వల్లభాయి పటేల్/తాత్కాలిక ప్రభుత్వము
తాత్కాలిక ప్రభుత్వము
జర్మనీనియంత హిట్లర్ స్వీయరాజ్య విస్తృతికిగా నిరుగు పొరుగున నల్పరాష్ట్రముల నాక్రమింప సాగెను. ఇది క్రమముగ నభివృద్ధిపొంది తృతీయప్రపంచసంగ్రామముగఁ బరిణమించెను. బ్రిటిషువారు 1939 సెప్టెంబరునెలలో జర్మనీపై యుద్ధము ప్రకటించిరి.
భారతదేశమునందుఁగూడ యుద్ధ సంరంభ మేర్పడెను. ఈ సంగ్రామలక్ష్య మేమని కాంగ్రెసుప్రభుత్వము లడిగెను. బ్రిటిషువారు మిన్నకుండిరి. కొన్నిరాష్ట్రముల గవర్నర్లు కాంగ్రెసు మంత్రివర్గములకుం దెలుపకయే యుద్ధకృషి చేయ సాగిరి. దీని కంగీకరించక కాంగ్రెసు మంత్రులు, శాసనసభ సభ్యులు తమపదవులను వీడిరి.
తనలక్ష్యశుద్ధికై కాంగ్రెసు గాంధీజీ నాయకత్వమున 1940 సంవత్సరమున వ్యష్టిసత్యాగ్రహ మారంభించెను. యుద్ధమున భారతీయులు బ్రిటిషు ప్రభుత్వమున కెట్టి సాయము చేయఁగూడదని వెల్లడించెను.
ప్రపంచసంగ్రామము తీవ్రమాయెను. జర్మనీ, ఇటలీ, జపాను, దేశములకు జయపరంపర లభించుచుండుట చేతఁ గాంగ్రెసుతో నేదోవిధముగా రాజీపడఁదలచి బ్రిటిషు ప్రభుత్వము 1942 జులైలో సర్‌శ్టాపర్డూక్రిప్సును మనదేశమునకు రాయబారమంపెను. కాంగ్రె సాయన ప్రతిపాదనమును దిరస్కరించి బ్రిటిషువారు భారతమునుండి వైదొలఁగుటే తన లక్ష్యమని తెలిపెను. 1942 ఆగస్టు 8 వ తేదీన బొంబైనగరమున నఖిలభారత కాంగ్రెసు సంఘము క్విట్ ఇండియా తీర్మానమునుజేసెను. ఈ యుద్యమము నడుపుట యెట్లా యని యగ్ర నాయకు లాలోచించుచుండగా, ఆగస్టు 9 వ తేదీ అర్ధరాత్రివేళ వారి నందరి నరెస్టు చేసి చెరసాలలో బంధించెను.
తమకుఁ బ్రియులైననాయకులు ప్రభుత్వమువారిచే నర్ధరాత్రివేళ బంధింపఁబడుటచేఁ బ్రజలలో నలజడి యారంభమాయెను. ప్రజలు గాంధీజీ బోధించిన యహింసాసిద్ధాంతమును విస్మరించి దౌర్జన్య పద్ధతులతో నాంగ్లేయులఁ దరిమివేయఁ గృత నిశ్చయులైరి. ప్రభుత్వ భవనములను, రైళ్లను, గూలద్రోయుటే గాక, దేశములో గొప్పయలజడి, యరాచకము సాగెను. ప్రభుత్వమువారు ప్రజానాయకులను నిర్బంధించుటచే దేశములో స్వాతంత్ర్యోద్యమము సన్నగిల్లునని తలఁచిరికాని ప్రజలుద్రిక్తులై విప్లవము సాగించిరి. ఈ ప్రజా విప్లవమే ఆగస్టు విప్లవమని విఖ్యాతి గాంచినది.
కాంగ్రెసు నాయకులను, గాంధీజీని విడుదలచేయవలయునని దేశమున గొప్పయాందోళన చెలరేగెను. దీనికిఁదోడుగా భారతీయ నాయకులను విడిపించి వారితో రాజీపడవలెనని, అమెరికా చీనాల అధ్యక్షులును, బ్రిటిషు ప్రధానిని దొందర చేసిరి. 1944 నాటికి భారతదేశమునకు యుద్ధప్రమాదము పోయినది. 1944 మేలో గాంధీజీ నస్వస్థతకారణముచే విడుదల చేసిరి. క్రొత్తవైస్రాయి వేవెల్ గాంధీజీతో రాజీయత్నము చేయగాఁ గాంగ్రెసు కార్యసమితి సభ్యుల విడుదలఁజేసినఁగాని తాను రాజీలోఁ బాల్గొననని పల్కెను. అంతట వైస్రాయి కేంద్రశాసనసభలోని కాంగ్రెసు పక్షనాయకుడు భూలాభాయిదేశాయ్, ముస్లింలీగు నాయకుఁడు లియాకత్ ఆలీఖాన్‌గారలతో రహస్యముగా రాజీ మాటలు సాగించెను. ఈ రాజీపద్ధతిలోఁ గాంగ్రెసులీగులకు సరి సమానప్రతిపత్తి యిచ్చు పద్ధతిని కాంగ్రెసువారితోఁగలసి కేంద్రప్రభుత్వములో లీగువారు మంత్రులుగ నుండి పరిపాలన సాగించుటకును, గాంగ్రెసువారిని జైలునుండి విడిపించుటకును నేర్పాటు గావింపఁబడెను.
భూలాభాయిదేశాయి 1945 డిశంబరు 30 వ తేదీని అహమ్మద్ నగర్‌కోటకు వెళ్ళి సర్దారు వల్లభాయిని గలిసికొని సంభాషించెను. ఈ విధముగాఁ గాంగ్రెసు నాయకులందరు నాయన ప్రయత్నమువలనఁ గారాగారవిముక్తులైరి.
భారత దేశ రాజకీయ సమస్యలఁ బరిష్కరింపఁదలచి యప్పటి రాజ ప్రతినిధి వేవెల్ ప్రభువు 1945 జూన్ 4 వ వారమున భారతదేశమునందలి రాజకీయపక్షముల ప్రతినిధులను సిమ్లానగరమున కాహ్వానించెను. ముస్లింలీగు అధ్యక్షుడు జిన్నా హిందువులతో సమాన ప్రాతినిద్య మీయవలెనని పట్టు పట్టెను. దీనికి కాంగ్రెసువా రంగీకరించనందున సిమ్లాసభ విఫల మయ్యెను.
1946 సంవత్సరమున భారతదేశమున జరిగిన శాసన సభల యెన్నికలలోఁ గాంగ్రెసువారి కఖండ విజయము చేకూరెను.
1946 మార్చిలో బ్రిటిషు ప్రభుత్వము సర్‌శ్టాఫర్డు క్రిప్సు, సర్ అలగ్జాండర్, పెథిక్ లారెన్సు, అను అమాత్య త్రయమును భారతదేశమునకు రాయబారమంపిరి.
ఈ రాయబారపు సందర్భములో వల్లభాయి 1946 మార్చిలో బొంబాయిలో నిటులు ప్రసంగించెను.
"భారతదేశ మీ యేడు గడవకమునుపే స్వాతంత్ర్యము పొందఁగలదు. రాయబారమువచ్చిన బ్రిటిషు అమాత్యత్రయముతోఁ గాంగ్రెసు మైత్రితో మెలఁగును. పెక్కు మార్లు కాంగ్రెసు స్వాతంత్ర్య సంగ్రామము గావించినది. కాని ప్రస్తుతము మంత్రిత్రయముతోఁ జర్చించుట కే నిర్ణయించినది."
"ఈ చర్చలు విఫలమైనచోఁ గాంగ్రెసు తుదిసారి పోరాటము సాగించును. బ్రిటిషు ప్రభుత్వమువారు భారతదేశము నుండి నిర్గమించునట్లు పాటుపడును."
అమాత్యత్రయ మాసేతు హిమాచలము పర్యటన మొనరించి యొక పథకమును సూచించిరి. కాంగ్రెసువారు దాని కంగీకరించిరి. తదనుగుణముగ 1946 సెప్టెంబరు రెండవ తేదీన నెహ్రూ ప్రధానమంత్రిగాఁ దాత్కాలిక మంత్రివర్గ మేర్పడెను. ఆమంత్రివర్గమున వల్లభాయి హోంశాఖను, బ్రచురణశాఖను నిర్వహించెను. ముఁస్లింలీగు ప్రతినిధులు తొలుత నీ మంత్రివర్గమునఁ జేరకుండిరి. వైస్రాయికోరుటచే తర్వాత వారును బ్రవేశించిరి.