వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/వివాహము-జయాపజయాలు


వివాహము - జయాపజయాలు

మానవ వైవాహిక జీవన ప్రవాహము గంగానది వంటిది. ఇందు వైజ్ఞానిక (Intellectual) ఉద్వేగ (Emotional) ములను యమునా సరస్వతుల సంగమమున్నది. శారీరకమైన కామము (Physical passion) మూల ప్రవాహము. ఈ త్రివిధములైన నదులకూ ఒకవిధమైన లయ, కుదిరినప్పుడే భార్యాభర్తల వైవాహిక జీవన స్రవంతికి ఆనంద మహాసాగర సంయోగం కలుగుతుంది.

అంటే భార్యభర్తలకు శారీరకమైన పరస్పరాకర్షణమూ, అన్యోన్యమూ ఉండి, ఇరువురూ వైజ్ఞానికమైన ఏకస్థితిని పొంది, ఉద్వేగ విషయకమైన ఉన్నత బంధంతో సామ్యము కలిగియుండవలెనని అభిప్రాయము.

స్త్రీ పురుషులిద్దరిలో ఏ ఒకరో వైజ్ఞానిక, ఔద్వేగికాలైన మానసిక బాధలను అనుభవిస్తుంటే అది ఆ వ్యక్తి సహచర, సహచరీ వైవాహిక సౌఖ్యానికి భంగం కలిగిస్తుంది. వివాహ బంధము కేవలమూ అల్పమైన శారీరక శృంగార బంధము (Sexual Erotic Union) కాకపోవుటయే దీనికి కారణము. అందుకనే మానవజాతి శాస్త్రజ్ఞుడు ఎల్లిస్ మహాశయుడు 'ఉదాత్తమూ ఉత్తమమూ అయిన వివాహము కేవలం శారీరక భోగ తృష్ణను తీర్చుకోటంతో ఆగిపోదు. వాటికి భిన్నమైన అనేక బంధాలతో ఇది భార్యాభర్తలను అనువశులను చేస్తుంది. అందువల్ల ఇరువురికీ అభిరుచులూ, ఆదర్శాలూ ఏర్పడుతవి; సహజీవన మర్యాదలు ఏర్పడుతవి; మాతా పితృత్వబంధమూ ఆర్థిక బంధమూ ఏర్పడుతవి' అని అభిప్రాయ మిచ్చాడు. ప్రాచ్య కామ కళా విజ్ఞాని వాత్స్యాయన మహర్షి ఆదిలో శారీరక ప్రతిపత్తిని గురించి విశేషముగ పలికినాడు గాని, త్రివర్గములలో పరస్పరానుఘాతంగా కామాన్ని సేవించాలెనని నిర్దేశించాడు. ఈ రీతిగా ప్రాచ్య పాశ్చాత్య జాతి శాస్త్రజ్ఞులందరూ వైవాహిక జీవితంలో ఉన్న ఈ త్రివేణీ సంగమాన్ని గుర్తించారు.

యౌవనారంభ దశలో భార్యాభర్త లిరువురి మధ్యా శారీరక శృంగార భావం కొంత విశేషంగానే ఉంటుంది. అది కాలక్రమేణా నశించిపోయినా అనేకులలో

వైవాహిక బంధం ప్రిదిలిపోవటం లేదు. దీనికి ముఖ్యకారణము పరస్పర ప్రీతిభావం


(Mutual Devotion) వైవాహిక విజయానికి ఇరువురు వ్యక్తులకూ పరస్పర గౌరవాదరణలు (Admiration of Personalities) ఉండి తీరాలి.

వైజ్ఞానిక, ఉద్వేగ, శారీరకములలో శారీరకానికి విశేష ప్రాధాన్యం లేకపోలేదు. వైవాహిక జీవనంలో శారీరకమైన అసంతృప్తి వధూవరులకు కలుగకుండా ఉండటానికే ప్రాచ్య పాశ్చాత్య లోకాలలో కామకళావేత్తలూ, వైద్యశాస్త్రజ్ఞులూ మానవ జాతి విభజన మొనర్చినారు, సాంప్రయోగిక వైవిధ్య (Modus Sexualis) మును నిరూపించినారు. భావరాగ లక్షణ నిరూపణ మొనర్చినారు. పూర్వరతి (Love-play) స్వరూపమును వెల్లడించినారు.

వైవాహిక జీవన విధానంలో స్త్రీలు విశేషంగా ఆశాభంగం ఎందుకు పొందుతారో చెప్పవచ్చును. వివాహబంధంలో స్త్రీ పురుషుని కంటే కొంత విశేషాన్ని ఆశిస్తుంది. ఆమె స్వప్నాదర్శాలకు ఏ మాత్రం విభిన్నత గోచరించినా ఆశాభంగం పొందుతుంది. పురుషుడు స్త్రీవలె గృహ విషయాన్ని విశేషంగా పట్టించుకోడు. అతని దృష్టి గృహేతరమైన బాహ్య ప్రపంచం మీద లగ్నమై ఉంటుంది. అందుమూలంగా వైవాహిక ఛిద్రాలకు స్త్రీవలె అతను నిస్పృహ వహించడు.

ఆధునిక స్త్రీ మానసిక స్థితీ, దృక్పథమూ, మార్పు పొందాయి. అందువల్లనే నేడు స్త్రీ విశేషమైన వైవాహికాశాభంగాన్ని పొందుతున్నది. మున్ముందు ఇది ఇంకా విపరీత స్థితిని పొందబోతున్నదని విజ్ఞుల అభిప్రాయము. ప్రాచీన కాలంలో భార్యాభర్తలిద్దరికీ వివాహం ఒక పవిత్ర కర్మ. అందువల్ల స్త్రీ పురుషులిరువురూ వివాహమంటే జంకేవారు కారు. ఏ కారణం చేతనైనా వైవాహికచ్ఛిద్రం ఏర్పడితే దానిని కేవలం విధివిలాసంగా భావించేవారు. ప్రాచీన మానవ సంఘాలు ఈ దృష్టితో వివాహాన్ని గుర్తించేవి. మతపీఠాలూ, పీఠాధిపతులూ ఈ నిశ్చయంతోనే నాటి వివాహాలను ఆమోదించేవారు.

ప్రాచీన వివాహం మీద మొదట పురుషుడు తిరుగుబాటు ప్రారంభించాడు. జీవత సహచరిని ఎన్నుకునే విషయంలో కొంత స్వేచ్ఛను ఆశించాడు. ధర్మశాస్త్రాను సారమైన వైవాహిక జీవనం వలన ఆత్మతృప్తి లేదనీ, వివాహ మూలముగా వైయక్తిక సౌఖ్యము (Personal Stisfaction) లభించవలెననీ, అదే ప్రాప్యమనీ వారు వాదించారు. పురుషులు ఇటువంటి విప్లవ మార్గాలను త్రొక్కటము ఏ నాడో ప్రారంభించినా, స్త్రీలు సాంఘికోన్నతి, ఉజ్జ్వల గృహమూ తప్ప తదితరాలను కోరకుండా వివాహాలు

నేటివరకూ చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రత్యేక స్త్రీ ప్రణయము కనిపించలేదన్నమాట!


'వేష ధారణలలో పురుషులతో సామ్యమును ఆశించలేదు. శాసనసభలలో సమాన హక్కు కోసం పోరాడి పొందలేదు' అన్నమాట.

కేవలం ఇటువంటి స్వేచ్ఛా సౌఖ్యాలను కోరటమే కాకుండా వివాహం వలన కామతృప్తి (Sexual Satisfaction) ని కూడా వాంఛిస్తున్నారు. పురుషునివలె శారీరకమైన వైవాహిక జీవనంలో వారూ కోరికలు పెంచుకున్నారు. అందువలన వారికి ఆశాభంగము అత్యధికంగా కలుగుతున్నది. వారిలో ఒకవిధమైన శృంగారిక కాఠిన్యము (Mosachistic Tendency) ఏర్పడినది. అందువలన వారు శుక్లస్యందనము విసృష్టి (Orgasm) సంబంధమైన సౌఖ్యాన్ని పొందలేకపోతున్నారు. నేటి స్త్రీకి ఆదర్శలగు అమెరికా యూరప్ దేశ స్త్రీలు (Euro - American women) నూటికి నలుబదిమందియైనా సాంప్రయోగిక సౌఖ్యాన్ని పొందలేకపోవటం జరుగుతున్నదని వాన్డినెల్డి, స్టెకెల్, మేరీ స్టోవ్సు మొదలగు రచయితల వ్రాతలవల్ల తెలుస్తూ ఉన్నది. అంటే ఆధునిక స్త్రీ వైవాహిక జీవనంలో ఎంతటి ఆశాభంగాన్ని పొందుతున్నదో దీనివల్ల అర్థమౌతుందన్నమాట.

ఈ రీతిగా స్వేచ్ఛా సామ్యాలను సంపాదించుకొనిన ఆధునిక స్త్రీలలో గృహజీవనమును నెరపుటకు పురాతన మర్యాదల ననుసరించు భర్త పనికిరాడు. నూతనభర్త కావలసి వున్నాడు. పురుషుడు పూర్వం వలె ఒక చక్కని గృహాన్ని చూపించి సాధన సంపత్తి నిచ్చి ఇంతటితో తృప్తి చెందమని చెప్పే దినాలు పోయినవి. అతనికి ఏ విధమైన అంగవైకల్యం ప్రాప్తించినా అది నన్నేమి బాధపెడుతుందని ఇకముందు స్త్రీ తృప్తి వహించదు.

ఇంతకు పూర్వం స్త్రీ పురుష సంయోగం కేవలము ఏకపాత్రాభినయం (Solo). స్త్రీ ద్వితీయ పాత్ర వహించేది. ఈ నాడు అది వాకో వాక్యము (Duet). శృంగారిక రంగస్థలంమీద ఇద్దరూ సమానంగా పాత్ర నిర్వహణం చేస్తున్నారు. అందువల్ల కలిగే లాభనష్టాలకు ఇద్దరూ సమాన బాధ్యత వహిస్తున్నారన్నమాట!

నేటి వధూవరులలో కలుగుతున్న నూతన భావాలు ఒకరీతిగా విజయ వంతమైన వివాహ బంధాలు ఏర్పరుస్తున్న మాట వాస్తవము. కానీ అంతకంటే అధికంగా విజయరహిత వివాహాలను నిరూపిస్తూ ఉన్నవి. స్త్రీ పురుషుల మధ్య కామసంబంధమైన తౌర్యత్రికము (Harmony) కుదరకపోవటానికి ముఖ్యకారణము కామకళా విషయికమైన అజ్ఞానము. కేవలమూ అజ్ఞానము కంటే అపమార్గాన్ని అనుసరించే కించిద్ జ్ఞానము విశేషమైన అజ్ఞానము. ఇందువల్ల కూడా వివాహ బంధాలు విజయవంతాలు కాకపోవటం జరుగుతుంది.

లోకంలో అనేకమంది ప్రణయం సహజమైన అవబోధము (Instinct) అని భ్రమపడతారు. పరిశీలిస్తే మానవుడు తినటమూ, తాగటమూ, ఎలా నేర్చుకున్నాడో, అదేరీతిగా కామాన్ని కూడా నేర్చుకున్నాడు. ఇంకా విశేషంగా నేర్చుకోవలసి ఉంది. కేవలమూ ప్రకృతి ననుసరించటం వల్ల విశేషమైన ప్రయోజనం ఉండదు. దానికీ రసన (Taste) అవసరము. కామాన్ని పొందటంలో కళా మార్గాలను అనుసరించటము ఆరోగ్యానికి భంగమనీ, అది అసహజమైనదనీ కొందరు అమెరికా, ఇంగ్లండు దేశాలలోని భర్తలు భావిస్తున్నారట. ఇది పొరబాటు. ఏ రీతిగా మాతృత్వమునూ, భర్తృత్వ, భార్యాత్వములనూ కళలుగా భావిస్తున్నామో, అదేరీతిగా కామోపాసనమునూ ఒక కళగా భావించటము శ్రేయస్కరమని విజ్ఞుల అభిప్రాయం. అటువంటి అభిప్రాయంతో వైవాహిక జీవనం సాగినప్పుడు నేడు విశేషంగా 'విడాకుల' (Divorce) పాలౌతున్న అనేక సంసారాలలో విచ్ఛిత్తి ఉండదని ఎల్లిన్, యాడ్లర్, వాకర్ మొదలైన మానవజాత్యభిజ్ఞుల అభిప్రాయము.

శారీరకంగా వివాహము విజయవంతం కాకపోవటానికి విశేషంగా భర్తలు కారకులు. వారికి స్త్రీ పురుషులకు కలిగే విసృష్టి సుఖంలోని విభేదం తెలియుట అత్యవసరము. వారికి రతాంతరమున కలుగు శుక్ల క్షరణమున గాని సౌఖ్యం చేకూరదు. ఉపరతి (Tumscence) ఎరుగని భర్తకు రతమున (Da tumscence) భార్యను తృప్తను గావించే శక్తి ఉండదు. ఇతనికి కలిగే త్వరితస్థలనము శారీరకలోపము; వైద్యసహాయ మవసరము. స్త్రీలో కామం స్తబ్ధస్థితిని (Frigid State) పొందినప్పుడు ఆమె ఎటువంటి కామానుబంధాన్నీ (Sexual Intimacy) అంగీకరించదు. అది గమనింపని భర్త భార్యను ఉన్నిద్రను చేయటానికి యత్నించి విఫలు డౌతుంటాడు. పురుషుల్లో సంప్రయోగేచ్ఛ హఠాత్తుగా ఉత్పన్న మౌతుంటుంది. అది అతిశక్తిమంతము. స్త్రీలో నిద్రాణమై ఉంటుంది. దీనిని మేల్కొలపటానికే సమస్త దేశాలలోనూ ప్రాచీన కాలంలోనే కామతంత్రాలు బయలుదేరినవి. ఆధునిక భర్త అజ్ఞానం వల్లనూ, అపనమ్మకం వల్లనూ, దూరదృష్టి లేకపోవటం వల్లనూ వాటి పొంతపోక ప్రియాప్రసాధనం చేయలేకపోతున్నాడు. ఈ స్తబ్ధత కేవలమూ స్త్రీలలోనే కాదు; పురుషులలో కూడా ఉంటుంది. ఎల్లిస్ మహాశయుడు 'రెండు జాతులలోనూ నేటి దుష్టమైన విద్యావిధానం వల్లనూ, విశేషమైన వయస్సు వచ్చిన తరువాత వైవాహిక బంధనాలు ఏర్పడటము వల్లనూ, జాత్యజ్ఞానము (SexualIgnorance) వల్లనూ స్తబ్ధత

ఏర్పడుతుందని అభిప్రాయమిచ్చాడు.


ఈ స్తబ్ధతకు వ్యతిరిక్తమైన కామోద్వేగము (Hyper aesthesia) కారణముగాను కొన్ని వివాహాలు విజయవంతాలు కాలేకపోతున్నవి. సహజమైన కామాన్ని బహిర్గతం చేయకుండా ప్రాచీనులు ఏర్పరచిన నిబంధనలు భంగ్యంతరంగా కామోద్వేగానికి కారణాలుగా పరిణమించినవి. ఈ ఉద్వేగము అధికమైనప్పుడు ఉన్మాదంగా పరిణమిస్తుంది (Sexual Neurosis). ఆవిష్కరణాది (Fetishism) అసహజలక్షణాలు (Abnormalities) వల్ల ఏర్పడుతుంటవి. ఈ విధమైన ఉన్మాదం వల్ల వివాహ బంధానికి కొన్ని ఆటంకాలు కలుగుతున్నవి. ఇటువంటి స్థితి నాగరిక జాతుల్లో కనుపించదు. నాగరికులలో కొంతకాలం ఏకపత్నీత్వమనో, పాతివ్రత్యమనో మనస్సులో దాగి ఉండి కాలక్రమేణ బయటపడతవి. వైవాహికమైన ఆనందాన్ని ఒక మనస్తత్త్వ శాస్త్రజ్ఞుడు పదునాలుగు శ్రేణులుగా విభజించాడు. అతడు పరిశీలించిన నూరు వివాహములలో ఏబది ఐదుమంది భార్యలు భర్తల వైవాహిక జీవితం సహజంగా ఉంటుందనీ, నలుబది ఒక్కమంది భర్తలు వారికి వైవాహికానంద మిచ్చే సుఖం సంపాదించుకోలేరనీ, అందులో ఇరువది ఒక్కమంది భర్తలు దుర్బలులనీ సమాధాన మిచ్చారట. 'వెయ్యి వివాహాలు’ అనే గ్రంథంలో డికిన్సన్ తారాబీమ్ మహాశయులు ప్రతిముగ్గురు స్త్రీలలోనూ ఒకతెకు మాత్రమే శారీరకానందము కలుగుతున్నదని వ్రాశారు. టెర్మక్ అను శాస్త్రజ్ఞుడును ఇట్టి అభిప్రాయమును వెలిబుచ్చినాడు. వీటి ననుసరించి కెన్నెత్ వాకర్ తన 'నాగరికతా పరిణామము’ (Changes in Civilization) అనే గ్రంథంలో, అసంతృప్తలైన స్త్రీలు వివాహ జీవనమంటే కాలక్రమాన అయిష్టత వహించి పరపురుషాభిలాష చేస్తారని చెప్పాడు.

వైవాహికమైన అపజయానికి నపుంసకత్వం ఒక కారణం. ఇది 90% మానసిక దౌర్బల్యము; మిగిలినది మాత్రమే శారీరకము. దీనికి పెంపకము కారణము. సంఘమూ, సంసారమూ కామాన్ని ఒక పెనుభూతంగా నిరూపించి చూపటమూ, అపవిత్రకర్మగా బోధించటమూ జరిగిన తరుణంలో వివాహం జరిగితే, వైవాహిక జీవనం చెయ్యటానికి తగిన శక్తి వ్యక్తులలో నిద్రితమౌతుంది. వారిని జాతిశాస్త్రజ్ఞులు ఊనకాములు అని అన్నారు. ఊనకామి వైవాహిక కామాన్నీ వ్యభిచారంగా భావించటం అనే అనుమానానికి తావిస్తుంది. అందువల్ల కామోద్వేగము కాని, నపుంసకత్వముగానీ కలుగవచ్చుననీ స్త్రీల జాతిస్వరూపానభిజ్ఞత, కామభీరుత్వము, కామేహ్యత (Disgust) కలుగవచ్చుననీ ఔస్పెన్స్కీ అనే ఒకానొక జాతి శాస్త్రజ్ఞుడు అభిప్రాయమిచ్చాడు. ఇటువంటి మానసికత్వాన్ని మానసిక వైద్యం మూలంగా నయం చేసుకొని వైవాహిక

జీవనాన్ని సుఖప్రదం చేసుకోవచ్చునని విజ్ఞుల అభిప్రాయం.


విజయవంతంగా ఉన్నవనుకునే వివాహ బంధాలు కలిగిన భార్యాభర్తలను స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని కల్పించినా, వారిలో ప్రతి ఒక్కరూ రెండవ వారిలో కామోద్వేగం తక్కువని చెపుతారని వాకర్ అనే మహాశయుడన్నాడు. ఇటువంటి సామ్యఆహిత్యాన్ని తీర్చి ఆ వివాహాలను పరిపూర్ణంగా విజయవంతం చేసేమార్గమే లేదు. అయితే మానసిక సామ్యంవల్ల ఈ కొద్ది లోపాలను దంపతులు లెక్కచేయరు. ఇటువంటి లోపాలు కూడా లేకుండా చేయటానికి కొందరు వివాహ పూర్వ ప్రణయ సంయోగము మంచిదని అభిప్రాయపడ్డారు. కానీ దానివల్ల అనేక లోపాలు కూడా సంభవిస్తాయని శాస్త్రజ్ఞులు నిర్ణయిస్తున్నారు.

వైవాహిక జీవనం కొంతకాలం సక్రమంగా సాగిన తరువాత స్త్రీ పురుషులలోని మాతృ పితృత్వ లక్షణాలు బహిర్గతమౌటం వల్ల కూడా తరువాత వివాహచ్ఛిద్రాలు బయలు దేరుతుంటవి. కేవలం సంయోగాసక్తి ఉన్న పురుషుడు (Phallic Type) పిల్లలమీద మమకారం ఉన్న స్త్రీని (UterineType) వివాహం చేసుకోవటంవల్ల ఆమెకు సంసారాసక్తి అతనికి కామేచ్ఛ అధికం కావటం జరుగుతుంది. అదేరీతిగా కామాసక్త (Clitoroid Type) కూ సంసారాసక్తునికీ (Orchitic Type) వివాహం జరిగినా కొంతకాలం తీరిన తరువాత అపజయాన్ని తప్పక పొందుతుంది. ఈ దంపతులలో స్త్రీ పురుషులు ఇద్దరూ కామాసక్తులైనప్పుడు పర పురుష దారాభిగమనాలు తప్పవు. అందువల్ల వైవాహిక జీవనంలో కామచిహ్నాలూ, మాతా పితృత్వ చిహ్నాలూ, దంపతులలో సరిసమానంగా ఉండటము అత్యవసరము. నేడు విశేషంగా అవతరిస్తున్న కృత్రిమ సాధనాలు (Contraceptives) మూలంగా స్త్రీ పురుషుని కోరికకు భిన్నంగా శారీరక సౌఖ్యాన్ని పొందటానికీ, భార్య అత్యధికంగా ప్రేమించే సంతానం కలుగకుండా పితృత్వం వహించదలచుకోకపోవటం వల్ల పురుషుడు కేవలం కామాన్ని తీర్చుకోటానికే అవకాశాలు ఏర్పడుతున్నవి. బిడ్డల పోషణను చేయదలచుకోక ఇద్దరూ ఏకగ్రీవంగా కృత్రిమ సాధనాలను ఉపయోగిస్తే తప్ప, లేకపోతే కొన్ని సందర్భాలలో ఈ సాధనాలే వైవాహిక జీవనాన్ని భగ్నం చేయగలవనటంలో సందేహం లేదు. సంయోగ నాటకంలో కొన్ని తడవలు పొత్తు కలియక పోటానికి భార్య కూడా కారణమౌతుంటుంది. ఆమె తెలివిగలదైతే తనకేమి కావాలో భర్తకు చెప్పటమే కాకుండా, అతనిలో నిద్రిస్తూ ఉన్న శక్తిని ఉన్నిద్రం చేయగలిగలినదై ఉంటుంది. కానీ అటువంటి

సందర్భాలలో ఆమె అతనికి గురుత్వము నెరపుతున్నట్లు తెలియకుండానే జరిగించాలి.


స్త్రీకి ఎటువంటి స్వేచ్ఛ లభించినా శారీరక సంయోగ విషయంలో పురుషుడే ప్రధాన భూమిక (Primary Part) వహించటం తప్పదు. అతడు గృహజీవనంలో ద్వితీయ స్థితిని పొందినప్పుడు ప్రణయ విషయంలోనూ ద్వితీయ స్థితిని పొందుతాడు. ఎంతగా తన ఆధిక్యాన్ని చలాయిద్దామనుకున్న భార్య ఐనా ఎక్కడో అన్యమైన ప్రయోజనాలు తప్ప కారణంగా నపుంసకుడిని వివాహమాడదు. ఒక్కొకప్పుడు భార్య భర్తలోని కామశక్తిని సవ్యంగా వ్యాఖ్యానించు కొనలేక, వైవాహిక జీవనం కొంత గడచిన తరువాత అతనికి అనురాగం తప్పిపోయిందనో, లేక వ్యభిచరిస్తున్నాడనో పొరబాటు కూడా పడటం సంభవించి వైవాహిక జీవనానికి భంగం వాటిల్లే చేష్టలు చేయవచ్చును.

వివాహమైన మొదటి దినాల్లో ఇతఃపూర్వము చిదంబర రహస్యంగా ఉన్న దానిని ఆనందాన్ని - పొందవలెననే కుతూహలం వల్ల రమేచ్ఛ ఉదృతంగా ఉండవచ్చును. అది కాలక్రమేణా క్షీణించటమూ సహజము. కృత్రిమమైన వాంఛ తగ్గి సహజస్థితిని వారిరువురూ చేరుకున్నప్పుడే మానసిక నైతిక విషయాలలో అన్యోన్యత కలిగి, వైవాహిక విజయ జైత్రయాత్ర ప్రారంభిస్తారు.

స్త్రీలు ఏకశృంగారలు (Mono - erotic) పురుషులు బహుశృంగారులు (Poly- erotic) అనుకోవటం పొరబాటు. 'శారీరకంగా స్త్రీ అనేకమందిని ఆకర్షించినా ఆమె బిడ్డలకు వేరు వేరు తండ్రులను పొందటముగానీ, అనేక సంసారాలను నిలపడముగానీ పొసగదు. అందువల్ల వారు ఏకగమ్యులే గాని మానసికంగా బహుశృంగారలు' అని ఎల్లిస్ మహాశయుని అభిప్రాయము. ఈ సూక్ష్మమును గ్రహించుట వైవాహిక విషయానికి కొంత తోడ్పడుతుంది. ఒక భార్యాభర్తలు అన్యులచేత ఆకర్షితులైనప్పుడు వారి జీవితము సౌఖ్యప్రదమౌతుందని గాఢమైన నమ్మకం కలిగితే, వివాహ విచ్ఛేదావశ్యకత ఏర్పడుతుంది.

స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యాభిమానంతో ఉంటేగాని వైవాహిక జీవనము జయప్రదం కాదు. కేవలము శారీరకతృప్తి ప్రాధాన్యం వహించిన వివాహాలలో విజయవంతము లైనవి అత్యల్పము. మాతాపితృత్వవాంఛలో వైవాహిక జీవనం నెరపేవారికి సంతానము నిరంతరమూ వైవాహిక విచ్ఛిత్తి కలుగకుండా కాపాడుతుంటుంది.

నేటి వివాహ విధానాలలో ఉద్వేగానికి విశేష ప్రాముఖ్యాన్ని లోకం చూపటం లేదు. కేవలమూ శారీరక సౌభాగ్యానికి లొంగిపోయి కానీ, ఆర్థికాది సంపత్తికి తల

ఒగ్గి కానీ వివాహ మాడేవారు, వైజ్ఞానికోద్వేగ సంబంధమైన సామ్యం దాని అంతట


అది ఉన్నప్పుడు సంతోషిస్తున్నారు. కానీ వైవాహిక జీవనంలో ఉద్వేగానికి విశేష ప్రాధాన్యం ఉన్నది. ఇరువురిలోనూ ఒకేవిధమైన ఉద్వేగమూ, ఆదరాభిమానాలూ ఉన్నా కొన్ని సందర్భాలలో వివాహం విజయవంతమైనది కావటం లేదు. కళాకారుల వివాహాలు సర్వసామాన్యంగా ఇటువంటివి. కళాజీవి సర్వసామాన్యంగా తాను కళకోసం జీవిస్తున్నాననుకుంటాడు. కళావేశం కలిగినప్పుడు ప్రియపత్ని నైనా తోసి రాజంటాడు. ఇరువురూ కళాకారులై అన్యోన్యమైన భావోద్వేగాలను అవగతం చేసుకుంటే తప్ప, సర్వసామాన్యంగా వారి జీవితం వైవాహికంగా విజయవంతమైనదని చెప్పటానికి వీలుండదు. కేవలం తన మానసికోద్వేగాలను అనుసరించి ఆనందాన్ని పొందే వ్యక్తి సహచరికి వైవాహిక సౌఖ్యముండని మాట వాస్తవము. ఇటువంటి స్త్రీలును ఉండవచ్చును. బార్నిస్ 'జాతి, నేస్తము, వివాహము' అనే గ్రంథములో 'స్త్రీ జాతిలోని ఒకానొక అదుపాజ్ఞలు కలిగిన మానసికోద్వేగకు ఆ వైవాహిక విజయానందము శూన్య’మని ఈ విధంగా అభిప్రాయపడ్డాడు :

“The most dangerous type of female flirt is the beauty who uses every kind of art of attraction, accepting all the tributes that her admirers offer; leading men to believe that she is being ensnared but withdrawing safely and retaining her physical Purity' and inviolability each time. She is often for sale to the highest bidder, but she is sometimes only an abnormally cold and permanently immature person who cannot make a success of any kind of marriage” అని అతని అభిప్రాయము.

స్త్రీ మానసికోద్వేగానికి నేటి వైవాహిక జీనవంలో కించిత్తయినా గౌరవం లేదు. సర్వసామాన్యంగా స్త్రీ మానసికోద్వేగం అతి అనాగరక స్థితిలో స్వామిత్వవాంఛ (Possessiveness), ఈర్ష్య ఇత్యాదులు అధికము. సృజనావిధానంలో ఆమె వీటిని మరిచిపోతుంటుంది. ఆమెకు తగిన సృజనోద్వేగవాంఛ తీరకపోవటంవల్ల కూడా వైవాహిక జీవనానికి ఆనందం ప్రాప్తించదని ఒక వేత్త అభిప్రాయము. మానసికోద్వేగము తీరని ఆధునిక స్త్రీలు కొందరు నవోఢలతో అధిక స్నేహము (Unisexual Love) చేస్తున్నట్లునూ, అందువల్ల విశేష ప్రమాదములు సంభవిస్తున్నట్టు తెలుస్తున్నది. తమతో సమానమైన మానసికోద్వేగమూ, విజ్ఞానమూ కల పురుషుని కాని వరింపమని అన్వేషణ చేస్తున్న అనేకమంది ఆధునిక కన్యకలకు ఏదో విధమైన సృజనావృత్తు (Creative occupations) లతో సంబంధము కలిగి ఉండటము అవసరమనీ, అందువలన

వారికి శారీరకమైన అవకాశాలేమిటో, వాటినుండి ఏ విధంగా బయటపడవలసి


ఉంటుందో తెలుస్తుందనీ లారా హట్టన్ 'ఏకాకిని' (Single Woman) అనే గ్రంథంలో వ్రాసింది.

వైజ్ఞానికంగా స్త్రీ పురుషు లిరువురూ నేడు సామ్యము కలిగి లేరు. కాని అట్టి స్థితికి సహచరినిగానీ, సహచరునిగానీ తీసుకొని వచ్చు ప్రయత్నమున్నప్పుడు వైవాహిక జీవనము విజయవంతమూ, ఆనంద ప్రదమూ ఔతుందనటములో ఆటంకము లేదు. అందువల్ల లోకంలో వైవాహిక జీవనము సౌఖ్యప్రదము కావటము కేవలము ఉట్ర ఉడియముగా కలుగదు. దానివల్ల కలిగే బాధలు విశేషంగా దంపతులలో ఏ ఒక్కరోగాని లేక ఇరువురు గానీ తాము ఎట్టి బాధ్యతా వహించకుండానే వివాహం వల్ల సమస్తమూ పొందవలెనని కోరుకోటం వల్లనే కలుగుతున్నవి. వివాహం విజయవంతమైనది కావటానికి కన్యావరణ; వధూవరణము మొదలు వైవాహిక జీవనము ఒక సమస్థితి వహించేవరకూ జరుగవలసిన సమస్తమైన కర్మలమీదనూ ఆధార పడవలసి ఉంటుందని చెప్పవచ్చును. ఇందులో ముఖ్యమైనది కన్యావరణమే. అందువల్లనే ఈ సమస్తమైన అభిప్రాయాలూ సూత్రప్రాయంగా మహర్షి వాత్స్యాయనుడు ఆయన కాలానికి తగిన భాషలో కన్యాసంప్రయుక్తములోని వరణాధ్యాయమున, కేవలమూ పురుష పరంగానే 'సవర్ణాయాం అనన్య పూర్వాయం శాస్త్రతో దిగతాయాం, ధర్మోర్థః, పుత్రాః సంబంధః పక్షవృద్ధిః అనుపసత్కృతా రతిశ్చ' అని శాస్త్రబద్ధం చేశాడు.

( ఆంధ్రపత్రిక 1948, నవంబరు 10)