వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/భగవాన్‌ శ్రీకృష్ణ

భగవాన్ శ్రీకృష్ణ

శ్రీకృష్ణాయ నమః

"యదా యదా హి ధర్మస్యగ్లాని రృవతి భారత! ।
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజా మ్యహం ||"
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం !
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే |”

"ధర్మచ్యుతి కలిగి అధర్మము ప్రబలినపుడు నన్ను నేను సృజించుకొంటాను. దుష్ట సంహారం చేసి శిష్టులను రక్షించి ధర్మ సంస్థాపన చేయటం కోసం యుగయుగంలోను నేను అవతరిస్తుంటాను” అని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు అభయమిచ్చాడు.

కృష్ణావతారము : సంఖ్య

ఈ అభయ ప్రదానాన్ని చెల్లించటంకోసం పరమాత్మ అనంతకోటి అవతారాలు ఎత్తాడు. అయితే వాటిలో మనం పదింటినే ప్రధానంగా గ్రహించి “దశావతారా” లని వ్యవహరిస్తున్నాము.

"మత్స్య కూర్మ వరాహశ్చ, నారసింహశ్చ వామనః ।
రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవ చ ॥”

అన్న శ్లోకం ఈ దశావతారాలను క్రమంగా పేర్కొంటున్నది. ఇందులో కృష్ణావతారం తొమ్మిదవది. అంకెలలో తొమ్మిది పూర్ణ సంఖ్య. అలాగే దశావతారాల్లో కృష్ణావతారం పూర్ణావతారం.

కృష్ణశబ్ద నిర్వచనం

బ్రహ్మ వైవర్త పురాణంలో

"బ్రహ్మణో వాచకః కోయ మృకారో నంతవాచకః
శివస్య వాచక పశ్చణ కారో ధర్మవాచకః |

అకారో విష్ణువచన శ్శ్వేతదీపనివాసినః

నరనారాయణార్ధస్య విసర్గో వాచక స్మృతః ||" క్+ఋ+ష్+ణ్+అః= కృష్ణః కకారము బ్రహ్మ వాచకము. ఋకారము అనంతవాచకము. 'ష'కారము శివ వాచకము ణ కారము బ్రహ్మవాచకము. ఆ కారము విష్ణువాచకము. విసర్గ నరనారాయణులను తెలుపుతుంది. అంతేకాక కృష్ణః నల్లనివాడు. సర్వం కరో తీతి కృష్ణః - సర్వమును చేయువాడు. కర్ష తీతి కృష్ణః రాక్షసులను సంహరించువాడు అని కూడ కృష్ణశబ్ద వ్యుత్పత్తి విశేషాలు కన్పిస్తున్నవి.

కృష్ణావతార ఆవశ్యకత - వైశిష్ట్యం

ప్రతిసృష్టిలోను జీవులు దేవాంశ, రాక్షసాంశలతో పూర్వ జన్మల్లో సంపాదించిన పాప పుణ్య కర్మల సంచితాల కనుగుణంగా సజ్జనత్వ, దుర్జనత్వాలతో జన్మిస్తారు. యుగాంత సమయాలల్లో దుష్టశక్తులు ప్రబలి విశృంఖల విహారం చేస్తూ ఆపదలు కల్గిస్తున్నప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. దేవాంశలతో భీష్మ, ద్రోణ, ధర్మజాదులు జన్మించి, రాక్షసాంశ సంభూతులు, దుష్టులైన దుర్యోధనాదుల విజృంభణం వల్ల ధర్మజాదులు ఆపదలపాలై అధర్మానికి తాత్కాలిక విజయం చేకూరటం జరుగుతున్న సమయంలో, అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించటం కోసం కృష్ణపరమాత్మ అవతరించటం అవసరమయింది. ఆయన ద్వాపరయుగాంత సమయంలో ఒక శ్రావణ బహుళ అష్టమి (జన్మాష్టమి) నాడు చీకటి చిందులాడే చెరసాలలో దేవకీదేవి అష్టమగర్భాన లీలామానుషవిగ్రహుడై అవతరించాడు. వీర, శృంగారాది నవరసపరిపూర్ణుడై మహాయుద్ధవీరుడుగా, ఆదర్శ ప్రభువుగా, రాజనీతి ధురంధరుడుగా, అనుష్ఠిత సదాచార ప్రవర్తకుడుగా, ధర్మసంస్థాపనాచార్యుడుగా, సర్వోపదేష్టయైన జగదేక గురువుగా, భక్తలోకశరణ్యుడుగా వ్యవహరించి, తన కర్తవ్య నిర్వహణానంతరం నిర్యాణాన్ని పొందటమే శ్రీకృష్ణావతార వైశిష్ట్యం.

పుట్టుక - బాల్య క్రీడలు

శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడు. కారాగారంలో బంధితులైన దేవకీ వసుదేవుల గర్భాన, తనకు పూర్వం అగ్రజులు ఏడుగురు క్రూరనిరంకుశుడైన మేనమామ కంసుని కఱకు కత్తికి బలియైనారని ఎఱిగి ఎఱిగి, ఎనిమిదవ వాడుగా భూమిపై పడటమే ఆయన తొలి లీల. మానవాకృతితో తరువాత ఆయన నిర్వహించిన సమస్తచర్యలూ ఆయన లీలావిశేషాలే. దివ్యబాలుడుగా అవతరించి చిత్రహింసలకు గురి అవుతున్న తల్లిదండ్రుల హృదయాలలో ఆశాజ్యోతులను వెలిగించి, భావిజన నాయకుడుగ పరిణమించి, ప్రఖ్యాతి నార్జించటం కోసం తండ్రి వసుదేవునిచేత తనను గోకులంలోని నందగోపుని ఇంటికి చేర్పించుకున్నాడు. తనకు ప్రతిగ నిల్పిన మహామాయచేత తానవతరించి అతణ్ణి హతమార్చనున్నాడని హెచ్చరిక చేయించి, కంసుని హృదయంలో భయాగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేశాడు.

నందుని ఇంట ముద్దుబిడ్డడై పెరుగుతూ అతిచిన్న వయస్సులోనే కామరూపిణియైన పూతనను సంహరించటం, అఘాసుర, శకటాసుర, ధేనుకాసుర, తృణావర్త, వృషభాసురాది దుష్టులను పరిమార్చి తన మాహాత్మ్యాన్ని, దివ్యత్వాన్ని ప్రదర్శించాడు. మృద్భక్షణం చేసి తల్లి యశోదకు తన దివ్యత్వాన్ని ప్రదర్శించి వాత్సల్య రసానుభవం కోసం మరుక్షణంలోనే మరిచిపోయేటట్లు చేశాడు. క్షీర, నవనీతాదులను దొంగిలించి ఒకవంక గోపాలకులకు కష్ట నష్టాలను కల్పించి కోపోద్రేకాలపాలు చేస్తున్నా, వారికి వీడరాని ప్రియ బాలుడైనాడు. ఆప్తమిత్రుడు, అగ్రగామి యై వారికి నాయకుడై యుగయుగాలుగా వస్తున్న ఇంద్రపూజకు స్వస్తి చెప్పించి గోవర్ధన పూజ నారంభించి, ప్రతీకారంగా ఇంద్రుడు కురిపించిన శిలా వర్షం నుంచి వారి కభయమిచ్చి కాపాడి, తాను సాధుజన రక్షకుడైన దేవదేవుడన్న విశ్వాసం కల్గించాడు.

శ్రీకృష్ణుడు గోకులాన్ని ఆవరించి ఉన్న కాళీయాది అసురశక్తుల నన్నింటినీ నిర్మూలించి వారి హృదయాలలో ధార్మికమైన సజ్జన భావనను కల్పించాడు. గోపాలకుల క్షీర, నవనీతాలను దొంగిలించటం మూలంగా వారిని ప్రేమించి సుజ్ఞానులను, విజ్ఞానులను చేశాడు. గోపీ కృష్ణ ప్రణయమార్గం ద్వారా గోపకులానికి జీవాత్మ పరమాత్మలకు గల సంబంధాన్ని వెల్లడి చేశాడు. రాధా ప్రణయలీలల మూలంగా భక్తి అవిచ్ఛిన్న తైలధార వంటిదని నిరూపించాడు. రాసక్రీడలవల్ల గోపకులానికి 'సో హం' మార్గాన్ని నిరూపించాడు. ఈ విధంగా గోకుల జీవితంలో శ్రీకృష్ణుడు అశక్తులు, నిస్సహాయులు, అజ్ఞానులు, అసంస్కృతులు అయిన సామాన్యజనానికి దైవమైన తానే వెనుక శక్తియై, సహాయకుడై, బోద్ధయై, సంస్కర్తయై వర్తిస్తానని ప్రకటించాడు.

అవతార సహాయకులు

అథర్వ వేదాంతర్గతమైన 'కృష్ణోపనిషత్తు' శ్రీమహావిష్ణువు కృష్ణావతారాన్ని ఎత్తటానికి పూర్వమే రుద్రాది దేవతలు అవతార సహాయకులుగ అవతరించిన విశేషాలను వివరించి చెపుతున్నది. శ్రీరామచంద్రుని పురుష సమ్మోహనమైన దివ్యమంగళ విగ్రహాన్ని చూచి వనవాసులైన మహర్షులు సంతుష్టులై "స్వామీ! నిన్ను ఆలింగనం చేసికోవలెనని కోరిక మాకుదయించింది. అంగీకరించ”మని ప్రార్థిస్తే శ్రీరామచంద్రుడు "నేను మరొక పర్యాయం కృష్ణరూపంలో అవతరించబోతున్నాను. అపుడు మీరంతా గోపికలై అవతరించగలరనీ, అపుడు నన్ను ఆలింగనం చేసికోవచ్చును" అనీ ఈ ఉపనిషత్పీఠిక వెల్లడిస్తున్నది.

రుద్రాదిప్రధాన దేవతలు "మేము నీ ఆజ్ఞానుసారం భూలోకంలో అవతార సహాయకులుగా అవతరిస్తాము. కాని మమ్మల్ని సర్వదా నీ దేహసంస్పర్శనం కలిగే అవతారాలనే మాకు ప్రసాదించ' మని వేడుకొంటే స్వామి అంగీకరించాడు. అందు మూలంగా నందాదుల జన్మలేర్పడ్డాయి.

బ్రహ్మానందమే నందుడు. ముక్తి కాంత యశోద. బ్రహ్మ విద్య దేవకి. వసుదేవుడు ఉప నిషత్సముదాయం. వేదార్థం శ్రీకృష్ణ భగవానుడు. గోపికలు, గోపాలురు వేదమంత్రములు. విహార సమయాల్లో కృష్ణభగవానుని చేతిలో ఉండే వేణుదండం బ్రహ్మ. రుద్రుడు మురళి. శృంగము ఇంద్రుడు. స్నేహితులు దేవతలు. గోకులం (బృందావనం) వైకుంఠం. గోకులవనంలోని వృక్షాలు మునీశ్వరులు. ఆదిశేషుడు బలరాముడు. కృష్ణుని అష్టభార్యలు, షోడషసహస్రాదిక స్త్రీలు ఉపనిషన్మంత్రములు. రుక్మిణీ దేవి దయ. సత్యభామ అహింస, సుదాముడు (కుచేలుడు) శమము, అక్రూరుడు సత్యము, ఉద్ధవుడు దమము.

తృణావర్త, ధేనుకాది దైత్యులు లోభక్రోధాదులు. చాణూరుడు ద్వేషము. ముష్టికుడు మత్సరము. కువలయాపీడము దర్పము. బకాసురుడు గర్వము. అఘాసురుడు మహావ్యాధి. కంసుడు కలి. (కలహము)

శ్రీకృష్ణ భగవానుని నందకమనే ఖడ్గము మహేశ్వరుడైన రుద్రుని రూపము. శ్రీరుద్రునకు ఘోరాతనువు, శివాతనువు అనే రెండు రూపాలున్నవి. అందులో శివాతనురూపమైన శాంతి రూపం, వంశీనాదం. ఘోరాతనురూపం ఖడ్గం. శ్రీకృష్ణుని కట్టి వేసిన రోలు శ్రీమహావిష్ణువు తండ్రి యైన కశ్యపుడు. తాడు దేవమాతయైన అదితి. కృష్ణుని గద (కౌమోదకి) కాళిక, ధనుస్సు (శార్థము) వైష్ణవీమాయ. బాణము ప్రాణభక్షకమైన కాలం, వటవృక్షం గరుడుడు. వనమాల (తులసీమాల) భక్తి.

కృష్ణోపనిషత్తులోని పై వివరణ వల్ల, ఇతర విశేషాలవల్ల శ్రీమహావిష్ణువే కృష్ణభగవానుడుగా అవతరించటమే గాక, బృందావన రూపంతో సమస్త వైకుంఠాన్నీ భూమి మీదికి తరలించి తాను క్రీడించాడని వ్యక్తమవుతున్నది. ఈ విశేషమంతా శ్రీకృష్ణావతారం పూర్ణావతార మనటానికి తగిన ఉపపత్తిని స్పష్టరూపంలో నిరూపిస్తున్నది.

అవతరణ రహస్యాలు

వేదార్థ విదులైన పెద్దలు కృష్ణావతార సమయంలోని అవతార రహస్యాలను ఎన్నింటినో వివరించారు. అందులో కొన్ని :

కృష్ణభగవానుడు పరమాత్మ. ఆయన బ్రహ్మానందంలో గాని ఆవిర్భవించ లేడు గనుక బ్రహ్మానందమే నందుడుగా అవతరించినది. పరమానందం ముక్తిలోనే లీనమై ఉంటుంది గనుక ముక్తికాంత యశోదగా రూపొందినది. దేవతలచేత కొనియాడబడుతున్న బ్రహ్మ విద్యే దేవకి గనుక శ్రీకృష్ణరూప పరబ్రహ్మం ఆమెయందు ఆవిర్భవించాడు. వేదార్థం నారాయణ స్వరూపం. అట్టివేదార్థమే శ్రీకృష్ణరూపంతో భూమిమీద అవతరించినది. గోపికలు శ్రీమహావిష్ణు ప్రతిపాదకమైన వేదమంత్రాలు కావటం తగిఉంది. జగద్గృహంలో శ్రీమహావిష్ణువు బ్రహ్మ రూప దండ సహాయంతో సర్వకార్యాలనూ నిర్వర్తిస్తుంటాడు కనుక, బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ రూపగోపాలకుని వేణుదండం కావటం విశేషం. భగవంతుడైన రుద్రుడు సకల కళా ప్రవీణుడు. ఆయన శ్రీకృష్ణుని పిల్లనగ్రోవిగా అవతరించటం యుక్తము. ఇక్కడ ఉపనిషత్తులు గోపనీయాలు (కాపాడదగినవి) అలాగే స్త్రీలు గోపనీయలు గనుకనే ఉపనిషన్మంత్రాలు షోడశ సహస్రాధిక స్త్రీలు కావటంలోని ఔచిత్యం. శ్రీకృష్ణుణ్ణి యశోద కట్టివైచిన ఉలూఖలం (రోలు) దామము త్రాడు. దేవతా పితరులైన కశ్యపుడు అదితి కాకపోతే బంధితుడుగాని శ్రీకృష్ణుని బంధించటం ఎలా వీలు పడుతుంది? శ్రీకృష్ణ భగవానుడు అదితీకశ్యపుల చేత బంధితుడు కావటానికి, శిక్షణీయులైన యమళార్జునాదులను దండించటమనే ధర్మమార్గాన్ని కాపాడడం కోసం చేసిన అభినయం (నటన) మాత్రమే. కువలయా పీడము పూర్వజన్మలో అరిష్టుడనే రాక్షసుడు. దుర్యోధనుడు కలియుగావతారం. వైజయన్తి అనే కృష్ణుని పూలమాల, దాని పరిమళం కేవలధర్మం. వైజయంతి అనే పేరు జయహేతువు. “యతో ధర్మ స్తతో జయః" అను ప్రమాణాన్ననుసరించి ధర్మం, సైతం జయహేతువే గదా! అక్షరాల శిరోభాగంలో అనుస్వారం వలె ఉండే వైష్ణవమైన ఛత్రం ఆకాశం. శ్రీకృష్ణుని నందకం (గద) చతుర్దశ విద్యలు. శ్రీకృష్ణ నాయకత్వాన సాగిన భారతయుద్ధభూమిలో పాల్గొన్న ఉభయ పక్షవీరులు ఏయే దేవాంశ రాక్షసాంశలతో జన్మించారో మహాభారత సభాపర్వ ఆరంభంలో విశదంగా నిరూపితమైనది.

కృష్ణుడు - విద్యాభ్యాసము

తాను సర్వజ్ఞుడైనా లోక శిక్షణకోసం “గురువులేని విద్య, కూసువిద్య" అన్న సామెతను నిరూపించేటట్లు, సుదామా (కుచేల) ది సతీర్థులతో మహర్షి సత్తముడైన సాందీపని దగ్గర అంతేవాసియై అష్టాదశ విద్యలను సకల కళాశాస్త్రాలను అనతికాలంలో అధ్యయనం చేశాడు. భావికాలంలో గీతోపదేశం చేయటానికి తగిన అర్హత నంతటినీ సమార్జించుకొని బ్రహ్మణ్యుడైనాడు. (తపస్సు, వేదము, సత్యము, జ్ఞానము, మొదలైన విద్యావివేకాల యెడ ప్రీతిగలవాడు 'బ్రహ్మణ్యుడు’). ఆయన బ్రహ్మణ్యుడని 'బ్రహ్మణ్యో దేవకీ పుత్ర' అని ఆత్మబోధోపనిషత్తు ప్రకటిస్తున్నది. తన శిష్యు డార్జించిన సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం ప్రభాసతీర్థంలో మరణించిన తన పుత్రుని బ్రతికించమని సాందీపని కోరితే, శ్రీకృష్ణుడు యమలోకానికి వెళ్ళి మృతబాలుని బ్రతికించి తెచ్చి గురుదక్షిణగా సమర్పించి గురుఋణము తీర్చుకొన్నాడు. భార్య ప్రేరణంవల్ల దారిద్ర్య నివారణ కోసం సర్వసంపన్నుడైన తన కడకు వచ్చి చెప్పుకోలేక లజ్జాముద్రితుడైన సహపాఠి సుదాముణ్ణి, అతని మనోవృత్తి నెరిగి సర్వసంపన్నుని చేసి లోకాని కొక సత్పారాన్ని నేర్పాడు. తపః ప్రభావాన్ని నిరూపించటం కోసం తానే పుత్రార్థియై శివుని గురించి తపస్సు చేసి సిద్ధసంకల్పుడైనాడు. రాజసూయయాగ సందర్భంలో ధర్మజుడు వచ్చినవారిని పరామర్శిస్తుంటే శ్రీకృష్ణుడు ఆ యాగసందర్శానార్థం విచ్చేసిన మహర్షుల పాదప్రక్షాళం చేసి అర్చించి వినయ విధేయతా స్వరూపాన్ని లోకానికి ప్రదర్శించాడు.

ఆదర్శప్రభువు - జాతినిర్మాత

గోకులం నుంచి తన లౌకిక జీవిత ప్రయోజనాలను సాధించటం కోసం మథురానగరికి వెళ్ళి నాందీ ప్రస్తావనలుగా కువలయాపీడ మర్దనం, చాణూర, ముష్టిక సంహారం చేసి క్రూరనిరంకుశుడు, మాతులుడు అయిన కంసుని వధించి మాతామహుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. అశక్తత వల్ల వృద్ధుడైన ఉగ్రసేనుడు మథుర

సింహాసనాన్ని స్వీకరించి రాజ్యపాలన చేయమని కోరినపుడు

"నహి రాజ్యే న మే కార్యం, నాప్యహం నృపకాంక్షితం!
న చాపి రాజ్యలుభేన మయా కంసో నిపాతితః ॥

"నాకు రాజ్యకాంక్ష ఎన్నడూ లేదు. రాజ్యలోభం వల్ల నేను కంసుని చంపలేదు” అని సెలవిచ్చి, మాతామహుడికి ప్రతినిధిగా రాజ్యపాలనం చేస్తూ లోకానికి ఉత్తమ పాలక లక్షణాలను ఆచరణ మూలంగా వెల్లడించాడు. పరస్పర వైషమ్యాలతో భిన్న మార్గులై వర్తిస్తున్న వృష్టి, సాత్వత్యాదులయిన యాదవ ప్రభువులను ఏకముఖం చేసి, ధర్మ సంస్థాపన మహాకార్యాలలో తన నాయకత్వము క్రింద అగ్రగాములై వర్తించేటట్లు వారిని తీర్చి దిద్దాడు.

శ్రీకృష్ణుడు : మహావీరుడు

శ్రీకృష్ణుడు వరగర్వితులైన శిశుపాల, కాలయవన, హంస - డిభక, పౌండ్రకవాసుదేవ, వజ్రనాభ, నరకాసురాది రాక్షసులతోను, జాంబవంతాది మహావీరులతోను నానావిధ యుద్ధనైపుణ్యాన్ని ప్రదర్శించి కొందరిని సంహరించి, కొందరిని సంస్కరించి జగదేక వీరుడని కీర్తికెక్కాడు.

రాజ, రాజరాజ నిర్మాత

దుష్టరాజన్యులను సంహరించినపుడెల్లా శ్రీకృష్ణుడు ఆ రాజ్యాల మీద గుణవంతులైన ధర్మప్రభువులను నిలిపి మహారాజనిర్మాత అనిపించుకొన్నాడు. ధర్మజునిచేత రాజసూయం చేయించి సమ్రాట్ నిర్మాత అయినాడు. ధర్మప్రియులైన పాండవుల పక్షాన్ని వహంచి భారత మహాసమరంలో వారికి విజయాన్ని చేకూర్చి, ధర్మ ప్రతిష్ఠాపనం చేశాడు.

శ్రీకృష్ణుడు : నిరుపమ రాజనీతి కోవిదుడు

కౌరవ, పాండవ రాజకీయ వ్యవహారాలతో సంజయ రాయబారం వరకు తనకేమీ పట్టనట్లు వర్తించిన శ్రీకృష్ణుడు, దుర్యోధన, ధృతరాష్ట్రుల దుష్టబుద్ధిని శంకించి స్వయంగా కౌరవ సభకు రాయబారిగా వెళ్ళే బాధ్యత తనమీద వేసికొని, సభలో బహుముఖీనమైన రాజనీతి నైపుణ్యాన్ని ప్రదర్శించి శత్రువుల బలాబలపరిజ్ఞానంతో తిరిగివచ్చి రాజనీతి కోవిదులలో అగ్రేసరుడనిపించు కొన్నాడు. రాజసూయవేళ తనను అర్చించడానికి అంగీకరించటంలోను, శశిరేఖా వివాహ సందర్భంలోను, కర్ణుడి జన్మవృత్తాంతాన్ని తెలియజేయడంలోను, జీవితంలోని ఇతరమైన అనేక చర్యల్లోను శ్రీకృష్ణుని రాజనీతి ప్రస్ఫుటంగా గోచరిస్తుంది.

శ్రీకృష్ణుడు : ఆపద్బాంధవుడు

కౌరవ సభలో ధర్మబద్ధులై భర్తలు తోడ్పడలేని నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో, దుష్టదుశ్శాసనాదులు వివస్త్రను చేయటానికి పూనుకొన్నప్పుడు ద్రౌపది మొరపెట్టుకొంటే అక్షయ వస్త్ర ప్రదానం చేసి మానసంరక్షణం చేయటం, అరణ్యవాస సమయంలో పాండవులను శాపోవహతులను గావించటానికి దుర్యోధనుడు, శిష్యసహితుడైన దుర్వాసోమహర్షిని పంపించినపుడు ఆయనకు తగిన రీతిలో ఆతిథ్యమిచ్చి సత్కరించేటందుకు సూర్యుని చేత అక్షయపాత్ర ప్రదానం చేయించటం ఆయన ఆపద్బాంధవత్వానికి నిదర్శనాలు. అశ్వత్థామ క్రూరాస్త్ర ప్రయోగానికి గురియైన ఉత్తర గర్భాన్ని రక్షించి పరీక్షిత్ జన్మకు హేతుభూతుడై భరత వంశాన్ని నిలువబెట్టటం, ఆయన ఆర్తత్రాణ పరాయణత్వానికి ఉచితమైన ఉదాహరణ. ఆయన నిర్హేతుక జాయమాన కటాక్షానికి కుబ్జవృత్తాంతం చక్కని నిదర్శనం.

శ్రీకృష్ణుడు : భక్త జనాధీనుడు

“అనన్యా శ్చింతయంతో మాం యేజనాః పర్యుపాసతే | తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||”

ఇతర భావాలు లేనివారై ఎవరు నన్ను గురించి ఆలోచిస్తూ నిరంతరం ధ్యానిస్తుంటారో, వారి యోగక్షేమాలను నేను వహిస్తుంటాను అని తన భక్త పరాయణత్వాన్ని గురించి గీతలో భగవానుడు వెల్లడించాడు. రామావతారంలో మహర్షిసత్తములు "నీవు పరమాత్మ" వని ఎన్నిమార్లు చెప్పినా, నేను దశరథపుత్రుడను అని అన్నాడేగాని, తాను పరమాత్మనని అంగీకరింపలేదు. శ్రీకృష్ణుడు ఇందుకు భిన్నంగా తాను పరమాత్మనని మాహాత్మ్యాదులతో ప్రదర్శించుకొన్నాడు. ప్రత్యక్షంగా పలుమార్లు ప్రకటించుకొన్నాడు. యశోదకు నోటిలో బ్రహ్మాండాదులను చూపించటం, రాయబారవేళ తన్ను కట్టివేయదలచి నపుడు, మహాభారత యుద్ధారంభవేళ విశ్వరూప ప్రదర్శనం చేశాడు. తన యెడ భక్తితో వర్తించిన అక్రూర, ఉద్ధవ, విదుర, భీష్మ, కుంతి, ద్రౌపది రుక్మిణ్యాదుల యెడ భగవంతునివలె వర్తించాడు ఆయన. 'మద్భక్తా యత్ర గాయన్తి, తత్ర తిష్టామి నారద!' అన్న ప్రమాణ వాక్యానికనుగుణంగా భక్తాధీనుడైనాడు. తనకంటే తన భక్తులను అధికం చేసి దాస, దాసోఽహ సంప్రదాయానికి కారణ భూతుడైనాడు. శిశుపాలాది వైరభక్తులకు సైతం మోక్షప్రదానం చేసిన ప్రభువైనాడు.

"యే యథా మాం ప్రపద్యన్తో తాం స్తథైవ భజామ్యహమ్।
మమ వర్మాను వర్తన్తే మనుష్యాః పార్థ! సర్వశః॥"

ఎవరు ఏ మార్గంలో సేవించినా నన్ను చేరుతారని మహోదారదైవమై ప్రవచించాడు. ఆయన ప్రభుతా విశేషాలను, భక్త జనమార్గ వైవిధ్యాలను వెల్లడించే భక్తి శాస్త్రం భాగవతం.

'విద్యావతాం భాగవతే పరీక్షా' నేను విద్యావంతుడనన్న వాడిని భాగవతంలో పరీక్షించటం భారతదేశంలోని విద్వత్సంప్రదాయం. ఇంతటి మహోదాత్తత గల గ్రంథం కావటం వల్లనే, భక్తకవిసత్తముడైన మహాకవి పోతన భాగవతాన్ని ఇలా కీర్తించాడు.

మ."లలిత స్కంధము కృష్ణమూలము శుకా లాపాభిరామంబు మం
జులతాశోభితమున్, సువర్ణసుమన స్సుజ్ఞేయమున్ సుందరో
జ్జ్వలవృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబు నై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ర్విన్ సద్ద్విజ శ్రేయమై.”

శ్రీకృష్ణుడు: గీతాచార్యుడు

మహాభారత రణరంగంలో ఉభయపక్షాల మధ్య అష్టాదశ అక్షౌహిణీదళాలు మోహరించి నిలచినవేళ విభ్రాంతుడు, మహావేశ వివశుడు, కింకర్తవ్యతావి మూఢుడు, యుద్ధ యాగారంభ విముఖుడునై పార్థుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు, పార్థసారథి తన నారాయణత్వాన్ని ప్రకటిస్తూ అనుగ్రహ బుద్ధితో, అల్ప సమయంలో సదసద్విజ్ఞాన రూపమైన ఉపనిషత్ సారాన్ని గీతారూపంలో ఉపదేశం చేసి, అతనిచేత కదనభూమిలో వీరవిహారం చేయించి విజయాన్ని చేకూర్చాడు. పిండీకృత విజ్ఞాన పుంజమైన గీతను ఉపదేశించిన మార్గాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాలను సంజయుడు ధృతరాష్ట్రుడికి 'ఏకశ్లోకీ భగవద్గీతా' అన్న ఈ క్రింది శ్లోకంలో ఇలా ఉపదేశించాడు.

"యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్టో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతి ర్మతిర్మమ॥

ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు, * ధనుర్ధారియైన అర్జునుడు ఉంటారో అక్కడ

సంపద, విజయం, ఐశ్వర్యం, దృఢమైన నీతి ఉంటాయి. ఇంతటి మహత్తు కలిగిన గ్రంథం కావటం వల్లనే భారతీయ తత్త్వవేత్తలు వేదాంత శాస్త్రానికి ప్రమాణ గ్రంథాలైన “ప్రస్థానత్రయం”లో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలతో బాటు ఈ గీతను కూడ చేర్చారు. భారతదేశంలో పుట్టి వేదప్రామాణ్యాన్ని అంగీకరించే సమస్తమతకర్తలు, అద్వైత విశిష్టాద్వైతాది సంప్రదాయ మతాచార్యులు, తమ తమ సిద్ధాంతాలకు అనుగుణంగా గీతకు వ్యాఖ్యానాలు వ్రాసి ప్రచారం చేశారు. ప్రాచ్య పాశ్చాత్యమైన ఆధునిక వైజ్ఞానిక ప్రపంచం చేత సర్వసంశయవిచ్ఛేదం చేయగలిగి సత్యార్థ ప్రకాశకమైన ఏకైక తత్త్వ గ్రంథంగా స్వీకరింపబడి గీత ఈ నాడు జేగీయమానమవుతున్నది.
ఈ సందర్భంలో గీతా మహాత్మ్యంలోని క్రింది రెండు శ్లోకాలను స్మరించడం సముచితం.

 

“సర్వోపనిషదో గావోదోగ్ధా గోపాలనందనః ।
పార్థో వత్సః సుధీ ర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్||”
"సంసార సాగరం ఘోరం తర్తుమిచ్ఛతి యో నరః |
గీతానావం సమాసాద్య పారంయాతి సుఖేన సః ||


ఉపనిషత్తులన్నీ గోవులు. శ్రీకృష్ణుడు పాలు పితుకువాడు. అర్జునుడు దూడ. మహత్తరమైన గీతామృతమే క్షీరము. బుద్ధి సంపన్నుడే ఆ పాలను త్రాగువాడు. ఘోరమైన సంసార సముద్రాన్ని దాటదల్చుకొన్న మానవుడు భగవద్గీత అనే నౌకను పొందగలిగితే సులభంగా ఆవలిఒడ్డుకు చేరగలడు.

శ్రీకృష్ణార్పణమస్తు


  • శ్రీ కృష్ణ భగవానుడు యోగేశ్వరుడనీ అష్టభార్యలతోను, షోడశసహస్ర వనితాజనంతోను గోపికాంగనలతోను విలాసలీలల్లో మునిగి తేలినా అస్ఖలిత బ్రహ్మచారి అని, ఆయన జీవయాత్ర 'పద్మ పత్రమి వాంభసామ్' అన్న రీతిలో సాగిందని, మహాద్రష్టలైన మహర్షి సత్తములందరూ ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. ఈ విశేషాంశాన్ని అవగతం చేసికోటానికి సాంప్రదాయిక పరిజ్ఞాన సంపత్తితో కూడిన వివేచనసామర్థ్యం ఎంతైనా అవసరం. కేవల లౌకిక విజ్ఞానవేత్తలకు అర్థమయ్యేది కాదు.

    కృష్ణాష్టకమ్

 వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ ।
దేవకీపరమానన్దం కృష్ణం వందే జగద్గురుమ్ ॥

అతసీపుష్ప సంకాశం హారనూపుర శోభితమ్ ।
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ।।

మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్।
బర్హిపింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్।।

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభమ్ ।
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్।।

గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసమ్ ।
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥

రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితమ్ ।
అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ ।।

కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్రనిభాననమ్ ।
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్।।

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ ।
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ।।

కృష్ణాష్టక మిదం పుణ్యం, ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటి జన్మకృతం పాపం, తక్షణేన వినశ్యతి ॥

శ్రీకృష్ణార్పణమస్తు