వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/వివాహము-ఏకపత్నీత్వము
వివాహము - ఏకపత్నీత్వము
అనాది కాలంనుంచీ సంఘానికి మూలాధారాలైన స్త్రీ పురుషుల పరస్పర శారీరక సంబంధం అనేక కారణాల మూలంగా మార్పులు పొందుతూ నేటి వివాహ వ్యవస్థగా పరిణమించింది.స్త్రీ పురుషుల శారీరక సంబంధం వల్ల సంతానము కలగటమూ, తన్మూలంగా కుటుంబాలు ఏర్పడటమూ జరిగి ఉంటుంది. అదే క్రమక్రమంగా మానవ జాతుల్లో ఆచారంగా పరిణమించి ఆయా కాలాలల్లో చట్టసమ్మతమైన వివాహంగా అంగీకృత మౌతూ వచ్చింది.
వివాహ వ్యవస్థకు ఆదిమ రూపం స్త్రీ పురుషుల శారీరక సంబంధం. దాని స్వరూప స్వభావాదులను గురించి శాస్త్రజ్ఞులు భిన్నాభిప్రాయాలను వెల్లడించారు. కొందరు ఒక జాతిలోని స్త్రీ పురుషులు యావన్మందీ తల్లి, చెల్లెలు, అన్న, తమ్ముడు అనే వివక్ష లేకుండా కామోపభోగం నెరపుకున్నారని అభిప్రాయపడినారు. కొందరు అటువంటి వివక్షారహిత కామోపభోగం (Sexual Promiscuity) ఉన్నదని నిరూపించటానికి తగిన ఆధారాలు లేవనీ, అటువంటి స్థితి మానవునికి పూర్వరూపమైన వానర జాతిలోనే కనిపించదనీ పలుకుతున్నారు.
ఒక మాట మటుకు సత్యము. ఆదిమ మానవ జాతుల్లో నేటి సంఘంలో కనిపిస్తూ ఉన్న నీతినియమాలూ, విధినిషేధాలూ లేవు. ఒకానొక స్థితిలో మానవజాతిలో స్వీయ బంధు ప్రణయము (Incest) ఉన్నదని అంగీకరించటానికి తగిన ఆధారాలు కనిపిస్తున్నవి. ఈ పద్ధతి ననుసరించి అన్నాచెల్లెళ్ళూ, అక్కాతమ్ముళ్ళూ, తల్లీకుమాళ్ళూ భార్యాభర్తలు కావచ్చును.
అనాది మానవ కుటుంబాలు (Families) ఇటువంటి వివక్షారహితమైన కామోపభోగస్థితి నుంచే ఉద్భవించినవని మోర్గన్ పండితుని అభిప్రాయము. నేడు ఇటువంటి శారీరక సంబంధాన్ని గానీ, వైవాహిక ధర్మాన్ని గానీ నిరూపించే జాతి ప్రపంచంలో ఎక్కడా కనిపించటం లేదు.
తరువాతి కాలంలో వివాహ వ్యవస్థలో ఒక మార్పు వచ్చింది. ఏక గర్భ జనితులైన సంతానం వివాహమాడరాదనే నియమం ఏర్పడ్డది. తల్లీబిడ్డల మధ్య కామభోగం
నిషిద్ధమైనది. ఇది వైవాహిక విధానంలో రెండో మెట్టు. అందుమూలంగా మానవ
జాతులు వెనుక గుంపులుగా జీవిస్తూ గుంపు పెళ్ళిళ్ళు (Group Marriages)
చేసుకుంటూ ఉండేవారు. సహచరీ వివాహానికి (Punatiar Marriages) అలవాటు
పడి, ప్రత్యేక కుటుంబాలుగా ఏర్పడవలసి వచ్చింది. ఈ వివాహ విధానంలో అనేక
రకాలైన మార్పులతో వివాహం జరగటానికి అవకాశం ఉన్నది. అయితే - ప్రధానాంశం
ఒకటే. ఒక కుటుంబంలోని పురుషులందరికీ సమష్టిగా ఆ కుటుంబంలోని స్త్రీలందరూ
భార్యలై ఉంటారు - పుట్టుకతోనే. వారు మాత్రము తల్లీకుమాళ్ళూ, అన్నాచెల్లెలూ,
అక్కా తమ్ముడూ కాకూడదు.
ఈ వివాహ విధాన పరిణామ రూపంగా దంపతీవివాహము (Pairing Marriage) ఏర్పడ్డది. ఒక పురుషుడు ఒక స్త్రీతో తాత్కాలికముగానో, లేక కొంతకాలమో వైవాహిక ధర్మాన్ని కలిగి ఉంటాడు. గుంపు పెళ్ళిలో వివాహము వ్యక్తిపరము కాదు. ఈ రెండు విధానాలలోనూ అది వ్యక్తిగతము.
గుంపు పెళ్ళిళ్ళు క్రమంగా ప్రపంచంలో అంతరించిపోయినవి. దాంపత్య వివాహాలు (Pairing Marriages) ఆచారాలైనవి. ఈ విధానంలో బహుపత్నీత్వము ఉండకపోదు. ప్రతి మగవాడికీ అనేకమంది భార్యలున్నా వారిలో ఒకతె మాత్రమే ప్రధాన భార్య అయి ఉంటుంది. బహుభర్తృత్వము ఉన్న జాతుల్లో అనేక మంది భర్తలున్నా ఆ స్త్రీకి ఒకడే ప్రధాన భర్తగా వ్యవహరిస్తాడు. ఇంతేకాదు - జాతుల్లోని స్త్రీ పురుషులు ఇద్దరూ అప్పుడప్పుడూ కామతృష్ణను తీర్చుకోవటానికి ఈ దాంపత్య వివాహబంధాన్ని అతిక్రమించి అన్య స్త్రీ గమనమూ, స్త్రీ పరపురుష గమనమూ చేయటానికి అవకాశముండేది. కాని, స్త్రీ విషయంలో ఈ హక్కు ఎంతోకాలం నిలువలేదు. స్త్రీ ఒక పురుషునితో సహచరించటం ప్రారంభించింది మొదలు, ఏ జాతీ ఆమెపట్ల పరపురుష గమనాన్ని అంగీకరించలేదు. దానికి వ్యతిక్రమం జరిగితే కఠిన శిక్షకు పూనుకున్నవి కూడాను.
మాతృస్వామికాలైన కుటుంబాలలో (Matriarchical Families) బహుభర్తృత్వమూ (Polyandry), పితృస్వామికాలైన కుటుంబాలలో (Patriarchical Families) బహు భార్యాత్వమూ అన్ని కాలాలలోనూ కనిపించినా, ఈ ద్వివిధ వివాహాలూ ఆర్థికంగా అనేకమైన అవస్థలను తెచ్చిపెట్టటం చేత, ఏ నాడూ ఇవి ప్రబలంగా జాతి కంతటికీ వైవాహిక విధానాలుగా ఉన్నవని చెప్పటానికి అవకాశం లేదు.
దాంపత్య వివాహ విధానంలో వివాహ విచ్ఛేదానికి ఏ నిమిషాన పట్టినా అవకాశం ఉన్నది. అందులో కష్టమేమీ లేదు. నిబంధనలు లేవు. పూర్వంనుంచి వలెనే పిల్లలు
తల్లికి చెందుతారు.
రక్తసంబంధం ఉన్న బంధువులతో వివాహ బంధాలు దూరమవటం దాంపత్య
వివాహంతో ప్రారంభం. అందుమూలంగా కన్యకకు సవ్యమైన వరుణ్ణి, వరుడికి
సవ్యమైన కన్యకనూ వెతకటం ఆచారమైంది. ఒక ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు "దాంపత్య
వివాహం మూలంగా రక్త బంధువర్గంతో వివాహం జరగటానికి వీలులేకపోయింది.
ఇతఃపూర్వం బంధుత్వం లేనివారితో వైవాహిక సంబంధాలు నెరపవలసిన అగత్యం
కలగటం చేత, జాతుల్లోని వ్యక్తులు, మానసికంగానూ, శారీరకంగానూ, బలవంతులు
కావటం ప్రారంభించారు. శారీరకంగానూ, మానసికంగానూ బలంగల రెండు
జాతులుగాని, రెండు కుటుంబాలు గానీ వైవాహిక బంధంతో ఏకమై ఒక జాతిగా
గాని, ఒక కుటుంబంగా గానీ పరిణామాన్ని పొందేటప్పుడు వారికి కలిగే సంతానంలో
మేధ విస్తారమై, ఉంటుంది. రెండు జాతుల శక్తులూ, రెండు కుటుంబాల శక్తులూ
ప్రత్యేకతలూ వారిలో ప్రతిఫలిస్తవి" అని అభిప్రాయమిచ్చినాడు.
అంటే - క్రమక్రమంగా రక్తసంబంధం కలవారిని అధికం చేసుకుంటూ, వారితో వైవాహిక బంధాలను నిషేధిస్తూ ఉండటం వల్ల దాంపత్య వైవాహిక విధానం అమలులోకి వచ్చింది. మొదట జాతిని స్త్రీ పురుషులనే రెండు జాతులుగా విభజించటమూ, తదుపరి ఆత్మబంధు ప్రణయాన్ని అరికట్టటమూ జరిగింది. దాంపత్య వివాహ ధర్మానికి పరిణామ రూపంగా ఏకపత్నీ వివాహము (Monogamy) వైవాహిక విధానంగా అవతరించింది.
దాంపత్య వివాహం అమలులో లేని కాలంలో పురుషులకు స్త్రీలు కోరుకున్నంత మంది దొరికేవారు. ఈ వివాహం వల్ల స్త్రీలు కొందరికి మాత్రమే భార్యలైనారు. పుట్టుకతోటే భార్య అనిపించుకునే స్త్రీ పురుషుడికి గుంపు పెళ్ళి విధానంలో ఉన్న రీతిగా ఉండే అవకాశం పోయింది. అందుమూలంగా దాంపత్య వివాహంతోపాటు రాక్షసవివాహమూ (Marriage by Capture), క్రయ వివాహమూ (Marriage by Purchase) వైవాహిక ధర్మాలుగా ఒకదానికొకటి తోడుగా ఉంటూ ఉండేవి. అయితే ఇవి భార్యలను పొందే మార్గాలలో భేదాలే గాని ప్రత్యేక వివాహ సంస్థలుగా పరిగణింపదగ్గవి కావు.
ఏక పత్నీత్వము (Monagamy) మిథున వివాహానికి (దాంపత్య వివాహానికీ) పరిణామ రూపము. ఇది అనాగరక జాతి ప్రాథమిక ద్వితీయావస్థలలో అవతరించింది. ఈ విధానం ప్రపంచంలో అమలులోకి రావటం మూలాన క్రమక్రమంగా నాగరికత
అభివృద్ధి కావటం ప్రారంభించిందన్నమాట.
ఈ వివాహ విధానాన్ని గురించి వ్రాస్తూ ఎలెన్కీ మహాశయురాలు ఇలా అన్నది.
“ఏకపత్నీ విధానము అనేక కారణాలవల్ల విజయవంతమైనది. ఇందుమూలంగా ఇతః పూర్వము స్త్రీలకోసం పురుషులలో జరిగే అంతఃకలహాలు నశించినవి. పురుషులు వారి శక్తిని వైజ్ఞానిక ప్రపంచ పర్యవేక్షణ వైపునకు త్రిప్పటానికి అవకాశం లభించింది. స్త్రీ పురుషులదృష్టి సంతాన ప్రాప్తి వైపుకు మొగ్గించి, స్త్రీ పురుషుల కార్యక్రమ విభాగము (Division of work) ఏర్పడ్డది. నిలకడైన జీవితం ఏర్పడ్డది. సంతానం కారణంగా వెనుకటివలె పురుషుని ఇష్టానిష్టాలకు లొంగిపోవలసిన అగత్యం తప్పిపోయింది. పురుషుల సాంసారిక జీవనానికి ఒక ఉదాత్తత లభించింది. ఈ వివాహ విధానం మూలంగా స్త్రీ పురుషులలో సహకార భావం వృద్ధి పొందింది. వారి ఇరువురి మధ్యా అన్యోన్యానురాగాన్నీ, దయాదాక్షిణ్యాలనూ ఏర్పరిచింది. భర్తకు స్వామిత్వం లభించింది. దానితోబాటు పోషణ భారం పైన బడ్డది. స్త్రీ పురుషుని మీద జీవనభృతికి ఆధారపడవలసి వచ్చింది. నిజమే కాని "సత్సంతానవతి” ననే ఆనందాన్ని పొందే సదవకాశం లభించింది.”
మొట్టమొదట చరిత్రలో 'ఏకపత్నీత్వ విధానము' స్త్రీ పురుషుల సమానత్వం కోసం ఉద్భవించలేదు. ఎన్ని మాటలు చెప్పినా అనాది సంఘంలో స్త్రీ కున్న గౌరవం ఏకపత్నీ వైవాహిక ధర్మమైన సంఘంలో ఆమెకు లేదు. ఆమె ఒక విధంగా పురుషునికి బానిస ఐపోయినది అని చెప్పవచ్చును. ఏకపత్నీ వివాహ కాలానికి పూర్వము స్త్రీ పురుష జాతులు రెంటికీ పరస్పరాధిక్యాలకోసం అంతర్యుద్ధాలు జరుగుతూ వచ్చినవి. వాటి ఫలితంగా స్త్రీ జాతి ఓడిపోయింది. పురుష జాతి జయించింది.
అయితే - ఈ వివాహ విధానాన్ని కావలెనని కోరుకున్న వారు స్త్రీలేనని జేచేషన్ వంటి శాస్త్రజ్ఞుల అభిప్రాయము. అనాది మానవ జాతి ఆరణ్యక జీవనం నశించటం ప్రారంభించింది. వైవాహిక విధానాలు క్రమక్రమంగా మార్పు పొందినవి. ప్రాచీన కాలంలో ఉన్న సామ్యగృహ జీవన విధానం నిలవటానికి తగిన అవకాశాలు తక్కువైపోవటం ప్రారంభించినవి. వారికి ఒక నూతనమైన ఆర్థిక విధానం, జీవిత లక్షణ లక్ష్యాలూ ఏర్పడుతూ వచ్చినవి. ఈ నూతన విధానంలో స్త్రీలకు బాధ కలగటం ప్రారంభించింది. అది కారణంగా వారు తాత్కాలికంగా గానీ, మరికొంత కాలంపాటు గాని ఒక పురుషునితోటే వైవాహిక జీవితం గడప నిశ్చయించుకున్నారు. అందుకు స్త్రీ పావిత్య్రాన్నీ పాతివ్రత్యాన్ని అభిలషింప ప్రారంభించింది. పురుషుడికి తనను
పాలింపను పట్టాభిషేకం కట్టింది.
వైవాహిక విధానంలో ఏకపత్నీత్వమనే మార్పు పురుషజాతివల్ల కలగలేదని
చెప్పటానికి శాస్త్రజ్ఞులు ఒక కారణం చూపిస్తున్నారు. అది స్వేచ్ఛా ప్రణయము.
ఈ ప్రణయము అనాదికాలంలో స్త్రీ పురుషులకు సరిసమానంగా ఉంటూ వచ్చింది.
ఈ నాడు స్త్రీలకు లేదు. దీనిని పురుషులు అనుభవిస్తున్నారు. అటువంటి పురుష
స్వేచ్ఛా ప్రణయాన్ని ఏ దేశమూ ఏ జాతీ బహిష్కరించలేదు. చివరకు ఎబ్బెట్టుగానైనా
చూడటం మానివేసింది. స్త్రీలు అనుభవించటానికి ప్రయత్నిస్తే సంఘం వారిని
బహిష్కరిస్తున్నది.
కామం మాట అటుంచినా, ఏకపత్నీత్వ విధానం మూలంగా దాంపత్య వివాహ కాలంలో ఉన్న స్త్రీ జాతి సాంఘిక ప్రతిపత్తి (Social Status) కూడా నశించింది. దాంపత్య కాలంలో స్త్రీల ఆధిక్యాన్ని గురించి ఒక యాత్రికుడు తన యాత్రలలో తిరిగి పొందిన అనుభవాలను వ్రాస్తున్నాడు.
"స్త్రీలు ఇతర కులాల్లోని భర్తలను గురించి సామ్య జీవన విధానమున్న ఇళ్ళలో నివసిస్తారు. అందువల్ల ఆ ఇళ్ళకు వర్గ యద్విధమైన ప్రాధాన్యం లేదు. వాళ్ళకు సంబంధించిన ధాన్యరాశులు అన్నీ ఒకటే. వాటిలో నుంచే అందరూ పంచుకుంటుంటారు. అదృష్టం లేని భర్త ఎవరైనా కాపురం చేస్తుంటే, అతడు సంపాదించ లేకపోతే, అతణ్ణి గొంగళీతో సహా ఏ నాడు బయటికి పొమ్మంటే ఆ నాడు నడవవలసిందే. అటువంటి సందర్భంలో పిల్లలు గానీ, ఇంట్లో ఆస్తిపాస్తులు గానీ వెంటరావు. అతడు వట్టి చేతులతో తిరిగి తండాల్లోనికి వెళ్ళి పోవలసి వస్తుంది. ఈ జాతుల్లో ఆడవారు శక్తిసంపన్నలు, అవసరమైతే వాళ్ళు మగవారి నెత్తిమీద కొమ్ములూడగొట్టి కూర్చోబెట్టగలరు.” ఇటువంటి ఆధిక్యం ఏకపత్నీత్వం ఆచరణలో వచ్చిన తరువాత తారుమారవుతూ, పూర్వకాలంలో పురుషుల న్యూనభావపరంగా మారిపోయింది.
ఏకపత్నీత్వ వివాహ విధానం కుటుంబ సాంఘిక స్థితిలో అనంతమైన మార్పు కల్పించింది. ఇతః పూర్వమున్న వైవాహిక విధానంలో సంతానం తల్లిని తప్ప తండ్రిని గుర్తించలేదు. ఇప్పుడు వారిని పాలించి పోషించడానికి తండ్రికి సమాన ప్రతిపత్తి లభించింది. సామాజిక వివాహ విధానంలోని తండ్రుల కంటే ఈ తండ్రికి బిడ్డలమీద మమకారమూ, తహతహా అధికము కాదు. సంతానం పురుషుడిది. ఆస్తిపాస్తులన్నీ అతనివి. అతని ఆస్తికి ఉత్తరాధికారులు సంతానము. ఈ సంతానం కారణంగా
పురుషుడు ఆస్తిపాస్తులను సంపాదించటమూ అభివృద్ధి పొందటమూ జరుగుతుంది.
వ్యక్తిగతమైన సంపత్తి (Private Property) కారణంగా లోకంలో పాలితులు, పాలకులుగా మానవజాతి విభజితమై పోయింది. మనిషిని దోచుకొని ఒక జాతి, ఒక వ్యక్తి బాగుపడటం నేటి ఆర్థిక విధానము. దీనికి మూలకారణము వ్యక్తిగత సంపత్తి; భంగ్యంతరముగా సంతానం. ఇవి రెండూ ఏకపత్నీ వివాహ విధానం వల్ల ఏర్పడ్డవి.
దాంపత్య వివాహ విధానంలో తండ్రి ఆహారాన్ని తెచ్చేవాడు. తల్లినీ పిల్లలనూ పోషించేవాడు. వారిరువురి మధ్యా కలహ కారణాలున్నప్పుడు తండ్రి వెళ్ళిపోతూ అతని సామగ్రి పుచ్చుకుని వెళ్ళేవాడు. తల్లి ఆమె సామగ్రి పెట్టుకొని ఇంట్లో ఉండి మరో తాత్కాలిక భర్తను చూచుకునేది. అంటే విచ్ఛేదం, ఇబ్బంది గానీ ఆంక్షగానీ లేదన్నమాట. ఏకపత్నీ వివాహంలో ఒక పక్షం అంగీకరించినా ఇరువురూ అంగీకరించినా సంతాన కారణంగా సంఘమూ, ప్రభుత్వమూ, మతమూ భార్యాభర్తల మధ్య వివాహ విచ్ఛేదము అంగీకృతం కాదు.
ఏకపత్నీత్వ విధానంలో ఆదర్శం ఒకదారి తీసింది. ఆచారం మరొక దారి తీసింది. ఏక పత్నీత్వం ఆచారంలో ఉన్న ఏ దేశంలోనూ మతగ్రంథాలనూ, పురాణాలనూ పరిశీలిస్తే స్త్రీకి విశేష గౌరవం కనిపిస్తుంది. కాని వ్యవహారంలో ఆ రీతిగా ఉండదు. స్త్రీని అతి ఉదాసీన భావంతో చూడటం సమస్త దేశాలలోనూ పొడకట్టుతున్నది. స్త్రీలనూ, సంతానాన్ని పని యంత్రాలుగా పరిగణించి వారిని శుల్కాల క్రింద మార్చుకోవటమూ, వాణిజ్య పదార్థాల క్రింద భావించి, వారి ఇష్టానిష్టాలతో ఈషత్తెనా ప్రమేయం లేకుండా అతిథి పరిచర్యలకూ, మిత్రకోటి ఆనందానుభవాలకూ ఉపయోగించారు. అన్యదేశాలను జయించి తెచ్చిన బానిసకన్యల కిచ్చిన గౌరవం కూడా ధర్మపత్నులకీయని రారాజులు చరిత్రలో లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. ఎప్పుడైనా పురుషులు భార్యను గౌరవించినట్లు కనిపిస్తే అతనికి వారసులైన పుత్రులను ఉత్పత్తి చేసే యంత్రమనే భావంతో తప్ప వ్యక్తిగత ప్రణయం మూలంగా గానీ, తన అర్ధాంగి అనిగానీ కాదు. ఆడ బానిసల మీద అధికారాన్ని ఆమెపరం చేసి భార్యను తృప్తి పరచినారు. అయితే ఆమె కంటి ముందే రాజవంశాలలోని పురుషులు వారిని ఉపపత్నులనుగా స్వీకరించి భోగిస్తుంటే ఆమెకు కిక్కురుమనే అధికారం లేదు. ప్రపంచంలో అన్ని జాతుల్లోనూ ఏకగామిత్వం (Monogamy) ఇదేరీతిగా నడిచింది.
అంటే ఏకగామిత్వ మనేది కేవలము స్త్రీ జాతి విషయంలోనే నన్నమాట. పురుషునికి ఈ వైవాహిక విధానంలో అనంతమైన కామ స్వేచ్ఛ ఉన్నదన్నమాట
అందుకనే ఒక తాత్త్వికుడు దీనిని ఏకపత్నీత్వమనటం కంటే ఏక పతిత్వమనటం
యోగ్యమయినదన్నాడు. ఇది కారణంగా 'జనానా'లు బయలుదేరినవి. వాటితో పురుష సంబంధాన్ని అరికట్టారు. అందుమూలంగా ఆత్మలింగ ప్రణయము (Homo-sexual Love) అభివృద్ధి అయింది. ఎన్నివిధాల నిర్బంధాలు కల్పించినా స్త్రీలు భర్తలను మోసగించి కామేచ్ఛ తీర్చుకోవటమూ వ్యభిచరించటమూ జరుగుతూనే వస్తున్నది.
అందుమూలంగా ఏకపత్నీ వివాహానికి బానిసత్వము, వ్యభిచారమూ అనే రెండూ తప్పనిసరి ఐన ఉపాంగాలుగా ఉంటూ వచ్చినవి. ఈ విధానంలో సహజమైన అనురాగానికి స్థానము లేదు. ఆస్తిపాస్తుల మీద ఆధారపడి ఉన్నది. ఏకపత్నీ వివాహానికి మూలమైన అభిప్రాయములు - పురుషుని ఆధిక్యం, పురుష సంతానానికి వారసత్వపు హక్కు కలిగించటం దేశాన్నీ, దేవతలనూ, పితరులనూ తరింప జేయటమూ.
కార్మిక విధానాన ఆలోచిస్తే స్త్రీ పురుషుని సంతాన ఉత్పత్తి పోషణలనే మొదటి కర్మవిభాగాలు (Divisions of Labour) ఇవి ఏకపత్నీత్వ విధానం వల్ల ఏర్పడ్డవని అన్నాడు మార్కు మహాశయుడు. జాతి వ్యతిరేక భావాలు (Class opposition) మొదట ఏకపత్నీత్వ విధానంలో స్త్రీ పురుష జాతులకు రెంటికీ ఘర్షణ జరిగిందని అందులో స్త్రీజాతి ఓడిపోయి బానిస జాతిగా పరిణమించిందనీ ఏంజల్సు మహాశయుడన్నాడు.
ఏకపత్నీ వివాహ విధానం అమలులోకి వచ్చిన తరువాత సంఘంలో అంతకు పూర్వం కనుపించని మరి రెండు జాతులు బయలు దేరినవి. ఏకపత్నీ విధానాన్ని అనుసరించి ఆర్థిక సంపత్తిని చూచిగాని, లేక ఇతర కారణాల మూలానగాని వివాహమాడి, ఆ భర్తలతో సుఖాన్ని అనుభవించలేక నిరంతరమూ హృదయమిచ్చి మోహించిన ప్రియులు ఒక జాతి, నిష్ప్రయోజకులూ, నిరంకుశులూ, దద్దమ్మలూ అయిన భర్తలు (Cuckold Husbands) రెండవజాతివారు.
కన్యకాప్రణయము (Premartial Love), వ్యభిచారము (Prostitution) నాగరక జాతుల్లో తప్పని సరి ఐపోయాయి. దీనికి కారణము నేటి ఏకపత్నీ వివాహ విధానము. వ్యభిచారమును ఎంత అరికట్టటానికి ప్రయత్నించినా నిష్ప్రయోజన మైంది. అయితే ప్రభుత్వాలు ఒక విషయం మాత్రం చెప్పగలిగినవి. ఒక విషయము మాత్రమే. 'వైవాహిక బంధం వల్ల కలిగిన సంతానానికి (బిడ్డకు) తండ్రి అయినవాడు మాత్రమే 'భర్త' అని. మూడువేల సంవత్సరాలనుంచీ వస్తూ ఉన్న ఏకపత్నీ వివాహానికి తేలిన ఫలితాంశమిది.
(ఆంధ్రపత్రిక - 1948 జులై 21)