వావిలాల సోమయాజులు సాహిత్యం-4/మణిప్రవాళము/పుష్పలోకము
పుష్పలోకము
ఆదిత్యవర్ణే తప సో౽ధి జాతో
వనస్పతి స్తవ వృక్షో౽ థబిల్వః |
తస్య ఫలాని తపసానుదన్తు
మాయా న్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ॥ (శ్రీ సూక్తము)
(సూర్యుని వంటి వన్నెగల్గిన లక్ష్మీ! మొదట నీ యనుగ్రహమువలన నీ హస్తమునుండి పువ్వులు లేకుండఁగ నే ఫలించునట్టి బిల్వవృక్షము జన్మించినది. ఆ పాదపము బాహ్యాంతరింద్రియ సంబంధమగు దారిద్య్రమును బోఁగొట్టుఁగాక!)
ప్రతిభాభియోగ్యతచే స్వర్గమునందలి సౌవర్ణ రూపముల ద్రష్టయై దర్శించువాఁడు కవి. దర్శితములైన యేతచ్చాంపేయ రూపములకుఁ ద్వష్టయై బాహ్యాకృతులఁ గల్పించి రసమయ జగత్సృష్టిఁ గావించువాఁడు కవి! కవి సౌందర్య రసమునం దావిర్భూతుఁ డగును. అతని[1] సరసహస్తమునుండి మధువు స్రవించును.
జగద్రష్టయుఁ ద్వష్టయు నగు హిరణ్యగర్భుఁ డాదికవి కాదికవి. అతని హస్తద్వారమున వెల్లివిరిసి లోకమును మధుమంతముగ నొనర్చిన కృతులలోఁ బుష్పలోకము రమ్యాతి రమ్యమైనది. సమాధినిష్ఠుఁడై సృష్టికావ్య 'కృత్యాది'ని దానె కోమలకుసుమమై స్రష్ట నారాయణ నాభీసరోజ ద్వితీయమన నొప్పి యుండును. ఆదిత్య ప్రథముఁడైన యా విష్ణుని యమృతావలోకనము నర్థించి యుండును.
పరమేష్ఠి ప్రకటించిన యపూర్వభావభంగిమలే ప్రసూనములు. ఈ జగచ్ఛిల్పి కవి! 'కవి సత్యరథమునకుఁ గట్టఁబడిన యశ్వము!!' ఇది సూనృతమార్గమునఁ బరుగిడి యానందధామమును జేర్చును. ఈ కారణముననే స్రష్ట మానవ నయన మనోనయనాహ్లాదనమే సుమసృష్టికి పరమప్రయోజనముగ భావించి యుండునని భావుకలోక మూహించినది. శాబ్దికు లీ రసవద్రహస్యమును గుర్తించి తొలి యుషస్సులు తోఁచిననాఁడే పుష్పమునకు సుమన మనియు, నాకాధిపతి వనమునకు నందనమనియు నామకరణమొనర్చిరి.
పూలు లేని దేశము సకల సద్గుణశోభిత యగు నాలు లేని సంసారము
ముగ్ధహాసము లేని ముఖము. సిత శార వర్ణములతో నవరసోల్లాసములతో ననంత
భావనల కాధారభూతములైన సుమసంతానములపై నే దేశమం దెవ్వరి కెక్కాలమునఁ
గోర్కె వొడుమదు? కాలోచిత సమస్తైశ్వర్యముల నయ్యవి విలసిల్లుట వెంగలులు కాని
యే దేశీయు లర్థింపరు? మంగళ ప్రదములు మహిమాఢ్యములు నైన వాని
సౌభాగ్యగరిమఁ గని యే దేశీయులు ప్రహర్షహృదయులు కారు?
పుష్పములు పరమేశ్వరహాసస్వరూపములు. మాతృశ్రీ ప్రకృతి రుచిరాభరణాంగ రాగములు. ఇట్టి వీనితోఁ బరిచయము లేక [2]"బుద్ధత్వ'మబ్బదు. పురుషోత్తమప్రాప్తి కలుగదు. ఇంతయేల? ఆ హిరణ్యగర్భుఁడే జగత్కారణనాభీసరోజ సంభవుఁడు కదా! ఊహింప సర్వసృష్టి యొక సుమనమగుటయు గోచరింపకపోదు.
రసలుబ్ధమైన లోకమున ననురాగాభిమానములు [3]సాత్మ్యములు. సామాన్య వ్యక్తి మొదలుగ సర్వసంగపరిత్యాగులై మునివృత్తిఁ జేకొనిన మహర్షులవఱ కియ్యది తరతమ భేదములతో నొప్పుచున్నది. కాలదేవతాదుహితలగు ఋతుకన్యలకు నిట్టి యనురాగాభిమానములున్నవి. ఒక ఋతుకన్యకు నచ్చిన కుసుమవిభేదము మఱియొక ఋతుకన్యకమానసమును మఱల్పఁలేదు. ఒక ఋతుకన్య పెంచి పాలించిన పూదోటను మఱియొక ఋతుకన్య చీకాకు పఱచి చిత్తమున నానందానుభూతి నొందును. శతపత్రములపై శరత్తునకు మక్కువ మిక్కుటము. బాలకుందములపై హేమంతమున కనురాగ మధికము. లోధ్రములఁ గని శిశిరము రోమాంచకంచుక యగుచున్నది. శిరీషములన గ్రీష్మము పడిచచ్చును. కదంబములపై వర్షమునకు గాఢవాంఛ. ఆయా ఋతుకన్యల యభిమానానురాగములఁ జూఱఁగొనిన పుష్పము లాయా కాలముల నవనవోన్మేషశాలినులై నిత్యనవ్యావతారములఁ బ్రవర్తిల్లుచుఁ గొన్ని ప్రయోజనముల సాధించి నిర్యాణము నొందును.
అల్పముగ నైననేమి, యనల్పముగ నైననేమి సకలర్తువులును బుష్పసమయములే. అయ్యు నీ కమనీయకీర్తి వసంతకాలమున కబ్బినది. వసంతము మల్లియలది. ఇది మల్లికామాసమగుట మహాకవులెఱింగి యుండుటచే వసంత పుష్పావిర్భూతిని వర్ణించుపట్ల 'స్థాలీపులాకము'గ మల్లికావిలాసముల నిరూపించుటయందు మనసు గొందురు. [4]'నిఋతి దిగ్వాయుపతి వసంత ఋతుశోభ లీను చూలాం' డ్రగు మల్లియల మనోహరవిన్యాసములు దర్శించిన మహాకవి కందు సారవదాంధ్ర సాహిత్య
సౌమనస్యము లిట్లు గోచరించినవి.
సీ. 'దీప్తిమాధుర్యావధిశిరస్సుధాంశుభా
స్వన్మనోహర విలాసమ్ములగుచు
క్లిష్టబంధవిచిత్ర కేళీప్రశస్తిర
హఃకళాపూర్ణోదయము లగుచు
కృష్ణపదాగ్రభక్తి సుగృహితాముక్త
మాల్యదాచ్ఛ ప్రౌఢమధువు లగుచు
ననితరలభ్యవర్ణాత్తశయ్యాహేతు
వై పాండురంగమహత్తు లగుచుఁ
తే. దీయఁదనములు మెఱుఁగులుఁ దెచ్చుకొన్న
ప్రియలు ప్రియులు కూడి మనుచరిత్ర లగుచుఁ
దెలుఁగు రసికలోకముల కందిచ్చె నసువు
లత్తుకొని మల్లెపూల్ క్రొత్త క్రొత్తరుచులు.'
సాధకుని శక్తిసామర్థ్యముల ననుసరించి వసంతమల్లికామతల్లికల లీలావిలాసములు ద్యోతకములగుట నిస్సంశయము.
‘బ్రహ్మ విష్ణు మహేశ్వరులఁ దమ హరిణేక్షణలకు గృహకుంభదాసులఁ గావించి వర్ణనాసీమ నతకరించు చరిత్రచే విచిత్రితుఁడైన కుసుమాయుధునకు నమస్కరింతు' నని మహానుభావుఁడగు నొక కవివతంసుఁడు కావ్యారంభ మొనర్చి యున్నాఁడు. ఇట్టి మహత్తరశక్తి యా మదనునకుఁ బుష్పసాయకుఁ డగుటచే నబ్బిన దనుట యతిశయోక్తి కాదు.
పుష్పముల కింతటి ప్రౌఢప్రభావము కలదని యంగీకరించుటకు బుద్ధివోని[5]శంకర పూజ్యపాదులవంటి శివోపాసకులు "తల్లీ! పుష్పధన్వియు, మధుకర మౌర్వియు, మలయమరుదా యోధనరథియు, వసంత సామంతుఁడునైన యనంగుఁడు త్వదీయాపాంగావలోకనశ్రీ వహించి యెక్కటివీరుఁడై జైత్రయాత్ర సాగించుచున్నాఁ' డని సమస్తకీర్తి నా సౌందర్యలహరీ కటాక్ష వీక్షణములకుఁ గట్టిపెట్టిరి.
కవికుల గురువు కాళిదాసు పరమేశ్వర సాన్నిధ్యమున కా యగధర రాజపుత్రికను[6]నిర్భర్త్సిత పద్మరాగాశోక పుష్పగను నాకృష్ణ హేమద్యుతి కర్ణికారగను, ముక్తాకలాపీకృత సింధువారగను నలంకరించి లేఁబ్రొద్దు వన్నెగల వలిపమును ధరింపఁజేసి పూగుత్తులచే వంగిన జంగమలతవలెఁ గొనివచ్చి యుచితజ్ఞుఁడై పుష్ప ప్రాభవమును గాపాడినాఁడు. అంతటితోఁ దనివినొందక సారెసారెకు స్రస్తమగుచు స్మరకార్ముక మౌర్వీద్వితయమో యన నొప్పు కేసర దామకాంచిక నామె కవలంబమాన మొనర్చి నాఁడు.
ఒక యువకవి గులాబీలకుఁ గోమలకంఠ మొసఁగలేదని పరమేష్ఠిని నిందించుటకుఁ బాల్పడినాఁడు. కాని మఱియొక సరస సాహిత్యప్రియంభావుకుఁడు [7]"ప్రౌఢ భావప్రపూర్ణలౌ నో పుష్పకన్యలారా! మీరు పిలువనైన నెఱుఁగని ప్రవక్తలు; నిత్య నిర్మలానందమును బ్రసాదించు నమృతచషకము' లని యుజ్జ్వలముగ నూహించి నాఁడు, [8]"వినఁబడెడు సంగీతము మధురమైనది; వినఁబడని సంగీతము మధురాతి మధురమైనది.’ ఆమంత్రణము లేకయే యమలిన భావములఁ బంచి పెట్టుచుఁ గుసుమములు కోమల కలస్వనములు వినిపింపఁగలవు. రసగుంఫిత కావ్యాలాపముల రసిక హృదయముల దోఁచుకొనగలవు. 'కాశపుష్పమొండు కదలిన కన్నీటి జడులకుఁ గారణభూతములగు గంభీరభావములు నాలో స్పందించు' నని యొక యాంగ్లమహాకవి ప్రవచనము. ఐన నా ప్రసవభాషల, సుమగీతముల నవగతమొనర్చుకొని, యాహ్లాదించుటకు గుసుమసుకుమార హృదయముండ వలెనన్నమాట!
ప్రాచ్యులకు బ్రసవకులముపైఁ బ్రణయము. వారికిఁ బూలతో వియ్యములు; పూలతోఁ గయ్యములు, వారు కుసుమ హృదయ మెఱుఁగుదురు; సుమసృష్టి రహస్య మెఱుఁగుదురు. ప్రాచ్యుఁడైన యొక 'త్సిన్' చక్రవర్తి ప్రమదవనమునందలి ప్రసవలతలు విహంగదంపతుల విశృంఖలవిహారములకు గుఱి కాకుండుటకై కాంశ్యకింకిణులఁ గట్టించియు, ఋతుసమయముల నాస్థానగాయకులచే మనోజ్ఞ రాగాలాపముల విన్పించియు నానందాబ్ధి నోలలాడినాఁడు. బౌద్ధధర్మావలంబి మఱియొక 'త్సిన్' సార్వభౌముని కరుణాహృదయము పుష్పలోకము నుద్దేశించి : "కొనగోఁట గిల్లఁ గన్నీటఁ దడిసిన మిమ్ము తథాగతులకుఁ గాన్క యొసఁగలే నో లలితలతాంతములారా! నా కొఱకి ట్లీ లతల లీలావిలాసములతో నిల్చి భూత భవిష్యద్వర్తమాన బుద్ధులను జేరుకొనుఁ" డని యర్థించినాఁడు. అహో! ఎట్టి హృదయార్ద్రత! ఎంత రసికత!!
పుష్పములతోఁ బుట్టినది పుణ్యభూమి భరతావని. అందు ప్రమాదవనములు లేని ప్రాచీన పట్టణమే లేదు.
మ. [9]"పరిపూఁదోఁటల తావి మి న్నలమ వేల్పుల్ మెచ్చి తద్భూజభా
స్వరసంతానములన్ దివిం బెనుప నా సంతానముల్ దివ్యని
ర్ఝరిణీనిర్మల వారిపూరపరిపోషం బందియుం దన్మహా
తరలక్ష్మీ పరిపూర్తిగాన కెసఁగెం దత్కల్పశాఖిప్రథన్.”
చ. [10]తను ధరణీతటిద్విహృతి ధన్యవనావళి యింత మీరుటల్
కనియును మేఘ మిచ్చటి కలజ్జతఁ జేరెడుఁ గాక చేరకేఁ
గినను గొఱంత యేమి పురికిం బువుఁదేనియ సోనకాలువల్
జనముల పైరుపంటలకుఁ జాలవె యెన్నఁటికైన నెన్నఁగన్.'
అని వర్ణించియున్నాఁడు. ఆదర్శప్రభువగు నా భగవానుని మార్గము ననుసరించియే మన ప్రాచీన రాజన్యులు వనపాలన జేసి వినుతికెక్కిరి. ఉపవనాంత లతికాశైలూషికలు పవనాహతుల తోడను శ్రుతిసుఖభ్రమరగీతముల తోడను గుసుమకోమల దంతరుచుల తోడను నాటపాటల నొప్పుచుండఁ గని ప్రమోదమగ్న మానసులైరి. అసూర్యంపశ్యలును హంసయానలు నైన ప్రమదాజన మా వనవీథుల [11]"వృషభగతిరగడలతో విశృంఖల విహారముల నొనర్పఁగని వారు కన్నుల కామెతలొసఁగి గర్వించిరి.
శుభాశుభములకు సుమసంబంధ మార్యోపదిష్టమార్గము. ఇష్టదైవతముల ప్రణయానురాగములఁ జూఱఁగొనిన ప్రసవముల నిచ్చి కొల్చిననాఁడే పురాతన భారతీయ భక్తుఁడు పరమానందభరితుఁ డైనాఁడు. కుతపవేళ గృహవీథి కరుఁగుదెంచిన యతిథి నాహ్వానించి కాశపుష్పార్చనఁ గావింపఁ గలుగునెడ గేస్తు 'ధన్యోస్మి' యని తలంచినాడు. స్వయంవర వేళలందు పరీక్షానంతరము మరందబిందు తుందిలమ్మగు సురభిళ పుష్పమాలికచే రాకుమారి వరుని గళసీమ నలంకరించిన పిమ్మటనే యతని మందాక్షవీక్షణ మాలికాద్వితయోద్దీప్తుఁ గావించినది. పరిణయ వేళఁ బ్రసవరథములఁ బర్యటించి నవవధూవరులు వృద్ధదంపతుల శుభాశీస్సుల నందికొనిరి. మూఁగనోము పట్టిన ముగ్ధ[12]దూసిన నాగమల్లికల దోసిళులతో' ముత్తైదువుల మంగళాకాంక్షల నర్థించినది. ప్రసవశయ్యల శయనించి ప్రసవాసవములు సేవించిన పిమ్మటనే మదన మహాసామ్రాజ్య పట్టభద్రులై మహారాజులు నిశాసమయములఁ బ్రవర్తిల్లిరి. వారి కొల్వుకూటములఁ గళాభిజ్ఞలైన నట్టువరాండ్రు మున్ముందుఁ బుష్పాంజలులఁ బ్రరోచనఁ గావించిన పిమ్మటఁ జతుర లాస్యోల్లాసితలైరి. రాజసూయానంతరము జైత్రయాత్రాతత్పరులై శత్రుదేశములపై దండయాత్ర సాగించి రణవీథుల శాత్రవశిరః కందుకక్రీడావినోదులై విజయమునఁ దిరిగివచ్చు రాజన్యులకుఁ బురలక్ష్మి చత్వర రాజమార్గ ప్రతోళికా సౌధాగ్రములు ధరించిన కలువడములతోఁగాని కమనీయ సుస్వాగత మొసఁగ లేదు. శ్వేతవసనాంగరాగములతో శుభ్రనవ మల్లికాకుసుమ కుట్మలాలంకృతయైగాని శుక్లాభిసారిక కాంతునభిసరింపలేదు. సహగమనసమయము లందుఁ బితృవనవిహారమున కేఁగుచున్న పుణ్యవనితలఁ బుష్పలోకము ప్రణయాభిభూతయై యనుసరించినది. 'శ్మశానకుసుమన్యాయ' మబ్బినను గణుతింపక ప్రసవకులము స్నేహస్వరూపనిరూపణ మొనర్చి కీర్తిగడించి లోకమునకు గుణపాఠము నేర్పినది.
చతుర్విధాలంకరణములలోఁ గుసుమాలంకరణ మమలినమైనది. ఇయ్యదియే యాద్యమైనది. నేఁటి భూషాలంకరణముల చరిత్ర నన్వేషింప నవి యన్నియు నొకనాఁటి పౌష్పాలంకరణములని వెల్లడి యగుచున్నది. ఈ సహజ సుమాలంకరణ సౌభాగ్యగరిమను గూర్చి సకలర్తుసంపదలు గల యలకాపుర మందలి పురంధ్రీమణుల నడిగిన వీనుల విందుగ వినిపింతురు. 13[13]వారు లీలాకమలహస్తలు, బాలకుందాను విద్దలు, లోధ్రప్రసవ పరాగముచేఁ బిశంగిమశ్రీ వహించిన మనోహరాబ్జముఖలు, నవకురవక కేశపాశలు, చారుశిరీషకర్ణలు, ఆషాఢప్రథమ దివసమేఘదర్శనాయత నీపసుమాలంకృత సీమంతినులు”.
'స్త్రీల చిత్తము కుసుమసుకుమార' మని 14[14]"మహాకవి భవభూతి ప్రవచనము. వారికి నుద్యానపుష్పములకును సన్నిహిత స్నేహము, పుష్పవనవిహారసమయములఁ బ్రబంధనాయికలును బూఁదీవలు నన్యోన్యము మార్పునొందుట కవిలోక సిద్ధము. లతావనితలకు దోహద సేవ యొనర్చుట వా రెఱిఁగినట్లు వన్నె కెక్కిన వనపాలకు లైన నెఱుఁగ రనుటలో నతిశయోక్తి యిసుమంతయైన లేదు. లేకున్న కమలహస్తల కరస్పర్శతోఁగాని మాకందము పల్లవింపకుండుట, కోమలాంగుల యాలింగనకళా ప్రక్రియలతోఁ గాని కురవకము కుట్మలింప కుండుట లెట్లు పొసఁగును? అలివేణుల వీక్షణములో నే యమృత మున్నదో, తిలకము కులికి పుష్పించుచున్నది. అశోక మంత కంటెను జాణ; చరణాహతి కలుగు వఱకును జలింపదు. కంబుకంఠి గీతామృతమునఁగాని కిసలయింపని ప్రియాళువు కళాప్రియ యనుటలో నౌచిత్య మున్నది కదా! ముగ్ధహాసల ముఖరాగమున జంపకము, నర్మభాషిణుల సరసహాసమున మేరువు, సీమంతినుల సీధురసముచే వకుళ, పద్మనేత్రల ప్రౌఢముఖవిలాసశ్రీల సింధువారము, కామినీమణుల కమనీయసల్లాపములఁ గర్ణికారము కుసుమించుటలు చూడ, నా లతాతరువుల రసికత యన్యప్రాణిలోకమున కతీతమైన దని తోఁచకమానదు. పుష్పాలంకరణపట్టభద్రలైన పుష్పలావికలు పూర్వ పట్టణములకుఁ బెట్టని యలంకారములు. నర్మ సరసోక్తులకు వా రేడుగడలు. వారి నిశితసంభాషణలకుఁ గుసుమములు సంకేతములు. 15[15] పొన్న పూవొడి నేల పొదివితివే చెలి' యని పుష్పముల విలిచికొనవచ్చిన పల్లవశిఖామణి యొకఁడు ప్రశ్నింపఁ బుష్పలావిక కర్తుక 'పొడమె బల్దీవిపై పొదువవలదె’ యని సరసమగు సమాధాన మొసఁగి యతని హృదయమును ముప్పిరిఁగొనఁ జేయుచున్నది. మధురానగరి యందు -
చ. 16[16]"సరసులనర్మ మింపుల నొసంగఁ గదంబఁపు దండఁగట్టుచోఁ
గరగుటఁదెల్పుదృక్తరళ కాంతులు నుత్తరమిచ్చు నంతరాం
తరములనవ్వులు న్గలువతండము మొల్లలు నుంచు మిన్నుగ్రు
చ్చి రహిని రిత్తనూలొసఁగి సిగ్గువహింతురు పుష్పలావికల్.”
ప్రియులు సంకేతస్థానములఁ జెప్పికొనుటకును బుష్పములు చిహ్నములై యెప్పుచున్నవి. నీలోత్పలముపైఁ దుమ్మిపూవును నిల్పిచూపిన 'నర్ధనిశా సమయమున శివాయతనమునందు మన యిరువుర సమాగమ' మని వారి పరిభాష.
క.17[17]కలపములు గూర్ప బహువిధ
తిలకంబులు వెట్ట వింత తెరువునఁ బలు పు
వ్వులు గట్టి కట్టి ముద్దుగ
దల ముడువఁగ సరులుగ్రువ్వఁ దద్దయునేర్తున్'
సైరంధ్రులు రాజప్రాసాదములు 18[18] వావాతలకుఁ బ్రణయపాత్రలై వారి శీలసౌభాగ్యములఁ గాపాడుటయందుఁ 'గర్కటిగర్భము ధరించినట్లు' జాగరూకత వహింప నెంతయు విలసిల్లుట ప్రసవకులకీర్తి నుగ్గడించుచున్నది.
'పరమేష్ఠి రమ్యాతిరమ్యముగఁ బుష్పసృష్టి యొనర్చినాఁడు; కాని వాని కాత్మను బ్రసాదింప మఱచె' నని యొక తాత్వికుఁ డనినాఁడు. ఇతఁడు దేవత అగ్నిముఖు లైనట్లు పుష్పములు కవిముఖములని మఱచెనేమో! కవిముఖముల నే నాఁటి కా నాఁ డవి తమ భావపరంపరల వెల్లడించుచునే యున్నవి. 'ఏ కోవ పూవునే నీవు, నీ తావి పూవులకు రా' దని స్తుతిపాఠకుఁడై భ్రమరయువకుఁడు ముగ్ధకన్యకల మిథ్యాప్రణయమున మోసగింపఁ బూనుకొనిన వేళలఁ గనిపెట్టి 'నెమ్మదికి రావె యీ తుమ్మెదకు నో పూవ! అమ్ముకోఁబోకె నీ నెమ్మనము నో పూవ!!' యని పుష్పలోకము హితవాక్యములఁ బలికినది. నీచపు దాస్యవృత్తి మనలేక దేశము స్వాతంత్య్రజైత్రయాత్రల సాగించు సమయమున -
ఉ. 19[19]ఈ సుమజన్మ మెట్లు ఘటియిల్లెనొ నా కొకనాఁటి పాటిదై
వాసనలీను సోయగము వాయని తీయని పోడుముల్ క్షణం
బో సగమో విచారపడఁబో నయినన్ విడివడ్డ నా యెద
న్మోసులువారు నూతనమనోరథ మామని వేడిపొంగులన్.’
అని పుష్పలోకప్రతీకయైన యొక సుమము నిజకాంక్ష నిట్లు వెల్లడించినది. "ఓ వనమాలీ! పేదల రక్తమాంసములఁ బెంపు వహించి దయారసామృతాస్వాద దరిద్రులైన ధనవంతుల పెద్దఱికమ్ము కై మతోన్మాదము పెంచు దేవునికి మాఱుగ నిల్పిన రాతిబొమ్మలం దూదరనోవు జన్మ మిఁక యొక్క నిమేషముసైప నాయెదన్. లలనాజనతా కబరీభరైకభూషాకలనలందుఁ దల్పోపగూహబిబ్బోకములందును నాకుఁ దలంపు లేదు. చక్రవర్తుల శవపేటికలఁ జీరనిద్రనొందుఁ చిత్తము లేదు. నన్నుఁ ద్రుంచి మాతృసేవాచరణమ్ములం దసువు లర్పణఁ జేసెడివారి పార్థివశ్రీ చెలువారుచోటఁ బడవేయుము. వారి యుదాత్త సమాధి మృత్తికలో వాసనలీనుచు రాలిపోయెదను.”
పుష్పలోకమునఁ బ్రవేశించిన మహాకవులకు మహనీయ దర్శనభాగ్యములు లభించినవి. ఆదికవి వాల్మీకి పుష్పతరువుల నొక మాఱుష్ణీషధారుల వలెను, మఱియొకమాఱు పీతాంబరధారులవలెను దర్శించినాఁడు. శివతపోభంగ కార్యనిర్వహణార్థమై సుమసాయకదేవుఁడు త్రిలోకాధిపతియగు నింద్రుని కడ తాంబూల మందుకొని రతీద్వితీయుఁడై వాసంత విలాసశ్రీ వహించిన తపోవనమునఁ బ్రవేశించునేళ మహాకవి కాళిదాసునకుఁ బుష్పలోకము ప్రియదర్శన మొసఁగినది.
20[20]లగ్నద్విరేఫాంజన భక్తికిమ్మీరిత తిలకముఖియై మధుశ్రీ బాలారుణకోమల లాక్షారసముచేఁ జూతప్రవాళోష్ఠము నలంకరించుచున్నది. ప్రియాళుద్రుమమంజరీరజః కణములు విశాలనేత్రములఁ బడుటచే దృష్టిపాతమునకు విఘ్న మాపాదింప మృగములు మదోద్ధతిచే మర్మరపత్రమోక్షములైన వనస్థలములఁ బర్వు లెత్తుచున్నవి. చూతాంకురాస్వాద కషాయకంఠమగు పుంస్కోకిలాకూజితము మనస్వినీమాన విఘాతదక్షమై యొప్పుచున్నది. వర్ణప్రకర్షనే కాని బ్రహ్మ తనకుఁ దావి నీయలేదని కర్ణికారము నొచ్చుకొనుచున్నది. మధుద్విరేఫరాజు కుసుమైక పాత్రలోఁ బ్రియాను వర్తమానుఁడై యాస్వాదించుచున్నాఁడు. గీతాంతర వేళఁ గిన్నరుఁ డొకఁడు శ్రమవారిలేశముల నించుక సముచ్ఛ్వాసిత పత్రలేఖలు గలిగి పుష్పాసవాఘూర్ణిత నేత్రశోభియగు ప్రియాముఖమును జుంబించుచున్నాఁడు. నిండు పూగుత్తులే పాలిండ్లుగఁ జిత్తమును హరించుచున్న తీఁగబోటులవలన తరువరులు వినమ్రశాఖా భుజబంధనముల నొందినవారగుచున్నారు. 21[21]"మురారి మహాకవి యస్తమించు సూర్యకిరణములనే యొకటి, రెండు, మూఁడు, నాలుఁగని లెక్కించుచుఁ దన కమలదళముల ముడిచెనో మఱల నుదయించు నట్టి యా కిరణములనే యుదయవేళ కమలలత సంతోషముతోఁ దిరిగి లెక్కించుచుఁ గ్రమముగాఁ దనదళములను విప్పు మనోజ్ఞ దృశ్యమును దర్శించినాడు.
మ. 22[22] "తనకుం గౌఁగిలి యీ వొకప్పుడును నాథా! నీ కరస్పర్శనం
బున గిల్గింతలె యంచుఁ బద్మిని కరాంభోజంబునన్ మందమం
దనటద్వాయుచలద్దళాంగుళులు గన్పట్టంగ నవ్వెల్గురా
యని రారా యనిపిల్చె నాఁదగు ద్విరే పాద్యంతదీర్ఘధ్వనుల్.”
చేమకూర కవిరాజు వీనులొగ్గి విని యానందించినాఁడు. 'నానాసూనవితాన వాసనల నానందించు సారంగ మేలా నన్నొల్లదటంచుఁ దీవ్రతపమొనర్చి గిరికాదేవి నాసికయై ప్రేక్షణ మాలికా మధుకరీపుంజముల నిర్వంకలం బూనిన' గంధఫలిని భట్టుమూర్తి కన్నులారఁ గాంచి తనివినొందినాఁడు. [23]23కవయిత్రి విజ్జికాదేవి యుదయ సంధ్యాదేవి నర్చించుటకై ప్రాక్సముద్రమున స్నానమాడి నభోద్రుమ శాఖికలం దున్న నక్షత్రపుష్పములఁ గోయ నంశుమాలి యసంఖ్యాకము లైన కరములఁ జూచు రమణీయదృశ్యమును జూచినది.
[24] 24చక్షుర్గోచర మగు పుష్పము సాధకుని దృష్టియందు హృదయపుష్పమునకు బాహ్యచిహ్నము. అది శుద్ధపుష్పము కాదు. విశ్వేశ్వరుని ప్రాణకళిక! అనంతుని లీలారూపము!! ఇట్టి పుష్పరూపమున మునిఁగి తన్మయత్వముతోఁ జూచి సాధకుఁడు దానిని ధ్యానధారణలకు లక్ష్యముగ నొనర్చుకొనుచున్నాఁడు. అట్టి స్థితి యందుఁ బుష్పము వలనఁ గలిగిన రసానుభవము సాధన కాలంబమగుటయే కాక మూర్తిమంతమగును. అందుఁ బ్రాణసాక్షాత్కారమగును. పుష్పము చిద్రూపమున ననంతమై యనంతమగు ప్రాణవాహినియందు దివ్యసౌరభముతో వికసించు చున్నది. సాధకుని ప్రాణమునకు నా పుష్పమునకు జరుగు నాదానప్రదానమే రాసలీల! రూపాంతరము!!'
- ↑ అతని సరస - కవిర్హి మధుహస్తయః అని శ్రుతి.
- ↑ సత్యరథమునకు - కవి ఋతస్య పద్మభిః అని ప్రమాణము, బుద్ధత్వము బౌద్ధులకు నిర్యాణము చరమసిద్ధి. ఇదియే బుద్ధత్వము.
- ↑ సాత్మ్యములు : సహజలక్షణములు; శతపత్రములపై కాళిదాసు మేఘ. సం. 1, శ్లో. 22.
- ↑ నిఋతి దిగ్వాయువతి - శ్రీ విశ్వనాథ ఋతుసంహారము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాకవి భర్తృహరి శతకత్రయిలోని శృంగార శతకమును "శంభు స్వయంభు హరయో హరిణేక్షణానాం, యేనా క్రియంత సతతం గృహ కుంభదాసాః, వాచామగోచర చరిత్ర విచిత్రితాయ తస్మై నమో భగవతే కుసుమాయుధాయ” అను శ్లోకముతో నారంభించినాఁడు.
- ↑ శంకరపూజ్యపాదులు : అద్వైతమతస్థాపనాచార్యుఁడైన యాదిశంకరుఁడు
- ↑ నిర్భిర్త్సిత - కాళిదాసు కుమార, సం. 3, శ్లో. 53
- ↑ ప్రౌఢభావ ప్రపూర్ణలౌ - ఒకకూరా కాకుజా (జపాన్ రచయిత) Book of Tea నుండి గృహీతము
- ↑ వినఁబడెను సంగీతము : Heard Melodies are sweet and those unheard off are sweeter still - Keats 'ode to a Grecian Urn' ఒక యాంగ్లకవి - వర్డ్సు వర్తు (క్రీ.శ. 1770-1850). సుప్రసిద్ధంగ్ల ప్రకృతి కవి; త్సిన్ చక్రవర్తి: చైనా సార్వభౌముఁడు
- ↑ పరిపూఁదోటలు : వసుచరిత్ర ఆ.1, ప. 108
- ↑ తను ధరణీతటిద్విహృతి - ప్రభా. ప్రద్యు. ఆ. 1, ప. 66
- ↑ వృషభగతి రగడ - ప్రబంధములఁ బుష్పాచయముల నీ రగడలఁ గవులు వర్ణించినారు. ఇట వృషభగతి నడకను గూడ సూచించును
- ↑ 'దూసిన నాగమల్లికల' - శ్రీ విశ్వనాథ 'మూగనోము' నుండి
- ↑ వారు లీలాకమల - కాళిదాసు మేఘసం. సర్గ 2, శ్లో. 2
- ↑ భవభూతి (క్రీ.శ. 730 ప్రాంతము) మాలతీమాధవము, ఉత్తరరామచరిత్ర, మహావీరచరిత్ర లనెడి నాటకత్రయమునకుఁ గర్త; పదవాక్యప్రమాణజ్ఞుఁడు
- ↑ పొన్నపూవొడి - వసుచరిత్ర ఆ. 1, ప. 109
- ↑ సరసులనర్మ - ఆముక్తమా. ఆ. 2, ప. 20
- ↑ కలపములఁగూర్ప - తిక్కన విరాటపర్వము ఆ. 1, ప. 320
- ↑ వావాత : మహిషి, పరివృక్త, వావాత, పాలాగలి - ప్రాచీన రాజన్యులకుఁ బత్నీచతుష్టయము. వావాత రాజప్రణయమును జూఱఁగొనినది
- ↑ ఈ సుమజన్మ - శ్రీ వేదుల 'కాంక్ష' నుండి
- ↑ లగ్నద్విరేఫ - కాళిదాసు కుమారసం. సర్గ. 3, శ్లో. 30-54.
- ↑ మురారి : అనర్ఘ రాఘవకర్త (క్రీ.శ. 790-840) ఈ భావమునకు మూలము "ఏక ద్వి త్రి చతుః క్రమేణ గణనా మేషామివాస్తం యతాం కుర్వాణా సుమకోచయద్దశశతా న్యంభోజ సంవర్తికాః భూయోశ క్రమశః ప్రసారయతీతా స్సం ప్రత్య మానుద్యత స్సంఖ్యాతుం సకుతూహ లేవ నళినీ భానో స్సహస్రం కరాన్"
- ↑ తనకుం గౌఁగిలి - విజయవిలాసము ఆ. 1, ప. 130 చేమకూర తంజావూరు
రఘునాథరాయల యాస్థానకవి నానాసూన - వసుచరిత్ర ఆ. 2, ప. 47 - ↑ విజ్జికాదేవి - క్రీ.శ. 6, 7 శతాబ్దుల మధ్యకాలము. కౌముదీమహోత్సవ నాటకకర్త్రి - ఇందలి భాగమునకు మూలము : దీర్ఘ దిగంతవిటపేషు కరైరసంఖ్యై నక్షత్ర పుష్పతరణేషు నభోద్రుమస్య, స్నాతో స్థితో జలనిధేరయ మంశుమాలీ, సంధ్యార్చనాయ కుసుమాపచయం కరోతి.
- ↑ చక్షుర్గోచరమగు పుష్పము: సమీక్ష - శ్రీ ముట్నూరి కృష్ణరావు పుట 84