వావిలాల సోమయాజులు సాహిత్యం-4/ఇతర వ్యాసాలు/కులాసా కబుర్లు
కులాసా కబుర్లు
ఉదాత్తమైన విషయాల మీద నిలిచి అలోచించటానికి మనసు 'మొరాయించి'
నప్పుడు ఉబుసుపోక కొందరు ఉత్తములు కూడా కులాసా కబుర్లు చెప్పుకుంటారు.
ఇది కేవలం కించిత్కాలక్షేపార్థం. కొందరు ఆ పని తప్ప మరో పని చెయ్యలేరు.
‘అసిధారా వ్రత దీక్షితుడి’ వలె జీవితాన్ని ఆద్యంతమూ ఈ 'మహోత్కృష్ట' కర్మలోనే
వారు గడుపుతారు. అయితే వారికి వ్రతుల మన్నమాట తెలియకపోవచ్చు. దీనికి
మూలకారణం జీవితాన్ని 'సింహావలోకన' చేసే జిజ్ఞాసకు బుద్ధి నిరంతరమూ
నిద్రావస్థను పొందటమే. వారి వృత్తికి మనస్సు ఎన్నడూ 'మరణ బాధ' పొందనవసరం
లేదు. ఆలోచనా, పర్యాలోచనల మధ్య 'డోలాయమానం' కావటం అది స్వప్నావస్థలోనైనా
అనుభవించి ఉండదు. విసుగు లేకుండా, అణుమాత్రమైనా 'టెంపో' చెడకుండా
'చిన్మయ జ్యోతి' దర్శించేటప్పుడు పొందే 'చిదానందానుభూతిలో శ్రోతలను ఆకట్టే
ప్రజ్ఞ దానికి అవసరం. దానికీ సహజ ప్రతిభ ఉండాలి. వ్యుత్పన్నతను అది లోకానుభవ
పరిశీలనలవల్ల అజ్ఞాతంగానూ, అననుభూతంగానూ పొందుతుంది. ఇంత మాత్రం
చేత ఈ కబుర్ల రాయుళ్ళ మనస్సుకు మాంద్యం లేదని కాదు. అది ఊర్ధ్వంగా,
ఎగరలేని పక్షివంటిది; పని చేయదని కాదు. 'మందమైన మనస్సు పిశాచాలకు
ప్రియమైన కర్మాగారం' అనే ఇంగ్లీషు సామెత ఇందుకోసమే పుట్టింది. ఇటువంటి
‘మందబుద్ధులలో నుంచే సైతాను అతని శిష్యులను స్వీకరిస్తాడు.' క్రీస్తు 'కర్మ యోగులలో
నుంచే అతని అనుచరులను గ్రహిస్తాడని ఓ తాత్వికుడన్నాడు. ఇందులో అనంత
సత్యం గర్భితమై ఉంది; అందువల్లనే కులాసా కబుర్లు చెప్పేవారు నిరంతరమూ
శ్మశాన జీవితం గడుపుతారని తాత్త్వికులంటారు.
స్వతస్సిద్ధంగా ఉత్తమ విషయాన్ని గురించి ఆలోచించక కులాసా కబుర్లు చెప్పుకునే వారిలో ఉండే మాంద్యం కొన్ని విధాలైన కార్యశూరుల్లోనూ ఉంటుంది. ఇటువంటివారు ఒక్కొక్కప్పుడు ఉత్తమ క్రియాదక్షులనూ, జిజ్ఞాసువులనూ చూచి పరిహసిస్తుంటారు. జాన్సను రాత్రిళ్ళు ఏకాంతంగా కావ్యకర్మలో మేల్కొని ఉదయానంతరం నిద్రపోతుండేవాడు. ఆయన్ను చూచి ఒకప్పుడు ఇటువంటి వారు
కొందరు పరిహసించారు. ఆ మహాశయుడు ఈ కోటిలో చేర్చదగినవారిని గురించి
జిజ్ఞాస చేసి 'ఒకడు సాలీళ్ళను పట్టుకొని సూక్ష్మదర్శితో దానికెన్ని కళ్ళున్నవో
పరిశీలించటానికి జీవితమంతా వ్యర్థం చేస్తున్నాడు; మరొకడు అందమైన పూలలో
పుప్పొడిని విడదీసి విచ్ఛేదయంత్రమందు కాలం గడుపుతున్నాడు. కొందరు గాలుల
రాకపోకలను పరిశీలించి వాటిని 'ఉల్టా సీదా' చెయ్యవచ్చు ననే తృప్తితో
చనిపోతున్నారు. ఇంతకంటే ప్రముఖులు కొందరు రంగులేని రెండు పానీయాలను
కలపటంవల్ల కొత్త రంగు వస్తున్నదని గమనించి, ఒక మహత్తర విషయాన్ని దర్శించి
లోకోపకారం చేశామన్న తృప్తితో దేహయాత్ర చాలిస్తున్నారు. వీళ్ళందరినీ
మనోమాంద్యులని అనవలసిన స్థితికి నన్ను పురికొల్పుతున్నారు' అని అన్నాడు.
ఆయన చెప్పినట్లు ఇటువంటివారిలో మానవత్వం లుప్తమైపోతుంది; పైశాచిక జఠర
ఉంటే ఉండవచ్చు.
నిశితంగా ఏ విషయాన్నైనా ఆలోచించవలసిన అగత్యం లేని ఖాళీ మనస్సూ, అతివాచాలమైన జిహ్వా రెండూ ఏకోదరాలు. గోరంతలను కొండంతలు చేసి ఆలోచించటం శూన్యమైన మానసానికీ, నీలాపనిందలకు రెక్కలు కట్టి లోకంలో ఎగరవెయ్యటం వాచాల జిహ్వకూ లక్షణం. కులాసా కబుర్లు మాత్రమే చెప్పగల వాడికీ రెండూ తప్పకుండా ఉండితీరుతవి.
కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే ఏ 'బృందం' దగ్గరికైనా వెళ్ళి ఓ చిరునవ్వు పారేసి 'ఏమండోయ్ ఏం మాట్లాడుకుంటున్నా? రని ప్రశ్నిస్తే, రింగు లీడరును చూపించి 'మనవాడు ఏమేమో కోసేస్తున్నాడండీ' అని అతని ముఖాననే అనేస్తుంటారు. దానికి అతని అంగీకారం ఉండీ, ఉండనట్లు 'కబుర్ల రాయుడు' స్మేరాననుడౌతాడు. ఏ దేశంలోనైనా కబుర్లు చెప్పుకునే వాళ్ళు బృందాలుగా ఏర్పడి, విషయాన్ని బట్టీ, కాలాన్ని బట్టీ వ్యక్తులు మారిపోతూ కాలక్షేపం చేస్తుంటారు. వారి మధ్య గ్రహరాట్టులా కబుర్ల రాయుడు'. అతని ‘వాచామగోచర వాచాల విన్యాసాలతో, శ్రోతల దృక్సరోజతోరణ మాలాలంకృతుడౌతూ, ఉన్నతాసనాన్నీ, ఉత్తమ గౌరవాన్నీ పొందుతుంటాడు. అతగాడు 'వాక్రుచ్చే' అన్నీ సర్వాబద్ధాలనీ, చట్టసమ్మతాలు కానివనీ 'మనో వాక్కాయ కర్మలా' వ్యక్తీకరిస్తున్నా అతనిని మానమనటం గానీ, శ్రోతలు వినకపోవటం గానీ జరగదు. ఇందుకు ప్రధాన కారణం అతని మాటల్లో ఉన్న 'అయస్కాంత శక్తి'. అది అతడికి ఎలా లభించిందని ప్రశ్నించి చూస్తే వినేవాళ్ళు ఇచ్చిందే! ఉబుసు పోకకు కబుర్లు చెప్పే వ్యక్తులు ఆ సంఘాలు గానీ, మానవ సమాజంగానీ ఇచ్చే గౌరవ మర్యాదలను పరిశీలిస్తే మానవజాతికి కట్టుకథలన్నా, అసత్యవాక్పాటవమన్నా ఎంత ఆసక్తో
అవగతమౌతుంది. అందుకనే ఎక్కువ మందికి కులాసా కబుర్లే 'ఖుషీ'గా
ఉండటమున్నూ, చెప్పేవాడు బట్టతలలకూ, మోకాళ్ళకూ ముడి పెట్టుతున్నా ముచ్చటపడి
విని మురిసిపోవటమున్నూ. విశేషంగా మానవజాతిలో ఉన్న ఈ దౌర్బల్యం
గమనించటం వల్ల కబుర్ల రాయుళ్ళు జైత్రయాత్ర సాగిస్తున్నారు. లోకాలను
జయిస్తున్నారు. వారు చెప్పేమాటలు, 'గగన కుసుమాలనీ' అజాగళస్తనాలనీ,
నేతిబీరకాయలనీ గ్రహించినా ఏమీ వెరపు లేదు. అతడు 'ప్రియ వాది'. 'అప్రియస్య
చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః!' అన్న ఆర్యోక్తిని తెలుసుకోకపోయినా సారాంశాన్ని
గ్రహించి వ్యవహరించటం అతని లక్షణం.
కబుర్ల రాయుడు లోకం సమస్తం అతనికి అవగతమైనట్లే మాట్లాడుతుంటాడు. అతడి 'అనర్గళ వాగ్ధోరణీ సారణాల్లో అనేకులు మహాపురుషులూ, మహాత్ములూ ‘ఖూనీ' అవుతుంటారు. 'అందుమూలంగా అతను 'ఆత్మహత్య చేసుకుంటున్నాడన్నమాట' అని తాత్వికులంటేనేం? ప్రసిద్ధి పొందినవాళ్ళమీద ఇతని 'వాగ్బాణాలు' పడ్డా పరవాలేదు. ఇటువంటి 'గరుడాస్త్రాలకు' నాగాస్త్ర ప్రయోగం చెయ్యగలిగిన 'నరనారాయణులు' వాళ్ళు. ఇంకా పేరు ప్రఖ్యాతులు ఎరగని వాళ్ళమీద 'కబుర్ల రాయుళ్ళు' విసిరే 'అంపగమి'కి ఉక్కిరి బిక్కిరై పోతుంటారు. అందుకనే ఓ ప్రఖ్యాత రచయిత వీరిని 'అగ్నితుల్యు' లన్నాడు. అగ్ని 'తనూనపాత్తు' - పుట్టిన దేహమంతా తానే ఐ ఉంటాడట. వీరూ అంతే - నిలువునా 'ఖుషీ' ఉంటుంది. దాన్ని కబుర్ల రూపాన లోకంలో వెలిబుచ్చి 'అశుచీక్షణు' లౌతుంటారు. అగ్నికి నల్లని జాడ అంటి ఉంటుంది - అందువల్ల ఆయన కృష్ణ వర్త్మ ఐనాడు; వీరూ కృష్ణవర్త్మలే - వీరిని అపకీర్తి వెన్నాడుతుంటుంది. ఆయనవలె వ్యక్తులను 'పరశురామ ప్రీతి' చేసే శక్తి వీరికి లేదు గాని దాహకులు.
ప్రఖ్యాతులైన వ్యక్తుల మీదుగానో, ఇరుగు పొరుగు గృహస్థుల మీదుగానో కబుర్ల కమనీయ జిహ్వారథం నడుస్తుంది. అవహేళన అతని రథానికి కట్టిన అశ్వం. దాని కాంతీ, సటాచ్ఛటలూ, హేషితాలూ శ్రోతలను ఆకర్షిస్తవి. ఈ ఆకృష్టులైన వ్యక్తులకు కబుర్ల రాయని జిహ్వాజగన్నాథ రథ చక్రాల క్రింద నలిగిపోతున్న ప్రఖ్యాతుల ప్రజ్ఞా ప్రతిష్ఠలు గానీ, సామాన్య గృహస్థుల సమతా సౌమనస్యాలుగానీ ఎన్నడూ అర్థం కావు; అయితే వారికి బాధలేదు, ఆ ప్రయత్నమేలేదు గనక. వీరు 'జిహ్వా గ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్ర బాంధవా' అన్న ప్రమాణానికి విపరీతార్థాన్ని కల్పించే శక్తిగల ‘కబుర్ల రాయని' 'గారాబు శిష్యులు'. వీరి గురువర్యుడు 'సర్వజ్ఞుడు.' ఆయన లోకం సమస్తాన్నీ ఆకళించుకొన్న అఖిలజ్ఞుని వలె ప్రసంగిస్తాడు, ప్రవర్తిస్తాడు. అది
సాహసమని గానీ, సత్యేతరమని గానీ అతడెరగడు. అతనిది దివాంధ దృష్టి.
'విన్న విషయాల్లో ఎక్కువ భాగం నమ్మకు. నమ్మినవాటిలో అతి స్వల్పాలు గాని సత్యాలు కావు' అని పూర్వం ఓ గురువర్యుడు శిష్యునికి బోధించాడట. ఇది నగ్న సత్యం. 'కబుర్లరాయని' 'జిహ్వాతూలిక' చిత్రించిన ఓ 'సహస్ర ప్రియ' సత్యానికి 'ప్రియవిరహ, కావచ్చును. అతడు 'ప్రియారహితగా' చూపించిన కురూపిని వేయిమంది ప్రేమించనూ వచ్చు, లోకంలో సత్యాలకూ కులాసా కబుర్లలోని సత్యాలకూ ఇంత అంతరముంటుంది.
కబుర్లకు అపప్రథలూ, అపకీర్తులూ, అసత్యాలూ తాబేదార్లు. వీటికి ప్రచారం కల్పించే వాళ్ళు కులాసా కబుర్ల రాయుళ్ళు. కులాసా కబుర్లలో వ్యక్తులమీద గానీ, వస్తువుల మీదగానీ ఉండే ఈర్ష్య, క్రోధం, వైరం, వలపూ ఇత్యాదులు వ్యక్తమౌతూ ఉంటవి. ఈ సహజావ బోధలకు కళ్ళాలు వేసి లొంగ దీసుకున్న వ్యక్తులు ఇటువంటి వాటిలో పాల్గొనరు. అథవా ఏ కారణం చేతనైనా ఆ దుస్థితి సంభవిస్తే మానసికంగానైనా హర్షించరు. సాధ్యమైనంత త్వరలో కులాసా కబుర్లరాయుని ఆస్థానమనే 'బలిపీఠం’ దగ్గరినుంచీ బయటపడే యత్నం చేస్తారు. అయినా ఎంత మోతుబరి పెద్ద మనుషులకైనా, జీవితాని కొకమాటే కావచ్చును. ఇటువంటి కబుర్ల 'గోష్ఠి'లో చేరటం తప్పటం లేదు. దానికి అన్నివైపులా అలముకొని ఉన్న వాతావరణ కారణం. అందులో కొందరు భాగస్వాములై క్రమంగా ఏదో లాభం ఒలికి పోతుందని, అటు తరువాత బయటపడలేక పోవటమూ జరుగుతుంటుంది.
‘అసత్యకథాకల్పనం చేసేవాళ్ళు నీచులు; వాటిని ప్రచారం చేసేవాళ్ళు నీచాతినీచులు, అన్నారు పెద్దలు. కులాసా కబుర్ల రాయుళ్ళలో ఎక్కువ భాగం ఇటువంటివారే. ఎప్పుడైనా యిటువంటి కులాసా కబుర్లకు మనమే గురి అయినామని గ్రహించిన పెద్ద మనుషులు పట్టించుకోనట్లు ఓ చిరునవ్వు విసిరేస్తుంటారు. అంతకంటే ఉదాత్తులు “నా మీద అసత్య ప్రకటన చేసినందుకు నాకు బాధలేదు; కానీ 'సంతసంబగును కల్గన్ భుక్తి అవ్వానికిన్" అంటారు. జిజ్ఞాసువులు 'అయ్యో! పాప' మని వాళ్ళ దైన్య స్థితికి నిట్టూరుస్తారు. కులాసా కబుర్లు చెప్పేవాళ్ళు ఆత్మశక్తిని గానీ, స్వభావాన్ని గానీ గ్రహింపలేనివారేమా? - అని వారి చింత. వీరి మాటలవల్ల కలిగే ప్రయోజనము బహుస్వల్పంగా ఉంటుంది; దానికి లెక్క జేసి వారితో మైత్రినాశించవలసినంత అవసరం లేదు. వారి ప్రచారం వల్ల సంభవించే నష్టానికి భయపడవలసిన పని కూడా ఉండదు. పొరపాటున అటువంటి స్థితి సంభవించిన
వ్యక్తికి దైహిక, మానసికారోగ్యాలు క్రమక్రమంగా లుప్తమైపోతూ ఉంటవి. 'సత్‌శీల
భానూదయం'తో వీరి ‘వాఙ్మిహికాజలధు' లను ఆపోశనించగలనన్న అంతశ్శక్తి కలవాణ్ణి
అవి అణుమాత్రమైనా కలత పెట్టలేవు.
కబుర్ల రాయుళ్ళు ఒక్కొక్కప్పుడు వాళ్ళను గురించే కోసేస్తుంటారు. ఆత్మస్తుతి కంటే ఆనంద ప్రదమైన విషయం ఏముంది గనక! అందరి గొప్పదనాన్ని గురించీ అవహేళనైతేనేం, వాళ్ళు భంగ్యంతరంగా పలుకుతుంటారు. వాళ్ళ మంచి చెడ్డలమాట ఎవరూ తల పెట్టకపోవటం, వాళ్ళ మనస్సును క్షుభితం చేయటం వల్ల ఈ పనికి పూనుకుంటారు. 'ఎవరూ చెప్పనప్పుడు మన మైనా చెప్పుకోకపోతే ఎలాగనే వారి భయం. అనేకానేక సందర్భాలలో ఇటువంటివారికి 'ఆత్మ విశ్వాసాన్ని' అంటగట్టటమూ, ఆధిక్యమును గుర్తించటమూ లోకంలో గమనిస్తుంటాము. ప్రజాయుగంలో 'స్కోత్కర్ష’ లేనిదే పైకి రాలేమేమో అన్నంత అనుమానం కలిగేటట్లు చేయగలిగారీ 'ఆత్మ ప్రశంసాపరులు!'
కులాసా కబుర్లు చెప్పటమన్నా, వినటమన్నా, 'మహిళాలోకం' మహా ఆదరాన్ని చూపిస్తుంది. స్థూలంగా ఇవి వారి వినోదాలేనని ఏకగ్రీవంగా అంగీకరించవచ్చు. ‘కులాసా కబుర్లకు’ ఒక అధిదేవతను సృజించమని ఏ శతశిల్పిని కోరినా అతడు 'స్త్రీ మూర్తినే' సమాధినిశ్చలుడై దర్శించి తీరుతాడు. 'వర్ణికాభంగం'లో అతనికి కొంత అనుమానం కలుగక తప్పదు. మూల ప్రకృతి వర్ణాన్నే భావిస్తాడు; విను "శిష్య బ్రువులను" చూచి నిశ్చలంగా వికటాట్టహాసం చేసే వికృత రూపినా, కాదు, విమలతేజోమూర్తిని సృజిస్తాడు.
స్త్రీలోకంలో కబుర్లు చెప్పటం ప్రారంభమైతే, పెళ్లి చేసుకున్న తరువాత ఆమె అంత అధమస్థురాలు ప్రపంచంలో లేదని ప్రతి అర్ధాంగీ ప్రారంభిస్తుంది. అంతటి నిస్పృహకు ఏదో నిగూఢమైన కారణం ఉండి ఉంటుందని ఏ మానసిక వేత్తా మనస్సును క్లేశపెట్టుకో నవసరం ఉండదు. సర్వసామాన్యంగా ప్రక్కయింటి ఆవిడ క్రొత్తగా చేయించుకున్న నెక్లేసో, 'పెట్టి పూజ' చేయను పెద్ద యింటి ఆవిడ కొనుక్కున్న క్రొత్త పేటంచు చీరో ఐ ఉంటుంది. అంతగా మనం పొరబాటు పడితే, తత్తుల్యమైనదే మరొకటి తప్పకుండా అయి తీరుతుంది. ఏమైనా ఒకటి సత్యం. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి భగ్గుమనే అత్తాకోడళ్ళనూ విడివిడిగా పిలిచి కబుర్లు చెప్పించి, 'పుల్లింగాలు' పెట్టి వాళ్ళు కాట్లకుక్కలవలె పోట్లాడుకుంటుంటే మనసారా చూచి ఆనందించడం
ఆంధ్రదేశంలో ప్రతి అత్తా కోడలికీ అర్థంగాని ఓ సరదా!. ఆధునిక యువతీ మణులలో,
కులాసా కబుర్ల పరిణామంగా 'ప్రేమ వసంతమూ, పెళ్ళి గ్రీష్మమూ' అని అనేక
గోష్ఠుల్లో తేలిపోతున్నట్లునూ ప్రత్యేక విలేఖర్లు పదే పదే వ్రాస్తున్నారు.
లోకంలో ఇతరుల ప్రణయ, ప్రళయాలూ, ఆశనిరాశలూ, పాండిత్యా పాండిత్యాలూ, భయభక్తులూ కులాసా కబుర్లకు వస్తు విశేషాలు చెప్పేవారికి, త్రినయనాగ్నికి 'త్రిపురాలూ' దహించుకో పోవలసినదే. అనేక మాట్లు అతగాడొక్కడే ‘స్వయం వ్యక్తి'గా శ్రావణ బెళగొళలోని గోమఠేశ్వరుడివలె కొండమీద నిలిచిపోతాడు. ఇతరులెంతెంత వారూ 'ఇంద్రాదు' లౌతారు. వారు ఉత్తమానుత్తమాన్ని గానీ, పవిత్రతా పవిత్రతలను గానీ పాటింపని 'పరమా ద్వైతులు'. వీరివల్ల బాధపడ్డ ఒక జిజ్ఞాసువు అనాలోచితంగా అన్నాడు : 'కులాసా కబుర్లను చెప్పేవాళ్ళనూ, వినేవాళ్ళనూ శిక్షించే అవకాశమే నాకుంటే, ఒకరి నాలుకను - వక్త గనక - చిల్లి పొడిపించి చెట్టుకు కట్టిస్తాను; ఒక కర్ణ రంధ్రానికి తాడు కట్టించి ఏటవాళ్ళ కొండకొమ్మునుంచీ క్రిందికి జారవిడిపిస్తా' నన్నాడు. అటువంటి స్థితి వచ్చినా గట్టి న్యాయవాదులుంటే, ఈ 'అన్న వ్యక్తి' ముందు తన్ను తానే శిక్షించుకొని తరువాత ప్రతివాదులను శిక్షించేటట్లు అంగీకారం ఇప్పించవలసిందని కోర్టువారిని కోరి, అంతంలో అనంత దిగ్విజయం పొందగలరని నమ్మవచ్చు. ఈ వ్యసనానికి ఎప్పుడో ఒకప్పుడు పాలుగాని వాడుండడు. అందువల్ల ఇటువంటి 'అవకాశాన్ని' ఏ 'అభ్యుదయుడూ' కోరడు. ఇది నిశ్చయం.!
మంచి చెడ్డలమాట అలా ఉంచితే కబుర్లు చెప్పటం మటుకు అందరికీ చేత నౌతుందనుకోటం పొరబాటు. సహజ ప్రతిభతో పాటు వ్యుత్పన్నత ఉండి తీరాలి. కులాసాగా కబుర్లు చెప్పటమూ ఒక కళ. కళలు 'కాంతా సమ్మితాలు' అనంతాలూ అత్యద్భుతాలూ ఆనంద ప్రదాలు 'ఓమ్... తత్... సత్'
ఆంధ్రపత్రిక జనవరి 5, 1948