వల్లభాయి పటేల్/నెహ్రూ-పటేల్

వల్లభాయి నిర్యాణమునకు భారతదేశమంతయు దుఃఖ సముద్రములో మునిగెను. తండ్రితోపాటు సోదరునిగూడఁ గోల్పోయితిమని ప్రముఖనాయకులేగాక ప్రజలందరుకూడ విలపించిరి.

భారతదేశమందేగాక ప్రపంచము నలుదిశలనుండి యా మహాబాహువు మరణమునకు విచారసూచనలు వెలువడెను.

నెహ్రూ-పటేల్

పొట్టునుండి పప్పును వేఱుచేయుటలో వల్లభభాయి కత్యద్భుతమైన సామర్థ్యమున్నది. జవహర్లాలువలె, నావలె నతఁడు భావనా స్వప్నప్రపంచములోఁ దిరుగువాఁడుకాదు. ధీరత్వ విషయములో నతనితో సమాను లుండిన నుండవచ్చును గాని, మించినవారుమాత్ర ముండరు. స్థిరసంకల్పుఁడు ఏవిషయములోనైన నొక నిశ్చయమునకు వచ్చిన నంతే; దానికిఁ దిరుగులేదు. ప్రజాసేవయే యతని నిత్యైకసాధన. దేనికయిన లక్షణనిరూపణచేయుటకు జవహర్లాలు; ఆ లక్షణముల ననుసరించి కార్యక్రమ నిర్ణయము చేయుటకుఁ బటేలు. కాఁబట్టి జవహర్లాలు నడిగి లక్షణములు తెలిసికొనుఁడు, పటేలు నడిగి క్రియాకలాపము గ్రహించుఁడు.

-మహాత్ముఁడు

స్వతంత్ర భారతీయతకుఁ బ్రపంచ మెఱిఁగిన బాహ్య చిహ్నము పండిట్ నెహ్రూ; అంతశ్శక్తి పటేల్. విడివిడిగాఁ జూచుకొన్న రెండు విరుద్ధభావములేమో యని భ్రమ కల్పించునంత విపరీతములు. కాని పరిపూర్ణతా పుష్టమైన యేకశక్తి, ద్విధాగతరూపము నంది పరస్పరపోషకముగా నైన విచిత్ర సంస్థ - ఆ యిరువుర కూటమి.

మాహాత్ముఁడీ నాయకులను దేశమున కప్పజెప్పుటలోఁ దన ప్రతిభను జూపించినాఁడు దేశభక్తి, గురుదేవుఁడగు మహాత్మునియందు భక్తి; యీ సూక్తులే వారిరువుర నేకము చేయు దృఢబంధములు. ఈ యిరువుర స్వభావముల తార తమ్య వైచిత్రిని, సంకలనాలబ్ధపరిపూర్ణతను, డాక్టరు బాలకృష్ణకేస్కారుగా రీ వ్యాసములోఁ జక్కగాఁ జిత్రించిరి.

"భారతదేశమును బ్రస్తుత మావరించియున్న గందరగోళము, ననిశ్చితమై నిరంతరము మారుచున్న వాతావరణములలోఁ బండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ, సర్దార్ వల్లభ్ణాయి పటేలును చలాయించుచున్న యనితరలభ్యాధికార మొక్క టే నిశ్చితముగా, స్పష్టముగాఁ గన్పడుచున్నది.

"వారిద్దరు భారత దేశసంయుక్త నియంతలని చెప్పవచ్చును. కాని యా యధికారమును వా రెట్టి కుతంత్రముద్వారా సంపాదించి యుండలేదు. పరిస్థితులు వారి కీ యధికారమును గైవసమొనర్చినవి. ఈనాడు ప్రభుత్వములోను, బయటను సర్వము వారే నడుపుచున్నా రనుట నిస్సందేహము. మహాత్మాగాంధీ జీవించియుండఁగానే నాయన వీ రిద్దరిని సమన్వయ పఱచుచుండెడివాఁడు. వీ రిద్దరు నాయన మహావ్యక్తిత్వము ద్వారానే యుత్తేజము పొందినారు. ఆయన పరమపదించిన తరువాత భారతభాగ్యవిధాతలు వీరే యైనారు.

అనిశ్చితము

"భారతదేశము చరిత్రలో నతిక్లిష్టసమయములో నిప్పుడున్నదని గుర్తించినచో నీ విషయము మఱింత ప్రముఖముగాఁ గనుపించఁగలదు. దేశ మిప్పుడే విదేశపరిపాలననుండి విముక్తమైనది. వెంటనే కని విని యూహంచి యెఱుఁగనంతటి క్లిష్టసమస్యల నెదుర్కొనవలసివచ్చినది. అంతరంగభేదాభిప్రాయములు పలురకములై యనేకములుగా నున్నవి. నూతన ప్రభుత్వము స్థిరపడుటకుఁగూడ నవకాశము చిక్కలేదు. పంజాబ్, సింధులనుంచి కాందిశీకులరాక లన్ని ప్రణాళికలను దాఱుమా రొనర్చినవి. కాశ్మీర్, హైదరాబాదులు కొఱుక రాని కొయ్యలుగా నున్నవి. పాకిస్థాన్ శాశ్వతవైరుధ్యము, చాలమంది ఇండియన్ ముస్లిములు దానిని హర్షించుటవలన దేశమునకుఁ బ్రమాదము వాటిల్లఁజేయవచ్చునను భీతి వ్యాపించినది.

ఇటువంటి యనిశ్చితపరిస్థితిలోఁ బ్రతి విషయము నీ యిద్దరు రాజకీయ వేత్తల ప్రవర్తనపైనే యాధారపడియుండు నని దినదినము తేలిపోవుచున్నది. వా రిద్దరి పరస్పరసంబంధములు, దేశము నెదుర్కొనుచున్న పలుసమస్యలను వీ రెదుర్కొను విధానము, విడివిడిగాఁగాని, సంయుక్తముగాఁ గాని, వీరుచేయు నిర్ణయములు, భారతదేశ భవిష్యత్తును, గొన్ని తరములవఱకు, నిర్ణయించును. ఒకవిధముగాఁ జూచినచో భారతదేశ భవిష్య త్తీయిద్దరువ్యక్తుల ప్రవర్తనపై నాధారపడియుండుట శోచనీయముగానే కన్పట్టును కాని యున్న పరిస్థితి యిది. బహుశః యొక డజనుమందిపై నాధారపడి యుండుటకంటె, నిద్దఱపైనే యాధారఓడి యుండుట మంచిదేమో!

ఏ విధముగాఁ జూచినను నెహ్రూ-పటేల్ కూటమి యాశ్చర్యజనికమైనది. అది విరుద్ధశక్తుల విచిత్రస్నేహము. ఒక విధముగాఁ జూచిన. నది యొకదాని నొకటి పూర్తిచేయునట్టి కూటమి. పండిట్ నెహ్రూ యాగర్భశ్రీమంతుఁడు. విజ్ఞానవంతమగు ధనికకుటుంబమునకుఁ జెందినవాఁ డాయన. ఆయన చిన్నప్పటినుండి యింగ్లండులోఁ బెరిగెను. అందువలన జీవితములో ననేక విషయములపై నాయన యింగ్లీషు దృక్పథముతోనే యాలోచించును. వైజ్ఞానికముగ నాయనకు సోషలిజమన్న నమ్మకము, గౌరవముకలదు. కాని సామాజిక జీవితములో నలవాట్లలో నాయనది పూర్తిగా శ్రీమంతులవిధానము. నాయకత్వమును బొందుట కాయన యితరులవలెఁ గష్టపడ వలసిన యవసరమే లేకపోయెను.

తన రాజకీయ జీవితములోఁ బ్రారంభమునుండియు తన తండ్రి, గాంధీజీల ప్రోద్బలముతోఁ బండిట్ నెహ్రూ ముందుకు నెట్టఁబడెను. తన కా ప్రోద్బలముద్వారా లభించిన పదవుల స్థాయికిఁ దనకు స్వతః యున్న శక్తిసామర్థ్యములవలన నాయన రాఁగలిగెను. కాని చులుకనగా లభించిన యీ నాయకత్వ మాయన రాజకీయానుభవములో నొక శూన్యత నాపాదించి, రాజకీయ సమస్యలను, రాజకీయముల నాయన యొక విచిత్ర ధోరణిలోఁ బరిశీలించున ట్లొనర్చినది. ఆయన యుదారస్వభావుఁడు. గౌరవనీయుఁడు. మంచి సంస్కృతి, రసజ్ఞానము కల వాఁడు. కవిత్వమన్న నాయనకుఁబ్రీతి. రచయితగా నాయన గణనీయుఁడు. రాజకీయకుతంత్రములు, కుట్రలు నాయనకు నచ్చవు. ఆయన యాదర్శవాది. గతములైన రెండు దశాబ్దములనుండి యాయనకుఁ బ్రజలలోఁగల పలుకుబడివలనఁ బ్రజలాయనయన్న మిక్కిలి గౌరవింతురు. ఆయనకుఁగూడఁ బ్రజా సమూహమన్నను, వారి పొగడ్తలన్నను బ్రీతి. ఆయన సాహస వంతుఁడు. భావోద్వేగి.

అనుష్ఠాన రాజకీయవేత్త

సర్దార్ పటేల్, కష్టించి పనిచేసెడి, పొదుపరులగు వ్యవసాయదారుల కుటుంబములో జన్మించెను. ఆయన గుజరాత్ లోని బార్ త్తర్ పటేదార్ వంశమునకుఁ జెందినవాఁడు. ఈ వంశస్థులు కొంచెము తలబిరుసైన యూహావిహారులుగాక యనుష్ఠానపరులు. ఆ వంశగుణము లీయనలో మూర్తీభవించినవి. ఆయనయు, నాయన సోదరుఁడు, విఠల్‌బాయి పటేలును, జాకచక్యముగల సమర్థులగు యోధులు. ఆయన కటువగు మితభాషి. రసజ్ఞత, కళలన్న నాయనకు బిడియము. ఆయనది కేవలము భారతీయదృక్పథము. ఆయన జన్మతః యోధుఁడు. సంఘటనాశక్తిగలవాఁడు. రాజకీయతంత్రములందుఁ బ్రవీణుఁడు. రాజకీయపుటెత్తులు వేయుటలో నాయన యద్వితీయుఁడు. విరోధులపట్ల నాయన నిర్దాక్షిణ్యుఁడు. రాజకీయముగా నడ్డంకని సర్దార్ భావించినవాఁ డేనాటికైనను నణఁగద్రొక్కఁబడుననుట నిశ్చయమే. ఆయన గొప్ప ప్రజానాయకుఁడు. ఎట్టి సమస్యలనైనను దేలికగ గ్రహింపఁగలఁడు. దేశ మునఁ గ్లిష్టసమయమున నాయన వాస్తవికదృక్పథము బాగుగా నుపయోగపడినది. ఆయన కడుదృఢస్వభావుఁడు. కాంగ్రెసు సంస్థలో యూరపియన్ దృక్పథముతోఁ జూచిన, నాయన యొక్కఁడే గొప్ప రాజకీయవేత్త. ఆయన భారతదేశపు బిస్మార్కు. వ్యక్తిగతముగా నాయన భీకరుఁడు. ఎదుటివారికి భయావహుఁడు. కాని యాయన నెఱిఁగినవా రాయనలో ననేక గుణములను బ్రేమింపకపోరు. ప్రతివిషయము జాగ్రత్తగా నుద్విగ్నుఁడుగాకుండ నాలోచించును. సోషలిజమన్నను సోషలిస్టులన్నను నాయనకుఁ దలనొప్పి.

విరుద్ధశక్తులు

నెహ్రూ యేకాంతవాసప్రియుఁడు. కాంగ్రెసులో వర్గ విభేదముల కాయల యతీతుఁడుగా నుండుట యలవాటయి పోయినది. ఆయన రాజకీయపు పెంపకమాయనకుఁ గుతంత్రము లన్న ననిష్టత కల్గించినది. తనచుట్టు వందిమాగధులవలె ననుచరులు తిరుగుచుండుట యాయన కిష్టములేదు. అది తన ప్రతిష్ఠకు భంగకరమని యాయన యుద్దేశము. ఆయన ప్రతివిషయములోను స్వీయోద్దేశముల ప్రకారమే వ్యవహరించును. ఆయనది యొక మానిసిపార్టీ.

సర్దార్ పటేల్ పుట్టుకతోనే సంచాలకుడు. అది స్వభావసిద్ధమని యాయన భావించుచుండును. చతురత, సంఘటనాశక్తిద్వారా యాయన తన బలగమును బలుకుబడిని సాధించుకొనెను. ఆయన నెమ్మదిగా కాంగ్రెసు సంస్థను సంఘటిత మొనర్చెను. ఇప్పుడు దాని నాయనయే నడుపుచున్నాడు. ప్రతివ్యక్తిని, సంఘటనను, పార్టీ లాభనష్టముల దృష్ట్యానే యాయన పరిశీలించును. ఆయన చుట్టు నెప్పుడును వినయ విధేయతలతో వర్తించు ననుచరులు మూగియుందురు.

ఈ విరుద్ధశక్తులను సమన్వయించి నడిపించుకొని వచ్చుచున్నది భారత భాగ్యవిధాత గాంధీజీ. ఆయన యసమాననాయకుఁడు. పటేల్ నెహ్రూలవంటి యనుచరులను గూడగట్టుకొని రాఁగలఁడు. వీ రిద్దరు నాయనను బూజించి, గౌరవించెడువారనుట నిస్సందేహము ఆదర్శకతపట్ల నెహ్రూకుఁ గల శ్రద్ధవలననే గాంధీజీ కాయనపై వాత్సల్యము ప్రబలెను. ఆయన నైతికభావనప్రకారము వ్యక్తిలో వ్యక్తిత్వము ముఖ్యమైనది. అందువలననే నెహ్రూ యాయనకుఁ బ్రియతముఁడయ్యెను. గాంధీజీకిఁ బటేల్‌తోఁగల సంబంధములు కూడ నిట్లు దృఢతరమైనవే. సర్దా రాయనకుఁ దొలిగా లభించిన యాంతరంగికానుచరులలో నొకఁడు. ఆయన శక్తిసామర్థ్యములను గాంధిజీ గుర్తించి యాయనపట్ల నవిరళవాత్సల్యమును గలిగియుండెను. పటేల్‌పట్ల గాంధీజీ కత్యంతవిశ్వాస ముండుట వలననే యాయన చాలకాలమునుండి గాంధీజీకిఁ "గుడిచేయి"గాఁ బరిగణింపఁబడుచుండెను. సర్దార్‌కూడఁ బూర్తిగా గాంధీజీకి దోసిలొగ్గెను.

కాని వీరిద్దరు గాంధీజీతో ననేకపర్యాయము లేకీభవించలేదు. అంతర్జాతీయత, సోషలిజము మొదలగువానిపైఁ బండిట్ నెహ్రూ బాహాటముగానే గాంధీజీ నెదిర్చెను. పటేల్ తన చతురత, వాస్తవికదృక్పథములతో ననేకపర్యాయము లాయన యాదర్శాత్మకవిధానములను బ్రతిఘటించెను. కాని గాంధీజీ నిర్ణయించిన తర్వాత దానికి దోసిలొగ్గెడువాఁడు. వీరిద్దరుకూడఁ బ్రస్తుత మింత యుచ్చస్థితిలో నుండుటకు గాంధీజీయే కారణము. ఎంతో యోచనచేసియే గాంధీజీ పటేల్‌ను గుజరాత్‌లోఁ దనప్రధానానుచరుఁడుగా నిర్ణయించుకొనెను. అట్లు నిర్ణయించిన తర్వాత నాయనపట్లఁ జాలవిశ్వాస ముంచెను. సర్దార్ రాజకీయ ప్రతిష్ఠకు, నధికారమునకు నిదే తొలిమెట్టు.

భారతదేశ నాయకత్వము నెహ్రూకుఁగూడ గాంధీజీ వల్లనే లభించినది. లాహోర్ కాంగ్రెసు కధ్యక్షుడుగా - బహుశః చరిత్రలో నింత చిన్న వాఁ డెవ్వడు నధ్యక్షుఁడై యుండఁడు - నెహ్రూను నిలబెట్టినది గాంధీజీయే. గాంధీజీనైతిక శక్తియేఁ దన వెనుక లేక పోయినచో నెహ్రూ కాంగ్రెస్ యంత్రములో తన ప్రతిష్ఠ నిలఁబెట్టుకోలేకపోయెడివాఁడే. పండిట్ నెహ్రూ యెప్పుడు పార్టీతంత్రములకు, నోట్ల నర్థించుట కిష్టపడఁడు. ఈయనకు గాంధీజీ యీపని చేసెడివాఁడు. చాల విధములుగా గాంధీజీ వల్లనే నెహ్రూ చెడిపోయినాఁడు.

భిన్న విధానములు

ఈ నాయకు లిద్దరి దృక్పథములలోఁగూడఁ జాలవిభేదము లున్నవి. నెహ్రూ యొకవిధమైన ఫేబియన్ సోషలిస్టు. అంతర్జాతీయవాది. చాల సమస్యలపట్ల నతనివైఖరి యతివాదధోరణిలో నుండును. పాశ్చాత్యసంస్కృతి, యలవాట్లన్న నతనికిఁ జాలమోజుకూడ. సంస్కృతి యలవాట్ల విషయములోఁ బటేల్ కేవలము భారతీయుఁడు. ఆయన యే యిజము'లోను నమ్మక ముంచనంతటి చతురుఁడని చెప్పవచ్చును. గాని, సామాజికాభివృద్ధికి "ధనికవాద మవసర"మని యతఁడు భావించుననుట నిజము. నూతనసామాజికవ్యవస్థలోఁ గార్మికవర్గప్రాముఖ్యమును గుర్తించుటకే యాయన చాలకాలము నిరాకరించెను. అదే యాయనలోని గొప్పలోపము. నెహ్రూ యొక యాదర్శవాది. పటే లనుష్టానవేత్త.

దై నందిన వాస్తవిక రాజకీయములలో నెహ్రూపటేలు లిద్దరు సుస్థిరస్థానములలోనే యున్నారు. కాంగ్రెస్ తలపెట్టిన ప్రతి నూతనవిధానములోను నెహ్రూ గాంధీజీతో నేకీభవించెడువాఁడు. క్రమేణ ప్రజానీకము నెదుట నాయన గాంధీజీ ముఖ్యప్రతినిధి యైనాఁడు. పటేల్ సంచాలకుఁ డైనాఁడు. నెహ్రూ ప్రజానీకమునకే చిహ్నమైనాఁడు. ఈ పదవి వెనుక నధికారమంతయుఁ బటేల్‌చేతిలోనున్నది. వీరిద్దరు గాంధీజీతో నేకీభవించినది క్రిప్సురాయబారపు సమయములో దేశవిభజన ప్రసక్తి వచ్చినప్పు డొక్కపర్యాయముమాత్రమే. కాంగ్రెసు భవిష్యత్తును గుఱించి చర్చలు జరుగుచున్నప్పుడుకూడ వీరిద్దరు గాంధీజీతో నేకీభవించలేదు. కాంగ్రెసు భవిష్యత్తు విషయమై గాంధీజీకిఁ గొన్ని స్పష్టమగు నుద్దేశము లుండెను. కాని వీరిద్దరిని మహాత్ముఁడు చక్కగా సమన్వయపఱచి, కలసికట్టుగఁ బని చేయించఁగలిగెను. కార్మికసమస్యలు, పరిశ్రమలను జాతీయ మొనర్చుట మొదలగు ముఖ్యసమస్యలపై గాంధీజీ యభిప్రాయములను గాంగ్రెసు సంప్రదాయమును రూపుదిద్దుటలో నెహ్రూకుఁ జాలప్రాబల్య ముండెననుటకూడ వాస్తవమే.

ఐక్య మవసరము

ఇంతటి విభిన్నదృక్పథములుగల వ్యక్తు లనేకసమస్యలపై భిన్నాభిప్రాయములు కలిగియుండకపోవుట యాశ్చర్యముగా నుండఁగలదు. వాస్తవమునకు వారిద్దరు నొకరిసూచనల నొక రనేకపర్యాయములు తీవ్రముగాఁ బ్రతిఘటించుకొనిరి. ఇది స్వాభావికమే. కాని దేశభవిష్యత్తు తామిద్దరుఁ గలసి పని చేయుటపైనే యాధారపడియున్నదని వారు గ్రహింపవలెను. గాంధీజీ హత్యానంతర మీ విషయము మఱింత ప్రాముఖ్యము వహించినది. చాలమంది యాశించినదానికి విరుద్ధముగా వా రిద్దరుఁగలసి పనిచేయఁగలిగిరి. అంతేగాక యీ సమయమున విడిపోవలెనని వారు కోరుకొన్నను విడిపోఁగలరా యన్నది సందేహాస్పదమే. వారిద్దరు విడిపోవుట ప్రస్తుతానిశ్చిత వాతావరణములో నొక పెద్ద సంక్షోభమునకు దారిదీసి, యెట్టి విషమపరిణామములనైనఁ గలిగించవచ్చుననుట నిస్సందేహము. కొంతమంది యవకాశవాదు లొకరియెదుట రెండవ వారిని దూషించి, తాము లాభము పొందవలెనని, యోచించుచు, వీరిద్దరిమధ్య విభేదములను వృద్ధిచేయుచున్న మాటకూడ వాస్తవమే.

రాజకీయచరిత్రలో నింతటియాశ్చర్యకరములు, విభిన్నాత్మకములైన 'కూటములు' లేకపోలేదు. రాజకీయవేత్తలకు భేదాభిప్రాయము లుండెడివి. ఇకముందు నుండఁగలవు. అందు వలన వారొకే యాదర్శముకొఱకుఁ గలసికట్టుగాఁ బనిచేయ లేకపోలేదు. పటేల్ - నెహ్రూ లిప్పటివఱకుఁ బోరాడుకొను చుండవచ్చును. కాని తాము కలసి పనిచేయక తప్పదని గ్రహించి యిప్పుడు కలసి పనిచేయవచ్చును. వారి విభేదముల తీవ్రత వారి కలయిక నడ్డుపెట్టజాలదు.

వాస్తవమునకు, వారివిభేదములను గుఱించి మాట్లాడుచు వారిద్దరిమధ్యఁగలసామ్యమును, వారిద్దఱను దగ్గరకులాగుచున్న పరిస్థితులను బ్రజలు గ్రహింపకున్నారు. దేశములోని యత్యవసరపరిస్థితియేగాక గాంధీజీపట్ల శ్రద్ధాభక్తులుకూడ వారి కలయిక కొక ప్రబలకారణము. రాజకీయముగ, నాధ్యాత్మికముగ వా రాయన కుటుంబమునకుఁ జెందినవారు. నెహ్రూ సోషలిస్టు దృక్పథము గాంధీజీ పలుకుబడివలనఁ జాలవఱకు మారినది. ఇద్దరు దశాబ్దములనుండి కలసి పనిచేయుట కలవాటుపడియుండిరి. ఒకరితప్పు లొకరికిఁ బూర్తిగాఁ దెలియును. బహుశః యనేక పర్యాయము లొకరి నొకరు తిట్టుకొనియుండ వచ్చును. కాని దానిని విస్మరించి యైక్యముతో వారు వ్యవహరించఁగలరు.

మహాత్మునివంటి సంస్థలు

తమ పలుకుబడి ప్రాబల్యమువలన నెహ్రూ పటే ళ్ళిద్దరు గాంధీజీవంటి సంస్థలే యైనారు. వారు కేవల మగ్ర నాయకులు మాత్రమేకాదు. ప్రస్తుత కల్లోల వాతావరణములోఁ బ్రజ లొక్కొక్కప్పుడు ప్రభుత్వ విధానములను నొక్కొక్కప్పుడు కాంగ్రెసు హైకమాండు చర్యలను నిరసించినను, జివరకు వీ రిద్దరినిజూచియే, ప్రతి విషయము నంగీకరించుచున్నారు. నెహ్రూ పటేలులతర్వాత నే వ్యక్తిగాని, చివరకుఁ గాంగ్రెసుగాని యిటువంటి సహనదృష్టితోఁ బరిశీ లించఁబడదు. వారు సఫలులై ఫలితములనైనఁ జూపించవలసి యుండును, లేదా వైదొలఁగవలసి యుండును. నెహ్రూ పటేలుల తప్పులను బ్రజలు - బహుశః యలవాటు ప్రకారమే కావచ్చును-సహించెదరు. అంతేకాని వారితరువాత వచ్చెడు వారి తప్పులను సహించరు. ఈ ముఖ్యవిషయములఁ గాంగ్రెసు పార్టీ ముఖ్యముగా భవిష్యత్తునుగుఱించి యాలోచించుచున్నప్పుడు జ్ఞాపక ముంచుకొనవలెను.

భవిష్యత్తు విషయములోనే యీ యిద్దరు నాయకులొక ముఖ్యవిషయములో నసమర్థులైపోయిరని చెప్పక తప్పదు. తమతర్వాత తమ స్థానముల నాక్రమించి కార్యక్రమమును జయప్రదముగా సాగించగల సమర్థులగు "ద్వితీయశ్రేణి" నాయకులను వీరు తయారు చేయలేకపోయిరి. తమతర్వాతఁ దమ స్థానముల నాక్రమింపఁగల సమర్థులగు ననుచరులకుఁ దమ పద్ధతులలో శిక్షణనీయక వీరు నిర్లక్ష్యము చేయుచున్నారు.

"నా తదనంతరము బూడిదే" యన్న యుద్దేశమైనట్లు కనిపించుచున్నది. దేశము క్లిష్టపరిస్థితిలో నుండుటవలనను దేశములో వీ రిద్దరికి నొక ప్రత్యేకస్థాన ముండుటవలనను నీ లోప మత్యవసరకాలములో విషమపరిణామములకు దారి దీయగలదు. వాస్తవమునకు దేశమునకుఁ బ్రస్తుతప్రభుత్వమునకు విరోధులైనవా రీ లోపము తమకు గొప్ప సహాయకారి కాఁగలదని యాశించుచు నందు కెదురుచూచుచున్నారు. దీని నాధారముగాఁ జేసికొని ప్రణాళికలుకూడ నేర్పాటుజేసికొనుచున్నారు.

నెహ్రూవైఖరి సులభముగానే బోధపడఁగలదు. తనకుఁ బ్రత్యేకముగా ననుచరవర్గము నేర్పాటు చేసికొనుట కాయన నిరాకరించెను. ఇది శోచనీయము. రాజకీయముగాఁ దప్పే యైనను నున్న పరిస్థితి యది. దూరదృష్టి, చాకచక్యముగల సర్దార్ పటేల్‌వంటి యనుష్ఠాన రాజకీయవేత్త, తన తరువాతఁ దన స్థాన మాక్రమించగల యనుచరవర్గము నెందుకుఁ దయారు చేయుటలేదో బోధపడుటలేదు. ఇప్పుడు ప్రసిద్దిలోనున్న కాంగ్రెసు నాయకులందరు ముసలివారు. త్వరలోనే వీరు గట్టిగాఁ బనిచేయ నసమర్థు లౌదురు.

అందువలన భవిష్యత్తు చాల చంచలముగా ననిశ్చితముగా నున్నది. సమయమునకుఁ దగినట్లు వ్యక్తులుకూడ నుద్భవించఁగలరని యాశించవలెను. కాని యీ విషయమే భవిష్యద్రాజకీయవిషయములలో ముఖ్యమగు పాత్ర నిర్వహింపనున్నది. ఈ విషయములోనే గాంధీజీ ప్రజానీకపు వాస్తవాద్వితీయ నాయకుఁడుగాఁ గన్పించుచున్నాడు. తన యుత్తేజనకర శిక్షణలద్వారా యాయన మెరికలవంటి యనుచరులను దయారుచేయఁగలిగినాఁడు. వారే యీనాఁడు దేశమునకు నాయకత్వము వహించియున్నారు. ప్రస్తుత నాయకు లందరు నాయనవద్ద నేర్చుకొన్న వారేగాని, యీ విషయములో నాయన విధానమును వీరు సాగించ లేకపోవుచున్నారు.