వల్లభాయి పటేల్/తాఱుమాఱు
డనే కాపురముపెట్టి యపారముగ నార్జింపసాగినాఁడు. ఇంతలోనే యాయన జీవితవిధానము మఱియొక విధముగ మారవలసి వచ్చినది.
తాఱుమాఱు
ఆంగ్ల విద్యాభ్యాసమువల్ల, ప్లీడరీవృత్తివల్లఁ బటేలులో క్షీణించుచు వచ్చిన జాతీయత పాశ్చాత్యదేశవాసమువల్లఁ బూర్తిగాఁ బోయినది. దొరల వేషభాషలు, రీతి రివాజులు బాగుగా నలవాటైనవి. పిల్లలనుగూడ నింగ్లండు పంపవలయునని తలంచి ముందుగఁ గాన్వెంటులోఁ జేర్చినాఁడు.
తాను జుట్టు, సిగరెట్టు, పలాస్, మధుపానముల కలవాటైనాఁడు. అన్నతో నప్పుడప్పు డనవసరమైన యర్థరహితమైన హాస్యాలకు దిగి ప్రొద్దుపుచ్చుచుండెడివాఁడు.
పదిమందితోఁ గలసి తిరుగకుండెను. పలుక కుండెను. కోరచూపులు చూచుచుండెను. ఆయన దగ్గరకు వచ్చిన వారితోఁగూడ మందహాసము చేయుటయేగాని పల్లెత్తి పలుకరించువాఁడుకాఁడు. తా నెక్కడనుండియో యూడిపడ్డ ట్లహంకారము చూపించువాఁడు. రాజభక్తి, బ్రిటను నందుభక్తి యానాఁ డాయనలో నధికముగా నుండెను.
గుజరాతు క్లబ్బులో నాయన యొకసారి యీవిధముగాఁ జెప్పెను. 'దుర్గాపూజ పండుగనాఁడు నే నంతులేని యానందములో నిమగ్నుఁడనై యుండువాఁడను. ఆ పండుగను బట్టించుకొనువాఁడనే కాదు. వినోదమే నాకెక్కువ. భారతీయులు విదేశీయుల ననుసరించుటయే యభివృద్ధికర మార్గమని తలఁచుచుంటిని. నేను బాఠశాలలోఁ జదివిన గ్రంథముల సారాంశ మేమన - మన దేశీయు లల్పులు, బుద్ధిహీనులు, మనపై రాజ్యముచేయు విదేశీయులు మనమేలు గోరువారు. వారే మన యుద్ధారకులు, ఉత్తములు. మన దేశీయులు వారిసేవచేసి బ్రతుకు బానిసలు. ఈ నిద్యావిషప్రచారము దేశమందంతటఁ జేయఁబడినది."
1915లో నహమ్మదాబాదులో గాంధీజీ - సత్యాగ్రహము ప్రారంభించి స్థానికులైన పెద్దలను గలసికొనుటకై గుజరాతు క్లబ్బుకు వచ్చెను. అప్పుడు వల్లభాయి చీట్లాడు చుండెను. ప్రక్కనున్న మవలంకరు గాంధీజీ రాఁగానే యాయన కడకుఁబోగాఁ బటేలు గాంధిజీ నెంతో శ్లేషగా విమర్శించెను.
తరువాతఁ బటేలుకు మహాత్మునితో 1917 లో సన్నిహిత సంబంధ మేర్పడెను. అప్పటినుండి యాయన జీవిత విధానమే మాఱిపోయినది. ఆ దొరలవేషము, డాబు, దర్పము, రీరి రివాజులు పోయినవి. ధోవతి, యుత్తరీయము, లాల్చీ, వేష ధారణమైనది. వేషములోనేకాదు, అసలు వ్యక్తిలోనే మార్పు వచ్చినది. ఆనాటనుండి ప్రజలలో నాయన యొకఁ డైనాఁడు. ఒకఁ డగుటయేకాదు - ప్రజాసేవయే సర్వస్వమైనది. దేశభక్తియే యాయన మత మైనది. కార్యదీక్షయే యాతని లక్షణము. స్థితప్రజ్ఞత్వమే యలంకారము - వేయేల ? ఆయన జీవిత విధానమే పరివర్తన చెందినది.
ఒకనాఁడు గాంధిజీని బరిహసించిన పటేలు మఱొకనాఁడు గాంధీజీ సిద్ధాంతముల నాచరించువారిలో నగ్రశ్రేణికిఁ జెందినాఁడు. అంధప్రాయముగ గాంధీజీ ననుసరించుచుంటి నన్నాఁడు. ఎంతటి వింత! ఎంత తాఱుమాఱు!.
ఆయన పూర్వ ప్రస్తుత పరిస్థితులనుగుఱించి 1921లో నొక సభయం దిట్లు ప్రసంగించెను. "మొట్టమొదట నేను షోకిల్లాను. రసికుఁడను. రాజకీయములలోఁ బాల్గొనుటకంటెఁ జీట్లాటయే వేయిరె ట్లధిక మనుకొంటిని. ఈ మోసపు రాజకీయములన్న నాకు సరిపడునదికాదు. కాని గాంధీమహాత్ముఁ డీ కర్మక్షేత్రమునఁ గాలిడినాఁడు. ఆయన ప్రభావమువల్ల నేను మాఱిపోయొ రాజకీయములోఁ జేరితిని."
అసలు విషయ మేమి యన, నాయన యెంత పాశ్చాత్య వ్యామోహములోఁబడినను, శత్రువులను జులుకన చేయవలెనను భావ మెంతయున్నను వీని యన్నిటికి వెనుక నొక యద్భుతసమైన క్రియాశక్తి, యొక యఖండమైన సేవాభావము దాగి దోబూచు లాడుచుండెడిది.
ఆ సేవాభావమే, యా దివ్యశక్తియే, యాయన మిత్రులను, క్ల యింటులను గొప్పగొప్ప యఖాతములనుండి తప్పించి రక్షించినది. పటేలు వారికి రక్షకుఁ డయ్యెను. మహాత్ముని ప్రభావమువల్ల నా పై పొరపోయి యాంతరంగికభావ మభివృద్ధిచెందినది.
మహాత్మునితో సన్నిహితభావ మేర్పడఁగానే తన బిడ్డలను గాన్వెంటులోనుండి మాన్పించి మహాత్ముని పాదముల వద్దఁ జేర్చినాఁడు. పటేలు గాంధీజీ కన్నిటఁ గుడిభుజముగా నుండి యధికసమర్థతతోఁ బాటుపడుచుండుట నేటి ప్రపంచమునకు విదితము.