వల్లభాయి పటేల్/ప్లీడరుగా
ప్లీడరుగా -
వల్లభాయితండ్రి యాస్తిపరుఁడుకాఁడు. అందుచేత వల్లభాయి కింకను నున్నతవిద్య నభ్యసించుట కవకాశము లేక పోయెను. ఆతనికిఁగూడఁ గళాశాలావిద్య నభ్యసించు నభిరుచి లేకపోయెను. ఆయన యాంతర్యములో బారిష్టరు పరీక్షకుఁ జదువవలయునని యుండెను. కాని చేతిలో ధనములేదు. ధన సంపాదనకొఱకై ప్లీడరీపరీక్ష చదివి గోధ్రాలోఁ బ్రాక్టీసు ప్రారంభించెను. తరువాత బోర్సద్‌వెళ్లి యక్కడఁ బ్రాక్టీసు పెట్టెను. ఆయన యక్కడ నడుగు పెట్టఁగనే మహాప్రఖ్యాతి నార్జించెను. కేసులు చాల వచ్చుచుండెను. క్రిమినలుకేసు లనిన నాయనకు మిక్కిలి సరదా - మానవ స్వభావము తెలిసిన వాఁడు, సహజప్రతిభావంతుఁడు గనుక నాయన యీ ప్లీడరీ వృత్తిలోఁ బేరుప్రఖ్యాతుల నందెను.
పటే లధికముగా, ఖూనీ, దోపిడి మున్నగు క్రిమినలు కేసులు పట్టుచుండెను. క్రిమినలు లాయరుగా నాయనపేరు ప్రఖ్యాతులు మిన్నంటుచుండెను. ఆయనపేరు విన్న పోలీసు అధికారులు, మేజిస్ట్రేటులుకూడ భయపడుచుండిరి. వల్లభాయి పటేలును వదలించుకొంద మని మేజిస్ట్రేటు తన కోర్టును బోర్సద్‌నుండి యానందపట్నమునకు మార్చుకొనెను. కాని యక్కడకును బటేలు తయారయ్యెను. ప్రాక్టీసు వెనుకటి మాదిరిగానే యిక్కడకూడఁ బెరుగసాగెను. ఆ మేజిస్ట్రేటు మఱలఁ బటేలుతోఁ బడలేక కోర్టును బోర్సదుకు మార్చెను. మఱల నిక్కడకూడ నాయనయే ప్రత్యక్షము.