నారు.,

మహాగణేశ్వరుని మహామంత్రం 'ఓం, హ్రీం, శ్రీం, క్లీం, క్లైం, గ్లెం, గం, గణపతయే వరవరదసర్వ జనం మే వశమానయ స్వాహా' - అని. ఇందులో ముఖ్యమైన అక్షరాలు ఇరువది ఒకటి మాత్రము, అందువల్ల గణపతికి ఇరువది యొకటి ముఖ్యమైన సంఖ్య. అన్ని పత్రులు, అన్ని కుడుములు పెట్టటము మనకు లక్షణము.

మహాగణేశుని రూపాన్ని గురించి వ్రాస్తూ ఒక అభిజ్ఞుడు ఇలా వ్రాసినాడు. 'Mahaganesa is a fanciful figure better imagined than modelled. A Sea of cane juice which naturally attracts bees and wasps; and the elephant headed God has to perpetually fan them with his broad flapping elephant ears, for he has the head of an elephant with three eyes. An elephant rutting and as such Mahaganesa has his spouse Paducakara seated on his left thigh and embracing an amorous bejewelled Ganesa : a Veritable NOU VEAUX riches. ⁹6

కొన్ని గ్రంథాలు మహాగణేశుని హేరంబుని ఒకే దేవతామూర్తిగా భావించినవి. హేరంబశబ్దాన్ని 'హః : శంకరః హేతతే సమీపే రమతే తిష్యతా' అని సాధింపవచ్చును. హేరంబుడు బంగారువర్ణము కలవాడు. త్రినయనుడు. సింహవాహనుడు. ఆయన హస్తాలలో ఒకటి అభయహస్తము. ఒక కొమ్ము, గొడ్డలి, జపమాల, గద, అంకుశము, త్రిశూలము ఆయన ఆయుధాలు. విఘ్న, వినాయక, శూర, వీర, వరద, ఇభవక్త్ర, ఏకదంతులు ఇతని పరిచారకులు. ఇతనికి బీజాక్షరం 'గం.' ముద్గల పురాణంలో హేరంబుని గురించిన రూపవర్ణనాదులు విశదంగా కనిపిస్తున్నవి. ఆయన గజతుండము సూటిగా నుండి కుడికిగాని ఎడమకుగాని తిరిగి ఉండటం మరొక శిల్పశాస్త్ర లక్షణము. ఈయనను పంచముఖ వినాయకుడని కూడా శిల్పరత్నము, ముద్గల పురాణము వ్యవహరించినవి. మనదేశంలో తిరుముద్రియూరు దేవాలయంలో పంచముఖ వినాయకుని శిలావిగ్రహం ఒకటి అతి సుందరశిల్పం కనిపిస్తున్నది. ఆ విగ్రహానికి ఉన్న పంచ శీర్షాలమీదను కారండమకుటాలు ఉన్నవి. సర్వసామాన్యంగా ఉండవలసిన యజ్ఞోపవీతం కనుపించదు.

హరిద్రాగణపతికి బీజాక్షరం గ్లం. గాయత్రి ఛందము. చోరగణేశుడు మంత్రజప సందర్భాలలో తప్పిదం చేయకుండా ఉండటానికి ఏర్పడ్డ దేవత. 'గణేశవిమర్శిని' అనే గ్రంథంలో చోరగణేశ మంత్రం 'న జప్త్వా కర్మ మాత్రం న కుర్యాత్, యది కుర్యాత్ తదా దోష ఉక్తో వర్ణవిలాస తంత్ర' అని ఉంది. ఇతని మంత్రం గ్లాం. బ్రహ్మ దానికి ద్రష్ట. ఉచ్ఛిష్ట గణపతి దేవతా ఉచ్ఛిష్టాన్ని స్వీకరిస్తాడు. హిందూ దేశంలో హస్తిపకులు ఉచ్ఛిష్టాన్ని భుజించటం కారణమై ఉంటుంది. డుంఠి విఘ్నేశుని రూపాన్ని మహాకవి శ్రీనాథుడు కాశీఖండంలో పేర్కొన్నాడు. చండీ గణేశరూపానికి ఇండోనీషియా, బృహద్భారతం (Greater India) లో అనేక శిలాప్రతిమలు ఉదాహరణాలుగా కనిపిస్తున్నవి.

సామాన్యంగా పుణ్యాహకర్మచేయిస్తూ పురోహితుడు 'యత్పుణ్యం నక్షత్రం, తద్వదకుర్వీతి లోపఘ్యుషమ్, యదావై సూర్య ఉదేతి, అథ నక్షత్రం నైతియావతి తత్ర సూర్యోగచ్ఛేత్, యత్ర జఘన్యం పశ్యేత్, తావత్కుర్వంతి యత్కారస్యాత్ పుణ్యాహ ఏవ కురుతే (తైత్తిరీయ బ్రాహ్మణము 1,5,2,1) అనే మంత్రాన్ని వినిపిస్తాడు. సూర్యోదయ కాలానికి ముందు ఉషఃకాలంలో తూర్పున ఏ నక్షత్రం ఉదయిస్తుందో గమనించి, ఆ నక్షత్రాన్ని పూజించటం భారతీయులకు అనూచానంగా వస్తున్న ఆచారం. ఈ అభిప్రాయాన్నే నిరూపిస్తూ ఋగ్వేద మంత్రం ఒకటి 'ప్రాతర్యవాణా ప్రథమా యజధ్వమ్ నోరనసామయన్తి దేవాయా అజుష్టమ్' (ఋగ్వేదము V 77. 1) ఈ రీతిగా ఉంది. సూర్యోదయానికి పూర్వం తూర్పున ఏ నక్షత్రం ఉదయిస్తే ఆ నాడు ఆ నక్షత్ర సంబంధమైన దేవతను ముందు మనం పూజించాలి. లేకపోతే సూర్యాస్తమయ సమయంలో ఉదయించే నక్షత్ర దేవతనైనా పూజించాలి. అని ఈ మంత్రానికి తాత్పర్యం. భాద్రపదచవితినాడు సూర్యోదయాత్పూర్వం మనకు విఘ్నేశ్వర నక్షత్రం కనిపిస్తుంది. అందువల్ల ఆ నాడు గణపతిని పూజిస్తున్నాము. మర్నాడు ఋషిపంచమి. ఆ కారణం చేత భాద్రపదమాసారంభం నుంచీ విఘ్నేశ్వర నక్షత్రం సప్తర్షుల ప్రక్కన ఉంటాడు. ఈ కారణాలవల్లనే విఘ్నేశ్వరుని జ్యోతిష రూపుడని అష్టోత్తర శతాలు పలకడం.

దేవతలే నక్షత్రాలు.' పాశ్చాత్యులు సప్తర్షి మండలం నాగలి ఆకారంలో ఉంటుందని అన్నారు. గ్రిమాల్డి అనే పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్త చీనాదేశ నక్షత్రపట్టికలో మూషకరూపం ప్రక్కన సప్తర్షులు ఉన్నట్లు చూపినాడు. సింహం మీదుగా ఒక ఏనుగుతలతో ఉన్న మనుష్యరూపం ఉందిట వాటిలో. అందువల్ల గజముఖుడు, లంబోదరుడూ, మూషకవాహనుడూ అయిన విఘ్నేశ్వరుడు జ్యోతిష రూపుడు. భాద్రపద శుద్ధచవితినాడు ఉదయానికి ముందు ఉదయించిన విఘ్నేశ్వరుడు, చైత్రశుద్ధ చవితినాడు సూర్యాస్తమయ సమయంలో తూర్పున కనిపిస్తాడు. అందువల్ల నేటికీ అస్సాం రాష్ట్రంలోదిగా పరిగణిత మౌతున్న కామరూపంలో, ఆ నాడు విఘ్నేశ్వర పూజ చేస్తారు. ఈ విధంగా చవితినాడూ, చైత్రశుద్ధ చవితి నాడూ విఘ్నేశ్వర పూజ చేయటం పైన ఉదహరించిన ఋగ్వేద మంత్రాన్ని అనుసరించి వైదికాచారాలే. మన పంచాంగాల్లో మాఘశుద్ధ చవితి గణేశ పూజ అని వ్రాసి ఉంటుంది. చైత్రశుద్ధ చవితినాడు విఘ్నేశ నక్షత్రదర్శనం అయినా, ఆయన మాఘశుద్ధ చవితినాడే ఉదయించటం వల్లనే ఆ నాడు గణేశ పూజ అయింది. ఇందువల్లనే సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు స్వామికణ్ణు పిళ్లై గణేశ చతుర్థి మాఘశుద్ధ చవితి అని నిర్ణయించినారు.

విఘ్నేశ్వరునికి సంబంధించిన గజముఖ, శమంతకోపాఖ్యానాలను జ్యోతిష శాస్త్రజ్ఞులు ఖగోళ శాస్త్రరీత్యా సమన్వయం చేసినారు.

గజాసురుడు ఘోరమైన తపస్సు చేసి లోక కంటకుడైన సందర్భములో విష్ణువు మాయానర్తకుని వేషంలో వచ్చి బ్రహ్మ, నంది, నారదుల సహాయంతో నాట్యం అతణ్ణి ప్రాణమివ్వమని కోరినాడు. అతడు అంగీకరించి శివునికీ తనకూ నిత్యసాన్నిధ్యం కోరుకున్నాడు. ఆ కారణం చేత నంది వెళ్ళి గజసంహారం చేసి అతని శిరస్సును తెచ్చి పార్వతిచేసిన పిండిబొమ్మకు అతికించినాడు. గజాసురుడు కోరినట్లు అతని ముఖానికి ప్రథమపూజ ఆ నాటినుంచీ జరుగుతూ వున్నది. విఘ్నేశ్వరుడు గజముఖుడైనాడు. ఇది పురాణ కథనం. దీనిని ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ క్రిందివిధంగా సమన్వయిస్తున్నారు.

'అర్ద్ర' రుద్రుడు. అశ్వని, భరణి కృత్తికా నక్షత్రాలు నాగవీథి; రోహిణి, మృగశిర, ఆర్ద్ర నక్షత్రములు కుజవీథి, ఈశ్వరుడు గజవీధిలో ఇరుకు కోవలసి వచ్చినది. వృషభరాశి నంది, వృషభము గజుని చంపినది, వృషభము అర్ధను మిథునముతో జేర్చుటకు తోడ్పడినది. ఇంతకుముందు గజుని మూలముగా వేరైనా పార్వతీ పరమేశ్వరులు మరల నొకటైనారు.

“మఖ, పుబ్బ, ఉత్తర 1/4, సింహరాశి, సప్తర్షి మండలం జ్యోతిష శాస్త్రంలో బృహదక్షమని పిలువబడుతున్నది. అందే జాంబవంతుడు, సప్తర్షులలోని వాడు పడమటి చుక్కలు రెండూ ఇట మఖ సింహమును, ఆట ధ్రువుని (URSA - MINOR - చిన్న ఎలుగుబంటు) జూపుచున్నవి.' దీని ననుసరించి ఏర్పడ్డదే శమంతకోపాఖ్యాన కథ. విష్ణుపురాణంలో జాంబవంతుని కుమారుని దాది 'సింహః' ప్రసేన మవధీత్సింహా జాంబవతాహతః, సుకుమారక మారోదీస్తవ హ్యేష శ్యమంతకః" అని చెప్పింది. విఘ్నేశ్వరుడు చవితినాడు హస్తానక్షత్రంలో కలిసి వుంటాడు. అందువల్ల హస్తి (గజము) హస్తకూ ఏమైనా సంబంధం ఉండి వుంటుందా అని శ్రీ గొబ్బూరి వెంకట ఆనందరాఘవరావుగారు ఊహించినారు. వేదములో 'హస్తానక్షత్రం సవితాదేవతా' అని ఉందట! సత్రాజిత్తు సూర్యుణ్ణి ఆరాధించి శమంతక మణిని సంపాదించినట్లు ఉన్న కథకూ, దీనికీ ఏమైనా సంబంధం ఉంటుందా?

ఆచార్య శంకరుల తరువాత సూర్య, శివ, శక్తి, సుబ్రహ్మణ్య, గణేశ, విష్ణు సంప్రదాయాలు వచ్చినవి. వీరిలో గాణాపత్యులు గణపతిని శివునికంటే అధికునిగా భావించి ఆయనకు పంచముఖాలు, త్రినయనాలూ కొన్ని సందర్భాల్లో కల్పించినారు. వినాయకుణ్ణి వారు శివుని ఆకాశ శక్తిగా భావించినారు. అనంతాకాశాన్ని వ్యక్తం చేయటానికి బహుళ గోళాలను మోదక రూపాలుగా భావించి ఆయన కడుపును అంత విశాలమైనదానినిగా ఊహించి ఉంటారా? అనంతానందగిరి, గాణాపత్యులలో ఆరు సంప్రదాయాలున్నట్లు పేర్కొన్నాడు. వారిలో ప్రథములు మహాగణపత్యుపాసకులు. ఈ సంప్రదాయానుయాయులు వామ మార్గాన్ని అనుసరించి అశ్లీలమైన గణపతిమూర్తిని ఆరాధిస్తారట. నవనీత, సంతాన, స్వర్ణ గణపతులను ఉపాసించేవారు శ్రాతవిధులను అనుసరిస్తారట. గాణాపత్యుల మతంలో కార్యారంభాల్లో గణపతిని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లు 'ఓం లం నమస్తే గణపతయే త్వ మేవ ప్రత్యక్షం, తత్త్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్మాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ కేవలం ఖల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యమ్” ఇత్యాది వాక్యాలవల్ల గాణాపత్యులు గణపతిని వసు, రుద్ర, ఆదిత్య రూపుడైన పరమాత్మనుగా భావించారనటం నిస్సందేహము. అందువల్ల ఆయన అవతారమూర్తులను కొన్నిటిని కల్పించి ఈ దేశంలో కొన్ని కథలు కూడా వ్యాప్తిలోకి వచ్చినవి. అటువంటి కథలు దక్షిణ దేశంలో చిన్న పిల్లలకోసం మురుగేశ మొదలియారు వ్రాసినాడు. ఈ కథలో ముఖ్యంగా గమనింపదగ్గ అంశం కంసునికీ కృష్ణునికీ ఉన్న సంబంధం వంటిది, గణేశుడికీ, సింధువనే రాక్షసుడికీ, ఉండటం, ఈ కథల్లో ప్రళయ కాలానంతరం పునఃసృష్టికి పూర్వం గణపతి వటపత్రశాయిగా ఉండటమూ గమనింపదగ్గది. 10

"త్వం బ్రహ్మత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వ మింద్రస్త్వ మగ్నిస్త్వం | వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మా భూర్భువరాప ఓమ్ || " - గణపత్యుపనిషత్తు అధోజ్ఞాపికలు

1. గత సంవత్సరం గుంటూరు హిందూకళాశాలలో శ్రీ వల్లభజోస్యుల సుబ్బారావుగారి అధ్యక్షతన జరిగిన గణపతి మహోత్సవాల్లో అధ్యక్షులు ఈ అభిప్రాయాన్ని సెలవిచ్చారు.

2. Hindu - Sunday - V.M. Narasimham, 14 Aug 1949

3. హిందీ మాధురి సం. 3 సం. 6 పుట 832

4. Hindu Holiday s and Festival & GUPTE, p. 55

5. "The Idea therefore of a bumper crop overriding the pestilence of the rats might be well represented by a god with an elephant head, riding a rat or MUSHIKA (thief) and possessing in addition, a fair, round belly of the later evidently symbolical of the barn" (Gupte-P 58)

6. DEVATA : - Edited by B.D. Basu - P. 187

7. 'Deva means a shining or luminous star, luminosity, light itself subject to appearance like the moon on those days of full moon and new moon' - R. Shama Sastri, Vedic iconography.

8. భారతి - పార్థివ, భాద్రపదము పుట 229, 230 ఈ అంశాలను శ్రీ విస్సా అప్పారావు పంతులు గారు ఆంధ్రశిల్పిలో విపులంగా చర్చించినారు.

9. భారతి - పార్థివ భాద్రపదము పుట 230.

10. ఈ సందర్భంలో 'విఘ్నేశ్వరుడు కూడా ఒక దేవుడేనా?' అన్న శ్రీ కుందూరి ఈశ్వరదత్తుగారి వ్యాసాన్ని గమనించటం యుక్తము. (భారతి ఆగస్టు 1927) (భారతి - వికృతి, భాద్రపదము)