వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/ఆసుర వివాహము

ఆసుర వివాహము

కవిబ్రహ్మ తిక్కన సోమయాజి ఆనుశాసనిక పర్వంలో ధర్మరాజుకు గాంధర్వాది వివాహ విధానాలను చెప్పించే సందర్భంలో 'మున్ను మనంబున దనిసిన కన్నియ యెవ్వాని గోరు గాంధర్వం బా, యన్ను నతని కిచ్చుట, నెలవన్నుట యాసురము సూవే కౌరవముఖ్యా!' (ద్వి. ఆశ్వాసము. 233) అని ఆసుర వివాహ (marriage by purchase) లక్షణాన్ని వ్యక్తీకరించినాడు. కన్యకపోషకులు - తండ్రి కావచ్చును లేదా ఇతరులు కావచ్చును- ఆమెను ఒకానొక క్రయవస్తువుగా భావించి, వివాహార్థిగా వచ్చిన వరుని దగ్గరనుంచి గానీ, లేదా వాని బంధువుల దగ్గిరనుంచి గానీ కొంత ప్రతిఫలాన్ని పొందటము ఆసుర వివాహానికి ముఖ్యగుణము. ఇది భారతదేశంలో అనాది కాలం నుంచీ ఒక వైవాహిక విధానంగా ఉంటూ ఉన్నట్లు మన్వాదిస్మృతులవల్ల వ్యక్తమౌతూ ఉన్నది.

అనాగరకజాతుల్లో నేటికీ ఈ వివాహ విధానమే విశేషంగా కనిపిస్తున్నది. ఇది కేవలం రాక్షస వివాహం వలె (Marraige by Capture) అధమము కాదు దైవప్రాజాపత్యాలవలె ఉత్తమమూ కాదు. నాగరికతా పరిణామంలో మధ్యమస్థితి వహించిన నాళ్ళలో ఈ వివాహ విధానమే విరివిగా కనిపిస్తున్నది.

కొన్ని అనాగరకజాతుల్లో వివాహానికి వధువు బంధువర్గం దగ్గిరనుంచీ అంగీకారం ఊరికే దొరకదు. కన్యక తండ్రికి గానీ, ఇతర ఆత్మ బంధువులకు గానీ కొంత 'శుల్కం' ఇవ్వవలసి ఉంటుంది. అది కేవలమూ ఆస్తిపాస్తుల వల్లనే కాకపోవచ్చును. కొన్ని జాతుల్లో వివాహ యోగ్య అయిన కన్యక దొరకవలెనంటే, వరుడు ఆమె బంధువర్గానికి కొంతకాలం సేవ చేయవలసి ఉంటుంది; కొన్ని జాతుల్లో కన్యకు ప్రతిగా మరి ఒక కన్యకను ఇవ్వవలసి ఉంటుంది.

ఈ విధంగా ప్రతిఫలాన్ని ద్రవ్యరూపాన గానీ, మనుష్య రూపాన గానీ, లేక సేవామూలంగా గాని పొందితేగానీ, కన్యకను వివాహ యోగ్యుడైన వరుడికి ఇవ్వకపోవటము చాలా నికృష్టమైన ఆచారం. దీనిని స్త్రీలైనా ఎదుర్కోవటానికి యత్నం చెయ్యలేదు. పైగా వారు ఇటువంటి 'పణ్యద్రవ్యం' పుచ్చుకోవటం వల్ల వివాహానికి క్రమగౌరవం కలుగుతుందనీ, అది వారికి గౌరవ విషయమని భావిస్తున్నారు. కొన్ని జాతుల్లో ఆమెకోసం వ్యయమయ్యే ధనాధిక్యమును బట్టి భార్యకు గౌరవం లభిస్తున్నది.

'కన్యాశుల్కం' కోసం కొంతధనం వ్యయం చేయకుండా లభించిన భార్యను వెలివేసిన వ్యక్తివలె భావించటం యాకూట్ జాతి వారి అభిప్రాయం. యద్విధమైన శుల్కమును ఆ జాతి స్త్రీలు అగౌరవంగా చూస్తారట. క్రమమైన వెలయిచ్చి కొనుక్కోని భార్యను జారిణిగా పరిగణించటం పశ్చిమాఫ్రికా జాతుల ఆచారం. ప్రియుడు 'శుల్కం' చెల్లించలేని స్థితిలో, కొన్ని జాతుల్లో ప్రియ అతనితో కలిసి తండ్రి యింట్లోనుంచి పారిపోతుంది. అప్పుడు తప్ప ఆమె మనసారా ప్రేమించిన ప్రియుణ్ణి వివాహం చేసుకోటానికి అవకాశముండదన్న మాట. అందువల్ల కొన్ని జాతుల్లో ఈ శుల్కాన్ని తప్పించుకోటానికి యువతీయువకులు పారిపోవటం (Elopement) జరుగుతుంటుంది. అటువంటి వరుణ్ణి వధూజాతివారు దొంగసొత్తుతో ఉన్న వాడివలెనే చూస్తారు.

భార్యకు ప్రతిగా ఇచ్చే ఈ 'శుల్కం' జాతుల్నిబట్టి మారుతుంటుంది. మక్కాలో కన్యకలను భార్యలుగా ఉత్తమ తరగతులవారే అమ్ముతుంటారని ఫీల్డింగు అతని 'విచిత్రాచారాలు' అనే గ్రంథంలో వ్రాశాడు. చాలా దేశాలలో ఇది బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది. దానికి ప్రతిగా వరుడు కొంత కట్నమూ పొందవచ్చు. ఆంధ్రదేశంలో పెట్టే సొమ్ముకూ అల్లుడికిచ్చే కట్నానికి అధిక సంబంధం నేటికీ కనిపిస్తూ ఉన్నది.

ఉత్తర అమెరికాలోని ఇండియను జాతుల్లో అందమైన వధువుకు 'శుల్కం' పన్నెండు పోనీ జంతువులు. అక్కడి కాలిఫోర్నియాలోని హూఫా జాతిలో వధువుకు ఇచ్చే శుల్కం వరుని తండ్రి తల్లిని వివాహమాడేటప్పుడు ఇచ్చిన 'పణ్యధనం' మీద ఆధారపడి ఉంటుంది. ఆఫ్రికా జాతుల్లో భార్యను కొనుగోలు చెయ్యటం విపరీతం. పణ్యధనం ఆహారవస్తువులు, గొంగళులు, కత్తులు మొదలైన వస్తు సామగ్రి ఏదైనా కావచ్చును. జాతి పెద్ద భార్యను కొనటానికి నూరు పశువుల నిస్తాడు. ఉగాండాజాతుల్లో ఉత్తమ తరగతివారు భార్యకోసం నూరు మేకలనూ, పదహారు ఆవులనూ క్రయధనంగా ఇవ్వవలసి ఉంటుంది. పేదవాడు మూడు నాలుగు ఎద్దులనూ అయిదు ఆరు సూదులు ఇస్తే భార్య దొరుకుతుంది. బంగలాజాతిలో నరధనం తప్ప పుచ్చుకోరు. ఆ జాతిలో భార్య కావలిస్తే ఇద్దరు ఆడబానిసలనూ, ఇద్దరు మగబానిసలనూ స్వతంత్రుడైనవాడు ఇవ్వలసి ఉంటుంది. ఆఫ్రికా జాతుల్లో సర్వసామాన్యంగా పశువులకూ కన్యకలకూ మారకం జరుగుతుంది. పది పన్నెండు పశువులను ఇస్తే కాఫిర్కు భార్య లభించటం కద్దు. హైరిపోజాతిలో పేదవాడికైనా ధనికుడికైనా భార్య ఒకేరీతిగా, ఒకే మారకానికి దొరుకుతుంది. కన్యక తండ్రికి ఒక బలిసిన ఎద్దును గానీ, లేదా ఒక మేకపోతును గానీ పంపిస్తే చాలు. దానిని వివాహ సమయంలో చంపి తినేస్తారు. ఇది ఒక్కటే వారి వివాహం తంతు. ఒక బండెడు చొప్పకు గానీ, ఒక బండెడు కట్టెలకు గానీ పేదవాడికీ, మూడువేల రూబుల్స్ శుల్కమిస్తేగానీ ధనికుడికీ, రష్యాలోని బాస్కర్ జాతివారిలో భార్య ఒకానొక కాలంలో లభించేది కాదని ఒక సాంఘిక శాస్త్రవేత్త వ్రాసి ఉన్నాడు.

సర్వసామాన్యంగా 'ఈ శుల్కం' అనేక విషయాలమీద ఆధారపడి ఉంటుంది. వధువు అందచందాలు, ఉభయుల ఆర్థికస్థితి, వరుడి వయస్సు, స్త్రీ పురుష జనసంఖ్య, మరికొన్ని స్థానిక కారణాలూ దీన్ని నిర్ణయిస్తూ ఉంటవి. కొన్ని సందర్భాలలో ఈ సందర్భాలతో అవసరం లేకుండా భార్యను పొందటానికి ఇంత శుల్కమని నిశ్చితమై కూడా ఉంటుంది. సర్వసామాన్యంగా విడాకులు పొందిన స్త్రీని గానీ, విధవ అయిన స్త్రీని గానీ తక్కువ వెలకు పొందవచ్చు. పుష్పవతి కాని పిల్లగానీ, బహుకాలం వివాహం కాని స్త్రీగానీ తక్కువకే దొరకవచ్చు.

చైనాలో అత్యుత్తమ నాగరిక జాతుల్లో ఈ నాటికీ ఆసుర వివాహం కనిపిస్తున్నది. శుల్కం చేత పడ్డంతవరకూ పెళ్ళి జరిగినట్టే కాదు, తంతు జరిగినా సరే. మొట్టమొదట మహమ్మదీయ దేశాలలో తండ్రికి 'కన్యాశుల్కం' ఇవ్వడం జరిగేది. అది క్రమంగా భర్త చనిపోయిన తరువాతగానీ, విడాకులు పొందినప్పుడు గానీ ఉపకరించే స్త్రీ ధనంగా పరిణమించింది. కొన్ని సందర్భాలలో ఇది వధువుకు బహుమతి మూలంగా చెందే ఏర్పాటు జరిగింది.

ఆసుర వివాహం స్త్రీలకు నైచ్యస్థితి ఏర్పడడానికి కారణంగా పరిణమించింది. వ్యక్తిత్వము గానీ, స్వేచ్ఛా స్వాతంత్య్రముగానీ లేని పశువుగా ఆమె పరిగణిత కావటం పురాతన సంఘాలలో ఆమె మారకానికి ఉపకరించే వస్తువైంది.

గ్రీసుదేశం అత్యుత్తమ నాగరికతను అనుభవిస్తూ ఉన్న కాలంలో, ఈ ఆసుర వివాహానికి సంబంధించిన ఒక వైవాహికాచారం ప్రబలంగా ఉన్నట్లు వారి సాహిత్యం వల్ల వ్యక్తమౌతున్నది. ఆమె క్రొత్త యింటికి అమ్ముడు పోవటం వల్ల ఆమెకు స్వాతంత్య్రం లేదు అని నిరూపించటానికి ఆమె ఎక్కివచ్చిన బండిని వరుని ఇంటి ముందు పురాతన గ్రీకులు పరశురామ ప్రీతి చేసేవారట. 'ప్రధానపుటుంగరము' అనేక జాతుల్లో ఈ శుల్కాన్ని చెల్లించటానికి గుర్తుగా భావిస్తారు. టుటానిక్ ఇంగ్లీషు జాతుల్లోనూ ఇదే లక్షణము. రష్యాలో వధువు వరుని పాదాలు ముద్దు పెట్టుకోవటమనే ఆచారం, ఆమె దాస్యభావాన్ని వ్యక్తం చేయటమే. అది ఫ్రాన్సు దేశంలో తరువాతి కాలాన భర్త కాళ్ళ దగ్గిర ఉంగరం పడేటట్లుగా చేసి దానిని వధువు వంగి తీసుకోవటమనే మార్పు పొందింది. రష్యాలో మహావిప్లవం వరకూ అసుర వివాహం బాహాటంగా సాగింది. వరుని తండ్రి వధువు తండ్రి దగ్గరికి వెళ్ళి బేరమాడి కోడలిని కొనుక్కొచ్చేవాడు. గేదె, గుర్రం, ఆవును బేరమాడటానికి, వధువుని తెచ్చుకోటానికి ఏ విధమైన విభేదమూ లేదు. వారు వివాహ యోగ్య ఐన కన్యను 'కుంక' అంటారట. 'కున' అంటే మార్టిన్ అనే జంతువు. పూర్వం దాని ధర్మానికి మారకంగా వివాహ యోగ్య ఐన కన్యక లభించటం వల్ల, నేడు కూడా యుక్త వయస్క అయిన కన్యకు ఆ పేరే నిలిచింది.

ఐర్లండు జాతులవారు శుల్కానికి 'కాయోబాచీ' అంటారట. దానికి వస్తుసముదాయమని అర్థం. అందులో బంగారము, రాగి, ఇత్తడి, గుడ్డలు, పందులు, ఆవులు అన్నీ ఉండవచ్చును. భార్యాపణ్యద్రవ్యాన్ని ఒక్కమాటుగా ఇవ్వవలసిన అగత్యం అన్ని జాతుల్లోనూ లేదు. వివాహం జరిగిపోయిన తరువాత కొన్ని సంవత్సరాలవరకూ ఇస్తూ ఉండవచ్చును.

సైబీరియాలో కిర్గిజ్ అనే టర్కిష్ జాతిలోని తండ్రి, కుమారుడికి పది ఏళ్ళు రాగానే ఒక పిల్లను సిద్ధం చేసుకొని ఎనభై పశువుల వరకూ ఉండే శుల్క ద్రవ్యాన్ని జాగ్రత్త చేయటం ప్రారంభిస్తాడు. ఇది అనేక పర్యాయాలుగా చెల్లించవచ్చు. ఎక్కువమొత్తం రాగానే పెళ్ళి జరుగుతుంది. ఈ జాతిలో శుల్కం అధికం. అందువల్ల ఎవరూ తొందరపడి భార్యకు విడాకులివ్వరు. ఇస్లాం మతధర్మం పురుషుని ఆధిక్యాన్నే నిరూపిస్తున్నా, స్త్రీని భర్త ఆస్తిగా పరిగణించటాన్ని ఏర్పరచినా, కావలసినంత మంది దొరక్క పోవటం వల్ల (Economic law of supply and demand) ఇటువంటి పని జరగదు అని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

ఆసుర వివాహ లక్షణమైన 'శుల్కం' పూర్తిగా చెల్లిస్తే గాని భార్య భర్త ఇంటికి రాక తల్లిదండ్రులతోనే ఉండటం అనేక జాతులలో ఉంది. పశ్చిమాఫ్రికాలో పూర్తిగా శుల్కం చెల్లించలేని భర్త మామగారింట్లోనే చెల్లించే వరకూ భార్యతో కాపురం చేస్తుంటాడు. అంతవరకూ కలిగే సంతానం మామగారి దౌతుంది. టెనింబరులో కన్యకకు శుల్క ద్రవ్యంగా ఏర్పరుచుకున్న దంతపు సామాను పిల్ల తండ్రికి చెందటానికి ఎంతోకాలం పడుతుంది. అంతవరకూ అతడు మామగారింట్లోనే ఉండిపోతాడు. ఆకికుయున్ జాతిలో ఇరవై గోవులకు భార్య లభిస్తుంది. అన్నీ ఒకమాటు చెల్లించక వంతులమీద చెల్లించినపుడు అతనికి కలిగే సంతానానికి తొమ్మిది పది సంవత్సరాలు కూడా రావచ్చును. చిన్ కొండజాతుల్లో ఈ శుల్కాన్ని జీవితాంతం చెల్లిస్తూ ఉంటాడట. దీనినిబట్టి అనాగరక జాతులు కూడా అనేకమార్లుగా క్రయధనం పుచ్చుకోవటం వల్ల ఉండే నష్టాన్ని గ్రహించినట్లు అర్థమౌతున్నది. మొత్తం చెల్లింపలేని పక్షంలో పిల్లతండ్రికి కుటుంబము పెరగటమూ, కుమార్తె భర్తతో ఇంట్లోనే ఉండి అతని 'పనిపాటలు' చేసి పెట్టుతూ ఉండటం వల్ల, ఇటువంటి పద్ధతినే విశేషంగా కొన్ని జాతులు ఆదరించేవని ప్రపంచ వివాహ చరిత్ర కారులు వెస్టర్ మార్కు అభిప్రాయము.

రాక్షసంగా కన్యను ఎత్తుకోపోయి వివాహం చేసుకోవటం మొదటి మెట్టు. దానికి ప్రతిగా ఆసురము వచ్చింది. వెల ఇంత అని నిశ్చయం చేయటం కష్టమనిపించినప్పుడు ఆసుర వివాహంలోనే 'బదులుకు బదులు' (Marriage by Exchange) అనే పద్ధతి ఆచారంగా కొన్ని జాతుల్లో ఏర్పడ్డది. అంటే భార్య లభించవలెనంటే ఒక స్త్రీని బదులు ఇవ్వవలసి వచ్చిందన్న మాట. కుమార్తెలుంటే వధూవరుల తండ్రులు ఈ మారకం చేస్తారు; చెల్లెలుంటే అన్నదమ్ములు చేస్తారు; చెల్లెళ్లు లేనప్పుడు పినతండ్రి కూతుళ్ళనూ, పెత్తండ్రి కూతుళ్ళనూ మారకం చేయవచ్చు. మలనీషియాలోని సోలామన్ జాతిలో మొదటి స్నేహితాలు అభివృద్ధి చేసుకోవటానికి ఏర్పడ్డ స్త్రీల మారకం శుల్క వివాహంగా పరిణమించింది. దక్షిణ ఆస్ట్రేలియాలో వరినోరీ జాతి స్త్రీ, తనకు బదులుగా తల్లిదండ్రులు మరి ఒక ఆడపిల్లను ఇవ్వని పురుషుణ్ణి వివాహం చేసుకోటం అగౌరవంగా భావిస్తుందట. ఇటువంటి ఆచారాలు న్యూ గినీ, న్యూ హెబిడ్రిన్, సొలోమన్, సుమత్రా ద్వీపాలలో ఉన్నవి. సుమత్రా ద్వీపవాసులు 'జూజు' (కన్యాశు ల్కం) ఇవ్వటానికి బదులుగా స్త్రీనే ఇస్తారట. న్యూ సౌత్ వేల్సులో కుంబూ, మూరి జాతుల్లో శుల్కం బదులు వివాహం ఉంది.

కొన్ని జాతుల్లో ఈ శుల్కానికి తోడు ఆడపిల్లల కన్యాత్వాన్ని (Virginity) కాపాడినందుకు తల్లికి కొంత ధనమూ, అంగీకారం ఇచ్చినందుకు అక్కచెల్లెండ్రకూ, తండ్రికీ కొంత ధనమూ ఇవ్వవలసి ఉంటుంది. ఈ ధనమంతా తిరిగి అవసరమని తోచినప్పుడు ఇచ్చివేసి పిల్లను తెచ్చుకోవటం, ఆఫ్రికా జాతులు కొన్నిట్లో ఆచారంగా ఉందని వెస్టర్మార్క్ అభిప్రాయం. 'పశుధనానికి' అమ్ముడుబోయిన స్త్రీని కాఫిర్ జాతులు తక్కువగా చూస్తారు. కొన్ని జాతుల్లో ఈ ధనాన్ని వివాహానంతరం స్త్రీ ధనంగా మార్చి ఉంచుతారట. నేటి వైవాహిక విధానాలలో బహుమతులుగానూ కట్టళ్ళు, నడవళ్ళుగా మనం పిలిచినా సమస్త వ్యవహారాలూ ఒకనాటి అసుర వివాహ లక్షణాలే అని నిశ్చయంగా చెప్పవచ్చును. ఇది ఆంధ్రదేశంలో నేటికీ విరివిగా కనిపిస్తున్నది. ఈ శుల్కం స్త్రీ ధనంగా మారటమూ, శుల్కాన్ని స్త్రీకే ఇవ్వటమూ ఆసుర వివాహ విధానంలో మరొక మెట్టు పైకెక్కినట్లు వ్యక్తం చేస్తున్నవి. కొన్ని మహమ్మదీయ జాతుల్లో క్రీ.పూ.100 సంవత్సరాలనాడే శుల్కంగా ఇవ్వటానికి కన్య అయితే ఒప్పుకున్న రెండువందల దీనారాలు గానీ, విధవ అయితే ఇవ్వవలసిన నూరు దీనారాలుగానీ, స్త్రీ ధనం కావటం ఏర్పాటైంది. దీనికోసం భర్త ఆస్తి తాకట్టైనా పెట్టవలసి వస్తుంది. వివాహం జరిగినట్లు నిశ్చితం కావలెనంటే, స్త్రీ ధనమైన 'సాదక ' ను తండ్రిపరం చేయవలెనని కొరాను పలికింది.

భారతదేశంలో 'స్త్రీధనం' మనువు నాటినుండి ఏర్పాటైంది. టుటానిక్ జాతుల్లో క్రీ.శ. 6వ శతాబ్దంలో కాని జరుగలేదు. పితృస్వామికాలైన కుటుంబాలలో ఈ స్త్రీధనం భర్త దగ్గరే ఉంటుంది. అతని మరణానంతరం ఆమెకు అతని రాబడిలో నుంచీ భృతికి ఏర్పాటు జరగడం వచ్చింది. మొన్నమొన్నటివరకూ యూరప్, జర్మనీ, స్విట్జర్లండు దేశాలలో వివాహ సమయంలో ఆచారంగా ఉన్న 'ఉదయప్రదానము’ (Morgengabio) లేక 'మార్నింగ్ గిఫ్ట్' శుల్కానికీ, స్త్రీధనానికి సంబంధించింది. ఇటలీలోని 'కాయిల్' ఇటువంటిదే.

ఆసుర వివాహంలో 'సేవాశుల్కం' అనే ఒకానొక విధానం అనేక జాతుల్లో కనిపిస్తుంది. తండ్రికి కొంతకాలం సేవ చేసి పిల్లను పొందటమే దీని లక్షణం. ధనం ఇచ్చే బదులు 'శరీర సేవ' చేస్తూ ఉండటం వల్ల దీనిని కూడా శాస్త్ర శుల్క వివాహం (Marriage by Purchase) గా భావించారు. కొన్ని జాతుల్లో శుల్కం చెల్లించినా కన్యక తండ్రికి వరుడు కొంతకాలం సేవ చేస్తేగాని భార్య దొరకదు. ఇటువంటి సందర్భాలలో జరిగే వివాహాన్ని ఆసుర వివాహము (Marriage by Purchase) అనటానికి వీలు లేదని ఫీల్డింగు అభిప్రాయము. ఇటువంటి వివాహానికి ఉదాహరణంగా బైబిలులో (Genisis – XXIX) జాకోబ్, రాఖిలోల - కథ కనిపిస్తూ ఉన్నది. మాతృస్వామికాలైన కుటుంబాలలో కన్యక కుటుంబానికి వరుడు కొంతకాలం సేవ చేస్తే గాని భార్య లభించదు; అతనికి ఆస్తి లేకపోతే ఎంతకాలమైనా ఆ కుటుంబానికి సేవకుడుగా ఉండవలసి వస్తుంది; అయితే పితృస్వామికాలలో (Patriarchal) సేవజేయవలసిన కాలానికి ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఈక్విడార్లో కానిలాస్ ఇండియనులలోను, బ్రేజీలు ఇండియనులలోను యూకటులున లోను ఇదే ఆచారం. ఉత్తర ఆసియాలో నిగేరియా, కొరయక్, చుక్ చీ జాతి యువకుల్లో ఈ విధంగా భార్యకు సేవ చేయవలసిందే. ఇండియా, ఇండో చైనా, చైనా, జపాన్ దేశాలలో ఇది అనేక జాతుల్లో ఆచారంగా ఉంది. ఇండియన్ ఆర్చి పెలగో, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలల్లోను కొన్ని కుటుంబాలలో ఇదే పద్ధతి. ఎస్కిమో జాతిలోను, మకరంగాలలోనూ (ఆఫ్రికా) ఇదే ఆచారం. ఈ రీతిగా సేవ చేస్తూ ఉన్న భర్త మంచి గుణాలు లేనివాడనిపిస్తే, ఎప్పుడైనా అతణ్ణి కన్యక తండ్రి ఇంట్లోనుంచి వెళ్ళిపొమ్మనవచ్చును. అటువంటి సందర్భాలలో భార్యాభర్తలకు కలిగిన సంతానం కన్యక కుటుంబానికి చెందటమే కనిపిస్తున్నది.

ఈ సేవా వివాహానికి (Marriage by service) ముఖ్యోద్దేశం భర్తకంటే భార్య అవసరాలని నిరూపించడమే అయినట్లు అవగతమవుతున్నది. ఇటువంటి వివాహాలు జరిగినప్పుడు స్త్రీకి విశేష స్వాతంత్య్రము ఉన్నది. ఆసుర వివాహంలో కేవలం శుల్కమిచ్చి విక్రయించుకున్న భార్యకు ఇటువంటి స్వేచ్ఛ ఉండడానికి అవకాశం ఏ మాత్రమూ లేదు. సర్వ సామాన్యంగా అనాగరిక జాతుల్లో స్త్రీ పొందే నైచ్యాన్నీ, అగౌరవ భావాన్నీ తీసివేయడానికే ఇటువంటి సేవలక్షణం. ఆసుర వివాహంలో ఒక భాగంగానూ, ప్రత్యేక వివాహ విధానంగానూ ఏర్పడి ఉంటుందని విజ్ఞుల అభిప్రాయం.

పురాతన గ్రీసు దేశంలోని స్పార్టాలో 2/5 వంతు దేశం స్త్రీకి కట్నంగా వచ్చినదేనని ఎరిస్టాటిల్ చెప్పినాడు. న్యాయ సమ్మతమైన భార్యకు 'డాన్' (స్త్రీ ధనం) ఇవ్వటము ఒకానొకనాడు రోమనులు విశేషంగా గౌరవించేవారు. భార్య దానిని నూత్న గృహ నిర్మాణం కోసం భర్తకిచ్చి తర్వాత పుచ్చుకుండేది. ఇటువంటి ఆస్తిని తాకట్టు పెట్టడానికి గాని, అమ్మడానికి గాని భర్తకు ఎటువంటి అధికారమూ రోమన్ ధర్మశాస్త్రం అంగీకరించలేదు. భర్త కట్నంగానూ భార్య శుల్కంగాని, లేక స్త్రీ ధనంతో గాని నూతన గృహాన్ని ఏర్పరచుకొని కొంతకాలం కాపురం చేసి, విభేదాలొచ్చి విడాకులు పుచ్చుకుంటే, ఆ ఆస్తిని ఇరువురూ సమానంగా పంచుకునేవారు.

క్రీ.పూ. 1955లో బాబిలోనియా రాజు హమ్మురబీ, భర్త భార్యను ఇంట్లోనుంచి వెళ్ళగొడితే, ఆమె స్త్రీ ధనాన్ని ఇచ్చివేయవలసిందే అని శాసించాడు. 'ఇటలీలోని స్త్రీలు' అనే గ్రంథంలో విలియం బౌల్డింగ్ మహాశయుడు స్త్రీ ధనాన్ని గురించి నానా విధాలైన నియమాలను, విచిత్రాలను వివరించాడు. ఇటువంటి లక్షణాలే ఇతర జాతుల్లోను, దేశాల్లోను ఉన్నవి. ఆసుర వివాహంగా ఉన్న సేవకుడు కేవలం సేవకుడు. భవిష్యత్తులో జామాత. ఇది అతనికి కేవలం పరీక్షాసమయం. విరివిగా కనిపించే బహూకృతులు, తదితరాలు ఉభయకులాల మధ్య సఖ్య బంధాన్ని అభివృద్ధి చేయడం కోసంగానే కనిపిస్తున్నవి. ఈ విషయమే జాఫెర్సన్ సైబీరియాలోని యూకాగిర్ జాతి అభిప్రాయమే ఇటువంటిదైనట్లు రాసినాడు. ఫావిడా జాతిలోని పెళ్ళి కుమారుడి పక్షం ఏబది నాణాలు పంపితే వాటికి బదులుగా పెళ్లి కుమార్తె వారు ఐదు పందులను పంపుతారట! అప్పుడు పెళ్ళి కుమార్తె తండ్రి పెళ్ళి కుమారుడి తండ్రికి 'మీ నాణాలకు మీకు వచ్చేది ఈ ఐదు పందులు గాని అందమైన మా అమ్మాయి కాదు' అని చెప్పి పంపుతారట. ఇటువంటి సందర్భాలలో ఇవి లాంఛనాలు. పరస్పరమూ సఖ్య భావాన్ని పెంపొందించే క్రియలేగాని ఆసుర వివాహ లక్షణాలుగా ఆధునిక వివాహంలో నిలిచిన లక్షణాలు మాత్రం కావు.

(ఆంధ్రపత్రిక 1948 డిసెంబర్ 15)

÷