పరిచయము

సర్దారు పటేలు కాంగ్రెసు నాయకులలో భీష్మాచార్యుఁడు. భీష్మాచార్యుడేకాదు, భీష్మప్రతిజ్ఞకలవాఁడు. గాంధీజీ తరువాత భారత రాజకీయాలలో గణనీయుడు అయినను జవహరునకు ప్రేమాస్పదుడగువాడు. రాజాజీ వంటి మేధాసంపన్నుడాయన. కాని భారతనాయకులలోఁ బ్రత్యేకతఁగన్నవ్యక్తి. గాంధీయుగములో నొక విశిష్టతఁగల నాయకుఁడు. సముద్రునివలె గంభీరుఁడు. మేరువువలె నచంచలుఁడు. హిమగిరినిబోలు నున్నతుఁడు. సాటిలేని మేటి పరాక్రమము, దేశమునెడలఁ పవిత్రప్రేమ యాయనకు సహజాలంకారములు.

ఆయన హృదయము గుహవలె విశాలము, భయంకరము. “వజ్రాదపికఠినము, కుసుమాదపి కోమలము” కూడ.

గాంధీజీ కుడిభుజమని పేరుగాంచిన పటేలు చేతులలోఁ బడి తప్పించుకొని పోయిన వారెవ్వరును లేరు. భ్రిటిషుసింహమే గజగజలాడినది.

ఆయన గాంధికీ ముఖ్యశిష్యుఁడే, అయినను నాయన ప్రచారకుఁడు, ప్రబోధకుఁడుకాఁడు. ఆయనపద్ధతి భిన్నము. గాంధీజీ సిద్ధాంతములరీత్యా పోరాటములు జరిపించి ప్రపంచ విభ్రమ కలిగించిన కార్యసాధకుఁడు.

సర్దారు తన జీవితమంతయు రాజకీయములకే యర్పించెను. బ్రిటిషు ప్రభుత్వమునుండి యధికారమును హస్తగతము చేసికొనుటకు సత్యాగ్రహసమరము జరిపి ప్రతిరంగమునందు జయముగాంచిన విజయసారధి. భారత స్వాతంత్ర్యసమరములో నపూర్వసాహసమునఁ బోరాడినసేనాని. సద్యస్స్ఫురణ, సూక్ష్మ దృష్టి, శీఘ్రనిర్ణయము, భావగాంభీర్యము, వజ్రసంకల్పము, నిర్మాణ నైపుణ్యము, కార్యదీక్ష, ఆత్మవిశ్వాసము, సహజ వివేకము, సర్దారు ప్రత్యేక గుణములు.

ఆయన నిష్కపటి; కాంగ్రెసు నాయకులందఱలోను మంచి నిష్కర్షకలవాఁడని ప్రఖ్యాతిగాంచినవాఁడు. తన కనుకూలురు కానివారందరును బ్రతికూలురనియే భావించును. తటస్థభావ మనునది లేనేలేదు. ఆయన తలపెట్టిన పని యేదైనను సాధించక విడచిపెట్టఁడు. నిందాస్తుతులను లక్ష్యపెట్టఁడు. కర్తవ్యనిర్వహణలోఁ జండశాసనుఁడు. బారిష్టరైయుండికూడఁ దాను గర్షకుఁడనని చెప్పికొను వినమ్రమూర్తి.

ఇంపీరియలిజము, ఫాసిజములవలె సోషలిజము, కమ్యూనిజములుకూడ నాయనకు సరిపడని సంగతులు. గాంధీయిజమే యాయనకు గణనీయమైనది.

[1] “తన హక్కులపై దాడిజరిగిన నెంత పట్టుదలతో వ్యవహరించునో చెప్పుటకు వీలులేదు.

“స్వార్థరహితుఁడు. పనికిమాలినవారిని, నంతకంటె నెక్కువగా దుష్టులను, నియంతలను నిరసించువాఁడు.

“పోరాటము - ఇదియే యాయన నినాదము.

“సత్యాగ్రహిగాఁ బోరాడును. ఎవరిపై సహాయనిరాకరణము సాగించునో, యతనితో సహకారమునకై యెప్పుడును సిద్ధముగనే యుండును, యథార్థమైన సత్యాగ్రహి. “పరులవాదన కాయన త్వరగా లొంగనివాఁడు. అవసరమేమో, యనవసరమేమో తెలిసికొనగల విచక్షణ యాయనకుఁ గలదు. అవసరమని భావించినచో నిఁక బట్టు విడువఁడు. ఎప్పుడు నొక సూత్రముపైఁ బోరాడును. పోరాడ నారంభించినచో సర్వశక్తులను వినియోగించును. చీట్లాటలో నైనను, చపాతీలలో నైనను, వాగ్వివాదములో నైనను నిదియే యాయన తత్త్వము. జయమందుటయే యాయన లక్ష్యము. చర్చలలోఁ గానిండు, ఎన్నికలలోఁ గానిండు, విజయమునకై యాయన మహాతురత నొందును. అప్పట్టున నాయన యోర్మి పూర్తిగా నశించును. ఒక్కొకప్పుడు ప్రతిపక్షము నేమాత్రము సహింప లేఁడు. ప్రతిపక్షులను గటువుగా, పరోచకమైనవిధముగా మాటలాడి నొప్పించు తత్త్వము. కాని తన చమత్కృతితోఁ దెలివితేఁటలతోఁ బ్రతిపక్షులయందు విద్వేషభావము కలుగకుండఁ జేసికొనిపోఁగల దిట్ట.”

ఆజాద్‌వలె సర్దారు పాండితీప్రకర్షకలవాఁవాడు కాఁడు. కాని యపారమైన ప్రపంచజ్ఞానముకలవాఁడగుటచేఁ బాండిత్య లోపము బయటపడదు.

జవహరులాలువలె విస్తృతముగ విదేశములలోఁ బర్యటనచేసినవాఁడు కాఁడు. కాని చక్కని యూహశక్తి కలవాఁడు.

సుభాషబాబువలె ననిర్దిష్ట సాహసోపేతకార్యములకుఁ గడంగఁడు. తన కార్యాచరణప్రణాళికను ముందుగనే సిద్ధము చేసికొని దానిని నిరంతరాయముగ ననుసరించును.

రచన తక్కువ - కాని కాగితముపైఁ గలముపెట్టిన ధారాళముగ నడచును - ఆయన శైలి గంభీరము, అత్యంత సునిశితము.

ఉపన్యాసములు దంచివేయువాఁడుకాఁడు - కాని తన యుపన్యస్తవిషయములోని ప్రతి మాటయందును దన హృదయావేదనను జొప్పించి మాటలాడును. చక్కని చతురోక్తులతోఁ బిట్టకథలతోఁ దన యుపన్యాసమును విన సొంపుగఁ దీర్చిదిద్దును.

ఆయన వాక్యములు చిన్నవి - బల్లెపుపోటులవలె నుండును. స్వరాజ్యము సిద్ధించినపిమ్మట నెంతయో కాలముపాటు గాంధీజీ శిష్యులలో నగ్రస్థానము వహించిన వాఁడుగా సర్దారు స్మరింపఁబడును. అచంచలధృతి గలిగిన స్థిత ప్రజ్ఞుఁడుగా, నఖండ సేవానిరతి గల కర్మవీరుఁడుగాఁ జిర కాలము స్మరణీయుఁడై యుండఁగలఁడు.

కార్యాచరణమున విశ్వాసము, ఫలసిద్ధిపట్ల నడుగంటని యాశ, ధర్మబుద్ధిఁ - ఏసుక్రీస్తు తన శిష్యుల కీ గుణత్రయముగా బోధించినాఁడు. ఈ గుణత్రయబోధానుసారముగనే తన దేశమునకు, మానవజాతికిఁ స్వార్థరహితసేవ చేసినవాఁడని స్వరాజ్యసిద్ధ్యనంతరము సర్దారు బహుకాలము స్మరింపఁబడఁ గలఁడు.

ఆయన జన్మతః నాయకుఁడు. విద్యార్థిదశలోనే నిర్భయుఁడని పేరు పొందినవాఁడు. విద్యార్థులను సంఘటితపఱచి నాయకత్వము వహించి స్వార్థపరులైన యుపాధ్యాయుల నుఱ్ఱూత లూగించినవాఁడు.

న్యాయవాదవృత్తిలో క్రిమినల్ లాయరుగాఁ బ్రఖ్యాతి గాంచి పోలీసు అధికారులకు, మేజిస్ట్రేటులకు సింహస్వప్నమై పట్టిన ప్రతికేసునందు విజయము గాంచినవాఁడు.

గాంధీజీ సాహచర్యముద్వారా జీవితము ప్రజాసేవ కంకితము గావించి గాంధేయులలో సాటిలేనిమేటి యని గణన కెక్కినాఁడు. లెనినుకు స్టాలినెట్లో యీయన గాంధీజి కట్టి శిష్యుడని ఖ్యాతిగాంచినాఁడు.

గోధ్రాలో వెట్టిని దుదముట్టించుటలోను, కెయిరా సత్యాగ్రహములో గాంధీజీకిఁ గుడిభుజముగ సంచరించుటలోను గణుతికెక్కెను.

నాగపుర సత్యాగ్రహ మఖిలభారతోద్యమముగ మాఱి క్లిష్టపరిస్థితి యేర్పడినప్పుడు వల్లభాయి దానిని జయప్రదముగఁ బరిష్కరించి జాతీయపతాకాప్రతిష్ఠను గాపాడెను.

అహమ్మదాబాదు మ్యునిసిపాలిటీ కధ్యక్షుడై తన్నగరాభివృద్ధికిఁ బాటుపడుటయేగాక, దానిని కాంగ్రెసు నగరముగా దిద్దితీర్చిన కార్యదక్షుఁడు.

సత్యాగ్రహసమరములో బార్డోలీరైతులు చూపిన సత్యాగ్రహసాహసములు ప్రపంచేతిహాసములోఁ బేర్కొనఁదగినవి. ఇట్టి మహోదంతము ప్రపంచమునఁ గనివిని యెఱుఁగము. తరతరములనుండి తమ భుక్తములోనున్న భూములను భవనములను స్వస్థానములను వీడి యెనుబదివేల మంది సామాన్యజనము శాంతిసమరములో సర్వత్యాగములు చేసి యష్టకష్టము లనుభవించిరి.

ఈ బార్డోలీ సత్యాగ్రహసమరములో సర్వసేనానాయకుఁడై తుదివఱకుఁబోరాడి బ్రిటిషుసింహమును గజగజలాడించి రాజీకి రప్పించిన ఖ్యాతి పటేలునకే తగినది. భారత కర్షక లోకములోఁ గల చైతన్యమును బ్రపంచమునకుఁ చాటిన కర్షక విప్లవమూర్తి.

గ్రంథరచన చేయకయే స్వీయసంభాషణపాటవము వలననే పండితులు కవులు చేయజాలని భాషాభివృద్ధి గుజరాతీ భాషకుఁజేసిన భాషాసేవకుఁడు. “కదనరంగమున వలెనే కౌన్సిలు రంగమునఁగూడ బ్రభుత్వమును గాంగ్రెసుపక్షము పరాజయము నొందించఁగలదని ఋజువుచేసిన ఖ్యాతియుఁ బటేలునకే దక్కినది.

కాంగ్రెసువారి కీయనయందున్న భయభక్తులు మఱి యొకని యందు లేవు. కాంగ్రెసు నుత్తమ శిక్షణగల సంస్థగాఁ జేసినది పటేలు. సర్దా రనఁగా శిక్షణ, శిక్షణ యనఁగా సర్దారు, ఇవి రెండు నేకార్థబోధకములు - కాంగ్రెసు ప్రెసిడెంట్లు వత్తురు, పోదురు - కాని యా మహాసంస్థ యాజ్ఞల నమలులోఁ బెట్టునది యాయనయే. ఆయన గొప్పదనమున కంతకుఁ గారణ మదియే.

ఆయన కాంగ్రెసు కార్యనిర్వాహకసభ్యుఁడేకాదు - కాంగ్రెసు కిరీటము నౌదలఁ దాల్చిన ప్రజాసేవకుఁడు.

కాంగ్రెసుసూత్రధారులలో నొకఁడుమాత్రమేకాదు; కాంగ్రెసు విధినిర్ణేత.

స్వాతంత్ర్యసమరములో సేనానాయకత్వము వహించుటతోపాటు, స్వతంత్రభారతములో నుపప్రధానిగానుండి భారతజాతీయైక్యమునకు నిరోధకములుగా నున్న స్వదేశ సంస్థానముల నన్నిటిని ఇండియనుయూనియనులోఁ గలిపి సమ న్వయమొనర్చిన నేర్పరి - అశోకుఁడు, అక్బరు సాధించలేని యేకచ్ఛత్రాధిపత్యము సాధించిన సామర్థ్యము సర్దారుకే కలిగినది. సర్దారు తన జీవితములో సాధించిన ఘనతర విజయ మిది.

అంతర్జాతీయ విషయముల నెహ్రూ అఖండ ఖ్యాతిఁ గాంచినటులనే దేశరక్షణవిషయములలోఁ బటేలు ప్రతిభావంతుఁడని ప్రఖ్యాతిఁ గాంచినాఁడు.

వారు భారత భాగ్య విధాతలు.

ఆయన నాయకత్వమున భారతభూమి యవరోధముల నన్నిటి నతిక్రమించి యనతికాలములో నభ్యుదయము నొందఁ గలదని నిస్సందేహముగా భావించవచ్చును.

పితృ పరిచయము

వల్లభాయిపటేలు తండ్రిపేరు జవేరుభాయి వృత్తిచేఁ గర్షకుఁడు. ఆయన జన్మస్థానము గుజరాతులోని పేట్‌లావ్ తాలూకాలోని కరంసాద్ గ్రామము - జవేర్‌భాయి సామాన్య గృహస్థుఁడే కాని ధైర్య సాహసములలో సాటిలేని మేటి. 1857 లో జరిగిన స్వాతంత్ర్యసమర మా కర్షకవీరు నాకర్షించినది. గొడ్డు, గోద, పిల్ల, మేక, భూమి, పుట్ర వదిలిపెట్టి యా స్వాతంత్ర్యసమరమునఁ జేరినాఁడు. వీర నారి ఝాన్సీలక్ష్మీ బాయి దళమునఁజేరి స్వాతంత్ర్య సమరము సాగించినాఁడు.

ఆయన తెలివితేటలు, నిర్భయత, యాయన కెన్ని యాపదలు వచ్చినను నభివృద్ధిఁ గాంచినవి. అందుల కొక

  1. 1945 నవంబరు 3 వ తేది 'ఆంధ్రప్రభలో, పట్టాభిగారి వ్యాసమునుండి.